Saturday, December 31, 2016 0 comments By: visalakshi

పరిపూర్ణత్వము

 శ్లో" ఏతావానేవ లోకే2స్మిన్ పుంసాం ని:శ్రేయసోదయ:
     తీవ్రేణ భక్తియోగేన మనో మయ్యర్పితం స్థిరం

భగవానునిపై మనస్సు సంలగ్నమైన వారలు తీవ్రమగు భక్తియోగమున నెలకొందురు. జీవితపు చరమసిద్ధిని బడయుటకు అదియే ఏకైక సాధనము.




'మనోమయ్యర్పితం' (నా యందు సంలగ్నమైన మనస్సు) మనుజుడు తన మనస్సును శ్రీకృష్ణభగవానుని యందు అత్యంత శ్రద్ధతో నిలుపవలెను. అదియే పరమోస్థితి కాగలదు. మనస్సును కృష్ణపాదారవిందముల చెంత సంలగ్నము చేయుటే ఉత్తమోత్తమ విధానము. 'సర్వధర్మాన్ పరిత్యజ్య మాం మేకం శరణం వ్రజ ' "సమస్త ధర్మములను విడిచి కేవలం నన్నే శరణు పొందుము." మన భౌతిక బంధనముల నన్నింటిని విడిచి శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించ వలెను.




 'ప్రతిఒక్కరు తమ గుణకర్మల ననుసరించి పరిపూర్ణత్వమును సాధించ వచ్చునని శ్రీకృష్ణుడు తెలిపెను.' 

 శ్లో"  యత: ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం
           స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ: 

 "సర్వజీవులకు మూలకారణమును, సర్వవ్యాపకుడైన భగవంతుని మానవుడు తన స్వకర్మములను చేయుట ద్వారా అతడిని పూజించుటచే మనవుడు పరిపూర్ణత్వమును సాధించును."




ప్రహ్లాదుడు నరసింహ భగవానుని చేత అతని తండ్రిని  సంహరింప చేసి తన తండ్రికి గొప్ప సేవ చేసెను. శాస్త్రములలో ఎవరైన రాక్షసుడైనను భగవంతుని చేత సంహరించ బడినచో అతడు వెంటనే ముక్తిని పొందునని తెలుపబడినది. ప్రహ్లాదుడు ఇలా ఆలోచించెను: "నా తండ్రి ఎన్నో పాపకార్యములను ఒనరించెను. మరియు భగవంతుని వ్యతిరేకించెను కాబట్టి అతడు ముక్తిని పొందజాలడు" అని భావించెను. నరసింహ భగవానుడు హిరణ్యకశిపుని సంహరించిన తరువాత ప్రహ్లాదుడు ఇలా పలికెను: "శ్రీహరీ! నా తండ్రి గొప్ప నాస్తికుడు. అతడు మీ పాదపద్మముల వద్ద అనేక అపరాధములను చేసెను. అతడిని నీవు సంహరించితివి. అతడిని క్షమించి ముక్తిని ప్రసాదించుమని నేను మిమ్ములను ప్రాధేయపడుతున్నాను." నిజానికి హిరణ్యకశిపుడు వెంటనే ముక్తిని పొందాడు. కాని అతని ప్రియ పుత్రుడు తన తండ్రి ముక్తిని పొందగలిగెనా లేదా అని జిజ్ఞాసతో తెలుసుకోవాలనుకున్నాడు. ఎవరైనను శుద్ధ వైష్ణవుడై  భగవంతునికి సేవ చేసినచో వారు తమ కుటుంబమునకు అత్యున్నతమైన సేవ చేసినవారగుదురు. ఎందుకంటే ఇరవైఒక్క తరాలవారు ముక్తిని పొందుదురని భగవంతుడు నిర్ధారించెను. 




 భగవంతుని అవతారాలు ఎన్నో కలవు. కొంతమంది జనులు ఇలా ప్రశ్నిస్తుంటారు :" మీరు శ్రీకృష్ణుని పూజిస్తున్నారు. రాముని ఎందుకు పూజించరు? " నిజానికి కృష్ణునికి, రామునికి మధ్య తేడా లేదు. కాని ప్రతిఒక్కరు విభిన్నమైన ఆసక్తులను కలిగి ఉన్నారు. హనుమంతుడు ప్రత్యేకించి శ్రీరామచంద్రునికి అంకితమైనాడు. గోపికలు కేవలం శ్రీకృష్ణుడికి అంకితమైనారు. నిజానికి ఇందులో ఎటువంటి బేధము లేదు. భగవంతుడు వివిధ రూపాలతో అవతరించును. కాని అన్ని పరిస్థితులలోను అతడు భగవంతుడే. ఒకసారి గోపికల మధ్యనుండి శ్రీకృష్ణుడు అదృశ్యమై నాలుగు చేతులు గల నారాయణునిగా ప్రత్యక్షమైనాడు. కాని వారు కృష్ణుని వెతకసాగిరి. నారాయణుని రూపము పట్ల వారు పెద్దగా ఆసక్తిని కనపరచలేదు. వారు కేవలం కృష్ణుని చూడాలనుకున్నారు. నిజానికి శ్రీకృష్ణునికి, విష్ణువుకు మధ్య బేధము లేదు. కాని ప్రతి భక్తుడు ఒక ప్రత్యేకమైన ఆసక్తిని కలిగి ఉంటాడు. అందరి హృదయాలలో భగవంతుడు నిలిచి ఉన్నాడు. మనం భగవంతుని పట్ల శ్రద్ధాసక్తులను కలిగి ఉండి వారి కృపచే భక్తిలో దృఢసంకల్పులము కావలెను. 


  సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు  






Friday, December 30, 2016 0 comments By: visalakshi

రమణ మహర్షుల వారి సంభాషణలు..

  ప్రారబ్ధం:-   "పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే, యుగే" అన్నట్లు ఎప్పటికప్పుడు సాధువుల పుణ్యం, దుష్టుల పాపం చేరి ప్రారబ్ధంగా పరిణమించి ధర్మ సంస్థాపనార్ధం ఈశ్వరుడు రూపం ధరిస్తాడు.  ప్రారబ్ధం లేనిదే దేహమెట్లా వచ్చింది? పనులెట్లా చేస్తారు? జ్ఞానుల చర్యలనే ప్రారబ్ధమంటారు. బ్రహ్మ మొదలు సదాశివాది దేవతలకున్నూ ప్రారబ్ధం ఉన్నట్లు చెప్పబడింది. రామ కృష్ణాద్యవతారాలూ అంతే. శరీరమే ప్రారబ్ధం. ఏ నిమిత్తంగా ఆ శరీరం వచ్చిందో ఆ పని దానంతటదే జరుగుతుంది. 



ప్రారబ్ధం అహంకారానికే కానీ ఆత్మకు కాదు. మనం ఆత్మస్వరూపులమైనపుడు ప్రారబ్ధం మనలను బాధించదు. భగవంతునకు పరిపూర్ణ శరణాగతి చెందటం."ప్రభూ! నీవు తప్ప నేను లేను. నీ యిచ్చయే నెరవేరు గాక!" అంటూ నిరంతరం ప్రార్ధించాలి. ఏ కోరికా కూడదు  ..చివరకు మోక్షాపేక్ష కూడా అడ్దవుతుంది. అప్పుడు అహంకారం పూర్తిగా నాశనమైపోతుంది. ఇక ప్రారబ్ధం బాధించదు.   

సమాధి:-          యోగంలో శరీరాన్ని మరచి ఉండటమే  సమాధి.  
సకలేంద్రియాలు పనిచేస్తుండగానే ఎప్పుడూ సమాధిలో ఉండడం.  దీన్ని సహజ సమాధి అంటారు. నీవు సమస్త కార్యాలు చేస్తున్నప్పటికి శాంతితో నిలకడ కలిగిఉంటావు. అంతరాత్మ ప్రేరితుడవై చరిస్తున్నావని గుర్తించగలుగుతావు. అందువల్ల ఏమి చేస్తున్నా ఏమి తలుస్తున్నా అవి నిన్ను అంటవు. నీకు చింతలుండవు. ప్రతి పని వేరైయున్న ఒక వస్తువు చేత జరపబడుతుంది. ఆ గొప్ప వస్తువుతో నీవు ఏకమై ఉంటావు. " నాది అనేది అర్పించటం చిత్తశుద్ధి యిస్తుంది. నేనును అర్పించటం జ్ఞానాన్ని యిస్తుంది." 




 ధ్యానం:-        "నేను ఉన్నాను" అని ప్రతివారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటూనే ఉన్నా "నేను" పై దృష్టి కేంద్రీకరించక అన్యంగా ఉన్న వాటిపై ధ్యానం చేయాలని చూస్తారు.రెండు కనుబొమల మధ్య చూస్తే భగవంతుడు అక్కడే ఉన్నాడని అన్నట్లవుతుంది. ఈ సాధన వల్ల ఏకాగ్రత కుదురుతుంది. మనస్సును దృఢపరచి అంతర్ముఖ పరచవచ్చు. ప్రత్యక్ష మార్గమేమంటే "నేను" పైన దృష్టి నిలిపి నేనెవడను? అని నిరంతరం ప్రశ్నించుకోవాలి. ధ్యాన సమయంలో కళ్ళు మూసుకోవటం, తెరవటం ముఖ్యం కాదు. కండ్ల ద్వారా చూచేవారొకరున్నారు. ఆ చూచేవాడిని పట్టుకొని, లోపలికి తిప్పాలి. అప్పుడు ఆత్మ దర్శనం అవుతుంది.ప్రతివారికి ఉన్నది ఒక మనస్సు. దాని పుట్టుకెక్కడ? దాని స్వరూపమేమిటి? ఇది విచారిస్తూపోతే ఆ మనస్సు లయమై పోతుంది. ఆ తరువాత మిగులునది "నేను" "నెనెవరు?" నేను కేవలం ఆత్మను. ఇది ధ్యానము. ఈ పద్ధతిలో దేహవాసన నశిస్తుంది.  




  మౌనం:-       మౌనమంటే మాట్లాడకుండా ఉండటం కాదు. ఎక్కడ నుండి ఆలోచన, మాట పుడుతున్నదో అదే మౌనం. సంకల్పరహితమైన ధ్యానం. ఇదే నిజమైన భాషణ. మాట నిరంతరం మౌన భాషణను నిరోధిస్తుంది. గంటల కొలది ఉపన్యాసాలు, వ్యక్తులను రవ్వంత కూడా అభివృద్ధి చేయకపోవచ్చు. మౌనం అలాకాక, సమస్త మానవాళిని అభివృద్ధి పరుస్తుంది. సదా ఆత్మచింతనమే మౌనం. 




 ప్రాణాయామం:-        ప్రాణము, మనస్సు ఒక చోటునుండి పుట్టుకొస్తున్నాయి. అదే ఆత్మ. అందుచేత ఉచ్చ్వాస నిశ్వాసాలు, లేక మనస్సు(తలంపులు)ఎక్కడనుండి పుట్టుకు వస్తున్నాయో గమనిస్తూ ఉంటే ఆత్మ దర్శనం అవుతుంది.  ఈ  రెండింటిలో ఏ ఒక్కదాన్ని అనుష్టించినా చాలు. మనస్సును పరిశీలిస్తూ ఉంటే, ఒకనాటికి తలంపులన్నీ ఆగిపోతాయి. అప్పుడు పూర్ణశాంతి లభిస్తుంది. అది నీ స్వరూపమే. జనక మహారాజు ఇలా అన్నాడు "ఇప్పుడు నేను దొంగను(మనస్సు)పట్టుకున్నాను. ఇతడే నా నిజమైన నేనును దొంగిలించాడు. ఇప్పుడు ఇతనిని వధించి తీరుతాను."  




మనం తలంపులకు చోటిచ్చామంటే ఆత్మను పోగొట్టుకున్న వారమౌతాము. మనం పరిశీలించనంత వరకే మనస్సు బడాయి. పరిశీలించామా అదృశ్యమౌతుంది. ఆత్మ దర్శనమౌతుంది. తలంపులను సూటిగా అరికట్టలేని వారికి ప్రాణాయామం విధించారు. మనోనిగ్రహానికి ప్రాణాయామముపకరిస్తుంది. ఆసనాలు ప్రాణాయామానికి, ప్రాణాయామం ధ్యానానికి సాయం చేస్తాయి. ఫలితం మనశ్శాంతి.హఠయోగ ప్రయోజనం యిదే.  




 జపం:-         నేను జపిస్తున్నాను అను తలంపు పూర్తిగా పోయే వరకు జపం చేయాలి. అప్పుడు "జపిస్తున్నది నేను కాదు. మంత్రం నా యత్నం లేకుండానే తనంతట తానే సాగిపోతున్నది" అను సత్యం మీ అనుభవంలోకి వస్తుంది. అదే సహజస్థితి. అదే సిద్ధి. ఏ నామమైనా మనస్సును ఒక తలంపు పైన ఏకాగ్రపరచటం.తలంపులు మనస్సు నుండి వస్తున్నాయి కనుక మానసిక జపం ఉత్తమమైంది. వాచికము, దా ని  స్మృతి, ఆపైన ధ్యానము. ఈ క్రమంలో సాగి చివర అప్రయత్నమగు నిరంతర జపం. జకర్త 'ఆత్మయే ' జపాలన్నింటిలో "నేనెవరన్న" జపమే అత్యుత్తమం. అంతా పోతే నామమే ఉంటుంది. అదే ఆత్మ. అదే దైవం..అదే పరమావధి. నామజపం అంటే ఆ దైవానికి ఒక పేరు పెట్టి పిలుస్తున్నామన్నమాట. ...ఏ విధంగా తలిస్తే ఆ విధంగా వస్తాడు. వీరి అంతులేని కోరికలను తీర్చి.. ఇక్కడే ఫలితాన్ని అనుభవించమని అంతర్ధానమవుతారు. 


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు





Thursday, December 29, 2016 1 comments By: visalakshi

భక్త కనకదాస్ - part 2



వ్యాసరాయలవారు జరిగిన వృత్తాంతమంతయు ఆలకించి విస్మయమొందుతారు. వ్యాసరాయలవారికి వెంటనే ఒక సంకల్ప ముదయిస్తుంది. తాను త్రవ్విస్తున్న కాలువకు అడ్డముగ ఒక పెద్దబండ పడి, తొలగింప నశక్య మవుతున్నది. ఆ బండను తొలగించవలసినదని దున్నపోతును కోరగా దున్నపోతు ఆ బండను తొలగించి అదృశ్యమవుతుంది. నీరు ప్రవహించుటకు అనుకూలముగా దున్నపోతు బండను తొలగించిన ఆ తూమును "కనకతూము" అని పిలుస్తారు. చిత్తూరు జిలాలోని మదనపల్లి గ్రామమునకు సమీపములో ఈ తూము ఉన్నది. వ్యాసరాయలవారు ఈ సంఘటనను ఆధారముగా గ్రహించి, కనకదాసు భక్తి శ్రద్ధలను అవగతము చేసుకొని, అతడిని తన శిష్యునిగా స్వీకరించి, ఆశీర్వదిస్తారు. గురుదేవుని ప్రజ్ఞా ప్రబోధాలతో ప్రభావితుడైన కనకదాసు నిరంతర తపోధ్యానాదులాచరించి, అంతరంగిక ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంటాడు. పవిత్ర తీర్ధక్షేత్ర సందర్శనము చేయవలెననెడి కుతూహలము కనకదాసు మనస్సులో జనిస్తుంది. గురుదేవుల అనుమతిపొంది తీర్ధయాత్రలకు బయలు దేరుతాడు. 

 పుణ్యనదులలో స్నానమాచరిస్తాడు. పవిత్ర పుణ్యక్షేత్రములను దర్శిస్తూ తిరుమలేశుని దర్శనానికి తిరుపతి వస్తుంటాడు. తన భక్తులైన బీరప్ప బుచ్చమ్మల ముద్దుబిడ్డడు, నిరంతర గోవిందనామ స్మరణామృత పానచిత్తుడు, భక్త శిఖామణియైన కనకదాసుడు తన దర్శనమునకు అరుదెంచుచున్నాడని గ్రహించిన 'శ్రీనివాసుడు ' దేవాలయ మహంతుకు స్వప్నంలో దర్శనమిచ్చి కనకదాసును సగౌరవముగా సత్కరించవలసిందని చెబుతాడు. కనకదాసు తిరుమలేశుని దర్శనానికి వస్తాడు. ఏ ఆడంబరము లేక సర్వ సామాన్యునివలె గోచరించే కనకదాసును గుర్తించడం మహంతుకు సాధ్యంకాదు. స్వామి దర్శనానికై ఆలయ ముఖద్వారం వద్ద కనకదాసు రోజంతా నిరీక్షిస్తాడు. దర్శనం మాత్రం కాలేదు.  

 బాలాజీ దర్శన భాగ్యానికి నోచుకోని తన దురదృష్టానికి చింతిస్తూ రాత్రంతా దేవాలయమునందే పడుకొని దు:ఖిస్తాడు. ఆ సమయములో స్వామి ఆభరణాలు ఆనాడే అదృశ్యమవుతాయి. రాత్రంతా ఆలయ ప్రాంగణములో ఒంటరిగా సంచరిస్తూ కనిపించిన కనకదాసే చోరుడని నిర్ణయిస్తారు. బంధించి న్యాయాధిపతికి అప్పగిస్తారు. కనకదాసును త్రాటితో స్థంభానికి కట్టివేసి కొరడాతో తీవ్రముగా కొడతారు. కర్కశమైన కొరడా దెబ్బలను భరించలేక కనకదాసు మూర్చిల్లుతాడు. 'తిరుమలేశుడు ' మహంతుకు స్వప్నంలో దర్శనమిచ్చి, జరిగిన వృత్తాంతమంతయు తెలియజేస్తాడు. తాను సన్మానించమనిన కనకదాసును అవమానపరచినందుకు మహంతుపై ఆవేశమును చూపుతాడు. వెంటనే కనకదాసును విడిపించమని చెబుతాడు. మహంతు కనకదాసు బంధించియున్న ప్రదేశమునకు పరుగెత్తి కనకదాసు పాదాలపై బడి క్షమాబిక్ష కోరుతాడు. దైవదర్శనార్ధము కనకదాసును ఆలయములోనికి తీసుకువెళ్తాడు. దేవాలయ తలుపులు తీయగానే పోయిన ఆభరణములతో సహా స్వామి దర్శనమిస్తారు. నేత్రములవెంట భాష్పములు రాలుచుండ కనకదాసు చేతులు జోడించి స్వామికి నమస్కరిస్తూ "భగవాన్! వెంకటరమణా! అశ్రిత జనరక్షకా! నీ లీలలు మాకు అర్ధం కావు. నీవు భక్తుల నుద్ధరించు తీరు ఊహాతీతము. ఆభరణముల అపహరణ వెనుక దాగియున్న నీ ఆశ్రిత జనరక్షణము ఆదర్శము. అద్భుత మహిమాన్వితము. ఈ విధముగా నా ప్రారభ్దమును కరిగించి ప్రజలలో నా కీర్తిని ఇనుమడింపజేయాలని సంకల్పించినావా?" అంటూ గగుర్పాటు చెందుతాడు. వేంకటరమణుని అపార కృపామహిమకు కనకదాసుని నేత్రాలు చెమ్మగిల్లుతాయి. 



దివ్యానుభవములను పొందుతూ భగవానుని గాన కీర్తనలతో కనకదాసు శ్రీకృష్ణసన్నిధానమైన ఉడిపి చేరుతాడు. శ్రీకృష్ణ దివ్య పాదపద్మ దర్శనాభిలాషియై అరుదెంచుచున్న కనకదాసుని ఆలయములో ప్రవేశించడానికి వీలులేదని ధర్మకర్తలు ఆదేశిస్తారు. కనకదాసు హృదయము ముక్కలైపోయింది. శ్రీకృష్ణుని దివ్యతేజోమయ రూపమును గాంచలేని తన జన్మ నిరర్ధకమని ..ఆలయకర్తలను దర్శనభాగ్యము కల్పించమని యాచిస్తాడు..ప్రార్ధిస్తాడు. వారు కనకదాసు హృదయవేదనను పట్టించుకోక అహంకారముతో వీలుకాదని వెడలుమని ఆదేశిస్తారు. చెదిరిన మనస్సుతో, శుష్కించిన హృదయముతో కనకదాసు కదలలేక కదుల్తూ ఆలయం వెనుకపైపునకు వెళ్ళి దు:ఖించసాగాడు. భక్తవత్సలుడైన శ్రీకృష్ణుని మనస్సు ద్రవించింది. దేవాలయ గర్భగుడి వెనుకవైపు గోడ కదిలి పడిపోయింది. తూర్పుముఖముగా యున్న భగవానుడు పడమరవైపు తిరిగి భక్త కనకదాసుకు దర్శనమిచ్చాడు. జై జై వాసుదేవ హరి ! కనకదాసు స్వామిని దర్శించి ధన్యత చెందాడు. దానిని ఇప్పటికిని "కనకభండి" అని పిలుస్తుంటారు. అనగా కనకదాసు స్వామిని దర్శించిన కిటికీ అని అర్ధం. భక్త కనకదాసుకు దర్శన మొసంగిన పుణ్యద్వారమని భావము. 

భగవంతుని కృపకు పాత్రుడైన కనకదాసు తొంభై సంవత్సరాలు జీవించారు.  కొన్నివేల కీర్తనలు రచించారు. అనేక దేవాలయాలు నిర్మించారు.ఆదికేశవుని పాదపద్మములను నమ్మి తాను తరించడమేగాక తన ఆదర్శనీయ జీవితము ద్వారా ఎందరికో స్పూర్తిని కల్గించి తరింపజేసిన భక్త కనకదాసుని దివ్య చరితము పవిత్రము. భక్తాధీనుడైన భగవంతుడు  భక్తుల హృదయాలలో దర్శనీయం. అట్టి భక్తుల దర్శనమే ముక్తికి సోపానం.

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు  
Wednesday, December 28, 2016 1 comments By: visalakshi

భక్త కనకదాస్ - part 1


ఎవరూ లేని, చూడని చోట ఈ ఫలమారగించి రావాలి అని శిష్యులను పిలిచి పండ్లు పంచిపెట్టారు వ్యాసరాయలవారు. శిష్యులందరు తమకు నచ్చిన ప్రదేశములకు వెళ్ళి ఎవ్వరు లేని చోట గురువుగారిచ్చిన పండును భుజించి వస్తారు. ఒక శిష్యుడు మాత్రము ఆ పని పూర్తి చేయలేక తిరిగి తిరిగి ఆ పండును చేతియందుంచుకొని గురుసన్నిధికి చేరుతాడు. "పండు తినకనే వచ్చినావేమి?" అని వ్యాసరాయలు ప్రశ్నించారు.

శిష్యుడు చేతులు జోడించి నమస్కరిస్తూ "గురుదేవా! నేను మహాపాపిని గురుదేవుల ఆజ్ఞ పాలించలేని అసమర్ధుడను. తమరి ఆదేశము మేరకు ఎవ్వరు లేనిచోట, ఎవరికీ తెలియకుండా ఫలమారగించాలని ఎంతగానో ప్రయత్నించాను .నేనెక్కడికి వెళ్ళినా భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. " అని గురువుగారికి శిష్యుడు విన్నవించాడు. 



శిష్యుని విన్నపమునకు గురువుగారైన వ్యాసరాయలవారు సంభ్రమాశ్చర్యములతో పులకాంకితుడయ్యాడు. తన నిర్మల ఆధ్యాత్మిక భావపరంపరలతో గురుదేవులను విస్మయమొందించిన వ్యక్తియే భక్త కనకదాస్. 

విజయనగర సామ్రాజ్యమును శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించు రోజులలో యాదవకులమునకు చెందిన బీరప్ప యనునతడు సేవానాయకుడుగా ఉండేవాడు. అతని భార్య బుచ్చమ్మ. వీరిరువురు తిరుమలేశుని భక్తులై, ఆదర్శ గృహస్థజీవనమును గడిపెడివారు. చిరకాలముగా వారికి సంతానము లేకపోవుటచే వారు వేంకటేశ్వరుని సేవించి, తమకు సంతానము ననుగ్రహింప వలసిందిగా ప్రార్ధిస్తారు. వారి భక్తికి తృప్తి చెంది బాలాజీ వారికొక పుత్రుని ప్రసాదిస్తాడు. భగవత్ప్రసాదితమైన ఆ శిశువుకు తిమ్మప్ప అని నామకరణం చేస్తారు. 

తిమ్మప్పకు చదువు సంధ్యలయందు మనస్సు లగ్నం కాలేదు. విద్య వచ్చే అవకాశము లేనందున తండ్రి తన కుమారుని వ్యాయామము, విలువిద్యలందు నేర్పరిగా తీర్చిదిద్దాడు. తిమ్మప్ప యవన దశలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని దిక్కులేనివాడవుతాడు. తన ఇరవయ్యో ఏట వివాహం చేసుకుంటాడు. కానీ అనతి కాలములోనే భార్యావియోగము ననుభవించవలసి వస్తుంది. 

తిమ్మప్ప జీవితం ప్రశ్నార్ధకంగా మిగిలింది. ఒకనాడు ఆదికేశవ స్వామి స్వప్నంలో దర్శనమిచ్చాడు. తన భక్తుడు కమ్మని ఆజ్ఞాపించాడు. భగవదాజ్ఞను తిమ్మప్ప నిరాకరించాడు. జీవితంలో భోగభాగ్యాలను అనుభవించి విహరించాలనే తిమ్మప్పకు భక్తి జ్ఞానమను   పదములు చిరాకును కలిగించసాగాయి. అనేకసార్లు ఆదికేశవ స్వామి స్వప్న దర్శనమిచ్చి భక్తుడవు కమ్మని హెచ్చరించడము, తిమ్మప్ప నిరాకరించము జరుగుతూ వచ్చింది.     




ఒకసారి శత్రురాజులు తమ దేశము మీదికి దండెత్తిరాగా, తిమ్మప్ప యుద్ధమునకు వెళ్ళవలసి వచ్చింది. తిమ్మప్ప ధైర్యసాహసములతో మెరుపువలె విజృంభించి శత్రుసైన్యమును చెదరగొడతాడు. వెనుకనే ఒక సైనికుడు వచ్చి తిమ్మప్పపై కత్తి విసురుతాడు. వీపులో ఆ కత్తి గుచ్చుకొనగా తిమ్మప్ప మూర్చిల్లుతాడు. కొద్దిసేపటికి స్పృహలోకి వస్తాడు. గాయము తీవ్రబాధను కల్గించుచున్నది. కదలలేక ఉన్నాడు. అంతలో ఆదికేశవస్వామి మరల అక్కడ దర్శనమిచ్చాడు. స్వామి చిరునవ్వు చిందిస్తూ "తిమ్మప్పా! గాయము తీవ్రముగా బాధించుచున్నదా? ఆలోచించు ఇప్పటికీ మించిపోయినది ఏమీ లేదు. నాకు భక్తుడివి కా " అన్నారు. కత్తిపోటుతో విలవిలలాడుతున్న తిమ్మప్ప ఆగ్రహోదగ్రుడై " నన్నెందుకిలా బాధిస్తావు? నేను నీకు భక్తుడను కాలేను. నాకు భక్తి నచ్చదు. ముక్తి గిట్టదు. నిన్ను దర్శించాలని నీ కొరకు పరితపించే  ఎందరో భక్తులు ఈ ప్రపంచములో ఉండగా, నన్నే ఎందుకిలా వెంబడిస్తావు?" అన్నాడు. 

"తిమ్మప్పా! నీవు గతంలో నా భక్తుడవు. చిత్తశుద్ధితో నాకు సేవచేసి నన్ను స్మరించిన భాగవతోత్తముడవు. కర్మవశాత్తు ఇంతవరకు నీవు నన్ను ఆశ్రయించలేకపోయితివి. నీవు నన్ను సేవించు శుభఘడియ సమీపిస్తున్నది. నిర్మల మనస్కుడవై నన్ను సేవించు. నీ బాధలన్నీ తొలగించి నీకు ముక్తిని ప్రసాదిస్తాను" అని ఆదికేశవస్వామి తన దివ్య సందేశాన్ని అందిస్తారు. తిమ్మప్ప తదేకంగా స్వామిపై దృష్టిని సారించి "నీవు నన్ను బంధ విముక్తుణ్ణి చేయుమాట వాస్తమైనచో ప్రస్తుతము నన్ను హింసించుచున్న శారీరక బాధనుండి విముక్తి చేయండి. అలా జరిగితే నిన్ను నేను విశ్వసించి నీకు భక్తుడను కాగలను." అని చెప్పగా దీనదయాళుడు, భక్తవత్సలుడైన ఆదికేశవస్వామి తన దివ్య హస్తస్పర్శతో తిమ్మప్పను శరీరక బాధనుండి  విముక్తుణ్ణి చేస్తారు. భగవానుని దివ్య కరముల స్పర్శతో తిమ్మప్పలో నిద్రాణమైయున్న ఆధ్యాత్మిక చైతన్యము ప్రభావితమై, భక్తి పారవశ్యము పొడసూపుతుంది. ఆదికేశవస్వామి నవ్వుతూ అదృశ్యమవుతారు. తిమ్మప్పలో తీవ్ర పరిణామము కదిలింది. ఒక్క క్షణము కూడా భగవానుని చూడకుండా, స్మరించకుండా  ఉండలేకపోతున్నాడు. నేత్రములనుండి అశ్రుధారలు ప్రవహించుచుండ పరుగు పరుగున ఆదికేశవస్వామి ఆలయానికి చేరుతాడు. దేవాలయ ద్వారము మూసియుంటుంది. స్వామి వియోగాన్ని భరించలేక తన హృదయము నుండి  పొంగి వచ్చే విషాదానికి పదములు జోడించి    సుశ్రావ్యంగా కీర్తన గానం చేయసాగాడు. స్వామి వియోగాన్ని భరించలేని తిమ్మప్ప పసిబిడ్డవలె విలపిస్తూ తన శిరస్సుతో గుడి తలుపులను బాదుతాడు. శిరస్సునుండి రక్తము ప్రవహించుచున్నను తల బాదుకొనుట ఆపడు. ఆతని భక్తికి మెచ్చి ఆదికేశవస్వామి తిమ్మప్పను అనుగ్రహిస్తాడు. భగవానుని దివ్యమయ దర్శనముతో పులకాంకితుడై తిమ్మప్ప కరద్వయమును జోడించి నమస్కరిస్తూ తనలో పొరలి వచ్చుచున్న భక్తిభావాలను శ్రావ్యముగా కీర్తనద్వారా తెలియచేస్తాడు.   వాసుదేవా! నీ దివ్య నామస్మరణ చేయుటకై నాకు అనేక జన్మలు ప్రసాదించు. అని నిర్మల చిత్తముతో స్వామిని ప్రార్ధిస్తాడు. కేశవ భక్తుడైన తిమ్మప్ప బంగారు బుద్ధి కలిగి కనకదాసుగా మారిపోయాడు. 





కనకదాసుకు బాహ్య విషయాలపై అనురక్తి లేదు. నిద్రాహారాలు మాని భగవంతుని దివ్యసందర్శనాభిలాషియై కనకదాసు విలపించసాగాడు. ఒకనాడు కనకదాసుకు స్వప్నములో కేశవస్వామి దర్శనమిచ్చి హంపి నగరవాసి అయిన వ్యాసరాయ గురుదేవుల నాశ్రయించి మంత్రదీక్షను పొందవలసినదిగా తెలియజేస్తారు. కనకదాసు హంపి చేరి వ్యాసరాయలవారిని దర్శించి, తనను శిష్యుడుగా స్వీకరించి మంత్రదీక్షనొసగమని ప్రార్ధిస్తాడు. యాదవ కులజుడైన కనకదాసుకు మంత్రదీక్షనొసగుట వ్యాసరాయలకు ఇష్టం లేదు. ప్రార్ధనాపూర్వకముగా కనకదాసు పదే పదే ప్రాధేయపడసాగాడు. వ్యాసరాయలవారు విసుగుతో కోపోద్రికుడై "దున్నపోతు నామము జపించు.నీకు ఆ మంత్రము  బాగా సరిపోతుంది." అని చెబుతారు.  గురువు నుండి ఆ మాట రాగానే కనకదాసు విశ్వాసపూరిత హృదయముతో దూరంగా వెళ్ళి ఒక నిర్జన ప్రదేశములో "దున్నపోతు" నామమును ఉచ్చరించసాగాడు. తపస్సు తీవ్రరూపం దాల్చింది. భక్తి విశ్వాసములు చరమస్థాయి నందుకున్నాయి. తన వాహనమైన దున్నపోతుపై కఠోరసాధన సాగిస్తున్నందుకు యమధర్మరాజు సంతృప్తి చెంది దున్నపోతు రూపంలో కనకదాసుకు ప్రత్యక్షమవుతాడు. కనకదాసు శిరసు వంచి నమస్కరిస్తాడు . తనవలన ఏమి సహాయము కావాలో తెలియజేయుమని దున్నపోతు రూపంలో ఉన్న యమధర్మరాజు అడుగుతాడు. తనకేమీ అవసరం లేదనియు, తన గురుదేవుల అవసరమును తీర్చవలెనని ప్రార్ధించి..దున్నపోతును వెంటబెట్టుకొని వ్యాసరాయల వద్దకు కనకదాసు వస్తాడు. 

 తదుపరి భాగం  మరో టపాలో..... 


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

  
Saturday, December 24, 2016 0 comments By: visalakshi

సంస్కారం

' మనుర్భవ - జనయా దైవ్యం జనం '!సృష్టిలో మానవజన్మ అత్యంత శ్రేష్టమైంది. మానవత్వంతో పరిమళించే సంతానాన్ని దంపతులు సృజించాలి. వారు దేవతలు అయ్యేటట్లుగా కృషి చేయాలి. మానవులలో విశేష కర్మలు ఆచరించేవారే దేవతలు. అట్లాంటి దేవతా సంతానంతో సమాజం సుశోభితం కావాలి. షోడశ సంస్కారాల ద్వారా కలిగే పూర్ణ ప్రయోజనమిది. వైదిక సంస్కృతిలో మానవ జీవనాన్ని సంస్కరించేందుకు షోడశసంస్కారాల విధానాన్ని ఋషులేర్పరిచారు. 16 సార్లు మానవుణ్ణి సంస్కారాలతో సంస్కరించారు. అందులో ఒక భాగంగానే శిశువును సంస్కారాల ద్వారా సంస్కరించేందుకు ప్రయత్నం జరుగుతుంది. స్వర్ణకారుడు సువర్ణాన్ని అగ్నిలో వేసి దానిలోని మలినాలను తొలగించి శుద్ధి చేసినట్లుగా, జన్మించిన శిశువును సంస్కారాలనే బట్టీలో వేసి, శిశువులోని పూర్వమున్న చెడు భావాలను దుర్గుణాలను తొలగించాలి. మంచి సంస్కారాలను వేసేందుకు పూర్తిగా ప్రయత్నించాలి. 



 "సంస్కారో హి గుణాంతరాదాన ముచ్యతే"!

చెడును తొలగించి మంచిని స్థాపించడమే సంస్కారాల ప్రధాన ఉద్దేశ్యం.

అనేక జన్మల నుండి తనతో పాటు వచ్చే సంస్కారాలు..వంశపరంపరగా తల్లిదండ్రుల నుండి వచ్చే సంస్కారాలు ఇవి మంచివి కావచ్చు, చెడువీ కావచ్చు.. సంస్కారాలతో సంపూర్ణమానవ నిర్మాణానికై రచింపబడే ప్రణాళిక, ఆధ్యాత్మిక ప్రణాళిక. ఇదియే వైదిక సంస్కృతి ముఖ్య లక్ష్యం. 



సంపూర్ణ మానవ నిర్మాణానికి సంస్కార పద్ధతే ఆధారం. జన్మించిన శిశువు తనపూర్వ జన్మలలోని కర్మల సంస్కారాలను, తల్లిదండ్రుల ద్వారా లభించే సంస్కారాలను తన వెంట తీసుకువస్తుందనే మాట వేదసమ్మతం - శాస్త్ర సమ్మతం. 

 ఈ సంస్కారాలలో కొన్ని ఆత్మ శరీరాన్ని ధరించడానికి ముందు, కొన్ని ఆత్మ శరీరాన్ని ధరించిన తరువాత చేస్తారు. శిశువు జన్మించేందుకు ముందు చేసే సంస్కారాలలో గర్భాదాన సంస్కారం మొదటిది. వైదిక సంస్కృతి ఈ సంస్కారాన్ని ఒక క్రొత్త ఆత్మను ఆవాహన చేసేందుకు జరిగే పవిత్ర యజ్ఞంగా భావిస్తుంది. శిశువును గర్భంలో ధరించక ముందే దంపతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు శ్రేష్టమైన సంతానాన్ని ఉత్పన్నం చేసే సంకల్పం ఈ గర్భాదాన సంస్కారంలో ఉంది. హోమంలో ఘృత ఓషధులను ఆహుతులుగా ఇస్తూ భౌతికశుద్ధి వేదమంత్ర పాఠంతో ఆత్మశుద్ధి కలిగి శరీర ఆత్మబలాలతో కూడిన సంతానాన్ని ఉత్పన్నం చేసేందుకై దృఢమైన సాధనతో 20 విశేష ఆహుతులతో హోమం చేయాలి. ఈ హోమం వలన దంపతులలో శారీరక మానసిక ఉన్నతికి ప్రతికూలమైన దోషాలను దూరం చేసి, అలాగే సంతానోత్పత్తికి సంబంధించిన సామర్ధ్యం ఉండాలని పరమాత్ముని ప్రార్ధిస్తారు. 

  

తల్లిదండ్రులు ఎలాంటి భావాలు కలవారో అట్లాంటి భావాలవైపు ఆ శిశువు ఆకర్షించబడుతుంది. బీజాన్ని సంస్కరిస్తే ఉత్కృష్టమైన మొక్క ఉత్పన్నమౌతుంది. అలాగే సుదృఢమైన వేగవంతమైన ఆలోచనలతో కూడిన తల్లి గర్భాన్ని ధరిస్తే ఆ తల్లినుండి ప్రతి అంగం తయారవుతుంది. అది శిశువు పూర్వ సంస్కారాలను పూర్తిగా మార్చేస్తుంది. చెడు ఆలోచనలను బలహీనం చేస్తుంది. అప్పుడే సంపూర్ణ మానవ నిర్మాణం జరుగుతుంది. దివ్య గుణాలతో కూడిన శిశువు జననోదయ మవుతుంది.  

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు




Tuesday, December 20, 2016 1 comments By: visalakshi

సాధు స్వభావం





 తితిక్షవ: కారుణికా: సుహృద: సర్వదేహినాం
 అజాతశత్రవ: శాంతా: సాధవ: సాధుభూషణా:

ఓర్పు, కరుణ, సర్వజీవుల యెడ మిత్రత్వము అనునవి సాధులక్షణములు. అతడు అజాతశత్రువు, శాంతుడు, శాస్త్రమునకు కట్టుబడి యుండువాడు అయి యుండును. మరియు అతనివి ఉదాత్తగుణములు.


స్వభావరీత్యా మానవునకు ప్రేమానురక్తులను ఆశించడం పరిపాటి. ఆ ఆశలను అందుకోవడంలో విఫలమైనప్పుడు ఆవేశపూరితుడవుతాడు. కానీ ఆలోచిస్తే ఆ ఆశ అన్న భావాన్ని మనసునుండి తొలగించుకునే ప్రయత్నంలో అతను సాధు స్వభావుడవుతాడు.  



ఉదాహరణకి ఒక వ్యక్తినుండి ఏదైనా ఆశించినపుడు లభించకపోతే ఆ వ్యక్తిని నిరసనభావంతో చూడడం హాస్యాస్పదం. ఆశించినది నీ మనసు..ఇందులో ఆ వ్యక్తి ప్రమేయము లేదు. ఆశించిన అనురక్తి అందక మనసుకు కలిగే ఉక్రోషమును వారిపై చూపరాదు. అన్నిటిని సమాన దృష్టితో చూసే జ్ఞానమును అలవచుకోవాలి. 

దృఢమైన మనసుతో భగవానుని కొరకు లోకమందలి స్వజన సంబంధములు మరియు మిత్ర పరిచయముల వంటి సమస్త సంబంధములకు ఋణములన్నీ తీర్చుకోవలెను. ఋణవిముక్తులవ్వాలంటే ఆధ్యాత్మిక జీవనమనే సాధు సాంగత్యముతో విష్ణు ఆరాధనలో భక్తిభావ సమన్వితులై భగవచ్చరణారవిందములను ఆశ్రయించడం ద్వారానే మనం ఋణము లనుండి విముక్తులవుతాము.



 సుఖదు:ఖములు తాత్కాలికము. వాటి రాక పోకలు శీతగ్రీష్మ అనుభవముల వంటివి.జీవితానుభవముల వలన అవి కలుగుచుండును. కావున కలత పొందక వాటిని సహింపవలెను.నిజానికి సుఖదు:ఖములనేవి మనస్సు వలన కలుగునన్నది మనకు విదితము. కాబట్టి మనసును దైవ ఆరాధనలో నిమగ్నం చేసి  ప్రశాంతతను అలవరచుకోవాలి. 

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.  





Sunday, December 18, 2016 0 comments By: visalakshi

పరాభవం - పరంధామము.




శ్లో: న ప్రహృష్యే త్ప్రియం ప్రాప్య నో ద్విజే త్ప్రాప్య చా ప్రియం
    స్థిరబుద్ధి రసమ్మూఢో బ్రహ్మాని ద్బ్రహ్మణి స్థిత:  (5వ అ- 20వ శ్లో )

ప్రియమైన దానిని పొందినపుడు సంతోషించక, సుఖించక అప్రియమును పొందినపుడు దు:ఖింపక ఉండు వానిని , స్థిరమైన బుద్ధిగలవానిని, మోహితుడు కానివానిని, దివ్యజ్ఞానము కలవానిని, దివ్యత్వము (బ్రహ్మము) నందున్న వానినిగా తెలుసుకోవలయును. 

ప్రియ  భాషణముతో  పొగిడినా,  అప్రియ  భాషణముతో పరాభవించినా...
మానావమానములను ఒకేలా తీసుకోవాలని మహాత్ములు కొందరు ఆచరించి చూపారు. ఆ బాటలో మనం నడవాలంటే మానసిక స్థైర్యమును అలవరచుకోవాలి. రాగ ద్వేషాలను జయించ గలగాలి. 

 శాంతి, అశాంతి..సుఖం, దు:ఖం ఇవన్నీ మనసు ఏర్పరిచే గందరగోళ స్థితి. బాహ్య ప్రాపంచిక శాంతిని పొందాలని ఆతృత పడతాము. అశాంతిని కొని తెఛ్చుకుంటాము. 

మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో:
బంధాయ విషయాసంగో ముక్యై నిర్విషయం మన: 

"మానవునికి మనస్సే బంధమోక్షములకు కారణము. ఇంద్రియార్ధములందు 
నిమగ్నమైన మనస్సు బంధమునకు కారణము. వానియందు అనాసక్తమైన మనస్సు ముక్తికి కారణము." 



మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రము. మనస్సును పరాభవించిన వానికి మనస్సు గొప్ప శత్రువుగా ఉండిపోవును. అంటే కామము, కోపము, లోభము, భ్రాంతి మున్నగు వాటికి దాసుడై ఉండవలెను. కానీమనస్సుజయింపబడినప్పుడు మానవుడు అందరి హృదయములందును పరమాత్మస్వరూపమున నెలకొనియున్న భగవంతుని ఆజ్ఞలను అనుసరించుటకు స్వయముగా అంగీకరించును.

ప్రపంచములో అత్యున్నత లోకమునుండి..అత్యధమ లోకము వరకు అన్నియు దు:ఖ మయమైన ప్రదేశములే. మనస్సును సర్వదా పరమాత్మ స్మరణలో నిమగ్నమై ఉండునట్లు భక్తి ప్రపత్తులతో.. భగవత్ సేవలందు ఆసక్తితో దేవదేవుని పూజించవలెను. పరిపూర్ణ స్థితిని పొందవలెను.అదియే పరంధామము. 



  

Saturday, December 17, 2016 0 comments By: visalakshi

ఆధ్యాత్మిక ఉన్నతి






ఆధ్యాత్మిక ఉన్నతికి అవరోధాలు ఏమిటి? మంచి ఆధ్యాత్మిక అవగాహన గల మిత్రులతో సాహచర్యం ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదం చేస్తుంది అంటారు. కానీ నా మిత్రులు ఆధ్యాత్మికంగా ఒకరు రచనలు సాగిస్తుంటే వారికి మాటలతో అంతరాయం కలిగించకూడదు. వారి ఉన్నతికి మిత్రుల మౌనమే ప్రోత్సాహం అంటున్నారు. ఎంతవరకు ఇది సమంజసం... అని ఆలోచిస్తే... రచనలు చేసే వ్యక్తికి మిత్రుల మాటలు, వారి ఆత్మీయ పలకరింపు, తన రచనకు సద్విమర్శలు..లేక ఇలా కాదు మరోలా రాసుంటే ఇంకా బాగుండేది అన్న ప్రోత్సాహము.. ఆ రచయిత లేక రచయిత్రికి మరింత ముందుకు తీసుకెళ్ళి మరిన్ని భగవద్విషయాలు రాయాలన్న జిజ్ఞాసను కలిగిస్తాయి. కానీ చక్కటి విషయాలు చర్చించుకొంటూ ...మధ్యలో కారణం లేకుండా మౌనాలతో.. ఆ మౌనాలకు కారణం తెలియక ఆ రచయిత నొచ్చుకుంటుంటే...కొన్నాళ్ళకి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలన్న తపనతో "మౌనం" అంటే... ఆ రచయిత ముందుకెళ్ళి ఆధ్యాత్మికంగా అత్యున్నతి సాధిస్తాడా!...సాధించాలి...రాగ ద్వేషాలను, ప్రేమాను రాగాలను ... మనసు నుండి క్రమ క్రమంగా వాటిని విముక్తి చేసి (చాలా కష్టం..కానీ మనసును క్షోభకు గురిచేసి వాత్సల్యాలను కన్నీటి రూపంలో కడిగేసుకోవడానికి ప్రయత్నించాలి) మనస్సును మాయకు లొంగనీయక...భగవన్నామ స్మరణలో జీవితం సార్ధకం చేసుకోడానికి ప్రయత్నించాలి.  ఒక బంధాన్ని గానీ, స్నేహాన్ని గానీ మనసులో నుండి కలిగే ఆ అనుభూతిని మాటలలో వ్యక్తం చేయలేక ...మనసునందే గౌరవించే వ్యక్తిత్వం కలిగిన   అపురూప  స్నేహ బంధమా నీకు జోహార్లు.  

 కానీ ఆ రచయితకి మనసు బలహీనపడినా.. అలసిపోకుండా..జీవితమనే కడలిని ఎదురీదుతూ.. .ఓడిపోకుండా.. మనిషిగా సమాజంలో ఒక భగవత్ సేవకుడిగా.. భగవత్ సేవలో కాలం గడపగలిగేలా బాబాను దీవించమని ఆయనను శరణు వేడుతూ..తన  స్నేహితులను కూడా వారి మార్గంలో వారు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని వేడుకుంటూ....

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.

Wednesday, December 14, 2016 0 comments By: visalakshi

స్వాధ్యాయం

సమస్త ధర్మాలకు ఉత్పత్తి స్థానం వేదమే. చక్కని రీతిలో ధర్మశాస్త్రాలను అధ్యయనం చేయడమే స్వాధ్యాయం. ఆత్మ కళ్యాణం కొరకు ఆత్మచింతన చేయడం, ఈశ్వరభక్తి, ప్రణవ జపమందు శ్రద్ధ కలిగి ఉండడం మొదలైనవన్నీ స్వాధ్యాయంలోకి వస్తాయి. 




ముక్తి లేకుండా జీవిత పరమార్ధం లేదు. పరమార్ధం లేని జీవనం వ్యర్ధము. సుఖశాంతులతో త్యాగభావాలతో పూర్ణాయువు పొంది తొడిమ నుండి ఫలం వేరైనట్లుగా యోగి తన దేహం నుండి తనుకోరుకున్నాప్పుడు ఐచ్చికంగా ఆత్మను వేరుచేసే స్థితిని యోగధర్మంతో సాధించాలి. స్వాధ్యాయ తపస్సుల ద్వారా పొందే పూర్ణ ఫలమిదే.




 బాబాగారు ఒక సన్యాసికి ఏ విధంగా ముక్తిని ప్రసాదించారో సత్చరిత్రలో 31 అధ్యాయములో వారికి సద్గతిని ఎలా ఇచ్చారో వర్ణిస్తాను ....

ఓసారి మద్రాసులో నివసించే విజయానందుడనే సన్యాసి మద్రాసునుంచి మానససరోవరానికి వెళ్ళాలని, ఉప్పొంగే ఉల్లాసంతో బయలుదేరాడు. ఓ జపాను ప్రయాణీకుడి వద్ద మానససరోవరం మాప్ ని చూసి ఆ సరోవరం ను తప్పక దర్శించాలని దృఢనిశ్చయం చేసుకొన్నాడు. దారిలో శిరిడీ గ్రామం తగిలింది; సాయిబాబాకున్న దైవశక్తి గురించిన కీర్తిని విని ఉన్నాడు కనుక ఆయనని దర్శించుకోవాలన్న తీవ్ర ఇచ్చతో ఆ ప్రదేశాన్ని వెతుక్కుంటూ ఆ గ్రామానికొచ్చాడు. ఆ సమయంలో శిరిడీలో హరిద్వార్ కి చెందిన సోమదేవ్ స్వామీజీ.. భక్తబృందంతో ఉన్న ఆ సన్యాసిని సహజంగా కలవటం జరిగింది.అప్పుడు విజయానందుడు ఆ సన్యాసిని మానవ సరోవరం ఇక్కడికి ఎంత దూరముందని అడిగాడు. దానికా స్వామీజీ "గంగోత్రికి పైన యాభై మైళ్ళదూరం(ఎనభై కి.మీ) ఉంటుంది. అక్కడ బాగా మంచు కురుస్తుంది. ప్రతీ యాభై క్రోసులకీ భాష మారుతుంది. భూటాన్ లో ఉండే ప్రజల అనుమానాలతో పరదేశీయులకు చాలా బాధలు కలుగుతాయి." స్వామి నోటి ద్వారా ఈ సమాచారాన్ని విన్న సన్యాసికి  నిరుత్సాహం కలిగింది. అతని మనసు వికలమై చింతలో పడిపోయాడు.అప్పుడు సన్యాసి సాయిబాబా దర్శనం చేసుకొన్నాడు.వారి పాదాలకు సాష్టాంగం చేశాడు.మనసు ప్రశాంతిని పొందగా అతను అక్కడే ఆసనం వేసుకొని కూచుండిపోయాడు.భక్తులు బాబాకి చేస్తున్న సేవను చూస్తున్నాడు.అది ఉదయం వేళ జరిగే దర్బారు.మశీదులో భక్తులు కిటకిటలాడిపోతున్నారు.భక్తులు తీసుకొచ్చిన పూజాసామాగ్రినీ, విధిపూర్వకంగా వాళ్ళు బాబాకి చేసే పూజను చూసి అతను విస్మయం చెందాడు. బాబావారి పాదాలను జలముతో కడిగి, ఆయన కాలి బొటనవ్రేలిని ఉద్ధరిణిలోని నీటిలో ముంచి ఆ నీటిని తీర్ధంగా తీసుకొని శుద్ధభావంతో వాళ్ళు త్రాగుతున్నారు. కొందరు గంధం, సుగంధ ద్రవ్యాలను ఆయన దేహానికి పూస్తున్నారు. బాబా ఆ సన్యాసిని చూస్తూ కోపంతో "ఈ సన్యాసిని తరిమెయ్యండి. ఇతని సాంగత్యం పనికిరాదు "అన్నారు.బాబా అలా కోపంగా మాట్లాడినప్పటికీ సన్యాసికి ఆయన పట్ల ప్రేమ పెల్లుబికింది.తాను కూచున్నచోటునుంచి లేవలేదు. అ ప్రకారంగా ఆ సన్యాసి శిరిడీలో రెండు రోజులున్నాడు.అంతలో అతనికి తన తల్లి జబ్బుతో ఉన్నట్లు ఉత్తరమొచ్చింది. చాలా దు:ఖంతో తల్లిని కలవాలని అతని మనసుకనిపించి తన ఊరికి తిరిగి వెళ్ళాలని బాబా అనుజ్ఞకై జాబు చేత పట్టుకొని మశీదుకెళ్ళాడు. 

 "సమర్ధ సాయిమహారాజా! అమ్మని కలవాలని మనసు పీకుతోంది. దయతో నా ప్రయాణానికి అనుమతినిచ్చి నామీద కృపచూపండి"అంటూ సన్యాసి బాబా చరణాలు పట్టుకొన్నాడు.ఆమె అంతిమచూపు నాకు దక్కే అనుమతి ఇవ్వండి అని వేడుకొన్నాడు.




అయితే సాయి సమర్ధులు సర్వజ్ఞులు. సన్యాసికి ఆయువు తీరిపోయిందని ఆయనకు తెలుసు. కనుక అతనితో ఆయన...."తల్లిపై అంత ప్రేమున్నవాడివి ఈ సన్యాసి వేషం ఎందుకేసుకున్నావు? ఈ వేషానికి అహంకారము, మాయ, మమకారాలు శోభించవు.దు:ఖించకు. మనసులో ధైర్యం పెట్టుకో శరీరం ఎప్పటికీ నశ్వరమే. మరణం మన వెన్నంటే ఉంటుందని తెలుసుకొని శాస్త్రాల్లో చెప్పినది నీ ఆచరణలో పెట్టు. ఈ లోకంలో దేహం, భార్య, పిల్లలు మొదలైన విషయాల్లో నేను, నాది అన్న అభిమానం ఉంటుంది. దానివల్ల మూడు రకాల దు:ఖాలు ఉత్పన్నమౌతాయి.వీటిని ఐహిక అనర్ధాలంటారు. రెండవ అనర్ధం పారలౌకికమైనది. అంటే ఆముష్మికం. లోకులు కోరుకునే ఆ పరలోకం కూడా మోక్షాన్ని ప్రాప్తింప చేసుకోవటంలో అవాంతరాలను తీసుకొస్తుంది. సదా అధోముఖంగా ఉంటుంది. పరలోకంలో పుణ్యాన్ని సంపాదించలేము. పరలోక ప్రాప్తిలో నిర్భయత్వం ఉండదు. ఎందుకంటే పుణ్యం పూర్తయిపోతే అక్కడ్నుంచి కూడా కింద ఈ లోకంలో పడిపోయే భీతి ఉంటుంది. కనుక వాటిని పూర్తిగా త్యాగం చేస్తేనే అవి ఆనందాన్ని ఉత్పన్నం చేయటానికి ముఖ్య కారణాలవుతాయి. సంసార వైరాగ్యం పొంది, హరి చరణాల్లో స్థిరంగా లీనమై హరి భజన, నామస్మరణల్లో నిమగ్నమైపోతే ఆయన సంకటాలను పోగొట్టి మనలను రక్షిస్తాడు.నీ పూర్వజన్మ పుణ్యం చాలా గొప్పది. కనుకే ఈ స్థలం మీది ప్రీతితో నీవిక్కడకొచ్చావు. నీ జన్మని సార్ధకం చేసుకో. రేపట్నుంచి శ్రీమద్భాగవత పురాణాన్ని మనస్పూర్తిగా స్వాధ్యయనం చేయి. త్రికరణశుద్ధిగా మూడు సప్తాహాలు పారాయణ చేయి. కోరికలన్నింటినీ త్యజించి మళ్ళీ మళ్ళీ లోతుగా పరిశీలించాలన్న తపనతో ఈ గ్రంధాన్ని శ్రద్ధగా చదువు. అప్పుడు భగవంతుడు ప్రసన్నుడై సమస్త దు:ఖాలను అంతం చేస్తాడు. మాయామోహాలు శాంతిస్తాయి. నీకు ప్రపంచంలో ఆసక్తి తొలగిపోతుంది."  అని అన్నారు.






మరునాడు ఉదయాన సన్యాసి విజయానందుడు కాలకృత్యాలు తీర్చుకొని,స్నానాదికాలు పూర్తిచేసి బాబాకి దోసెడు పూలు సమర్పించి ఆయన చరణ ధూళిని తలపై ధరించాడు. తరువాత సంస్కృత భాషలోని శ్రీమద్భాగవత పురాణ గ్రంధాన్నితీసుకొని లెండీబాగ్ లోని చక్కని ప్రదేశంలో ఆసనం వేసుకొని బాబాని స్మరించి పారాయణ ప్రారంభించాడు. రెండు సప్తాహాలు భక్తితో పూర్తి చేశాడు. మూడవ సప్తాహం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా అతనికి అస్వస్థత కలిగింది. శక్తి లేక సప్తాహం అలాగే అసంపూర్తిగా వదిలేసి అతను వాడాకి తిరిగి వచ్చేశాడు. అతికష్టం మీద రెండు రోజులుండి, మూడవరోజు ఉదయం ఆ సన్యాసి అస్తమించాడు. శారీరక, ఐహిక విషయాలపై ఆసక్తి నశించిపోయి దేహ ముక్తుడైనాడు. సన్యాసి మరణం గురించి బాబాకి తెలిపినప్పుడు ఆయన భక్తులతో ఆతని దేహాన్ని రోజంతా ఉంచండి. అని చెప్పారు. ప్రభుత్వ అధికారుల విచారణ అనంతరం యధావిధిగా ప్రేత సంస్కారం అయిపోయింది. సరైన స్థలంలో అది పాతిపెట్టబడింది. సన్యాసికి సద్గతి ఇవ్వటం అనే సాయిబాబా కార్యం పూర్తయింది. సాయి సమర్ధులు సనాతన బ్రహ్మ. ఆయన మాటలు ఖచ్చితంగా నిశ్చయపూర్వకమైనవి.  


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.


Saturday, December 10, 2016 0 comments By: visalakshi

ధ్యాన యోగము

శ్లో" సుహృన్మి త్రార్యుదాసీన  మధ్యస్థద్వేష్యబంధుషు
     సాధుష్యపి  చ  పాపేషు  సమబుద్ధి  ర్విశిష్యతే  ..( భగవద్గీత 6వ అ..9శ్లో )

రుజువర్తనులైన శ్రేయోభిలాషులను, ప్రేమయుక్తులైన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ఈర్ష్యాపరులను, చుట్టములను, సాధువులను, పాపులను కూడా సమబుద్ధితో చూచు వ్యక్తి మిక్కిలి విశిష్టుడుగా పరిగణింపబడును. 



 శ్లో" యోగీ యుణ్జీత సతత మాత్మానాం రహసి స్థిత:
     ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీ రపరిగ్రహ:    ( 6వ అ-10వశ్లో )

దివ్యజ్ఞాని తన ఆత్మమనోదేహములను సర్వదా భగవత్సేవయందు వినియోగింపవలెను. అతడు ఏకాంతప్రదేశమున ఒంటరిగా నివసించుచు మనస్సును ఎప్పుడును శ్రద్ధతో నిగ్రహింపవలయును. అతడు కోరికలనుండియు, వస్తువులను కలిగియుండ వలెనను భావము నుండియు దూరముగా నుండవలయును. 


  

కృష్ణుడు బ్రహ్మముగను, పరమాత్మగను, దేవాదిదేవుడుగను వివిధ పరిమాణములలో గుర్తింపబడును. కృష్ణచైతన్యమనగా సంక్షేపముగా దివ్యమును ప్రేమయుక్తమును అయిన భగవంతుని సేవయందు ఆసక్తి కలిగి యుండుట. ప్రత్యక్షముగా కృష్ణచైతన్యము కలవాడు బ్రహ్మము అనినను, పరమాత్మ అనినను ఏమో తెలిసికొన్నవాడగుటచే దివ్యజ్ఞానముతో శ్రేష్ఠుడగును. అతనికి పరమసత్యమును గూర్చి కల జ్ఞానము సంపూర్ణమైనది. కృష్ణునియం దెల్లప్పుడు మనస్సును స్థిరముగా నుంచుట దివ్యజ్ఞాని యొక్క ప్రధమ ధర్మము. ఎల్లరూ కృష్ణునే ధ్యానించుచు ఆతని నొక్క క్షణమైనను విస్మరింపరాదు. భగవంతునియందు మనస్సు నేకాగ్రముగా నుంచుటయే సమాధి యనబడును.మనస్సును ఏకాగ్రముగా నుంచుటకు ఎవరైనను ఏకాంత స్థలమునుండి బాహ్యవిషయములవలన అంతరాయములను పరిహరింపవలయును. అతడు తన ఆత్మానుసంధానమునకు అనుకూల పరిస్థితులను గ్రహించి, అనుకూలములు కానివానిని త్యజించుట యందు మిక్కిలి శ్రద్ధ వహించవలెను. సంపూర్ణ నిశ్చయముతో వస్తువులను కలియుండవలెనను భావమునందు తన్ను బంధించు అనవసర భౌతిక విషయములకై అతడు ప్రాకులాడరాదు. ప్రత్యక్ష కృష్ణచైతన్యమనగా ఆత్మత్యాగమని అర్ధము. అందు భౌతికవస్తువులను కలిగియుండవలెనను భావమునకు అవకాశమే లేదు. 



20 - 23 శ్లోకాల భావార్ధం ను పరిశీలిస్తే...యోగాభ్యాసముచే మానవుడు భౌతిక భావముల నుండి క్రమముగా దూరుడగును. ఇదే యోగ సిద్ధాంతము యొక్క ప్రధాన లక్షణము. దీని తరువాత అతడు సమాధిలో నుండిపోవును. అనగా యోగి ఆత్మను పరమాత్మగా గుర్తించు భ్రాంతులేమియు లేకుండ దివ్యమైన మనస్సు చేతను బుద్ధి చేతను పరమాత్మను అనుభవించును. పతంజలిముని యోగసూత్రములో "పురుషార్ధశూన్యానాం గుణానాం ప్రతిప్రసవ: కైవల్యం స్వరూపప్రతిష్ఠా వా చితిశక్తిరితి" అని ప్రకటించారు. ఈ చిత్తిశక్తి లేక అంతరశక్తి దివ్యమైనది. పురుషార్ధములనగా భౌతిక, మత తత్పరత, ఆర్ధికాభివృద్ధి, ఇంద్రియ సంతృప్తి, చిట్టచివరికి భగవంతునితో ఏకమగుటకు చేయు ప్రయత్నము అని అర్ధము. ఈ భగవదైక్యమునే అద్వైతి "కైవల్య"మని చెప్పును. జీవిని తన నిజస్థితిని యెరుంగజేయు అంతరమైన లేక దివ్యమైన శక్తియే కైవల్యము.  

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు. 
Friday, December 9, 2016 0 comments By: visalakshi

గీతామృత బోధ

శ్లో" యే యధా మాం ప్రపద్యంతే తాంస్తధైవ భజామ్యహం! 
      మమ వర్త్మానువర్తంతే మనుష్యా: పార్ధ సర్వశ:!!   (గీత 4వ అ-11శ్లో)


మానవులు ఏ మార్గాన్ని అనుసరించినా, ఏ రూపాన్ని ఆరాధించినా నన్నే పొందుతారు. పార్ధా! ఎవరు నన్ను ఎలా సేవిస్తే, నేను వాళ్ళను అలా అనుగ్రహిస్తాను. మానవులందరూ అన్ని విధాలా నన్నే అనుసరిస్తున్నారు.అని భగవాన్ శ్రీకృష్ణుడు అర్జనుడి సందేహాన్ని తీరుస్తాడు.




భగవద్గీత అంటే భగవంతుని అమృతగానం. శ్రీకృష్ణుడు గీతను అనుష్ఠాన వేదాంతంగానే అందించాడు.కృష్ణుడు చేసిన ప్రతీ చర్య వెనుక ఓ అగాధమైన అంతరార్ధమున్నది. వేదాంత వివరణమున్నది. తత్త్వ రహస్యమున్నది. జైలులో పుట్టిన నాటినుండి, రేపల్లెలో పెరిగేటపుడు, పాలకుల ప్రక్కనచేరి ఎత్తులకు పై ఎత్తులు వేయించినపుడూ ..సమయం లభిస్తేచాలు సదుపదేశాలు అందించేవాడు శ్రీకృష్ణుడు. మహాభారత సంగ్రామంలో అర్జనుడికి చెప్పే వంకతో భగవద్గీతను లోకానికుపదేశించి ఉపకారం చేశాడు శ్రీకృష్ణుడు. వేదాలసారాన్ని అర్జనుని సాకుగా పెట్టుకొని స్వామి మానవ సమాజం కోసం ఉదారంగా అందించాడు. "శ్రీరామాయణం, భారతం, భాగవతం, భగవద్గీతాదులు ప్రపంచంలోని మానవజాతికంతటికీ మార్గనిర్దేశంచేసే పవిత్ర గ్రంధాలు..ఉదాత్తమైన ఉపదేశాలు." 




మనం మాత్రం గీతను కేవలం పవిత్ర గ్రంధంగా భావించి పూజగదికి పరిమితం చేశాం. మనిషి పరిపూర్ణుడవడానికి కావలసిన అంశాలు గీతలో ఉన్నాయి. గీతలోని ధ్యాన శ్లోకాలను చదివినప్పుడు అవి ధ్యానానికి ఎంత ఉపకరిస్తాయో తెలుస్తుంది. వేదాలు అనే కామధేనువు నుండి శ్రీకృష్ణుడనే గోవులకాపరి పితికిన 'పాలు ' గీత. ఆ పాలు కేవలం పూజగదిలో పెట్టి పూజించడానికి కాదు; అవి మనం తాగడానికి ఉద్దేశింపబడ్డాయి. అప్పుడే జ్ఞానశక్తి వస్తుంది. అనేక సం"ల నుండి ఆ పాల గ్లాసును పూలతో పూజిస్తున్నాం కానీ తాగలేదు. అందుచేతనే మనం బౌతికంగా, మానసికంగా, సాంఘీకంగా బలహీనులుగా ఉన్నాం. గీత అనే పాలను తాగడం మొదలుపెడితే జాతి నూతన జవసత్వాలను సంతరించుకుంటుంది. శక్తి వంతులమవుతాము.  జాతి ఔన్నత్యాన్ని సాధిస్తుంది. దేశం ప్రగతి పధంలో ముందుంటుంది.



సాధారణంగా అన్నిరకాల బోధలు దేవాలయాలలోనో, అరణ్యాలలోనో, ప్రశాంతమైన ప్రదేశాలలోనో చెప్పబడ్డాయి. గీతాబోధమాత్రం యుద్ధరంగంలో, కల్లోలంగా ఉన్న ప్రదేశంలో బోధించబడింది. ధైర్యశాలి ఐన అర్జనుడికి ధైర్యశాలి, ధీశాలి అయిన శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం గీత. అంటే ధైర్యశాలురైన ప్రజలకు మరింత ధైర్యం కోసం గీత అన్న ఉద్దేశ్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. "చక్కని పుష్పమాలవలె, మనోహర పుష్పగుచ్చంవలె క్రమపద్ధతిని సుందరంగా కూర్చబడిన ధర్మముల యొక్క సముదాయమే భగవద్గీత."  'భగవద్గీత పరమోత్కృష్ట గ్రంధరాజము.'


డిసెంబరు 10 అనగా రేపు 'గీతాజయంతి.'..సందర్భంగా మనమందరం గీతామృత బోధను, పఠనం చేసి గీతలో అంశాలను అవగాహన చేసుకొని పాటిద్దాం. పరిపూర్ణులవుదాం.  జ్ఞాన శక్తిని పొందుదాం.

  సర్వం శ్రీ సాయి నాధార్పణ మస్తు. 


Thursday, December 8, 2016 0 comments By: visalakshi

యజ్ఞోపవీతం

యజ్ఞోపవీతం పరమం పవిత్రం 
ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్!
ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజ:!!            (పారస్కర గృహ్య సూత్రం 2-2-10)

యజ్ఞమనే సత్కార్యాన్ని చేసేందుకు ధరించే దీక్షా సూత్రం ఈ యజ్ఞోపవీతం. 



యజ్ఞోపవీతం అంటే - మంచిపనులు చేసేందుకు సమీపంగా చేర్చేది, అర్హతను యోగ్యత కలిగించేదని అర్ధం. 

పరమం పవిత్రం - మానవుని పవిత్రంగా ఉంచే దివ్యమైన సాధనం యజ్ఞోపవీతం. 

 శ్లో" అద్భిర్ గాత్రాణి శుద్ధ్యంతి
      మన: సత్యేన శుద్ధ్యతి !
      విద్యాతపోభ్యాం భూతాత్మా
      బుద్ధిర్ జ్ఞానేన శుద్ధ్యతి !!   (మనుస్మృతి 2-97)

 జలంతో శరీరం,.. సత్యాచరణ, సత్యభాషణ వలన మనస్సు,.. విద్యా, ధర్మాచరణ వలన ఆత్మ,.. జ్ఞానంతో బుద్ధి పవిత్రమవుతాయని మహర్షులు తెలుపుతున్నారు.

ప్రజాపతేర్యత్ - సమస్త ప్రాణులకు పరమాత్ముడే ఆధారం. ఆయనే పతి, పాలకుడు, తండ్రి, రక్షకుడు, మనం చేసే శుభాశుభకర్మలకు న్యాయరూప ఫలాన్ని ఇచ్చేది పరమాత్ముడే. అతడు ఆనందస్వరూపుడు. పూర్ణసుఖస్వరూపుడు. మానవుడు అల్పబుద్ధితో ఇంద్రియాలకు వశుడై భౌతిక సుఖాలవెంట పరుగెత్తి అలసిపోతున్నాడు. అవి లభిస్తే సుఖాన్ని పొందుతున్నాడు. లేకుంటే రాగద్వేషాలకు లోనై దు:ఖాన్ని అనుభవిస్తున్నాడు. 

సహజం పురస్తాత్ - శిశువు జన్మించడానికి ముందే, తల్లి గర్భంలో శిశువుకు ఈ ఉపవీతం సహజంగా ఉంటుంది. తల్లి గర్భంలో బిడ్డకు, బొడ్డు త్రాడు రస, ప్రాణాలనిచ్చి రక్షిస్తుంది. అట్లాగే యజ్ఞోపవీతం, మానవులకు వేదోపదేశ అమృత రూప రస ప్రాణాలనిచ్చి జీవితాంతం కాపాడుతుంది.

 ఆయుష్యం - గర్భాధారణ మొదలు మరణకాలం వరకు మధ్య ఉండేకాలాన్ని ఆయువంటారు. ఆయుష్యమంటే ఆయువును వృద్ధి చేసేదని అర్ధం. అందుకే మానవుడు పురుషార్ధాలతో పూర్ణాయువును కోరుకోవాలి. శక్తిని అర్ధించాలి. ఇంద్రియాలు బలంగా దృఢంగా శక్తివంతంగా వుండాలని పరమాత్ముని కోరుకోవాలి.

అగ్ర్యం - ఈ యజ్ఞోపవీతం మానవునకు ఉత్తమమైన మార్గదర్శిని. శుభకార్యాలకు ప్రేరణనిస్తుంది. అవి చేసేవారిని రక్షిస్తుంది. వారిని సమాజంలో అగ్రస్థానంలో వుంచుతుంది. 

ప్రతిముంచ శుభ్రం - ప్రతి ముంచ అంటే ధరించడమని అర్ధం. శుభ్రం అంటే తెల్లని శుద్ధమైన యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఈ సూత్రం ఎప్పుడు శుచిగా ఉండాలి. శుచిగా లేకుంటే అది తీసి నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి.  

యజ్ఞోపవీతం - అలాంటి దివ్యగుణాలు కలిగిన యజ్ఞోపవీతం

బలమస్తు తేజ: - ఇది తేజోవంతమయిన యశస్సును, ఆత్మశక్తిని ప్రసాదిస్తుంది. యజ్ఞమయ జీవితాన్ని గడపాలనే జిజ్ఞాస కలిగిన స్త్రీ పురుషులందరు దీని ఉద్దేశ్యాన్ని, ప్రయోజనాన్ని తెలుసుకుని, యజ్ఞోపవీతాన్ని ధరించాలి.  



శ్లో" న శూద్ర సమాస్త్రియ: నహి శూద్రయోనౌ
     బ్రాహ్మణ క్షత్రియ వైశ్యా: జాయంతే
     తస్మాత్ చందసాం స్త్రియ: సంస్కార్యా: !!  (హారీత ధర్మ సూత్రాలు)

స్త్రీలు శూద్ర సమానులు కారు. శూద్ర యోనులందు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు జన్మింపరు. స్త్రీలు చందస్సులను (వేదాలను) పఠింపయోగ్యులని ప్రాచీన ఋషులు ప్రభోదించారు. ఈ వ్రతసూత్రం వైదిక సంస్కృతికి పరమ పవిత్రమైన ప్రతీక. ఆచార ధర్మాలను పాటించేవారు, శ్రద్ధ, శిష్టాచారం గల అన్ని వర్ణాల స్త్రీ పురుషులు నిష్ఠగా ఈ యజ్ఞోపవీతాన్ని ధరించవచ్చు అని   కొందరు ఋషులు, ఆచార్యుల అభిమతం. నీతివంతమైన జీవితాన్ని అభిలషించేవారెవరైనా ఈ ధర్మ సూత్రాన్ని ధరించి, గాయత్రీ మంత్రోపదేశం పొందవచ్చుననెడిది  శాస్త్రకారుల  నిశ్చిత  అభిప్రాయం. 



 సమస్త జీవరాసులలో మానవజన్మ అమూల్యమైనది. మనం ఈ జన్మలో అనుభవించే సుఖదు:ఖాలకు కారణం గత జన్మలలో చేసిన మంచి చెడుకర్మల ఫలమే. మానవులు చిత్తశుద్ధితో సత్కార్యాలను ఆచరించాలి. జన్మించిన ప్రతి మనుష్యునకు మూడు ఋణాలుంటాయి.. అవి పితృఋణం, దేవఋణం, ఋషిఋణం. యజ్ఞోపవీతం ఈ మూడు ఋణాలను తీర్చేబాధ్యతను తెలియజేస్తుంది. అందుకు ఈ వ్రతాన్ని స్వీకరించాలని యజ్ఞసూత్రం గుర్తుచేస్తుంది. శారీరక, మానసిక ఆత్మికబలాన్ని ప్రసాదిస్తుంది ఈ యజ్ఞోపవీతం. 

 సర్వం శ్రీసాయినాధార్పణ మస్తు


  
Wednesday, December 7, 2016 0 comments By: visalakshi

ఏకనాధస్వామి -దత్తుని అనుగ్రహం

నిరంతరము భగవన్నామామృత పానచిత్తులై అతిధి అభ్యాగతులను సేవిస్తూ అరిషడ్వర్గములను అంతమొందించి, భగవత్సాన్నిధ్యమును పొంది తరించిన భాగవతోత్తములలో సంత్ ఏకనాధస్వామి సదా స్మరించ దగిన ధన్యాత్ములు.




గోదావరీ పుణ్యనదీతీరంలో పైఠనపుర మను గ్రామము కలదు. ఆ గ్రామములో సూర్యాజీరావు, రుక్మాబాయి అను దంపతులుండేవారు. ఆదర్శగృహస్థ జీవనమును సాగిస్తూ జీవించేవారు. కానీ వారి హృదయాలలో పున్నామనరకము నుండి కాపాడి సద్గతిని ప్రసాదించే కుమారుడు లేడన్నవ్యధ చోటుచేసుకొని ఉన్నది. నిరంతరము పాండురంగని సేవచేస్తూ, తమ అభీష్టము ననుగ్రహించమని ప్రార్ధించేవారు. పాండురంగని ఆశీస్సులు ఆ పుణ్యదంపతులకు లభించాయి. వారికి కుమారుడు కలిగాడు. ఆ బాలునికి ఏకనాధ్ అని నామకరణం చేశారు. భగవదనుగ్రహంతో జన్మించిన ఏకనాధుడు బాల్యమునుండి ఆధ్యాత్మిక విషయములందు ఆసక్తి చూపుతుండేవాడు. ఆసక్తి పెరిగి పెరిగి ఆశయసిద్ధికి అన్వేషణగా పరిణమించింది. బాహ్యవిషయములందు అనురక్తి కలగడంలేదు. నిరంతరం వైరాగ్యజనిత మనస్కుడై ఉదాసీనంగా కనిపించేవాడు. ఏదో పోగొట్టుకున్నట్లు అతని నేత్రాలు వెతుకుతున్నట్లు గోచరమయ్యేవి. భగవంతునికి దూరమైన బ్రతుకు నిరర్ధకమని ఆ పసిహృదయం ఆరాటపడసాగింది.




 ఒకనాడు అతని స్నేహితులు ఆటలకు రమ్మని పిలువగా...ఆటలయందు ఆసక్తి లేకపోయినను మిత్రుల ప్రోద్బలంపై బయలుదేరుతాడు. ఆటలాడుతుండగా ఏకనాధుడు ఓడిపోయాడంటూ మిత్రులందరూ కేరింతలు పెడతారు. ఏకనాధుడు ఆలోచిస్తూ అవును వారు చెప్పినది నిజమే భగవానుని మరచి జీవనము కొనసాగించు నేను అపజయానికి మారుపేరు. నేను తప్పక గెలుస్తాను. భగవంతుని గెలుచుకుంటాను. అని చింతిస్తూ వైరాగ్యము హృదయమునుండి పెల్లుబుకుచుండ ఒక వృక్షచాయలో ఆశీనుడై అంతర్ముఖుడయ్యాడు. అంతరాత్మలో రమించసాగాడు. ఆట ముగియగానే స్నేహితులందరూ ఏకనాధుని అన్వేషిస్తూ ఆ ప్రదేశానికి అరుదెంచారు. అచ్చట అద్భుత దృశ్యాన్ని గాంచి నిశ్చేష్టులయ్యారు. ఏకనాధస్వామి ధ్యానస్థితిలో యుండ త్రాచుపాము అతని మెడను చుట్టి తన పడగతో స్వామి శిరస్సుకు గొడుగు పట్టినట్లు నిలచి యుండుట చూస్తారు. వారి అలికిడికి సర్పము ఏకనాధుని వదలి దూరంగా వెళ్ళిపోయింది. ఏకనాధస్వామి దృష్టి బహిర్ముఖమైంది. స్నేహితులందరూ స్వామిని చుట్టుముట్టి జరిగిన విషయమంతా చెప్పారు. ఏకనాధస్వామి అలా ఉండటాన్ని గూర్చి ప్రశ్నించసాగారు. 




 స్వామి ప్రసన్నవదనంతో స్నేహితులను సమీపించి వారితో మిత్రులారా! "నాకు ఆంతర్యంలో భగవానుని దర్శనం లభించింది. భగవానుని అమృతవాక్కు నాకు హృదయంలో వినిపించింది. దౌలతాబాద్ నగర నివాసియైన జనార్దనపంత్ ని గురువుగా స్వీకరించి సేవించమని ఆదేశము అందినది.నేను గురు సాన్నిధ్యమును పొందుటకు బయలుదేరుతున్నాను." అని మిత్రబృందమును కౌగలించుకొని, వారినుండి వీడ్కోలు తీసుకొని వెనుదిరిగి చూడకుండా దౌలతాబాద్ చేరాడు. గురు జనార్ధన పంత్ గృహస్థుడు. తాను సంసారములో యున్నను తనలో సంసారము లేకుండా జీవించిన మహాజ్ఞాని. దత్తాత్రేయ ఉపాసకులు.ప్రతి గురువారము తాను ఒక అరణ్యప్రదేశమునకు వెళ్ళి అక్కడ దత్తాత్రేయులవారి దర్శనము పొంది తృప్తి చెందేవాడు. తన దరిచేరు జిజ్ఞాసువులకు మార్గమును చూపి నడిపిస్తుండేవాడు. అట్టి గురుజనార్ధనుల వారిని సేవించి, ధన్యత నొందమని హృదయాంతర్యామియైన భక్తవత్సల భగవానుడు ఏకనాధస్వామిని ఆదేశించాడు.ఏకనాధుడు దౌలతాబాద్ చేరి గురు జనార్ధుని పాదాలను ఆశ్రయించారు. జనార్ధనుడు ఏకనాధుని శిష్యుడుగా స్వీకరించాడు. ఆతనిని గమనిస్తూ మంత్రదీక్ష ఇవ్వకుండా తమ ఇంటి ఖర్చుల పద్దులను ఒక పుస్తకములో వ్రాస్తుండమని చెప్పెను. సద్గురుని ఆదేశానుసారము వ్రాయుచుండెడివాడు. క్రమముగా ఏకనాధుని ఏకాగ్రతను, బుద్ధిసూక్ష్మతను గ్రహించి జనార్ధనుడు తృప్తి చెందుతాడు. " కుమారా! ఏకనాధా! ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరింపబడిన కర్మలు మానవునికి ఆధ్యాత్మికోన్నతిని కల్గిస్తాయి. గృహపద్దులను సరిచేయుటకు నీవు ఉపయోగించిన ఏకాగ్రతను భగవానునిపై వినియోగించినచో అనిర్వచనీయానందమును పొందగలవు." అని పరోక్షంగా జ్ఞానోపదేశము చేశారు గురు జనార్ధనులు. గురుబోధ ఏకనాధునిలో నిద్రాణమైయున్న ఆధ్యాత్మిక శక్తిని ప్రజ్వలింపచేసింది. భగవద్దర్శనము కొరకు తపించిపోసాగాడు.




గురుజనార్ధనుడు గురువారమునాడు యధావిధిగా దత్తాత్రేయులవారి దర్శనమునకై అరణ్యమునకేగుచు ఏకనాధస్వామిని వెంటబెట్టుకొని వెళ్ళారు. "ఏకనాధా! ఈనాడు నీకు దత్తాత్రేయులవారి దర్శనము కాగలదు. వారు ఏ రూపములోనైనను కనిపించవచ్చును. భ్రాంతికి లోనుగాకుము. అని చెప్ప ధ్యానస్థితిలో ఆశీనులైరి. కొంతసేపటికి ఒక వికృత రూపధారి అచ్చట కరుదెంచెను. జనార్ధనుడు ఆ వ్యక్తి పాదాలపై బడి ప్రణమిల్లెను. ఏకనాధుడు ఆ వ్యక్తిని చూసి అసహ్యించుకుంటాడు. జనార్ధునుని ఆశీర్వదించి ఆ వ్యక్తి అదృశ్యమవుతాడు. జనార్ధనుడు "వత్సా! ఏకనాధా! ఎంత అపచారము చేసితివి. ఆ వచ్చిన వ్యక్తి ఎవరోకాదు. అతడే అనసూయా పుత్రుడైన  దత్తాత్రేయులవారు.  త్రిమూర్త్యాత్మక   శక్తి స్వరూపము. చేతికందిన అపూర్వ అవకాశమును జారవిడుచుకొంటివి" అని తెలియజేయగానే ఏకనాధుడు దు:ఖవదనుడై విలపించసాగాడు. శిష్యుని పరితాపమును గాంచి..దిగులు చెందకు ఈ రోజుతో నీలో నున్న కొద్దిపాటి అజ్ఞానము పటాపంచలైంది. వచ్చే గురువారము నాడు నీవు దత్తాత్రేయులవారి దర్శనమును పొంది, వారి అనుగ్రహమునకు కూడా పాత్రుడవయ్యెదవు అని ఆశీర్వదించాడు.




మరుసటి గురువారము ఏకనాధుని వెంటనిడుకొని అరణ్యానికి ప్రయాణమయ్యారు గురు జనార్ధనులు. ఒక వృక్షచాయలో ఆసీనులై ధ్యానము చేయుచుండగా మెరుపు మెరుస్తుంది. ఒక దివ్యకాంతి వలయం గోచరిస్తుంది. నేత్రాలు తెరుస్తారు. దత్తాత్రేయులవారు ఒక ఫకీరు వేషములో దర్శనమిస్తారు. ఆతని చుట్టూ నాలుగు కుక్కలుంటాయి. ఆరు మేకలుంటాయి. వారు ఏకనాధుని దగ్గరకు పిలిచి అతని చేతికి ఒక ఖడ్గము నిచ్చి తనతో ఉన్న ఆరు మేకలను ఖండించమని చెబుతారు. ఏకనాధస్వామి భగవదాజ్ఞను శిరసావహించి మేకలను ఖండిస్తాడు. వెంటనే అక్కడ గోచరిస్తున్న దృశ్యమంతా అదృశ్యమైంది. ఫకీరుస్థానే దత్తాత్రేయులవారు ప్రసన్నవదనంతో దర్శనమిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపములతో మూడు శిరస్సులు, ఆరుచేతులతో దర్శనమిస్తారు. శంఖ, చక్ర, గదా,పద్మ, త్రిశూలముతో అద్భుత దర్శనమిచ్చి అనుగ్రహించారు. ఫాలభాగమున విభూతి ధారణచేసి, తులసిమాలను, పుష్పహారములను కంఠమునందు ధరించి, పాదుకలు పాదములయందు ధరించి, కామధేనువు వెనుక నిలబడియుండగ దేదీప్యమానంగా దర్శనమిచ్చి అభయప్రదానం చేశారు. 




 ఏకనాధస్వామి దత్తాత్రేయులవారికి సాష్టాంగ నమస్కారము చేసి తన కన్నీటితో స్వామి పాదాలకు అభిషేకం చేస్త్తాడు. దత్తాత్రేయులవారు "ఏకనాధా! నీవు ఖండించిన మేకలు ఏమిటో తెలుసా? అవియే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనెడి అరిషడ్వర్గములు. నీవు అరిషడ్వర్గములను అంతమొందించి అంత:కరణ శుద్ధిని పొందావు. ఇక నీ శేషజీవితమును హరిసేవకు వినియోగించుము. హరిగుణములను అభంగరూపముగా రచించి గానము చేయుచు తరించుము. వాల్మీకి విరచితమైన శ్రీమద్రామాయణకావ్యము, వేదవ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత గ్రంధములు సంస్కృత భాషలో యున్నవి. నీవు రామాయణ, భాగవత కావ్యములను ప్రాకృతమైన మరాఠీ భాషయందు రచించుము. అని అమృత సందేశమునిచ్చిఅంతర్ధానమయ్యెను.భాగవతులందరు గృహస్థాశ్రమములోనే తరించారు. నీవు నా ఆజ్ఞానుసారము గృహస్తుడవై ఆదర్శమార్గమున చరించి,భక్తిమార్గములో తరించి, లోకాన్ని తరింపజేయుము అని గురు జనార్ధనులవారు దీవించిరి. ఏకనాధస్వామి తల్లిదండ్రుల ఆదేశానుసారము  సద్గుణ సంపన్నురాలైన గిరిజాబాయి అను కన్యను వివాహమాడెను. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానము కలిగిరి. ఏకనాధస్వామి నిరంతరము జపధ్యానాదులతో, భగవద్గుణ సంకీర్తనాదులతో తన్మయత్వ జీవనముతో కాలము గడుపుచుండెను. ఒకనాడు పాండురంగ భగవానుడు ఏకనాధస్వామికి స్వప్న దర్శనమిచ్చి "ఏకనాధా! వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణ కావ్యమును   సులభశైలిలో సంస్కృతము తెలియనివారు చక్కగా చదివి అర్ధం చేసుకొనునట్లు మరాఠీభాషలో రచించుము" అని తెలియజేసెను. ఏకనాధస్వామి మేల్కొని దిగ్భ్రాంతి చెందెను. దత్తాత్రేయులవారి ఆశీర్వాదముతో, మరియు పాండురంగని అనుజ్ఞను హృదయములో గురుదేవులను కూడా ప్రార్ధించి రామాయణ రచనను రమ్యముగా సాగించి పూర్తి చేసెను. పరమ భాగవతమూర్తి ఐన ఏకనాధస్వామి తనకు ప్రాణమైన భాగవత గ్రంధమును కూడా మరాఠీ భాషలోకి అనువదిస్తూ భక్త సమూహమునకు వివరించెడివారు. ఏకనాధుని భక్తిప్రపత్తులకు సంతసించిన ద్వారకాపతి శ్రీకృష్ణుడు బ్రాహ్మణరూపంలో వచ్చి ఏకనాధస్వామి ఇంట్లో వంట చేయు శ్రీ ఖంఢ్వాగా 12 సం"లు ఆయనవద్ద ఉండి సేవ చేసెను. ఆయనను శ్రీకృష్ణ పరమ్మాత్మ అవతారములో చూసిన ఏకనాధుడు భగవాన్ నన్ను కరుణించావా తండ్రీ! అంటూ శ్రీఖండ్వా పాదములపై పడెను. చూస్తుండగానే శ్రీఖండ్వా అదృశ్యమయ్యెను. కృష్ణా తెలియక నీచే వండించుకొని తృప్తిగా 12సం"లు భోజనం చేశాను. నీవు తిన్నావా అని ఒక్కనాడైనా అడుగలేదు అని విలపించెను. వాసుదేవుడు మధురమైన వాణితో ఏకనాధా! నీవు నా ఆంతరంగిక భక్తుడవు. నీవు నా కృపకు పాత్రుడవయ్యావు. నిన్ను త్వరలోనే నాలో ఐక్యము చేసుకొంటాను" అని చెప్పి అంతర్ధానమయ్యెను. ఏకనాధుడు  కొద్ది రోజులకు భక్తులకు నమస్కరించి, గోదావరీ పుణ్యతీర్ధములోదిగి నీటిలోనుండి భక్తజనులకు నమస్కరిస్తూ వాసుదేవుని చైతన్యములో లీనమయ్యెను.భాగవత ధర్మమును ప్రచారము చేసి, భాగవతులకు ఆదర్శమై నిలిచిన ఏకనాధస్వామి సదా స్మరణీయుడు, సర్వ సంపూజ్యుడు. దత్తాత్రేయులవారి ఆజ్ఞతో రచించిన ఏకనాధ రామాయణము, ఏకనాధ భాగవతములను... దత్తుని ఐదవ అవతారధారి శ్రీ షిర్డీసాయిబాబా సమక్షమున భక్తులు ఆ గ్రంధములను బాబావారి చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనేవారు. ఆ పవిత్ర గ్రంధములను బాబాగారి సమక్షములో పారాయణ చేసేవారు. 



 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.