Monday, October 31, 2016 3 comments By: visalakshi

శ్రీసాయి సర్వవ్యాపకత

 శ్లో" అంతకాలే చ మా మేవ స్మరన్  ముక్త్వా కలేబరం!
      య: ప్రయాత స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయ:!!     8 అ-5శ్లో..


ఎవరు జీవితాంతమున నన్నే స్మరించుచు దేహమును విడుతురో వారు తత్క్షణమే నా భావమునే పొందుదురు. ఈ విషయమున సందేహము లేదు.

 శ్లో" యం యం వాపి స్మరన్ భావం త్యజ త్యంతే కలేబరం!
      తం త మైవేతి కౌంతేయ సదా తద్భావభావిత:!!       8 అ-6శ్లో..

దేహమును విడుచునపుడు మానవుడే స్థితిని స్మరించునో ఆ స్థితిని తప్పక పొందును.

 ఆయు:పరిమితి అనే తైలం అయిపోయాక, ప్రాణమనే జ్యోతి మందంగా వెలిగేటప్పుడు, బాబా దేహం బయ్యాజీ పాటిల్ తొడపై విశ్రమించింది. కింద పడనూ లేదు, నిద్రించనూ లేదు. కానీ హాయిగా ఆసనంపై కూచుని ఆ ప్రకారంగా తమ చేతులతో దానధర్మాలు చేస్తూ బాబా తమ దేహాన్ని ధరిత్రిపై విసర్జించారు. సాయిసమర్ధులు తమ మనోగతాన్ని ఎవరికీ తెలీనీకుండా ఉన్నపాటున తమ దేహపతనం చేసి బ్రహ్మీభూతులైనారు. దేహము అనే మాయా ముసుగు వేసుకొని మహాత్ములు ఈ జగత్తులో అవతరిస్తారు. లోకులను ఉద్ధరించే కార్యం ముగియగానే వెంటనే అవ్యక్తంలో సమరసతను పొందుతారు.  చిన్మయకాంతులు వెదజల్లే సాయి ఆత్మానందానికి మూలస్థానం.  దేహధారణ చేసి ఆయన వ్యక్తమయారు. దేహత్యాగం తరువాత ఆయన అవ్యక్తమైనారు. ఒక కార్యం కోసం ఒక ప్రదేశంలో అవతరించిన ఆయన అవతారకార్యం సమాప్తమైంది. ఇప్పుడు అన్ని కార్యాలలోనూ, అన్నిచోట్లా ఆయనకున్న సంబంధం సుస్పష్టమైంది. ఆయన సర్వవ్యాపకతను పొందారు. పూర్ణంగా శాశ్వతులైనారు.భక్తుల హృదయాల్లో కూచున్నారు. చైతన్యంతో తొణికిసలాడుతూ భక్తుల హృదయాల్లో శాశ్వతంగా కొలువై భక్తులను సదా మేల్కొలుపుతారు.భక్తుల కార్యాల్లో సాయం చేసే సాయి షిరిడీలో తమ దేహాన్ని ఉంచేశారు. కానీ ఆయన జగత్తులోని సమస్త స్థావరజంగమ వస్తువుల్లో స్వస్వరూపంలో నిండిఉన్నారు. మనసుకి సంకల్పం కలిగినపుడు అవతారం ధరించగల సమర్ధులాయన. మూర్తీభవించిన బ్రహ్మస్వరూపులైన అలాంటి పుణ్యాత్ములు లోకోపకారానికై అవనిపై ప్రకటమవుతారు. మూడున్నర మూరల ఐదడుగుల మానవదేహం నాది కాదని గ్రహించండి. అని ఈనాడు కూడా బాబా మనకు ఉపదేశిస్తున్నారు. ఆయనకి  విశిష్టమైన   రంగు, రూపాలను ఆపాదించడం యోగ్యం కాదు. అదృష్టవశాత్తూ  పరబ్రహ్మ సగుణమూర్తిగా బాబా మనతో ఉండగా  మనకు మనసులలో సందేహాలేల...ఇది ఒక జన్మకు పరిమితి అయ్యే విషయం కాదు. ఒకరితో  4 జన్మల బంధం అయితే, మరొకరితో 72 జన్మల ఋణానుబంధం అని బాబా తాము భక్తులతో కధలు చెప్పేటప్పుడు చెప్పారు. ఎంతమందికో ఆయన ఇప్పటికీ ప్రత్యక్షంగా దర్శనమిస్తారు. ఎందరికో స్వప్నంలో అనుభవాలిస్తారు. అనేకులకు రహస్యంగా లీలలు చూపిస్తారు. భక్తులకు వాళ్ళున్నచోటనే కనిపిస్తారు. వారి వారి మనసుల్లో ఉన్న భావన బట్టే వారికి అనుభవాలు కలుగుతాయి.  చావడిలో ఆయన గుప్తరూపంతో, మశీదులో పరబ్రహ్మ రూపంతో, సమాధి మందిరంలో సమాధి తీసుకొన్న రూపంతో సర్వత్రా సుఖరూపంతో ఉంటారు. ఆయన అక్షయంగా అఖండంగా దర్శనమిస్తారు. శ్రీసాయి చరణారవిందాలలో నిష్కామ ప్రీతి కలుగుగాక! గురుగుణాలను వర్ణించడంలో నిర్మలభక్తి ఉత్పన్నమగుగాక! గురు పాదాల్లో చెక్కుచెదరని అఖండ భక్తి కలుగుగాక! స్నేహానుబంధాన్ని దూరం చేయక భక్తులు అహోరాత్రులూ సుఖసంపన్నులుగా ఉందురుగాక!...
 మహాత్ముల స్వరూపం సదా ఆనంద దీపికలు వెలిగిస్తూ ఉంటుంది. దైవదృష్టికి పరిమితి లేదు. "ఏయధా మాం ప్రపద్యంతే తాంస్తధైవ భజామ్యహం" (నా పట్ల ఎలాంటి భక్తిని కలిగిఉంటే వారికి వారి భక్తి ననుసరించి అలాంటి ప్రతిఫలమిస్తాను) అయితే మహాత్ముల అంత:కరణ వారిని నిందించిన వారిపై కూడా కారుణ్యం కురిపిస్తుంది. బాబా ఎన్నోసార్లు "ఇతరుల మనసుకి కష్టం కలిగేలా మాట్లాడితే అవి నా హృదయాన్నే తూట్లు పొడుస్తాయి. నా అత్యంత సున్నితమైన భాగానికి గుచ్చుకుంటాయని తెలుసుకోండి. ఇతరులను   బాధాకర మాటలతో కోపం కలిగేలా మాట్లాడితే అవి నన్నే బాధిస్తాయి. కానీ వాటిని శాంతంగా సహించే వారే నాకు బాగా తృప్తి కలిగిస్తారు". అని చెప్పి ఉన్నారు. అలా సాయిబాబా జీవులన్నింటా లోపలా, బయటా నిండి ఉన్నారు .ఆ మహా మంగళప్రదమైన ప్రేమమయి సర్వవ్యాపకుడై  భక్తుల  హృదయనివాసుడైనాడు.

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

Sunday, October 30, 2016 0 comments By: visalakshi

దీపాల వెలుగు


 అమావాస్య వెలుగులుగా ఈ రోజు మన దీపాలను అభివర్ణిస్తాం.

చీకటిలో అవి మనకిచ్చే కాంతిలో పండగను ఆనందంగా జరుపుకుంటాం.

ప్రతీ దీపంలో మనం భగవంతుని చూస్తాం.  

 ఈ ప్రకృతిలో ప్రతీ మార్పు పరమాత్మ చర్యే! అందుకే మనం పరమాత్మని శరణాగతి చేద్దాం.మన చుట్టూ ఉండే ప్రపంచమూ ఆయనది అని విశ్వసిద్దాం.

భగవద్బంధుత్వాన్ని గుర్తించి ప్రేమాదరాలతో అందరం సహజీవనం ఉత్సాహంగా సాగిద్దాం.

  మనసనే దీపం వెలుగులో ప్రతిరోజూ దీపావళి జరుపుకుందాం..
Saturday, October 29, 2016 0 comments By: visalakshi

పక్షపాత రహితుడు పరమాత్మ

 శ్రీ సద్గురు సాయినాధాయ నమో నమ:

 శ్లో" సమో2హం సర్వభూతేషు న మే ద్వేష్యో2 స్తి న ప్రియ:!

    యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం!!...9అ"..29శ్లో

 భా:- నేను అన్ని ప్రాణులపట్లను సమానుడను. నాకు ద్వేషించదగినవాడు లేడు..ఇష్టుడును లేడు. ఎవరైతే నన్ను భక్తితో ఉపాసించుచున్నారో వారు నా యందున్ను, వారి యందు నేనున్ను ఉంటున్నాము.


ఆనంద పరిపూర్ణులు, జ్ఞాన ప్రతిరూపులు, సమర్ధ సద్గురులైన మీకు వందనములు బాబా!భయాన్ని నాశనం చేసి, కలియుగంలో ఉత్పన్నమయే దుష్టవాసనలను సమూలంగా దగ్ధం చేసిపారేసే మీరు ఆనందామృత సాగరమే! బాబా మీ స్వరూపాన్ని దర్శించకపోతే మనసుకి ఏ మాధుర్యమూ పట్టుకోదు. మీ స్వరూపాన్ని ధ్యానంలోకి తెచ్చుకొని కళ్ళెదుట నిలుపుకోవాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది. సాక్షాత్ శుద్ధజ్ఞానమూర్తి అయిన మీ పాదాలు తప్ప మాకు మరో ఆశ్రయం లేదు.బాబా! అనేకమంది భక్తులు మీ దర్శనానికొస్తారు. మీ పాదాలపై తలపెట్టి గుండెలనిండా పొంగిపొర్లే ప్రేమతో సుఖాన్ని పొందుతారు.ఆ చరణాలు ఎలా ఉంటాయని! చంద్రుడికి వృక్షశాఖలతో సంబంధాన్ని కల్పించిన ఉదాహరణలా పాదం బొటనవేలుని పట్టుకొని భక్తుల దర్శనోత్సాహాన్ని తీరుస్తారు. కృష్ణపక్షం పదిహేనవరోజు అంటే పూర్ణ అంధకారం ఉన్న అమావాస్య గడచిపోగానే చంద్ర దర్శనం చేసుకోవాలని అందరికీ సహజంగా కోరిక ఉంటుంది. అలాగే బాబా! భక్తుల కోరికను ..ఎడమ మోకాలుమీద కుడిపాదం పెట్టికూచున్నప్పుడు మీ పాదం దగ్గరే మీరు తీరుస్తారు. ఎడమచేతి చూపుడువేలు, దాని పక్కనున్న మధ్యవేలు, ఈ రెండు వేళ్ళు అనే చెట్టు రెండు కొమ్మల మధ్యప్రదేశంలో పాదం వేళ్ళు పట్టుకొని ఉంటారు. ఆ పాదం బొటనవ్రేలి మహిమ ధన్యం. బాబా స్వయంగా వేణుమాధవుడై గంగా-యమునలను ప్రకటం చేసి దాసగణుని తృప్తి పరిచారు.ఇక్కడ మా గృహమునందు బాబా చూపిన మహత్యం మరొకసారి మీ ముందు...


సాయి ప్రభూ! పూర్వజన్మ సుకృతమా, మాకి౦తటి అదృష్టమా!"అలనాడు దాసగణు మహరాజ్ ని కరుణి౦చి పాదము బొటనవేలును౦డి గ౦గా, యమునల ప్రవాహాన్ని చూపినావని సచ్చరిత్రలో చదివి ధన్యులమయ్యాము." ఈనాడు మా సోదరి చె౦త  అనుక్షణ౦ సాయినాధుడు తమ అద్భుత లీలలతో అలరిస్తున్నవైన౦ ఏ విధ౦గా మాటలలో పొదిగి మీకు వివరి౦చాలో తెలియని అల్పప్రాణిని నేను! అయినా సృష్ఠి, స్థితి, లయ కారకుడు శ్రీ సాయి నా చేత రాయిస్తున్నారన్న ధైర్య౦ నాలో మీకా అద్భుత౦ చెప్పాలన్న ఆకా౦క్ష రేపుతో౦ది.


శుక్రవార౦ మధ్యాహ్న౦ సోదరి ఫోనులో ఎ౦తో అనుభూతితో,అమిత ఆన౦దాతిశయ౦తో విభూధి బాబాగారి వెనుక వున్న చ౦దన చర్చితులైన బాబాగారి ను౦డి తీర్ధ౦ వస్తో౦ది. త్వరగా బయలు దేర౦డి అని చెప్పారు. మా శ్రీవారు ఆఫీసులో వున్నారు. మా సోదరి ఆఫీసుకి ఫోను చేసి "బావగారూ" నేను కళ్ళారా చూసాను లిప్తపాటు సెకనులో బాబాగారి  బొటనవేలు  ను౦డి బొట్టు,బొట్టుగా తీర్ధ౦ వస్తో౦ది. రెప్పవేయకు౦డా చూసాను మళ్ళీ కనిపి౦చలేదు.కానీ తీర్ధ౦ వస్తో౦ది.అని ఆత్ర౦గా వివరి౦చగా మావారు వె౦టనే ఒక సహౌద్యోగుని వె౦ట తీసుకుని సోదరి ఇ౦టికి వచ్చారు. చ౦దన౦ ర౦గులో వున్న తీర్ధాన్ని  చూసి తరి౦చి,ఒక ఐదు ని"లు మావారు ధ్యాన౦ చేసుకుని బయటకు వచ్చారు. మా సోదరి  వెళ్ళి చూచు సరికి గిన్ని ని౦డా తీర్ధ౦ ఉద్భవి౦చి౦ది."ఈ విధ౦గా ఉనికిని చూపిస్తూ అద్భుతమైన అనుగ్రహాన్నిమనకిస్తున్న శ్రీ సాయి నాధునికి" మనమ౦తా కలిసి" సేవలు"చేద్దా౦.అనిమాశ్రీవారు సోదరికి  భరోసా ఇచ్చారు.తీర్ధ౦  స్వీకరి౦చి వారిరువురు ఆఫీసుకి వెళ్ళారు.ఆ సమయానికి మేము కూడా అక్కడికి చేరాము.అ౦తటి మహిమాన్విత గ౦గా,యమున,త్రివేణీ్స౦గమలనుచూసిన ఆన౦ద౦లో అ౦దర౦ ఆ కరుణాబ౦ధుసాష్టా౦గప్రణామాలతో,పాదాభివ౦దనా
లు చేసాము అ౦దర౦ తీర్ధాన్నిస్వీకరి౦చాము.భక్తులు తీర్ధ౦ తీసుకున్నారు ఎ౦త మధురాతి మధుర౦. "చ౦దన౦,తేనె,తులసితీర్ధ౦ అన్నీ మిళితమైన సుగ౦ధామృత౦.బాబాగారి పాదోదక౦."ఆ అమృతాన్ని సేవి౦చి అ౦దర౦ పునీతులైనాము. ఇ౦తటి అదృష్టాన్ని మాకు ప్రసాది౦చిన శ్రీ సాయి చరణామృతాలని శరణు వేడుతూ....

ఈ రోజు (21-04-2011) మా సోదరి, నేను ఈ విషయ౦ అ౦తా చర్చి౦చుకుని, సాయ౦త్రము 6.30 గ౦"లకు బాబాగారికి  ధూప్ ఆరతి పాడుతున్న తరుణ౦లో మా ఇ౦టిలో ఒక అత్య౦త అద్భుత౦ జరిగి౦ది. మా సోదరి  మామిడిప౦డ్లు నైవేద్య౦ పెట్టిన తదుపరి వెళ్ళి చూడగా మా పూజా మ౦దిర౦లో బాబాగారి పాదమును౦డి "తీర్ధ౦" ప్రసాది౦చారు."మా పాప,బాబు సచ్చరిత్ర పారాయణ౦ మొదలు పెట్టిన ఈ రోజు తీర్ధ౦ ప్రసాది౦చడ౦....."
ఆతీర్ధ౦తో తడిసిన అక్ష౦తలు,ఆతీర్ధ౦ మిళితమై ఉన్న ఆ దృశ్య౦ చూసి మా కుటు౦బసభ్యుల౦ ఆశ్చర్య చకితులమై, ఆన౦దాతిశయాలతో బాబాగారికి మ౦గళారతులు  పాడుతూ,  పాదాభి వ౦దన౦ చేసి,ఆ మహిమాన్విత తీర్ధాన్ని అ౦దర౦ స్వీకరి౦చా౦. అద్భుతమైన , అనిర్వచనీయమైన ఆన౦దాన్ని పొ౦దాము.తెలిసిన భక్తులని పిలిచి తీర్ధాన్ని స్వీకరి౦చమని ఇచ్చాము.
మా సోదరి సాయినాధుని "ధ్యాని౦చి "  వివర౦ తెలుపుమనగా...సాయిప్రభు అమృత పలుకులు ఇవి.

" మీరిరువురూ తీర్ధ౦ గురి౦చి మాట్లాడుకున్నారుగా! " "అదే ఈ తీర్ధ౦" అని పలికారుట.

 ఆ పాదం బొటనవ్రేలుది ఎంత మహిమ..  ఇలా ఎందరికో ఎన్నో అనుభవాలున్నాయి..ఆనాడూ..ఈనాడూ...ఆనాటి హేమాడ్ పంత్ గారి అనుభవం వారి మాటల్లో... 

 కాకాసాహెబు దీక్షిత్ ప్రతిరోజూ పగలు ఏకనాధభాగవతం, రాత్రి భావార్ధరామాయణము గ్రంధపఠనం చేసేవాడు. ఈ రెండు గ్రంధాలు పరమార్ధాన్ని సాధింపచేయగల సారసర్వస్వాలు.ఈ గ్రంధాల్లో ఆత్మజ్ఞానం, వైరాగ్యం, నీతి - ఈ మూడు గుణాలనే జ్యోతులు వెదజల్లే అద్భుత ప్రకాశం అఖండంగా మెరుస్తుంటుంది. 

సాయికృపతో దీక్షిత్ కధను వినేందుకు నేను శ్రోతగా అయిన సమయం వచ్చింది.పగలు భాగవతం, రాత్రి రామాయణం వినే అవకాశం లభించింది. అలా ఓ రోజు రాత్రి ఆ పరమపవిత్ర కధ నడుస్తున్నప్పుడు విషయాంతరం చేసే ఓ విచిత్రం జరిగింది. రామాయణంలోని ఓ రసభరిత సన్నివేశం ..హనుమంతుడికి అతని తల్లి రాముడి గురించి చెప్పిన చిహ్నాలు పట్టుకొన్నప్పటికీ అతను తన స్వామి శక్తిని స్వయంగా పరీక్షించబోయాడు. చివరికి గొప్ప అరిష్టమొచ్చి దేహం మీద  పడింది. రామబాణం కొస తగిలి హనుమంతుడు ఆకాశంలో గిరగిర తిరగసాగాడు. అతని ప్రాణం కకావికలైపోయింది. అప్పుడక్కడికి అతని తండ్రి (వాయువు) వచ్చాడు. అతని హితం గురించిన ఆ మాటలు విని హనుమంతుడు రాముణ్ణి శరణన్నాడు. కధలో ఈ భాగం నడుస్తున్నప్పుడు జరిగిన చిత్రాన్ని వినండి. శ్రోతలందరూ శ్రవణానందంలో మునిగిపోయారు. అప్పుడొక 'తేలు 'అనే మూర్తీభవించిన విఘ్నమే ఉత్పన్నమైంది.దానికి కధను వినటంపై ప్రీతి ఎందుకు కలిగిందో ఏమో! అది ఏ మాత్రం తెలీకుండా నా భుజమ్మీదకు దూకి రహస్యంగా దాక్కొని కధారస మాధుర్యాన్ని రుచి చూస్తూ కూచుంది.అక్కడ కూడా బాబా అనుభవమే వచ్చింది. ఆ తేలుని నేను చూసుకోలేదు. అయితే హరికధను వినటంలో తత్పరులైన వారి సంరక్షణను  బాబా స్వయంగా చేస్తాడు. సహజంగా నా దృష్టి అటు పోయి చూసే సరికి నా కుడిభుజం మీది ఉత్తరీయంపై ఆ భయంకరమైన తేలు ఎంచకా హాయిగా కూచుని ఉండటం కనిపించింది.అసలది కదలక మెదలక ఉంది. ప్రశాంతమైన మనసుతో గ్రంధాన్ని వినే శ్రోతలా తన స్థానంలో హాయిగా కూచుని ఉందా అన్నట్లుంది. జాతి స్వభావాన్ననుసరించి ఊరికే కొండిని ఏమాత్రం అటూ ఇటూ కదిల్చినా దాంతో నేను బాధ కలిగి ఉండేవాణ్ణి. రామకధలో అందరూ లీనమై ఉన్నారు..దానివల్ల అందరికీ రసభంగమై ఉండేది. రామకధ ఎంత మహిమాన్వితం అంటే అక్కడ విఘ్నాలకు ఏమీ ప్రభావం ఉండదు. రామకృపతో నా బుద్ధి ఇలా సూచించింది. ఈ ఉపాధిని దూరంగా వదిలేయాలి. ఆ చంచల బుద్ధిగల ప్రాణులపై విశ్వాసం పెట్టరాదు. నేను మెల్లగా పైన కప్పుకొనే ఆ ఉత్తరీయం రెండు కొసలూ కలిపి కట్టాను. తేలుని గట్టిగా మూటకట్టి తోటలోకి తీసుకువెళ్ళి జారవిడిచాను.తేలు తన జాతి మూలంగా మహా భయంకరమైనది. అవకాశం వస్తే తన జాతి స్వభావాన్ని చూపిస్తుంది కూడా. అలాంటి భయం కలిగిన మాట నిజం. అయితే బాబా ఆజ్ఞ కూడా దృఢమైనది. కనుక దాన్ని చంపటానికి చేయి ముందుకు రాలేదు. అదినాకు హాని చేయలేదు..నేనూ దానికి హాని తలపెట్టలేదు.అందరియందు సమబుద్ధి కలిగి ఉంటానని పరమాత్మ చెప్పాడు. మానవులే కాదు సమస్తభూతాలు నాకు సమానమే! కానీ ఎవరైతే ఈ ప్రపంచంలో ఉండే ఇతర ప్రాణకోటికి, ఈ ప్రకృతికి కూడా హాని కలిగించాలని ప్రయత్నం చేస్తే మాత్రం భగవంతుడెప్పుడూ సహించడు. తనను ప్రేమతో సేవించేవారి హృదయాలలో తానుంటానని రక్షణ తానేనని వాగ్ధానం చేస్తాడు.పాముకానీ,తేలుకానీ ఏదయినా ఆయన ఆజ్ఞతోనే ప్రాణులన్నీ వ్యవహరిస్తాయి. ఆయన ఆజ్ఞను అతిక్రమించవు. కనుక ప్రతి ప్రాణిపైన దయ, ప్రేమ ఉండాలి.పక్షపాత రహితుడు పరమాత్మ. అందరినీ రక్షించే ఆ శ్రీహరే శ్రీ సాయిబాబా.

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

Thursday, October 27, 2016 0 comments By: visalakshi

సాయిభక్తి - పరమార్ధం

శ్లో" అనన్యా శ్చింతయంతోమాం ఏ జనా: పర్యుపాసతే!
   తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం!! ( 9అ ..22శ్లో) 


"నా భక్తుల ఇళ్ళలో అన్న వస్త్రాలకు లోటుండదు" అని శ్రీసాయి అభయమివ్వటం మనకు విదితం."అనన్యంగా నన్ను భజించేవారి, నిత్యమూ మనసారా నన్ను సేవించే వారి యోగక్షేమాలు నేనే చూస్తాను. ఇది నా వ్రతం" అనేది భగవద్గీతా వచనం. ఈ భగవద్గీతా వచనాన్ని ప్రమాణంగా తీసుకోమని శ్రీసాయి చెప్పేవారు.భక్తులకు అన్నవస్త్రాల కొరత ఉండదు..లౌకికంలో మానావమానాల లోభాన్ని వదిలేయండి. లోకుల ప్రశంసలకై తల ఒగ్గకండి. దేవుడి ద్వారం వద్ద గౌరవాన్ని పొందండి. ఆరాధ్యదైవం నా (సాయి) నామస్మరణలో మనస్సు లీనమగు గాక! జ్ఞాన భక్తికై దైవం ముందు చేయి చాపండి..భక్తి అనే దైవ ప్రసాదాన్ని పొందండి. అదే ధ్యేయముతో భజనలో లీనమవ్వాలి. అన్య విషయాలను విస్మరించుగాక!మనస్సు పరమశాంతికి పుట్టిల్లై తృప్తిగా నిశ్చయంగా భక్తిలో పారవశ్యం చెందు గాక!.
 సద్గురువు నా దైవం శ్రీసాయి నా భావనలలో సదా నాలోనే కదలాడే నా స్వామి నా మది తలపులలో తమ చేతిని నా తలపై ఉంచుతారు. విభూతితో పాటు ఆశీర్వాద పూర్వకంగా శిరస్సుమీద పెట్టగానే అంత:కరణ స్వానందంతో ఎగసి పడ్తుంది. కళ్ళనుండి ఆనంద భాష్పాల రూపంలో ప్రేమ కనురెప్పలు దాటి వరదలై ప్రవహిస్తుంది. గురుహస్త స్పర్శలోని కుశలత ఎంత అద్భుతమంటే ప్రళయాగ్నిలో కూడా దగ్ధం కాని సూక్ష్మదేహాన్ని ఆ హస్తస్పర్శ దహించి వేస్తుంది.(సూక్ష్మదేహం:- లింగదేహం, వాసనాయుక్త శరీరం, మనసు, బుద్ధి, పది ఇంద్రియాలూ, పంచప్రాణాలూ, ఈ పదిహేడు తత్వాలతో ఉంటుందీ దేహం. దాన్ని దగ్ధం చేస్తే ఆ జీవుడికి పునర్జన్మ ఉండదు.)

బాబా తమ కమలసుమదళంలాంటి చేతిని శిరస్సుపై పెట్టటంతోనే అనేక జన్మలనుంచీ సంతరించుకొన్న పాపాలు ప్రక్షాళనం అయిపోయి నా లాంటి సాయియొక్క ప్రేమిక భక్తులు పవిత్రులవుతారు.బాబాస్పర్శతో హృదయంలో అష్టసాత్విక భావాలు ప్రకటమవుతాయి.పారాయణ చేస్తున్నా, పురాణాలు చదువుతున్నా అడుగడుగునా బాబా కనిపిస్తారు. రాముడు కృష్ణుడు, వేంకటేశ్వరుడు....ఏ దేవాలయానికి వెళ్ళినా.. ఆ రూపాలలో బాబా దర్శనమిస్తారు.ఆహా జన్మ ధన్యము కదా!... కాయా, వాచా, మనసా శ్రీ సాయినాధునికి సాష్టాంగం చేస్తే ధర్మ అర్ధ కామ మోక్షాలనే నాలుగు పురుషార్ధాలను, కర్మ,జ్ఞాన యోగ, భక్తి- అనే నాలుగు మార్గాలతోనూ ఈశ్వరుడు ప్రాప్తిస్తాడు. మనసనే తోటలో భక్తి అనే నీటిని చల్లితే వైరాగ్యం మొలకెత్తుతుంది. జ్ఞానమనే పూలు విరగబూస్తాయి. కైవల్యమనే ఫలం లభిస్తుంది. జ్ఞానమయం విప్పారుతుంది. జనన, మరణాలు నిశ్చయంగా తప్పిపోతాయి.  

బాబా సత్య, జ్ఞాన, ఆనందయుక్తమైన మూడు స్వరూపాలుగా ఉండే పరమాత్ముడు. స్వయంసిద్ధుడు. ఏదో ఒక కారణాన్ని  నిమిత్తంగా పెట్టుకొని ఆయన తమ భక్తులకు శిక్షణ ఇవ్వటానికి పూర్ణత్వంతో జాగృతమై ప్రకటమైనారు.. "సర్వం ఖల్విదం బ్రహ్మ"(కనిపించేదంతా బ్రహ్మే) అంటే సర్వమూ  పరమాత్మ, మాయ, జగత్తు యొక్క ఐక్యతే అయి ఉంది. 

చిత్తంలో శాశ్వత సుఖశాంతులు ప్రాప్తింపచేసుకోవాలన్న ధ్యేయాన్ని పెట్టుకొని సమస్త ప్రాణుల్లోనూ పరమేశ్వరుణ్ణి చూడటమనే ఒక ఉపాసనే పరమపదప్రాప్తిని కలిగిస్తుంది.తత్వం అంటే అభేదజ్ఞానం. దాన్నే ఉపనిషత్తుల్లో బ్రహ్మజ్ఞానం అంటారు. పరమాత్ముని ఉపాసించటమన్నా అదే!, భక్తులు అనే భగవంతుడన్నా అదే! గురువు, బ్రహ్మ అని రెండు లేవు అన్న ఏకాత్మతాజ్ఞానమూ, భక్తీ కలిగాయంటే మాయను దాటటం ఎంతో సులభమవుతుంది. శ్రద్ధావంతులైన యోగ్య భక్తులు జ్ఞాన వైరాగ్యాలను ప్రాప్తింప చేసుకొని ఆత్మానందంలో నిమగ్నులౌతారు..పరమార్ధం పొందుతారు.

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు 

Wednesday, October 26, 2016 0 comments By: visalakshi

అచంచల విశ్వాసం

 శ్లో" మాం చయో' వ్యభిచారేణ భక్తియోగేన సేవతే!
    స గుణాన్ సమతీ త్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే!! -(14ఆ: 26శ్లో)

భా:- ఎవడు నన్ను చలించని భక్తియోగము చేత సేవించుచున్నాడో వాడు ఈ మిశ్రితమైన గుణములను అతిక్రమించి, బ్రహ్మతో సమానమైన రూపమును పొందుటకొరకు తగు వాడవును.  

ఈ ప్రపంచములో మనిషి పుడుతూనే రకరకాల బాధ్యతల బంధాలతో వచ్చాడు. వాటినుండి తప్పించుకోలేడు. సహజంగా ఏర్పడ్డ బంధాలు అవి. ఎవరూ కల్పిస్తే వచ్చేవి కావు.తొలగించినా పోయేవీ కావు  పుట్టుకతో వచ్చాయి కనుక... 

 మన ప్రవృత్తుల్లో కూడా ఎన్నో విచిత్రాలను మనం దర్శిస్తున్నాం. తెలియకుండానే మనస్సు ఒక్కొక్కసారి ప్రశాంతమౌతుంది. ఒకోసారి ఉద్రిక్తమౌతుంది.మరోసారి తెలియని అజ్ఞానంలోకి జారుకుంటుంది. కారణం ఈ జన్మ ప్రకృతి యొక్క అంశ కలది. అందుకే ప్రకృతికుండే గుణాలు దీనిమీద ఎప్పుడూ ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రకృతి సత్వ,రజో తమస్సులనే గుణాలు కలిగి ఉన్నది...వాటివల్ల తయారైంది కనుక ఈ శరీరం కూడా సత్వరజస్తమోమయమయే ఉంటుంది...సత్వం జ్ఞానాన్ని, ఆనందాన్ని ప్రశాంతతనూ ఇస్తుంది. రజస్సు కోరికలూ, కోపతాపాలూ పెంచుతుంది. తమస్సు అజ్ఞానాన్ని నిద్రాబద్ధకాలనూ పెంచుతుంది.


   ఈ మూడు గుణములు పర్యాయేనా ఒకటి పైకి వస్తే రెండు క్రిదికి వెళుతుంటాయి. సహజంగా సాగుతుంటాయి. ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవి. ఈ జీవుడు జ్ఞానఘనుడు. జ్ఞానరసుడు అని మనకి ఉపనిషత్తు చెబుతోంది. జ్ఞానమే తన ఆకారమైనపుడు ఈ ప్రకృతిలో శరీరాల్ని ధరించి తిరిగేటపుడు, తరిగిపోయే జ్ఞానాన్ని తిరిగి తాను నింపుకోవాలి ...పెంచుకోవాలి అని అనిపించాలి కదా! దానికి పరమాత్ముడు కొన్ని సాధనాలు చెప్పాడు. " లభించిన దానితో సదా ఆనందంగా ఉండు."... "ఎవడైనా నిన్ను నిందించినా, ఎవడైనా స్తోత్రం చేసినా పట్టించుకొనే ప్రయత్నం చేయకు."...మిశ్రతమై ఉండే త్రిగుణముల ప్రభావానికి దూరం కమ్ము!కేవలం సత్వంలో మాత్రమే ఉండే ప్రయత్నం చేయి. 'నిత్య సత్త్వస్థ:' అన్నాడు.


అయితే సత్త్వగుణంలో ఉండాలంటే ఈ రజస్తమస్సుతో ప్రచురమైన ఈ విషయసుఖాల్లోనుండి నిన్ను మొట్టమొదట వెనక్కు తీసుకో. వెనక్కు తీసుకోవడానికి బలం కలగాలి కనుక, ఈ శరీరానికి అందించే ఆహారాదులు కూడా శరీరానికి సత్త్వం అధికం చేసేవి చూచి అందించాలి. వండుకున్న పదార్ధంలో కూడా కనిపించని  దోషాలు ఉండవచ్చు. కనుక దానిని భగవంతునికి నివేదన చేసిన తరువాత మాత్రమే తీసుకోవాలి. అది సత్త్వాన్ని పెంచే అవకాశముంటుంది...దీపం వెలిగిస్తే చీకటి దానంతట అదే పోయినట్లుగా ఉత్తమ జ్ఞానం కలిగిన ఒకని సహాయం తీసుకోగలిగితే మన జ్ఞానం అధికమై మనపై ఆక్రమించడానికి ప్రయత్నం చేసిన తమోగుణాదులను వాటంతట అవే తొలగిపోయేట్టు చేస్తుంది. 

' బ్రహ్మ భూయాయ కల్పతే'గొప్ప బ్రహ్మానందాన్ని అనుభవించే స్థితికి చేరగలుగుట ...ఈ యోగ్యత ఎప్పుడు? ఏ రకమైన సందేహాలకీ తావీయని ,నిశ్చయాత్మక, అచంచలమైన విశ్వాసంతో ఎవడు నన్ను సేవిస్తాడో ....పరమాత్మ శ్రీ చరణ సన్నిధానానికి చేరడానికి మనిషికి ఈ విశ్వాసం చాలా అవసరం. పరమాత్మ సత్యసంకల్పుడు. దోషాలు మనలో ఉంటాయని తెలుసు. కానీ విశ్వాసం మనలో ఏర్పడితే ఆ దోషాలను మనలోంచి తొలగేటట్టు ఆయనే చేస్తాడు. ఆశ్రిత వాత్సల్యజలధి అని కదా స్వామిని అంటారు! నాయందు మనసు నిలుపుము. నా భక్తుడవు కమ్ము. నన్ను పూజింపుము.  నన్నేశరణు వేడుము. ఈ విధముగా చేసిన నీవు నన్నే చేరుదువు  ఇది సత్యము.  ...........geetaasaaramu...


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

Friday, October 14, 2016 0 comments By: visalakshi

సాయి లీలలు..

ఓం శ్రీ సాయినాధాయ నమో నమ:

శ్రీ సాయి మా గృహమునందు వెలసి మమ్ములను ధన్యులను చేసిన మరో లీల....


స్వయంభూ గా ఇంట్లో పూజలందుకుంటున్న శ్రీ సాయి...గుడి కట్టడానికి మంచి సంకల్పంతో...అందరూ సమిష్టిగా ప్రారంభించాలి అనుకున్న తరుణంలో అనుకోని అవాంతరం...అపుడు వేదనతో నా కుటుంబం బాబాను ప్రార్ధించగా...బాబా ఇచ్చిన సందేశం...

మహర్దశ రావాలన్నా,సాయి అనుగ్రహం పొందాలి...దేనికైనా ఫూర్తి నమ్మకం ముఖ్యం. ప్రయత్నాలన్నీ పరీక్షలే...విజయం తప్పక వస్తుంది..
18 నవంబరు మంచి ముహుర్తం.ఉదయం వర్జ్యం లేని సమయంలో శంఖుస్థాపన...మీతో పాటే నేనూ ఉన్నాను .

అజ్ఞానంతో ఆంతర్యం తెలుసుకోలేకపోతున్నారు. తర్కం చేస్తున్నారు సందేహాలతో తల్లక్రిందులవ్వద్దు. ప్రశాంత చిత్తంతో కార్యం ప్రారంభించండి...కార్యసిద్ధికై పాటుపడండి..మన సంకల్పం గొప్పది. దారి మళ్ళించే అడ్డంకులు చాలా ఉంటాయి."లీలలు కేవలం మీ నమ్మకాన్ని బలపరచడానికి మాత్రమే"! గుడి కట్టడం అనేది దృఢమైన సంకల్పంతో, నమ్మకంతో పూర్తి చేయడానికి  భక్తిని, భక్తితత్వాన్ని  ప్రచారం  చేయండి. 

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు