Tuesday, October 27, 2020 0 comments By: Vedasree

శివకేశవులు...

 


శివకేశవులకు భేదం లేదు. శివుణ్ణి పూజిస్తే విష్ణువును పూజించినట్టే.శివుణ్ణి ద్వేషిస్తే శ్రీహరినీ ద్వేషించినట్టే.ఈ పరమార్థాన్ని చెప్పేవే పంచారామాలు. శివరాత్రి నేపథ్యంలో మనరాష్ట్రంలోని ఈ అయిదు పవిత్ర క్షేత్రాల గురించీ.. మనుషులు సులభంగా మోక్షాన్ని పొందే మార్గం చెప్పమని ఓ సారి పార్వతీదేవి పరమ శివుణ్ణి అడిగిందట. అప్పుడు ముక్కంటి...


‘‘ శ్రీరామరామరామేతి రమేరామే మనోరమే 

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ’


అని చెబుతూ.. ‘రామ నామాన్ని మించినది మరొకటి లేదు. ఈ ఒక్క శ్లోకాన్నీ చదివితే సహస్ర నామాలు చదివిన ఫలితం వస్తుంది’ అని సెలవిచ్చాడట.శివ, కేశవులు వేరు కాదనే సత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడానికే పరమేష్ఠి అలా చెప్పాడట.ఇదొక్కటే కాదు..మన పురాణేతి హాసాలు ఎన్నో సందర్భాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. 

శివకేశవులకుభేదం లేదనీ స్కందపురాణంలోనూ ఉంది.


‘ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే 

శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః’


అంటే ... శివుని రూపమే విష్ణువు , విష్ణువు రూపమే శివుడు అన్నమాట. అలాంటి శివకేశవుల ఏకత్వానికి ప్రతీకలు పంచారామాలు.


నేను సంహరించలేను: తారకసురుడు పరమశివభక్తుడు తపస్సు చేసి శివుడి ప్రాణలింగాన్ని సంపాదించాడు. ఆ వర గర్వంతో దేవలోకం పైకి దండయాత్ర చేసి, ఇంద్రుణ్ణి ఓడిస్తాడు. దాంతో దేవతలంతా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి తారకాసురుణ్ణి సంహరించమని కోరారు. అప్పుడు శ్రీహరి...‘తారకుడు శివభక్తుడు. శివుడి ప్రాణలింగాన్ని సంపాదించినవాడు. అందువల్ల నేను వధించలేను. మీరు శివుణ్ణే ఆశ్రయించండి’అని చెప్పాడు. అప్పుడు దేవతలు శివుడి వద్దకు వెళ్లి శరణువేడారు. ‘ నా ప్రియ భక్తుడైన తారకుణ్ణి నేనుచంపలేను. అలాగని మిమ్మల్ని కాదనలేను. అందుకే... కుమార స్వామి తారకుణ్ణి వధిస్తాడు’ అని చెప్పాడు శివుడు.


షణ్ముఖుడు దేవసేనకు సారథ్యం వహించాడు. తారకుడితో యుద్ధం చేశాడు. కానీ సంహరించలేకపోయాడు. కుమారస్వామి తన బలహీనతను తండ్రికి విన్నవించాడు. ‘తారకుడి కంఠంలో నా ప్రాణ లింగం ఉన్నంతవరకూ అతడు చావడు’అని రహస్యాన్ని చెప్పాడు శివుడు. అప్పుడు కుమారస్వామి తారకుడితో మళ్లీ తలపడి, అతడి గొంతులోని శివలింగాన్ని బాణంతో బద్దలుకొట్టాడు. శివలింగం అయిదు ముక్కలైంది. ఆ శకలాలు గోదావరి, కృష్ణా తీరాల్లో పడ్డాయి.ఆ ప్రాంతాలే పంచారామాలయ్యాయి. అవే అమరారామం, సోమారామం, క్షీరారామం, ద్రాక్షారామం, కుమారారామం.


ఈ కథలో శివకేశవుల ఏకత్వం కనిపిస్తుంది. అందుకే శివుడి ప్రాణలింగాన్ని కలిగిన తారకాసురుణ్ణి చంపడానికి శ్రీహరి అంగీకరించడు.శైవక్షేత్రాలైన ఈ పంచారామాల్లో దాదాపు అన్నింటికీ క్షేత్రపాలకుడు విష్ణుమూర్తే కావడం మరో విశేషం.


ద్రాక్షారామం శివాలయం, విష్ణ్వాలయం రెండింటితో పాటు శక్తిపీఠం కూడా ఉన్న ద్రాక్షారామం దివ్య క్షేత్రం. ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబ.పురాణ కథ ఆధారంగా ఇది దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన చోటు. తారకుడి సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడిన తరవాత ఈ విషయాన్ని తెలుసుకున్న సప్తర్షులు.. సప్త గోదావరి తీర్థంలో భీమేశ్వరుడికి సుప్రభాత అభిషేకం చేయాలనుకున్నారు. మార్గమధ్యంలో తుల్యరుషి యజ్ఞం చేస్తున్నాడు. రుషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయనుకున్నాడు. రుషులనూ, గోదావరులనూ వారించాడు. ఉభయపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇంతలో తెల్లవారిపోయింది. శివలింగానికి సూర్య భగవానుడు ప్రథమ సుప్రభాత అభిషేకం చేశాడు. తరవాత వ్యాసమహర్షి వచ్చారు. రుషులను ఓదార్చి.. తాను అంతర్వాహినిగా సప్తగోదావరులను ఒక పుష్కరిణిలో చేర్చాననీ అది ‘సప్తగోదావరి’గా పిలవబడుతుందనీ, ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందనీ చెప్పారు.


ద్రాక్షారామ భీమేశ్వరలింగం 2.5 మీటర్ల ఎత్తులో నలుపు, తెలుపు రంగుల్లో ఉంటుంది. అందుకే ఆలయం రెండు అంతస్తుల్లో ఉంది. అభిషేకాదులు పై అంతస్తులోని లింగభాగానికి చేస్తారు. ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో క్రీ.శ 892-922 మధ్య నిర్మితమైంది. ఆలయ స్తంభాలు,గోడలపై 800 కు పైగా శాసనాలున్నాయి.ఆలయ బాహ్య ప్రాకారం నాలుగు ప్రవేశద్వారాలు గల ఎతైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్య ప్రాకారంలో కాలభైరవాలయం త్రికూటాలయం ఉన్నాయి. ఆలయ తూర్పుగోపుర మార్గంలో ధ్వజస్తంభం ముందు రావి, వేప వృక్షాలున్నాయి. ఆ చెట్లనీడలో ఒక శివలింగం, ఒక విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటినీ శంకరానారాయణ స్వాములు అని పిలుస్తారు. భీమేశ్వరాలయానికి క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు. ద్రాక్షారామ ఆలయంలో ఒక మసీదు కూడా ఉంది. ఇది సయ్యద్‌ షాఖాజీ అనే ముస్లిం గురువుది. భీమేశ్వరాలయం కాకినాడకు 28 కి.మీ దూరంలో ఉంది.


కుమారారామం కుమారారామం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఉంది. ఇక్కడ బాలా త్రిపుర సుందరీదేవి సహిత సోమేశ్వరుడు ఉన్నాడు. ఈ స్వామిని కుమారస్వామి ప్రతిష్ఠించాడు. శ్రీదేవీ భూదేవీ సమేత జనార్దునుడు ఇక్కడ క్షేత్రపాలకుడు. క్రీ.శ 892 నుంచి 922 వరకూ పాలించిన తూర్పుచాళుక్యులు సామర్లకోటలో కుమారారామ భీమేశ్వరాలయాన్ని నిర్మించారు. ఇందులో సుద్దరాయితో తయారైన లింగం కింది అంతస్తు నుంచి రెండో అంతస్తు వరకూ ఉంటుంది. ఆలయంలో కాలభైరవుడు, చంద్రమౌళీశ్వరుడు, ఉమాసమేత మృత్యుంజయ లింగం,నవగ్రహాల గుడి ఉన్నాయి. సామర్లకోట రాజమండ్రి నుంచి సుమారు 60 కి.మీ దూరంలో ఉంది.


క్షీరారామం ఇది పాలకొల్లులో ఉంది. ఇక్కడి శివుడు... క్షీరారామలింగేశ్వరుడు. ఒక కథనం ప్రకారం పంచారామాల్లోని మిగతా నాలుగు క్షేత్రాల్లో శివలింగ శకలాల ప్రతిష్ఠ ఒకే ముహూర్తాన వివిధ దేవతలతో జరిగింది.క్షీరారామంలో లింగాన్ని మాత్రం త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడట. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్దనుడు. ఆలయ విశేషాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రాజగోపురం. 9 అంతస్తులతో 120 అడుగుల ఎత్తులో ఉంటుంది. చివరి అంతస్తు దాకా వెళ్లడానికి లోపలి నుంచి మెట్లు ఉన్నాయి. తెల్లగా ఉండే ఇక్కడి శివలింగం రెండున్నర అడుగుల ఎత్తుంటుంది. ఏటా ఉత్తరాయణ, దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో సూర్యుని కిరణాలుపెద్ద గోపురం రెండో అంతస్తు నుండి శివలింగం పై పడతాయి. ఈ క్షేత్రం ఏలూరు నుంచి సుమారు 110 కి.మీ దూరంలో ఉంది.

సోమారామం ఇది భీమవరానికి రెండు కి.మీ దూరంలోని గునిపూడిలో ఉంది. ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. తూర్పు చాళుక్యరాజైన చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు. ఇక్కడి శివలింగానికి ఓ ప్రత్యేకత ఉంది. మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్యరోజు వచ్చేసరికి గోధుమరంగులోకి మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యథారూపంలోకి వచ్చేస్తుంది. ఇక్కడి స్వామిని చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి దీనికి సోమారామం అని పేరు వచ్చింది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోనూ,అన్నపూర్ణాదేవి పై అంతస్తులోనూ ఉంటారు. ఇలా శివుడి పైన అమ్మవారు ఉండటం దేశంలో మరెక్కడా లేదని చెబుతారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి.


అమరారామం శివుడి ఆదేశం ప్రకారం ఇంద్రుడు శివలింగ శకలం పడిన చోటుకు చేరుకున్నాడు. పెరిగిపోతున్న ఆ శివలింగాన్ని కృష్ణాతీరాన అమరావతిలో ప్రతిష్ఠించాడు. ఇక్కడి స్ఫటికలింగం ఎత్తు 16 అడుగులు.శివలింగం చుట్టూ రెండు అంతస్తుంలుంటాయి. అభిషేకాదులు రెండో అంతస్తులోనే చేస్తారు.అమరావతి ఆలయం మూడు ప్రాకారాలతో నిర్మితమైంది. మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, పార్థివేశ్వరుడు, సోమేశ్వరుడు, కోసలేశ్వరుడు, వీరభద్రుడు, త్రిపురసుందరీ దేవి ఆలయాలు , కల్యాణ మండపం, కృష్ణానదికి తోవ ఉన్నాయి. రెండో ప్రాకారంలో విఘ్నేశ్వరుడు,కాలభైరవుడు, కుమారస్వామి ఆలయాలు,నవగ్రహ మండపం,యజ్ఞశాల ఉన్నాయి. మూడో ప్రాకారంలో శ్రీశైల మల్లేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, సూర్యడి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి.ఈ ఆలయం గుంటూరుకు సుమారు 35 కి.మీ దూరంలో ఉంది.

              **ఓం నమో శివకేశవాయ నమః**

Monday, October 19, 2020 0 comments By: Vedasree

మాతా అన్నపూర్ణేశ్వరి... #మాతా అన్నపూర్ణేశ్వరీ.............!!


'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అని అన్నారు. భగవంతుని సన్నిధిని కోరుకునే మానవుడు, ముందుగా అన్నాన్ని ప్రణమిల్లమనండని మనుధర్మశాస్త్రం పేర్కొంటోంది. జ్ఞానాన్వేషకులైన మునులు అన్నాన్ని అలక్ష్యం చేయరు. కడుపులో ఆకలి అనే అగ్నిని పుట్టించేది అన్నపూర్ణమ్మకాగా, ఆ మంటని చల్లార్చేది కూడ ఆ చల్లని తల్లే. ఆ తల్లి కాశీనగరంలో కాశీ అన్నపూర్ణేశ్వరిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తోంది.


ఆ అన్నపూర్ణమ్మ తల్లి కాశీలో కొలువై ఉండటం వెనుక ఒక కథ ఉంది.


 బ్రహ్మదేవుని గర్వమణిచేందుకై పరమశివుడు, బ్రహ్మ తలల్లో ఒక తలను ఖండించగా, బ్రహ్మహత్యాదోషం చుట్టుకుంది. ఆ హత్యాదోషం పరమశివుని కడుపులో ఆకలిమంటగా రూపుదాల్చింది. ఆకలి బాధను తీర్చుకునేందుకై పరమశివుడు కపాల భిక్షాపాత్రను పట్టుకుని యాచిస్తూండేవాడు. ఆ భిక్షపాత్రలో ఆదిశక్తి అన్నం పెట్టగా, ఆ భిక్షాపాత్ర నిండాలన్నది విధి. అందుకై ఆదిశక్తి అన్నపూర్ణ అవతారాన్ని ధరించింది. ఆదిభిక్షువు పాత్రను అన్నంతో నింపింది. ఫలితంగా స్వామిని పట్టుకున్న బ్రహ్మహత్యాదోషం వెనక్కి తగ్గింది.


మరి, ఆ తల్లి వారణాశికి వచ్చిన కథ సంగతి ఏమిటి? ఈశ్వరునికి ప్రియాతిప్రియమైన కాశీ నగరంలో దేవదత్తుడు, ధనుంజయుడు అనే ఇద్దరు సోదరులున్నారు. దేవదత్తుడు అష్టైశ్వార్యాలతో తులతూగుతూండగా, ధనుంజయుడు మాత్రం నిత్య దారిద్ర్యంతో సతమతమవుతుండేవాడు. ఒక రోజు ధనుంజయుడు మణికర్ణికా స్నానఘట్టంలో ముఖ ప్రక్షాళన చేసుకుని, కాశీవిశ్వేశ్వరుని దర్శించుకుని, తినేందుకు ఏమీ దొరక్కపోవడంతో, ఆకలితో నకనకలాడుతూ కాశీ ముక్తి మంటపంలో కూర్చున్నాడు. 'నేను ఇలా ఆకలిదప్పులతో అలమటించడానికి కారణమేమిటి? నేను గతజన్మలో ఎవరికి అన్యాయం చేసాను? అని ఆలోచిస్తూ నీరసంతో నిద్రలోకి జారిపోయాడు. నిద్రలో అతనికొక కల. ఆ కలలో సన్యాసి గోచరించి ఇలా చెప్పాడు. 'దరిద్ర ధనుంజయా! పూర్వకాలంలో కంచిలో శత్రు మర్దనుడనే రాజకుమారుడుండేవాడు. అతనికి హేరంబుడు అనే ప్రియ మిత్రుడూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ వేటకెళ్ళి దారి తప్పిపోయారు. ఆకలితో అల్లాడిపోయారు. అలా తిరిగి తిరిగీ సూర్యాస్తమయ సమయానికి ఓ మునీశ్వరుని దర్శించుకున్నారు. ఆ మునీశ్వరుడు మిత్రులిద్దరినీ తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి మంచి నీళ్లిచ్చి, ఆకలి మంటలు చల్లారేందుకు పాలలో ఉడికించిన బియ్యపుపిండి ఫలహారాన్ని ఇచ్చాడు. ఆకలితో నకనకలాడుతూన్న శత్రుమర్దన రాజ కుమారునికి ఆ పదార్థం అమృతంలా తోచింది. ఒక్క చుక్క మిగల్చకుండా అంతా తాగేశాడు. అతని మిత్రుడు హేరంబునికి ఆ పదార్థం నచ్చక పోవడంతో కొంచెం తాగి, మిగతా వదిలేశాడు. అలా అన్నాన్ని అవమానపరిచి నందుకు హేరంబునిగా ఉన్న నీవు, ఈ జన్మలో దరిద్ర ధనుంజయునిగా జన్మించావు.


రాజకుమారుడైన శత్రుమర్దనుడు నీ అన్న దేవదత్తునిగా జన్మించి సకల భోగాలను అనుభవిస్తున్నాడు. అన్నాన్ని అవమాన పరిచినందుకుగాను నిన్ను అన్నదోషం వెంటాడుతోంది. ఈ స్థితి నుంచి నువ్వు బయటపడాలంటే అన్నపూర్ణేశ్వరీదేవిని శరణు వేడుకో. నియమ నిబంధనలతో అన్నపూర్ణ వ్రతాన్ని అనుసరించి, నీ దరిద్రాన్ని దూరం చేసుకో" అని చెప్పి సన్యాసి అంతర్థానమయ్యాడు. కల నుంచి మేల్కొన్న ధనుంజయండికి అన్నపూర్ణ వ్రతాన్ని ఎలా చేయాలో తెలియదు. అప్పట్నుంచి కనబడినవారినంతా అన్నపూర్ణ వ్రతాన్ని ఎలా చేయాలని అడుగసాగాడు. అలా అర్థిస్తూ, అర్థిస్తూ కామరూపదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఓ కోండప్రక్కన కోంతమంది దేవకన్యలు ఏదో పూజను చేస్తూండడం అతని కంట్లో పడింది. వారి దగ్గరకెళ్లి ఎవరిని పూజిస్తున్నారని అడిగిన ధనుంజయునికి, అన్నపూర్ణేశ్వరీదేవిని పూజిస్తున్నామన్న జవాబు లభించింది. అతని సంతోషానికి ఎల్లలు లేవు. ధనుంజయుని అభ్యర్థనతో దేవతలు అతనికి అన్నపూర్ణ వ్రతం చేసే విధానాన్ని చెప్పారు. ఇంటికి తిరిగివచ్చిన ధనుంజయుడు ఎటువంటి ఆటంకం లేకుండా అన్నపూర్ణేశ్వరీ వ్రతాన్ని చేసి, ఆ తల్లిని పూజించి, ఆ తల్లి అనుగ్రహానికి పాత్రమయ్యాడు. దరిద్రబాధలను అనుభవించిన ధనుంజయుడు ఒక్కసారిగా ఐశ్వర్యవంతుడయ్యాడు.


ధనవంతుడవగానే ధనుంజయుని కామపిశాచి పట్టుకుంది. కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేస్తూ మరొక స్త్రీతో కాపురాన్ని మొదలుపెట్టాడు. ఒక రోజు పెద్ద భార్యతో కూర్చుని అన్నపూర్ణ వ్రతాన్ని ముగించిన ధనుంజయుడు చేతికి వ్రత దారంతో చిన్న భార్య ఇంటికి వెళ్ళాడు. నన్ను వెళ్లగొట్టేందుకు నీ పెళ్ళాం ఈ దారాన్ని కట్టిందా? అంటూ ఆ దారాన్ని తెంపి దూరంగా విసిరేసింది అతని రెండవ భార్య. అంతటితో ఊరుకోకుండా ఆ దారాన్ని అగ్నికి ఆహుతి చేసింది. ఉదయాన్నే నిద్రలేచిన ధనుంజయుడు నోముతాడు తన చేతికి లేకపోవడాన్ని చూసి, భయపడి మరొక తాడును కట్టుకున్నాడు.


కానీ, జరగాల్సినదంతా జరిగిపోయింది. అన్నపూర్ణకు అపచారం జరిగిపోయింది. కుబేరునిగా ఉన్న ధనుంజయుడు మరలా కుచేలునిగా మారిపోయాడు. అనంతరం ఎన్ని వ్రతాలు చేసినప్పటికీ, అతనికి అన్నపూర్ణ కటాక్షం లభించలేదు. ఇక నాకేది గతి అంటూ మరలా కామరూప దేశానికి పరుగెత్తాడు. తనకు అన్నపూర్ణవ్రతం బోధించిన చోట దృశ్యన్ని చూసి, అతనికి ఆశ్చర్యమనిపించింది. అప్పుడు పూజ చేసిన చోట ఒక బావి కనిపించింది. జీవితంపై విరక్తి చెందిన ధనుంజయండు కళ్ళు మూసుకుని ఆ బావిలో దూకాడు. అయితే చీకటిలో బావిలో దూకిన ధనుంజయుడు చనిపోలేదు.


ఒక్కసారిగా బావిలోపల కళ్ళు మిరమిట్లు గొలిపే వెలుగు కనిపించింది. అక్కడ ఓ అద్భుత దృశ్యం అతని కంటబడింది. అక్కడొక కొలను. ఆ కొలను పక్కన పూజలో నిమగ్నమైన దేవతలు. ఎటుచూసినా వేదఘోషలు. చెవులకింపైన సంగీతం. అక్కడ స్ఫటిక శరీరాకృతితో ఓ పురుషుడు ఆనందతాండవం చేస్తున్నాడు. ఆతని కొప్పులో నెలవంక. నుదుట మూడు కన్నులు. ఆ శరీరమంతా ఆభరణాలతో ధగధగ మెరిసిపోతోంది. ఆయనకు ఎదురుగా ఓ రత్న సంహాసనంపై ఓ మాత కుర్చుని అతని నృత్యాన్ని ఆసక్తితో చూస్తోంది. ఇంతలో కొంతమంది దేవతలు ధనుంజయుని చూసి అతడిని గెంటి వేయడానికి ఉద్యుక్తులయ్యారు. అప్పుడా మాత వారిని వారించింది. ఆమె ధనుంజయుని దగ్గరకు పిలిచి, "నువ్వు ఇన్నాళ్ళూ ఏ అన్నపూర్ణేశ్వరీ దేవిని చూడాలనుకుంటున్నావో, ఆ అన్నపూర్ణేశ్వరీ దేవిని నేను. రుద్రుని రుద్రతాండవాన్ని చూసేందుకై ఇక్కడికొచ్చాను. నువ్వు చేసిన వ్రతాలు, ఆ పుణ్యం వలన నన్ను చూసే భాగ్యానికి నోచుకున్నావు. ఇది బ్రహ్మాదులకు కూడ దక్కని అవకాశం" అని చెప్పింది.


అప్పుడు ధనుంజయుడు భక్తి పారవశ్యంతో, "మాతా! మీ ఇద్దరి దర్శనభాగ్యంతో నా జన్మ తరించింది" అని పలికాడు. అన్నపూర్ణేశ్వరీ దేవి చిరునవ్వులు చిందిస్తూ, "ధనుంజయా! ఇకపై ఎవరు అన్నపూర్ణ వ్రతాన్ని చేస్తారో, వారికి కరువు వంటి బాధలుండవు. ఏ ఇంట్లో నన్ను పూజిస్తారో, ఆ ఇంట్లో నేను వచ్చి కొలువుంటాను. ఆ ఇల్లు ఐశ్వర్యాలతో కళకళలాడుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళి, మరలా వ్రతాన్ని ప్రారంభించు. నీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నేను భూలోకవాసుల కోసం కాశీ నగరానికే వస్తున్నాను. నా కోసం నువ్వొక ఆలయాన్ని నిర్మించు" అని ఆనతిచ్చింది. ధనుంజయుడు అమ్మవారి ఆనతిని అనుసరించి కాశీలో ఓ ఆలయాన్ని నిర్మించాడు. అదే కాశీ అన్నపూర్ణేశ్వరాలయం.


నిత్యాన్నదానేశ్వరిగా, నిటాలాక్ష ప్రాణేశ్వరిగా, అన్నపూర్ణాదేవి తన బిడ్డలైన మనకే కాక సకలజీవరాసులన్నిటికీ, ఆహారాన్ని ప్రసాదిస్తుంది. తద్వారా ఈ జీవకోటి నశించిపోకుండా కాపాడుతుంది. ఇలా జీవకోటికి ఆహారాన్నందించే అన్నపూర్ణాదేవి నిజ నివాసం ఆది స్మశానమైన వారణాసి క్షేత్రం. ఆ క్షేత్రాధిష్ఠాన దేవుడైన ఆ ఆదినాధుడు విశ్వేశ్వరుడి ప్రియపత్ని శ్రీ అన్నపూర్ణాదేవి. ఆమెనే కాశీఅన్నపూర్ణా అని పిలుస్తారు. దసరా పండుగ సందర్భాలలో దుర్గాలయంలో దుర్గమ్మ తల్లికి అన్నపూర్ణమ్మ అలంకారాన్ని కూడ చేస్తుంటారు. అయితే దుర్గాలయంలో ఈ అన్నపూర్ణాదేవి అలంకారాన్ని వేయడంలో పరమార్థం ఏమిటి అని అడిగితే, ఈ అన్నపూర్ణదేవి కూడా అమ్మవారి దివ్యస్వరూపాల్లో ఒక రూపమే. సాక్షాత్తు తన భర్త అయిన పరమేశ్వరుడే ఆదిభిక్షువుగా యాచనకి వస్తే ఆ తల్లి అన్నపూర్ణా ఆయనకి భిక్షని ప్రసాదిస్తుంది. ఇదీ అలంకారంలోని దృశ్యం.


 దీన్ని చూసి మనం గ్రహించాల్సింది ఏమంటే, తల్లికి బిడ్డలంటే ఎంతో ప్రేమ. ఏ తల్లైనా తన బిడ్డలందరికీ కడుపునిండా తీండిపెట్టుకోవాలనుకుంటుంది. అందుకోసం ఎంతకష్టాన్నైనా పడుతుంది. అలాగే దుర్గమ్మ కూడా అన్నార్తుల పాలిటి అన్నపూర్ణగా మారి, వారి ఆకలిని తీరుస్తోంది. అది ఆమెకి అత్యంత ప్రీతిపాత్రమైన కార్యం. ఆకలేసి యాచించిన తన భర్తకే ఆమె అన్నాన్ని సమర్పిస్తోంది. అంటే ఈ లోకంలో అ అన్నార్తులైన వారినందరినీ సాక్షాత్తు శివ స్వరూపులుగా మనం భావించాలి. అలా ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు మనమంతా సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవిస్వరూపమే అవుతాం. ఆ న్నార్తుల ఆకలిని తీర్చే అన్నపూర్ణలమవుతాం. లోకంలో ఆకలిని తీర్చడం కన్నామిన్న అయిన దానం ఏముంది? అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు. కాబట్టి మనం కూడా ఈ అలంకారంలోని పరమార్థాన్ని గ్రహించి అన్నదాతలుగా, అన్నపూర్ణలుగా మారాలి. వీలైనంత వరకూ అన్నార్తులు అలమటించి పోకుండా కాపాడాలి. 


ఒక్కసారి ఆ నిత్యాన్నదానేశ్వరి అన్నపూర్ణాదేవిని మనకి ఆ శక్తినివ్వమని ఆ బుద్ధినివ్వమని భక్తితో ప్రార్థించుకోవలెను. ఆ తల్లి భక్తాభీష్టప్రదాయిని. మనం కోరుకున్న కోరికలను తీర్చే కల్పవల్లి.

                            ఓం శ్రీ మాత్రే నమః...

సేకరణ. ఫేస్బుక్ నుండి.....

Sunday, October 18, 2020 0 comments By: Vedasree

వాగ్భూషణం...


 #పురుషార్థ సాధన.....


ప్రతి మానవునకు సాధించవలసిన నాలుగు లక్ష్యములు వున్నవి. అవి...


ధర్మ,

అర్ధ,

కామ,

మోక్షము..


..లనే చతుర్విధ పురుషార్ధములు. వీటిలో మొదటి మూడు లక్ష్యముల కొరకు ప్రతివారు నిత్యమూ ఏదో ఒక సాధన చేస్తూనే ఉంటారు. వాటి ఫలితములనూ పొందుతుంటారు. అవి వారి దైనందిన జీవితానికి సంబందించిన విషయములు కాబట్టి వాటి యెడల ఆసక్తి, ప్రయత్నము జరుగుతున్నది. ఈ ప్రయత్నములకు సంప్రాప్తించే ఫలితమంతా దాదాపు ఇహలోకమునకు సంబంధించినదే. అనిత్యము, అశాశ్వితమైనది.


నాల్గవదైన మోక్షము శాశ్వతమైనది. కాబట్టి అందరూ దానిని కోరుకుంటారు. అది చాలా కష్టసాధ్యమైన విషయం కాబట్టి ఎవ్వరూ తీవ్రమైన ప్రయత్నం చేయటానికి ఉత్సాహం కనపరచటం లేదు. ఎందుచేతనంటే అది జ్ఞానము వలననే సాధ్యమవుతుంది. అటువంటి జ్ఞాన సముపార్జనకు యోగ్యత అవసరం.


యోగ్యత పొందాలి అంటే లక్ష్యం యెడల పూర్తి అవగాహన, శ్రద్ద ఉండాలి. అటువంటి శ్రద్దాసక్తులు కలగాలి అంటే సాధన శమాది షట్కసంపత్తి ఉండాలి. వివేకం వల్ల, వైరాగ్యం వల్ల షట్కసంపత్తి లభిస్తుంది. అంటే బాహ్యేద్రియ నిగ్రహం అంతరింద్రియ నిగ్రహం వలన కలుగుతుంది. మనస్సు విషయ వాసనల మీదకు పోకుండా, శాస్త్రములు బోధించిన విషయములపై విశ్వాసం, శ్రద్ద కలుగుతాయి.


వాగ్భూషణం.....


వాక్కు భగవంతుడు మానవునుకి ఇచ్చిన అద్భుత మైన వరం. ఆ శక్తిని అంటే వాక్కును సద్వినియోగ పరచుకోవడం లేదా దుర్వినియోగ పరచుకోవడం అనేది మానవునిలోనే ఉంది. మనిషి మాట్లాడే తీరును బట్టి అతని వ్యక్తిత్వం అవగతమవుతుంది. మాట్లాడే మాటను బట్టి అతని సంస్కారం అర్థమవుతుంది. మాటల్లో ఎంత మహత్తు ఉందంటే మనిషి మాట్లాడే విధానం, పద్ధతి వలన, ఉపయోగించే పదాల వలన మిత్రులు ఏర్పడతారు. బంధువర్గం ఏర్పడుతుంది. శత్రువులు కూడా మిత్రులవుతారు. వైరివర్గం బంధుగణం అవుతుంది. అలాగే మిత్రులు శత్రువులవుతారు. బంధువులు విరోధులవుతారు.


అంచేత వాక్కు మనిషికి భూషణం కావాలంటే భాషణం లోనే ఉంది అంతా. అయితే ఈ భాషణం ఎలా ఉండాలీ అంటే మితం గానూ, ప్రియం గానూ, మృదువు గానూ, సత్యమైనది గానూ ఉండాలి.


మిత భాషణం...


మితంగా, అవసరమైనంత వరకే మాట్లాడడం. దీని వలన ఆత్మస్తుతికీ, పర నిందకూ అవకాశం ఉండదు. వాదోపవాదాలకూ, ఘర్షణలకూ తావుండదు. అనవసరమైన సంభాషణలు లేనప్పుడు కాలమూ వ్యర్థమవదు.


ప్రియ భాషణం...


ఎదుటి వారికి ప్రియం కలిగించేలా మాట్లాడడం. దీని వలన మైత్రి, సఖ్యత, ప్రేమ, అభిమానం, గౌరవం ఏర్పడతాయి.


మృదు భాషణం...


మృదువుగా మాట్లాడడం ఒక విధంగా కటువుగా మాట్లాడకపోవడం. కొంత మంది మాట్లాడితే వినాలనిపిస్తుంది. ఇంకా మాట్లాడితే బాగుండును అనిపిస్తుంది. కొంత మంది మాట్లాడితే వినబుద్ధి వేయదు. మాట్లాడడం ఆపేస్తే బాగుండును అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆపకపోతే తిట్టాలనో, కొట్టాలనో అనిపిస్తుంది. అదే కటు భాషణం.


సత్యభాషణం...


ఎప్పుడూ నిజాన్నే మాట్లాడడం. ఇది ఒక వ్రతం లాంటిది. గొప్ప ధర్మం. శ్రేయస్కరం కూడా. కాని ఒక్కొక్కప్పుడు సత్యం కూడా కఠోరంగా ఉంటుంది. అందుకే "నిజం నిప్పు లాంటిది" అంటారు. దాన్ని దాచలేము కూడా. నిజం చెపితే నిష్ఠూరం కూడా కలుగుతుంది. అవతలి వారి మనసు గాయపడవచ్చు. వారు బాధపడవచ్చు. అలాంటి సందర్భాలలో వారికది ప్రియభాషణం కాకపోవచ్చు.


అంచేత "సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం". సత్యాన్నే పలకాలి. ప్రియంగా పలకాలి. అప్రియమైన సత్యాన్ని పలకకుండా ఉండడమే మంచిది. అంటే నిజం చెపితే ఎవరికైనా ఏదైనా కీడు జరుగుతుందనుకున్నప్పుడు ఆ నిజం చెప్పవలసిన అవసరం లేనప్పుడు చెప్పకుండా ఉండడమే మంచిది. అలాగే ఒక అసత్యం చెపితే ఎవరికయినా ఏదయినా మేలు జరుగుతుందన్నప్పుడు అసత్యమాడినా పరవాలేదు. అదే ధర్మరాజు "అశ్వత్థామా హతః (కుంజరః)" అని ఆడిన అసత్యం. అలాంటి సందర్భాలలో, సమయాలలో సత్యం చెప్పకపోవడమే కాకుండా అసత్యమాడినా దోషం అంటదనేది శుక్రనీతి. కాని అది ఎల్లవేళలా పనికి రాదు.


"స్మితవక్త్రో మితభాషీ, అపూర్వభాషీచ రాఘవః" అని శ్రీరామచంద్రుని అష్టోత్తర శతనామావళిలో కీర్తించడం జరిగింది. అంటే శ్రీరామచంద్రుడు ఎల్లప్పుడూ చిరునవ్వుతో మాట్లాడేవాడునూ, మితంగా భాషించేవాడునూ, అపూర్వంగా అంటే ఇంతకు ముందు ఎన్నడూ ఎవరూ ఎరుగని విధంగా మహోన్నతంగా భాషించేవాడునూ అని కొనియాడడం జరిగింది. అందుకే అవతార పురుషుడై మానవులందరికీ మాటల్లోనూ, చేతల్లోనూ ఆదర్శప్రాయమైన మార్గాన్ని అవలంబించి చూపాడు.


అయితే ఈ వాక్కును నిగ్రహించుకోవడం ఎలా.. మనం మన మనసును నిగ్రహించుకుంటే వాక్కును నిగ్రహించుకోగలుగుతాము. మనసు నిర్మలంగా, శుద్ధిగా ఉంటే వాక్కు కూడా నిర్మలంగా ఉంటుంది. వాక్శుద్ధి కలుగుతుంది. అటువంటి వాక్శుద్ధి కలవారు అన్నది జరిగి తీరుతుంది. అదే పూర్వం ఋషీశ్వరులూ, మునీశ్వరులూ ఇచ్చిన శాపాలకూ, వరాలకూ ఉదాహరణ. వాక్శుద్ధి కలవారు చేసే కర్మలు కూడా శుద్దిగానే ఉంటాయి. ఇలా మనసూ, వాక్కూ, కర్మా ఈ మూడూ శుద్ధిగా ఉండడాన్నే త్రికరణ శుద్ది అంటారు...


|| ఓం నమః శివాయ ||

Saturday, October 17, 2020 0 comments By: Vedasree

త్రిపురాంతకం ..బాలాత్రిపురసుందరి ఆలయం..

 


#త్రిపురాంతకం


#బాలాత్రిపురసుందరి & త్రిపురాంతకేశ్వరుడు*


శక్తిపీఠాలు, నవదుర్గలు, ఊరూరా గ్రామదేవతలు ఇలా జగమే జగన్మాత. జగన్మాత శుంభనిశుంభులను రాక్షసులను సంహరించడానికి తన శరీరంనుండి  బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండ, మహాలక్ష్మి వంటి తొమ్మిది శక్తులను సృష్టించింది. వాటినే నవదుర్గలని దేవీపురాణంలో చెపుతారు. అటువంటి శక్తులలో శ్రీ బాలాత్రిపుర సుందరి కూడా ఒకటి. అటువంటి బాలా త్రిపురసుందరి స్వయంభుగా వెలసిన క్షేత్రము ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం. శక్తి పీఠమంతటి ప్రాబల్యత కలిగిన క్షేత్రం త్రిపురాంతకం.  అక్కడ  ఆ తల్లి పిలిస్తే పలుకుతుంది ఆర్తజనులకు ఆర్తిని బాపుతుందని భక్తులు విశ్వసిస్తారు. శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్న త్రిపురాంతకం క్షేత్రం శైవ, శాక్తేయ ఆలయాల్లో అతి పురాతనమైంది.


 మార్కాపురం-గుంటూరు మార్గంలో మార్కాపురం నుండి వినుకొండకు ముందుగా త్రిపురాంతకం గ్రామం ఉన్నది.త్రిపురాంతకం గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలోని కుమారగిరిపై త్రిపురాంతకేశ్వర స్వామి స్వయంభూవుగా వెలిశాడు. ఇక్కడ నుండి సుమారు  కిలోమీటరుదూరంలో బాలాత్రిఫురసుందరి ఆలయం కలదు.(మనం ప్రస్తుతం శ్రీబాలాత్రిపుర సుందరి ఆలయం గురుంచి ప్రస్తుతించుకుంటున్నాము. తరువాత త్రిపురాంతకేశ్వరుని ఆలయానికి వద్దాము). ఒక చెరువులోగల ఒక బావి వంటి చిదగ్నిగుండంలో బాలా త్రిపురసుందరీదేవి వెలిసింది. లలితా సహస్ర నామావళిలో అమ్మవారిని కదంబ వనవాసినిగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి ఆలయం వున్న చెరువుకు ఆనుకుని నాలుగైదు చెరువులు కలవు.


ప్రథమ మూలం (అమ్మవారి నిజమూర్తి) నిర్గుణాకారంలో అమ్మవారు వెనక్కు తిరిగి ఉంటుంది. భక్తుల దర్శనార్థం అమ్మవారికి ముందు మరో విగ్రహాన్ని ప్రతిష్టించారు. అక్కడ చెరువు కట్ట వెంట  కదంబ వృక్షములు కలవు. ఇంకను ఆ చెరువు కట్టలపై కదంబం మొక్కలు పుడుతూ ఉంటాయి. ఈ విధమైన కదంబం చెట్లు కాశీలో మాత్రమే ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇక్కడ ఒకనాడు కదంబ వనమే ఉండెడిది. ఈ కదంబం పూలు చిన్నవిగా కుంకుమ రంగులో పొడవైన సుమారు ఎనిమిది అంగుళముల తొడిమపై గెలల మాదిరిగా ఉండి అటువంటి తొడిమలు వృక్షమునిండా ఉంటాయి. 

*సాధారణంగా బంతిపువ్వు సైజులో కదంబం పువ్వు చూస్తూ ఉంటాము. అది కదంబకుసుమమే కావచ్చు. కాని అమ్మవారు ఉండే కదంబ వనంలోని కదంబ కుసుమం మాత్రం కచ్చితంగా కాదు (కాదన్నానని అన్యథా భావించవద్దు) నేను ఆ కదంబకుసుమములను అమ్మవారు    కొలువు తీరిన కదంబ వృక్షమునకు కలవు

శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి చిదగ్ని కుండ సంభూత కుమార గిరికి దగ్గరలో ఒకప్పటి చెరువు లో కదంబ వృక్షాల మధ్య శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం ఉంది అని చెప్పుకున్నాంకదా! ఈ ఆలయం లో ప్రతిదీ విశేషమైనదే. ఆలయ గోపురం గర్భ గుడిపై నిర్మాణ శైలి వైవిధ్యం తో ఉంటుంది. గర్భ గుడిమీద రాజ గోపురానిని పోలిన గోపురం ఉండటం ప్రత్యేకత. *త్రిపురాంతక పీఠేచ దేవి త్రిపురసుందరీ* అని శాస్త్రాలలో ఉన్నా ఇది అష్టాదశ శక్తి పీఠంలలో ఒకటిగా గుర్తింపు పొందలేదు. కారణం ఇక్కడ అమ్మవారు స్వయంభుగా ఆవిర్భవించటమే. అమ్మవారు నిర్గుణ శిలా కారం గా ఆవిర్భవించింది. ఇప్పుడున్న గర్భ గృహం త్రిపురసున్దరీదేవి ఆవిర్భవించిన చిదగ్ని కుండం. దీన్ని స్థానికులు ‘’నడబావి ‘’అంటారు. అమ్మవారు ఉత్తరాభి ముఖం గా దర్శన మిస్తుంది. చిదగ్నిగుండం లోకి దిగాలంటే తొమ్మిది మెట్లు దిగి వెళ్ళాలి. ఒక్కో మెట్టూ ఒక్కో ఆవరణ. అదే నవావరణం లో బాలాత్రిపురసుందరి ఉంటుందన్న మాట. ఈ మెట్లకు అధిదేవతా ప్రత్యధి దేవతలుంటారు. తొమ్మిది మెట్లూ దిగిన తర్వాత చిదగ్ని గుండం లో నిర్గుణ శిలకార రూపం లో అమ్మవారు కనిపిస్తుంది. దివ్య చక్షువులున్న మునీశ్వరాదులకు మాత్రం అరుణ కిరణాలతో పుస్తాక్ష మాలా వరదాభయ హస్తాలతో దర్శనమిస్తుంది. సామాన్య జనం కోసం శిల ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహానికి వెనుక ఉన్న శిలమధ్య తెల్లని రాతి మీద శ్రీ బాలా యంత్రం ప్రతిష్టితమై ఉంది. విగ్రహానికి వెనుక రాతి కిరీటం ఉండటం చేత యంత్రం కనిపించదు. అమ్మవారిపై శ్రీ గాడేపల్లి రాఘవ శాస్త్రి గారు – ‘’నూటోక్క శక్తు లెప్పుడు –నాటక మటు లాడు చుండ,నాయక మణియై కూటంబు నేర్పు త్రిపురక –వాటము జొర నంత వాని వశమగు ధాత్రిన్ ‘’అని పద్యం చెప్పారు.

సిద్ధి మండపాలు చిదగ్ని కుండం నుంచి బయటికి వచ్చేటప్పుడు మెట్లకు రెండు వైపులా రెండు మండపాలున్నాయి. వాటినే ‘’సిద్ధి మండపాలు ‘’అంటారు. ఈ మండపాలలో కూర్చుని తదేక దృష్టితో మంత్రం జపిస్తే వెంటనే సిద్ధి కలుగుతుందని తత్వజ్ఞులు చెప్పారు. శ్రీ వావిలాల మహాదేవయ్య గారు ,శ్రీ గోపయ్య గారు ఇక్కడే కూర్చుని మంత్రానుష్ఠానం చేసేవారట.

శ్రీ చక్ర పాదుకలు మెట్లు దాటి బయటికి వస్తే శ్రీ చక్ర మండపం కనిపిస్తుంది. ఇక్కడే శ్రీ చక్ర పాదుకలున్నాయి. అర్చనలన్నీ వీటీకే చేస్తారు. అందరూ వీటిని పూజించ వచ్చు. ఈ చక్ర పాదుకలకు, చిదగ్నికుండ దేవికి తంత్ర సంబంధ అను సంధానం ఉంది. ధనం కావాలంటే ఎరుపు రంగు విద్య కావాలంటే తెలుపు ,శత్రు జయం కలగాలంటే నల్లని స్వరూపంతో అమ్మవారిని ధ్యానించాలి. ఈ పాదుకల వెనుక సిద్దేశ్వర పాదుకలుంటాయి. వీటిని ‘’గురుపాదాలు ‘’అంటారు. శ్రీ విద్యా సాంప్రదాయం లో వీటి ప్రాధాన్యం ఎక్కువ. గురుపాదుకలకు ప్రక్కనే బ్రాహ్మీ లిపి లో ‘’గురుపాదకా మంత్రం ఉంది’’. చక్ర మండలం నైరుతి భాగం లో శ్రీ దక్షిణా మూర్తి లింగం ఉంది .స్వామికి ఇక్కడే అభిషేకం చేస్తారు.

ఛిన్నమస్తా దేవి చక్ర మండపం దాటి ఉత్తర ద్వారం గుండా బయటికి వస్తే ‘’ఛిన్న మస్తా దేవి’’  చిన్న మండపం లో కనిపిస్తుంది. ఈమెనే ప్రచండ చండిక అని,  వజ్ర వైరోచని అని అంటారు. ఈమెయే అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలు. ఈమె దశ మహా విద్యలలో ఆరవ మహా విద్య. ఈమెను ఉపాసిస్తే కలిగే ఫలితం ‘’యామళం’’అనే గ్రంథం, వివరించింది. ఆలయం బయట చతుషష్టియోగినీ మూర్తులు దర్శన మిస్తారు. ఇవి ఇప్పుడు నిజంగా ఛిన్న మస్తకాలై రూపు చెడి గోడలకు నిలబెట్టబడి ఉన్నాయి.

రక్త పాత్రలు సాధారణం గా శక్తి ఆలయాలలో సింహవాహనం ధ్వజస్తంభం ఉండాలి. ఈ రెండు ఇక్కడ లేవు. కనుక అమ్మవారు మానవ ప్రతిష్టితం కాదని , స్వయంభు అని భావిస్తారు. వైదికాచారులే కాక వామాచారులకు కూడా ఈ అమ్మవారు ఉపాస్య దేవత. ’’సవ్యాప సవ్య మార్గస్థా’’. ఒక్కప్పుడు ఈ ఆలయం లో ‘’పంచ మకారార్చన’’జరిగేది. అందుకే గర్భాలయం లో రాతి తో చేయబడిన ‘’రక్త పాత్ర ‘’ఉంది. దీనికి ‘’ఉగ్రపాత్ర ‘’అనే పేరుకూడా ఉంది. ఉగ్రపాత్ర అర అడుగు ఎత్తు, రెండడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. ఎన్ని దున్నల్ని బలిచ్చినా, ఒక్కో పొతూరక్తానికి కడివెడు నీళ్ళు పోసినా ఆ రక్త పాత్ర నిండదు. ఈ విషయం ఈ నాటికీ ప్రత్యక్ష నిదర్శనమే ఈశాన్యం లో మామూలు భక్తులు వేరొక రక్త పాత్ర ఉన్నది. దానికి రెండు అడుగుల దూరం లో బలిని ఇచ్చే ‘’యూప స్థంభం ‘’కూడా ఉంది. దీనిపై సంస్కృత శాసనం ఉంది. శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం దానికి రెండు వైపులా సూర్య చంద్రులు ఉన్నారు.

దీన్ని ఒక కవి పద్యం లో ‘’మదపు టేనుగు నైన, కొదమ సింగంబైన –యూప శిలకు, సమీప మందు– మెడ యెసంగి నిలుచు మేకపోతులు దున్న –లేమి చెప్ప జూతు నామే మ్రోల ‘’ వ్యాస భగవానుడు ఈ అమ్మవారిని ‘’దేవతాగ్రణీ’’ అని స్తుతించారు స్కాంద పురాణం శ్రీశైల ఖండం లో- ‘’గిరి ప్రదక్షిణం కుర్యాత్ చతుర్భైరవ సంయుతం –త్రైలోక్య జననీ సాక్షాత్ త్రిపురా దేవతాగ్రణీ దృష్ట్వా ప్రయత్నతో దేవీ మర్చయిత్వా సమంత్రకం ‘’

కదంబ వనవాసిని త్రిపురసుందరీ దేవి స్థావరం కదంబ వనం .ఈ వనాలు ఆలయం దగ్గరే ఉన్నాయి. అతి సున్నితంగా రక్త వర్ణం తో ఉండే కదంబ పుష్పాలు అమ్మవారికి మహా ప్రీతి. అందుకే ‘’కదంబ కుసుమ ప్రియాయై నమః ‘’అని లలితా సహస్రం లో చెప్పారు. కదంబ వృక్షాలే కల్ప వృక్షాలని శ్రీ శంకర భగవద్పాదులు తెలియ జేశారు. ’’కదంబ కాననావాసా ‘’-కదంబ నామా కల్ప వృక్ష యుక్తం యత్కాననం వనం తత్ర గృహం యస్యాః సా తదా ‘’అని భాష్యం చెప్పారు.

వీర శిలలు అమ్మవారి ఉత్తర ద్వారం కు ఎదురుగా ఉన్న శిల్పాలన్నీ వీర శిలలే. ఇవి భక్తుల వీర కృత్యాలకు ప్రతి బింబాలు. ఒకప్పుడు ఆ వీరులకు ఇక్కడ ఆరాధన జరిగేది. ఇందులో అధికభాగం స్త్రీ శిల్పాలే .వివిధ ఆలం కారాలతో కేశ పాశాలతో వీరులు బల్లాలను తలలో, గుండెలో, గొంతులో, తొడలలో పొడుచుకొంటూ ఇంకా బ్రతికే ఉన్నట్లు కనిపిస్తారు. వీరు ఎందుకు వీరకృత్యాలు చేశారో తెలిపే శాసనాలున్నాయి. ’’స్వస్తిశ్రీ సోమతుశివ దేవా గురు అల్లడ్డ వీర మల్లునికి మేలుగావలెన్ అని తల త్రిపురా దేవి కిన్ ఇచ్చే ‘’ అని ఒక శాసనం. ఇంకోదానిపై ‘’దేవికి తల ఇస్తున్నాను తెలుంగు నాయని బావ మరది చావుండయ్య వీర’’అని అసంపూర్తి శాసనం కనిపిస్తాయి. ఇలా ఆత్మార్పణ చేస్తే దేవి కోరికలు తీరుస్తుందని నమ్మకం.

అపరాదేశ్వరీ ఆలయం –గుహలు అమ్మవారి ఆలయానికి దగ్గరలో బయట రోడ్డుమీద ‘’అపరాదేశ్వరీ ‘’లేక బాలమ్మ ఆలయం ఉంది. ఇది శిధిల రూపం లోనే ఉంది. దీనికి దగ్గరలో చింతామణి గుహ ,ఉన్నది. ఇది అమ్మవారి ఆలయమే నని భావన ఆధారం ‘’చింతామణి గుహాంతస్థ‘’ అనే నామం. ఇక్కడే పూర్వం లక్ష్మీ గణపతి ఆలయం ఉండేదట. అమ్మవారికి వెనక *వైడూర్య శిఖరం* అనే కొండ మీద ధ్యానం చేస్తే రోగాలన్నీ మాయమవుతాయట. ఇకడే తమాషా అయిన తెల్లని రాతి వరుస ఉందట. దీని రహస్యం సిద్ధులకు మాత్రమె ఎరుక.

*మహా సర్పం* –మరికొన్ని విశేషాలు బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం చెరువు కట్టపై ఒక పుట్ట ఉంది. అందులో విశేషమైన సర్పం ఒకటి ఉంటుంది. సంతానార్ధులు ,నాగ దోషమున్నవారు ,ఈ పుట్టకు పొంగళ్ళు సమర్పిస్తారు ఇందులోని పాము రాత్రి వేళ అమ్మవారి చిదగ్ని గుండం చేరి సేవ చేసి తిరిగి వస్తుందట. 

#కుమారగిరి*

శైవ శాక్తేయ క్షేత్రాలలో అత్యంత ప్రాధాన్యం పొందిన మహామహిమాన్విత దివ్య క్షేత్రం త్రిపురాంతకం స్కాంద పురాణం లో శ్రీశైలఖండం లో  *త్రైలోక్య పావనం తీర్ధం త్రిపురాంతక ముత్తమం* అని చెప్ప బడిన అతి ప్రాచీన క్షేత్రం. మార్కాపురానికి నలభై కిలో మీటర్ల దూరం లో ,గుంటూరు –కర్నూలు మార్గం లో రహదారికి రెండు కిలో మీటర్ల దూరం లో ఉన్నది. త్రిపురాంతకం సిద్ధ క్షేత్రం. అనేక యోగులు ,సిద్ధులు తాన్త్రికులకు ఆవాస భూమి .అనేక దివ్యమైన ఔషధాల నిలయం. రస రత్నాకర ,నాగార్జున సిద్ధ తంత్రం మొదలైన గ్రంధాలు దీని ప్రాభవాన్ని తెలియ జేశాయి. స్వామి ధ్వజస్తంభాన్ని చూసినా పాపాలు పటాపంచలౌతాయి. ఈ దైవ దర్శనం చేస్తే నంది జన్మ లభిస్తుందని విశ్వాసం. త్రిపురాంతక నామ స్మరణం ముక్తిదాయకం అని పార్వతీదేవికి స్వయంగా ఆ పరమ శివుడే చెప్పాడు .త్రిపురాంతక లింగాన్ని *తత్పురుష లింగం* అంటారు.

#స్థల పురాణం* 

త్రిపురాసుర సంహారం తారాకాసురుడు పూర్వం దేవ, ఋషులను బాధిస్తుంటే శివ కుమారుడైన కుమారస్వామి తారాకాసురుని మెడలోని ప్రాణ లింగాన్ని ఛేదించి వాడిని సంహరించాడు. ఈ యుద్ధం లో అలసిన శరవణ భవుడు ‘*ఆదిశైలం* అనే పేరున్న ఈ పర్వతం పై విహరించటం వలన *కుమార గిరి* అనే పేరొచ్చింది .తారకాసురుని ముగ్గురు కొడుకులు తారాక్షుడు ,విద్యున్మాలి ,కమలాక్షుడు. వీరినే త్రిపురాసురులు అంటారు. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ ముగ్గురు మూర్ఖులు శుక్రాచార్య అనుజ్ఞతో బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశారు. ఆయన ప్రత్యక్షం కాలేదు. పంతం పెరిగి ఒంటికాలి మీద నిలిచి తీవ్ర తపస్సు చేస్తే లోకాలు తల్లడిల్లిపోయాయి. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకో మన్నాదు .ఎవరి చేతిలోనూ చావు కలగ కూడదని వరం కోరుకొన్నారు. పుట్టిన వాడు చావాల్సిందే కనుక ఎలా చావాలనుకోన్నారో చెప్పండి అని అడిగాడు. తాము ఆకాశం లోమూడు పురాలను కట్టుకొని వెయ్యేళ్ళు జీవించిన తర్వాత ఆ మూడు పురాలు వరుసగా ఒకే చోట చేరినప్పుడు ఒకే బాణంతో ఆ త్రిపురాలను ఛేదించిన వాని చేతిలోనే తమకు మృత్యువు రావాలని కోరుకొన్నారు. సరే నన్నాడు బ్రహ్మ. తారాక్షుడు బంగారం, విద్యున్మాలి వెండితో, కమలాక్షుడు ఇనుముతో చేయబడిన పురాలను కట్టుకొని ఉంటూ దేవతలను మునులను బాధించేవారు. వారు పరమేశ్వరుని ప్రార్ధించారు .అప్పుడాయన త్రిపురాసురలను చంపాలంటే అపూర్వమైన రథం, అపూర్వమైన బాణాలు అవసరమనీ చెప్పాడు. వీరు శ్రీహరిని ప్రార్ధిస్తే ఆయన విశ్వకర్మకు ఆదేశం ఇచ్చి అపూర్వ బాణాలను సృష్టింప జేశాడు. విశ్వకర్మ జగత్తు తత్త్వంతో రథాన్ని, వేద తత్త్వంతో గుర్రాలను, నాగ తత్త్వంతో పగ్గాలను, మేరు శిఖర తత్త్వంతో ధనుస్సును, వాసుకి తత్త్వంతో వింటినారిని, సోమ,విష్ణు, వాయు తత్త్వాలతో బాణాలను తయారు చేసి ఇచ్చాడు. బ్రహ్మ రథసారధి అయ్యాడు. అ దివ్య రథాన్ని చూసి సంతసించి శివుడు అధిరోహించి త్రిపురాసుర సంహారానికి బయల్దేరాడు.

త్రిపురాంతకేశ్వర ఆవిర్భావం ఇంత చేసినా త్రిపురాసురుల తపో బలం వలన, మయుడి నిశ్చల తత్త్వం వలన ఆ దివ్య రథం భూమి లోకి క్రుంగి పోయింది .గుర్రాలు నిలువ లేకపోయినవి. ధనుస్సు పని చేయలేదు. రుద్రుడు విశ్వకర్మను పిలిచి సమర్థమైన రథం నిర్మించ లేక పోయినందుకు కోప పడ్డాడు. ఆయన సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు. పరమేశ్వరుడు అంతర్ముఖుడైనాడు .పర దేవతను ఆత్మలో ధ్యానించాడు. లీలా వినోదిని పరమేశ్వరి బాలాత్రిపురాసుందరిగా ఆవిర్భవించింది. శివుని ధనుస్సులో ప్రవేశించింది .దీనికి ఋగ్వేదంలో ఒక మంత్రం సాక్షిగా కనిపిస్తుంది. *అహం రుద్రాయ ధనురా తనోమి బ్రహ్మ ద్విషే శరవే హంత వా ఉ| అహం జనాయ సమదం క్రుణోమ్య హం ద్యావా ప్రుథివీ ఆవివేశ*, .అమ్మవారి తోడ్పాటుతో రుద్రుడు బాణం యెక్కు పెట్టాడు. దేవతలు అప్పుడు *నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః* ‘అని స్తుతించారు. త్రిపురాలన్నీ ఒకే సరళ రేఖలో చేరాయి. రుద్ర బాణం తో అవి ఒకే సారి ద్వంసమైనాయి. దేవమునులు సంతసించారు. బాలా త్రిపుర సుందరి ధనుస్సు నుంచి బయటికి వచ్చింది. శివుడు ఆమె సాయాన్ని ప్రస్తుతించాడు. ఆమె కృతజ్ఞతతో త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడు ఎక్కడ ఉంటె తానూ ఆక్కడే ఉండి ఆయన్ను సేవిస్తాను అని ఆయన అనుగ్రహాన్ని కోరింది. రుద్రుడు వెంటనే సమాధి స్థితిలోకి వెళ్ళాడు. ఆయన పాదాల దగ్గర ఉన్న స్థలం ద్రవించటం ప్రారంభించింది . పెద్ద గుంట ఏర్పడి నీరు లోపలి పొరల్లోకి ప్రసరించింది ఆ గుంటలోనే ఆయన *వైఢూర్య లింగం* గా ఆవిర్భవించాడు. దీనికి సాక్ష్యం గా వేదమంత్రం ఉంది *–స్తుతి శ్రుతం గర్త సదం యువానం*

*మృగన్నభీమ ముప హత్తు ముగ్రం*

*–మ్రుడా జరిత్రే రుద్రస్తవానో* *-అన్యంతో అస్మిన్ని వపంతు సేనా’* వైడూర్య లింగానికి పై భాగాన బ్రహ్మ దివ్య జల లింగాన్ని ప్రతిస్టించాడు. ఇక్కడ జలలిన్గానికి చేసిన అభిషేక ద్రవ్యం లోని ద్రవ్య చిత్త దోషాలు పై భాగం లోనే లయమై లోపల ఉన్న త్రిపురాన్తకేశ్వరుని చేరుతుంది.

త్రిపురాంతకేశ్వరుడు ఆవిర్భవించిన ఈ దివ్య ప్రదేశమే *కుమార గిరి*. *ఆదిశైలం, అరుణాచలం, కుమారాచలం, లేబ్రాయపు కొండ* అని పేర్లున్నాయి. తారకాసుర సంహారం చేసిన తర్వాత నుండి కుమార స్వామి ఇక్కడ రహస్య ప్రదేశం లో తపస్సు చేస్తున్నాడు. ప్రతి పౌర్ణమి నాడు పార్వతీ దేవి ,ప్రతి అమావాస్య రోజున పరమేశ్వరుడు వచ్చి తమ కుమారుడైన కుమారస్వామిని చూసి పోతూ ఉంటారని శివ పురాణం లోని శ్లోకం తెలియ జేస్తోంది – *అమావాస్య దినే శంభుఃస్వయం గచ్చతి తర* *–పౌర్ణమాసీ దినే పార్వతీ గచ్చతి ధృవం*

పిలిస్తే పలికే దైవం పూర్వం త్రిపురాన్తకేశ్వరుడు పిలిస్తే పలికే వాడట. పాల్కురికి సోమనాధుడు బసవ పురాణం లో చెప్పిన కిన్నెర బ్రహ్మయ కథ తార్కాణం. ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి నాలుగు వైపులా కొండ పైకి మెట్ల మార్గాలున్నాయి. ఇప్పుడు తూర్పు ద్వారం ఒకటే తెరచియున్నది. దక్షిణ సోపాన మార్గానికి దగ్గర మూలస్థానేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈయన మహా మహిమ కల దైవం. అనేకమంది రాజులు ఈయనకు భూరి దానాలు సమర్పించారు. దీనికి దగ్గరలో శ్రీ లక్ష్మీ చెన్న కేశవాలయం ఉన్నది. పలనాటి బ్రహ్మనాయుడు ఈ స్వామిని అర్చించాడు. మూల స్తానేశ్వరునికి ఆగ్నేయంగా పంచ బ్రాహ్మలచే ప్రతిష్టింప బడిన *పంచ లింగ దేవాలయం* ఉన్నది. ఈశాన్యం లో ఆవు పొదుగు ఆకారం తో లింగాలు దర్శన మిస్తాయి. పూజిస్తే ఆయురారోగ్యాలనిస్తాయి. దక్షిణ సోపానాల దగ్గర వీర భద్రాలయం ఉంది. ఇంకొంచెం పైకి ఎక్కితే ఇష్టకామేశ్వారీ దేవాలయం ఉన్నది. దీనికి దక్షిణంగా అద్భుత మహిమలున్న *అగస్త్య లింగం* ఉన్నది. దీనినే *విన్ధ్యేశ్వర లింగం* అని అంటారు. ముఖ్యదేవాలయం దగ్గరే *అపరాజితేశ్వరుడు* ఉన్నాడు. మన్యు సూక్తంతో అర్చిస్తే శత్రుజయం లభిస్తుంది. ఆగ్నేయంలో సూక్ష్మ తేజోమయ *యజ్ఞేశ్వర లింగం* వాయువ్యంలో హనుమంతుడు నెలకొల్పిన *మారుతి లింగం* ఉన్నాయి వీటిని పూజిస్తే ఆయుష్షు బలం యశస్సులు కలుగుతాయి. వీటి ప్రక్కనే మార్కండేయ ప్రతిష్టిత దివ్య లింగం ఉంది. ఉత్తరంలో చండీశ్వరుడు, పార్వతీ ఆలయానికి ఎదురుగా విశ్వామిత్ర ప్రతిష్టితమైన *ఉగ్రేశ లింగం* ఉన్నాయి. ఉత్తర గోపురం దగ్గర గొప్ప శిల్పకళాశోభితమైన మహిషాసుర మర్దిని విగ్రహం ఉండేది. ఇప్పుడు అది మద్రాస్ మ్యూజియం లో ఉంది. గర్భాలయానికి నైరుతి దిశలో *చీకటి మిద్దె* అనే చీకటి గుహ ఉన్నది. ఇక్కడి నుంచి కాశీ ,శ్రీశైలాలకు సొరంగ మార్గం ఉంది. వృశ్చిక మల్లేశ్వరాలయానికి దగ్గరలో మఠం ఉంది. శ్రీ బాలా త్రిపుర సుందరిని అర్చించడానికి సిద్ధ సాధ్యులు ఈ మార్గం ద్వారా వస్తారని చెబుతారు. ప్రధాన ఆలయానికి ఉత్తరాన ఒక చింత చెట్టు ఉండేది. దాని మూలం లో భైరవుడు ఉంటాడు. దాని ముందు మనిషి లోతు త్రవ్వితే ఒక గుండం కనబడుతుంది. అప్పుడు చింత చెట్టు ఆకులు కోసి గుడ్డలో మూట కట్టి ఆ గుండం లో వేస్తె రాళ్ళు చేపలుగా మారుతాయట. ఆ చేపలను వండి తలను తోకను తీసేసి తింటే మూర్చ వచ్చి కొంత సేపటికి లేస్తాడు. ఆ మనిషి వేల సంవత్సరాలు జీవిస్తాడని *నిత్య నాథ సిద్ధుడు* అనే యోగి

*రస రత్నాకరం* అనే గ్రంథంలో రాశాడు. చీకటి మిద్దె ప్రక్కనే *మహా గణపతి మండపం* ఉంది. విగ్రహం శిథిలమైతే ప్రక్కన కింద పెట్టారు. ప్రధానాలయం శ్రీ చక్రాకారం లో నిర్మించ బడింది. శివాలయం ఈ ఆకారం లో నిర్మించటం చాలా అరుదు. అలాటి అరుడైన దేవాలయం ఇది. *శ్రీ చక్రం శివ యొర్వపుః*’అంటే శివ పార్వతుల శరీరమే శ్రీ చక్రం. స్వామి ఉగ్రరూపం కనుక తూర్పు గ్రామాలు తగలబడి పోయాయట. అందుకే ఆ ద్వారాన్ని మూసేశారు .పక్కగా ఉన్న దారి గుండా వెళ్లి దర్శనం చేసుకోవాలి. లోపల స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఆకర్షణీయం గా ఉంటాడు. జల లింగాన్ని దుండగులు పీకేస్తే కొండ కింద ఉన్న శ్రీరామ ప్రతిష్టిత లింగాన్ని తెచ్చి ప్రతిష్టించారు .పునః ప్రతిష్టలో మూల విరాట్ ను కదిలించకుండా మూల విరాట్ కు కింద మరొక నర్మదా బాణ లింగాన్ని ప్రతిష్టించారు. త్రిపురాన్తకేశ్వరునికి ఉత్తరాన పార్వతీ దేవి అంటే స్కంద మాత ఆలయమున్నది. పై రెండు చేతులలో శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం ,డమరుం కింది చేతులలో పద్మాలు కలిగి ఉంటుంది. అమ్మవారి ముందు కాశీ విశ్వేశ్వర లింగం ఉంది . స్వామి అభిషేకాలకు భక్తజనం త్రాగటానికి గంధవతి తీర్ధం ఉంది. ఇందులో స్నానంచేస్తే పుణ్యం మోక్షం .బాలాత్రిపుర సుందరి ఆలయం వెనక పుష్పవతీ తీర్ధం ఉండేది. చెరువులో కలిసిపోయింది. మహా నందిలో లాగానే ఇక్కడ కూడా స్వచ్చమైన జలం తో ఉండే కోనేరుండేది. దీనికి *పాప నాశనం* ‘అనిపేరు. నాలుగు కొండల మధ్య ఉన్న సోమ తీర్ధం పాప నాశిని. కుమార గిరికి పడమర దూర్వాస నది లేక దువ్వలేరు ఉన్నది. ఇక్కడ దూర్వాసుడు తపస్సుచేశాడు. దీనికి దక్షిణం లో *ముక్త గుండం* లో స్నానం చేస్తే మోక్షమే.


తీర్దాలు-మిగిలిన గుడులు త్రిపురాంతకం అష్ట భైరవ పరి వేష్టితం. కుమార గిరికి దక్షిణాన భైరవగిరి సిద్ధులకు సిద్ధి క్షేత్రం. పూర్వం ఇక్కడ భైరవాలయం ఉండేది. తూర్పున శ్రీ సుందరేశ్వర స్వామి కొండపై ఉన్నాడు. పడమరలో శ్రీ రామ నిథేశ్వరుడు మిక్కిలి పూజ నీయుడు. ఉత్తరాన ఉన్న కొండను పూలకొండ అంటారు. ఇక్కడే తారకాసురుడు పూజించిన శివ లింగం ఉంది. ఇక్కడే తారకాసుర మందిరం ఉండేదట. దక్షిణాన కొండమీద విద్యున్మాలి పూజించిన లింగం ఉంది. దీనికి దిగువన ఓషధీ సమన్విత సోమ తీర్ధం ఉంది. ఇది సర్వ రోగ నివారిణి. తూర్పున పంచ బ్రహ్మలు ప్రతిష్టించిన పంచ లింగాలున్నాయి. వాయవ్యం లో లింగాల కొండ ఉంది. ఇక్కడ వెయ్యి నూట ఒక్క లింగాలు ఉన్నాయట. ఇక్కడ అజ్ఞాతం గా మునులు తపస్సు చేస్తూ ఉంటారట. ఇకడే దివ్యౌ షది *సంజీవిని* ఉన్నాడని జ్ఞానులు చెబుతారు.


కుమారగిరిపై త్రిపురాంతకేశ్వర స్వామి స్వయంభూవుగా వెలిశాడు. ప్రపంచంలో ఏ ఆలయంలోకి ప్రవేశించాలన్నా తూర్పు, ఉత్తర ద్వారాల ద్వారా దర్శనానికి వెళతారు. ఇది రాక్షస ఆగమన ప్రకారం నిర్మించడంతో దక్షిణ ద్వారం(నైరుతి ప్రవేశం) నుంచి


ఆలయంలోనికి ప్రవేశం ఉంటుంది. శ్రీచక్ర ఆకారంలో శక్తి పీఠాల ఆలయాలను నిర్మిస్తుండటం ఆనవాయితీ కాగా త్రిపురాంతకేశ్వరుని ఆలయం శ్రీచక్ర పీఠంపై నిర్మితం కావడం చేత ఆలయానికి ప్రత్యేక విశిష్టత సంతరించుకుంది. వైష్ణవ, శివ ఆచారాల మేళవింపు కలిగిన ఈ ఆలయం శ్రీశైల ఆలయాల కంటే అతి ప్రాచీనమైంది. స్వామి ద్వారం వద్ద ఉన్న ద్వారపాలకులైన భద్రుడు, వీరభద్రుడు శిల్ప నైపుణ్యతకు పెట్టింది పేరు. స్వామికి ఉత్తర వైపుగా సిద్ధేశ్వరి తల్లి ఢమరుకం చేత పూని భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ నుంచి శ్రీశైలానికి వెళ్లేందుకు బిల మార్గం ఉంది. పూర్వం మునులు ఈ దారినే వినియోగించినట్లు వేదాల్లో పేర్కొన్నారు. ఎటు చూసినా శిల్ప సంపదే ఏడో శతాబ్ధంలోని కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగిన అతి ప్రాచీన ఆలయం త్రిపురాంతక క్షేత్రం. ఆలయ పరిసరాల్లో శిల్ప సంపద శోభాయమానంగా దర్శనమిస్తుంది. ఆలయానికి వేసిన రంగులను ఇటీవల తొలగిస్తుండటంతో సహజత్వం కలిగిన శిల్ప సంపదతో పాటు గోడలపై శాసనాలు కనిపిస్తున్నాయి. పాపనాశనం, అంగారేశ్వర, మూల స్థానేశ్వర, సోమేశ్వర, ఖడ్గేశ్వర, కన్యసిద్ధేశ్వర, కేదారేశ్వర, మల్లిఖార్జున, కపిలేశ్వర, గౌరేశ్వర, ఉత్తరేశ్వర, ఏకాదశ రుద్ర స్థానాల మధ్య త్రిపురాంతకేశ్వరుడు స్వయంభూగా వెలిశాడు. ఈ ఆలయానికి నాలుగు వైపుల ఉన్న సోపానాలు నేడు కనుమరుగయ్యాయి.


బిలాలు శివాలయానికి ఉత్తరాన ‘’కోకిలా బిలం ‘’ఉంది. సాధకుడు శుచిగా అందులో ప్రవేశించాలి. నలభై అడుగులు లొపలికి వెడితే కోకిల ఆకారపు రాళ్ళు కనిపిస్తాయి. ఆ రాళ్ళను తీసుకొని వాటి వెనక నువ్వులు పెడితే అవిపగిలిపోతాయి. అప్పుడు ఆ రాళ్ళను పాలలో వేస్తె పాలు నల్లగా మారుతాయి. ఈ పాలను గొంతు నిండే దాకా తాగాలి. అప్పుడు దివ్య శరీరం పొంది తెల్లజుట్టు ముడుతలు పోయి ,రోగాలు లేనివాడై మూడు బ్రహ్మ దినాలు జీవిస్తాడు. మహా బలవంతుడై వాయువేగం కలుగుతుందని చెపుతారు.


గుండ్ల కమ్మ నదికి తూర్పు కొండపై చంద్ర మౌళీశ్వరాలయం ఉంది. దాని దగ్గరేకాశి కేశుడు ,ఒక కోనేరు ,నృసింహ బిలం ఉన్నాయి. బిలం లో ప్రవేశిస్తే యోగసిద్ధి కలుగుతుంది. దానిలో నుంచి కాశీ వెళ్ళచ్చు.


వీరశైవం –మఠాలు త్రిపురాంతకం శైవమత వ్యాప్తికి దోహద పడింది. ఇక్కడి ‘’గోళకీ మఠం’’ప్రసిద్ధి చెందింది. 14వ శతాబ్దం లో వీర శైవం విజ్రుమ్భించింది. 1312నాటికి పూజారులు 72నియోగాల వారు స్తానాదిపతుశ్రీ అసంఖ్యాత మహా మహేశ్వరులకు లోబడి ఉండాలన్న నిబంధన ఏర్పడింది. ఇక్కడి ‘’విశుద్ధ శైవ మఠం’’ఉచిత అన్న వస్త్రాలిచ్చి వేదం వేదాంగాలు శాస్త్రాలు సాహిత్యం బోధించింది. పదమూడు పద్నాలుగు శతాబ్దాల మధ్య ‘’కాపాలిక మతం ‘’అభి వృద్ధి చెందింది. అప్పుడే ‘’పంచ మకారార్చన ‘’జరిగేది (మద్యం మాంసం మగువ ).

ఉత్సవాలు ప్రతి సోమ ,శుక్రవారాలలో విశేష ఉత్స్సవాలు మహా శివరాత్రి నాడు కల్యాణోత్సవం జరిగేదని వసంత నవరాత్రులు ,శరన్నవ రాత్రులు శ్రావణ మాసంలో ఉత్సవాలు కార్తీకంలో అభషేకాలు సంతర్పణలు జరిగేవని శాసనాల వలన తెలుస్తోంది. తర్వాత ఆలయం శిథిలా వస్తకు చేరింది. శ్రీశైలం దేవస్థానం ఈ క్షేత్రాన్ని దత్తతకు తీసుకోని పునరుద్ధ రించి మళ్ళీ నిత్య ధూప దీప నైవేద్యాలు ఉత్సవాలు నిర్వహింప జేస్తోంది. దాతలు ముందుకు వచ్చి అన్నదాన సత్రాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కార్యనిర్వాహణ అధికారి మరియు ఇతర సిబ్బంది మహాశివరాత్రిని అద్భుతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని వర్గాల వారు మూడు రోజుల పాటు అన్న దాన సత్రాలు వసతి సముదాయలు నిర్వహిస్తున్నారు. మూడో రోజు స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇంతటి మహా మహిమాన్విత దివ్య క్షేత్రమైన త్రిపురాంతకం మహా శివరాత్రి నాడు వెళ్లి శ్రీ బాలా త్రిపుర సుందరిని, శ్రీ త్రిపురాంత కేశ్వరుని దర్శించి జీవితాలను చరితార్ధం చేసుకోవాలి

బాలాత్రిపుర సుందరి సన్నిధిలో శుభకార్యములు గాని, పితృకార్యములు గాని నిర్వహించుకొనుటకు వసతి సౌకర్యముతో సహా సౌకర్యము గలదు.

త్రిపురాంతకంలో శ్రీశైలంవారి కరివెన వారి సత్రం (కేవలం బ్రాహ్మణులకు మాత్రమే), మరియు ఇతర బ్రాహ్మణ 8 సత్రములు, ఇంకను  ఇతర సామాజికవర్గముల వారికి సత్రములు కలవు.


                    శ్రీమాత్రే నమః🙏

-      --చాగంటివారి ప్రవచనం నుండి

      ప్రతీదానినీ ఈశ్వరునితో అనుసంధానం చేయడమే నిజమైన భక్తి. మీ పూజామందిరంలో మీ సింహాసనం దగ్గర మీరు అమ్మవారికి నిజాయితీ గా అన్ని విషయాలు చెప్పాలి. భక్తి అన్న పాశం పడితే సంసారం మిమ్మల్ని ఏమీ చేయదు.

రామకృష్ణ పరమహంస అంటారు..... పనస కాయను ఒలిచేవాడు చేతులకి నూనె రాసుకుని ఎన్ని పనసకాయలు కొట్టినా వాని చేతికి ఏమి అంటుకోదు. చేతులకి నూనె రాసుకోకపోతే ఇబ్బంది వస్తుంది. అంతా వాడి చేతులకు అంటుకుంటుంది. భక్తి పాశం మీకు పడిన తరువాత మీరు సంసారంలో ఉన్నా మీకోచ్చే ఉపద్రవం ఏమి లేదు. పైగా రక్షణ కలుగుతుంది. మీ భక్తికి ఇంట్లో ఉన్న వాళ్లందరూ రక్షింపబడుతూ ఉంటారు. ఈశ్వరుని వంక తిరిగి నమస్కారం చేస్తే ఆ పాశం పడితే మీరు ఉద్ధరణ పొందుతారు. ఆ పాశం మీ మీద పడాలి. మిగిలిన పాశాలు ఎన్ని పడినా ఉపయోగం లేదు. అవన్నీ యమపాశం కన్నా దారుణమైన పాశాలే.

అమ్మవారు భక్తి పాశాన్ని మీమీద వెయ్యాలి. వేయాలంటే మీరు అమ్మవారివైపు తిరగాలి. ఆమె కాంతి వంక తిరగాలి. తరువాత అమ్మవారిని ధ్యానం చెయ్యాలి. ఆవిడ చేతులవంక చూడాలి. అమ్మని అనుగ్రహించమని ప్రార్ధించాలి. అపుడు అమ్మవారు వెంటనే మీకు భక్తి పాశం వేస్తుంది. పాశం పడిందంటే ఇక మీరు ఉద్ధరణ పొందినట్లే. కాబట్టి ఆవిడ 'రాగస్వరూపపాశాడ్యా'  

      మనకి శరీర సంబంధమైన రాగం ఉంటే పాడైపోతాం. అమ్మవారికి సంబంధించిన రాగం ఉంటే ఉద్ధరణ పొందుతాం. ఇదీ తేడా. 

                         🙏శ్రీ మాత్రేనమః🙏Friday, October 16, 2020 0 comments By: Vedasree

శరన్నవరాత్రులు... #నవరాత్రులు - నవదుర్గలు*


ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు తొమ్మిదిరోజులు శరన్నవరాత్రులుగా వైభవంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులలోని అమ్మవారిని మొదటి మూడు రాత్రులు దుర్గగా, తర్వాతి మూడురాత్రులు లక్ష్మిగా, చివరి మూడు రాత్రులు సరస్వతిగా పూజిస్తారు. శుభ, నిశుంభ, మహిషాసురుడు మొదలైన రాక్షసులను సంహరించడానికి అవతరించిన దుర్గాదేవి తొమ్మిదిరోజులు వేర్వేరు రూపాలు ధరించింది. అందుకే ఈ నవరాత్రులలో ఆలయాలలో అమ్మవారికి ప్రతీరోజు ఒక్కో అలంకారం చేస్తారు. అలాగే రోజుకో రకం నైవేద్యం సమర్పిస్తారు. దేవీ భాగవతం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అనేవి నవదుర్గా రూపాలు. ప్రతి అవతారానికి ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక, ఉపాసనా రహస్యాలు ఉన్నాయి.


#వందేవాంచితలాభాయ చంద్రార్ధకృత శేఖరమ్

వృషారూఢాం శూలధరం శైలపుత్రీం యశస్వినీమ్


1. శైలపుత్రి: నవరాత్రులలో మొదటిరోజు పాడ్యమినాడు అమ్మవారిది శైలపుత్రి అవతారం. పర్వతరాజు పుత్రిక పార్వతిగా జన్మించిన సతీదేవి శంకరుడిని సేవించి వరిస్తుంది. శైలపుత్రి కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం ధరించి ఎద్దుపై స్వారీ చేస్తూ ఉంటుంది. పాడ్యమినాడు పెసరపప్పు, జీలకర్ర, మిరియాలతో చేసే పులగం లేదా కట్టు పొంగలి నైవేద్యంగా సమర్పిస్తాతారు.


#దధనా కరపద్మాభ్యం అక్షమాలా కమండలా


*దేవీ ప్రేదతు మయీ బ్రహ్మే చారిణ్యనుత్తమా


2. బ్రహ్మచారిణీ: రెండవరోజు విదియనాడు అమ్మవారిది బ్రహ్మచారిణిగా అవతారం. బ్రహ్మచారిణి అంటే తపమాచరించినదని అర్ధం. కుడిచేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలాన్ని ధరించిన ఈ తల్లి ఉమ, తపచారిణిగా కూడా పిలువబడుతుంది. విదియనాడు పెరుగుతో చేసిన దద్ధ్యోజనం నైవేద్యం చేస్తారు.


#పిండజ ప్రవరారూఢ చండకో పాస్త్రకైర్యుతా

ప్రసాదం తమతేహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా


3. చంద్రఘంట: దుర్గాదేవి మూడో అవతారం చంద్రఘంట.. తన నుదుటిపై అర్ధచంద్రుడిని ఘంటాకారంగా కలిగి ఉంటుంది కాబట్టి చంద్రఘంటగా పిలువబడుతుంది. పది చేతులతో, మూడు కన్నులతో పులిని అధిష్టించిన అమ్మవారు ఎనిమిది చేతులలో జపమాల, బాణం, ఖడ్గం, శ్వేతపద్మం, కమండలం, త్రిశూలం, ధనుస్సు, గద ధరిస్తే, మిగిలిన రెండు చేతులు వరాలిచ్చే, చెడును ఆపే ముద్రలతో ఉంటాయి. ఈ రోజు బెల్లంతో చేసిన గుడాన్నం నైవేద్యంగా పెడతారు.


#'సురాసంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ

దధనా హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్ '


4. కూష్మాంఢ : నాలుగవ రోజైన చవితినాడు అమ్మవారిని కూష్మాండగా అలంకరిస్తారు. అష్టభుజాలతో అలరారే ఈ తల్లి కమలం, ధనుస్సు, బాణం, కమండలం, కలశం, జపమాల, గద, చక్రం మొదలైనవి ధరించి సింహవాహినిగా ఉంటుంది. అంధకారంలో మునిగిపోయిన విశ్వాన్ని తన వెలుగుతో సూర్యకిరణాలవలే ఎల్లెడలా కాంతిని నింపింది కూష్మాండ దేవి. ఈ రోజు అమ్మవారికి చేసే అన్నం ప్రసాదాన్ని నూనెతో కాక నేతితో పోపు పెట్టి నేతి అన్నం నైవేద్యం పెడతారు.


#సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా

శుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ '


5. స్కంద : ఐదవ రోజైన పంచమినాడు అమ్మవారు స్కందాదేవిగా సాక్షాత్కరిస్తుంది. దేవతల సైన్యాధిపతియైన స్కందుడు లేదా సుబ్రహ్మణ్యాన్ని పిల్లవాడిగా తన ఒడిలో ఉంచుకుంటుంది. సింహాన్ని స్వారీ చేస్తూ, నాలుగు చేతులు, మూడు కళ్లు కలిగిన తల్లి రెండు చేతులలో కమలాలను , మరో రెండు చేతులు అభయం, రక్షణ ఇస్తున్నట్టుగా ఉంటాయి. స్కందమాతను పూజిస్తే ఎంతటి మూర్ఖుడైనా మహా పండితుడు అవుతాడంట. మహా కవి కాళిదాసు స్కందమాత ఆశీస్సులతోనే రఘువంశ మహా కావ్యం, మేఘదూతం రచించాడు. పంచమినాడు పాలు, బియ్యం కలిపి చేసిన పాయసాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు.


#చందరహాసోజ్వలకరం శార్దూలవరవాహనా


కాత్యాయనీ శుభం దద్ద్యాద్దేవీ దానవ ఘాతినీ '


6. కాత్యాయిని : ఆరవరోజైన షష్టినాడు అమ్మవారు కాత్యాయినిగా కొలువై ఉంటుంది. 


కాత్యాయన మహారుషి జగన్మాతను తన కూతురిగా పొందాలని తపస్సు ఆచరించాడు . అతని భక్తికి మెచ్చిన దుర్గామాత యమునా నదీ తీరాన అతని కుమార్తె కాత్యాయినిగా జన్మిస్తుంది. నాలుగు చేతులు, మూడు కళ్లతో ఉండే కాత్యాయిని ఒక చేత ఖడ్గం, ఒకచేత కమలం, రెండు చేతులతో అభయముద్ర కలిగి సింహాన్ని అధిష్టించి ఉంటుంది. షష్టినాడు పులిహార నైవేద్యంగా సమర్పిస్తారు.*


#'ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా

లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ

వామ పాదోల్లి, సల్లోహలితా కంటకా భూషణా

వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ '


7. ఏడవరోజు దుర్గామాత కాళరాత్రిగా రూపం దాల్చి ఉంటుంది. 


కాళరాత్రివలె నల్లగా ఉండి, అస్తవ్యస్తమైన కురులతో, మెరుపుతీగను హారంగా ధరించి భయంకరంగా ఉంటుంది . నాలుగు చేతులు, మూడు కళ్ళు కలిగి రెండు చేతులలో ఆయుధాలు, మిగిలిన రెండు చేతులతో అభయం, రక్షణ ఇస్తూ నాసికాలనుండి అగ్నిజ్వాలలను వెదజల్లుతూ ఉంటుంది. గాడిదను వాహనంగా కలిగిన ఈ తల్లి తనను శరణువేడినవారికి అభయాన్నిస్తూ శుభంకరి అని కూడా పిలువబడుతుంది. సప్తమినాడు పులిహోర, పాయసం నైవేద్యంగా సమరిపిస్తారు.


#శ్వేతే వృషే సమా

రూఢా శ్వేతంబరధరా శుచిః

మహాగౌరి శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా!'


8. ఎనిమిదవ రోజైన అష్టమినాడు దుర్గాదేవి మహాగౌరీగా పూజింపబడుతుంది.


అనితర సాధ్యమైన తపస్సు ద్వారా నల్లని తన మేని ఛాయను మార్చుకుని ధవళ కాంతులతో ప్రకాశించిన దుర్గాదేవి స్వరూపం మహాగౌరి. తెల్లని చంద్రకాంతితో విరాజిల్లే ఈ తల్లి నాలుగు చేతులు కలిగి ఉంటుంది. ఒక చేత త్రిశూలం, ఒక చేత కమండలం, ఒక చేత అభయం, ఒకచేత రక్షణ ఇచ్చే ముద్రలు కలిగి ఎద్దుపై స్వారీ చేస్తుంది. సప్తమినాడు పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు


#'సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురైర మరైరపి

సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ


9. తొమ్మిదవ రోజైన నవమి నాడు అమ్మవారిని సిద్ధిధాత్రిగా అలంకరిస్తారు.


అష్ట సిద్ధులతోపాటు మోక్షసిద్ధిని కలిగించే అమ్మరూపం ‘సిద్ధిధాత్రి’. పరమశివుడు మహాశక్తిని పూజించి అష్టసిద్ధులను పొందాడని దేవీ పురాణం చెబుతుంది. ఆ శక్తి అతని శరీరంలో సగభాగమై అర్ధనారీశ్వరుడిని చేసింది. చతుర్భుజాలతో భక్తుల పూజలందుకుంటుంది. ఈమె కమలాసనయై. మరొక చేతిలో కమలాన్ని ధరించి ఉంటుంది. రుషులు, మునులు, సిద్ధులు, దేవతలు కూడా సిద్ధిధాత్రిని పూజిస్తారు. నవమి నాడు బెల్లంతో చేసిన పరమాన్నం, దధ్యోదనం, పాయసం, పులిహోర చేసి నైవేద్యంగా సమర్పిస్తారు


                      || శ్రీ మాత్రేనమః ||

#శరన్నవరాత్రులలోఅమ్మవారి #అలంకరణలు #ముహూర్తాలు


17 - 10 - 2020


శరద్రుతువులో ఆశ్వీయుజమాసం ప్రారంభం మొదలుకొని తొమ్మిది రాత్రులు నవరాత్రలుగా జరిపి , పదవరోజు ఉదయం శమీ పూజతో ఉద్వాసన చేయడం పరిపాటి. వివిధ రోజులలో వివిధ పద్ధతులలో అలంకారాలు నివేదించి అమ్మవారికి వివిధ పద్ధతులలో పూజించి రకరకాల నైవేద్యాలు నివేదించి అమ్మవారి అనుగ్రహం పొందటం పరిపాటి.   నిజ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి రోజు అంగ్ల తేది ప్రకారం 17 అక్టోబర్ 2020 దేవి శరన్నవరాత్రారంభం.


17 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి , శనివారం మొదటి రోజున *'#బాలాత్రిపుర #సుందరీ'* అలంకారం.


ముహూర్తం :- కలశస్థాపన శుభ సమయం ఉదయం 7:38 నిమిషాల నుండి 11:29 వరకు, మధ్యాహ్నం 11:29 నుండి 12:16 వరకు.


నైవేద్యం - పులగం


18 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ విదియ, ఆదివారం రెండవ రోజున '#గాయత్రీదేవి' అలంకారం.


ఉదయం 8:05 - 8:35 , సాయంత్రం 6:18 - 6: 56


నైవేద్యం - పులిహోర


19 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ తదియ, సోమవారం మూడవ రోజున '#మహాలక్ష్మిదేవి' అలంకారం


ఉదయం 9 :05 - 9 :30 , సాయంత్రం 5 :35 - 6:30


నైవేద్యం - వడపప్పు, పానకం


20 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ చవితి, మంగళవారం నాల్గవ రోజున '#అన్నపూర్ణ' అలంకారం.


ఉదయం 7 :02 - 7 :40 , సాయంత్రం 5 :05 - 5 : 32


నైవేద్యం - పరమాన్ణం, బూరెలు


21 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ పంచమి, బుధవారం ఐదవ రోజున '#లలితాదేవి' అలంకారం.


ముహూర్తం:- సరస్వతీ ఆవాహనం ఉదయం 6:05 - 7:53 ( మూల 1 వ పాదం )


సరస్వతీ దేవి మూల నక్షత్ర పూజ ఉదయం 7:54 - 8:58


సరస్వతీ దేవి సాయాహ్న పూజ మధ్యాహానం 3:29 - 5:39 వరకు


నైవేద్యం - పెసర బూరెలు, పరమాన్నం


22 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ షష్టి, గురువారం ఆరవ రోజున '#శాకంబరీదేవి' అలంకారం.


ముహూర్తం:- త్రిరాత్ర కలశస్థాపన సమయం ఉదయం 6:05 - 7:32


పూర్వాషాడ సాయహ్న పూజ మధ్యాహానం 3:29 - 5:38


పూర్వాషాడప్రదోష పూజ సాయంత్రం 5:39 - 8:02


నైవేద్యం - శాకాన్నం (కూర అన్నం)


23 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ సప్తమి, శుక్రవారం ఏడవ రోజున '#సరస్వతీదేవి' అలంకారం.


ఉదయం 6 :20 - 7 :05 , సాయంత్రం 5 :39 - 6:20


నైవేద్యం - కదంబం ప్రసాదం.


24 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ అష్టమి, శనివారం ఎనిమిదవ రోజున #దుర్గాష్టమి '#దుర్గాదేవి' అలంకారం.


ముహూర్తం:- ఉదయం 7;38 - 8:59, మధ్యాహ్నం 11:28 - 12:14 , సాయంత్రం 5:37 - 7:11


నైవేద్యం - నిమ్మకాయ పులిహోర


24 -10 -2020 సరస్వతీదేవి ఉద్వాసన ముహూర్త సమయం ఉదయం 7:38 - 8:59


25 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ నవమి, ఆదివారం తొమ్మిదవ రోజున '#మహిషాసురమర్దినీ' అలంకారం.


ఉదయం 8:45 - 9:15 , సాయంత్రం 6:12 - 6: 37


నైవేద్యం -చలివిడి, వడపప్పు, పానకం.


అక్టోబర్ 25


విజయదశమి పూజ ప్రారంభ ముహూర్త సమయం ఉదయం 8:40 - 11:57


శమీ పూజ, ఆయుద పూజలు ఉదయం 10:25 - మధ్యాహానం 12:14


అపరాజితా దేవి పూజా సమయం మధ్యాహ్నం 1:00 - 3:18


విజయ దశమి విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:46 - 2:32


విజయ దశమి పర్వదినాన దుర్గాదేవి ఉద్వాసన సాయంత్రం 5:36 - 8:00 లేదా


26 అక్టోబర్ సోమవారం ఉదయం 6:06 - 8:24 లోపు.

సేకరణ..From FB...

 

Friday, October 2, 2020 0 comments By: Vedasree

అమ్మల గన్న యమ్మ దుర్గమ్మ...

               ** ఓం శ్రీ మాత్రే నమః **


బెజవాడ ( విజయవాడ )     కనక దుర్గా  మాత ఆలయంలో రాజద్వారం పై ఉండే

ఈ పద్యం గురించి మీకు తెలుసా?


#అమ్మలగన్నయమ్మ 

ముగురమ్మల మూలపుటమ్మ

చాల పెద్దమ్మ, సురారులమ్మ 

కడుపారడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్ !!!


విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియక కాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సత్ఫలితాన్ని ఇచ్చేస్తాయి.  మంత్రంము,  భీజాక్షర యుక్తముగా  ఉంటే  మనము, కొన్ని కొన్ని చదవకూడదు. కొన్ని కొన్ని చేయకూడదు. పక్కన గురువు వుంటే లేదా గురుముఖతా ఉపదేశము పొంది  ఉంటే  తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేము.  ఉచ్ఛారణా దోషాలు లేకుండా  భీజాక్షరములను ఉపాసన అందరూ  చెయ్యలేరు  . అది కష్టం. కానీ పోతనగారు ఈ దేశమునకు,  మనకు  బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.


""అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ, కవిత్వ,  పటుత్వ,  సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ’ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు, మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడానికని ఇటువంటి ప్రయోగం చేశారు.


అమ్మలగన్నయమ్మ’– అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు ? మనకి లలితాసహస్రం ’శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభమవుతుంది. ’శ్రీమాతా’ అంటే ’శ’కార ’ర’కార ’ఈ’కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు వున్నదో ఆయమ్మ – అంటే ’లలితాపరాభట్టారికా స్వరూపం’ – ఆ అమ్మవారికీ దుర్గాస్వరూపమునకు భేదం లేదు – అందుకని ’అమ్మలగన్నయమ్మ’ ’ముగ్గురమ్మల మూలపుటమ్మ’ – ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ. ’చాల పెద్దమ్మ’ – ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి – అండపిండ బ్రహ్మాండములంతటా  నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపము  బ్రహ్మాండములనన్నిటినీ సృజించి, ధరించి వ్యాపించి  పోషించే  బ్రమ్హాన్డభాన్డోదరి ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదంలేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది. అలా ఉండడం అనేదే మాతృత్వం,  దయ,  దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.


అండపిండ బ్రహ్మాండములనన్నిటి యందు  నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.


’సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ – సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ. అనగా దితి. దితి అయ్యో అని ఏడిచేటట్టుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.


’తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ – ఇదొక గొప్పమాట. అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తితో తిరుగుతున్న వారెవరు?


బ్రాహ్మి – మాహేశ్వరి – వైష్ణవి – మహేంద్రి


చాముండ – కౌమారి – వారాహి – మహాలక్ష్మి


మనకి సంప్రదాయంలో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి.


ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని ’అష్టమాతృకలు’ అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.


 "రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతామ్ "",  


 అని అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక – ఆవిడ లలితా పరాభట్టారిక – ఆ అమ్మ మాయమ్మ.


’మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ – ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్త్వ,  కవిత్వ, పటుత్వ,  సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చేయ్యాలి.


అమ్మవారికి ’శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐంహ్రీంశ్రీంక్లీంసౌః – ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము ’ఓం’, కవిత్వమునకు బీజాక్షరము ’ఐం’, పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము ’హ్రీం”, ఆ తర్వాత్ సంపదల్ – లక్ష్మీదేవి – ’శ్రీం’.


ఇపుడు ’ఓంఐంహ్రీంశ్రీం’ – అమ్మలగన్నయమ్మ *’శ్రీమాత్రేనమః’*


మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు. కానీ మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చెయ్యకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా.


అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ –

అంటున్నారనుకోండి అపుడు మీరు మరోరూపంలో ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ – ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ అనేస్తున్నారు.


మీరు అస్తమాననూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. అపుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం ’శ్రీమాతా’ అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది.


ఆవిడ రాజరాజేశ్వరి. అయినా ఆవిడముందు అమ్మా అమ్మా అనేసరికి ఆవిడి పొంగిపోతుంది. ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవడం చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది. ఇప్పుడు మీరు ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రే నమః’ అనలేకపోవచ్చు, లేదా  గురువు ముఖతా  ఉపదేశము లేదు కదా,,, 


కానీ ’అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ ’ 

అనడానికి కష్టం ఏమిటి ?


ఈవిధంగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి తెలుగు వారందరికీ ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు ఆయన ఒక ఋషి,, నిజానికి మనకాలానికి "బ్రహ్మర్షి "అందుకని మనకు ఈ  పద్యమును అనుగ్రహించినారు.....


                 || ఓం శ్రీ మాత్రే నమః ||

From FB...