Monday, September 28, 2020 0 comments By: visalakshi

గంగాధరేశ్వర స్వామి ఆలయం..

 


#శివగంగ- కర్ణాటక*


     

అభిషేకం చేసే నెయ్యి వెన్నగా మారే అద్భుతం ఈ ఆలయం ప్రత్యేకం


    శివాలయంలో '1600' సంవత్సరాల నుండి జరుగుతున్న అద్భుతం సైన్స్ కు అందని వాస్తవం...


 “నెయ్యి- అభిషేకం” చేసినప్పుడు, నెయ్యి వెన్నగా మారుతుంది...శివానుగ్రహం... తన ఉనికిని పరమేశ్వరుడు చెబుతున్నట్టే ఉండే ధార్మిక దివ్య చైతన్య రహస్యం...


 కర్ణాటక రాష్ట్రం తుముకూరు

 గంగాధరేశ్వర స్వామి   ఆలయం లో జరిగే మర్మమైన ఈ విషయం అంతుపట్టని శివవైభవం.


శివలింగంపై నెయ్యితో అభిషేకం చేసినప్పుడు, నెయ్యి వెన్నగా మారడం  అభిషేకం సమయంలో భక్తులు ప్రత్యక్షంగా చూసే వరం.   


వెన్నగా మారే నెయ్యికి ఔషధ శక్తులు ఉన్నాయని, అనేక రోగాలను నయం చేస్తాయని కూడా భక్తులు విశ్వసిస్తారు.

 

 ఈ అద్భుతం 1600 సంవత్సరాల నుండి ఆలయంలో జరుగుతోంది. అయితే ఇది ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు ఎవరూ కనుగొనలేకపోయారు.. ప్రతి ఒక్కరూ ఆలయాన్ని సందర్శించి వారి కళ్ళ ముందు జరిగే అద్భుతాన్ని చూసితీరాల్సిందే.


 ఈ ఆలయం కర్ణాటక రాజధాని నుండి 54 కిలోమీటర్లు, 

 శివగంగే పర్వత శిఖరంపై తుమకూరు నుండి 19 కిలోమీటర్లు 804.8 మీటర్లు లేదా 2640.3 అడుగుల ఎత్తులో ఉంది. 


పవిత్ర పర్వతం శివలింగ ఆకారంలో ఉంది మరియు స్థానికంగా "గంగా" అని పిలువబడే ఒక నీటిధార ప్రవహిస్తుంది, తద్వారా ఈ ప్రదేశానికి దాని పేరు వస్తుంది. కొండపై చారిత్రాత్మక శిలమైన నంది లేదా బసవన్న నిటారుగా ఉన్న శిల పైన చెక్కబడినది.


శివయ్య కొలువైఉన్న పర్వతం 

శివలింగాకృతిని పోలి ఉంటుంది.


 పర్వతం నుండి నిత్యం పారే జలాధార శివయ్య శిరస్సు నుండి జాలువారే గంగమ్మ ను తలిపిస్తుంది


 పర్వతం పై కొలువైఉన్న దేవాలయాలు, ప్రమధగణాలు సాక్షాత్ కైలాస శిఖరం పై ఉన్న భావనకు వేదికలవుతాయి.


 పర్వతం చుట్టూ ప్రవహించే నీటిలో స్నానం  పుణ్యప్రదమని,సకలపాప హరణమని భక్తులు విశ్వసిస్తారు.


 అభిషేక సమయంలో పరమేశ్వరునికి సమర్పించే నెయ్యి వెన్నగా మారడం అద్భుతమైన అనుగ్రహం


ఇలా అనేక విశిష్ఠతల సమాహారం శివగంగ దివ్య క్షేత్రం


 ఈ క్షేత్రాన్ని 'దక్షిణ కాశీ' గా పిలుస్తారు.

 

పర్వతశిఖరం పైన గంగాధరేశ్వరుడు దేవాలయం, హున్నమదేవి ఆలయం,పాతాళగంగా ఆలయం,నందీశ్వరుడు కొలువై ఉన్నారు


 ఈ శిఖరం పైనే శారదాంబ ఆలయం ఈ ఆలయం చూస్తూ అగస్త్య తీర్ధ, కపిల తీర్ధ,కన్వ తీర్ధ,పాతాళ గంగ సరస్సులు ఉన్నాయి.


మకర సంక్రాంతి సందర్భంగా, ఆలయం సాయంత్రం సూర్యరశ్మి నంది కొమ్ముల మధ్య ఒక ఆర్క్ గుండా వెళుతుంది మరియు గుహ లోపల ఉన్న లింగంపై నేరుగా పడి లోపలి విగ్రహాన్ని ప్రకాశిస్తుంది. ఈ దృగ్విషయం పురాతన వాస్తుశిల్పుల సాంకేతిక నైపుణ్యం యొక్క రుజువు


 ఈ ఆలయం యొక్క మరొక ప్రాముఖ్యత ఏమిటంటే, దేవుడి కోసం ఆలయంలో వెలిగించిన దీపం తప్ప వేరే విద్యుత్ శక్తి లేదు.


 ప్రజలు ఈ వెలుగులో మాత్రమే స్వామి వారిని చూస్తారు. చెక్కిన అనేక మంటపాలు కూడా ఉన్నాయి.


ఓం నమశ్శివాయ🙏

సేకరణ... From FB...

Monday, September 21, 2020 0 comments By: visalakshi

మహా మృత్యుంజయ దేవాలయం...

 



#మృత్యుంజయ మంత్రానికి ఆది క్షేత్రం*


మనం నిత్యం చదివే మృత్యుంజయ మంత్రానికి ఆది క్షేత్రం ఇది. 

ఈ మహిమాన్విత ప్రదేశం పేరు జాగేశ్వర్. 


ఉత్తరాఖండ్ లోఆల్మోరా కి సమీపాన (సుమారు 50 కిలోమీటర్లు) ఉంది.


ఇక్కడి స్వామి జాగేశ్వరుడు…

అమ్మవారి పేరు పుష్టీ దేవి. 


#ఇదే దారుకావనం.. 


నిజానికి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఉన్నది

నాగేశం దారుకావనే కాదట.. జాగేశం దారుకావనే అని చెబుతారు. అదే ఈ

జ్యోతిర్లింగం.. 


చుట్టూ దారుకావనం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.


సతీ దేవి తపస్సొనర్చిన గొప్ప క్షేత్రం కూడా ఇదే.


“ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం

ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్”


ఈ మహా మృత్యుంజయ మంత్రంలోని పుష్టి వర్ధనుడే ఈ

స్వామి. 


కోవెల ద్వారపాలకులుగా నంది మరియు స్కంది వుండగా శివుడు పడమర ముఖంగా వుంటాడు.


 ఇక్కడి శివలింగం రెండు భాగాలు కలిపినట్టుగా వుంటుంది. 


దీనిని అర్ధనారీశ్వర శివలింగమని, పెద్దగా వున్న భాగం శివుడని, కాస్త చిన్నగా వున్న భాగం పార్వతని అంటారు. 


ఈ శివలింగాన్ని చేత్తో కదిపితే కదులుతుంది. అన్ని శివాలయాలలోను శివుడు యోగనిద్రలో వుండి హారతి సమయాలలో మాత్రమే జాగరూకుడై భక్తులను అనుగ్రహిస్తాడుట కాని యిక్కడ సర్వకాల సర్వావస్థల యందు జాగ్రదావస్థలో వుండి భక్తులను అనుగ్రహిస్తాడుట అందుకని ఈ ఈశ్వరుని "జాగేశ్వరమహదేవ్ " అని అంటారు. 


శివలింగానికి వెనుక వైపున చందరాజులైన దీప్ చంద్ , త్రిపాల చంద్ ల అష్ఠలోహ విగ్రహాలు అఖండ జ్యోతి వుంటాయి. 


ఇక్కడ మరో విశేషం ఏంటంటే గర్భ గుడిలో కుడివైపున పట్టు పరుపు పై రాత్రి స్వామికి పవ్వళింపు సేవ చేస్తారు. 


రాత్రి చక్కగా పరచిన పక్క మరునాడు నలిగి వుంటుందిట స్వామి స్వయంగా పవ్వళించినట్లుగా స్థానికులు భావిస్తారు. 


కోవెలలో యెలుకలు లాంటివి వున్నాయేమో అనే సందేహం వెలిబుచ్చితే ఆ వూరు మొత్తం మీద యెలుకలు లేవని తెలిసింది.. 


ఆది శంకరా చార్యుల తో వచ్చిన కర్ణాటక బ్రాహ్మణులు యిక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ యిక్కడే వుండిపోయి కాలక్రమం యిక్కడి పిల్లలని పెళ్లి చేసుకొని యిక్కడే స్థిరబడ్డారు. వారి సంతతి వారే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


సేకరణ..

(FROM FB)

Sunday, September 20, 2020 1 comments By: visalakshi

పెద్ద వయస్సు- భాధ్యత

 


పెద్దవయసు - గౌరవం


పెద్దతనం వచ్చింది అనగానే కొన్ని విషయాలు మనం వదిలి వేయాలి.

పట్టుకోవటం కష్టం కానీ వదిలివేయటంలో బాధ ఏమిటి చెప్పండి?

అలా అనుమానంగా చూడకండి... ఏమి వదిలివేయాలో చూద్దామా ..

"అమ్మాయి!! గ్యాసు కట్టేసావా!! గీజర్ ఆఫ్ చేసావా??  ఏ.సి. ఆన్ లో ఉన్నట్లుంది.. పాలు ఫ్రిజ్ లో పెట్టావా ?? కరెంట్ బిల్లు కట్టారా !!!" లాంటి ఎంక్వయిరీలు వదిలి వేయండి !!!

"మా కొడుకు కోడలు పట్టించుకోరు"  అని హైరానా పడకండి.. 


ఇలా పట్టించుకుంటూ.. 60..70 ఏళ్ళు గడిపారు, ఇంకా ఎంతకాలం ??   ఇది వాళ్ళ హయాంలో వాళ్ళిష్టం .. కష్టనష్టాలు కూడా వాళ్ళవే !!  చూడండి అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండగలరో..  "నా అభిప్రాయం ఏమిటంటే" అని అనటం తగ్గించి.. 

"నీ ఇష్టం, నువ్వు చెప్పు" అని వాళ్ళ ఇష్టాయిష్టాలతో వాళ్ళని బ్రతకనిద్దామా!! 


'నాకూ తెలుసు' తో పాటు 'నాకు మాత్రమే తెలుసు' అనే అహం తగ్గించుకుని, వాళ్ళకి చాలా విషయాలు, టెక్నాలజీ 'నాకంటే ఎక్కువ తెలుసు' కదా అనే నిజాన్ని ఠక్కున ఒప్పేసుకోండి..  మీ మంచికేనండీ చెబుతున్నాను ...


"మా కాలంలో", 

"మా చిన్నప్పుడు" అంటూ వీలు చిక్కినప్పుడల్లా వారిని ఊదరకొట్టకండి.  వారి ముఖాల్లో కనిపించే విసుగుని చూడనట్లు నటించకండి.  మన పిల్లలు కోసం వచ్చేవారితో మితంగా మాట్లాడండి.  వాళ్ళు మనకోసం రాలేదు అని గుర్తుంచుకోండి.  కాసేపు మాట్లాడాక లేచి గదిలోకి వెళ్ళిపోగలిగే మనోనిగ్రహం అలవరుచుకోండి ..


పెద్దవారిని పలకరించే మర్యాదతో ఒక ప్రశ్న ఎవరైనా సహజంగా అడుగుతారు... "ఆరోగ్యం బాగుంది కదా" అని.   దయచేసి వెంటనే  స్పందించకండి...

మన బి.పి..... షుగర్.. కీళ్ళనొప్పులు .. నిద్ర పట్టకపోవటం,.. నీరసం అంత రసవత్తరమైన విషయం కాదని సదా సర్వదా గుర్తుంచుకోవాలండీ బాబూ !!!  మనకి తోచక కాలక్షేపానికి ఎంత ఆలోచించినా ఎదుటివాళ్ళకి దాంట్లో అంతే ఇంట్రెస్ట్ ఏం ఉంటుంది చెప్పండి.. "బాబోయ్ !! ఎందుకు అడిగామా" అనే పశ్చాత్తాపం వారికి కలిగించకండి.. 


ఇంకొక విషయం...

ఎవరో పెద్దాయన అన్నాడు... 

"మన అనుభవం తో వారిని తీర్చి దిద్దాలి కదా!" అని.

 కాలం మారింది... మారుతున్నది.. 

"రోట్లో కందిపచ్చడి రుబ్బటం.. తిరగలితో విసరటం.. కట్టెల పొయ్యి మీద వంట చేయటం, కవ్వంతో మజ్జిగ చిలకటంలో గల నా అనుభవం నేటి తరానికి ఎలా ఉపయోగపడుతుంది ??"


ఉద్యోగాలైనా అంతే ! పద్దతులు మారుతున్నాయి.. టెక్నాలజీ అన్నింటా చోటు చేసుకుంటున్నది.... విమానంలో ప్రయాణించే వారికి ఎర్రబస్సు లో సీటు ఎలా పట్టుకోవాలో చెప్పి ఏం ప్రయోజనం ??


*చివరగా పెద్దతనంలో మన పరువు కాపాడుకోవటం పూర్తిగా ... పూర్తిగా మన చేతుల్లోనే ఉందండీ !!  అనవసరం విషయాల్లో జోక్యం చేసుకోకుండా... మితభాషిగా వుంటూ... మన ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోకుండా... ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ... జిహ్వ చాపల్యం తగ్గించుకుని... అన్నింటికంటే ముఖ్యమైన విషయం "నన్ను ఎవరూ గౌరవించటం లేదు" అనే ఆత్మన్యూనతా భావం దరి చేరకుండా జాగ్రత్తపడాలి...*


భావం, బంధాలు, అంత తేలికగా తగ్గించుకోలేము.. కనీసం కొన్ని విషయాలను వదిలివేద్దాం.. పాజిటివ్ గా చూడండి...  ఉద్యోగానికి పరిగెత్తాలనే హడావిడి లేదు... మొత్తం సంసారాన్ని లాగే బాధ్యత లేదు... పిల్లలకి సహకరిస్తున్నామనే తృప్తి ఉండనే ఉంది.. 


హాయిగా పూజలు చేసుకోవచ్చు.. భగవద్గీత, భాగవతం చదువుకోచ్చు.. దైవదర్శనం చేసుకోవచ్చు.. చిన్న చిన్న హాబీలు మనసు కి ఆహ్లాదాన్నిస్తాయి.. వాటికి సమయం కేటాయించవచ్చు.. 


*ఒక మాటని రోజూ అనుకుందాం.. "I love myself...  I respect my self " ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది..* 


చివరగా............ మనం దిగవలసిన స్టేషన్ దగ్గరలోనే వుంది ...  Platform అదిగో ..... సమయం దగ్గర పడింది.  


ఇక మనకి బోగీలో ఉన్నవారితో  తగువులు... మనస్పర్థలు  ఎత్తిపొడుపు మాటలు అవసరం అంటారా... 

*మనం దిగుతుంటే వారి ముఖాల్లో 'హమ్మయ్య' అనే  భావం కనిపించాలో లేక 'అయ్యో అప్పుడే స్టేషన్ వచ్చేసిందా' అనే భావం కనిపించాలో నిర్ణయం మన చేతిలోనే ఉంది ...*


పెద్దతనం మనకి వరంలాంటిది ... అది ముఖ్యంగా మన 'అహం' తగ్గించి, మనకి జీవితం అంటే ఏమిటో, మన నిజమైన విలువ ఏమిటో ‌సరియైన అవగాహన కల్పిస్తుంది ... కాబట్టి అందరూ వృద్ధాప్యాన్ని ఆనందంగా స్వాగతించాలి సుమండీ !!! 

*నస అనిపించుకునే కంటే nice అనిపించుకోవడం మంచిది కదా!*


ఇది నాకు ఎవరో  పంపారు.  బాగుందని మీకు పంపుతున్నాను. 

👏👌🙏👍😊

చాలా బాగుంది.. చక్కగా వివరించారు.. ఈ మెసేజ్... ఇక నా అభిప్రాయం.. పెద్దతనం మనకి వరమే..కానీ కొన్ని సందర్భాల్లో మన వ్యక్తిత్వాన్ని కాదని వారి (పిల్లల)అడుగు జాడలో నడవమనడం సమంజసం కాదు కదా!.మన ఆలోచనలకు విలువ ఇస్తే ఆధ్యాత్మికంగా పరిణితి చెందిన వారవుతారు..మనతో పాటు వారి ఆత్మవిశ్వాసం ను పెంపొందించి అన్ని విషయాలలో ప్రోత్సాహం ఇవ్వాలి..మనం ఏదైనా చనువుగా చెప్పినపుడు ఎంత సహజంగా తీసుకుని సమ్మతిస్తారో..అదే విధంగా మనం కూడా వారి మాటలకు విలువిచ్చి సున్నితంగా తీసుకోగలగాలి...(నస)అనుకున్నా మనం తెలిపే విషయ వివేకం..విలువైన విషయాలు ఆలోచింప జేస్తాయి..Future లో అయినా అమ్మ, నాన్న చెప్పినవి అక్షర సత్యం అని గుర్తిస్తారు కదా!..అన్నింటినీ తెలియజేయాల్సిన థర్మం మనది..ఆచరణ..ఆమోదం..వారికి మాత్రమే వదిలేసి.. మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చాలి..ఐని నా అభిప్రాయం...

పట్టుకోవద్దు...పూర్తిగా వదిలేయద్దు...నిమిత్తమాత్రంగా ఉంటూ..అవసరానికి ఆసరాగా.. ఉందాం..ఒకరికొకరు అండగా ఉందాం.. అదే జీవన పయనం...

Saturday, September 19, 2020 0 comments By: visalakshi

ప్రార్థన - ఆర్తి...

 

 #ప్రార్థన*


పరకాయ ప్రవేశంతో రాజు దేహంలోకి ప్రవేశించిన శంకరాచార్యులు వారు చాలా కాలం వరకు తిరిగి రాకపోయే సరికి ఇంక రారు అని నిర్ణయించుకున్న శిష్యులు దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించి కార్యం చేస్తారు శంకరాచార్యులు వారి దేహానికి నిప్పు పెట్టిన విషయం గ్రహించిన శంకరాచార్యులు వారు తిరిగి దేహంలోకి ప్రవేశించే సమయానికి దేహం దహనం అవుతుంది అని తెలుసుకుని నరసింహ స్వామిని ప్రార్ధిస్తారు. భక్తితో ఆర్తీతో చేసిన ప్రార్ధన ఆలకించిన స్వామి  శంకరాచార్యులు వారి దేహానికి పెట్టిన మంటలను చల్లార్చి రక్షిస్తాడు, అదే ఈ అద్భుతమైన శ్లోకం ఎటువంటి ప్రాణాపాయ స్థితిలో అయినా అనారోగ్యంతో ఉన్నవారు అయినా ఈ స్త్రోత్ర పారాయణ చేసి వేడుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది.


**శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రమ్**


1:: శ్రీమత్ప యోనిధి నికేతన చక్రపాణే! భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే !

యోగీ శ శాశ్వత శరణ్య! భవాబ్ది పోత! లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలమ్బమ్ ||


తా:: పాలసముద్రము నివాసముగాగల ఓ దేవా! హస్తమున చక్రమును ధరించినవాడా ! ఆది శేషుని పడగలయందలి రత్నములచే ప్రకాశించు దివ్య దేహము కలవాడా! యోగులకు ప్రభువైన వాడా! శాశ్వతుడా! సంసార సాగరమునకు నావ యగువాడా! లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము.


2::బ్రహ్మేంద్ర రుద్రా మరుదర్క కిరీటకోటి - సంఘటి తాఘ్రి కమలామల కాంతికాంత!

లక్ష్మీ ల సత్కుచ న రో రు హరాజహంస - లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలమ్బమ్ || 


తా:: బ్రహ్మ, దేవేంద్రుడు, శివుడు, వాయుదేవుడు, సూర్యుడు అను దేవతల కిరీటముల అంచులచే తాకబడిన పాదపద్మముల కాంతిచే ప్రకాశించు వాడా! లక్ష్మీ దేవి యొక్క అందమైన  స్తనములనెడి తామర మొగ్గలకు రాజహంస యైన వాడా! ఓ లక్ష్మీ నృసింహాదేవా! నాకు చీయూత నొసగుము.


3::సంసార సాగర విశాలాక రాళ కాల - నక్ర గ్ర హగ్ర సన నిగ్ర హ విగ్ర హాస్య |

వ్యగ్ర స్య రాగర సనో ర్మి నిపీడిత స్య - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా:: ఓ దేవా నేను సంసారమనెడి సముద్రములో మునిగి, భయంకరములై, పెద్ద వైన కోరికలనెడి మొసళ్ళు మున్నగు క్రూర జల చరములచే మ్రింగ బడుచున్నాను. రాగ మనెడి ధ్వనించు అలలచే బాదింపబడుచున్నాను. ఓ నృసింహ దేవా! అట్టి నాకు చేయూత నిచ్చి నన్నుద్ధరింపుము.


4::సంసార ఘోర గహనే చరతో మురారే ! మారో గ్రభీ కర మృగ ప్రచురార్ధి తస్య |

ఆర్తస్య మత్సర నిదాఘుణి పీడితస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ || 


తా::ఓ మురారీ! నేను సంసార మనెడి ఘోరమైన అరణ్యములో సంచరించుచున్నాను. అందు మన్మథుడనెడి భయంకరమైన క్రూర మృగము నన్ను పట్టి మిక్కిలి పీడించుచున్నది. మత్సరమను మండువేసవి బాధింపగా మిక్కిలి దుఃఖించుచున్నాను. ఓ నృసింహ దేవా! ఆర్తుడైన నాకు రావలంబన మిచ్చి కాపాడుము.


5::సంసార కూప మటి ఘోర మగాధ మూలం - సంప్రాప్య దుఃఖశత సర్ప సమాకులస్య ,

దీన స్య దేవ కృపాయా పద మాగాతస్య  - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా::ఓ నరసింహస్వామీ! సంసారమనునది భయంకరమును, మిక్కిలి లోతైనదియును అగు పాడునుయ్యి . నేను ఆ కూపములో పడిపోయితిని. వందల కొలదిగా ఉన్న దుఃఖములనెడి సర్పములు నన్ను చుట్టుముట్టినవి. గొప్ప ఆపదలో ఉన్నాను. ఓ నృసింహదేవా! దీనుడనైన నాకు చేయూతనిచ్చి యుద్ధరింపుము.


6::సంసార భీకర కరీన్ద్ర కరాభి ఘూత - నిష్పిష్ట మర్మవ వపుషః సకలార్తి నాశః !

ప్రాణ ప్రయాణ భవ భీతి సమాకులస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి  కరావలమ్బమ్ ||


తా::దుఃఖములన్నింటిని నశింపజేయునట్టి దేవా! నేను సంసారమనెడి భయంకరమగు ఏనుగునకు చిక్కితిని. అది తొండముతో కొట్టి నా శరీరమును మిక్కిలి పీడించుచున్నది. ప్రాణములు పోవునేమో యను భయముతో మిక్కిలి తల్లడిల్లుచున్నాను. ఓ లక్ష్మీ నరసింహస్వామీ కరావలంబన మొసగి, ఈ సంసార గజబాద నుండి తప్పించుము.


7::సంసార సర్ప ఘనవక్త్ర భాయోగ్ర తీవ్ర - దంష్ట్రా కరాళ విష దగ్ధ వినష్ట మూర్తే :

నాగారి వాహన! సుదాబ్ది నివాస! శౌరే ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి  కరావలమ్బమ్ ||


తా::గరుడవాహనుడవు, పాలకడలి నివాసముగా కలవాడవు, అగు ఓ శౌరీ, సంసారము క్రూరమై, కోరలయందు విషము నిండి యున్న సర్పమువంటిది. దాని కాటువలన విషము శరీరము వ్యాపించి ప్రాణము పోవుచున్నది. నీవు నా ప్రాణములు కాపాడి నన్నుద్దరింపుము.


8::సంసార జాలపతిత స్య జగన్నివాస - సర్వేంద్రి యార్ధ బడి శాగ్ర ఝుషోపమస్య |

ప్రోత్ఖండిత ప్రాచుర తాలిక మస్తకస్య - లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్  ||


తా:::సర్వలోకములు నివాసముగా కల ఓ ప్రభూ! నేను సంసారమనెడు వలలో పడితిని. ఇంద్రియార్ధములనెడు గాలమునకు చిక్కిన చేపవంటివాడును. గాలమున చిక్కిన చేప దవడలు విచ్చి తలపై కెగసి యుండునట్లు - నేనునూ బయటకు రాలేక తపించుచున్నాను. నన్నీ సంసార బాధ నుండి తొలగించి యుద్ధరింపుము.


9::సంసార వృక్ష మఘబీజ మనంత కర్మ- శాఖాయుతం కరణ పత్ర మనజ్గ పుష్పమ్ ||

ఆరుహ్య దుఃఖ ఫలినం పతితో దయాళో - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్  ||


తా::సంసార వృక్షమునకు పాపమే బీజము. సమస్త కర్మలును శాఖలు, ఇంద్రియము లే ఆకులు. మన్మథుడే పూవులు. దుఃఖములే ఫలములు. అట్టి వృక్షము నెక్కి క్రిందపడిపోయితిని. దయాళువగు ఓ నృసింహదేవా! చేయూత నిచ్చి నన్నుద్ధరింపుము.


10::సంసార దావద హనాతురభి కరోరు - జ్వాలావలీ భి రాతి దగ్ధ తనూరు హాస్య,

త్వత్పాద పద్మ సరసీం శరణాగతస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్  ||


తా::సంసారమనెడి కారుచిచ్చు భయంకరములగు గొప్ప జ్వాలలతో నిండి పోయినది. నేను దాని నడుమ చిక్కుకొంటిని. ఆ మంటలు నా శరీర మందలి రోమములను కాల్చి వేయుచున్నవి. ఇక నా శరీరము కూడా దహింపబడును. కాన నిన్ను శరణు జొచ్చితిని. నీ పాద పద్మములనెడి సరస్సు తప్ప తాపము నేదియు చల్లార్చజాలదు. ఓ నృసింహ దేవా! కరుణించి చేయూత నొసగి, ఆ దావాగ్ని నుండి రక్షింపుము.


11::సంసార సాగర నిమజ్జన ముహ్య మానం దీనం విలోకయ విభో! కరుణానిదే! మామ్|

ప్రహ్లాద భేద పరిహార పరావతారః లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా::దయానిధి వైన ఓ ప్రభూ! ప్రహ్లాదుని దుఃఖము పోగొట్టుటకు నరహరి రూపమును ధరించిన దేవా! నేను సంసార సముద్రమున పడి, మునిగి పోయి, ఉక్కిరి బిక్కిరి యగుచున్నాను. దీనావస్థలో నున్న నన్నుద్ధరింపుము.


12::సంసార యూద గజ సంహతి సింహదంష్ట్రా - భీత స్య దుష్ట మతి దైత్య భయంకరేణ |

ప్రాణ ప్రయాణ భవభీ తినివారణే న లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా::ఓ నృసింహ మూర్తీ! నీ స్వరూపము దుష్ట బుద్ధులగు రాక్షసులకు మిగుల భయము కల్గించుచున్నది. సంసార సమూహములనెడి భయమును పోగొట్టునది. అట్టి రూపము ధరించి నాప్రాణములు కాపాడుమ


13::సంసార యోగి సకలే ప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలన్ద్రియ మృత్యునాశ -

సజ్కల్ప సిందు తనయాకు చ కు జ్క మాజ్క ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా::ఓ దేవా! లేనిపోని కోరికలకు సంసారమే కారణము. ఆ కోరికలు నేరవేరుటకై నిత్యమూ ఏవో  చేయవలసి వచ్చుచున్నది. అందువలన నీవు సంకల్పించినచొ అవి అన్నియు నశించును. లక్ష్మీ దేవి యొక్క కుచ కుంకుమచే చిహ్నితమగు వక్ష స్స్థలముకల నృసింహదేవా! నా సంసార బాధలను పోగొట్టి నన్ను రక్షింపుము.


14::బద్ద్వాగళే యమ భటా హుతర్జయన్తః కర్షంతి యత్ర భవపాశశ తైర్యుతం మామ్ |

ఏకాకినం పరవశం చకితం దయాళో | లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా::దయాళువైన ఓ పభూ! యమ భటులు పెక్కు పాశములతో నా మెడను బంధించి, బెదరించుచూ, ఏదారిలోనో నన్నీడ్చుకొని పోవుదురు. అపుడు పరులకు లొంగి, ఒంటరినై, దిగులుపడుచుండు నాకు దిక్కెవ్వరు? నీవే నాకు చేయూత నిచ్చి రక్షింపవలయును.


15::అన్దస్యమే హృత వివేక మహాధన స్య చొ రైర్మ హ బలిభి రిన్ద్రియ నామ దే యై:

మోహన్ద కారకుహరే వినిపాతిత స్య లక్ష్మీ నృసింహ!  మమ దేహి కరావలమ్బమ్ ||


తా::ఓ నరసింహ ప్రభూ! మహాబలవంతులగు ఇంద్రియములనెడి దొంగలు నా వివేక ధనమును దొంగిలించుకొని, అజ్ఞానమును అంధకారపు గుహలో త్రోసివేసిరి. కన్నులు కాన రాకున్నవి. నాకు చేయూత నిచ్చి, ఆ గుహ నుండి బయటకు తీసి నన్నుద్ధరింపుము.


16::లక్ష్మీ పతే! కమలనాభ! సురేశ! విష్ణో ! యజ్ఞేశ ! యజ్ఞ! మధు సూదన! విశ్వరూప

బ్రహ్మణ్య ! కేశవ! జనార్ధన! వాసుదేవ! లక్ష్మీ నృసింహ! మమ దేహి కరవలమ్బమ్ ||


తా::ఓ లక్ష్మీ పతీ ! నీవు పద్మమును నాభి యందు కలవాడవు. దేవతలకు నాయకుడవు. సర్వవ్యాపకుడవు. యజ్ఞములకు అధిపతివి. యజ్ఞ రూపుడవు. మధువను రాక్షసుని  శిక్షించినవాడవు. విశ్వరూపుడవు. బ్రాహ్మణ ప్రియుడవు. బ్రహ్మ, రుద్రుల అంశలు కలవాడవు. జన్మము లేకుండ చేయువాడవు. వసుదేవునకు పుత్రుడవై అవతరించినవాడవు. ఓ నృసింహదేవా! నాకు చేయూత నిమ్ము.


17::ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక వ్యాసాది భాగవత పుంగవ వృన్నివాస|

భక్తా సురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ! మమ దేహి కరవలమ్బమ్ ||


తా::ఓ దేవా ! నీవు ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు, శౌనకుడు, అనువారి హృదయములందు నివసించుచుందువు. భక్తులను, నీపై ప్రేమ కలవారిని కాపాడుటలో కల్పవృక్షము వంటివాడవు. ఓ నరసింహస్వామీ, నాకు చేయూత నొసగి కాపాడుము.


18::ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ - మన్యేన సిన్దు తనయా మవ లంబ్య తిష్ఠన్

వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా::ఓ దేవా! చతుర్భుజుడవగు నీవు ఒక చేత శంఖమును, ఒకచేత చక్రమును, ఒక చేత లక్ష్మీ దేవిని ధరించి, ఒక కుడు చేతితో అభయము నిచ్చు హస్తముద్రను దాల్చి యుందువు. అట్టి మహానీయుడవగు నృసింహ దేవా! చేయూతనోసగి నన్ను కాపాడుము.


19::ఆద్యన్త శూన్య మజమవ్యయ మప్రమేయ - షూదిత్య రుద్రా నిగమాది నుత ప్రభావమ్|

త్వామ్భోది జాన్య మధులోలుప మత్త భ్రుజ్గం - లక్ష్మీ నృసింహ !  మమ దేహి కరావలమ్బమ్ ||


తా::ఓ దేవా! నీవు మొదలు, తుది లేనివాడవు, పుటకయు, నాశనమును లేనివాడవు ఇంతవాడని ఊహింప సాధ్యము సనివాడవు. వేదములు, సూర్యుడు, రుద్రుడు, మున్నగువారు నీ ప్రభావమును కీరించుచుందురు. నీవు లక్ష్మీ దేవి ముఖ పద్మము నందలి మధువు నందు ఆసక్తి గల కొదమ తుమ్మెదవు. నరసింహ స్వరూపుడవగు నీవు నాకు చేయూత నొసగి రక్షింపుము.


20::వారాహరామ నరసింహమాది కాన్తా - క్రీడా విలోల శూలి ప్రవన్ద్య

హంసాత్మకం పత్పరమ హంస విహార లీలం - లక్ష్మి నృసింహ! మమ  దేహి కరావలమ్బమ్ ||


తా::ఓ దేవా! నీవు వరాహ, వామన, నృసింహావ తారముల నెత్తినవాడవు. లక్ష్మీదేవి మున్నగు కాంతలతో క్రీడించుట యందు ఆసక్తి కలవాడవు. బ్రహ్మ, రుద్రాది దేవతలు నీ కేప్పుడునూ నమస్క రించుచుందురు. నీవు పరమహంస రూపుడవు. ఉత్తములగు యోగుల హృదయములందు విహరించుచుందువు. ఓ లక్ష్మీ నృసింహస్వామీ! నాకు చేయూత నిమ్ము.


21::ప్రహ్లాద మానస సరో జవిహార భ్రుజ్గ - గాజ్గ తర జ్గ ధవళాజ్గ రామా స్థితాజ్గ |

శ్రుజ్గర సజ్గర సకిరీట ల సద్వరాజ్గ - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరవలమ్బమ్ ||


తా::ఓ నరసింహదేవా! నీవు ప్రహ్లాదుని మనస్సనెడు కమలమున విహరించు తుమ్మెదయైన వాడవు. గంగాతరంగములవలె తెల్లని దేహము కలవాడవు. లక్ష్మీదేవికి నివాసమగు వక్షః స్థలము కలవాడవు. శ్రుంగారము కలవాడవు. మేలైన కిరీటముతో ప్రకాశించు శిరస్శు కలవాడవు. నీవు నాకు చేయూత నిమ్ము.


22::మాతా నృశింహశ్చ పితా నృసింహః - భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః |

విద్యా నృసింహొ ద్రవిణం నృసింహః - లక్ష్మీ నృసింహ ! మమ  దేహి కరవలమ్బమ్ || 


తా::నాకు నృసింహుడే తల్లి, నృసింహుడే తండ్రి, నృసింహుడే సోదరుడు, నృసింహుడే మిత్రుడు, నృసింహుడే విద్య, నృసింహుడే ధనము, నృసింహుడే ప్రభువు నాకు సమస్తమును ఆ నృసింహుడే !


23::శ్రీ శజ్కరార్యర చితం సతతం మనుష్యః - స్సోత్రం పటేది హతు సర్వగుణ ప్రసన్నమ్ |

సద్యో విముక్త కలుషో మునివర్య గన్యో - లక్ష్మీ నృసింహ ! మమ  దేహి కరవలమ్బమ్ ||


తా::సమస్త గుణములతో కూడి, శంకర భాగవత్పాదులచే రచింపబడిన యీ స్తోత్రమును ఎ మనుష్యుడు ఎల్లప్పుడునూ పటించుచుండునో అతడు వెంటనే పాపములు నశించి పరిశుద్ధుడై, మునులచే పొగడబడు విష్ణులోకమగు వైకుంటమును పొందును.


24::యన్మాయార్జిత భవ ప్రచుర ప్రవాహా - మగ్నార్త మర్త్యనివ హేషు కరావలమ్బమ్,

లక్ష్మీ నృసింహ చరనాబ్జ మధువ్రతేనా - లక్ష్మీ నృసింహ! మమదేహి కరావలమ్బమ్ ||


తా::మాయా ప్రభావమున అజ్ఞానమునందు పడి, పెక్కు జన్మములను పొందుచూ, బాధల ననుభవించుచూ మనుష్యులకు ఈ స్తోత్రము తరించుటకు చేయూత అయినది. దీనిని లక్ష్మీ నరసింహస్వామి పాదపద్మములకు తుమ్మెద వంటి వారగు శ్రీ శంకరాచార్యులు రచించిరి.


25::శ్రీమాన్న్రుసింహ విభవే గరుడ ధ్వజాయ - తాపత్ర యో పశామనాయ భావౌషదాయ |

త్రుష్ణారి వృశ్చిక జలాగ్నిభుజ జ్గరోగ - లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలమ్బమ్ ||


తా::ఓ లక్ష్మీ నరసింహస్వామీ ! నీవు సమస్త లోకములకు ప్రభువువు. గరుడధ్వజుడవు. తాపత్రయమును నశింపజేయువాడవు. సంసారములనెడి రోగములకు ఓషదము వంటివాడవు. ఆకలి దప్పులు, తేళ్ళు, అగ్ని, జలము, పాములు, రోగములు మున్నగు వానివలన కలుగు బాధలను నశింపజేయువాడవు. పాపములు హరించు వాడవు. గురువైన వాడవు. అట్టి నీకివే మా నమస్కారములు.


#ఇతి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం సంపూర్ణమ్*

#దేవాలయాలకు వెళ్లవలెనా ?


{శ్రీ జయేంద్ర సరస్వతీ స్వాములవారి అనుగ్రహ భాషణములనుండి}


దైవారాధనకు చాలా పద్ధతులున్నాయి. మానసిక పరిపక్వత కల్గినవారు ఏకాంతంగా ఒక గదిలో కూర్చొని మానసికమైన ధ్యానం చేసుకోగలరు. మనస్సును నియంత్రణ చేయలేనివారు దేవాలయంలో వలెనే తమ ఇండ్లలో విగ్రహాలు పెట్టుకొని మంత్ర పఠనంతో అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. తమ ఇండ్లలో ఈ కార్యక్రమం నిర్వహించటానికి అవకాశం లేనివారు ఆలయాలకు వెళ్లి అక్కడ ఈ విధులను నిర్వర్తించి భగవదనుగ్రహాన్ని పొందుతారు.


మానవుని దుఃఖాల్ని ఉపశమింప చేయగల దివ్యౌషధం పరమాత్ముని యందు మనంలగ్నం చేసే స్థిరమైన భక్తి విశ్వాసాలే. మన బాధల్ని అధిగమించటానికి ఆవశ్యకమైన దార్ధ్యతను భక్తి సమకూరుస్తుంది. అలాంటి భక్తిని పెంచి పోషించే నిలయాలే ఆలయాలు. ఈ లక్ష్యంతోనే దేవాలయాలు నిర్మింపబడుతున్నాయి.

భగవంతుని తమ గృహాల్లో ఆరాధించేవారు దేవాలయాలకు వెళ్లవలెనా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ”అవును. వెళ్లాల్సిందే” అనేదే దానికి సమాధానం. ప్రతివాడు సాయంత్రం 6-30 గం.లకు అనగా ప్రదోషకాలంలో దేవాలయానికి వెళ్లి దైవదర్శనం తప్పని సరిగా చేసుకోవాలనేది మన మతం మనకిచ్చే ప్రత్యేక ఆదేశం. దేవాలయంలోని దేవత నారాధించుటను మనం ఒక ఆజ్ఞగా శిరసావహించాలి.


సర్వవ్యాపకుడైన దైవాన్ని ఆరాధించటానికి దేవాలయాల్లోకే వెళ్లాలా అని వేదాంతులు, పండితులు అప్పుడప్పుడు ప్రశ్నిస్తుంటారు. పరమాత్ముని ప్రతి వస్తువులోను చూడగల ఉచ్చస్థితికి మనం రాగల్గితే నిశ్చయంగా మనం ఆలయ దర్శనం చేయనవసరం లేదు. కాని మనం మన చేతులకున్న కాలుష్యాన్ని దేవాలయ గోడలపై రుద్ది ఆ గోడల్ని కలుషితం చేసే సమయంలో గోడల్లో దేవుని ఉనికిని భావిస్తామా? ఆ సందర్భంలో భగవానుడు గర్భగుడిలో మాత్రమే వుంటాడని తలుస్తాం. అలా భావించటం కూడ మంచిదే. అలాంటి విశ్వాసంతో దైవదర్శనం చేసికొని, ధ్యానించి దేవునిపై భక్తిని పెంపొందించుకొని భగవానుని సర్వవ్యాపకత్వాన్ని గురించి ఆలోచించే స్థాయికి చేరుకోగల్గుతారు. ఇలా దైవభక్తితో బహుసంఖ్యలో ఆలయాల్లో సమావేశమయ్యే ఆచారం మొత్తం దేశానికే శ్రేయోదాయకం.


మనం ఆలయాల్లో చేసే దైవారాధన మనగోత్ర నామాలు, జన్మనక్షత్రం మొదలైనవి చెప్పింతర్వాత ప్రారంభింప బడుతుంది. ప్రతివాడు తన యోగక్షేమం కొరకే దైవప్రార్థన చేస్తాడు. కనీసం తన కుటుంబ శ్రేయస్సును కూడ అర్థించడు. కాని మానసిక ధ్యానం చేసేవారు మాత్రం నిష్కామంగా ధ్యానజపం ఆచరిస్తారు. ప్రత్యేకమైన శ్రేయస్సులను తాము, తమ కుటుంబం సాధించుకోటానికి ప్రత్యేకమైన పూజావిధానాలున్నాయి.


ప్రతిదేవాలయంలోను నిత్యపూజలుంటాయి. అవి నిర్వర్తించిన తర్వాతే వ్యక్తులు తమ శ్రేయస్సుకోరి తమ గోత్రనామాలతో చేయించే పూజలు, అభిషేకాలు నిర్వహింపబడతాయి. ఇవిగాక సమాజ శ్రేయస్సు లక్ష్యంగా చేసే పూజలు కూడ ఉంటాయి. వీటిని పరార్థ పూజలంటాం. దేవాలయాలు దేశం మొత్తం ప్రజల శ్రేయస్సు కొరకు ఉద్దేశింపబడినవే. అచ్చట అందరు సమానులే. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువా అనే భావనకు అవకాశం లేదు. దేవాలయ కార్యక్రమ నిర్వహణలో అందరకు బాధ్యత ఉంది. ప్రతి ఆలయానికి ఒక సేవాసంఘం లేక సేవాసమితి ఉండవచ్చు. కాని దానికి ప్రత్యేక అధికారాలుగాని, హక్కులు గాని ఉండవు. కనుక ప్రజలందరు సమాన హక్కులను అనుభవిస్తూ, సేవానిరతిలో దేవాలయ కార్యక్రమాల్ని జయప్రదం చేయటానికి పూనుకోవాలి.


విగ్రహానికి పూజలు చేసేటప్పుడు ఔపచారిక క్రియలు చాలా నిర్వహిస్తాం. ఇంత క్రియాకలాపంతో కూడిన ఆరాధనను మనం ఎందుకు చేయాలి అనే ప్రశ్న ఎవరైనా అడగవచ్చు. కేవలం ప్రార్థన చేస్తే చాలదా ? దానికి సమాధానం లేకపోలేదు. మనం అనుభవించే ప్రతి వస్తువు భగవత్ప్రసాదితమే అనే భావనతో కృతజ్ఞతా పూర్వకంగా ఆయనకు ప్రీతియైన పదార్థాలను ఆయనకు నివేదించుంటే ఈ క్రియాకలాపాల అంతరార్థం.

అంతేగాక ప్రపంచంలో మనం అనుభవించే ప్రతి వస్తువునకు ఆధారభూతుడు భగవానుడే. వానిని నమ్రతతో ఆయన పాదాలవద్ద సమర్పించి తిరిగి వాటిని స్వీకరిస్తే మన ఆపదలన్నీ పటాపంచలౌతాయి. ఈప్సితార్థాలన్నీ నెరవేరుతాయి. ఆయన కరుణా కటాక్షానికి పాత్రులమయ్యామనే ఆనందం మనకు దక్కుతుంది. భగవంతునకు మనం చేసే అర్పణల వెనుకనున్న ఆంతరంగిక భావన ఇదే.

(From FB)....


Thursday, September 10, 2020 0 comments By: visalakshi

స్మరణ-ఆరాధన...

 #దేహలీ దీప న్యాయము"


🍁🍁🍁🍁

దేహలీ అంటే సంస్కృతంలో ఇంటి గడప అని అర్థం. దీపం ఇంటి గడప లోపల ఉంచితే ప్రకాశం ఇంటిలోపలే ఉంటుంది . దీపం ఇంటి బయట గడప అవతల ఉంచితే  ప్రకాశం వీధి లో ఉంటుంది. అదే దీపం గడప మీద పెడితే ఇంటా బయట కూడా ప్రకాశం ఉంటుంది.  దీనినే దేహలీ దీప న్యాయము అంటారు.


 ఏవిధంగా గడప మీద దీపము లోపల , బయటా చీకటి ని నశింపజేస్తుందో , అదే విధంగా మన అంతరంగపు  ఆలోచనలలో దాగి ఉన్న అజ్ఞానాంధకారము, మన బాహ్యంలో మనము నిర్వహించే కార్యము లలో వ్యాపించిన అంధకారము , రెండింటినీ తరిమి కొట్టాలంటే  గడప మీద దీపము ఉంచినట్లు నాలుక మీద నామస్మరణ కదలాలి. 


నామస్మరణ కదిలితే  బాహ్యాభ్యంతరాలలోని అవిద్యాంధకారము చెదిరిపోతుంది.   


 కాపలాదారుడు గడప వద్దనే నిల్చుని శత్రువులను,

చోరులను రానివ్వకుండా చూస్తాడు. అదే విధంగా గడప మీద దీపము లాగ నామస్మరణ హృదయ గడప వద్ద మారు మ్రోగుతూ ఉంటే కామ,క్రోధాది అరిషడ్వర్గాలు అనే శత్రువులను చెదరగొట్టవచ్చును. ఇదియే దేహలీ దీప న్యాయము అని అంటారు.


🍁🍁🍁




శ్యామాగా పిలవబడే సాయిబాబా భక్తుని అసలుపేరు మాధవరావ్‌ దేశపాండే. సాయి ఎన్ని విచిత్ర లీలలు చూపిస్తారో, భక్తుల జీవితాలలో అన్ని విచిత్రాలు కనబడతాయి. కపర్దే అనే ఒక భక్తునికి ప్రతిదినం దినచర్య వ్రాసుకునే అలవాటున్నది. ఆయన డిసెంబరు8, 1911న జరిగిన సంఘటనను డైరీలో వ్రాసుకున్నారు. మాధవరావు దేశపాండే(శ్యామా) ఇక్కడ నిద్రపోతున్నాడు. విశేషమొకటి చూశాను. అతని ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసములలో శ్రీసాయినాథ్‌ మహారాజ్‌, సాయినాథ్‌ బాబా అనే శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. అతడు గురక పెడుతున్నప్పుడు అదెంతో దూరానికి వినిపిస్తోంది. ఇది కపర్దే సమక్షంలో జరిగిన యదార్థ సంఘటన. మాండలికుడు యువరాజు. అతనికి చిన్నతనము నందే భక్తి వైరాగ్యములు అలవడ్డాయి. తల్లిదండ్రులు ఒకసారి ఆనందమును, మరోసారి దుఃఖమును పొందు చుండేవారు. కుమారుని పరిస్థితిని చూచి రాజ్యము, వైభవము, ఐశ్వర్యము విడిచి సన్యాసి అవుతాడేమోననేది వారి దుఃఖం. ప్రహ్లాదుని వలె శ్రీహరి కటాక్షమును పొందుతాడనే ఆనందము. అలా కాలం గడుస్తోంది. మాండలికుడు రాజయ్యాడు. వివాహమయింది. భార్యపేరు సులక్షణ. ఈమె కూడ విద్యావతి భక్తురాలు. కాని మాండలికుడు భక్తుడయినను కీర్తనము,పూజ, భజనము మొదలగు భక్తి కార్యక్రమ ములలో పాల్గొనడు. ఆమె తన భర్తను ఎందుకు భక్తి కార్యక్రమ ములలో పాల్గొనుట లేదని అడిగింది. అతడు ప్రియా! నీ హితోపదేశము చాలా విలువైనది. దానికి నాకెంతయో ఆనందమైనది. అయితే మా తండ్రి రాజ్యభారమును నాపై మోపినారు. పూజాదిక ప్రవృత్తుడయినచో రాజ్యకార్యములపై శ్రద్ధ ఉంచుటకు సమయము ఉండదు. పూజాదులలో కాలము గడుపుచున్న, శత్రురాజులు దండెత్తుదురు. జయము ఎవరికి కలిగినను రక్తపాతము కలుగును. ఏమి చేయుచున్నను శ్రీహరి నా హృదయమున నిల్చియేయున్నాడు అని పలికాడు. భర్తతో వాదోపవాదమునకు దిగుట సమంజసము కాదని, ఆమె ప్రస్తుతము ఊరకున్నది.


ఒకనాటి రాత్రిమాండలికుడు గాఢముగా నిద్రిస్తున్నాడు. అతని నోటి నుంచి రామనామము వెడలుచున్నది. నిద్రపట్టని ఆతని భార్య తన భర్త నోటి నుండి రామనామము వెడలుట చూచి ఆశ్చర్యపడ్డది. ఆతనిలో రామనామము ఉండి బహిర్గతమై తుదకు కట్టతెగిన చెరువు నుండి నీరు ప్రవాహించు నట్లు రామోనామోచ్చరణ కొనసాగుచున్నది. సులక్షణ సంతసమునకు హద్దు లేదు. తన భర్త మానసికారాధన చేయుచున్నాడని గ్రహించినది. ఆ విషయమును తన వద్ద గుప్తముగా ఉంచుచున్నాడని తెలుసుకున్నది. అలా ఒక రాత్రి కాదు. ప్రతి రాత్రియు రామనామము మాండలికుని నోటివెంట వెలువడుచున్నది ధారావాహికముగా.


ఆ సంతోషముతో, ఆమె ఒకనాడు భర్తకు చెప్పకుండా ద్వాదశి దినము నాడు ప్రజలకు అన్నదానము చేయుచున్నది. మాండలికుడు ”అదేమిటి సందడిగానున్నది? అని ప్రశ్నించాడు. ఆమె అలా చేయటానికి కారణాన్ని సంతోషంగా వివరించింది. ఎంత పనిచేశావు దేవి? భక్తి అనేది ప్రదర్శన కొరకా? అన్నాడు రాజు. మీ భక్తి ప్రపత్తులు ప్రజలకు స్ఫూర్తిదాయకములు అవవలెను కదా అన్నది భార్య. భక్తి అంటే భగవంతునిలో ఐక్యస్థితియే గాని వేరుగాదు. భక్తుడే కరిగిపోతున్నప్పుడు ఇతరులకు స్ఫూర్తిని ఎలా కలుగచేసేది. ఇతరులకు స్ఫూర్తిని కలిగించేది దైవమే. వేరెవరు కాదు అన్నాడు రాజు. భక్తి ప్రకటన సామాగ్రి కాదు. ఇతరుల ఆచరణ కొరకు చేసేది భక్తి కాదు.




#శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ...



 వాచస్పతి బ్రహ్మశ్రీ డా|| చాగంటి కోటేశ్వరరావు గారు అనేక సందర్భములలో ప్రాతఃస్మరణీయులు, ఋషితుల్యులైన కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి, వారి కవితా పటుత్వమును గురించీ అనేక ప్రవచనములలో చెప్పియున్నారు. వాటిలోని కొన్ని విశేషములు తెలుగు భాషామతల్లిని మొట్టమొదట జ్ఞానపీఠమునెక్కించిన కవిసమ్రాట్ విశ్వనాథ వారి 125 వ జయంతి సందర్భంగా…


విశ్వనాధ సత్యనారాయణ గారు "చెలియలి కట్ట" అన్న ఒక నవల వ్రాశారు. సముద్రమును పురుషుడితో పోలుస్తారు. సముద్రము యొక్క శక్తి అపారము. తలచుకుంటే ఊరిమీద పడిపోగలదు అయినా కెరటము వచ్చి వెనకకు వెళ్ళిపోతుంది తప్ప ఊరుమీదకు రాదు. అది తనకి తాను చెలియలి కట్ట దాటను అని నియమము పెట్టుకున్నది. సముద్రము అలా గీత గీసుకున్నది కనక అందరూ సంతోషముగా ఉన్నారు. ప్రతి పురుషుడు సముద్రమైతే "ధర్మేచ, అర్ధేచ, కామేచ మోక్షేచ నాతి చరామి" చెలియలి కట్ట. అది దాటకపోవడములోనే లోకము యొక్క శాంతి ఉన్నది.  వ్యక్తిగత నిర్ణయము ఒకటే కాదు, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ విషయము కావ్యములలో మహర్షులు ఎంత పరిణతితో చెప్పారో, విశ్వనాథ వారు కూడా అంతే గొప్పగా వివరించారు.


మహానుభావుడు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు వేయిపడగల నవల వ్రాస్తూ 999 పడగలు చితికి పోయినా ఒక పడగ బ్రతికి ఉన్నది. అదే చావో, రేవో ఈ జాతికి ఒక స్త్రీమెడలో తాళికడితే ఆమె వలన సంతానము పొంది సంసారము చక్కగా నడచిందా నడచింది, లేదా ఆయనకి ఆమె కూతురు, ఆమెకి ఆయన కొడుకు. ఇద్దరూ భగవన్ మార్గములో నడచి ఈశ్వరుని చేరుకోవడము. ఏ కారణము చేత కట్టుకున్న భార్యకి విడాకులు ఇవ్వడము కానీ, ఆడది తక్కువ ఆన్న భావముతో విడచిపెడతానన్న మాట కానీ ఈ జాతియందు లేదు. అది ఈ జాతి విశిష్టత, అద్భుతమైన సంస్కృతి. దీనికొరకు ప్రపంచదేశములు అన్నీ మన జాతికీ, ఇక్కడి సంస్కారమునకూ నమస్కారము చేశాయి.

వారి రామాయణ కల్పవృక్షంలో -

ప్రభు మేని పైగాలి వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చె,

ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగె,

ప్రభు మేని నెత్తావి పరిమళించిన తోన యశ్మంబు ఘ్రాణేంద్రియంబు చెందె,

ప్రభు నీలరత్న తోరణ మంజులాంగంబు గనవచ్చి రాతికి కనులు కలిగె

ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీక

రించినంత ఉపల హృదయవీధి

నుపనిషద్వితాన మొలికి శ్రీరామ భ

ద్రాభిరామ మూర్తి యగుచు తోచె!!

ఎప్పుడయినా సరే, మనం అహల్య గురించి తప్పుగా మాట్లాడకూడదు. అలా మాట్లాడడానికి మనకు హక్కులేదు. కొన్ని వందల సంవత్సరాలు ఆమె నిరాహారియై తపస్సు చేసింది. తదుపరి శ్రీరామదర్శనం చేసింది. శ్రీరామదర్శనానంతరం ఆమె పాపము పూర్తిగా నశించిపోయింది. ఆమెయందిప్పుడు పాపము లేదు. అటువంటి తల్లి కనుకనే శాపవిమోచనానంతరము రామచంద్రుడే ముందుగా ఆమెకు నమస్కరిస్తారు. రామచంద్రమూర్తిచేత నమస్కరింపబడిన మహాతల్లి అహల్య. అహల్య పేరు వినబడితే రెండుచేతులు ఎత్తి నమస్కరించాలి. ఆమె గొప్పతనం గూర్చి చెప్పడానికే రాముడంతటివాడు ఆమెకు ముందు నమస్కారం చేశారు. తన భార్య తప్పుచేస్తే, ఆమె ఏ దోషాన్ని ఎందువల్ల చేసిందో గమనించి, ఆమె చేత తపస్సు చేయించి, ఆ దోషాన్ని నివృత్తి చేసి, రాముడు వస్తే ఆమె పాపము పూర్తిగా నశిస్తుందని గౌతమ మహర్షి గొప్ప ఆదర్శముతో వ్యవహరించారు. ఈ ఘట్టాన్ని వర్ణిస్తూ, పై పద్యములో శ్రీరాముడు ఎలా పతితపావనుడో మహాద్భుతముగా చూపించారు విశ్వనాథ సత్యనారాయణ గారు.


"మళ్ళీ అందరూ వ్రాసిన రామాయణమే నేను వ్రాయడం ఎందుకు? అంటే ప్రతిపూట తిన్న అన్నమే మళ్ళా ఎందుకు తింటున్నావు? అంటే అన్నం తినకపోతే ఉండలేము కనుక తింటున్నాము. అలాగే వినిన రామాయణాన్నే మరల మరల వింటున్నాము. రామాయణం లేనినాడు మనిషి జీవితమే లేదు." అని అన్నారు . అందుకనే ఆ మహానుభావుడు ఋషితుల్యుడు అయ్యారు.



Monday, September 7, 2020 0 comments By: visalakshi

జన్మరాహిత్యం..

 



**సాలగ్రామం**


మన పూజా విధానంలో ‘సాలగ్రామ’ విశిష్టత అంతా ఇంతా కాదు. 


సాలగ్రామాన్ని విష్ణుమూర్తికి ప్రతీకగా చెబుతారు. ఎక్కడైతే సాలగ్రామముంటుందో అక్కడ శ్రీ మహావిష్ణువు కొలువుదీరి వుంటాడని చెబుతారు. 


కనుక ‘సాలగ్రామ’ పూజ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు చేసే పూజగా అభివర్ణించవచ్చు. 


సాలగ్రామ శిలయందు చరచరాత్మకాలయిన మూడు లోకాలు ఇమిడి ఉంటాయట. ఆ కారణంగా సాలగ్రామాన్ని భక్తితో పూజిస్తే కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యం ఫలానికి సమానమవుతుంది. అంతేకాదు కోటి గోవులను దానం చేసినంత పుణ్యం సంప్రాప్తిస్తుంది.


 సాలగ్రామ పూజవల్ల శివకేశవులిద్దరినీ పూజించిన ఫలితం లభిస్తుందని చెబుతారు. సాలగ్రామ శిలకు షోడశోపచార విధానాలు అర్జించిన భక్తులకు యావత్ కల్పాంతం వరకూ వైకుంఠాన నివసించే భాగ్యం కలుగుతుంది. 


సాలగ్రామానికి భక్తిశ్రద్ధలతో నమస్కరించి, పూజించినచో మరుజన్మ లేకుండా ముక్తి లభిస్తుందట. సాలగ్రామాన్ని స్మరించిన, దర్శించిన, నమస్కరించిన సర్వపాపాలు ప్రక్షాళనమవుతాయని శాస్త్రాల ద్వారా అవగతమవుతుంది. సాలగ్రామ శిలయందు వుంచిన అన్ని పదార్థాలు పవిత్రములవుతాయి. దీనిని ముందుంచుకుని పితృదేవతలకు తర్పణాలు ఇచ్చినచో, పితృదేవతలకు పైలోకాలలో శాశ్వత సుఖాలు లభిస్తాయట. సాలగ్రామ తీర్థాన్ని సేవించినచో వెయ్యిసార్లు పంచామృతాన్ని సేవించిన ఫలితంకన్నా, ప్రాయశ్చిత్తములందు ఆచరించే దానాల ఫలితాలకన్నా అధిక ఫలితం కలుగుతుందంటారు. యోగాశాస్త్రం, సాంఖ్యాశాస్త్రాలు తదితర ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియకున్నా, చదవకున్నా, ఒక్కసారి సాలగ్రామాన్ని శాస్త్ర ప్రకారం పూజించి, అభిషేకిస్తే కోటి లింగాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందట. 


తటాకాలందు సాలగ్రామాన్ని ఉంచి, ఆ నీటితో స్నానమాచరిస్తే సర్వతీర్థాలందు స్నానమాచరించిన పుణ్యఫలం కలిగి, సర్వదేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుందంటారు. అలాగే సాలగ్రామాన్ని అభిషేకించిన జలాలను ప్రోక్షించుకుంటే, పవిత్ర గంగాస్నానం చేసినట్లే అవుతుందట. సాలగ్రామ తీర్థం అత్యంత పవిత్రమైనది. విశేషమైన మహత్తు కలది. అలాంటి తీర్థాన్ని సేవించినవారికి పునర్జన్మ ఉండదట. విష్ణు స్వరూపమైన సాలగ్రామాన్ని విష్ణ్భుక్తుడైన సత్ బ్రాహ్మణునికి దానమిస్తే వంద యాగాలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. ఇంతటి విశేషాలున్న ఈ సాలగ్రామ శిలకు ఈ పద్నాలుగు లోకాలలో సరిపడే వేరొక శిల లేదని శాస్త్రాల ద్వారా అవగతమవుతోంది. సాలగ్రామంపై శుద్ధమైన మట్టితోగాని, రంగులతోగాని, కేశవ నామాన్ని రాస్తే, కోటి కల్పాల వరకూ స్వర్ణంలో నివసించే భాగ్యం కలుగుతుందట. పూజాపీఠమందు సాలగ్రామాన్ని అమరిస్తే సమస్తమైల పూజలు సక్రమంగా సాగి పరిపూర్ణమైన ఫలితాలు సొంతమవుతాయి. సాలగ్రామాలను ఆవుపాలతోగాని, పంచామృతంతోగాని శుద్ధి చేయాలి. ‘రుద్రాక్ష ధారణ’ నియమాలనే సాలగ్రామ పూజలందు పాటించాలి. ప్రత్యేక సమయాలందు, సంక్రమణ కాలాలందు, గ్రహణ సమయాలందు ఆయా సాల గ్రామాల ననుసరించి ఆయా దైవ జపాలను 1008 సార్లు చేస్తే లేదా చేయించుకుంటే అలాంటి సాలగ్రామాల శక్తి ద్విగుణీకృతమవుతుందని శాస్త్రాల ద్వారా అవగతమవుతుంది. సాలగ్రామాలందు ఉన్న చక్రాలననుసరించి వాటిని పిల్వడం జరుగుతోంది. ఏకచక్రముంటే సుదర్శనమని, రెండు చక్రాలుంటే లక్ష్మీ నారాయణమని, మూడు చక్రాలుంటే అచ్యుతుడని, నాలుగు చక్రాలుంటే జనార్థుడని, ఐదు చక్రాలుంటే వాసుదేవుడని, ఆరు చక్రాలుంటే ప్రద్యుమ్నుడని, ఏడు చక్రాలుంటే సంకర్షణుడని, ఎనిమిది చక్రాలుంటే పురుషోత్తముడని, తొమ్మిది చక్రాలుంటే నవ వ్యూహమని, పది చక్రాలుంటే దశావతారమని, పదకొండు చక్రాలుంటే అనిరుద్ధుడని, పనె్నండు చక్రాలుంటే దాదశాత్ముడని, పదమూడు చక్రాలకన్నా ఎక్కువ చక్రాలుంటే ‘అనంతమూర్తి’ అనే పేర్లతో పిల్వడం జరుగుతోంది. సర్వపాపహరమైనది, సర్వచింతనల నుంచి దూరం చేసేది, సర్వదేవతా పూజా ఫలితాలనిచ్చేది, సర్వశ్రేయస్కరమైనదని అయిన సాలగ్రామాన్ని పూజించడం, మానవుల అదృష్ట్భాగ్యంగా శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి సాలగ్రామాన్ని భక్తితో పూజించడం భక్తిముక్తిలకు మార్గం సుగమం చేసుకోవడంగా చెబుతారు.


#శ్రీమద్భగవద్గీత.....

స్వయంగా భగవంతుడే తన గురించి, తన భక్తుని గురించి, తనపై ఉండవలసిన భక్తి గురించి చెప్పటం వల్ల మరొక మానవమాత్రునితో పనిలేకుండా మార్పులు, చేర్పులు, తీర్పులు లేకుండా స్వయం సిద్ధమై నిలిచిందీ భగవద్గీత. అసలు ఏమిటీ భగవద్గీత.. భగవద్గీతకు మనకు సంబంధం ఏమిటి.. అందులోని విషయాలను తెలుసుకోవటం వల్ల మనకు ఏం ప్రయోజనం కలుగుతుంది.. మానవజన్మను సార్థకం చేసుకొనుటకు భగవద్గీత ఎలా సాయపడుతుంది..


మీరు సరదాగా మీ బంధువులింటికి వెళ్ళాలని హైదరాబాదు వెళ్ళారు. ఒకరోజు బిర్లా మందిరానికని, ఒకరోజు పార్కుకు, జూకు వెళ్ళివస్తున్నారు. ఒక రోజున ఎవరో స్వామీజీ భగవద్గీతపై ప్రవచనములు చేస్తున్నారని అక్కడికి వెళ్ళారు. ఒక గంట సేపు ఆ ప్రవచనాలు విని ఆనందించారు. అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకుంటే హాయిగా ఉండేది. కాని మధ్యలో స్నేహితుడు కనిపించి దగ్గరలో సర్కస్ ఉంది. వెళ్దాం అంటే వెళ్ళారు. జనంలో త్రోసుకొని టికెట్టు కొనుక్కొని లోపలికెళ్ళారు. స్నేహితుడు కనిపించలేదు. రెండు గంటలు సర్కస్ చూశారు.


.....


.....


తిరిగి ఇంటికి బయలుదేరారు. దారి తెలియలేదు. కరెంటు పోయింది. అయినా ముందుకెళ్ళారు. అక్కడ చిమ్మ చీకటి. కీచురాళ్ళ ధ్వనులు, భయం వేసింది. వడి వడిగా అడుగులు వేస్తున్నారు. వెనుక కుక్క మొరుగుతూ వెంట బడుతున్నట్లు అనుమానం వచ్చి పరుగు లంకించుకున్నారు. బాధ, దుఃఖం, ఆకలి, అలసట. దిక్కు తెలియక అలా వెళుతున్నారు. అలా ఎంత దూరం వెళ్ళినా మీ బంధువుల బజారు రాలేదు. కనిపించిన వారినల్లా అడ్రసు అడుగుతున్నారు. ఎవరూ తెలియదంటున్నారు. చివరకు ఒకాయన ఆ ప్రాంతాలన్నీ పరిచయమున్న వ్యక్తి తటస్థపడి "ఇదిగో ఇటు వెళ్ళు. ఒక ఫర్లాంగు వెళ్ళిన తరువాత దారి చీలుతుంది. ఎడమ వైపు తిరిగి సరాసరి వెళ్ళిపో. మీ బజారు వస్తుంది" అని చెప్పాడు. ఆ దారి వెంట వెళ్ళి ఇల్లు చేరుకున్నారు. నీ బాధలు, భయాలు తొలగిపోయి హాయిగా ఉన్నావు.


ఇదే విధంగా మనం కూడా మన స్వస్థానాన్ని పరమాత్మ స్థానాన్ని విడిచి ఈ మానవ లోకంలోకి వచ్చిపడ్డాం. ఇక్కడ ఏవోవో పనులు చేస్తూ వాటి ఫలితంగా సుఖాలు, దుఃఖాలు అనుభవిస్తున్నాం. ఈ జన్మను విడిచిపెట్టి మనం చేసిన పుణ్య కర్మల ఫలితంగా స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ అనేకమైన భోగాలు అనుభవిస్తాం. అలాగే పాప కర్మల ఫలితంగా నరకయాతనలు, భయంకరమైన దుఃఖాలు అనుభవిస్తాం. ఆ పుణ్య, పాప కర్మల ఫలితాలు అనుభవించిన తరువాత తిరిగి మళ్లీ ఈ లోకంలో కుక్కగా, నక్కగా, పిల్లిగా, బల్లిగా, పక్షిగా, పందిగా, పులిగా, ఏనుగుగా, చెట్టుగా, పుట్టగా, లేక మానవుడిగా అనేక రకాల జన్మలు ఎత్తుతూ ఉంటాం. అనేక సుఖాలు, భోగాలు, దుఃఖాలు, కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఇలా అనంత కోటిజన్మలు. ఈ ప్రయాణం ఇలా సాగుతూనే ఉంటుంది. మనం రోజుకొక డ్రస్సు వేసుకున్నట్లు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క దేహాన్ని తగిలించుకొని ఈ అంతులేని ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాం.


అయితే మనం ఎక్కడికి వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో తెలియకుండానే ఈ ప్రయాణం సాగిస్తుంటాం. "కస్త్వం క్కోహం కుత ఆయుతః".. నీవెవరు.. నేనెవరు.. ఎక్కణ్ణుంచి వచ్చాం.. (భజగోవిందం) అని పెద్దలు, శాస్త్రాలు మనను అడుగుతూనే ఉన్నారు. "మిత్రమా.. ఎక్కడి నుండి ఎక్కడకు నీ ప్రయాణం.. అని. ఏమో.. ఎక్కణ్ణించి వస్తున్నామో తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. గ్రుడ్డి ఎద్దు చేలో పడ్డట్టుగా, గాలి ఎటు వీస్తే అటు ఎగిరిపోయే ఎండుటాకులా ఎలాగో జీవయాత్ర సాగిస్తున్నాం. కాని మన ప్రయాణానికి ఒక గమ్యం లేదు.. ధ్యేయం లేదు.. లక్ష్యం లేదు.. "అచ్చపు చీకటింబడి".. అన్నట్లు చీకట్లో ప్రయాణం చేస్తున్నాం. మన ప్రయాణానికి పుట్టు పూర్వోత్తరాలు తెలియవు. పెద్దలు చెబుతున్నా, శాస్త్రాలు ఘోషిస్తున్నా మనం మాత్రం కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కోవటం లేదు.


ఇలా దిక్కులు మరచి, దిక్కు తోచక, చీకటిలో ప్రయాణిస్తున్న మనకు అన్ని మార్గాలు తెలిసిన స్నేహితునిలాగా 'భగవద్గీత' మనం ఎక్కడి నుండి బయలుదేరామో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో అన్ని విషయాలను చెప్పి, మనలను చేయిపట్టుకొని మన స్వస్థానానికి నడిపిస్తుంది. సమస్త దుఃఖాలను అంతం చేసుకొని, దుఃఖంలేని ఆనంద సామ్రాజ్యంలో మనలను ఓలలాడేటట్లు చేస్తుంది. అయితే మనం ఈ భగవద్గీత అనే స్నేహితుని చేయిపట్టుకొని వదలకూడదు. ఎటునడిపిస్తే అటు నడవాలి.


ఈ విధంగా మానవుడికి తన గమ్యస్థానం ఏమిటో తెలియజెప్పి అక్కడకు చేర్చే స్నేహితుడు గనుక భగవద్గీత మానవుడికి సంబంధించినది. మనకు సంబంధించినది. మానవ జన్మను సార్థకం చేసుకొనుటకు ఉపయోగపడేది భగవద్గీత.


కనుక భగవద్గీత చెప్పే విషయాలను గ్రహించాలి. ఈ లోకం మనది కాదు. ఇక్కడి వస్తువులు మనవి కావు. ఇక్కడి దుఃఖాలు, బాధలు కూడా మనవి కావు. “ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తిన్కోర్జున”.. అన్నట్లు ఈ పదునాలుగు లోకాలు కూడా మన మజిలీలే. ఆ లోకం నుంచి ఈ లోకానికి, ఈ లోకం నుంచి ఆ లోకానికి ఏతం బానలాగా పైకీ క్రిందికీ తిరుగుతూ ఉండాల్సిందే...


|| ఓం నమః శివాయ ||


*శివ.....


**శివ నామస్మరణ మహిమ...


శంకర భగవత్పాదుల వారు శివ అనే రెండు అక్షరాల శక్తిని చెప్తూ.. “శివేతి దౌవర్ణౌ ఘరట్టగ్రావాణౌ భవవిటపి బీజౌఘదలనే” అన్నారు... శివ అని పలకడం నిజానికి పెద్ద కష్టం కాదు. దిత్వాక్షరాలు, దీర్ఘాక్షరాలు లేవు. ఆ రెండు అక్షరాలలో ఏదో అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని అనుభవించడమే కాని వ్యాఖ్యానించలేము. 


'శి' 'వ' అనేవి రెండు తిరగలి రాళ్ళలా పని చేస్తుంటాయన్నారు. తిరగలి రాళ్ళకి ఒక లక్షణం ఉంది. ఏవైనా గింజలు అందులో వేసి తిప్పితే అవి మొత్తం చూర్ణం అయిపోతాయి. మామూలుగా గింజలు భూమి మీద వేస్తే మొలకెత్తుతాయి. కాని పిండి చేసి భూమి మీద వేస్తే మరి మొలకెత్తవు.


మనకి అనేక జన్మలు మొలకలెత్తడానికి కావల్సిన పాపపుణ్య కర్మబీజాలు చాలా ఉంటాయి. ఎన్ని జన్మలుంటాయో మనకేం తెల్సు.. జన్మలో దుఃఖం, జన్మరాహిత్యంలో ఆనందం ఉందని మనకి తెల్సు కాని అది పొందడానికి తగ్గ సాధన చేస్తున్నామో లేదో ఈశ్వరుడికే తెలియాలి.


జన్మరాహిత్యం పొందాలంటే మన దగ్గర అనేక జన్మల నుంచి పోగుచేసుకొన్న కర్మబీజాలు పోవాలి. అవి అలా వదిలేసినా మళ్లీ మొలకెత్తుతాయి. మామూలు మొలకలు కాదు క్రమంగా జన్మలనే అరణ్యాలు తయారౌతాయి. కాబట్టి ఈ కర్మబీజాలని 'శి' 'వ' అనే తిరగలి రాళ్ళలో పడేస్తే పిండైపోయి ఇక మనకి మళ్లీ జన్మ అనేదే ఉండదని ఆది శంకరుల వారు అభయమిచ్చారు. శివ నామం జన్మరాహిత్యాన్ని ప్రసాదించి పరమపదాన్ని చేర్చుతుంది...


|| ఓం నమః శివాయ ||

గురు పూజోత్సవం..

 #గురు పూజోత్సవం*




🙏🙏🙏🙏🙏🙏🙏


*"గురు బ్రహ్మ, గురు విష్ణు* 

*గురు దేవో మహేశ్వరహ*

*గురు సాక్షాత్ పరబ్రహ్మ*

*తస్మై శ్రీ గురవే నమః"*


మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ , ప్రతిక్షణంలోనూ అతను ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే వుంటాడు. కానీ ఆ గురువుని మనమందరం ప్రత్యక్షంగా చూడగలిగేది తరగతి గదిలో విద్యనభ్యసించినప్పుడే..!


ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తూ.. తన భవిష్యత్తుకు ఆయన అనుభవాన్ని వారధిగా చేసుకుని ముందుకు సాగుతాడు. జీవితంలో ఎవరికీ కేటాయించనంత సమయాన్ని గురువువద్ద గడుపుతాడు. అలా తమ జీవితాలకు ఓ రూపం కల్పించి , తీర్చిదిద్దే గురువులనే ప్రత్యక్ష దైవాలను... విద్యార్థులు ప్రేమగా పూజించేందుకు , స్మరించుకునేందుగానూ సెప్టెంబర్ 5వ తేదీని *"ఉపాధ్యాయ దినోత్సవం"గా "గురు పూజోత్సవం"గా* జరుపుకుంటున్నారు.

నవ నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి


అయినా... ఆదిమయుగం నుండీ ఆధునిక శకం దాకా ఆయనే ఋషి


జాతి జీవన వికాస మార్గదర్శకుడతడు


సమాజ దేవాలయానికి సిసలైన పురోహితుడు


అతడు... ఉపాధ్యాయుడు.. సృష్టి స్థితి లయల నిర్దేశకుడు..!


*"మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ"* అన్నారు పెద్దలు. తల్లి , తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. *"గురువు"* అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. *"గు"* అంటే చీకటి. *"రు"* అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. *"గు"* అంటే గుహ్యమైనది, తెలియనిది. *"రు"* అంటే దానిని రుచ్యము చేసేది. అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది. ప్రేమ , ఆప్యాతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్ధుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం.


భారతీయ సంప్రదాయంలో గురువుకు గల ప్రాధాన్యత గణనీయమైనది. గురువు సమక్షంలో నేర్చుకునే విద్య మనిషి జీవితానికి అర్ధాన్ని , పరమార్ధాన్ని చేకూరుస్తుందన్న భారతీయుల భావన యుగాలనాటి నుండి గురుశిష్య బాంధవ్యాన్ని చిరంజీవిగా నిలుపుతున్నది. భారతీయ పురాణేతిహాసాలు సైతం పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తరువాత గురువు ప్రధాన పాత్ర పోషిస్తారని తెలిపాయి. అందుకే అవి గురువుకు దైవత్వాన్ని ఆపాదించి పెట్టాయి.


ఈ సందర్భంలో ఉపాధ్యాయవృత్తికి అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి కాస్తంత తెలుసుకుందాం..!


రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888వ సంవత్సరం సెప్టెంబర్ ఐదో తేదీన జన్మించారు. పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అనేక ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. తత్వశాస్త్రంపై మక్కువతో అదే ప్రధానాంశంగా ఎమ్.ఎ. విద్యాభ్యాసంలో థీసిస్‌గా *"ది ఎథిక్స్ ఆఫ్ వేదాంత"ను* తన 20వ ఏటనే సమర్పించిన ప్రతిభాశాలి రాధాకృష్ణన్. 


అనంతరకాలంలో ఆయన అధ్యాపక వృత్తిలో కొనసాగుతూనే పలు మతాల తత్వసారాన్ని ఆకళింపు చేసుకున్నారు. రాధాకృష్ణన్ రచనల్లో ఒకటైన *"ఇండియన్ ఫిలాసఫీ"* భారతీయ తత్వశాస్త్ర వినీలాకశంలో ధృవతారగా నిలిచిపోయింది. విదేశాలలో తాను చేసిన తత్వ శాస్త్ర సంబంధిత ప్రసంగాలలో భారతదేశానికి స్వాతంత్ర్యం రావల్సిన ఆవశ్యకతను ప్రస్తావించేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌ పదవిని చేపట్టిన ఆయన విశ్వవిద్యాలయాన్ని సంక్షోభంలోంచి బయటపడేశారు.


దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలను నిర్వహించిన రాధాకృష్ణన్... విద్యా రంగంలో పలు నిర్ణయాత్మక సంస్కరణలకు మార్గదర్శకులయ్యారు. తన అనిర్వచనీయమైన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక భారత రత్న పురస్కారం ఆయనను వరించింది. 1962వ సంవత్సరంలో దేశంలో అత్యుత్తమైన రాష్ట్రపతి పదవికి డాక్టర్ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. పదవిలో ఉన్న ఐదు సంవత్సరాలలో తలెత్తిన సంక్షోభాలకు తనదైన శైలిలో పరిష్కారం చూపారు.


ఇదే సందర్భంలో కొంతమంది శిష్యులు మరియు మిత్రులు... రాధాకృష్ణన్ పుట్టిన రోజును జరిపేందుకు ఆయన వద్దకు వచ్చారట. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. *"నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు , దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే తానెంతగానో గర్విస్తాన"ని* చెప్పారట. ఈ రకంగా ఉపాధ్యాయ వృత్తిపై తన ప్రేమను చాటుకున్న రాధాకృష్ణన్ కోరిక మేరకే ఆనాటి నుంచి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో *"ఉపాధ్యాయ దినోత్సవం"గా* జరుపుకుంటున్నాం.


తాను చేపట్టిన రంగంలో అద్వితీయ ప్రతిభను కనపర్చే రాధాకృష్ణన్ తన 79వ ఏట.. 1975వ సంవత్సరం , ఏప్రిల్ 17న చెన్నై నగరంలో కన్నుమూసారు. విశ్వవిఖ్యాత తాత్వికుడిగా , ఆదర్శ ఉపాద్యాయుడిగా అందరి మన్ననలు చూరగొన్న సర్వేపల్లి కనుమరుగైనా.. ఆయన భావనలు.. నాడు , నేడు , మరెప్పటికీ అధ్యాపక లోకానికి స్పూర్తిగా నిల్చిపోతాయి. తనలోని జ్ఞానసంపదను విద్యార్థులకు పంచడం ద్వారా వారి భావి జీవితానికి బంగారు బాటను వేసిన గురుదేవుడిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అందరి మనసుల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోతారు.


ఇకపోతే...


సమాజ నిర్మాణంలో కీలకపాత్ర వహించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేక రోజుని ఏర్పాటు చేసి ఆ వృత్తిని గౌరవిస్తుండడం మన సంస్కృతిలో నేడు అంతర్భాగమై పోయింది. ఇది ఎంతైనా గర్వించతగ్గ విషయం. ఇది సర్వత్రా వాంఛనీయం. ఈ రోజుని ప్రతి విద్యాలయంలోనూ ఎంతో ఘనంగా నిర్వహించాలి. ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం ద్వారా వారి సేవలను గౌరవించాలి. వారి ఆదర్శాలను అనుసరించాలి. విద్యార్ధి సంఘానికి *"దేహం"* వంటివాడైతే ఉపాధ్యాయుడు *"ఆత్మ".* అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు , సమాజం మీద కూడ ఉంది.

Wednesday, September 2, 2020 0 comments By: visalakshi

గుడిమల్లం దేవాలయం..

 



చిత్తూరు జిల్లా కాళహిస్తి మండలంలో రేణి గుంటకు ఏడు కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖీ నది తీరంలో గుడిమల్లం గ్రామంలో ఒకటవ శాతాబ్దానికి చెందిన అతి ప్రాచీన శివాలయం ఉంది. ఈ ఆలయాన్ని శ్రీ పరుశురామాలయం అంటారు.


అత్యద్భుతమైన శిల్ప శోభితమైన ఆ ఆలయం చాలా కాలం కాలగర్భంలో కలిసిపోయి వెలుగులోకి వచ్చింది. 1911లో శ్రీ గోపీనాథరావు అనే పురాతత్వ వేత్త ఒక ఏడాది పరిశోధనలు జరిపి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి మొదటిసారి తెలియజేశారు.


ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుషలింగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల శివలింగంపై ఒక చేత్తో పరశువు, మరో చేతిలో గొర్రె పొట్టేలు పట్టుకుని యక్షని భుజాలపై నిలబడిన రుద్రుని రూపం దర్శనమిస్తుంది.


#అతి ప్రాచీన ఆలయం:

ఈ ఆలయంలో గర్భగుడి గజ పుష్ప ఆకారంలో ఉండి లోపల ఉన్న శ్రీ పరశురామ లింగం సహజ సుందరగా మహామహిమాన్వితమైనది. ఇక్కడున్న శిలాశాసనాలు చూస్తే ఆలయం మూడవ శతాబ్దానికి చెందినదని తెలుస్తున్నది.


ప్రాచీన శైవ పూజ విధానం తలపాగా, దోవతీ ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ ఋగ్వేదకాలంనాటిదని శాస్త్రఘ్నుల అంచనా. ప్రాచీన శైవ పూజ విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చేక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు.

అలాగే ఆలయ నిర్మాతలెవరో తెలియనీ ఈ శాసనాలలో స్వామి నిత్య దీప, ధూప నైవేద్యాల కోసం దానం చేసిన భూమి, ఆవులు, ధనం మొదలైన విషయాలను తెలియజేసే వివరాలుమాత్రం శాసనాలలో ఉన్నాయి. 1973లో జరిపిన పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో లభించే జేగురు రంగు రాళ్ల వలన ఆలయం రెండు లేక మూడవ శతాబ్దానికి చెందినదని అనుకున్నారు. కుండలు, పెద్ద సైజు ఇటుకలను పరిశీలిస్తే ఒకటవ , రెండవ శతాబ్దపు ఆంధ్ర శాతవాహనుల కాలం నాటివని నిర్థారించారు. కనుక ఆలయం క్రీ.శ ఒకటవ శతాబ్దికి చెందిన అతి పురతాన ఆలయం అని నిశ్చయంగా చెప్పవచ్చు.


#ఈ ఆలయానికి ఒక పురాణగాథ

ఒకప్పుడు ఇక్కడ పరశురామేశ్వరుడు అనే మహా భక్తుడు ఉండేవాడట ఆతను రోజూ దగ్గరలో ఉన్న కొలనులో గట్టుమీద ఉన్న గజ పుష్పాలు మొదలైన వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలను ఏరి తెచ్చి శివుడికి పూజ చేసేవాడు. అవి చాలా వింత ఆకారాలలో విచిత్ర పవిత్ర సువాసనలు వెద జల్లేవట. శివుడు ప్రీతి చెంది అతనిని అభినందింఛి ఆశీర్వ దించాడు.


#ఎలా వెళ్ళాలి?

గుడిమల్లం చేరుకోవడానికి రోడ్ మార్గం సులభంగా ఉంది. అయినా కూడా సమీపంలో విమాన మరియు రైలుమార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి.


#విమాన మార్గం: గుడిమల్లం సమీపాన రేణిగుంట దేశీయ విమానాశ్రయానికి 11కి.మీ దూరంలో ఉంది. 


ప్రభుత్వ బస్సుల్లో లేదా ప్రైవేట్ వాహనాల్లో గుడిమల్లం చేరుకోవచ్చు.


#రైలు మార్గం : గుడిమల్లం సమీపాన రేణిగుంట మరియు తిరుపతికి రైల్వేస్టేషన్లు కలవు. ఈ ఊర్ల నుండి గుడిమల్లం గ్రామానికి ప్రభుత్వ ప్రైవేట్ వాహనాలున్నాయి.


#రోడ్డు మార్గం : రేణిగుంట నుండి 11కి.మీ , తిరుపతి నుండి 22కి.మీ చిత్తూరు నుండి 85కి.మీ. చంద్రగిరి నుండి గుడిమల్లం గ్రామానికి బస్సు సౌకర్యంతో పాటుగా జీపు, షేర్ ఆటోల సౌకర్యం ఉంది.

Tuesday, September 1, 2020 0 comments By: visalakshi

అనంత పద్మనాభ వ్రతం..

 


పుట్టిన క్షణం నుంచి మరణించే క్షణం దాకా కాలవాహినిలో మనిషి ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటాడు. సుఖాలు అనుభవిస్తున్నప్పుడు కాలం తెలియకుండానే గడచిపోతుంది. కష్టాల్లో మాత్రం దినం ఒక యుగంగా గడుస్తుంది. అందుకే మనిషి అనంత సంసార సముద్రంలో నుంచి ఉద్ధరించమని అనంత పద్మనాభుణ్ని వేడుకుంటాడు. అలా వేడుకొంటూ చేసే వ్రతమే అనంత పద్మనాభ వ్రతం.


అనంత శబ్దం అంతులేని కాలానికి ప్రతీక. అనంతుడు అంటే ఆదిశేషుడు. అందుకే విష్ణువుకు అనంత శయనుడు అని పేరు. సర్వవ్యాపి అయిన విష్ణువు కూడా అనంతుడే. ఇలా కాలానికి, ఆదిశేషుడికి, విష్ణువుకు అవినాభావ సంబంధాన్ని తెలిపే ఈ వ్రతం ఎందరికో ఆరాధ్యంగా మారింది.


పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించారు. ఒకనాడు వారిని పరామర్శించేందుకు కృష్ణుడు వచ్చాడు. కృష్ణుణ్ని చూడగానే ధర్మరాజుకు ఎంతో సంతోషం కలిగింది. తమను కష్టాలనుంచి గట్టెక్కించగల మార్గదర్శి కృష్ణుడే అని దృఢంగా నమ్మిన ధర్మరాజు తాము పడుతున్న కష్టాలను ఏకరువు పెట్టి, ఎలాగైనా తమకు తరణోపాయం చెప్పమని కోరాడు. అప్పుడు కృష్ణుడు- ‘మీరు పడుతున్న కష్టాలకు కాలమే కారణం కనుక అనంతకాల స్వరూపుడైన మహావిష్ణువును పూజించమని’ చెప్పి, వ్రత విధానాన్ని కూడా వివరిస్తాడు. పూర్వం ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా అని ధర్మరాజు కృష్ణుణ్ని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా పూర్వం కృతయుగంలో సుమంతుడు అనేవాడు ఈ వ్రతాన్ని ఆచరించి, ఎన్నో కష్టాలనుంచి గట్టెక్కాడని కృష్ణుడు ఆ కథను వివరించి చెబుతాడు. అనంతుడు అనే పేరు కాలాన్ని చెబుతుంటే, పద్మనాభుడు అనే పేరు బ్రహ్మ సృష్టికి మూలమైన విష్ణువు నాభి కమలాన్ని చెబుతుంది. పద్మం వికా సానికి సంకేతం. సృష్టి అంటే వికాసమే కదా? ‘నాభి’ అంటే మూలస్థానం, మధ్యస్థానం కనుక మానవ సృష్టికి సంబంధించిన మూలస్థానమైన పద్మనాభుణ్ని తెలుపుతూ ఈ వ్రతంలోని ప్రధాన దైవాన్ని సాక్షాత్కారం చేస్తోంది. ఈ వ్రతంలో ముఖ్యమైన దోరాన్ని(రక్షా సూత్రాన్ని) కుడిచేతికి ధరించే సందర్భంలో చేసే ప్రార్థనలో- ‘ఓ అనంతకాల స్వరూపా! నన్ను ఈ అంతంలేని సంసార మహా సముద్రంలోనుంచి గట్టెక్కించు’ అని కోరడంలోని ఆంతర్యాన్ని గ్రహిస్తే మనిషి తనను కష్టాల కడలినుంచి ఉద్ధరించమని ఆర్తితో అడగడం లక్ష్యంగా కనబడుతుంది.


అనంత వ్రతంలో చతుర్దశ(పద్నాలుగు) సంఖ్యకు విశిష్టత ఉంది. అనంత పద్మనాభుడు చతుర్దశ భువనాలకు అధిపతిగా ప్రసిద్ధుడు. ఈ వ్రతం చతుర్దశీ తిథినాడే జరుగుతుంది. ఆదిశేషుడి రూపంలో ఉండే అనంతుడి పడగలు పద్నాలుగులో సగం అయిన ఏడే. పూజలో సైతం పత్రాల్లో, పుష్పాల్లో, ఫలాల్లో, పిండివంటల్లో, మధుర పదార్థాల్లో పద్నాలుగు సంఖ్య తప్పక ఉంటుంది. ఈ వ్రతాన్ని కూడా పద్నాలుగేళ్లు ఆచరించాలనే సంప్రదాయం ఉంది.


అనంత పద్మనాభ వ్రతంలో ప్రధానమైంది యమునా పూజ. పూర్వం యమునా నదీతీరంలో ఈ వ్రతాన్ని ఆచరించినందువల్ల, కలశంలో పవిత్ర జలాలను యమునా నదీజలాలుగా భావించి, పూజించడం కనబడుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించినవారు ధరించే దోరానికి గల గ్రంథులు సైతం పద్నాలుగే ఉంటాయి. ఈ వ్రతాన్ని పూర్ణిమతో కూడిన చతుర్దశినాడే ఆచరించాలనే నియమం ఉంది. పుణ్యకార్యాల్లో దర్భలకు విశేష ప్రాధాన్యం ఉండటం వల్ల అనంతుడి రూపంలో ఉండే ఆదిశేషుడి ఫలాలను దర్భలతో అల్లి, పూజాస్థానంలో నిలుపుతారు.


వ్రతం కారణంగా మానసికంగాను, దైహికంగాను, వాచికంగాను పవిత్రతను పాటించడంవల్ల మనిషి జీవితం నిర్మలం కావడం పరమార్థం..(from FB..)