Friday, August 28, 2015 1 comments By: visalakshi

రాఖీపౌర్ణమి-శ్రావణపౌర్ణమి

  ఓం శ్రీ నారాయణాయ నమ:

  "యత్ర నార్యోస్తు పూజ్యతే  తత్ర రమంతే దేవతా" - ఎక్కడ స్త్రీ మాతృరూపంలో ఆరాధించబడుతుందో, అచట దేవతలు నర్తిస్తారు.

   మన భారతీయ పండుగల్లో వివిధ దేవతల అనుగ్రహం, అధ్యాత్మిక దృక్పధం,ఆత్మీయతానురాగాల అనుబంధం కలబోసి ఉంటాయి.

   శ్రావణ పూర్ణిమ నాడు విద్యాదిదేవత,వేదమయుడు అయిన శ్రీ హయగ్రీవ స్వామి ఆవిర్భవించారు. దేవతారాధనకు, ధ్యానానికి అనువైన వేదాల జ్ఞానదీప్తిని ప్రసాదించడమే హయగ్రీవానుగ్రహం.

  మన ధర్మ శాస్త్రాల్లో పేర్కొన్న రక్షాబంధన మహోత్సవం ఈ రాఖీ పూర్ణిమ ప్రత్యేకత.

ఈ రోజున సోదరుని తిలకధారణతో,అక్షతలతో అభినందించి,సోదరి రక్షా కంకణాన్ని బంధిస్తుంది.ఇది దేవతారక్షగా అతడిని కాపాడుతుంది.

బదులుగా సోదరిని కానుకలతో సత్కరిస్తారు.సోదరీ సోదర అనుబంధానికి చెలిమిని బలపరచి,స్త్రీకి పుట్టింటి అనుబంధాన్ని దృడపరచిన పండుగ ఇది.

 ఇంటి ఆడపడుచును మహాలక్ష్మీ స్వరూపంగా, పరాశక్తికి ప్రతీకగా భావించే సంసృతి మనది.పుట్టింటి ఆత్మీయత స్త్రీకి ఎంతో మనో నిబ్బరాన్ని,ఉల్లాసాన్ని పెంచుతుంది.

 ఈ శ్రావణ పూర్ణిమ నిండు చంద్రుని శోభలను పుడమి స్వీకరించే రోజు.చంద్రుని ప్రకాశం వల్ల మనసు పవిత్రమై,ఆరాధనలూ,ధ్యానాలు  విశేషంగా ఆచరిస్తారు.

 మానవ సంబంధాల్లో దివ్యత్వాన్ని నింపుకునే ఈ ఆచారమే" రక్షాబంధన మహోత్సవం.."

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు


Wednesday, August 26, 2015 1 comments By: visalakshi

వరలక్ష్మీ వ్రతం

 ఓం శ్రీ మాత్రే నమోనమ:

 శ్లో" పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
    నారాయణప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా
    క్షీరోదధి సంభూతే కమలే కమలాలయే
    సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే !!

 శ్రావణ మాస మంటేనే మహిళలందరికీ సందడే సందడి. మంగళగౌరీ వ్రతాలు,నోములు, వరలక్ష్మీ వ్రతం, రాఖీపౌర్ణమి  ఇలా వరుసగా  పండుగలు...

 వరలక్ష్మీ వ్రత పండగ కు కావలిసిన   వ్రత సామాగ్రి అనగా పూజకు తగిన
పూలు,పళ్ళు,పట్టుచీరలు,రూపు, బంగారు ఆభరణములు తదితరములు   సమకూర్చుకొని,వరలక్ష్మీ మాతను సుందరంగా అలంకరించి,  కలశం పై చిన్న వరలక్ష్మి అమ్మవారి ప్రతిమను ఉంచి,పూలతో ,గాజులతో,బంగారు ఆభరణాలతో అలంకరించి లక్ష్మి అమ్మవారిని ఆవాహన చేసి, షోదశోపచారాలతో పూజిస్తూ వ్రతం ప్రారంభించాలి.  

 ముందుగా ఒక పళ్ళెములో బియ్యము పోసి,దానిపై మనము కలశము అమర్చి,పళ్ళెము ముందు తమలపాకువేసి పసుపు వినాయకుడిని చేసుకొని,మహా గణపతి పూజతో వ్రతం ప్రారంభించాలి. సంకల్పం చెప్పుకొని,గణపతి పూజానంతరం,వరలక్ష్మీ మాత పూజ ధ్యానం,ఆవాహనం,అర్ఘ్య,పాద్య,ఆచమనీయాలు సమర్పించి,పంచామృత,
శుద్ధోదకస్నానాలు సమర్పించాలి. వస్త్రయుగ్మం,ఆభరణం సమర్పించాలి.మాంగళ్యం (రూపు) సమర్పించాలి.గంధం,అక్షతలు,పూలు సమర్పించాలి.అధాంగపూజ,అష్టోత్తరశతనామావళి అక్షతలతో అమ్మను అర్చించాలి.ధూప,దీప,నైవేద్య,పానీయ,తంబూలాలు సమర్పించాలి.నీరాజనం సమర్పించాలి.మంత్రపుష్పం,దక్షిణ సమర్పించాలి. ఆత్మ ప్రదక్షిణ సమర్పించాలి.....ప్రార్ధనాపూర్వక నమస్కారం సమర్పయామి.
తోరపూజ...
తొమ్మిది సూత్రంబులు (పసుపు రాసిన దారము) గల తోరములను చేసి అమ్మవారివద్ద ఉంచి అక్షతలతో కమలాయై నమ: ప్రధమగ్రంధిం పూజయామి అంటూ నవమ గ్రంధిం వరకు పూజ చేయాలి.తోరం ముందు కలశానికి కట్టాలి. తరువాత శ్లోకం చదువుతూ  కుడి చేతికి తోరం కట్టుకోవాలి. 

 శ్లోకం చదువుతూ అమ్మవారికి వాయనం ఇవ్వాలి.వాయనమిచ్చాక అక్షతలు తీసుకొని వ్రతకధను చదువుకోవాలి.తరువాత ముత్తైదువకు పీట వేసి అమ్మవారి ఎదురుగా కూర్ఛోబెట్టి, పసుపు రాసి బొట్టు పెట్టి చేసిన ,నైవేద్యంపెట్టిన,పిండివంటలు,శనగలు,తాంబూలం,వస్త్రములు,దక్షిణ అన్నీ ఒక పళ్ళెములో పెట్టి ఆవిడకు తోరము కట్టి, వాయనము ఇస్తూ,ఇసినమ్మ వాయనం అని 3 సార్లు అనాలి. ఆవిడ పుచ్చుకుంటినమ్మ వాయనం అని 3 సార్లు అనాలి.   వాయనమును  అందుకున్నదెవరమ్మా అని అనగా ముత్తైదువ "నేనమ్మా గౌరీ దేవిని" అని అనాలి.తదుపరి పూజాక్షతలను కుటుంబీకులందరూ తమపై వేసుకొని,తీర్ధ ప్రసాదాలు స్వీకరించాలి.

వరలక్ష్మీ వ్రతకల్పంలో ప్రతి శ్లోకం చదువుతూ పూజ చేయాలి. ఈ వ్రతమునకు 9 లేక 5 రకముల పిండి వంటలు చేయాలి.సాధారణంగా బూరెలు,పరవాన్నం,పులిహోర,ఉండ్రాళ్ళు,గారెలు లేక బజ్జీలు చేయచ్చు.ఎవరిష్టం వారిది. చలిమిడి,వడపప్పు కొద్దిగా పానకం చేసి నైవేద్యం పెట్టాలి.ఒక కొబ్బరికాయ కలశానికి, రెండవది అమ్మవారి ముందు కొట్టి నైవేద్యం సమర్పించాలి. 

 మనం చేసిన చలిమిడిని కుందులుగా చేసి దీపం వెలిగించి ఆ దీపం పైన గరిట  పెట్టి కధ చదువుతాము.కధ పూర్తయ్యీసరికి పొగకి గరిట నల్లగా మసి పడుతుంది దానికి కొద్దిగా నెయ్యి చేర్చి ముత్తైదువులకి కాటుకగా ఇస్తాము. చుట్టుపక్కలవారిని అందరినీ తాంబూలానికి పిలిచి అందరికి పసుపు రాసి, గంధం,బొట్టు ఇచ్చి,శనగలు,తాంబూలం ఇచ్చి పెద్దవారైతే ఆశీర్వాదం తీసుకుంటాము.అతి ముఖ్యమైన విషయం ఆరోజు వీలు చూసుకొని తప్పకుండా లలితా సహస్రనామ స్తోత్రం పఠించాలి. 

 వరలక్ష్మీ వ్రతం చేసుకుని,అందరం వరలక్ష్మీ కటాక్షంతో సౌమాంగల్యం,సర్వసౌభాగ్యాలు ప్రసాదించమని అమ్మను వేడుకుంటూ...

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్రయంబకే గౌరి  నారాయణి నమోస్థుతే!!   

Saturday, August 22, 2015 1 comments By: visalakshi

పాఠశాల మిత్రుల అపురూప కలయిక

"  నిన్న మీ మిత్రులను కలిసిన మీ ఆనందం అంబరాన్ని తాకగా, ప్రకృతి కూడా పులకించి వర్ష రూపేణా తన హర్షాన్ని తెలుపుతున్నట్లు వుంది ఈరోజు వాతావరణం. ఏమంటారు నేస్తం?" అని నా ఆత్మీయ స్నేహితురాలు ..అభినందిస్తుంటే నా మనసు సంతోషములో మునిగి తేలింది.

పదవ తరగతి 1982 బాచ్ మాది. 


33 ఏళ్ళ తరువాత మా పాఠశాల స్నేహితులం ఒక 15 మంది ఒక స్నేహితురాలి సహకారంతో ఒకచోట కలుసుకోవడం అనేది జీవితంలో మధురమైన మరపురాని రోజు."స్వాతంత్ర్యము" వచ్చిన రోజు. అదేరోజు మేము కలుసుకొన్నది.


ఒకరినొకరు ఆనందముగా పలకరించుకొని,ఒకరివిషయాలు ఒకరు తెలుసుకొని చాలా సందడిగా సమయము తెలియకుండా గడిచిన ఆ మధుర క్షణాలు మరపు రావు. 
 విశేషమేమిటంటే ..ఇన్నేళ్ళ తరువాత కూడా ఒకరినొకరు అందరం గుర్తుపట్టి ఆనాటి విషయాలను మాట్లాడుకోవడం ఆనందదాయకం.అందరూ డాక్టర్లు,ఆఫీసర్లు,ప్రొఫెసర్లు, టీచర్లు, హౌస్ వైవ్ లు...వగైరా అయివుండి కూడా, సమయం కేటాయించుకొని .....ఆతృతగా,ఆర్తిగా,ప్రేమగా కలిసాము. 

 
ఇంకా 25 మంది మా బాచ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నాము.ఆకాంక్ష బలీయమైనది.నెరవేరాలని ఆశిద్దాము. ..... Friday, August 14, 2015 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 81 ఉపనిషత్తులు

 ఓం శ్రీ పరబ్రహ్మణే నమో నమ: 

 ఉపనిషత్తులు :---

' ఉపనిషత్తులు '   అనేమాట వినగానే అవి చాలా క్లిష్టమైనవనీ, కేవలం సంస్కృత మేధావులకు,పండితులకే సంబంధించినవనీ ఒక అపోహ ఉంది.అవి భారతజాతికి అందులోనూ హైందవజాతికెంతటి మహత్తరమైన ప్రయోజనాలను ధర్మసూత్రాలద్వారా తెలియజేస్తున్నాయో గ్రహించగలిగితే, ఆ అపోహలన్నీ పటాపంచలైపోతాయి.

 ప్రపంచ ఆధ్యాత్మిక సాహిత్యంలో అగ్రేసర స్థానాన్ని అలంకరించిన ఈ ఉపనిషత్తుల ద్వారా సనాతన భారతీయ మహర్షుల అలౌకిక చింతనా వైభవ పరాకాష్ఠ తెలుస్తుంది. ఉపనిషత్తుల మహోత్కృష్ఠ ధార్మిక భావనావైశిష్ట్యం యావత్ ప్రపంచ మేధావుల్ని సైతం దిగ్బ్ర్హమకు లోను చేస్తొంది. "వేదాల చివర ఉన్న వేదాంతాలే ఉపనిషత్తులు"ఇవి మనకు తెలిసి 108. ఇవి మొత్తం 200 పైగా ఉంటాయని వేదజ్ఞుల అభిప్రాయం.

 భారతీయ తత్వ,ధర్మశాస్త్రమే ఉపనిషత్సారాం. భగవద్గీత వ్యక్తం చేసిన సకల ఆధ్యాత్మిక మార్గాల సం యోగం వాటన్నింటి మూలం ఉపనిషత్తులే. భారతదేశంలో పరివ్యాప్తమైన ఆధ్యాత్మిక మత భావాంకురాలన్నీ ఉపనిషత్తుల్లో ఉన్నవనీ, అవి తెలిసినవాడే అసలైన భారతీయుడనీ అన్నారు స్వామి వివేకానంద. సకల శాస్త్రపురాణాల్లోని భక్తిభావజాలానికి మూలం ఉపనిషత్తులే. ఉపనిషత్తుల్లోని ప్రతి ధర్మసూత్రమూ ఆదర్శభారతీయ జీవన విధానంతో ముడివడి ఉంది. ఉపనిషద్విషయ వైభవాన్ని పాశ్చాత్య విద్వాంసులు అంగీకరించారు,అనుసరించారు.

 ఉపనిషత్తులు మానవజాతికి అనేకమైన అమూల్య సందేశాలిస్తున్నాయి. ఈ జీవనయానం పరమ పవిత్రమైనది కనుక జాగరూకులై ఆత్మవిశ్వాసంతో లక్ష్యం సాధించే వరకు విశ్రమించక శ్రమించమంటున్నాయి.'ఉపనిషత్తు ' అంటే బ్రహ్మవిద్య. ఇది సాధించగలిగిన వాడు ప్రపంచంలోనే విజేతగా,ధర్మమూర్తిగా, పురుషోత్తముడిగా గుర్తింపు పొందుతాడు. శరీరానికి శిరస్సు ఎంతటి ప్రధానమో, వేదాల్లో ఉపనిషత్తులు అంతటి ప్రధానమైనవి. 

 మానవుడు పాపి కాడు. పాపి అనడం ఈశ్వరనింద చేయడం వంటిది. ప్రతి మనిషీ అమృత పుత్రుడే.పరబ్రహ్మ నుంచే వస్తాడు. పరబ్రహ్మమే గమ్యం కూడా.ఆ గమ్యం చేర్చడానికే ఉపనిషత్తులు ఉపయోగపడతాయి.
 ఆత్మస్వరూపాన్ని,మోక్షాన్ని అందజేస్తాయి. అజ్ఞాన తిమిరాన్ని తరిమేస్తాయి. భగవద్ధత్తమైన ఈ జన్మను దైవ రుణం తీర్చుకునేందుకే సద్వినియోగం చేసుకునే దిశలో సత్కర్మ పధాన పయనించాలని ఉపనిషత్సందేశం. సకల ప్రాణకోటిలోనూ దైవమే ఉన్నాడు.అందరినీ,అన్ని జీవ,జంతువుల్నీ ప్రేమతోనే చూడాలనీ,దాన్నే భగవత్సేవగా పరిగణించాలనీ గుర్తెరగాలి.వివిధ నామాలతో ఆరాధించే పరమాత్మ ఒక్కడే.అంత:కరణ శుద్ధితో,సద్గురు బోధతో ధర్మవర్తనం అలవరచుకోవాలి.స్వశక్తి సామర్ధ్యాలకు గర్వపడరాదు. మనకు లభించే సర్వశక్తులూ పరమాత్మ సంకల్పంతో ఆవిష్కృతమైనవే. మనం కేవలం నిమిత్తమాత్రులం. పునర్జన్మ లేకుండా మోక్షమే అలేఖిక సుఖమనీ,దానికే మానవుడు నిరంతర జ్ఞాన సాధన చేయాలనీ ఉపనిషత్తులు మానవాళికి హితబోధ చేస్తున్నాయి. 

 ఆదిశంకరాచార్యులు ఈ ఉపనిషత్తులకు అద్భుతమైన, సరళమైన శైలిలో వ్యాఖ్యానాలు రచించారు. తెలుగులోకి అనువదితమైన సర్వ ఉపనిషత్తుల సారమూ తెలుగు పాఠకుల ముందు వడ్డించిన విస్తరిలా కనిపిస్తోంది. ఇక ఆ జ్ఞాన భోజనం చేయవలసిన కర్తవ్యం మనదే. ఉపనిషత్పఠనం వల్ల అజ్ఞాన వినాశమే కాక, బ్రహ్మసాక్షాత్కారం ప్రాప్తిస్తుంది. 

  'ఉపనిషత్ ' అంటే మరో అర్ధం ఉంది. గురువులకు సమీపంలో ఉండాలంటూ గురుశిష్యుల పవిత్రానుబంధం తెలిపే ఆధ్యాత్మిక విద్య ఉపనిషత్తుల్లో ఉంది. ఇది రహస్య విద్య.గురువు నుంచి మాత్రమే తెలుసుకోదగినది.అద్వైత ప్రతిపాదనతో పాటు ఓంకారపూర్వక ఉపాసనా విధానం కూడా ఉపనిషత్తులు అభివ్యక్తం చేస్తున్నాయి.అవి అందిస్తున్న శాంతిపాఠం పఠించదగిన చోట అసత్యానికి,హింసకు,అసూయాద్వేషాలకు తావే ఉండదు. ...సిహెచ్.శ్రీరామమూర్తి గారు ఈనాడు పేపరులో "ఉపనిషత్తుల అక్షరాల విత్తులను చల్లి, అంతటా చల్లే ప్రయత్నం చేద్దాం అన్నారు. నాకూ చల్లే అవకాశం ఇచ్చినందుకు.....ధన్యవాదాలు.


  సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు. 


Thursday, August 6, 2015 1 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 80 మనసు పూజ

 ఓం శ్రీ సమర్ధ సద్గురవే నమో నమ:
 ధ్యానంతో కూడిన మానసిక పూజే భక్తుడిని భగవంతుడికి చేరువ చేస్తుంది.

ప్రశాంతత నిండిన మనసే...పరుల అండను కోరని మనసే పరమాత్ముడికి ప్రీతికరమవుతుంది.

భక్తుడి సాధన భౌతికం నుంచి మానసికానికి ఎంత త్వరగా చేరుకుంటే పూజలో అంత పరిణతిని సాధించినట్లు!

 అశాంతి,అసంతృప్తి నిండిన మనసు,ప్రశాంతత లేని మనసులో పరమాత్మ ప్రకటితం కాడు.అలజడితో కూడిన అంతరంగంతో ఎన్ని ఆరాధనలు చేసినా ఆశించిన ఫలితం కనిపించదు. 

నిశ్చలమనసును మించిన నీరాజనం,ఆపద్భాంధవుడి ఆశ్రయాన్ని మించిన ఆరాధనం మరొకటి లేదు.

మనసును పవిత్రం చేయని పూజాపునస్కారాలు,
జపతపాలు,సంధ్యావందనాది కర్మల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.

మాధవ సంబంధాన్ని కాదని మానవసంబంధాలపై ఆధారపడినంతకాలం మనకు నిరాశలు, నిస్పృహలు, నిట్టూర్పులే!

అంతటా భగవంతుని చూడగలగడం భక్తుడి అత్యుత్తమ హృదయ సంస్కారం.

సుఖమైనా,దు:ఖమైనా సమచిత్తంతో సాగిపోయేవారే భగవంతునికి ఇష్టులు.! 


స్వతంత్రేచ్చను వదులుకొని, సర్వమూ నీవని ఆ సర్వేశ్వరుడి ముంగిట వాలిపోవడమే పూజ పరమావధి. శరణాగతి, సత్సాంగత్యమే భగవద్భక్తికి నిదర్శనాలు.

"  సతతం మనల్ని మనం సత్కర్మలలో నియోగించుకుంటూ, నిరంతరం స్వయంకృషితో, పట్టుదలతో, కార్యశూరత్వాన్ని ప్రకటించుకోవాలి. ఫలితంపై దృష్టి లేకుండా సదా కర్తవ్యనిర్వహణలో, విహితకర్మలను నిర్వర్తించడంలో నిమగ్నమవడమే దైవకృప లేదా దైవసంకల్పం లేదా శరణాగతి."


   సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

Saturday, August 1, 2015 1 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 79 (గురు సుబోధ)

ఓం బహురూప విశ్వమూర్తయే నమో నమ:
 శ్లో" సర్వశ్రుతి శిరోరత్న సముద్భాషిత మూర్తయే !
    వేదాంత అంబుజ సూర్యాయ తస్మై శ్రీ గురవే నమ: !!

    శోషణం భవసిందోశ్చ ప్రాపణం సారసంపద !
  యస్య పాదోదకం సమ్యక్ తస్మై శ్రీ గురవే నమ: !!

భా: సకల వేదాంత శిరోరత్నభూషితుడై ప్రకాశించువాడు, వేదాంతపద్మాన్ని వికసింపజేసే జ్ఞానసూర్యుడు అయిన సద్గురువుకు వందనములు.
ఎవరి కృపాకటాక్షంతో సంసార సాగరం పూర్తిగా శోషించి, అనంత జ్ఞాననిధి ప్రాప్తిస్తుందో అలాంటి సద్గురువుకు వందనములు.     (గురుస్తోత్రం )  "గురుదేవుని మించిన సత్యవస్తువు ఇంకొకటి లేదు." 
గురుసేవను మించిన తపస్సు, గురుబోధను మించిన జ్ఞానం లేదు.
గురువు సర్వదేవమయుడు.
గురుకరుణ లేనిచో విషయత్యాగం, తత్వదర్శనం, సహజావస్థ- అన్నీ దుర్లభమే అవుతాయి.
"మనలో సంకుచితపు చాయలు, అహంభావపు నీడలు లేకుండా,మనలో లోపాలను సరిజేసుకుంటూ,మనస్సును శుద్ధంగా ఉంచే ప్రయత్నం చేసినప్పుడే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది."  
' గురువు 'ను గురించి ఒక సభలో ఒకానొక శ్రేష్ఠభక్తుడు ప్రసంగిస్తూ ముందుగా గురుస్తోత్రం చేయదలచి, గురువును సూర్యునితో పోల్చాలని అనుకున్నాడు. అయితే సూర్యుడు బాహ్యంగా ప్రకాశాన్ని అందిస్తాడు, కానీ గురువు మనస్సులో నిఘూడంగా ఉన్న అజ్ఞానతమస్సును పారద్రోలగల సమర్ధుడు.సూర్యుడు దట్టమైన మబ్బులున్నప్పుడూ, గ్రహణ సమయంలోనూ, రాత్రులందూ కనుమరుగవుతాడు. కానీ గురువు ఎటువంటి ఆవరణము లేకుండా, ఎల్లవేళలా నిత్యప్రకాశవంతుడైనవాడు. కనుక గురువు సూర్యుని కంటే గొప్పవాడు అని సభికులకు తెలియజేశాడు.

చంద్రునితో పోల్చాలన్నా, చంద్రుడు వృద్ధి క్షయాలను కలిగి ఉండి,కృష్ణపక్షంలో కనుమరుగవుతున్నాడు.చంద్రునిలో కళంకం ఉంది.కానీ గురువు వృద్ధి క్షయాలు లేనివాడు,పరిపూర్ణుడు, నిష్కళంకుడు.ఎలావేళలా ప్రసన్నుడు, స్వయంప్రకాశకుడు. కనుక గురువు చంద్రుని కంటే గొప్పవాడు.

అనంత సాగరమైన సముద్రంతో పోల్చాలన్నా,సముద్రం అగాధంగా కనిపిస్తున్నా, దానిలోతు తెలుసుకోదగినదే.కానీ గురుదేవుల కటాక్షపులోతు తెలుసుకోలేనిది. అంతు పట్టనిది.సముద్రగర్భంలో లౌకికవిలువ కలిగిన ముత్యాలు,రత్నాలు ఉండగా, గురుదేవుల హృదయం కరుణరసమనే రత్నాలతోనూ,సహనమనే ముత్యాలతోనూ,వైరాగ్యమనే పగడాలతోనూ నిండి ఉండివెలకట్టలేని రీతిలో అలరారుతోంది.కనుక సముద్రం కంటే కూడా గురువే గొప్పవాడు.

అగ్నితో పోలుద్దామంటే అగ్ని స్థూలమైన వాటినే దహించగలదు.కానీ గురువు సూక్ష్మంగా, జన్మ జన్మాంతరాలుగా ఉన్న కర్మరాశులనన్నింటినీ, తన జ్ఞాన దృష్టితో భస్మం చేయగలవాడు.కనుక అగ్ని కంటే గురువే గొప్పవాడు.ఇంక సృష్టి,స్థితి,లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోలుద్దామన్నా, ఆ మూడుకార్యాలు నిత్య సత్యమై ఉన్న ఏకమైన పరబ్రహ్మశక్తి వల్ల జరుగుతున్నాయి. అట్టి శక్తిని కలిగి ఉండి,గుణత్రయాతీతుడు,పరబ్రహ్మ స్వరూపుడైనవాడు 'గురువు 'అని పలికి ఆ పరమభక్తుడు మౌనంగా గురువుకు నమస్సులు అర్పించాడు.

"గురువు ఎడల ఇటువంటి శ్రద్ధ, విశ్వాసం ఉన్న సాధకునికి గురువు ఆదేశాలు నిత్యానుష్ఠానాలై అలరారుతాయి. అట్టివారి జన్మ చరితార్ధమవుతుంది.గురువును అటువంటి భక్తి ప్రపత్తులతో శ్రద్ధగా అర్చించి, వారి మనస్సు ప్రసన్నత పొందే విధంగా వారి ఆజ్ఞలను పాటిస్తూ, ఆదేశాలను అనుకరిస్తూ, వారి అడుగుజాడలలో నడుస్తూ, గురుదేవుల కరుణ, అనుగ్రహం సర్వులూ అందుకోగల స్థితిని ఆశిద్దాం."

సాయి గురుదేవుల ఆజ్ఞలను శిరసావహించడమే "గురుపౌర్ణమి"నాడు మా సత్సంగ కుటుంబం సమర్పించుకున్న మన:పూర్వకమైన "దక్షిణ".

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు