Friday, August 14, 2015 By: Vedasree

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 81 ఉపనిషత్తులు

 ఓం శ్రీ పరబ్రహ్మణే నమో నమ: 

 ఉపనిషత్తులు :---

' ఉపనిషత్తులు '   అనేమాట వినగానే అవి చాలా క్లిష్టమైనవనీ, కేవలం సంస్కృత మేధావులకు,పండితులకే సంబంధించినవనీ ఒక అపోహ ఉంది.అవి భారతజాతికి అందులోనూ హైందవజాతికెంతటి మహత్తరమైన ప్రయోజనాలను ధర్మసూత్రాలద్వారా తెలియజేస్తున్నాయో గ్రహించగలిగితే, ఆ అపోహలన్నీ పటాపంచలైపోతాయి.

 ప్రపంచ ఆధ్యాత్మిక సాహిత్యంలో అగ్రేసర స్థానాన్ని అలంకరించిన ఈ ఉపనిషత్తుల ద్వారా సనాతన భారతీయ మహర్షుల అలౌకిక చింతనా వైభవ పరాకాష్ఠ తెలుస్తుంది. ఉపనిషత్తుల మహోత్కృష్ఠ ధార్మిక భావనావైశిష్ట్యం యావత్ ప్రపంచ మేధావుల్ని సైతం దిగ్బ్ర్హమకు లోను చేస్తొంది. "వేదాల చివర ఉన్న వేదాంతాలే ఉపనిషత్తులు"ఇవి మనకు తెలిసి 108. ఇవి మొత్తం 200 పైగా ఉంటాయని వేదజ్ఞుల అభిప్రాయం.

 భారతీయ తత్వ,ధర్మశాస్త్రమే ఉపనిషత్సారాం. భగవద్గీత వ్యక్తం చేసిన సకల ఆధ్యాత్మిక మార్గాల సం యోగం వాటన్నింటి మూలం ఉపనిషత్తులే. భారతదేశంలో పరివ్యాప్తమైన ఆధ్యాత్మిక మత భావాంకురాలన్నీ ఉపనిషత్తుల్లో ఉన్నవనీ, అవి తెలిసినవాడే అసలైన భారతీయుడనీ అన్నారు స్వామి వివేకానంద. సకల శాస్త్రపురాణాల్లోని భక్తిభావజాలానికి మూలం ఉపనిషత్తులే. ఉపనిషత్తుల్లోని ప్రతి ధర్మసూత్రమూ ఆదర్శభారతీయ జీవన విధానంతో ముడివడి ఉంది. ఉపనిషద్విషయ వైభవాన్ని పాశ్చాత్య విద్వాంసులు అంగీకరించారు,అనుసరించారు.

 ఉపనిషత్తులు మానవజాతికి అనేకమైన అమూల్య సందేశాలిస్తున్నాయి. ఈ జీవనయానం పరమ పవిత్రమైనది కనుక జాగరూకులై ఆత్మవిశ్వాసంతో లక్ష్యం సాధించే వరకు విశ్రమించక శ్రమించమంటున్నాయి.'ఉపనిషత్తు ' అంటే బ్రహ్మవిద్య. ఇది సాధించగలిగిన వాడు ప్రపంచంలోనే విజేతగా,ధర్మమూర్తిగా, పురుషోత్తముడిగా గుర్తింపు పొందుతాడు. శరీరానికి శిరస్సు ఎంతటి ప్రధానమో, వేదాల్లో ఉపనిషత్తులు అంతటి ప్రధానమైనవి. 

 మానవుడు పాపి కాడు. పాపి అనడం ఈశ్వరనింద చేయడం వంటిది. ప్రతి మనిషీ అమృత పుత్రుడే.పరబ్రహ్మ నుంచే వస్తాడు. పరబ్రహ్మమే గమ్యం కూడా.ఆ గమ్యం చేర్చడానికే ఉపనిషత్తులు ఉపయోగపడతాయి.
 ఆత్మస్వరూపాన్ని,మోక్షాన్ని అందజేస్తాయి. అజ్ఞాన తిమిరాన్ని తరిమేస్తాయి. భగవద్ధత్తమైన ఈ జన్మను దైవ రుణం తీర్చుకునేందుకే సద్వినియోగం చేసుకునే దిశలో సత్కర్మ పధాన పయనించాలని ఉపనిషత్సందేశం. సకల ప్రాణకోటిలోనూ దైవమే ఉన్నాడు.అందరినీ,అన్ని జీవ,జంతువుల్నీ ప్రేమతోనే చూడాలనీ,దాన్నే భగవత్సేవగా పరిగణించాలనీ గుర్తెరగాలి.వివిధ నామాలతో ఆరాధించే పరమాత్మ ఒక్కడే.అంత:కరణ శుద్ధితో,సద్గురు బోధతో ధర్మవర్తనం అలవరచుకోవాలి.స్వశక్తి సామర్ధ్యాలకు గర్వపడరాదు. మనకు లభించే సర్వశక్తులూ పరమాత్మ సంకల్పంతో ఆవిష్కృతమైనవే. మనం కేవలం నిమిత్తమాత్రులం. పునర్జన్మ లేకుండా మోక్షమే అలేఖిక సుఖమనీ,దానికే మానవుడు నిరంతర జ్ఞాన సాధన చేయాలనీ ఉపనిషత్తులు మానవాళికి హితబోధ చేస్తున్నాయి. 

 ఆదిశంకరాచార్యులు ఈ ఉపనిషత్తులకు అద్భుతమైన, సరళమైన శైలిలో వ్యాఖ్యానాలు రచించారు. తెలుగులోకి అనువదితమైన సర్వ ఉపనిషత్తుల సారమూ తెలుగు పాఠకుల ముందు వడ్డించిన విస్తరిలా కనిపిస్తోంది. ఇక ఆ జ్ఞాన భోజనం చేయవలసిన కర్తవ్యం మనదే. ఉపనిషత్పఠనం వల్ల అజ్ఞాన వినాశమే కాక, బ్రహ్మసాక్షాత్కారం ప్రాప్తిస్తుంది. 

  'ఉపనిషత్ ' అంటే మరో అర్ధం ఉంది. గురువులకు సమీపంలో ఉండాలంటూ గురుశిష్యుల పవిత్రానుబంధం తెలిపే ఆధ్యాత్మిక విద్య ఉపనిషత్తుల్లో ఉంది. ఇది రహస్య విద్య.గురువు నుంచి మాత్రమే తెలుసుకోదగినది.అద్వైత ప్రతిపాదనతో పాటు ఓంకారపూర్వక ఉపాసనా విధానం కూడా ఉపనిషత్తులు అభివ్యక్తం చేస్తున్నాయి.అవి అందిస్తున్న శాంతిపాఠం పఠించదగిన చోట అసత్యానికి,హింసకు,అసూయాద్వేషాలకు తావే ఉండదు. ...సిహెచ్.శ్రీరామమూర్తి గారు ఈనాడు పేపరులో "ఉపనిషత్తుల అక్షరాల విత్తులను చల్లి, అంతటా చల్లే ప్రయత్నం చేద్దాం అన్నారు. నాకూ చల్లే అవకాశం ఇచ్చినందుకు.....ధన్యవాదాలు.


  సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు. 


0 comments: