Thursday, September 6, 2018 2 comments By: visalakshi

మధుర భక్తి

                                                ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమ:





భక్తిలో "భగవత్ప్రేమ" అనేది పరాకాష్ట. భగవద్దర్శనమైన తర్వాత భక్తుడు భగవంతుని విరహాన్ని క్షణకాలం కూడా సహింపజాలడు. ఈ వియోగము భగవత్ప్రేమ ద్వారా వెల్లడి యై ప్రకాశిస్తుంది. గోపికలు భగవంతుడైన శ్రీకృష్ణుని ఆత్మేశ్వరునిగా భావించి అనిర్వచనీయమైన నిర్మలభక్తిని చాటారు. గోపికలు కృష్ణ విరహమును ఒక్క తృటికాలమైననూ సహింపలేకపోయేవారు. గోపికలు అంటే జీవులు....కృష్ణుడంటే పరమేశ్వరుడు. రాసక్రీడ అంటే జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యమే. గోపికా విరహమంటే ఈశ్వర సాయుజ్యం కోసం జీవుడు పడే వేదన.  శ్రీకృష్ణుడు నిష్టూరాలాడడం, దాగిఉండడం, ఏడిపించడం ఇవన్నీజీవునికి పరమేశ్వరుడు పెట్టే పరీక్షలు. సగుణ భక్తులు నిర్మల భక్తులుగా కావడానికి భగవంతుడు వారికి చేసే దోహదము.  శ్రీకృష్ణ లీలలన్నీ  ఆధ్యాత్మికరహస్య భావనలతోనే అర్ధం చేసుకోవాలి. గోపికా వస్త్రాపహరణమంటే ....శరీరమే ఆత్మ అనే అపోహ, దేహంపై అభిమానాన్ని లేకుండా చేయడం కోసం ప్రయత్నించమని చెప్పడానికి సంకేతం. "ఈశ్వరస్సర్వ భూతానా" మనే పరమసత్యాన్ని వస్త్రాపహరణమనే సంకేతం ద్వారా  తెలుపుచున్నాడు. 

భగవంతునికి సంబంధించిన తత్వములో బాహ్యార్ధము అపహాస్యంగా తీసుకోరాదు. సాధారణ కవి కూడా భగవత్కధలలో శృంగార వర్ణనము కేవలము బాహ్యార్ధంతో చేయడు. ప్రతి కధనం యొక్క ప్రయోజనము మోక్షప్రాప్తియే. కావున ఈ గోపికా కృష్ణలీలలన్నీ జీవ పరమేశ్వర సంకేతాలే. భారత సంస్కృతిలో మధుర భక్తి భావనకు పరాకాష్ఠ ఈ గోపికా కృష్ణలీలలు.  భక్తి పరాకాష్ఠ పొందిన భక్తుని విరహం భగవంతుని కొరకు ఇలాగే ఉంటుంది. జయదేవుని గీత గోవిందంలోని వర్ణనలు కూడా ఈ కోవకు చెందినవే. మొదట లౌకిక దృష్టితో అర్ధం చేసుకున్నా చివరికి బుద్ధి వికసించి అలౌకికమైన దివ్య సోపానాలకు ద్వారం తెరుస్తుంది. ఈ గోపికలు హరి పూజార్ధము భూమిమీద జనియించిన సుందర సురకన్యలే కదా! 



దేహింద్రియ మనోబుద్ధులు అన్నీ కలిసినప్పుదే మనకు భక్తి భావన కలుగుతుంది. మనసులో నామము జపము చేస్తూనే దేహముతో భగవంతుని సూత్రాలకు విరుద్ధంగా ఉండే పనులు చేయడం బుద్ధితో వక్ర పనులను చేయడం ఇవన్నీ భక్తి భావనకు భంగం కలుగజేస్తాయి. పూజాగృహములో కొంతసేపు జపము చేసి బయట అందరినీ మోసం చేసే పనులు చేయటం భక్తి అనిపించుకోదు. భక్తుడు దేహ ఇంద్రియ మనోబుద్ధులతో భగవంతుని ధ్యానిస్తూ ఉంటాడు. దేహము కానీ, బుద్ధిగానీ, మనస్సుగానీ ఏ ఒక్కటి సహకరించకపోయినా భక్తి కుదరదు. విభక్తము కానిది భక్తి. భగవంతుడు ప్రతి సాధకునికి 35 సూత్రాలను భక్తుని లక్షణాలుగా చెప్పాడు. 



నిర్దేషుడు, సర్వభూతాలకు మిత్రుడు, కరుణాళువు, నిర్మోహము కలవాడు, నిరహంకారుడు, సుఖ దు:ఖములను సమానంగా చూసేవాడు, సహనశీలుడు, నిత్యసంతుష్టుడు, యోగయుక్తుడు ఆత్మనిగ్రహము కలవాడు, దృఢనిశ్చయము కలవాడు, మనోబుద్ధులను అర్పించినవాడు, ఎవరి వలన లోకములో బాధ జనింపదో లోకముచే ఎవడు బాధపడడో అటువంటివాడు,...ఇత్యాది లక్షణాలతో...

బృందావనంలో ‘రాధాకృష్ణుల రాసలీలలు కన్నుల పండుగగా జరుగుతుంటాయి! పదహారు వేలమంది గోపికలతో, రాధతో యమున ఒడ్డున బాలకృష్ణుడు ‘రాసలీల’ జరిపి గోపికలను ఆనందపరవశులను చేయడం, ఆత్మ - పరమాత్మల సమ్మేళనలోని అంతరార్థాన్ని తెలియచేసేందుకై ఆయన ఈ బృందావనాన్ని రంగస్థలంగా చేసుకొన్నాడు. రాసక్రీడను నిమిత్తమాత్రంగా చేసుకుని, గోపికల్లోని శారీరక మోహావేశాన్ని, ఈర్ష్యాసూయల్ని గోపాలుడు నావాడే అన్న స్వార్థాన్ని, అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన పరతత్వంలో మమేకం కావడం అంటే ఏమిటో తెలియజేయడమే ఈ రాసలీలల్లోని అంతరార్థం.

యోగమాయ సహకారంతో ప్రతి వొక్క గోపికకి ఒక్కో కృష్ణుని సృష్టించి గోపాలుడు తనకే స్వంతం అనే భావనను కలుగజేసి ఆనందంలో ముంచెత్తడంతో వైష్ణవ భక్తకవులు, జయదేవుడు, సూరదాసు స్వామి హరిదాసు, గోవిందస్వామి మొదలైనవారంతా శ్రీకృష్ణ పరమాత్మ ప్రవచించిన తాత్విక సారాన్ని భక్తజనులకు సరళమైన రీతిలో గీతాల రూపంలో  అందించారు. కాళీయమర్దనం, పూతనవధ, దామోదరలీలలు ... ఇలాంటి శ్రీకృష్ణుని లీలలను మనసార స్మరించుతూ  కృష్ణనామాన్ని జపించినవారు శ్రీ కృష్ణ సాయుజ్యాన్ని పొందుతారు.