Monday, September 30, 2019 0 comments By: visalakshi

ఆత్మశక్తి-దైవ ఆరాధన...


ఓం శ్రీ సాయినాథాయ నమో నమః


   
స్వభావరీత్యా మానవునకు ప్రేమానురక్తులను ఆశించడం పరిపాటి. ఆ ఆశలను అందుకోవడంలో విఫలమైనప్పుడు ఆవేశపూరితుడవుతాడు. కానీ ఆలోచిస్తే ఆ ఆశ అన్న భావాన్ని మనసునుండి తొలగించుకునే ప్రయత్నంలో అతను సాధు స్వభావుడవుతాడు.

మహాత్ముల స్వరూపం సదా ఆనంద దీపికలు వెలిగిస్తూ ఉంటుంది. దైవదృష్టికి పరిమితి లేదు. "ఏయధా మాం ప్రపద్యంతే తాంస్తధైవ భజామ్యహం" (నా పట్ల ఎలాంటి భక్తిని కలిగిఉంటే వారికి వారి భక్తి ననుసరించి అలాంటి ప్రతిఫలమిస్తాను) అయితే మహాత్ముల అంత:కరణ వారిని నిందించిన వారిపై కూడా కారుణ్యం కురిపిస్తుంది. బాబా ఎన్నోసార్లు "ఇతరుల మనసుకి కష్టం కలిగేలా మాట్లాడితే అవి నా హృదయాన్నే తూట్లు పొడుస్తాయి. నా అత్యంత సున్నితమైన భాగానికి గుచ్చుకుంటాయని తెలుసుకోండి. ఇతరులను   బాధాకర మాటలతో కోపం కలిగేలా మాట్లాడితే అవి నన్నే బాధిస్తాయి. కానీ వాటిని శాంతంగా సహించే వారే నాకు బాగా తృప్తి కలిగిస్తారు". అని చెప్పి ఉన్నారు. అలా సాయిబాబా జీవులన్నింటా లోపలా, బయటా నిండి ఉన్నారు .ఆ మహా మంగళప్రదమైన ప్రేమమయి సర్వవ్యాపకుడై  భక్తుల హృదయనివాసుడైనాడు...ఓం సాయిరాం.... 

దృఢమైన మనసుతో భగవానుని కొరకు లోకమందలి స్వజన సంబంధములు మరియు మిత్ర పరిచయముల వంటి సమస్త సంబంధములకు ఋణములన్నీ తీర్చుకోవలెను. ఋణవిముక్తులవ్వాలంటే ఆధ్యాత్మిక జీవనమనే సాధు సాంగత్యముతో విష్ణు ఆరాధనలో భక్తిభావ సమన్వితులై భగవచ్చరణారవిందములను ఆశ్రయించడం ద్వారానే మనం ఋణము లనుండి విముక్తులవుతాము.

 సుఖదు:ఖములు తాత్కాలికము. వాటి రాక పోకలు శీతగ్రీష్మ అనుభవముల వంటివి. జీవితానుభవముల వలన అవి కలుగుచుండును. కావున కలత పొందక వాటిని సహింపవలెను. నిజానికి సుఖదు:ఖములనేవి మనస్సు వలన కలుగునన్నది మనకు విదితము. కాబట్టి మనసును దైవ ఆరాధనలో నిమగ్నం చేసి  ప్రశాంతతను అలవరచుకోవాలి....ఓం సాయిరాం...,
బాబా తమ కమలసుమదళంలాంటి చేతిని శిరస్సుపై పెట్టటంతోనే అనేక జన్మలనుంచీ సంతరించుకొన్న పాపాలు ప్రక్షాళనం అయిపోయి నా లాంటి సాయియొక్క ప్రేమిక భక్తులు పవిత్రులవుతారు. బాబాస్పర్శతో హృదయంలో అష్టసాత్విక భావాలు ప్రకటమవుతాయి. పారాయణ చేస్తున్నా, పురాణాలు చదువుతున్నా అడుగడుగునా బాబా కనిపిస్తారు. రాముడు కృష్ణుడు, వేంకటేశ్వరుడు....ఏ దేవాలయానికి వెళ్ళినా.. ఆ రూపాలలో బాబా దర్శనమిస్తారు. ఆహా జన్మ ధన్యము కదా!... కాయా, వాచా, మనసా శ్రీ సాయినాధునికి సాష్టాంగం చేస్తే ధర్మ అర్ధ కామ మోక్షాలనే నాలుగు పురుషార్ధాలను, కర్మ,జ్ఞాన యోగ, భక్తి- అనే నాలుగు మార్గాలతోనూ ఈశ్వరుడు ప్రాప్తిస్తాడు. మనసనే తోటలో భక్తి అనే నీటిని చల్లితే వైరాగ్యం మొలకెత్తుతుంది. జ్ఞానమనే పూలు విరగబూస్తాయి. కైవల్యమనే ఫలం లభిస్తుంది. జ్ఞానమయం విప్పారుతుంది. జనన, మరణాలు నిశ్చయంగా తప్పిపోతాయి.."ఓం సాయిరాం..."

" మా మనస్సును అంతర్ముఖము చేయుము. దానిని లోపలివైపు పోవునట్లు చేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలిసికొను శక్తిని కలుగజేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగునటుల చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించెదము. సుఖదు:ఖానుభవములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకొనుడు... మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక!"...ఓం సాయిరాం...

"తడిసిన కట్టెలకు నిప్పు సెగను పెట్టగానే తేమ పోయినట్లు, సాధు సా౦గత్య౦ వల్ల  లౌకికుల హృదయాల్లోని లోభ మోహాలనే తేమ పోతు౦ది."


"ఒక దీపాన్ని, మరో దీప౦ వెలిగిస్తు౦ది. అ౦తమాత్ర౦ చేత వెలిగి౦చే దీప౦ వెలుగు తగ్గిపోదు. అలాగే ఇతరులకు బోధి౦చే కొద్దీ మీ జ్ఞాన౦ పెరుగుతు౦దే కానీ తరగదు." .."ఓం సాయిరాం".


సర్వం శ్రీ సాయి నాధార్పణ మస్తు

Friday, September 27, 2019 0 comments By: visalakshi

శ్రీ సుబ్రహ్మణ్యుడే సుబ్బారాయుడు గా నిజరూప దర్శనం....


               ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి నమోనమ:500 ఏళ్ళ క్రితం జరిగిన అద్భుత సంఘటన -
శ్రీ సుబ్రహ్మణ్యుడే శ్రీ  సుబ్బారాయుడుగా వెలసిన క్షేత్రం ,
శ్రీ సుబ్బారాయుడి నిజరూప దర్శనం.................................... ఫేస్ బుక్ సౌజన్యంతో ఈ టపా.....

పాణ్యం మండలం సుబ్బరాయుడు కొత్తూరు భిన్నమైన ఆచారాన్ని పాటిస్తోంది. ఆదివారం అందరికీ సెలవు. ఆ పల్లెకూ సెలవే. కానీ మిగిలినవారికంటే కాస్త ఎక్కువ సెలవు. ఆదివారం మాంసాహారం ముట్టకపోవడం, అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఈ పల్లెలో అనాదిగా వస్తున్న ఆచారం. మిగిలిన రోజుల్లో మాంసాహారం తినాలన్నా.. ఆ ఊరిలో దొరకదు. ఆరు కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఆసక్తి కలిగించే ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్య స్వామి ఆలయ స్థల పురాణ నేపథ్యం ఉంది.

*ఏమిటా కథ..?*
500 ఏళ్ళ క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణుడిని ఆశ్రయిం చాడు. మాఘ శుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగుతాయని బ్రాహ్మణుడు సూచించాడు. దీంతో చెన్నారెడ్డి కాడెద్దులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో నాగలికి ఉన్నట్లుండి భూమిలో ఏదో అడ్డుతగులుతుంది. ఆ క్షణంలోనే ఆకాశంలో 12 తలల నాగుపాము రూపం ప్రత్యక్షమౌతుంది. ఆ తేజస్సుకు రైతు కంటిచూపు కోల్పోతాడు.

కాసేపటి చుట్టు పక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కులాగి చూస్తారు. అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం బయట పడుతుంది. ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బరాయుడినని(సుబ్రహ్మణ్యేశ్వస్వామి), మూడు రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెబుతాడు. అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటిచూపు వస్తుంది. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్థులు నిర్ణయించుకుంటారు. స్వామివారిని వేడుకుంటారు. ‘రాత్రి రోకలిపోటు తరువాత మొద లుపెట్టి.. తెల్లవారు జామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలి’ అని స్వామి సెలవిస్తాడు. లేదంటే ఏడుగురు బలి అవుతారని హెచ్చరి స్తాడు. స్వామివారి స్వయంభు విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు. కోడి కూతలోగా ప్రహరీ మాత్రమే పూర్తవుతుంది. పైకప్పులేని ఆలయం సిద్ధమౌతుంది. అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా.. స్వామి వెలసిన తరువాత సుబ్బరాయుడు కొత్తూరుగా మారింది. ఇదీ స్థల పురాణం.

*ఆదివారం సెలవెందుకు..?*
సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం. ఎస్‌ కొత్తూరు గ్రామానికి ప్రతి ఆదివారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. కేవలం ఆదివారం రోజే 6 నుంచి 8 వేల మంది భక్తులు స్వామిని సందర్శిస్తారు. ఆ ఒక్కరోజే సుమారు మూడు వందల అభిషేకాలు జరుగుతాయి. స్వామిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. తమను చల్లాగా చూస్తున్న స్వామి కోసం ఆదివారం ఆచారాన్ని ఆలయం నిర్మించిన సమయంలోనే ప్రారంభించారు గ్రామస్థులు. ఆదివారం వస్తే మాంసాహారం వండరు, తినరు. గ్రామంలో మాంసాహార దుకాణాలు లేవు. మామూలు రోజుల్లో కావాలన్నా.. గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందివర్గం వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఇక పండుగ మరుసటి రోజున మాంసాహారంతో కర్రిపండుగ నిర్వహించడం సాధారణం. ఆ పండుగ ఆదివారం వస్తే.. సోమవారానికి వాయిదా పడుతుంది.

*ఆ మూడు మాసాల్లోనూ అంతే..*
ఏడాది పొడవునా ఆదివారాలతోపాటు కార్తీకం, మాఘం, శ్రావణ మాసాల్లో గ్రామస్థులు మాంసాహారం ముట్టరు. ఈ కట్టుబాటును ఎవ్వరూ మీరింది లేదు. ఆదివారాలతో కలిపి ఇలా ఏడాదిలో సుమారు నాలుగు నెలల పాటు మాంసా హారానికి దూరంగా ఉంటూ గ్రామస్థులు స్వామిపై తమకున్న భక్తిని చాటుకుం టున్నారు. ప్రతి ఆదివారం వేలాదిగా వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నారు.

*అంత్యక్రియలకూ సెలవే....*
కొత్తూరులో 220 కుటుంబాలు ఉన్నాయి. జనాభా సుమారు 900. ఆదివారం గ్రామస్థుల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించరు. మరుసటిరోజు వరకూ మృత దేహాన్ని ఇంటివద్దే ఉంచుతారు.సోమవారం అంత్యక్రియలు నిర్వహి బస్తారు. ఇందుకూ స్వామిపై ఉన్న అపార మైన భక్తే కారణం. గ్రామానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అలాంటి పవిత్రమైన రోజున మృతదేహాన్ని తీసుకువెళితే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని గ్రామస్థులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మృతదేహంతో వెళితే భక్తులకు అంటు తగులుతుందని తమకు తామే కట్టడి చేసుకున్నారు.

*ఎలా చేరుకోవచ్చు...?*
బనగానపల్లె మండలం నందివర్గం నుండి S.కొత్తూరు 5 కి.మీ దూరంలో కలదు.ఇక్కడ నుండి ఆటో సదుపాయం కలదు.

 ఓం నాగేంద్రాయ నమ: