Friday, August 21, 2020 0 comments By: visalakshi

**వినాయక చవితి**

 

వినాయక చవితి ప్రాశస్త్యం 


భాద్రపద శుద్ద చవితి నాడు గౌరీశంకరులకు పుత్రుడిగా గణపతి అవతరించడం వల్ల, గొప్ప పర్వదినం గా గణేశ చతుర్ది జరుపుకొంటాం. విఘ్నాలను తొలగించి శుభాలను ఇచ్చే శుభదాయకుడు గణపతి. అన్ని శుభ కార్యాలలో ఆయనకే అగ్ర పూజ. 'గ' అనే శబ్దం జ్ఞానవాచకం. 'ణ' అంటే నిర్వాణం. జ్ఞాన నిర్వాణాలకు శాసకుడైన అధిపతి కనుక గణేశుడని అంటాం. విఘ్నాలు అనేవి అజ్ఞానం వల్ల కలుగుతాయి. అజ్ఞానం తో చేసే పనుల వలన విఘ్నాలు తప్పవు. గణపతి జ్ఞానాని కి మూర్తి, కనుక జ్ఞానాన్ని పొందడానికే ఆయన్ని పూజిస్తాం. ఆయన విఘ్న గణపతి మాత్రమే కాదు, వరద గణపతి కూడా. గణపతిని శ్రద్దా భక్తులతో పూజిస్తే, తలపెట్టిన కార్యానికి సంబంధించిన దేవత కూడా సంతుష్టి పొంది ఫలాన్నిస్తుంది. గణపతి ని పూజిస్తే శత్రుక్షయం జరుగుతుంది. గ్రహబాధలు తొలగుతాయి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. శ్రీ గణపతి ని పూజించినవారు జీవన్ముక్తులవుతారు. అంతే కాదు, గణపతి ఆది దేవుడు. ప్రతి ఒక్కరూ ఆయనను పూజించాల్సిందే. గ్రహాల్లో శని గ్రహ ప్రభావం అందరికి తెలిసినదే, శని ఇతరులను వారి కర్మానుసారం పట్టి పీడించే గ్రహం, అటువంటి శని దేవుడు రక్షించమని వేడుకునేది గణపతినే, ఎలాగంటే ఇతర బాధల నుండి తనను తానూ రక్షించుకునేందుకు శనిమహాత్ముడు ధరించేది విజ్ఞేశ్వర కవచాన్నే. జ్యోతిష్యపరం గా చూసినా ఈ చవితి రోజున వినాయకుడిని పూజిస్తే గ్రహబాధలు వంటివన్నీ తొలగుతాయి.   ముఖ్యం గా గమనించాల్సిన విషయమేమిటంటే గణపతి ప్రకృతి దేవుడు. గణపతి పూజలందుకొనేది ప్రకృతి లో లభించే వివిధ రకాల పత్రితోనే. అందుకే మనం ప్రకృతి లో లభించే సహజ సిద్ద మైన వాటితో, అది కూడా నీటిలో ఆరోగ్యవంతం గా కరిగే బంకమట్టి తో తయారు చేసిన గణపతి ప్రతిమలను ఆరాధించడం వలన ఆ గణపతి కి మరింత చేరువగా పూజించుకొని అత్యంత ప్రీతిపాత్రులం కాగలం.  మన ప్రతి పనికీ, ఆచారానికి, వ్యవహారానికి వెనుక ఒక మహత్తరమైన అర్ధం, పరమార్దం దాగి ఉంటాయి. ఈ పూజకు ఉపయోగించే పత్రాల లో అనేక ఆరోగ్య పరమైన ప్రయోజనాలే కాకుండా ఎన్నో దైవపరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. మహోత్కృష్టమైన హిందూ ధర్మం లో మహర్షులు ఔషధాలను, మూలికలను పూజా ద్రవ్యాలుగా, యజ్ఞ యాగాది క్రతువులలో సమిధలుగా పేర్కొన్నారు. అటువంటి వాటితో పూజలు, యజ్ఞ యాగాదులు చేసి సద్గతులు పొందవచ్చు.  గణపతి కి ఎరుపు రంగు అత్యంత ప్రీతి పాత్రం. గణపతి వక్రతుండం ఓంకారానికి ప్రతీక. లంబోదరం బ్రహ్మాండానికి సంకేతం. లంబోదరానికి బిగించిన సర్పం కుండలిని శక్తి కి సంకేతం గా చెబుతారు. గణపతి చేతిలోని పాశ అంకుశాలు రాగ ద్వేషాలు నియంత్రించే సాధనాలు. ఆయనకి ప్రియమైన భక్ష్యం మోదకం. మోదకం అంటే ఆనందాన్నిఇచ్చేది. గణపతి కృప వలన ఆనందఫలం లభిస్తుంది. గణపతి పూజా విధానం లో మరొక ముఖ్యమైన ప్రక్రియ "దోర్భికర్ణం" అంటే చేతులతో చెవుల్ని పట్టుకోవడం. కుడి చేత్తో ఎడమ చెవి, ఎడమ చేత్తో కుడి చెవి ని పట్టుకుని, కూర్చుని లేచి గుంజీలు తీయడం. ఇలా చేయడం వల్ల గణపతి సంతుష్టుడవుతాడని, దీని వలన మన కోరికలు నేరవేరుస్తాడని ఒక నమ్మకం. వినాయక చవితి రోజున ఏకవింశతి పత్ర పూజ , అంటే 21 రకాల పత్రాలతో పూజించే విధానం విశిష్టమైనది. గరిక పత్రీ గణపతి కి అత్యంత ప్రియమైన పూజాద్రవ్యం. వంద యజ్ఞాలు చేస్తే కలిగే ఫలితం కన్నా ఒక్క గరిక పోచ తో చేసే పూజ అత్యంత ఫలితాన్నిస్తుందని, గరిక లేని పూజ వ్యర్దమైనదని సాక్షాత్తు గణపతే పేర్కొన్నాడట.  ఆషాడం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ మాసాల లో ఆరోగ్య సమస్యలు అధికం గా ఉంటాయని అందరికి తెలిసిన విషయమే, కావున మనం ఈ మాసాలలో ఆచరించే పండుగలు, పర్వదినాలలో వినియోగించే ద్రవ్యాలలో, ప్రసాదాలలో అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండేట్టు, మన మహర్షులు ఏర్పరచడం గమనించవలసిన అంశం. గణేశచతుర్ధి నాడు మనం వినియోగించే వివిధ పత్రులలో దాగి ఉన్న ఆరోగ్య అంశాలను తెలుసుకొందాం.  బృపతి పత్రం (వాకుడు) ఈ పత్రి లోని ఔషద గుణం, ఉబ్బస బాధ ని తగ్గిస్తుంది.  మాచి పత్రం (ధవనం) ఈ పత్రి లోని పరిమళo ఒత్తిడిని తగ్గించి ఉల్లాసాన్ని కలిగిస్తుంది.  బిల్వపత్రం ( మారేడు) ఈ పత్రి మధుమేహం , విరేచనాలకు విరుగుడుగా పనిచేస్తుంది.  దూర్వపత్రం (గరికె) ఈ పత్రి యాంటివైరల్ శక్తి , రోగ నిరోధక శక్తి కలిగి ఉంటుంది.  దుత్తర పత్రం (ఉమ్మెత్త) ఈ పత్రి ఊపిరితిత్తుల పై ప్రభావం చూపి వ్యాకోచింపచేయడం ద్వారా ఉబ్బస వ్యాది తగ్గుతుంది.  బదరీ పత్రం (రేగు) ఈ పత్రి చర్మ వ్యాధులకు అధ్బుతం గా పనిచేస్తుంది.  తూర్యా పత్రం (తులసి) ఈ పత్రి శరీరం లోని ఉష్ణాన్ని తగ్గిస్తుంది, జలుబు, దగ్గు వంటి వ్యాధులను దరిచెరనివ్వదు.  అపామార్గ పత్రం (ఉత్తరేణి) ఈ పత్రం దగ్గు, ఉబ్బసం వంటి వ్యాదులకు చక్కటి పరిష్కారం లాగ పనిచేస్తుంది  చూత పత్రం (మామిడి) ఈ పత్రం నోటి దుర్వాసన, పళ్ళు, చిగుళ్ళ సమస్యలకు ఉపశమనాన్నిస్తుంది.  జాజి పత్రం (జాజి) ఈ పత్రి చర్మ వ్యాదులను, జననాంగ వ్యాదుల నుండి రక్షిస్తుంది.  గండకి పత్రం (అడవిమొల్ల యుదిక) ఈ పత్రి అతి మూత్ర సమస్య నుండి ఉపశమనాన్నిస్తుంది.  అశ్వత్థ పత్రం (రావి ఆకు) ఈ పత్రి విశేషమైన ఔషధ గుణాల్ని కలిగినటువంటిది, ముఖ్యం గా నోటి దుర్వాసన జననాంగ సమస్యలని తగ్గిస్తుంది.  అర్జున పత్రం( మద్ది ఆకు) ఈ పత్రి రక్త స్థంభనం, గుండె ఆరోగ్యానికి చాలా చక్కగా పనిచేస్తుంది.  అర్క పత్రం (జిల్లేడు) ఈ పత్రి నరాల బలహీనత ఉన్నవారికి, చర్మవ్యాదులు కలిగిన వారికి చక్కగా పనిచేస్తుంది.  విష్ణుక్రంతం (పొద్దుతిరుగుడు) ఈ పత్రి చర్మాన్నికాపాడే గుణాన్ని కలిగి ఉంటుంది.  దాడిమ పత్రం (దానిమ్మ) ఈ పత్రి వాంతులు, విరేచనాలను అరికట్టడానికి, శరీరం లో ఉన్న హానికర క్రిములను నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది.  దేవదారు పత్రం (దేవదారు) ఈ పత్రి శరీర ఉష్ణాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది.  మరువకం పత్రం (మరువం) ఈ పత్రి పరిమళం తో మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.  సింధువార పత్రం(వావిలాకు) ఈ పత్రి కీళ్ళ నొప్పులకు మంచి ఔషధం.  శమీ పత్రం (జమ్మి చెట్టు) ఈ పత్రి నోటి వ్యాధులను తగ్గిస్తుంది.  కరవీర పత్రం (గన్నేరు) ఈ పత్రి ఎంతకు మానని పుళ్ళు తగ్గించడానికి దీని వేర్లు, బెరడుని ఉపయోగిస్తారు   గణపతి భక్తి సులభుడు. ప్రయత్నం లేకుండానే మొలిచే గరికలే గణపతి కి ప్రీతి. తానూ కూడా అలాగే భక్తులకు శ్రమలేకుండా అనుగ్రహించే స్వామి. కేవలం మట్టి తో రూపు నిచ్చి గడ్డిపోచలతో, పత్రాలతో, పళ్ళ తో పూజించి, గుంజీలు తీస్తే స్వామి ఎంతో సంతృప్తి పొంది, సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తాడు.


**మట్టి తో చేసిన వినాయకుడ్ని ఎందుకు పూజించాలి**


హిందూ సంప్రదాయం లో మనం చేసే ప్రతి పనికి చక్కటి ఆధ్యాత్మిక మరియు సామాజిక స్పృహ ఉంటాయి. మన పూర్వీకులు ఏర్పరిచిన ఆచారాలు సంప్రదాయాల లో ఎన్నో శాస్త్రీయ కోణలు ఎంతో విజ్ఞానం ఇమిడి ఉన్నాయి. ఇటువంటి ఆచారాల్ని మనం గౌరవించి మన జీవనాన్ని సుఖమయం చేసుకోవడం తో పాటు భవిష్యత్తు తరాల ఉన్నతి కి పాటు పడాలి. 


వినాయక చవితి మనకు వర్ష ఋతువు లో వస్తుంది. ఎండాకాలం లో చెరువులు, బావులు, కుంటలు ఎండడం వలన నీరు తగ్గుతుంది. ఈ సమయం లో అందులో ఉన్న బురద మట్టి ని బయటకు తీయడం వలన వర్షాలు పడినప్పుడు వాన నీటిని నిలువ చేసుకొనే సామర్థ్యం పెరుగుతుంది.


భగవంతుడు విశ్వవ్యాపిత. విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. అందుకే మట్టి తో వినాయకుడిని చేసి భగవంతుని విశ్వవ్యాపకత్వాని తెలియ చేయడమే. మట్టి నుండే అన్ని ప్రాణులు సృష్టింపబడ్డాయి. చివరకు సర్వ జీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి ధర్మం. మట్టి ఎక్కడైనా ఎవరికైనా లభిస్తుంది . బీద, ధనిక తేడా ఉండదు. భగవంతుడు అందరివాడు. మట్టి అందరికి సులభం గా లభిస్తుంది. అందుకే మట్టి తో వినాయకుడిని చేసి పూజించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.


ఇలా పూజించిన విగ్రహాన్ని తిరిగి ఆ చెరువుల్లోని నిమజ్జనం చేస్తారు. ఇలా నిండిన చెరువుల్లో మట్టిని వేయడం వలన బురదగా మారి, చెరువు అడుగు భాగానికి చేరి నీరుని ఇంకకుండా అడ్డుపడుతుంది. 


ఇక సామాజిక కోణాన్ని పరిశీలిస్తే అందరు కలిసి మట్టి ని తీయడం, అందరు కలిసి తిరి నిమజ్జనం చేయడం వలన జనుల మధ్య చక్కటి ఐక్యత స్నేహ భావాలు పెరుగుతాయి. ఇలా అందరూ కలిసి చేసే మంచి పనుల వలన పర్యావరణాన్ని కాపాడుకొంటూ, సామాజిక హితం కొరకు కృషి చేస్తూ చక్కటి జీవన శైలిని గడపాలి.

         జై గణేష్ మహరాజ్...

    

    

Thursday, August 13, 2020 0 comments By: visalakshi

**శ్రీ దత్త గురవే నమః*

*శ్రీ దత్తాయ గురవేనమః*


*భక్తితత్వమే మహిమాన్వితం!*

సంతాపాలన్నీ సంకల్ప జనితాలు. ఆవేదనలన్నీ ఆలోచనా ఫలితాలు. విచారము లేకుండా విషాదము రాదు. భావనలోనే బాధలు పుట్టుకొస్తాయి. వర్షం కురిసింది అంటే ఆకాశంలో మేఘాలున్నట్లే. గగనంలో నిలిచియున్న మేఘాలే వర్షాలై కురుస్తాయి. మనోగగనంలో చలించే సంకల్ప మేఘాలే బ్రతుకులలో బాధల వర్షాన్ని కురిపిస్తాయి. వేదనా వడగళ్లను రాల్చుతాయి.

బాధపడటం ఎవ్వరికీ ఇష్టం లేదు. అలాగని బాధల నుండి విడిపడటం ఎవరికీ సాధ్యం కావటం లేదు. అంటే, బాధలు బ్రతుకుల్లో అంతగా పెనవేసుకుని ఉన్నాయని అర్థం. విడదీయలేని రీతిలో అతుక్కుపోయాయి. బాధలు ఇష్టం లేకపోయినా, బాధపడటం కష్టంగానేయున్నా, బాధలుపడుతూ బ్రతకడం మనిషికి అనివార్యంగా ఉంది. అలవాటుగా మారింది. ఎందుకో తెలుసా! బాధలు నాకు వద్దు అంటున్నది ఎవరో ఒక్క క్షణం ఆలోచించండి. బాధలను వరించినవారే. ఇక్కడే ఉంది చిక్కుముడి.  నేను ఇంతకాలం జీవించాను అనేవారే గాని అలా జీవించడంలో ఎంత బాధను ప్రోది చేసుకున్నాను అని ప్రశ్నించుకొనేవారు అరుదుగా ఉంటారు. ఒకనాటి బాధలు నేడు లేకపోవచ్చు. బాధానుభూతులు మనస్సుల నుండి దూరం కాలేదనే వాస్తవం తెలిసినవారెందరు? బ్రతుకులో బాధలున్నాయి. బుద్ధిలో బాధల జ్ఞాపకాలూ ఉన్నాయి. అవే బాధాస్మృతులు. మతులను చెడగొట్టేవి మనుగడను కాలరాచేవి ఈ స్మృతులే. ఎవరి మనస్సులైనా చేదు జ్ఞాపకాలతోనే చిందులేస్తూ ఉంటాయి. స్మృతులను ఆపడం మనిషికి ఎలా సాధ్యం కాదో, వాటి మధ్య హాయిగా జీవించడం కూడా అలాగే సాధ్యం కాదు. ఇక్కడే బ్రతుకు మోయలేని బండగా మిగిలిపోతోంది.

మనసేమీ బాగలేదు. అలా సినిమాకెళ్దాం. ఇలా మిత్రుల మధ్య గడుపుదాం అని పలుకుతూ ఉంటారు. అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు కూడా. నిజమే.   బావుంది.. ఫలితమేమిటి? అలా చెయ్యడం వల్ల బాగలేని మనస్సు బాగుపడుతుందా? కానే కాదు. బాగుపడలేని మనస్సు, బాధపడే మనస్సు తాత్కాలికంగా బాధను మరచిపోతుంది. అంతే.  సినిమాలో ఉండేది రెండుమూడు గంటలే. బంధుమిత్రాదుల మధ్య ఎంతకాలం ఉండగలం? వాళ్లను, లేదా ఆ పరిస్థితుల్ని విడిచిపెట్టి రాగానే మళ్లీ జ్ఞాపకాలు ప్రారంభమవుతాయి. స్మృతులు కదుల్తాయి. మతులు కలవరపెడతాయి. మరొక విషయాన్ని కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. వినోదాల మధ్య ఉన్నంత మాత్రాన జ్ఞాపకాలు రావని చెప్పలేము. సరదాగా స్నేహితుల సరసన నవ్వుతూ కాలం వెళ్లబుచ్చుతున్నా, బాధల జ్ఞాపకాలు రావచ్చు. అలాంటి సమయాల్లోనే ప్రక్కవారు ”ఏమిటి? ఉన్నట్లుండి అదోలా మారిపో యారు అని మన ఆంతర్యంలోని మూగబాధను ముఖాలలో చూసి మాట్లాడుతూ ఉంటారు. అర్థమైందా? మన గతాలు స్వగతాలుగా మారి, అనుక్షణం బుద్ధిలో స్వాగత తోరణాలను అలం కరిస్తూ ఉన్నంతకాలం బాధల నుండి విడిపడటం మనిషికి సాధ్యం కాదు. మనం మనకు జ్ఞాపకం వస్తున్నంత కాలం మనస్సు మదనపడుతూనే ఉంటుంది. మనుగడ మలినపడుతూనే ఉంటుంది.  గతాన్ని పూర్ణంగా తుడచివేయాలి. బాధానుభవాలను గూర్చి మనస్సు ఆలోచించకుండా చూసు కోవాలి. అదెలా సాధ్యం? స్మృతుల మధ్య సతమతమయ్యే మనస్సు, బాధానుభవాలలో తలదూర్చి విలపించే బుద్ధి వాటి నుండి విడిపడాలి.

అలా జరగాలి అంటే, మనస్సు మరోకోణంలో ఆలో చించడం ప్రారంభించాలి. బుద్ధి మరోవిధంగా చరించగలగాలి.  అయితే, ఒక్క సత్యాన్ని ఇక్కడ విస్మరించకూడదు. మనస్సు దేనిని గురించి ఆలోచించినా, బుద్ధి మరొక చోట సంచరించినా ఫలితం మాత్రం శూన్యంగానే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆలోచనలన్నీ ప్రపంచానికి సంబంధించే ఉంటాయి. మన స్మృతులు అందుకు భిన్నంగా లేవు. సంబంధాలతో ముడిపడియున్న ఈ ప్రపంచంలో ఒక అనుభవం మరొక అనుభవంతో కరచాలనం చెయ్యకపోదు.  చీకటిని చీకటితో పోగొట్టలేము. (నహి తమ స్తమసో నివర్తకమ్‌) మరి బాధల వలయం నుండి ఎలా విడి వడాలి? దానికి మార్గమేమిటి? మార్గం ఉంది. అదే భక్తి. భక్తి ఏం చేస్తుంది? భక్తి వల్ల బ్రతుకులో ఏం జరుగుతుంది? భక్తి మనస్సును సం స్కరిస్తుంది. మనస్సులోని స్మృతులను శాశ్వతంగా మరుగున పడేస్తుంది. మహిమను ఆవిష్కరిస్తుంది.  పరమేశ్వరునితో మనకుండే సంబంధాన్ని భక్తి గుర్తుచేస్తుంది. భగవంతుని స్మరణతో బుద్ధిని నింపేస్తుంది. జ్ఞాపకాలతో గొడవపడే మనస్సును గోవిందునితో ముడిపడి జీవించేలా చేస్తుంది. గతం పంచే అనుభవ స్మృతుల మధ్య శోకసాగరంలో మునిగి పోతూ భగవంతుని విస్మరించాం. సదా పరమేశ్వరుని చింతించడంలో గతానుభూతుల్ని శాశ్వతంగా పాతిపెట్టి ఆనందంగా, తృప్తిగా జీవించగలు గుతాము. ఇదంతా భక్తి వలన కలిగే దివ్యమైన శక్తి.  బాధలను శాశ్వ తంగా మరుగుపరచి, మహిమతో మనస్సును ఊరేగించే స్థితి.  భక్తి ఎలా చెయ్యాలి? భక్తితో బుద్ధిని భవ్యంగా ఎలా మార్చుకోవాలి? బుద్ధిలో సదా భగవంతుడే శోభించేలాగా ఆచారాన్ని, విచారాన్ని కదలిస్తూ ఉండటమే భక్తి.

 శ్రీ దత్తస్వామి తన సంకల్పంతోనే దుష్టశిక్షణ చేయగలడు. అయినా కలియుగంలో బలహీనులు, అల్పాయుష్కులైన మానవులకు మనసును నిగ్రహించే శక్తి బహుస్వల్పమని పరమాత్మకు తెలుసు. కాబట్టే శ్రీ పాద శ్రీ వల్లభుడుగ మానవరూపముతో అవతరించుట, జగద్గురువుగా ప్రజలకు విశదపరచుట జరిగింది. ఆయన అపారదయామయుడు. తన నామస్మరణతోనే, దత్త నామస్మరణతోనే, గురు నామస్మరణతోనే రక్షణ యిస్తానని వాగ్దానం చేసినాడు.  అంతేకాదు. అనేక వేలమంది తపస్వులయొక్క తపోశక్తిని,  గురువుల ధారణాశక్తిని  ఆస్తికులైన మానవులకు అదృశ్యంగా అందించి, ప్రజలందరినీ గురుభక్తిమార్గమునందు ప్రవర్తించునట్లు చేయ సంకల్పించినారు .కలిపురుషుని కబంధహస్తాలకు గురుభక్తులైనవారు చిక్కరు. ఇది బ్రహ్మదేవుడు కలిపురుషునికి ప్రారంభంలోనే చెప్పిన నిబంధన.

     శ్రీ పాదుల సంకల్పంతో అనేక మంది గురువుల సంకల్పబలంతో ఇటీవల సర్వులకూ భక్తిమార్గం లభించింది. యాత్రలు చేయుటయందు దైవ దర్శనము చేయుటయందు అభిరుచి పెరిగింది. ఇది కలిపురుషునికి కంటగింపైనది. ఏ విధంగానైనా దైవ దర్శనాలు భక్తులకు లేకుండ చేయుటే లక్ష్యంగా ఈ *కరోనా వ్యాధి* అనే అస్త్రాన్ని ప్రయోగించి భక్తులను భయభ్రాంతులను చేయ ప్రయత్నిస్తున్నాడు. కానీ గురువుల సంకల్పము, దత్త సంకల్పము మహా శక్తివంతమైనవి.గుడిలోని దైవమే గుండెలో వున్నాడు. ప్రతి భక్తుని గుండె ఒక గుడియై నిరంతరారాధన అపారంగా జరుగుచున్నది.ఎవరింటిలో వారు వుండి మహత్తరమైన ఆరాధన చేయుచున్నారు. మనసు నిలుపుకొనుటకై ఒక రూపము అవసరమైనది. అందువలననే దేవాలయములు వెలసినవి. మహర్షులయొక్క మరియు సద్గురు శ్రీ పాద వల్లభుల పరంపర యొక్క మహాసంకల్పము చేత కలిపురుషుని ప్రభావము అణగారిపోవును.ఇది తథ్యము. గురు భక్తులారా! ప్రస్తుత పరిస్థితుల్లో నిరంతరము గురునామ స్మరణయే గురు భక్తుల చేతిలోని బ్రహ్మాస్త్రం.

నేటి మంత్రపఠనం*

#దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి - శ్రీ దత్త నామ కవచం - ఫలితాలు

దత్తపరమైన జ్ఞానం చెప్పుకోవడం, వినడం అనే క్రియవల్ల అన్ని అమంగళములు నశించి పోతాయి అంటూ దత్తుడి మహిమ చెప్పుకోవడం వల్ల వచ్చే ఫలితం చెప్తూ వేదధర్ముడు దీపకునికి ఒక 108 అద్భుత దత్తనామములు చెప్తాడు. ఆ దత్తనామాలు నిత్యానుష్టానం చేసేవాడిని కవచంలా స్వామి కాపాడతాడు.

#దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి*

ఓం శ్రీ దత్తాయ నమః
ఓం దేవదత్తాయ నమః
ఓం బ్రహ్మదత్తాయ నమః
ఓం శివదత్తాయ నమః
ఓం విష్ణుదత్తాయ నమః
ఓం అత్రిదత్తాయ నమః
ఓం ఆత్రేయాయ నమః
ఓం అత్రివరదాయ నమః
ఓం అనసూయాయ నమః
ఓం అనసూయాసూనవే నమః 10
ఓం అవధూతాయ నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధర్మపరాయణాయ నమః
ఓం ధర్మపతయే నమః
ఓం సిద్ధాయ నమః
ఓం సిద్ధిదాయ నమః
ఓం సిద్ధిపతయే నమః
ఓం సిధ్ధసేవితాయ నమః
ఓం గురవే నమః
ఓం గురుగమ్యాయ నమః 20
ఓం గురోర్గురుతరాయ నమః
ఓం గరిష్ఠాయ నమః
ఓం వరిష్ఠాయ నమః
ఓం మహిష్ఠాయ నమః
ఓం మహాత్మనే నమః
ఓం యోగాయ నమః
ఓం యోగగమ్యాయ నమః
ఓం యోగాదేశకరాయ నమః
ఓం యోగపతయే నమః
ఓం యోగీశాయ నమః 30
ఓం యోగాధీశాయ నమః
ఓం యోగపరాయణాయ నమః
ఓం యోగిధ్యేయాంఘ్రి పంకజాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం దివ్యాంబరాయ నమః
ఓం పీతాంబరాయ నమః
ఓం శ్వేతాంబరాయ నమః
ఓం చిత్రాంబరాయ నమః
ఓం బాలాయ నమః
ఓం బాలవీర్యాయ నమః 40
ఓం కుమారాయ నమః
ఓం కిశోరాయ నమః
ఓం కందర్ప మోహనాయ నమః
ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః
ఓం సురాగాయ నమః
ఓం వీరాగాయ నమః
ఓం వీతరాగాయ నమః
ఓం అమృతవర్షిణే నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం అనుగ్రహరూపాయ నమః 50
ఓం స్ధవిరాయ నమః
ఓం స్ధవీయసే నమః
ఓం శాంతాయ నమః
ఓం అఘోరాయ నమః
ఓం మూఢాయ నమః
ఓం ఊర్ధ్వరేతసే నమః
ఓం ఏకవక్త్రాయ నమః
ఓం అనేకవక్త్రాయ నమః
ఓం ద్వినేత్రాయ నమః
ఓం త్రినేత్రాయ నమః 60
ఓం ద్విభుజాయ నమః
ఓం షడ్భుజాయ నమః
ఓం అక్షమాలినే నమః
ఓం కమండలధారిణే నమః
ఓం శూలినే నమః
ఓం శంఖినే నమః
ఓం గదినే నమః
ఓం ఢమరుధారిణే నమః
ఓం మునయే నమః
ఓం మౌనినే నమః 70
ఓం శ్రీ విరూపాయ నమః
ఓం సర్వరూపాయ నమః
ఓం సహస్రశిరసే నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రబాహవే నమః
ఓం సహస్రాయుధాయ నమః
ఓం సహస్రపాదాయ నమః
ఓం సహస్రపద్మార్చితాయ నమః
ఓం పద్మహస్తాయ నమః
ఓం పద్మపాదాయ నమః 80
ఓం పద్మనాభాయ నమః
ఓం పద్మమాలినే నమః
ఓం పద్మగర్భారుణాక్షాయ నమః
ఓం పద్మకింజల్కవర్చసే నమః
ఓం జ్ఞానినే నమః
ఓం జ్ఞానగమ్యాయ నమః
ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః
ఓం ధ్యానినే నమః
ఓం ధ్యాననిష్ఠాయ నమః
ఓం ధ్యానస్ధిమితమూర్తయే నమః 90
ఓం ధూళిదూసరితాంగాయ నమః
ఓం చందనలిప్తమూర్తయే నమః
ఓం భస్మోద్ధూళితదేహాయ నమః
ఓం దివ్యగంధానులేపినే నమః
ఓం ప్రసన్నాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ప్రకృష్టార్ధ ప్రదాయ నమః
ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వరీయసే నమః 100
ఓం బ్రహ్మణే నమః
ఓం బ్రహ్మరూపాయ నమః
ఓం విశ్వరూపిణే నమః
ఓం శంకరాయ నమః
ఓం ఆత్మనే నమః
ఓం అంతరాత్మనే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం శ్రీ దత్తాత్రేయాయ పరబ్రహ్మణే
నమో నమః 108

 ఓం శ్రీ దత్తాయనమః ఓం దేవదత్తాయనమః తో ప్రారంభమయ్యే  ఈ దివ్య నామములు  దివ్యదృష్టితో దత్తాత్రేయ స్వామి ని  దర్శించి వేద ధర్ముడు దీపాకునికి చెప్పాడు. తరువాత ఈ నామములను కవచముగా ఎలా చేసుకొనవలెనో వివరించాడు. ఈ కవచమును ఉదయము, సాయంత్రం శ్రద్ధగా చదివిన పాపములనుంచి విముక్తి కలుగును అని శిష్యునకు కూడా చెప్పెను.

#శ్రీ దత్త నామ కవచం*

1. ఓం కారాది నమోంతానం! నామ్నామష్టోత్తరం శతమ్!
శ్రద్ధయా యః పఠేన్నిత్యం! త్రిసంధ్యం నియతః సుధీః॥

#భావము:: వేదధర్ముడు ఇలా చెప్పారు - ఓం కారంతో మొదలు పెట్టి నమః శబ్దమును చివర చేర్చి నూట ఎనిమిది నామములను విద్వాంసుడు ఏకాగ్రతతో మూడు సంధ్యా కాలములలో శ్రద్ధగా చదవాలి.

2. సర్వపాప విముక్తాత్మా! జాయతే విమలాంతరః !
భుక్త్యా యథేప్సితాన్భోగాన్! ప్రేత్య బ్రహ్మణి లీయతే ॥

#భావము:: ఈ నామములు పఠించిన చో పాపచింతనలనుండి విడివడి స్వచ్ఛమైన మనస్సు కలవాడై. కోరిన కోర్కెలు తీరి సమస్త సుఖములను అనుభవించును . పరలోకమున శ్రీ దత్తునియందు ఐక్యము చెందును.

3. భక్తరక్షాక్షణో దేవః!స్మృతః సేవా స్వవేశ్మని!
స్వభోజ్యస్యార్పణం దానం! ఫలమింద్రాది దుర్లభమ్ ॥

#భావము:: భక్తరక్షణ కొరకు ఎల్లప్పుడూ దత్తుడు సిద్ధంగా వుండును. భక్తులను రక్షించుటయే ఆయనకు ఆనందం. మన ఇంట్లోనే వుండి ఆయనను తలచినా, భోజనమునకు ముందు ఆ స్వామికి భోజనం అర్పించి తినినా, మనకు దానఫలము లభిస్తుంది. ఇంద్రాది దేవతలకు కూడా దుర్లభమైన ఐశ్వర్యమును ఇచ్చును.

4. య ఏతైర్నామభిర్దివ్యైః! కవచం ధారయేత్కృతీ!
రాజవేశ్మని కాంతారే! దుర్గాదిషు మహాభయే ॥

#భావము:: ఈ అష్టోత్తర శతనామములు ఎవరు కవచముగా ధరించెదరో వారు కృతార్థులు అగుదురు. రాజభవనము నందు , అరణ్యములందు మహాభయములందు ఈ నామములతో కవచముగా ధరించిన విజయము పొందుతారు.

5. శత్రుచోరభయాకీర్ణే! శ్మశానే ప్రేతదూషితే!
న భయం విద్యతే తస్య! దృష్ట్వా తం విద్రువేద్భయమ్॥

#భావము: శత్రువులు, దొంగలు, శ్మశానములయందు,భయములువుండు చోట ఈ నామములు కవచముగా కలిగిన వానిని చూసి భయపడి అన్ని పారిపోవును.

6. శిరో లలాటం నేత్రేచ! భ్రూమధ్యం చ భ్రువౌ తథా!
నాసే కర్ణౌ తథోష్ఠౌ చ! హనుః కంఠం కకుత్తథా ॥

#భావము:: శిరస్సు, నుదురు, నేత్రములు, కనుబొమల మధ్యభాగం, కనుబొమలు, ముక్కు, చెవులు, పెదవులు, దవడలు, కంఠము, ఈ  నామములు చెప్పుచూ తాకవలెను. అక్కడ వున్న రోగములు పోతాయి.

7 . దౌతాంఘ్రిహస్త ఆచమ్య! స్మృత్యా దత్తం న్యసేత్సుధీః!
కరాంగన్యాసౌ విన్యస్య!షడ్భిః ష్షడ్భిః తతః క్రమాత్ ॥

#భావము:: చేతులు, కాళ్ళు కడుగుకొని కేశవాది నామాలతో ఆచమనం చేసి దత్తాత్రేయుని స్మరించి ఈ అష్టోత్తర శతనామ కవచమును చదువుకొనవలెను. అంగన్యాస, కరన్యాసములు ఆరేసి నామములతో  చేయవలెను.

8. జత్రుస్తనౌ చ చక్షుశ్చ! హృదయం నాభిరేవచ!
మూలాధార స్ఫిచావూరూ! జానుజంగాశ్చ గుల్ఫయౌః ॥

#భావము:: మూపు సంధులు, వక్షస్థలము, నేత్రములు, నాభి, మూలాధార ము, పిరుదులు, కటిప్రదేశము,తొడలు, మోకాళ్ళు, పిక్కలు, గిలకలు.

9. ప్రపదౌ పాదమూలాభ్యం ! తథా పాదతలే ఉభే!
పాదాగ్రాంగుష్ఠయో శ్చైవ ! హస్తాగ్రాభ్యాం తథైవ చ ॥

#భావము: మోకాళ్ళు, పాదమూలములు , పాదప్రదేశములు, బొటనవేళ్ళు, చేతుల యొక్క అగ్రభాగములకు, నామములతో కవచము చేసుకొనవలెను. నామ ప్రభావముతో ఆయా అవయము ల రోగములు పోవును మరియు కవచము వలె రక్షణ ఇచ్చును.

10. స్కంధయోర్బుజమూలాభ్యాం ! సంధిభ్యాం కరయోః పృథక్!
అంగుల్యం గుష్ఠయోశ్చైవ! హస్తాగ్రాభ్యాం తథైవ చ ॥

#భావము: భుజస్కంధముల యందు, భుజముల మూలలయందు, హస్తముల సందులయందు, వ్రేళ్ళయందు, హస్తాగ్రములయందు .

11.హృదయాద్దస్త పాదాగ్ర! పర్యంతవ్యాపకం న్యసేత్!
దశేంద్రియాంతః కరణ! చతుష్టయధృతంన్యసేత్ ॥

#భావము:: హృదయము నుంచి హస్తాది పాదాగ్రముల వరకు ఈ నామకవచమును కప్పవలెను. పది ఇంద్రియాలందు, మనో,బుద్ధి, చిత్త, అహంకారముల యందు ఈ కవచమును ఉంచవలెను.

12. రోమస్వేకం చ హృదయం! స్పృష్ట్వా నామాని పంచ చ !
జేద్భక్త్యా స్మరన్దేవం! కృతకృత్యో భవేన్నరః ॥

#భావము: రోమమలయందు, హృదయము నందు స్పృశించి అయిదు నామములను చెప్పవలెను. ఇట్లు భక్తి తో తన అవయముల అన్నిటి అందును ఆ దేవదేవుని స్మరించుచూ ఆ స్వామి నామములను జపించవలెను.

జపమునకు ముందు చేయవలసిన ధ్యాన శ్లోకం:::

#పీతాంబరాలంకృత పృష్టభాగం! భస్మావగుంఠామలరుక్మ దేహమ్!
విద్యుత్సదాపింగ జటాభిరామం! శ్రీ దత్తయోగీశమహంనతోస్మి ॥

భావము:: పట్టు వస్త్రాలు కట్టుకొన్న, విభుతితో పూయబడిన బంగారపు శరీరము కలవాడు, మెరుపు తీగ వలె పచ్చనైన జడలతో మనోహరమైన శ్రీ దత్తయోగీశ్వరునికి అన్నివేళలా వంగి వంగి నమస్కరిస్తాను.....(from FB)

        *శుభమస్తు*

🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

శ్రీ గురు రాఘవేంద్రస్వామి

**శ్రీ గురు రాఘవేంద్రస్వామి*శ్రీ గురు రాఘవేంద్ర స్వామి(1595-1671)హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు. ఇతను వైష్ణవాన్ని (విష్ణువుని కొలిచే సిద్ధాంతం) అనునయించారు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. తమిళనాడులోని కుంభకోణం మధ్వమఠాన్ని 1624 నుండి 1636 వరకూ మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేసారు. ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తులు. ఇతను పంచముఖిలో తపస్సు చేశారు, ఇచ్చట పంచముఖ హనుమంతుణ్ణి దర్శించారు.(హనుమంతుని పంచముఖ దర్శనం శ్రీరామ చంద్రులు తర్వాత దర్శించినది శ్రీ రాఘవేంద్ర తీర్ధులు మాత్రమే) మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించారు, మరియు ఇక్కడే జీవ సమాధి పొందారు . వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు. రాఘవేంద్రస్వామి వెంకణ్ణ భట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మణ్ణభట్టు మరియు గోపికాంబ అనే కనడ భట్టు రాజులు రెండవ సంతానంగా 1595లో జన్మించారు. జన్మ సంవత్సరం 1598 లేదా 1601 కూడా కావచ్చు అనే వాదనలున్నాయి. వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు ఈతణ్ణి చిన్నప్పుడు వేంకటనాథుడనీ, వేంకటాచార్య అని కూడా పిలిచేవారు. తన బావ లక్ష్మీనరసింహాచార్ వద్ద మదురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక, వేంకటనాథుడ్ని కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరి, ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యసించారు. 1614లో మదురై నుండి తిరిగి వచ్చినపుడు సరస్వతీ బాయితో వీరికి వివాహమయింది. వీరి కొడుకు లక్ష్మీనారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు. ఆ తర్వాత కుటుంబమంతా కుంభకోణం చేరుకుంది. శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్రతీర్థుల వద్ద అభ్యసించడం మొదలుపెట్టారు. అనతికాలంలో గొప్ప విద్యార్థిగా ఉద్భవించి, అన్ని వాదోపవదాల్లో తర్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు. సంస్కృత మరియు వైదికశాస్త్రాల్లో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలుపెట్టారు. రాఘవేంద్రస్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే, ఆయన కాలంలో ఆయనో గొప్ప వైణికుడు కూడా. గురువు తరువాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణభారత దేశమంతా విజయం చేయటానికి బయలుదేరారు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్యబృందానికి చూపిస్తూ మధ్వప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేసారు. 1671 లో తన శిష్యబృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవసమాధి పొందారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి చరిత్ర శ్రీరాఘవేంద్రులు జ్ఞాన సంపన్నుడు, సిద్ధ పురుషుడు. మంత్రాలయంలోని బృందావన సన్నిధానంలో భక్తులు పొందే శాంతి సంతృప్త్తుల మాటలకందనివి. అలజడి, అశాంతి, ఆందోళనలతో నిండిన నేటి నాగరిక సమాజానికి అటువంటి సత్పురుషుల సాహిత్యం, సాన్నిహిత్యం, సాన్నిధ్యం ఎంతో అవసరం. అది నిరంతరం వెలిగే అఖండ జ్యోతి.

గురు రాఘవేంద్రస్వామి చరిత్ర శ్రీ రాఘవేంద్రస్వామి 1571లో కాంచీపురం సమీపంలోని భువనగిరిలో నిరుపేద కుటుంబంలో తిమ్మన్నభట్టు , గోపికాంబ దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులుపెట్టిన పేరు వెంకటనాధుడు. వీరి తాతగారు శ్రీకృష్ణ్ణదేవరాయల ఆస్థాన వైణికుడిగా వుండేవారు. వెంకటనాథుడి బాల్యంలోనే తల్లిదండ్రులు గతించారు. బావగారైన లక్ష్మీనారాయణ చేరదీశాడు. బావగారి పెంపకంలోనే వెంకటనాథుడు సర్వశాస్త్ర పారంగతుడయ్యాడు. యుక్తవయసు రాగానే సరస్వతి అనే కన్యతో వివాహమైంది. ఓ పిల్లవాడు కూడా పుట్టాడు. కాని వెంకటనాధునికి దరిద్రం దావాలనంలా చుట్టుముట్టింది. ఆదుకునేవారెవరు లేరు. నిస్సహాయ స్థితిలో వెంకటనాధుడు భార్యాబిడ్డలతో కలిసి కుంభకోణం చేరుకున్నాడు. అనూహ్యంగా అక్కడ తాత్కాలికంగా బసచేసిన సుధీంద్ర తీర్థులవారి ఆశ్రయం లభించింది. గురు సాంగత్యం సుధీంద్రుడు కొత్త శిష్యుడైన వెంకట నాధుని ఎంతో ప్రేమగా ఆదరించాడు. శిష్యుని అసమాన్య ప్రజ్ఞాపాటవాలకు ఆశ్చర్యపోయాడు. అతని మేథాశక్తిని, శాస్త్ర జ్ఞాన ప్రావీణ్యాన్ని అభినందించకుండా ఉండలేకపోయాడు. జ్ఞాన వరిష్టుడైన వెంకటనాధుని వినయ విధేయతలు చిత్తశుద్ధీ గురువైన సుధీంద్ర యతీంద్రులను బాగా ఆకర్షించాయి. వయోభారంతో వున్న సుధీంద్రులు శిష్యుడైన వెంకటనాధుని ఒకరోజు పిలిచి "వెంకటనాథా! నేను వృద్ధాప్యంలో ఉన్నాను. ఈ శరీరం నేడోరేపో అన్నట్టుగా ఉంది. రామచంద్రమూర్తి ఆరాధన నిరంతరాయంగా కొనసాగించేందుకు నా తర్వాత ఈ పీఠాధిపత్యం నీవు వహించాలి" అని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. తనకు భార్యాబిడ్డలున్నారని కుటుంబ పోషణ చేసి వారిని సుఖపెట్టడం తన బాధ్యత అని చెప్పాడు వెంకటనాథుడు. గురువుగారి కోరికను తీర్చలేకపోతున్నందుకు వ్యాకులపడుతూ ఇంటికి చేరుకున్నాడు. భార్యకేమీ చెప్పలేదు. ఆ రాత్రి కలలో సరస్వతీదేవి ప్రత్యక్షమై "నాయనా వెంకటనాథా! నీవు కారణ జన్ముడవు. నీ అద్భుత మేధా సంపత్తితో సద్గురువువై దారి తప్పిన జనాలకు దారి చూపు! అంతేకాదు వ్యతిరేక వర్గాల ఎదురు దాడులనుంచి మధ్వ సిద్ధాంతాన్ని మధ్వ సాంప్రదాయాన్ని రక్షించగల సమర్ధుడవు నీవే. లే! ఆలోచించక నీ గురువు చెప్పినట్టు చెయ్యి" అని పలికింది. మేల్కొన్న వెంకటనాథుడు పరుగు పరుగున గురువు సన్నిధికి చేరుకున్నాడు. సుధీంద్రులు వెంకటనాథుని తంజావూరులోని తన ఆశ్రమానికి తీసుకునిపోయి శాస్త్రోక్తంగా సన్యాస దీక్షనిచ్చి పీఠాధిపత్యం అప్పగించాడు. దీక్షానామం రాఘవేంద్రస్వామి. 40 ఏళ్ల పవిత్ర జీవనం సన్యాస దీక్ష తీసుకునేనాటికి రాఘవేంద్రుల వయసు 23 ఏళ్లు. తదుపరి 40 ఏళ్లు అతి పవిత్ర జీవనం గడిపి నియమ నిష్టలతో నిత్య సైమిత్తికాలతో మూలరాముని ఆరాధించాడు. ఈ 40 ఏళ్ల కాలంలో సాధించిన విజయాలు, జరిగిన సంఘటనలు, మహిమలు వారి సోదరి కుమారుడు నారాయణాచార్‌ రాఘవేంద్ర విజయమ్‌ అన్న గ్రంథంలో నిబద్ధం చేశారు. ఆనాటి నవాబు ఒకరు రాఘవేంద్రులను పరీక్షింపదలచి రెండు బుట్టలతో మాంసం పంపాడు. భక్తులు శిష్యులు ఆ బుట్టలు తెరిచి చూడగా పళ్లు, పువ్వులు అందులో ఉన్నాయి. ఒకసారి మృతి చెందిన బాలుడికి ప్రాణం పోశారు. నిరక్షరాస్యుడైన వెంకన్నను ఆదోనిలోని గవర్నరు వద్ద దివాను స్థాయికి పెంచడం, సిద్ధి మస్సానెత్‌ఖాన్‌ మంత్రాలయం గ్రామాన్ని రాఘవేంద్రులకు రాసి ఇవ్వడం (మద్రాస్‌ డిస్ట్రిక్ట్‌ గెజిటీర్‌ పునర్ముద్రణ 1916 చాప్టర్‌ 15 ఆదోని తాలూకా పేజీ 213) వంటివి జరిగాయి. మద్రాసు గవర్నర్‌ ధామస్‌ మన్రోకు రాఘవేందస్వ్రామి చూపిన అద్భుతాలు బళ్లారి జిల్లా గెజిటీర్‌లో చూడవచ్చు. రాఘవేంద్రుల యశశ్చంద్రికలు దశదిశలా పాకాయి.  బృందావనిలో జీవ సమాధి.. పీఠాధిపత్యం వహించి నలభై ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలో శిష్యుడైన వెంకన్నను పిలిచి విషయమంతా సేకరించి తుంగభద్రా తీరాన మంత్రాలయంలో తాను జీవ సమాధి కావడానికి అందమైన బృందావనం నిర్మించమని కోరాడు. చెప్పిన ప్రకారం వెంకన్న చక్కని బృందావన మందిరాన్ని నిర్మించాడు. శ్రీ రాఘవేందస్వ్రామి నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకుని శుచియై చేతిలో వీణను పట్టుకుని సమాధిలో ప్రవేశించాడు. శ్వాసని నిలిపివేసి మనోలయం చేశాడు. 1200 సాలిగ్రామాలతో బృందావన సమాధిని మూసివేశారు. సమాధి గతుడైన తర్వాత ఆయన చూపిన మహిమలు, చేసిన అద్భుతాలు కోకొల్లలు. 700 సంవత్సరాలు సూక్ష్మరూపంలో బృందావనంలో ఉండి తన భక్తులను అనుగ్రహిస్తానని ఆయన చేసిన ప్రకటన సత్యాతి సత్యం. ఆయన ప్రియశిష్యుడు అప్పణాచార్యులు తుంగభద్ర ఆవలి తీరాన వుండేవారు. గురువు సమాధి ప్రవేశం చేస్తున్నాడని తెలిసి నదిని దాటి పరుగున బృందావనానికి చేరుకున్నాడు. అప్పటికే అంతా ముగిసింది. అప్పణాచార్యులు కవి కన్నీటి పర్యంతం అయ్యాడు. తాను వస్తూ దారిలో అల్లుకుంటూ వచ్చిన శ్లోకంలో ఏడక్షరాలు ముగింపులో కొరవడ్డాయి. వ్యధ చెందుతున్న శిష్యుడిని తృప్తిపరిచేందుకు ఆ ఏడక్షరాలు సమాధిలోంచి వెలువడ్డాయి. ఆ శ్లోకమీనాటికీ బృందావనంలో ప్రార్ధనలో పఠిస్తారు. అసమాన శేముషీదురంధరుడైన రాఘవేంద్రునికి టిప్పణాచార్య చక్రవర్తిగా బిరుదు లభించింది. వ్యాకరణ శాస్త్రంలో ఆయన ప్రజ్ఞా పాటవాలకు మెచ్చి మహా భాష్యకార బిరుదంతో సన్మానించారు.

ఆయన స్వతంత్ర రచనల్లో జైమిని పూర్వ మీమాంస సూత్రాలకు రాసిన భాష్యం భట్ట సంగ్రహం భారతీయ తత్వశాస్త్రానికి అపురూపమైన కానుక. వివిధ భాషలకు సులభంగా వ్యాఖ్యానాలు రచించి మధ్వ సిద్ధాంత ఔన్నత్యాన్ని ప్రతిపాదించాడు. ఐతరేయోపనిషత్తు మినహా తొమ్మిది ప్రధాన ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రచించారు. వ్యాసతీర్థల చంద్రికకు ప్రకాశిక పేరుతో చేసిన పరిమళ వ్యాఖ్యానంతో పరిమళాచార్యుడుగా వాసికెక్కాడు.  శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మహిమలు శ్రీ గురురాయ రాఘవేంద్ర యతీంద్రులు కారణ జన్ములు.ఆయన బృందావన ప్రవేశానికి ముందు , బృందావన ప్రవేశం తరువాత కుడా ఎన్నో మహిమలు భక్తులకు అనుభవమవుతునే ఉన్నాయి.వాటిలోని కొన్ని లీలలను స్మరించుకుందాం. శ్రీ స్వామి ని ఒక బ్రహ్మచారి చాలకాలంగా సేవించు కుంటూ ఉండేవాడు కొంతకాలానికి అతనికి పెళ్ళి చేసుకోవాలనే ఆశ కలిగింది. శ్రీ గురువుల ఆశీర్వచనం తీసుకొని వెళదామని స్వామి చెంతకు వచ్చాడు.ఆసమయం లో శ్రీ రాఘ వేంద్రులు మృత్తికా శౌచము చేసుకుంటున్నారు. ఆమృత్తిక నే ఒక పిడికెడు యిచ్చి, పో ,నీకు మంచి జరుగుతుందని దీవించి పంపారు. ఆ యువకుడు ప్రయాణం చేస్తూ, మార్గమధ్యం లో ఒక రాత్రి ఒక కరణం గారి ఇంటిముందు పడుకున్నాడు. అర్ధరాత్రి సమయానికి ఒక బ్రహ్మ రాక్షసుడు బిగ్గరగా అరుపులు కేకలతో వాణ్ణి నిద్రలేపాడు.." నాకు దారి ఇవ్వమని. నీ తలపాగ లో అగ్ని ఉందని, దాన్ని తీసిపారేయమని "అరవసాగాడు.. విషయం అర్ధమైన ఆ యువకుడు " నీకు దారిస్తే నాకేంటి ప్రయోజనం "అని అడిగాడు. అందుకు బ్రహ్మరాక్షసుడు ఒక బంగారు పళ్ళాన్ని బహుకరించగా. ఆ యువకుడు తలక్రింద పెట్టుకున్న , స్వామి ఇచ్చిన మృత్తిక ను కొద్ది గా తీసి రాక్షసుని మీదకు విసిరాడు. వెంటనే ఆ బ్రహ్మరాక్షసుడు భగభగ మండి మాడి మసై పోయాడు. ఈ గలాటా అంతా విని భైటకొచ్చిన ఇంటి యజమాని ,ఇన్నాళ్లు తనకు పుట్టిన బిడ్డలను తినేస్తున్న బ్రహ్మరాక్షసుని పీడ విరగడైనందుకు సంతోషించాడు. అందుకు కారకుడైన ఆయువకుని ఆదరించి తన చెల్లెలినిచ్చి వివాహం చేశాడు. ఇటువంటి గాథలెన్నో శ్రీవారి మృత్తికామహిమలను గూర్చి, శిష్యులయెడ గురువుల అనుగ్రహాన్ని గూర్చి తెలియజేస్తున్నాయి. మాంసపు ముక్కలను పట్టువస్త్రం తో కప్పి, కానుకగా పంపించిన ఆదోని నవాబుకు జ్ఞానోదయమయ్యేటట్టు ,మంత్రించిన జలంతో మాంసపు ఖండాలను ఫల పుష్పాలుగా మార్చి, క్షమాపణ కోరిన నవాబు నుండి మంచాల గ్రామాన్ని జాగీరు గా పొందారు. ఆవుల కాపరి వెంకన్న అనే వ్యక్తి స్వామి అనుగ్రహం తో విద్వాంసుడై, మఠాన్ని నిర్మించి, సేవించి. తరించాడు. పాము కాటుకు గురైన రాజకుమారుని బ్రతికించాడు. గడపకు తల తగిలి మరణించిన భక్తునిపై మంత్రోదకం చల్లి బ్రతికించాడు. తంజావూరు రాజ్యం లో కరువు కాటకాలు పెచ్చరిల్లడం తో ఆ రాజు కోరిక మేరకు రాజధాని లో ప్రవేశించి, ధాన్యపు కొట్టుపై శ్రీ అనే బీజాక్షరాన్ని సంస్కృతం లో వ్రాసి, అదే బీజాక్షరాన్ని నిత్యము వ్రాస్తూ, జపం చేయమని ఆజ్ఞాపించారట. కొద్దికాలం లోనే కుండపోత గా వర్షాలు పడి, పంటలు పండి, క్షామనివారణ జరిగింది. స్వామివారి మృత్తికా స్పర్శ చే పిశాచాలు పారి పోతాయి.. మంత్రాక్షతలు ఆరోగ్యవంతుల్ని చేస్తాయి. స్వామి సమాధిస్ధు లైన 150 సంవత్సరాలకు సమాథి నుండి లేచి వచ్చి, మంత్రాలయం ఆస్తులను పరిశీలించ వచ్చిన అప్పటి మద్రాసు గవర్నర్ థామస్ మన్రో తో స్వయం గా మాట్లాడి, అక్షతలిచ్చారట. అతడాశ్చర్య చకితుడై ఆ మంత్రాక్షతలను ఆనాడు వండెడి బియ్యంలో కలిపి వండించుకొని భుజించాడు. ఈ విషయం మద్రాసు రివ్యూ ఎనిమిదవ సంపుటము 280 వ పేజిలో వ్రాయబడింది. ఈ విషయాన్ని ఎత్తి బళ్ళారి జిల్లా గెజిటీరు మొదటి సంపుటం లో 15 వ ప్రకరణం లో ఆదోని తాలూకా ను గురించి 213 -వ పేజీలో ప్రచురించబడింది. శ్రీ గురు రాఘవేంద్రుల వారి పాదాలను స్మరించుకుంటూ భక్తి ప్రపత్తులతో గురుస్తోత్రాన్ని పఠించే వారికి దుఖాలు దూరమౌతాయి. గురువుల ఆనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతోంది..శ్రీ గురు రాఘవేంద్ర యతీంద్రుల అనుగ్రహం మనందరిపై వర్షించాలని ఆశిస్తూ ... పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః శ్రీ రాఘవేంద్ర తీర్థులు కలియుగ కల్పవృక్షం మంత్రాలయంలో వెలసిన శ్రీ రాఘవేంద్రతీర్థులు. భక్తకోటికి కష్టాలు కడ తేరుస్తూ మంత్రాలయం మహర్షిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. మంత్రాలయ ఋషి రాఘవేంద్రులు మానవ కళ్యాణంకోసం వెలిసిన మహిమాన్విత మహనీయుడు శ్రీరాయలు. భక్తులు రాఘవేంద్రస్వామిని శ్రీరాయలు అని పిలుచుకుంటారు. బృందావనం నుంచే సజీవుడిగా వుండి భక్తుల మొర ఆలకిస్తున్న దేవుడు రాఘవేంద్రస్వామి. ‘‘నేను, దేవుడు ఒకటి కాము మేమిరువురము వేరువేరు. అతడు ఈశుడు, నేనాతని దాసుడను మాత్రమే'' అని చెప్పే ద్వైత సిద్ధాంతంను ప్రవచించిన మద్వాచార్యుల బోధనల వ్యాప్తికోసం ప్రచారంచేసిన వారే శ్రీ రాఘవేంద్రస్వామి. మద్వా సిద్ధాంతం ప్రకారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో పూజలు సాగుతున్నాయి. మద్వ ప్రచారం సాగిస్తూ మానవ కళ్యాణంకోసం యోగిగా మారిన మహానుభావుడు శ్రీ రాయలు.

అలాంటి మహనీయుడైన శ్రీ రాఘవేంద్రులు క్రీ.శ.1595 సంవత్సరం, మన్మనాథ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సస్తమీ మృగశిరా నక్షత్రంలో తిమ్మన్నభట్టు, గోపాంబ దంపతులకు కలిగిన సంతానమే సన్యాసం తీసుకున్న తరువాత రాఘవేంద్రునిగా మారిన రాజయోగి. తల్లిదండ్రులు వెంకటనాధునిగా నామకరణం చేసారు. వెంకటనాథుడు చిన్నతనం నుంచి అన్ని విద్యలలో ఏకసంథాగ్రాహి. గురువుల అనుగ్రహాన్ని పొందినవాడు. వెంకటనాధుని తెలివితేటలు గురించి అందరూ పొగిడేవారే. తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. వెంకటనాధుడు మధురలోని బావ లక్ష్మీనరసింహాచార్యులవద్ద వేదమంత్రాలు చదవటంలో మెలకువలు నేర్చుకున్నారు. తమ వంశపార్యపరంగా వచ్చే వీణావాయిద్యాయిని కూడ వేంకటనాధుడు నేర్చుకున్నారు. వెంకటనాధుడు చదువు కొనసాగిస్తున్న ఆయన మనస్సు మాత్రం మఠంలో మూల రాముల పూజలు చేయటానికే మనస్సు తహతహలాడుతూ వుండేది. శ్రీ సుదీంద్ర తీర్థుల వద్ద శిష్యునిగా చేరి టీకా, తాత్పర్యాలు వ్రాసి పరిమళచార్యునిగా గురువుచేత బిరుదు పొందాడు. అమరకోశం కంఠస్తంగా వుండేది. సంస్కృతం, నిఘంటువులు వెంకటనాథుని నోట్లోనే వుండేవి. చదువులు ముగిసిన అనంతరం యవ్వనంలో వున్న వెంకటనాథునికి సరస్వతీ అనే అపూర్వ అందమైన అందాల రాశితో వివాహం జరిగింది. వీరి వివాహం ఎంతో వైభవంగా సాగింది. ఒక పుత్రుడు జన్మించాడు. వెంకటనాథుని జీవితంలో కడు దారిద్య్రం దాపురించింది. చివరికి భార్య అనుమతి తీసుకొని గురువుతోపాటు దేశ సంచారం సాగిస్తూ వేదాంత చర్చలు జరిపి ఎందరినో మెప్పించారు. గురుసుదీంద్ర తీర్థులు వెంకటనాధునికి మహాభాష్యాచార్యుడని బిరుదు ఇచ్చారు. సాటిలేని పండితునిగా వేంకటనాథుడు గురువు సన్నిధిలో పెరిగాడు. తన తరువాత మఠంకు వారసుడు వెంకటనాథుడని గురువు సుదీంద్రులు భావించారు. అంతేకాకుండా ఒక రోజు కలలో శ్రీ మూలారాములు సుదీంద్రులకు వచ్చి తన అనంతరం పీఠం ఎక్కే అర్హత వెంకటనాథునికి మాత్రమే వుందని చెప్పారు. ఈ విషయాన్ని వెంకటనాథునికి గురువు సుదీంద్రులు వివరించారు. సన్యాసం స్వీకరించే విషయం మీమాసంలో వున్న వెంకట నాథునికి సరస్వతీదేవి కలలో కనిపించి మఠం పీఠాధిపతిగా సన్యాసం స్వీకరించి మద్వా సిద్ధాంతాన్ని లోకాన్ని విస్త్తరింపచేయాలని సెలవిచ్చింది. సరస్వతీదేవి కోరిక కూడా ఇదే కావటంతో వెంకటనాథుడు సన్యాసం స్వీకరించటానికి సిద్ధమై గురువు సుదీంద్రులకు తన అభిప్రాయాన్ని తెలిపారు. తంజావూరు పాలకుడు రఘునాథ భూపాలుని ఆధ్వర్యంలో క్రీ.శ.1621, ఫాల్గుణశుద్ధ ద్వితీయలో ప్రజల సమక్షంలో పీఠాధిపతిగా పట్ట్భాషేకంగావించి సన్యాసం స్వీకరించారు. గురువు సుదీంద్రతీర్థులు వెంకటనాథునికి రాఘవేంద్ర తీర్థులు అని నామకరణం చేసారు. గురు సుదీంద్రతీర్థులు మూల విగ్రహాలైన మూల రామచంద్రుని విగ్రహం, దిగ్విజయరాముల విగ్రహం, జయరాముని విగ్రహం, వేదాంత గ్రంథాలు, శివతఛత్రం, వింజామరలు, స్వర్ణపల్లకి, మఠం కార్యక్రమాలు అన్ని కూడ శ్రీ రాఘవేంద్రతీర్థులకు అప్పగించారు. 1623లో గురువు సుదీంద్రతీర్థులు హంపీవద్ద గల నవ బృందావనం అనే ప్రాంతంలో బృందావనస్థులైనారు. శ్రీ రాఘవేంద్ర తీర్థులు తంజావూరు, వెల్లూరు, శ్రీరంగం, రామేశ్వరం, మధుర మొదలగు ప్రాంతాలలో పర్యటన చేసి మద్వప్రచారం గావించి వేదాంత చర్చలు జరిపి అనేకమంది పండితులను ఓడించాడు. రాఘవేంద్ర తీర్థులు శ్రీ వ్యాస తీర్థులు వ్రాసిన ‘చంద్రిక' అనే గ్రంథానికి ‘ప్రకాశం' అనే వివరణ వ్రాసారు. న్యాయముక్తావళి, ‘తంత్రీ దీపిక' సుధ, పరిమళ అనే మున్నగు గ్రంథాలను వ్రాసారు. భక్తులకు అనేక మహిమలు కూడ చూపాడు. ఆదోని పర్యటనలో స్వామి వున్నప్పుడు, ఆదోనిని పాలించే సిద్ధిమసూద్‌ఖాన్ అనే రాజు రాఘవేంద్రుని సభకు ఆహ్వానించారు. స్వామిని పర్యవేక్షించటానికి పళ్ళెంలో మాంసం ముక్కలు పెట్టి దానిపై గుడ్డకప్పి స్వీకరించమని చెప్పారు. స్వామి వెంటనే ఆ పళ్ళెంపై మంత్రపు జల్లులతో చల్లగా మాంసం పూవ్వులుగా మారాయి. దాంతో సిద్దిమసూద్‌ఖానే స్వామి మహత్యం తెలుసుకొని రాఘవేంద్రుని కోర్కె మేరకు ‘మంచాల' గ్రామాన్ని దత్తతగా ఇచ్చారు. మంచాలమ్మ దేవత కొలువై వున్న మంచాల గ్రామంలోనే శ్రీ రాఘవేంద్రులు మఠం ఏర్పాటుచేసుకొని భక్తులకు మహిమలు చూపుతూ, మరోవైపు మధ్వప్రచారం సాగిస్తూ శ్రీ రాఘవేంద్రులు క్రీ.శ.1671, విరోధికృత్ శ్రావణ బహుళ ద్వితీయరోజున రాఘవేంద్రులు సశరీరంతోనే బృందావనం ప్రవేశం చేసారు. స్వామి బృందావనం చేసిన మంచాల గ్రామం మంత్రాలయ నేడు ఒక మహా పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. ఆనాటి నుంచి ఈ బృందావనం నుంచే స్వామి భక్తుల కోర్కెలు తీర్చుతూ రాఘవేంద్రస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా, సాహితీవేత్తగా, మహిమలు చూపే మహనీయుడుగా పూజలు అందుకున్న రాఘవేంద్రులు భక్తుల హృదయాలలో కొలువై వున్నాడు. కలియుగ కల్పవృక్షంగా భక్తులు కొలుస్తారు. అందుకే ఆయన దేవుడయ్యాడు రాఘవేంద్రస్వామి సన్యాసాశ్రమం తీసుకోవడానికి ముందు, అంటే వేంకటనాథుడుగా ఉన్న రోజుల్లో తన ఇంట్లోనే కొంతమంది పిల్లలకు వేదం చెబుతూ ఉండేవాడు. అయితే అందుకు ఆయన దక్షిణ కూడా తీసుకునేవాడు కాదు. దాంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటి అవసరాలకి సంబంధించిన ధాన్యం, కూరగాయలు ఇస్తూ ఉండేవారు. అలా వచ్చిన వాటితో ఆయన భార్య సరస్వతి కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఓ పశువుల కాపరి కొడుకు వీధి అరుగుపై కూర్చుని స్వామి చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ ఉండేవాడు. అది గమనించిన స్వామి ఆ పిల్లవాడిని లోపలికి పిలుస్తాడు. భయపడుతూనే లోపలి వచ్చిన ఆ పిల్లవాడు, తనకి చదువుకోవాలని ఉందని చెబుతాడు. తన దగ్గరున్న శిష్యులకన్నా అ కుర్రవాడు చకచకా పాఠాలను అప్పగించడం చూసిన స్వామి ఆశ్చర్యపోతాడు. ఇక నుంచి అందరితో పాటు ఆ పిల్లవాడికి చదువు చెప్పాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న మిగతా విద్యార్ధినీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తారు. ఆ పిల్లవాడితో కలిసి తమ పిల్లలు చదువుకోరనీ, అతనికి పాఠాలు చెప్పాలనే ఆలోచన విరమించుకోమని అంటారు. అందుకు స్వామి నిరాకరించడంతో, వాళ్లు తమ పిల్లలను పంపించడం మానేస్తారు. అంతమంది పిల్లలు పాఠాలు చెప్పించుకోవడానికి రాకపోతే ఇల్లు గడవడం కష్టమవుతుందేమోనని సరస్వతి ఆందోళన వ్యక్తం చేస్తుంది. భగవంతుడు తనని నమ్మిన వారిని ఎప్పుడూ ఉపవాసం ఉండనీయడనీ, ఆ విషయం గురించి కంగారు పడవద్దని స్వామి ధైర్యం చెబుతాడు. ఆ రోజు నుంచి ఆయనకి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా, ఆ పిల్లవాడికి పాఠాలు చెప్పడం మాత్రం ఆపలేదు. అలా ఆ రోజుల్లోనే కులమతాలకు అతీతంగా వ్యవహరించిన రాఘవేంద్రస్వామి, నేటికీ అన్ని వర్గాల వారి హృదయ పీఠాలను అధిష్ఠించి కనిపిస్తుంటాడు....from FB..

 ఓం శ్రీ గురుభ్యో నమ: