Wednesday, November 26, 2008 8 comments By: visalakshi

స్త్రీ -స్వేచ్ఛ:-


కుటుంబ వ్యవస్థలో భర్త పాలనలో మధ్య తరగతి సగటు స్త్రీల స్వేచ్ఛ : ఉదా: మా బంధువుల అమ్మాయికి పెళ్ళి అయి 2సం"లు దాటాయి . భర్త రైల్వేలో చేస్తున్నాడు. ఈమె పెళ్ళికి ముందు ప్రైవేటు ఉద్యోగం చేసేది .పెళ్ళి సెటిల్ అయ్యాక మానేసింది. ఒక పాప పుట్టాక మరల జాబ్ లో జాయిన్ అయింది. నెల తిరిగేసరికి జీతం మొత్తం అత్తగారి చేతిలో. ఆ అమ్మాయికి బస్ పాస్ +10 రూ "లు . ఆఫీస్ నుండి వచ్చాక ఇంటిపని మొత్తం చేసుకోవాలి. ఇది ఆ అమ్మాయి ఆర్ధిక స్వాతంత్ర్యం ,వ్యక్తిగత స్వేచ్ఛ. కనీసము తల్లిదండ్రుల్కి, చుట్టాలకి ఫోను చెయ్యాలన్నా భర్తగారి ,అత్తగారి పర్మిషన్ ఉండాలి. ఆ అమ్మాయిని ఏదైనా ఫంక్షన్ కి పిలవాలంటే ,మా అత్తగారికి,మా వారికి చెప్పండి. వాళ్ళు పంపితే వస్తాను. ఇదీ జవాబు. ఇంత లోబడి ఉండి అవకాశం ఇచ్చి పైగా మీకు అన్నీ తెలుసుకదా అక్కా ! అత్తగారింట్లో ఎలా ఉండాలో అని అంటుంది. అంటే అలాంటి స్త్రీల ఉద్దేశ్యం " అత్తగారింట్లో ఒక బానిసలా ఉండమని. తల్లి దండ్రులు కష్టపడి చదివించి ప్రేమతో పెంచి పెళ్ళిచేసి అత్తవారింటికి పంపిస్తారు. అని."
సాంప్రదాయం అనే ముసుగులో లోబడి ఉంటూ పైగా తన వంశం అంటే అత్తగారి తరఫు (పుట్టినప్పటి నుండీ అక్కడే ఉన్నట్టు గా ) వంశ చరిత్రను మనకు వినిపిస్తూ వాళ్ళ జీవన విధానాన్ని గొప్పగా సమర్ధించుకుంటూ ఉంటారు. తమకి లోబడి ఉన్న స్త్రీని ,ఆమెకెంత ఘనత ఉన్నా సరే ,కుటుంబ సభ్యులు గౌరవించరు. అందరు స్త్రీలు ఇలా ఉన్నారని కాదు .ఇలా కూడా కొంతమంది మధ్య తరగతి స్త్రీలు యాంత్రికంగా జీవిస్తున్నారు.
భార్య జ్ఞానంతో ,లోకానుభవంతో మాట్లాడిందా భరించలేడు భర్త. ఎంత పట్టించుకోకపోయినా లెక్క చేయకుండా, మౌనంగా బతకగలది స్త్రీ హృదయం ఒక్కటే.
అసలు స్త్రీకి ,ఇంట్లోనూ, బయటా అధికారాలు కాదు కావలసినది. స్త్రీకి తనమీద ,తన జీవితం మీద ,తన శరీరం మీద,మనసు మీద ,హృదయం మీద సంపూర్ణ అధికారం కావాలి .బానిసత్వం లో ఏదో అశాంతి .యాంత్రికంగా అన్నీ జరిగిపోతాయి. ఎన్ని బాధలున్నా సరే స్వేచ్ఛలోనే శాంతి.ఎన్ని కష్టాలున్నా స్వేచ్ఛ కోసం పోరాడాలి స్త్రీ. అందులోనే ఉంది శాంతి, సంతృప్తి.
Thursday, November 20, 2008 5 comments By: visalakshi

నమ్మకం: పాజిటివ్ థాట్

నమ్మకం అనేది మనిషిలోని గుణం. అది ఒక విధమైన ప్రశాంతతనూ
,సంతోషాన్నీ కలిగిస్తుంది.
చిన్నతనం నుండీ అతి జాగ్రత్తను నేర్పుతూ ఎవరినీ నమ్మకు ,
మోసగిస్తారు అని తల్లి దండ్రులు వ్యతిరేక ఆలోచనలు మనసులో నాటుతారు.
వ్యక్తిని బాగా పరిశీలించి నీ అంచనాలకు సరిపోతేనే నమ్ము. అని పదే పదే చెబుతారు కొంతమంది పెద్దలు.
ఈ రకంగా నమ్మకానికి దూరంగా మనిషిలో అపనమ్మకాన్ని ఎక్కువగా ముద్ర వేస్తారు. దాని కారణంగా చివరికి తల్లిదండ్రుల మీద కూడా సరైన నమ్మకం అలవరుచుకోరు. మనసు అయోమయ స్థితికి వెళుతుంది. కొంతమంది తమని తాము నమ్మలేని స్థాయికి దిగజారిపోతారు.
అపనమ్మకం అనుమానాన్ని ,సంఘర్షణను ,అశాంతిని ,పిరికితనాన్ని పెంచుతుంది.
ఒక మహిళ భర్తగా మారిన పరాయి మగవాడికి తన సర్వస్వం అర్పించి ,అనుసరించడానికి ఆధారం" నమ్మకం. "
"ఒక గులాబి వికసిస్తున్నప్పుడు (ఎవరు తనని ఆస్వాదిస్తారో ) అని ఆలోచించదు.వికసించడం తన సహజత్వం - వికసించింది అంతే. అది సహజ గుణం .అలాగే నమ్మకం అనేది నిశబ్ధం నుంచి ,నిజ స్వరూపం నుంచి పుట్టుకొచ్చే శాంతి పూర్వక సుగంధం.
నమ్మకం మనిషిని ఉన్నతంగా ఆలోచింపజేస్తుంది. పరిపక్వతను ,వ్యక్తిత్వ వికాశాన్ని పెంపొందిస్తుంది .ముందుగా తన మీద తనకి నమ్మకం కలగాలి. ఆ నమ్మకాన్ని తన చుట్టూ వున్న వ్యక్తుల మీద పెంచాలి. అందరినీ ప్రేమించాలి.
ఎవర్ని నమ్ముతున్నానని కాదు ,ఎలా నమ్ముతున్నాను :ఎంతగా నమ్ముతున్నాను అన్నవి ప్రధానాలు .
జస్ట్ ! నమ్మకంతో కూడిన హృదయాన్ని పెంచుకోండి. అది ఒక విచిత్రమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. మన ఉనికిలోనే అద్భుతం నిండిపోతుంది.
Monday, November 17, 2008 4 comments By: visalakshi

ప్రేమ(తో)లేఖ...............

ప్రేమలేఖ అంటే మిత్రులకు లే రాయడం.
నిర్మలమైన స్నేహం ,స్వచ్చమైన హృదయాల నుండి పుట్టినవే మధురమైన లేఖలు.
అంతరంగికుడైన మిత్రుడితో హృదయంలోని మార్దవమైన అభిప్రాయాన్ని చెప్పుకోవడమే ప్రేమలేఖ !!!
ప్రియురాలు దగ్గర లేనప్పుడు ఆమెతో ఇంటిమేట్‌గా మాట్లాడడమే ప్రేమలేఖ !!!!
చాలా ప్రియమైనవారు రాసిన లేఖ పదే పదే చదువుతూ కలలలోకి వెళ్ళకపోతే ఆ వుత్తరం వచ్చి ప్రయోజనం లేదు..
నన్ను మరిచిపోవద్దు. సర్వకాల సర్వావస్తల్లోనూ నిన్నే అన్వేషిస్తున్నానని జ్ఞాపకం చేయడమే ప్రేమలేఖ.
ఈ ప్రపంచమే, ఈ సృష్ఠి సౌందర్యమే ఒక పెద్ద ప్రేమలేఖ..........
"లేఖ" ఎంత మధురంగా ఉంది ఈ పదం .అందుకే మా పాప పేరు లేఖ అని పెట్టుకున్నాను. అందరూ లేఖా అని పిలుస్తారు.
తరం మారింది .ఈరోజుల్లో ఎంతమంది వుత్తరాలు రాసుకుంటున్నారు?అందరూ ఈమెయిల్సు మరియు సెల్ఫోనులో మెసేజిలు చేసుకుంటున్నారు. ఇవి కూడా పరస్పర అవగాహనకు తోడ్పడుతాయి . ఇంటర్నెట్ పుణ్యమాని బ్లాగులలో పరస్పరం అభిప్రాయాలను పంచుకునే అవకాశం వచ్చింది.
ఎన్ని వచ్చినా ఆ పాత మధురాలే తీయగా వుంటాయి.
చివరిగా ఒక మాట. పుస్తకం.......మన నేస్తం అని నిన్న ఈనాడు పత్రికలో శీర్షిక రాసారు. అందులో తెలుగు పుస్తకాల స్థానమెక్కడ అని ప్రశ్నిస్తూనే శ్రీ శ్రీ , ,చలం ,విశ్వనాధ సత్యనారాయణ ,ఆరుద్ర ,డా.సి.నారాయణ రెడ్డి,రాచకొండ విశ్వనాధశాస్త్రి ,,చాగంటి సోమయాజులు, గోపీచంద్ ,మరియు బుచ్చిబాబు తది తర సుప్రసిద్ధాల రచనలకు ఎప్పుడూ ఆదరణ వుంటుంది. నేడు వాటిని తలదన్నే రచనలు రావడంలేదని సాహితీ పిపాసులు అంటున్నారు. పుస్తకాల పట్ల జిజ్ఞాస కలిగించేందుకు వాటి ఆవశ్యకతను చాటి చేప్పేందుకు మన రాష్త్రంలో "విశాలాంధ్ర "అన్ని శాఖల వద్ద జాతీయ పుస్తక వారోత్సవాల సంధర్భంగా ఈ వుత్సవాలను చేపడుతోంది.
కాబట్టి ఆ పాత మధుర పుస్తకాలకోసం చలో విశాలాంధ్ర.
Saturday, November 8, 2008 6 comments By: visalakshi

నా బాల్యం..........

తడబడే అడుగులతో తనివి తీరని ఆటలతో సాగిపోయే బాల్యం,భగవంతుని స్వరూపమే.అందుకే అన్నారు పిల్లలూ ,దేవుడూ చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే :
చిన్ననాటి ఆటలు ,పాటలు ,ఆహ్లాదం,పల్లెటూరు మధురమైన జ్ఞాపకాల్ని,మరల రాని మధుమాసం లాంటి పసితనాన్ని ,అందరితో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది .
హైదరాబాదు నగరంలో అమ్మా నాన్నల దగ్గర తెల్ల కాగితంలా ,స్వఛ్చంగా ,కల్లాకపటం తెలియని వయసులో 2వ తరగతి చదువుతుండగా మా అమ్మ ప్రోద్భలంతో మా నాన్నగారు నన్ను అమ్మమ్మ గారింటికి తీసుకెళ్ళారు . మా అమ్మమ్మకి 4గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. మా అమ్మ ,మామయ్య హైదరాబాదులో, మిగిలిన వారు తూ"గో"లో ఉన్నారు. మా ఊరు అమలాపురం దగ్గరలోని ఒక పల్లెటూరు. అక్కడ అమ్మమ్మ, పిన్ని ఉండేవారు. వారికి తోడుగా అలా పల్లెటూరు లో అడుగు పెట్టిన నా అనుభూతుల పరిమళాలు.
మా అమ్మమ్మగారిల్లు 13గదుల పెంకుటిల్లు. అంత పెద్ద ఇంట్లో ఉంటున్నది ముగ్గురం.ఒక్కో గదికి ఒక్కోపేరు . ప్రతీ గదీ నాదే అన్న హక్కుతో మొత్తం కలియతిరిగి ,అమ్మమ్మ అరుగుమీద కూర్చుని కబుర్లు చెబుతుంటే పక్కనే కూర్చుని పెద్ద ఆరిందాలా వినేదాన్ని. అక్కడ స్కూలు 7వ తరగతి వరకు ఉండేది .స్కూలికి వెళ్ళి వచ్చాక ,సాయంత్రం మా కొబ్బరి తోటల్లో తిరిగి వచ్చేదాన్ని. రాత్రి అంటే భయం .ఎందుకంటే వూళ్ళల్లో ఎక్కువగా కరెంటు తీసేవారు. హరికెన్ లాంతరు పెట్టుకుని అమ్మమ్మ దగ్గరే ఉండేదాన్ని. చీకట్లో ఏ గదిలోకి వెళ్ళాలన్నా భయపడేదాన్ని. స్టోరు రూము అంటే మరీ భయం. పెద్ద పెద్ద భోషాణాలూ అవీ ఉండేవి. పెద్ద పులిలా నేనుండగా భయం దేనికి ,భయం వేసినపుడు ఆంజనేయస్వామి దండకం చదువుకో అనేది. పండగలకి అందరూ వచ్చినపుడు మాత్రము మా ఇల్లు ఒక బృందావనమే. అప్పుడు మనవలు, మనవరాళ్ళను చుట్టూ చేర్చుకుని మా అమ్మమ్మ రకరకాల కధలు ,అష్టోకరపక్షి ,మానుబోకి, పేదరాసిపెద్దమ్మ లాంటి కధలు చాలా చాలా చెప్పేవారు.అదీ బయట ఆకాశం, నక్షత్రాలు చూసుకుంటూ అరుగుమీద అమ్మమ్మతో కూర్చోవడం చాలా ధీమాగా అనిపించేది. అక్కద పండగలొస్తే దేవుడ్ని ఊరేగించేవారు. నేను, పిన్ని పూవులన్ని గుచ్చి పెద్ద పెద్ద దండల్ని ఊరేగింపు ఇంటి ముందుకి రాగానేస్వామి మెడలో వేసి హారతులిచ్చేవాళ్ళం . పూజామందిరం అన్నిటికన్నా నాకిష్టమైనది. నాకు ఇష్టమైన రవ్వలడ్డు చేసి పూజామందిరంలో పెట్టి రోజుకొక్కటి ఇచ్చేవారు.ఇంకోటి అడిగితే దేవుడు రోజు ఒకటి నీకోసం ఇస్తున్నాడు అని మరునాడు మందిరం నుండి ఒక లడ్డు నా చేతిలొ పడేట్లు గా చూపించారు. నా అమాయకత్వానికి ఇప్పటికీ నవ్వు వస్తోంది. నా లేలేత బాల్యాన్ని తీయ తీయగా 4ఏళ్ళు గడిపిన నాకు తీరని విషాదం మా నాన్నగారి మరణం. వెనువెంటనే నెల తిరగకుండా ఆ భాదతో మా అమ్మమ్మగారి మరణం. ఈ విషాదాలతో నేను మరల హైదరాబాదు అమ్మగారింటికి చేరుకున్నాను. నేను అమితంగా ప్రేమించిన ఇద్దరు నాకు నా చిన్నతనంలోనే దూరమయ్యారు. మరల 25 సం:ల తరువాత అంటే 6నెలల క్రితం మా ఊరు మా అక్క,చెల్లెళ్ళు ,మరియు మాపాపతోవెళ్ళి చూసి వచ్చాము. మా ఇల్లు, మాఊరు చాలా మార్పుతో సర్వాంగసుందరంగా ఉన్నాయి. మా ఊర్లో అందరి ఆప్యాయతకి కళ్ళు చెమర్చాయి. అమ్మమ్మని గుర్తుతెచ్చుకుని అందరిని పేరు పేరునా అడిగి ఊరంతా చూపించిమళ్ళి అందరూ రావాలి అంటూఆతిధ్యమిచ్చిన మా ఊరి పెద్దలందరికి నా హృదయ పూర్వక నమస్కృతులు.