Friday, September 30, 2016 0 comments By: visalakshi

దశహారిణి-శక్తిరూపిణి దుర్గ

 స్త్రీలను జగన్మాతరూపాలుగా, మాతృమూర్తులుగా భావించే అద్భుత సంస్కృతికి నిలయమైన మాతృభూమి మనది.స్త్రీలు దు:ఖిస్తే సిరిసంపదలు నిలవవనీ, స్త్రీలను వేధిస్తే అరిష్టాలు ఆవరిస్తాయనీ నమ్మిన ఆర్యభూమి మనది. విద్యాదాయిని సరస్వతి, సౌభాగ్యదాయిని లక్ష్మి, శక్తిప్రదాయిని పార్వతి...ఇలా ముగురమ్మలను ఆరాధించే దేవభూమి మనది; ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి: - కనురెప్పలు తెరచినంత మాత్రాన సృష్టి, కంటికాంతులు ప్రసరించినంత మాత్రాన స్థితి, కనురెప్పలు మూసినంత మాత్రాన లయలను సాగించే ఆదిపరాశక్తి ఆవిర్భవించిన ఆధ్యాత్మిక భూమి మనది.     అలాంటి పుణ్యభూమి అయిన భారతావనిలో నేడు స్త్రీలు ఇంటా, బయటా      వేధింపులకు గురవుతున్నారు. ...కామాసురులు, మదాసురులు,
  లోభాసురులు లేని సమాజాన్ని చూడాలంటే, అనుగ్రహించి అభయమిచ్చిన   ఆ జగన్మాతే ఆగ్రహిస్తే వినాశనమవుతామన్న విషయాన్ని సదా        గుర్తుంచుకోవాలి.  

 మనిషిచేత పాపకృత్యాలు చేయించేవి నియంత్రణలోలేని దశేంద్రియాలు. ఈ దశేంద్రియాల ద్వారా మనిషి చేసే పాపకృత్యాలు పది. అవి - దోపిడి, హింస, స్త్రీవ్యామోహం, లోభం, వంచన, పరుషవాక్కులు, అసత్యం, పరనింద, చాడీలు చెప్పడం, అధికార దుర్వినియోగం,ఈ దశవిధ పాపాలను హరించడానికి జగదంబను కొలిచే పండుగనే 'దశహరా ' అని అంటారు.......జన్మరాహిత్య స్థితిని పొందడానికి మానవజన్మ దశలను హరించమని జగన్మాతను ఆరాధించే పండుగనే 'దశహరా ' అని కూడా అంటారు. కాలాంతరంలో ఈ పదం 'దసరా 'గా రూపాంతరం చెందిందని పెద్దలంటారు. మానవుల వద్ద శక్తిని ప్రసాదించే ఒక గొప్ప మంత్రం ఉంది.అది విజయానికి దారి తీసే అద్భుతమంత్రం.,అదే ఐక్యతామంత్రం. ఐకమత్యంగా ప్రజలందరినీ సంఘటిత పరచగలిగినశక్తి జన-గణేశుడు ఇస్తాడు. ఇంక ప్రజలందరి ఐశ్వర్యానికి సమిష్టి రూపంగా లక్ష్మీదేవి, జ్ఞానం యొక్క సమిష్టిరూపంగా సరస్వతీదేవి, సమాజంలోని యువశక్తికి స్పూర్తిదాయకునిగా కార్తికేయుడు నిలుస్తారు.ఈ నాలుగు సమిష్టి శక్తిరూపాలను కలగలిపితే వచ్చే ఏకత్వశక్తియే దుర్గా స్వరూపం.చతుర్భుజుడైన గణేశుని, రెండుభుజాలతో ఉన్న లక్ష్మి, సరస్వతి, కార్తికేయుల మొత్తం భుజశక్తిని కలుపుకొని పదిభుజాలతో దుర్గామాత మనకు గోచరమవుతుంది.   సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ, వారికి గల సంఘటితశక్తికీ సంకేతం ఈ దుర్గామాత. ప్రజాబలం, ధనం, జ్ఞానం, ఐకమత్యాలు అన్నీ కలగలిసినప్పుడు దుర్గ ఆవిర్భవిస్తుంది. నాలుగు దిక్కులు, నాలుగు మూలలు, పైన, క్రింద అన్నీ కలిపితే దశదిశలు ఏర్పడతాయి.ఈ దశదిశలనుండి వచ్చిన ఏ ప్రమాదాన్ని అయినా అరికట్టగల అప్రమత్తతను కలిగి ఉండి, పది చేతులతో ఆయుధాలను ధరించిన శక్తి స్వరూపంగా దుర్గామాతను కొలుస్తారు. దుర్గామాత మాతృరూపంలో సమాజాన్ని పరిరక్షిస్తూ మన పూజలను అందుకొని..మనచే ఆరాధింపబడుతున్న మాతృరూపిణి.
  జ్ఞానం, ఎరుకలతో కూడిన ప్రజ్ఞ బాహ్యశత్రువులనే కాక అంతర్గతంగా మనస్సులో దాగి ఉన్న అరిషడ్వర్గాలను సైతం నశింపజేయగలదు.. శత్రువులు అంటే రాక్షసులు, దుర్మార్గులుగా ఎక్కడి నుండో వచ్చేవారు మాత్రమే కాదు, సమాజంలోనే అంతర్గతంగా నివసిస్తూ మన మధ్యే తిరుగాడుతూ ఉండేవారు కూడా అని చెప్పవచ్చును. ఒక వైద్యుడు తన వృత్తిధర్మాన్ని విస్మరించినప్పుడు, ఒక దుకాణదారుడు వస్తువులను కల్తీ చేసినప్పుడు, రాజకీయాలు దుష్టత్వాన్ని సమర్ధించినప్పుడు, ఒక దొంగ నాయకుడైనప్పుడు, అనర్హుడు మత బోధకునిగా ప్రచారాలు చేస్తున్నప్పుడు, అసమర్ధుడు ప్రజాపాలకుడైనప్పుడూ - ఈ సమాజమనే తల్లి ఆ త్రిశూలాన్ని తప్పక ధరించవలసి ఉంటుంది! ఐకమత్యంగా ఉన్న మానవ సమూహమే సమాజాన్ని తల్లిగా, దుర్గామాతగా  సంరక్షిస్తుందని గుర్తెరగాలి.
Thursday, September 29, 2016 1 comments By: visalakshi

బ్రహ్మచర్య వ్రతం

'మీ నర నరాల్లో బ్రహ్మచర్యం అగ్నిలా ప్రజ్వరిల్లాలి.' "శరీరం, మనస్సు, బుద్ధి ఈ మూడు సమగ్రంగా పరిణతి చెందాలంటే బ్రహ్మచర్యం అత్యంత ఆవశక్యం. బ్రహ్మచర్యాన్ని అవలంబించిన వ్యక్తులలో అద్భుతమైన జ్ఞాపకశక్తి, గణనీయమైన  అవగాహనశక్తి  వృద్ధి  చెందుతాయి."  బ్రహ్మచర్యాన్ని పాటించడం ద్వారా లైంగికశక్తి మరింత ఉన్నతమైన 'ఓజస్సు ' అనే మానసిక శక్తిగా రూపొందుతుంది.  ఆత్మనిగ్రహానికి,జిహ్వేంద్రియాన్ని అదుపులో ఉంచడానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. అతి బలమైన జిహ్వేంద్రియాన్ని అదుపులో ఉంచడం ద్వారా మిగిలిన ఇంద్రియాలపై నియంత్రణ సులభం అవుతుంది. అందుకే ఆహార విషయంలో కొన్ని నియమనిబంధనలు అవసరం. సాత్విక ఆహారం తీసుకోవడం ;అపక్వ ఆహారం అంటే పండ్లు, కాయగూరలు భుజించడం; ఉపవసించడం మొదలైనవన్నీ సాధనామార్గంలో అవసరం. బ్రహ్మచర్య సాధన ఆరంభంలో శరీరానికి ఎలాంటి ఆహారం ఇస్తున్నామనే విషయంతో పాటు మనస్సుకు ఎలాంటి సమాచారాన్ని అందజేస్తున్నామనేది కూడా అంతే ముఖ్యం. మనస్సులోని ఆలోచనలు, భావనలు, ఇంద్రియాల నుండి సేకరించే సమాచారం పరిశుద్ధమైనవిగా ఉండటం బ్రహ్మచర్యపాలనకు అత్యంత ఆవశ్యకం.  గాంధీ మహాత్ముడు బ్రహ్మచర్యం గురించి తెలియజేస్తూ..." కేవలం జిహ్వేంద్రియాన్ని, గుహ్యేంద్రియాన్ని అదుపులో ఉంచడం బ్రహ్మచర్యం కాదు. త్రికరణశుద్ధిగా ఆత్మనిగ్రహాన్ని పాటించినప్పుడే అది సమగ్రమైన బ్రహ్మచర్య అనుష్ఠానం అవుతుంది." అని వివరించారు.

 విషయాసక్తిని  కేవలం భౌతికమైన పద్ధతులద్వారా అదుపు చేయలేము. మానసిక స్థాయిలో దాన్ని పరిష్కరించడం చాలా ముఖ్యం.  పూర్వమీమాంస కర్త అయిన జైమిని వేదవ్యాసుని వద్ద విద్యాభ్యాసం చేస్తున్న రోజులవి. పాఠ్యబోధనలో భాగంగా ఒకరోజు వ్యాసభగవానుడు ' ఎట్టి పరిస్థితులలోనూ స్త్రీలతో కలిసి మెలగవద్దు. అలాచేస్తే మీరు ఎంత జాగ్రత్త వహించినా, ఎంత మెలకువగా ఉన్నప్పటికీ కామానికి బానిసలయ్యే ప్రమాదం ఉంది.' అని సూచించారు. అప్పుడు జైమిని అతి విశ్వాసంతో గురువర్యా! నేను బ్రహ్మచర్యంలో సుప్రతిష్ఠుడనయ్యాను.ఏ స్త్రీ కూడా నన్ను ప్రలోభానికి గురి చేయలేదు. అని పలికాడు . ఓహో అలాగా! అది త్వరలోనే తెలుస్తుంది అంటూ వ్యాసమహర్షి తీర్ధయాత్రకు బయలుదేరారు.

ఒకనాడు వ్యాసుడు తన యోగశక్తి ప్రభావంతో అందమైన స్త్రీ రూపాన్ని ధరించాడు. ఆకాశం మేఘావృతమై మరి కొద్దిసేపట్లో కుండపోతగా వర్షం కురుస్తుందనగా నిస్సహాయురాలైన అబలవలె ఒక చెట్టు క్రిందకు చేరాడు. అదే దారిలో తన ఆశ్రమానికి వెళుతున్న జైమిని ఆమెని చూసి ఆశ్రయం కల్పించి రక్షించాలనే ఉద్దేశంతో తనతో పాటు తీసుకువెళ్ళాడు.ఆమెకు ఆశ్రమం లోపల బస ఏర్పాటు చేసి, తను మాత్రం వరండాలో పడుకున్నాడు. అర్ధరాత్రి కామప్రకోపం అధికరించగా బయట చలిగాలి బాగా వీస్తోంది అంటూ లోపలికి చేరాడు. మరికసేపటికి ఆ స్త్రీ చేతిగాజుల గలగలలు విని ఉండబట్టలేక ఆమెను సమీపించాడు. అప్పుడు అక్కడ ఆ స్త్రీ స్థానంలో వ్యాసమహర్షి ప్రత్యక్షమై జైమినీ! ఏమైంది నీ సంయమన శక్తి? ఇప్పుడు చెప్పు, నువ్వు బ్రహ్మచర్యంలో సుప్రతిష్ఠుడవయ్యావా? అని ప్రశ్నించారు. 

 మాయ యొక్క శక్తి, ఇంద్రియాల ప్రభావం ఎంతటి ఘనులైనా మోసగిస్తుంది. అందుకే బ్రహ్మచర్యాన్ని పాటించాలనుకునే సాధకులు పెద్దల సూచనలను అనుసరించే క్రమంలో ఎలాంటి అలసత్వానికి తావు ఇవ్వకూడదు. స్వామి వివేకానంద బ్రహ్మచర్య వ్రతపాలన గురించి చెబుతూ "బ్రహ్మచర్య ఆదర్శాన్ని చేపట్టాలని కోరుకునేవారు సంయమనానికి సంబంధించిన నియమాలను నిష్ఠగా పాటించాలి. స్త్రీ సాంగత్యాన్ని కూదా విడనాడాలి." అని హెచ్చరించారు.
 పతంజలి మహర్షి 'వితర్కభావనే ప్రతిపక్షభావనం - హానికరమైన భావాలను అరికట్టడానికి సద్భావాలను మనస్సులో ప్రవేశపెట్టాలి.'అని యోగసూత్రాల్లో సూచించారు.మహాత్ముల దివ్యసన్నిధి, స్పూర్తిదాయక వచనాల ప్రభావం వల్ల ప్రాపంచికుల మనస్సులు పవిత్రమవుతాయి. "పుణ్యక్షేత్రాలు,తీర్ధస్థలాల్లో ఎందరో మహాత్ములు సాధన చేస్తూ ఉంటారు. అలాంటి ప్రదేశాలను దర్శించినప్పుడు మనస్సు త్వరితగతిన ఉనంత ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందుతుంది." బ్రహ్మచర్య పాలనకు అత్యున్నత పరిష్కారం శరీర స్పృహను విడిచి ఆత్మబుద్ధిని అలవరచుకోవటం, సర్వులను లింగభేదంలేని నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, ఆత్మ స్వరూపాలుగా పరిగణించడం. ఇందుకు పట్టుసడలని సుదీర్ఘ ప్రయత్నం అవసరం.జపము,ధ్యానము, స్వాధ్యాయము, సంకీర్తన, సేవ, ప్రార్ధన వంటి మంచి అలవాట్లతో శారీరకంగా, మానసికంగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం సులభమవుతుంది.
Wednesday, September 28, 2016 2 comments By: visalakshi

అస్తేయ సాధన

 మహాత్మాగాంధీ ఈ అస్తేయాన్ని సత్యాహింసలతో అనుసంధానించి ఇలా అంటారు.."అహింస యొక్క సారమే ప్రేమ". ఎప్పుడైతే మనం నిజంగా ప్రేమిస్తామో అప్పుడు చౌర్యం అనేది అసాధ్యం. మనకు తెలిసిగానీ, తెలియకగానీ ఇతరుల వస్తువులు తీసుకుంటే అపరాధభావానికి లోనవుతాము. మనకు అవసరంలేని వస్తువులను మన దగ్గర ఉంచుకుంటే -అదీ చౌర్యమే. మన నిజమైన అవసరాలు కొన్నే.కానీ మితిమీరిన ఆశలే చౌర్యాలకు పాల్పడేలా చేస్తాయి. దుబారాగా ఖర్చు చేయడం మరొక రకమైన చౌర్యం..పొదుపు చేయడం అస్తేయం. మనం తరచుగా అనేకచోట్ల నుండి ఇతరుల భావాలను సేకరించి, మన రచనలలోనూ, ప్రసంగాలలోనూ ఉపయోగించి ఆ ఘనతను మనకు ఆపాదించుకుంటాం..కానీ ఏ మూలం నుండి గ్రహించామో వారిపట్ల కనీసం కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచకపోవడం కూడా చౌర్యమే!

  ఇక అస్తేయ సాధన ఎలాగో చూద్దాం. ఇందులో స్థూలమైనవి మరియు సులభమైన విషయాలను ముందుగా పరిశీలిద్దాం. ఇంటిని కొల్లగొట్టడం, జేబు దొంగతనాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, తప్పుడు కొలతలు, కల్తీ వ్యాపారం, పన్ను ఎగవేత కోసం తమ ఆదాయాన్ని తక్కువగా చూపడం....ఈ రకమైన పనులన్నింటినీ వదిలిపెట్టటమే అస్తేయ సాధన. 

 స్తేయానికి మూల కారణం - 'మనిషికి ఉన్న అత్యాశే', దాన్ని రూపుమాపడమే నిజమైన అస్తేయ సాధన. ఇక్కడ ప్రతిపక్షభావనం అంటే ఈ దుర్వ్యాపారాలను ప్రేరేపించే ప్రవృత్తులకు వ్యతిరేక ఆలోచనలను ప్రవేశపెట్టడం ద్వారా దీన్ని సాధించవచ్చు.దొంగతనం అనేది చట్టరీత్యా నేరం. అందుకు శిక్ష కూడా పడుతుంది. దొంగతనం వంటి పనులకు పాల్పడిన వ్యక్తుల పట్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారు.ఆ పని అశాంతికి, అపరాధభావానికి లోను చేస్తుంది. మనిషికి ఆశ ఎన్నటికీ చావదు. మానసిక అస్థిరతకు, బాధలకు అదే మూలకారణం. ఇది మిత్రులను సైతం శత్రువులుగా మార్చివేయగలదు.ఈ రకమైన ఆలోచనలు ప్రతిపక్షభావనలు. ఈ ఆలోచనలు మనిషికి అస్తేయ సాధన పట్ల సంకల్పబలాన్ని కలిగిస్తాయి.  ఆధ్యాత్మిక సాధకుడు ఇతరుల నుండి దాచి ఉంచవలసిన పనులు ఎంతమాత్రం చేయరాదు. "ముందు నీ పట్ల నీవు సత్యవంతంగా ఉండు. ఆ తర్వాత ఇతరుల పట్ల కూడా! ఈ విషయంలో ఆత్మవంచనకు తావు ఇవ్వకూడదు."     - శ్రీరామకృష్ణులు... 

 ఎప్పుడైతే సమాజంలో  ధర్మాత్ముల కంతే ధనవంతులే ఎక్కువగా గౌరవించబడతారో, అప్పుడు జనసామాన్యం అంతా అడ్డదారిలోనైనా ధనవంతులు కావాలనే చూస్తారు. ఈ సామాజిక రుగ్మతను నిర్మూలించాలంటే నైతిక ధర్మాలను నిత్య జీవితంలో పునరుద్ధించి అనుసరించాలి.  అంతరంగంలోను, బాహ్యంగానూ అస్తేయ సాధనను అలవరచుకున్న వ్యక్తి మనస్సు చురుకుగానూ, మిక్కిలి జాగరూకతతోను ఉంటుంది.తత్ఫలితంగా అది యోగసాధనలో పైస్థాయికి ధ్యానం వైపు సులభంగా మొగ్గుచూపుతుంది. దురాశ అనేది ఒక రకమైన బంధం.అది సాధనా మార్గంలో దు:ఖాన్ని కలిగించే అడ్డంకులైన పంచక్లేశాల (అవిద్య, అహంకారం, రాగం, ద్వేషం, అభినివేశం) వంటిది. 

 ఈశావాస్య ఉపనిషత్తులో నొక్కి వక్కాణించిన అస్తేయం యొక్క ఆధ్యాత్మిక దృక్కోణాన్ని ఇప్పుడు చూద్దాం. అంతా ఒక్కటిగా చూస్తున్నప్పుడు, అంతా ఒక్కటిగా ఉన్నప్పుడు ఇక 'చౌర్యం' మాట ఎక్కడ? ఈ రకమైన ఆధ్యాత్మిక భావంలో నెలకొన్న యోగికి ఆశించదగినది ఏదీ లేదు.అలాగని పోగొట్టుకునేది కూడా ఏదీ లేదు. తమలో ఉన్న భగవంతుడే ఆ దొంగలోనూ వ్యక్తం కావడం వారు చూస్తారు.   ఒకసారి ఘాజీపూర్ లోని పవహారీబాబా ఆశ్రమంలోకి ఒక దొంగ ప్రవేశించాడు. అతడు ఏదో అలికిడి విని తప్పించుకుందామనేసరికి బాబా మేల్కొన్నారు. తను దొంగిలించిన సొత్తు అక్కడే వదిలేసి ప్రాణభయంతో ఆ దొంగ పరిగెత్తసాగాడు. బాబా కూడా అతనిని వెంబడించి చాలా దూరం పరిగెత్తిన తరువాత అతడిని పట్టుకోగలిగారు. తరువాత బాబా ఆ దొంగను 'నారాయణా అని సంబోధిస్తూ అతడు దొంగిలించిన సొత్తు అతడికే ఇచ్చివేశాడు. ఆశ్చర్యపోయిన ఆ దొంగ తరువాత జీవితంలో గొప్ప సాధువుగా పరిణమించాడు.

 భగవద్గీతలో చెప్పినట్లు ఎవరైతే భగవంతుణ్ణి శరణుజొచ్చి, హృదయపూర్వకమైన భక్తిని కలిగి ఉంటారో అలాంటి వారి యోగక్షేమాలను ఆ భగవంతుడే చూసుకుంటాడు. చరాచర సృష్టి వెనుక ఉన్న ఏకత్వాన్ని ధ్యానించడం, స్తేయ అస్తేయాలనే ద్వంద్వాలకు అతీతమైన ఆధ్యాత్మిక చైతన్యం మనలో జాగృతం అవడం - అస్తేయ సాధన యొక్క అంతిమ లక్ష్యం ఇదే!    
Tuesday, September 27, 2016 3 comments By: visalakshi

అపరిగ్రహం

"అపరిగ్రహస్థైర్యే జన్మ కధంతా సంబోధ: - అపరిగ్రహమనే వ్రతంలో నిష్ఠులైనవారికి పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది." 

 అపరిగ్రహం అంటే ' ఇతరుల నుండి ఏమీ స్వీకరించకపోవడం' సహజంగా ఇక్కడ అందరూ భావించే విషయం ఇతరుల నుండి బహుమతులు, వస్తువులు తీసుకోకపోవడం అని. కానీ ఇక్కడ విషయం అది కాదు. ' స్వీకరించడం అనే భావన మనం విడనాడాలి.' అని ఇది సూచిస్తుంది.  ఇతరుల నుండి ఏమైనా స్వీకరించాలనే భావనే మనలను బద్ధులను చేస్తుంది...శారీరకంగాకానీ, మానసికంగాకానీ ఇతరులకు బానిస కావద్దు. తప్పనిసరి పరిస్థితులలో ఎవరినుండైనా ఏదైనా స్వీకరించవలసి వస్తే ' ఇది ధర్మాచరణకు మాత్రమే, నాకోసం కాదు ' అనే వైఖరి అవలంబించడం ఉత్తమం. ఇలా ఎవరి చేతులలోనూ బందీ కాకుండా, ఎవరికీ బానిస కాకుండా ఉంటే మానసిక స్వేచ్చ లభిస్తుంది. ఆ స్థితి నుండి ధర్మాచరణ అలవడుతుంది.    అలా మానసిక స్వేచ్చను పొందిన మనస్సు దాని అంతరాళాల లోతును కనుగొంటుంది. మన మనస్సుకు ఇప్పుడు స్వేచ్చ లేదు. ఎందుకంటే అది ఎన్నో పరిమితులకు లోబడి ఉంది. ఈ పరిమితులన్నీ( వాసనలు, అభిరుచి, తలంపు, భావము, జ్ఞాపకము) తొలగిపోతాయో అప్పుడు ఆ స్వేచ్చా మానసానికి మన ఆలోచనలను గమనించగలిగే శక్తి వస్తుంది.అలా గమనించడం వలన మనస్సుకు బంధనాలనుండి విముక్తి లభిస్తుంది.  

" మీకు ఎవరైనా ,ఏదైనా ఇస్తే, అది మీకు కాదు భగవంతునికి అని గుర్తుంచుకోండి. దాన్ని మీకై ఉపయోగించకుండా ఆయన సేవకై వినియోగించండి." ఈ ప్రపంచంలో ఎవరూ ఎవరికీ ఇవ్వలేరు. అంతా భగవంతుడిదే. అందుకే ఆయనకు నివేదించడానికే స్వీకరిస్తున్నామనే సమర్పణ భావంతో జీవించడం ఉత్తమం. అపరిగ్రహ సాధన చేసినప్పుడు మనం స్వేచ్చగా ఉన్నామనే భావనను పొందుతాం. అప్పుడు మనం పూర్తిగా స్వతంత్రులం. ఏ బానిసత్వమూ ఉండదు.

  అపరిగ్రహ ధర్మాన్ని అనుసరించి గత స్మృతులను పొందడం వల్ల ప్రయోజనం ఉంది. మనస్సుకు బానిసలైనవారి ఆలోచనలు అప్రయత్నంగా ఆచరణలోకి వస్తాయి. అందుకే ప్రతి ఆత్మజ్ఞాని ప్రేమ, దయ, క్షమ, అఔదార్యాలను కచ్చితంగా పొందుతారు. ఎప్పుడైతే స్వతంత్రేచ్చతో అన్ని ఆలోచనలను పైకి తీసుకు వస్తాడో అప్పుడు తన గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు. తద్ద్వారా ఇతరులను క్షమించడం, వారిపట్ల దయ కలిగి ఉండడం మొదలైన అనుష్ఠాలను గావిస్తాడు. ఈ లోకంలోకి తన రాకపోకలను గమనించి ఈ మారు ఎలాగైనా ప్రకృతిమాయకు లోనవకుండా ముక్తుడవడానికి ప్రయత్నిస్తాడు. అతి చిన్న అంశంగా కనిపించే అపరిగ్రహం వెనుక ఇంత కధ దాగి ఉంది.అందుకే పతంజలి నైతికజీవన నిబంధనలైన   'యమ ' నిర్దేశకాలలొ దీనిని కూడా చేర్చాడు.Monday, September 26, 2016 0 comments By: visalakshi

మా విశాల హృదయంలో సమాలోచనలు..పురుషార్ధాలు..

 పురుషార్ధాలు "  పురుషేణ (ఆత్మనాఅర్ధ్యతే కామ్యతే ఏతే పురుషార్ధా:"! 

పురుషునిచే అంటే ఆత్మచే (స్త్రీ పురుషులచేకోరబడేవి కనుక వీనికి పురుషార్ధాలని పేరు.పురుషార్ధాలు నాలుగుధర్మఅర్ధకామమోక్షాలుఅధర్మ కార్యాలనుండి ఇంద్రియాలను మరల్చి ధర్మకార్యాలలో వాటిని రమింపజేయాలనేది వేదఋషుల ఆదేశంఅందుకే మానవుని జీవనంలో శ్రమించి సాధించే శ్రేయోమార్గాన్ని మనకు చూపించారు శ్రేష్ఠ మార్గమే పురుషార్ధ సాధన-పురుషార్ధాలు.
ధర్మం:-
విశ్వమంతటా అంతర్యామి రూపంలో నిండి ఉన్న పరమాత్మ - విష్ణువుసృష్ఠిలోని త్రివిధ పదార్ధాలనూ సత్వ,రజస్తమో గుణాలతో కూడిన పదార్ధాలను  పరమాత్ముడే తయారు చేసాడుఅప్పుడే  పదార్ధాలన్నీ తమ తమ ధర్మాలను ధరించి ఆయా విధులను సక్రమంగా నిర్వహిస్తాయని వేదం ఉపదేశిస్తుందివేద విహిత కర్మలు ధర్మములువానికి విరుద్ధమైనవి అధర్మములు.ధర్మాన్ని నాశనం చేసేవారిని ధర్మమే నాశనం చేస్తుందిధర్మాన్ని రక్షించేవారిని ధర్మమే రక్షిస్తుందిధర్మాన్ని విడిచిపెట్టినవారిని ధర్మమే విడిచి పెడుతుందిఅందువలన శ్రద్ధతో ధర్మాన్ని ఆచరించాలి.

 పురుషార్ధాలన్నింటికీ 'ధర్మమే ప్రధాన లక్ష్యం ' అందుకే ఋషులు ధర్మాన్ని అతిక్రమించ వద్దని పదే పదే హెచ్చరించారుఅపుడే మనుష్యుడు తన పరిధిలో తను జీవిస్తాడుసుఖిస్తాడుతృప్తినిశాంతిని పొందుతాడు

  ప్రపంచములో మానవులకు ధర్మమొకటే మిత్రుడు.  అది మరణించిన తరువాత కూడా మన వెంట ఉంటుందిబాంధవ్యాలతో సహా అన్నీ మనలను విడిచిపోతాయికానీ  ధర్మం మాత్రం మనలను ఎప్పుడూ విడువదు.

అర్ధం:- మనం  లోకంలో అనుభవించే పదార్ధాలన్నీ అర్ధాలేధర్మబద్ధంగా వస్తువులను సంపాదించుకొని వానిని త్యాగభావంతో అనుభవించడమే అర్ధ ప్రయోజనంగృహస్తులకు సంపదలు కావాలివాటిని కష్టపడి పురుషార్ధంతో సాధించాలిసాధించిన వానిని భోగించాలి భోగంలో త్యాగముండాలి. నాది కాదనే ఆలోచన ఉండాలి. ఇతరులు కూడా  వస్తువులను అనుభవించేందుకు అవకాశం కల్పించాలి. నాది అనే భావం వీడి అందరిదీ అనే విశాల మనస్తత్వం అందరిలో కనిపించాలి. అదే అర్ధం... 

 కామం:- అంటే ధర్మబద్ధమని కోరికలు. పురుషార్ధాలలో ప్రధమంగా ఉన్న ధర్మంతోనే వస్తువులను పొందాలి. అలాగే కోరికలు కూడా చాలా సహజంగా ధర్మానికి నీతికి అత్యంత దగ్గరగా ఉండాలి. ఉత్తమ సంతానాన్ని ఉత్పన్నం చేసి లోకానికి ఉపకారం చేయాలి. మనుష్యుడు వాంచలకు లొంగిపోకూడదు. అందని కోరికలకు ఆశించి భంగపడకూడదు. కోరికలు మనిషికి దు:ఖాన్ని కలిగిస్తాయి. జీవితావసరాలను సాధ్యమైనంతవరకు తగ్గించుకోవాలి. అవసరాలు మనిషిని వేధించి బాధిస్తాయి. ఈ నాటి మానవులు మొదటిదైన ధర్మాన్ని, చివరిదైన మోక్షాన్ని విడిచి, మధ్యలోని అర్ధకామాల వెంట పరుగులు తీస్తున్నారు. ఋషుల ఆలోచనలకు భిన్నంగా వ్యవహరిస్తే మానవులకు దు:ఖమే కలుగుతుంది. త్రికాలజ్ఞులైన వేదఋషులను అనుసరించడం మన ధర్మం.

మోక్షం:- ఇది పరమ పురుషార్ధం కైవల్యం. ఇది యోగులకు మాత్రమే ప్రాప్తించే అత్యంత పరమపద సోపానం. దానికి మానవులు యమములు, నియమములు శ్రద్ధతో పాలించి, ప్రాపంచిక మోహాలను వదిలించుకొని ఈశ్వర ప్రాప్తిని పొందాలి.యోగికి చిత్తస్థైర్యం కొరకు ప్రణవనాదం ఆలంబనమౌతుంది. యోగి బ్రహ్మప్రాప్తికై యత్నించి ముక్తుడౌతాడు. బ్రహ్మము శాంతము, అజరము, అమరము, అమృతము అభయము......  


      
  .......Visalakshi.....
  
  
  

మా విశాలహృదయంలో సమాలోచనలు..పంచానన మూర్తి ఆకృతి ..అర్ధం-పరమార్ధం

 ఓం నమ: శివాయ

  పంచానన means all that is ruled by number five.

Shiva is considered to be the ruler of the five directions, five elements, five faces and five senses....

Shiva who developed four extra heads so that he could continue looking at the apsara TilOttama as she went around him in salutation.


Ishana: Sadashiva  is associated with anugraha shakti. (power of blessing)

Tatpurusha: also known as maheswara associated with Thoridhana sakti.(power of concealment)

Aghora : also referred  to as Rudra ..Aghora Shiva associates with samhara shakti (power of dissolution )

Vamadeva : also termed as Vishnu.. vamadeva shiva is associated with stithi shakti (power of substance )

Sadyojaata : also named as brahma ...sadyojaata shiva is associated with srishti shakti (power of creation )


 ఆది దేవునికి నమస్కారములు. ఇలా టైపు చేస్తూ నాలోనూ భక్తి ఉంది ..కాబట్టి నా అంతరాలనుండి ఈ వివరణ వచ్చింది. అని లిప్తపాటు మది పులకించింది. ఆ పరమేశ్వరుడు ఈ విధంగా తనని తల్చుకునే అవకాశం మనకి కల్పించాడు.ధన్యోస్మి....            Rukmini Devi........
 పంచానన లేదా ఐదు ముఖాల ఆకృతి సృష్టికి మారుగా ఉన్న ఐదు అంశాలకు ప్రాతినిద్యం వహిస్తుంది.అది.. 


 శిరోబిందువు వైపు తిరిగి ఉన్న ఈశానుడి ముఖం అత్యున్నత  ఆకృతిని సూచిస్తూ ..సదాశివునిగా పేర్కొనబడుచున్నది. అది ఆకాశాన్ని పాలించే శక్తికీ, మోక్షప్రదాత అయిన దేవతకు ప్రతీక.

 తత్పురుషుడి ముఖం తూర్పువైపు తిరిగి ఉంది. వాయువు మీద ఆదిపత్యం చెలాయించే శక్తికి ప్రతీకగా కాంతినిరోధక, అంధకారబంధుర శక్తులకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

పంచభూతాలలోఒకటైన అగ్నికి పాలకుడైన  అఘోరుడు  దక్షిణాభిముఖుండై విశ్వాన్ని లయం చేసి పునర్నిర్మించే శక్తికి ప్రతీకగా విలసిల్లుతున్నాడు.
 ఉత్తరాభిముఖంగా వామదేవుడు జలంపై ఆధిపత్యం వహించి స్థితికి బాధ్యుడై ఉన్నాడు. 

 సద్యోజాతుడు పశ్చిమాభిముఖుండై ఫృధ్వీ తత్వానికి పాలకుడై సృష్టించే శక్తికి ప్రాతినిద్యం వహిస్తున్నాడు......  
     
  ఓం నమ: శివాయ    
                                                                     ......Visalakshi......

                                                                       

Sunday, September 25, 2016 0 comments By: visalakshi

మా విశాలహృదయంలో సమాలోచనలు..మరోకోణంలో రామాయణం....

 ఓం శ్రీ రామచంద్రాయ నమో నమ:

 రామాయణం దీనిని మరో కోణంలో చూద్దాం.

{వాట్సాప్ లో సమగ్రంగా సాధ్యం కాదు కాబట్టి సంక్షిప్తంగా చెప్తాను.

నీవు చెప్పిన సంక్షిప్త రామాయణమును ఇక్కడ పదిల పరుస్తాను భారతీ! నువ్వు "స్మరణ"లో సమగ్రంగా ఈ రామాయణమును చెప్పమని నీ ఈ స్నేహితురాలి కోరిక...}


మానవుడు మాధవుడు ఎలా కాగలడో తెలియజెప్పే సాధకుడిగా శ్రీరాముణ్ణి చూద్దాం.
 దశేంద్రియములను  సంయమపరచిన సాధకుడు దశరధుడు అయినా....

 మంధర  అనే బుద్ధి ప్రేరణతో, ఆధ్యాత్మిక(పారమార్ధిక) లౌకిక(ప్రాపంచిక) లక్ష్యాలకు మధ్య డోలాయమానంగా ఊగిసలాడే చిత్తమనే కైక, శ్రీరాముడనే సాధకుణ్ణి....

ఈ పోటీలు, స్పర్ధలు, హంగులు, ఆర్భాటాలు రణగొణధ్వనుల మధ్యలో నుండి రణాలు(శబ్దాలు)లేని అరణ్యవాసం కొంతకాలం చేయమని ఆదేశిస్తుంది.

 చంచలమై, అస్థిరమై,నిలకడలేని ఆలోచనలకు ప్రతిరూపములు వానరమూకలు.

సుగ్రీవం అంటే కళ్ళెం. సుగ్రీవం అంటే చక్కగా నియంత్రంచబడిన మనస్సు. నిష్కామభావం, అకుంఠిత కార్యదీక్ష, అచంచలభక్తి, జ్ఞాననిష్ఠ అనే సాధనల ద్వారా మరింత దృడతరం చేసుకున్న సంకల్పశక్తికి మారుపేరు ఆంజనేయుడు.

 నిరంతరం మారిపోయే ఆలోచనల మూకను అదుపులో పెట్టుకొని, నియంత్రణతో సంయమనమైన మనస్సు ద్వారా ,సంకల్పమనే ఆంజనేయుని సహాయము వలన మనస్సు అశోకమై ప్రసన్నమైనప్పుడు శాంతి దొరికి మానవుడు మాధవుడవుతాడని చాటి చెప్పిన సాధకుడు రాములోరు.... 
                                                                            Bharati.....


శ్రీరామాయణం విశిష్ఠత పాఠ్యే గేయే చ మధురం. దీన్ని ఏ రూపంలో పఠించినా, ఏ విధంగా పాడుకున్నా మధురంగా ఉంటుంది అన్నది ఆదికవి వాల్మీకి మాట. అది అక్షర సత్యం. కాబట్టే నాటి నుండి నేటి వరకు కవులు ఎందరో రామకధను ఆధారం చేసుకొని వివిధ రచనలు చేస్తున్నారు....

 రామకధకు విరామం లేదు..అది వినే వారికి విసుగు లేదు..చదివేవారికి కొదవ లేదు..ఇంద్రియాల్ని జయించి రాముడు జీవితాన్ని విజయవంతం చేసుకొంటే, ఇంద్రియ పరాజితుడు రావణుడు జీవితంలోనూ పరాజితుడైన వైనం మనకు ఆదికావ్యమైన రామాయణ గాధ తెలుపుతుంది...  శ్రీరామచంద్ర ప్రభువు సర్వధర్మస్వరూపుడని, పురుషోత్తముడని, సాక్షాత్తూ పరబ్రహ్మమేనని ఉపనిషత్తులు వక్కాణిస్తున్నాయి.ఆ విధంగానే వాల్మీకి మహర్షి కూడా శ్రీరాముణ్ణి షోడశగుణశోభితుణ్ణిగా తీర్చిదిద్దాడు తన రామ చరితలో...తమ రామాయణ కావ్యసృష్టిలో సందర్భోచితంగా పలు పాత్రల్ని ప్రవేశపెట్టి ధార్మిక నేపధ్యంలో కర్మ - భక్తి - జ్ఞానాలను సమ్మిళితం చేసి తద్ద్వారా సమున్నతమైన నైతిక ప్రమాణాలను,మానవజన్మను సార్ధకం చేసే మహోత్కృష్టమైన మానవ విలువలను పుష్కలంగా పండించి రామచరితను పరిపుష్టం చేసాడు. కొందరు తత్వశాస్త్రమంటారు...మరికొందరు మంత్రశాస్త్రమంటారు..ఇంకొందరు పారాయణ గ్రంధమంటారు..ఇలా ఎందరెన్ని విధాలుగా అనుకొన్నా - అది మాత్రం మానవాళి పరిపూర్ణ జీవన వికాసానికి దోహదపడే అత్యద్భుతమైన ధర్మనిధి. అందుకే రామచరితం అందరికీ శిరోధార్యం ; చిరస్మరణీయం!...
                                                           visalakshi......