Saturday, September 24, 2016 By: visalakshi

సుమధుర వాణి

 ఓం శ్రీ పరమేశ్వరాయ నమో నమ:     


ఓం జిహ్వయా అగ్రే మధు,

మే జిహ్వామూలే మధూలకం!

మమేదహ క్రతావసో

మమ చిత్తముపాయసి!!

మన నాలుక -వాణి మధురంగా ఉండాలి. మొదటి నుండి చివరి వరకు తేనె ధారలు ప్రవహించే విధంగా ఉండాలని వేద మంత్రం బోధిస్తోంది.మన మాటలలో ఎంత మాధుర్యం ఉందో అదే మధురమైన ఆత్మీయభావన మనం చేసే ప్రతి పనిలోనూ ఉండాలి. మనం చేసే అలోచనలు కూడా ఇతరులకు శ్రేయస్సును కలిగించే విధంగా మధురంగా, తియ్యగా, సరళంగా ఉండాలి.... .కానీ  ఆచరణలో పెట్టే సమయంలో బహుశా ఆవేశం వల్ల సరళభాషణ ఒకింత ఖటినం అవుతుంటుంది.. విశ్లేషించుకొనేంతలో మిత్రత్వంలో అపోహలు.....అంతర్ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.



..అందుకే మనస్సును, వాణిని అధీనంలో ఉంచుకొని ఉత్తమ ఆలోచనలతో, ప్రేమపూర్వక వాక్కులతో, సద్భావనతో జీవించాలని విజ్ఞులు మనకు బోధించారు. సఖ్యతతో ఉండే సన్నిహిత స్నేహం..మనసెరిగిన బంధం..భాషణలో అంతరార్ధం గ్రహించి, ఇలా కాదు  ఇలా ఉండాలి అని ప్రేమగా ఉపదేశించి తెలిపే సఖ్యతే స్నేహం.    వాణి మధురంగా, కోమలంగా, ప్రియంగా ఉండాలి..నిజమే! కానీ పరమాత్మ ప్రసాదితమైన వాణిని వ్యక్తిత్వ పరంగా గౌరవ ప్రదమైన సంభాషణలతో స్నేహ సూత్రంగా భగవద్దత్తమైన దివ్య వరంగా భావించాలి   ... అసంబద్ధంగా మాట్లాడుతుంటే నిందిస్తారు...ఆచి తూచి మాట్లాడాలంటారు..అసత్యం మాట్లాడడం అసురుల స్వభావమని అంటారు...కావున ఇలాంటి అసత్యం, అసంబద్ధం మాటల వలన ఆత్మ మనస్సు దూషితమవుతాయి. విశ్వాసం ఉండదు. స్నేహమయ జీవనం కోల్పోతాము.  అందుకే వేదమంత్రం వాణిని శోధించి మాట్లాడమంటుంది.





శ్లో" అహింసయైవ భూతానాంకార్యం
శ్రేయో అనుశాసనం ! వాక్ చైవ మధురా
శ్లక్షౌ ప్రయోజ్యా ధర్మ మిచ్చతా !!....మనుస్మృతి..

 మానవుడు విద్య నభ్యసించి ధర్మాత్ముడై విరోధంలేకుండా జీవుల కళ్యాణం కొరకు ఉపదేశించాలి. ఉపదేశంలో వాణి మధురంగా, కోమలంగా, ప్రియంగా ఉండాలి. తన సత్యోపదేశంతో ,ప్రేమమయ వాక్కులతో ధర్మాన్ని పెంచి  సత్సాంగత్య వాతావరణాన్ని పవిత్రభావంతో వృద్ధిచేయాలి. 





 శ్లో" యన్మనసా ధ్యాయతి తద్వాచా వదతి !
    యద్వాచా వదతి తత్కర్మణా కరోతి ! 
    యత్కర్మణా కరోతి తదపి సంపద్యతే !!

 ఏదైతే మనం మనస్సుద్వారా ఆలోచన (ధ్యానం ) చేస్తున్నామో, అదే వాక్కు ద్వారా వచించాలి. ఏదైతే వాక్కు ద్వారా వచిస్తున్నామో, అదే కర్మ-పని ద్వారా చేయాలి. ఏదైతే కర్మ ద్వారా చేస్తున్నామో ఆ సత్ కర్మ ఫలాలను సత్యదృష్టితో దర్శించి సర్వజనుల సౌఖ్యాన్ని ఆకాంక్షించాలి. 




 మాధుర్యభరితమైన వాణితో ఇతరుల దు:ఖాలను, ఆపదలను తొలగించవచ్చు.వారికి మనశ్శాంతిని, ప్రసన్నతను కలిగించవచ్చు.ఇతరుల క్రోధాన్ని తొలగించవచ్చు.అంతేకాక...పవిత్రమైన వేదవాణిని గూర్చి నారదునకు సనత్ కుమారుని ఉపదేశము...

 ఋగ్వేదాది చతుర్వేద విద్యలన్నీ వాణిద్వారానే తెలుస్తాయి. పృధ్వి,అంతరిక్షం,ద్యులోకాల జ్ఞానానికి వాణే ఆధారం. వాయువు, ఆకాశం, జలం,తేజస్సు,మనుష్యులు, పశువులు, పక్షులు, తృణములు, వనస్పతులు, జంతువులు, క్రిమి,కీటపతంగాదులన్నీ వాక్కు మూలంగానే తెలియబడతాయి. ధర్మాధర్మములు, సత్యాసత్యములు, సాధువులు, మహాత్ములు, అనే వీని జ్ఞానం కూడా వాక్కు వలననే కలుగుతుంది. వాక్కు లేకుంటే శబ్దజ్ఞానం కలుగదు. మంచి చెడులు తెలియవు. వాక్కు ద్వారా జ్ఞానం ఇతరులకు అందుతుంది. వాక్కును బ్రహ్మగానెంచి ఉపాసించువారు వాక్కుకు సంబంధించినంత వరకు స్వేచ్చగా చరించగలడు. అని సనత్ కుమారుడు నారదునకు ఉపదేశించాడు.

ఈ ఉపదేశం ద్వారా సుమధురమైన వాణి గొప్ప మహిమాన్వితమైనదని భగవంతుడు మనకిచ్చిన దివ్య వరంగా బావించి పూర్ణ ఫలాన్ని పొందుదాం....     







1 comments:

భారతి said...

మధురవాణి గురించి మధురాతి మధురంగా మనోహరంగా చెప్పావు వేద. 'ప్రియవచన వాదీ ప్రియోభవతి' అన్నట్లుగా, నీ ప్రియమైన మృదుభాషణమే నిన్ను "ప్రియమైన ఆత్మీయురాలి"గా అందరి మనస్సులను రంజింపజేస్తూ, ఆత్మానుబంధంగా పెనవేస్తుంది.