Sunday, June 18, 2023 3 comments By: visalakshi

నాన్నకో ఉత్తరం.....మణిగాడి లేఖ...

 నాన్నకో ఉత్తరం...

మీకంటూ ఒక రోజుని కేటాయించి ఆరోజు మీకు శుభాకాంక్షలు చెప్పాలని తహ తహలాడే ఎంతో మంది అమ్మాయిలని అబ్బాయిలని చూస్తూ,  ఆశ్చర్యపోతూ , ఈరోజు ప్రత్యేకంగానో, ప్రత్యక్షంగానో,పరోక్షంగానో అందరిచేత అందరి నాన్నలు శుభాకాంక్షలు అందుకొంటుంటే, మరి నేనెలా అందజేయను నా శుభాకాంక్షలు మీకు? "నేను మీదగ్గరికి వచ్చేయనా నాన్నగారు "? అని అడుగుదామనిపిస్తొంది , మరి నేను వచ్చేస్తే ..మీ మనవడు, మనవరాలు ఎలా?


 " ఉత్తరం అంటే ఎదుటి మనిషి మనముందే ఉండి మనతో మాట్లాడుతున్నట్లు ఉండాలి! ఏ నది వడ్డునో కూర్చుని, వెచ్చటి టీ తాగుతూ, గుప్పున సిగరెట్ పొగ, చేతిలో చెలి ఉత్తరం, పక్కన నెచ్చెలి అలా అలలా తీయగా మాట్లాడ్తున్నట్లుగా ఉండే భావన ఎంతో బాగుంటుందిట. చలంగారు ప్రేమలేఖలు చెప్తాయి.


మేము ఉత్తరాలు రాసే అవసరం లేకుండా ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాలు తెలుసుకొనే అవకాశం మా చేతిలో ఉండేట్టుగా అరచేతిలోనే ప్రపంచాన్ని చూపించేస్తొంది ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం.


మరిలా ఈ సెల్ ఫోన్లలో మాట్లాడుకొంటూ, కంప్యూటర్‍లో శుభాకాంక్షలు అందుకోంటూ అందరూ అధునిక సాంకేతికపరిజ్ఞానం ఆసరాగా అందరికి దగ్గర్లో ఉంటున్నట్టుగా భావించి, అంత ఆనందంగా పరస్పర శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తుంటే నువ్వేంటి పాతకాలంలా ఉత్తరం వ్రాస్తున్నాననుకొంటున్నారా నాన్నగారు? " ఏం చేయను? వెళ్తూ వెళ్తూ కనీసం ఒక్కమాట చెప్పారా నాకు, నేను "వెళ్తున్నానమ్మా" అని, (అయినా నా పిచ్చి కాని , మీరు వెళ్ళేప్పటికి ఈ email కాని, ఈ సెల్ ఫోన్లు కాని ఉన్నాయా నాన్నగారు, నంబరు అడగడానికి  గాని, మెయిల్ అడ్రస్ అడగడానికి గాని) "నాన్నగారు స్కూలుకి వెళ్తున్నాను" అంటే "తప్పమ్మా వెళ్ళొస్తాను అనాలి, ఒక్క హాస్పిటల్ లో ఇలా అనకూడదు" అని చెప్పిన మీరు ఎక్కడ నేను "నాన్నగారు వెళ్ళొస్తాను అనండి" అని సతాయిస్తాననే కదూ మాటవరసకన్నా నాకు "వెళ్తున్నాను " అని చెప్పలేదు.


 అవును నాన్నగారు! ఒక్క విషయం ఎన్నాళ్ళుగానో అడగాలని అనుకొంటూ ఎప్పటికప్పుడు దాటేస్తున్నాను. ఆరోజు మీకు గుర్తుందా? అమ్మా , తమ్ముడు వరలక్ష్మి వ్రతం అని ఊరెళ్ళారు. చిన్నదాన్ని నాదగ్గిర ఉంచమని మీరు అమ్మదగ్గిర మంకు పట్టు పట్టారు, ఎందుకని ?  "ఆడపిల్లలు ఇద్దరూ ఉండాలి ఇంటి మహాలక్ష్ములు, వరలక్ష్మీ  వ్రతానికి వాళ్ళిద్దరూ ఉండాలి అన్నా కాని, వద్దంటే , వద్దని వాదన చేసి నెగ్గారు. ఎందుకు నాన్నగారు, మీరు అంత బతిమాలి నన్ను మీదగ్గిర అట్టేపెట్టుకొని, జాగ్రత్తగా చూసుకొంటానని మాట తప్పారు కదూ.. చూసుకోలేకపోయానని, అమ్మకి చెప్పెస్తే సరిపోయేది కదా, దానికి మీరలా వెళ్ళిపోవడమెందుకు? .


నాకింకా గుర్తుంది నాన్నగారు! తెల్లవారుఝామునే నన్ను లేపి తలంటు పోసి, నీకేమి తెచ్చానో చెప్పుకో చూద్దాం అని కళ్ళు మూసి , నాతో దోబూచులాడి మరీ చూపించిన ఆకుపచ్చ గళ్ళ పట్టులంగా కళ్ళల్లో నిన్నో మొన్నో కొని తెచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అదివేసి, జడలు వేయడానికి విఫల ప్రయత్నం చేసి, " నాకు రాదురా అత్తయ్య చేత వేయించుకో " అని అన్నప్పుడు, పరిగెత్తుకొని వెళ్ళి అదేదో హక్కులా "అత్తయ్యా మా నాన్నగారు జడ వెయ్యమంటున్నారు " అంటే , "పండగ పనిలో ఉన్నానిప్పుడు, నా దగ్గిరకి పంపడమేమిటే?" అని విసుక్కొంటూ అత్తయ్య జడ వేస్తే , "ఇదిగోండి, పాపని విసుక్కొవద్దు, పసిపిల్ల దానికేమి తెలీదు " అని నన్ను తీసుకొచ్చుకొన్నారు కదూ.. నిన్న మొన్న జరిగినట్లుండే ఏ విషయాన్ని మనసుపొరల్లోంచి బయటికి పంపలేక పోతున్నాను. మరి పక్కింటావిడ విసుక్కొంది అని, అలా చెప్పి నన్ను తీసుకెళ్ళిన మీరు ఆరోజు సాయంత్రమే ఎందుకు వెళ్ళిపోయారు? "మావయ్యా వాళ్ళింటికి వెళ్తున్నాను" అన్నారు. ఆ తరువాత ఈరోజు వరకూ ఎంత మంది మీరు లేరని అలుసుగా తీసుకొని నన్ను విసుక్కొన్నారో మీకు తెలుసా? మీరు చెంతనుంటే ఎవరన్నా ఎమన్నా అనేవారా? ఎందుకొదిలేసారలా?


 మొన్నే అనుకోకుండా ఎవరో ఒక sms పంపించారు. అది చదువుతుంటే అసలు తప్పు మాది కూడా ఉందనిపిస్తొంది నాన్నా!.


ఒక చిన్న పాప, వాళ్ళ నాన్న అలా నడుస్తూ ఉంటే.... ఒక చిన్న పిల్ల కాలువ దాటాల్సివచ్చిందిట. అప్పుడు వాళ్ళ నాన్న అన్నారుట:


 "చిన్నారి! నన్ను జాగ్రత్తగా పట్టుకోమ్మా! గబుక్కున ఎక్కడన్నా కాలువలో జారిపడ్తావేమో! జాగ్రత్త" అని చెప్తే ....ఆ చిన్నారి అందిట


 "నాన్నా! నేను నీ వేలు పట్టుకొంటే భయానికి గబుక్కున జార విడిచేస్తానేమో, నువ్వే నా వేలు పట్టుకో.. నేనెక్కడపడిపోతానో అని వడిసి పట్టుకొంటావు, అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటావు, నేను సేఫ్" అని అందిట.


ఆ చిన్నారి తెలివితేటలు నిజానికి నా(మా)కు లేవేమో కదా నాన్నగారు, మేము మీవేలు వదిలేసాము. మీకు కోపమొచ్చింది కదూ.. "తెలియక చేసిన తప్పు నాన్నగారు ! మా వేలు పట్టుకోండి నాన్నగారు" అని చెప్పాడానికి అందనంత దూరానికి వెళ్ళిపోయారు. ఉండిలేక ఉన్నది మీరే, ఉన్నా కూడా లేనిది నేనే. మిమ్మల్ని మా వేలు పట్టుకోనీయకుండా , నేనే మీ వేలు పట్టుకొని నడుద్దామన్న స్వార్థం మమ్మల్ని ఇలా శిక్షించింది. అయినా... ఈరోజు ప్రత్యేకమంటూ అందరూ శుభాకాంక్షలు చెప్తుంటే, నేను మటుకు మౌనం వహించడమెందుకని, ఇంకో ఇన్ని జన్మలకి మీకే కూతురిగా పుట్టాలని, అప్పుడు ఆ భగవంతుడిని మిమ్మల్ని పూర్ణాయుష్కుడిని చేయాలని, మీరే మావేలు పట్టుకొని నడిపించాలని మనస్పూర్తిగా కోరుకొంటూ........


ఇక్కడ లేని నాన్నగారికి! ఇక్కడే ఉన్న నా శుభాకాంక్షలు. 


ఎప్పటికీ మీ కూతురే అయిన మణిగాడు


*******

మా చెల్లి రాసిన ఈ లేఖ నా మనసును కదిలించింది.. అందుకే ఇలా బ్లాగులో...నాన్న గారికి నా నమస్సులు..🙏🙏🙏...Friday, February 3, 2023 0 comments By: visalakshi

అద్వైతం - విశిష్టాద్వైతం

ఓం శ్రీ గురుభ్యో నమః

                                   🙏🙏🙏...అద్వైతం - విశిష్టాద్వైతం / జగత్ గురువులు జగతికి వెలుగులు.


శ్రీ శంకరాచార్యులు - అద్వైతం - సర్వ భౌతిక ప్రపంచానికి బ్రహ్మమే ఆధారం.


శ్రీ రామానుజాచార్యులు - విశిష్టాద్వైతం


 సర్వ భౌతిక ప్రపంచంతో బ్రహ్మం అంతర్లీనమై అంతా ఒక్కటే.


     

 జగత్తులో అనేక రకాల ఆధ్యాత్మిక సాధనాలున్నాయి. ఇందులో ఏది ఎవరికి తగినదనే దాన్ని సాధకుని యోగ్యత, అవగాహన స్థాయిని బట్టి నిర్ణయించి, అది వారికి ఉపదేశించేది గురువే. గురువు అంటే అజ్ఞానాన్ని దూరం చేసేవాడని అర్థం. ‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే ప్రకాశం. గురువు అంటే చీకటిని తొలగించి వెలుగుతో ప్రకాశింపచేసేవాడు అని అర్థం. జ్ఞాన మార్గ దర్శకుడైన గురువు స్థానం పరమ పవిత్రమైనది. జ్ఞానాన్ని ఆర్జించడం కన్నా సద్గురువు చరణారవిందాలను సేవించడం, అనుగ్రహాన్ని పొందడం ఉత్తమమైనది.


వేదాంతులందరూ జరిపే తత్వవిచారం జీవాత్మ, పరమాత్మల అంతర్లీనత ప్రాతిపదికన జరుగుతుంది. అవి వేరుకాదన్న ఏకాభిప్రాయమే వారందరిలో కనపడుతుంది. ప్రామాణికాలైన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత- అద్వైతం చెప్పేదంతా పొందుపరచి బ్రహ్మజిజ్ఞాసులకు అందుబాటులో ఉంచాయి. వేదాంతులైన మహాగురువులు ఆదిశంకరుడు, రామానుజుడు ఇద్దరూ జీవాత్మపరమాత్మల సంలీనమే అద్వైతానికి మూల సూత్రంగా అంగీకరిస్తారు. ఆ రెండింటి స్వరూపం మీద, ఆ సంయోగం జరిగేది ఎలాగో, అందుకు వారిచ్చే వివరణలు మాత్రం భిన్నమైనవిగా ఉన్నట్లు అనిపిస్తాయి.


జీవాత్మ పరమాత్మలు వేరుకాదని చెప్పే తిరుగులేని అద్వైతం శంకరుడిది. ‘లోకమాయ’, ‘కర్మసిద్ధాంతం’ కేంద్ర బిందువులుగా ఆయన అద్వైత వాదనలుంటాయి. జీవుడు, దేవుడు ఒకరేనన్న నిజాన్ని మాయా ప్రభావంతో మనిషి గుర్తించలేడంటారు శంకరులు. చీకటిలో చూసిన తాడును పాము అనుకుని, వెలుతురు రాగానే అది పాము కాదు తాడు అని తెలుసుకున్నట్లే- లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు అనిపింపజేసే ‘సర్పరజ్జుభ్రాంతి’లాంటి అటువంటి మాయను అధిగమించలేనంత కాలం ‘అవిద్య’తో ఉండిపోతాడని చెబుతారు. జీవితకాలమంతా అతణ్ని వెంటాడుతూ వేధించే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు అది మూలరూపమంటారు. ఆత్మశక్తికి తప్ప అవి లొంగుబాటులోకి రావని తెలుసుకొమ్మంటారు. కార్యం లేకుండా ఫలితం ఉండదని, ఫలితం ఉండబట్టే అందుకొక కారణం ఉండితీరాలని ఆయన విశ్వసిస్తారు. వర్తమానంలో మనిషికి ఎదురయ్యే పర్యవసానాలన్నీ కార్యకారణాలతో ముడివడిఉన్నవేనని చెప్పే కర్మసిద్ధాంతం, ఆయన అద్వైతవాదనలన్నింటిలో కీలకమై కనిపిస్తుంది.


శంకరులు- నిద్రాణమై తనలోనే ఉన్న ఆత్మను జ్ఞానభక్తి సాధనలతో జాగృతం చేయమంటారు. అప్పుడే అది బ్రహ్మంతో పునరేకీకరణ పొందగలదంటారు. జ్ఞానానికి, భక్తికి సమగ్రమైన వివరణలుండే సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి వంటి రచనలు శంకరులవే. అహంకారభావనలు తొలగిపోవటమే జ్ఞానమని చెప్పే సారాంశమే ఆ రచనలన్నీ ప్రస్ఫుటిస్తాయి.


రామానుజులు వైదిక పరమైన దైవత్వాన్ని గురించి చెప్పే అద్వైతాన్ని ఆమోదిస్తారు. వేదోక్తమైన ఆస్తికత్వాన్ని సమర్థించేదాన్ని ‘విశిష్టాద్వైతం’ అన్నారు. దేహం, ఆత్మ రెండూ దైవ స్వరూపాలే అంటారాయన. శంకరులు చేసినట్లు- సగుణ నిర్గుణ బ్రహ్మలుగా, బ్రహ్మాన్ని వేరుచేసేందుకు అంగీకరించరు. అద్వైతానికి మౌలిక సూత్రమైన జీవాత్మపరమాత్మల సంవిలీనాన్ని మాత్రం వ్యతిరేకించరు. జీవుడు, పరమాత్ముడు ఒకరేనన్న ప్రగాఢ విశ్వాసంతో జీవుణ్ని పరమాత్ముడిని వెదకమంటారు. కర్మరాహిత్యం అయినప్పుడే జీవుడికి ‘శుద్ద సత్వస్వరూపం’ లభిస్తుందని, ‘బ్రహ్మశరీరం’ అంటే అదేనని, ఆ శరీరంతోనే అతడు అంతర్యామిలో విలీనం కాగలడన్నారు. ‘వైకుంఠపాప్త్రి’ అదేనంటారు.


సామాజిక స్పృహ కనపడని ఆధ్యాత్మికతను విశిష్టాద్వైతం ప్రోత్సహించదు. రామానుజులు-మనుషుల మధ్య సంచారం చేస్తూ, కులం మూఢనమ్మకాలకు అతీతంగా వారిని కొనసాగమంటూ ఉద్బోధించారు. దేవాలయాల్లో ప్రవేశానికి అందరూ అర్హులేనన్నారు. సామూహికంగా ప్రజలు, భగవత్సేవలు నిర్వహించమన్నారు. విశిష్టాద్వైతానికి వివరణలన్నీ ఆయన రచించిన శ్రీభాష్యం, వేదాంత సాగరం, వేదాంత సంగ్రహాల్లో కనపడతాయి.


శంకరుడు అది అద్వైతం అన్నా, రామానుజుడు విశిష్టాద్వైతం అని చెప్పినా, వారిద్దరూ భగవంతుడైన బ్రహ్మాన్ని చేర్చేది అద్వైత మార్గం ఒక్కటేనని తెలిసిన మహాజ్ఞానులు. అది సూత్రీకరించి మనిషికి సులభగ్రాహ్యం చేసిన మహాపురుషులు.


మన సనాతన ధర్మాన్ని కాపాడటానికి జన్మించిన

మహనీయులు,ఈ రోజు మన ధర్మం ఉందంటే

అది వారు ఏర్పరిచిన బాట,క్షేత్రాలు,మార్గదర్శనం తోనే అని మనం తెలుసుకోవాలి.


మన భారతీయ సంప్రదాయంలో ‘గురు’ శబ్దం చాలా మహత్తరమైనది. ఆధ్యాత్మిక వేత్తల్ని గురువులుగా భావించే విలక్షణ సంస్కృతి మనది. 


విశిష్ట దర్శనాలతో ప్రజానీకానికి మార్గదర్శనం చేసిన శంకరాచార్యులు, రామానుజాచార్యులు ఇరువురూ వైశాఖ శుద్ధ పంచమి నాడే జన్మించడం విశేషం.


#శ్రీ ఆది శంకరులనగానే అద్వైతం, శ్రీ రామానుజుడనగానే విశిష్టాద్వైతం గుర్తుకు వస్తాయి.


#శ్రీ ఆది శంకరాచార్యులు


శంకరులు కేరళలోని కాలడి గ్రామంలో జన్మించారు. ఆర్యాంబ, శివగురువులు వీరి తల్లిదండ్రులు. రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే వేదాలను, వేదాంతసారాన్ని అధ్యయనం చేసిన కుశాగ్రబుద్ధి. గోవింద భగవత్పాదుల వద్ద సన్యాస దీక్షను స్వీకరించారు. గురువుల ఆదేశానుసారం కాశీకి వెళ్ళి శిష్యులకు ఉపదేశంచేస్తూ, పండితులతో చర్చలు సాగిస్తూ, వివిధ మతాల్లోని దోషాలను సహేతుకంగా విమర్శించేవారు. మండనమిశ్రుణ్ని, అతడి భార్య ఉభయ భారతిని శాస్త్ర చర్చల్లో ఓడించి, సత్యనిష్ఠతో జ్ఞానమార్గ వైశిష్ట్యాన్ని గుర్తింపజేశారు. సన్యాసం ఒక మానసిక పరిపక్వ స్థితి. మనుషుల మధ్య ఉంటూనే మమతానుబంధాలను అధిగమించి మానవతా ధర్మాన్ని ప్రచారం చెయ్యాలని శంకర సందేశం.


శంకరులు బోధించిన తత్వం అద్వైతం. అది ఈ దేశపు అఖండత్వాన్ని కాపాడటానికి అక్షయమైన సిద్ధాంతం. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ వంటి శ్రుతి వాక్యాలు అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదికలు. నాలుగు వేదాల నుంచి ఈ నాలుగు వాక్యాలు గ్రహించి బ్రహ్మ స్వరూపాన్ని వివరించడంలో వాటిని సమన్వయించారు. శంకరాచార్యులు జ్ఞానమార్గానికి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చారు.

          


 అద్వైతం అంటే రెండు కానిది. అంటే జీవుడికి, దేవుడికి భేదం లేదని చెప్పే మతమన్నమాట. ఈ సిద్ధాంతానికి రూపకర్త జగద్గురు శ్రీ ఆదిశంకరులు. కేరళలోని కాలడి అనే గ్రామంలో జన్మించిన ఆదిశంకరులు ప్రపంచమంతా జగద్గురువుగా గౌరవించే అత్యున్నతమైన ఆధ్యాత్మికవేత్త, మహాజ్ఞాని, మహాపండితులు. సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి, ప్రస్థాన త్రయభాష్యంతో బాటు ఈనాడు మనం స్తుతించుకునే అనేక స్తోత్రగంథాలు, ప్రకరణ గ్రంథాలు, కనకధారాస్తోత్రం, భజగోవింద శ్లోకాలు ఆయన రచించినవే. రవాణా సదుపాయాలు లేని రోజుల్లోనే ప్రపంచమంతా కాలినడకన పర్యటించి అన్ని మతాలను, విశ్వాసాలను ఒక తాటిపైకి తెచ్చిన ఈ జగద్గురువు భారతదేశంలో నాలుగు పీఠాలను స్థాపించారు.


 బదరీనాథ్, పూరి, శృంగేరి, ద్వారకలలో వీరు స్థాపించిన ఈ పీఠాలకు బాధ్యతలు చేపట్టిన వారు కూడా వీరి నామంతోనే జగద్గురువులుగా ప్రఖ్యాతి చెందుతుండటం విశేషం. వీరి లెక్క ప్రకారం దేహమే దేవాలయం. దేహంలో ఉండే జీవుడే దేవుడు. భౌతికమైన దేహం నశించినా, ఆ దేహంలో ఉండే జీవుడు మాత్రం స్థిరంగా ఉంటాడని అద్వైతుల నమ్మకం. నిశ్చలమైన బుద్ధితో ‘అహం బ్రహ్మాస్మి’ అంటే నే నే బ్రహ్మను అని తెలుసుకునేవాడు  జీవన్ముక్తుడు అవుతాడని అద్వైతులంటారు.

               ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు అనే ప్రస్థానత్రయానికి భాష్యం రాశారు. వివేక చూడామణి, శివానందలహరి, సౌందర్య లహరి, భజగోవిందం, కనకధారాస్తవం వంటి గ్రంథాల్లో వారి పాండిత్యం వెల్లడవుతుంది. సర్వజనామోదంగా ఉండేలా శివ, విష్ణు, గణపతి, సూర్య, శక్తి రూపాలతో కూడిన పంచాయతన పూజా విధానాలను ప్రవేశపెట్టారు. శంకరులు జాతీయ సమైక్యతా సూత్రాన్ని పరిరక్షించడానికి ధార్మిక జాగృతిని కలిగిస్తూ బదరి, ద్వారక, పూరి, శృంగేరిలలో నాలుగు పీఠాలు స్థాపించారు.


                                  °°°°°°°°°°°°

🙏🙏🙏...


#శ్రీరామానుజాచార్యులు


రామానుజులు తమిళనాడులో శ్రీపెరంబుదూరులో జన్మించారు. తల్లిదండ్రులు కాంతిమతి, కేశవాచార్యులు. యామునాచార్యుల వద్ద వైష్ణవ దీక్షను పొందారు. తిరుకోష్ఠియారు ‘ద్వయ’ మంత్ర రహస్యాన్ని వివరించి గోప్యంగా ఉంచమని కోరితే మోక్షం ఏ కొద్దిమందికో పరిమితం కాకూడదని తలచిన రామానుజులు ఆలయ గోపురం అధిరోహించి అక్కడ గుమిగూడిన జనులందరికీ మంత్రాన్ని బోధించారు.


పరమాత్మ ఒక్కడే. ఆయన విశిష్ట గుణసంపన్నుడు. ఆ విశేషణాలు, తత్వాలకు గల లక్షణాల్ని, వాటి మధ్య పరస్పర సంబంధాన్ని అవగాహన చేసుకునేందుకు తోడ్పడేదే జ్ఞానమని విశిష్టాద్వైతం చెబుతుంది. సూక్ష్మరూపంలో ఉండే అనేక జీవాత్మలు స్థూల రూపుడైన పరమాత్మలో అంశగా ఉంటూ పరమాత్మతో భేదాన్ని కలిగి ఉంటాయని, ఇదే విశిష్టాద్వైతమని పేర్కొన్నారు రామానుజులు. రామానుజులు సంస్కర్త. నాటి సమాజంలోని వివిధ వర్ణాలవారికి వైష్ణవంలో స్థానం కల్పించారు. భక్తిని ఉద్యమస్థాయిలో ప్రచారం చేశారు.


రామానుజులు వేదాంత సారం, వేదాంత సంగ్రహం, వేదాంత దీపం అనే గ్రంథాలు రచించారు. బ్రహ్మ సూత్రాలు, భగవద్గీతకు భాష్యం వెల్లడించారు. ఆయన కేవలం వేదాంతి కాదు. సమత, మమతలను నిత్య జీవితంలో ఆచరించిన పుణ్య యోగి. అనేక ప్రత్యేక సేవలను భగవదారాధనలో భాగంగా చేసి, విలక్షణ పూజా విధానాన్ని వ్యాప్తి చేశారు.


 బ్రహ్మానికి, ప్రకృతికి భేదం లేదని బోధించే విశిష్టాద్వైత మత స్థాపకులు రామానుజాచార్యులు. ఈ మతాన్ని అనుసరించేవారు విశిష్టాద్వైతులుగా ప్రసిద్ధి. జగత్తు సత్యం, జీవుడు సత్యం, దేవుడు సత్యం అన్నది వీరి విశ్వాసం. దేహంలోని భాగాల వలె జీవుడు కూడా దేవునితో చేరి ఉంటారని, దేహం నశించిన తరువాత జీవుడు మరో దేహంలో ప్రవేశిస్తాడు లేదా ప్రకృతిలో లీనమైపోతారని వీరి నమ్మకం.


విశిష్టాద్వైతమతాచార్యులైన భగవద్రామానుజులు నేటి చెన్నైకు చేరువలోని శ్రీపెరంబుదూరులో జన్మించారు. కాంచీపురం లోని తిరుక్కచినంబికి శిష్యులైన రామానుజులు శ్రీరంగంలో గొప్ప పండితుడు, వైష్ణవ మత ప్రవక్త అయిన యామునాచార్యులవారి వారసుడిగా నిలిచారు.


 బ్రహ్మసూత్రభాష్యానికి విశిష్టాద్వైత దృష్టితో శ్రీ భాష్యం వ్యాఖ్యను రచించారు. మొట్టమొదటి మత సంస్కర్తగా నిలిచిన రామానుజులవారు వేదాంత సంగ్రహం, గద్యత్రయం వంటి విశిష్టమైన గ్రంథాలను రచించారు. ఉత్తరభారతమంతా విస్తృతంగా పర్యటించిన ఆయన దేశం నలుమూలలా నాలుగు శ్రీైవైష్ణవ మఠాలను నెలకొల్పారు. జాతి, మత భేదాలను పాటించకుండా భక్తి భావంతో భగవంతుని సందర్శించాలనుకున్న ప్రతి ఒక్కరికి ఆలయ ప్రవేశం కల్పించేలా చేశారు. తిరుమలతో సహా అనేక దేవాలయాలలో నిర్దిష్టమైన పూజావిధానాలను, సంప్రదాయాలను ఏర్పరిచారు.

                     

తత్వాలు భిన్నంగా గోచరించినా గమ్యం ఒక్కటే. పుణ్య శ్లోకులు సదా స్మరణీయులే.....,,🙏🙏🙏.....

సంగ్రహించిన వ్యాసం...Thursday, February 2, 2023 1 comments By: visalakshi

సీతోపనిషత్

  ఓం నమో శ్రీ నారాయణాయ నమః
  శ్లో"  ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి త్రయం యద్భావ సాధనం!

     తద్బ్రహ్మసత్తా సామాన్యం సీతాతత్వ ముపాస్మహే !!


మం!!  ఓం దేవాహవై ప్రజాపతి మబ్రువన్, కా సీతా కిం

      రూపమితి, సహోవాచ, ప్రజాపతిః సా సీతా ఇతి (1)

ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులనే మూడు శక్తులూ ఎలాంటి దివ్యభావాన్ని సాధించడానికి ఉపయోగపడతాయో , అలాంటి బ్రహ్మసత్తాతో సమానమైన సీతాదేవి తత్వాన్నిఉపాసిస్తున్నాను. 

పూర్వం ఒకనాడు దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్లి పితామహా! సీత అంటే ఎవరు? ఆమె ఎలాంటి రూపం కలిగి ఉంటుంది ?అని ప్రశ్నించారు.

బ్రహ్మదేవుడు వారికిలా సమాధానం చెప్పాడు. "సీతాదేవి మూలప్రకృతి స్వరూపిణి అందుకే ఆమె ప్రకృతి అని పిలవబడుతోంది.'సీతా' అనే పదంలో మొత్తం మూడు అక్షరాలు ఉన్నాయి. ఆమె సాక్షాత్తు మాయా స్వరూపిణి. విష్ణువు ప్రపంచ బీజం. 'ఈ'కారం మాయా, 'స'కారం సత్యం అమృతం, ప్రాప్తం, చంద్రుడు, 'త'కారం లక్ష్మీ బీజం.  శ్రీంకారం,వైరాజం , సోమ , అమృతావయవాలు కలిగిన దేవి  'ఈ'కార రూపిణి అవుతోంది. ఆ దేవి ఆభరణాలతో ముత్యాలతో అలంకరించబడివుంది. ఆది మహామాయ శబ్ద బ్రహ్మరూపం. అందుకే స్వాధ్యాయం సమయంలో ప్రసన్నురాలౌతుంది. సమున్నతమైన భావాల్ని ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ మాయ పృధ్వీభాగంలో హలం (నాగలి)చివర సీతగా జన్మించింది.'ఈ'కార స్వరూపిణి అనే ఆమె ఆ దేవికి చెందిన మూడో మాయ. అది అవ్యక్త రూపంలో ఉంటుంది. శౌనకీయమైన శౌనకీ తంత్రంలో సీతాదేవి ఈవిధంగా వర్ణించబడివుంది. ఆమె శ్రీరాముడు సన్నిధిలో జగదానంద కారిణిగా ఉన్నది. సృష్టి , స్థితి, లయకారిణి కూడా ఆ సీతాదేవే.ఆ సీతమ్మ వ్యక్తంగా ఉన్న అన్ని జీవుల శరీరాలలో మూలప్రకృతి స్వరూపిణిగా జ్ఞేయరూపంలో ఉంటుంది. ఆమె ప్రణవ స్వరూపిణి కనుక ప్రకృతి అని వ్యవహరిస్తారు. ఆమెనే బ్రహ్మవాదినీ అని కూడా అంటారు. ఆ దేవి  "అధాతో బ్రహ్మజిజ్ఞాసా" స్వరూపిణి , సర్వవేదమయి , సర్వకీర్తిమయి , సర్వధర్మమయి , సర్వలోకమయి , సర్వాధార కార్యకారణమయి , మహాలక్ష్మీ తదితర దేవేశుల భిన్నాభిన్న రూపమయి , చేతనా చేతనాత్మక , బ్రహ్మ స్థావరాత్మక , గుణ ,కర్మ ,విభాగ భేదంలోదేహ స్వరూపిణి, ఆమె. దేవ ,ఋషి ,మనుష్య ,గంధర్వ స్వరూపిణి, అలాగే అసుర ,రాక్షస, భూత ,ప్రేత ,పిశాచ , దేహాలు ధరించినది.పంచభూత ,ఇంద్రియ ,మనః ప్రాణ స్వరూపిణి కూడా ఆమేనని తెలుస్తోంది. ఆ సీతాదేవి 1.ఇచ్ఛాశక్తి 2.క్రియాశక్తి 3.సాక్షాత్ శక్తి అనే నామాలతో మూడు రూపాల్లో శక్తి స్వరూపిణిగా ఉన్నది. ఆమే శ్రీ, భూ , నీలా , భద్రరూపిణీ ,ప్రభావరూపిణీ ,సోమసూర్యాగ్ని రూపిణీ అవుతున్నది. ఆ జనని సోమరూపిణిగా ఓషధుల్ని పుట్టిస్తోంది.కల్పవృక్షం, పుష్ప ,ఫల‌ ,లతా, గుల్మాత్ములైన ఔషధ భేషజాత్మికా ఉంది.అమృతం రూపంలో దేవతలకి మహస్తోమరసఫలాన్నిస్తోంది. అలా దేవతలకు అమృత రూపంలో, మానవులకు అన్నం రూపంలో , పశువులకి గడ్డి రూపంలో ఇలా సకల జీవులకీ ఎన్నో విధాలుగా ఆహారాన్ని అందిస్తోంది. ఆ సీతాశక్తి సూర్యాదులతో సకల లోకాల్నీ ప్రకాశింపజేస్తోంది. రాత్రి -పగలు రూపంతో , కాలస్వరూపిణిగా కల , విమేషం నుంచి ఘడియ,8జాములు ,దినం ,వారం ,పక్షం ,ఋతుఆయన ,సంవత్సర భేదాలతో మనుషులకి (వందసంవత్సరాలు ) కల్పనతో ప్రకాశిస్తోంది. ఇలా చిర ,క్షిప్ర రూపాలలో నిముషం నుంచి పదార్ధం వరకు ఉన్న ఈ కాలచక్రాన్ని  ఒక చక్రం లాగ త్రిప్పుతూ ,తన కాల విశేషాలతో ప్రకాశిస్తూ, తానే కాల స్వరూపిణి అవుతోంది.

ఆ సీతాదేవి అగ్ని రూపం కలిగింది. ఆమె ఆకలి దప్పికల రూపంలో ప్రాణులలో , ముఖ రూపంలో దేవతలలో , శీతోష్ణ రూపంలో వనౌషధులలో , కాష్ఠం(కర్ర) లోపలా బయటా నిత్యానిత్య రూపంతో ఉఃటుంది. ఆ శ్రీదేవి మొత్తం మూడు రూపాలు ధరించి శ్రీహరి సంకల్పం ప్రకారం లోకాల్ని రక్షిస్తూ ఉంటుంది. కాలానుగుణంగా ఆయా అవతారాలు ధరిస్తుంది. శ్రీ అని లక్ష్మీ అని భూదేవి అని ఆమెని పిలుస్తారు. ఆ తల్లి సప్త సాగరాల్లో నీరుగా , సప్త ద్వీపాలతో కూడిన భూమిగా, భూమి మొదలు14లోకాలకీ ఆధార ఆధేయమైన ఓంకార రూపిణి గా ఉంటుంది. సీతాదేవి అవతారమైన నీళాదేవి విద్యున్మాలినీ రూపంతో సకల ఔషధులకీ ,ప్రాణులకీ  పోషణ నిమిత్తం సర్వ స్వరూపిణి గా ఉంటుంది. అంతేకాక ఈ దేవి సమస్త భువనాలకీ క్రింది భాగంలో  జలాకారాత్మకమైన ఒక మండూకం (కప్ప)రూపంలో భువనాలన్నిటికీ ఆధారంగా ఉంటుంది.


సీతాదేవి క్రియాశక్తి స్వరూపిణి. ముందుగా శ్రీ మహావిష్ణువు ముఖం నుంచి నాదం , ఆ నాదం నుంచి బిందువు, ఆ బిందువు నుంచి ఓంకారం , ఆ ఓంకారానికి చివర వైఖానస పర్వతం ఆవిర్భవించాయి. ఆ పర్వతం నుంచి కర్మజ్ఞానమయమైన ఉపశాఖలు వచ్చాయి. ఆ ప్రదేశం లో త్రయీమయ రూపంలో అనగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం.. సర్వార్ధాలు దర్శనమిస్తాయి. లోకంలో వేదాలు మూడే అని చెప్పినప్పటికీ కార్యసిద్ధికో నాలుగో వేదం ఏర్పడింది. ఆ నాలుగో దాన్నే ఆసంగిరసం అంటారు. ఈ అధర్వాంగి రసవేదం కూడా త్రివేదాత్మకంగానే ఉంటుంది. ఋగ్వేదం21శాఖలతో., యజుర్వేదం 109శాఖలతో సామవేదం 100శాఖలతో ,అధర్వణ వేదం 50శాఖలతో ఉంది. ముందుగా అన్ని దర్శనాలకన్నా వైఖానస దర్శనం ప్రత్యక్ష దర్శనంగా ఉంది. ఆ తరువాత కల్పం ,వ్యాకరణం ,శిక్ష, జ్యోతిష్యం , నిరుక్తం ,ఛందస్సు అనేవి షడాంగాలు (ఇవే వేదాంగాలు).వీటి ఉపాంగాలైన న్యాయ మీమాంస లు ఏర్పడ్డాయి. ధర్మాన్ని తెలుసుకోవడం కోసం వేదవేదాంగాలన్నిటికన్నా అధికంగా  కాలానుగుణంగా ధర్మశాస్త్రాలు ఏర్పడ్డాయి. ధర్మశాస్త్రము అంటే అది మునీశ్వరుల అంతఃకరణ ప్రవృత్తే. బ్రహ్మ చెబుతున్నాడు ..ఇంకా ఇతిహాస పురాణాలు 1. వాస్తు వేదం 2.ధనుర్వేదం 3.గాంధర్వవేదం 4.ఆయుర్వేదం 5.మునివేదం..అనే ఈ అయిదు ఉపవేదాలు ఉన్నాయి. అలాగే దండం ,నీతి, వార్త ,విద్య ,వాయుజయం లాంటి స్వయంప్రకాశాలైన 21రకాల శాస్త్రాలున్నాయి. వైఖానస మహర్షికి పూర్వమే శ్రీ మహావిష్ణువు వాక్కు ప్రభవించింది. అది మూడువేదాల రూపంలో ఆవిర్భవించింది. వైఖానస మహర్షికి ముందు సాంఖ్యశాస్త్రం ఎలా పుట్టిందో అది ఏం చెప్పిందో మీకు బోధిస్తాను శ్రవణం చేయండి. (ఇతిహాస.. పురాణాలని పంచమవేదంగా పండితులు చెబుతారు.)


ఆ క్రియాశక్తి స్వరూపిణి ఉత్తమమైన బ్రహ్మమయ రూపం కలిగింది. సాక్షత్తు బ్రహ్మమైన ఆ శక్తిని స్మరించినంత మాత్రానే ఆమె అనుభవాన్నిస్తుంది. అంతే కాక ఆ దేవి నిగ్రహానుగ్రహ స్వరూపిణి. శాంతి తేజోరూపిణి. ఆమె వ్యక్తావ్యక్తకారణ చరణాది సమగ్ర అవయవ రూపంలో ,భేదాభేద రూపంగా ప్రకాశిస్తుంది. ఆ దేవి భగవంతుడి సహచారిణిగా ఉంటుంది. అనపాయిని అయిన ఆమె అనవతరం సాధకులకి సహాయ ఆశ్రయాల్ని ప్రసాదిస్తుంది. కళ్ళు మూసి తెరిచేంతలోనే సృష్టి ,స్ధితి, సంహార తిరోధాన ,అనుగ్రహాది శక్తుల్నీ ఆమె ప్రదర్శించగలదు.ఇంత సమర్ధులు కలిగిన ఆ దేవి  (సీత) సాక్షాత్తు శక్తిగా ప్రస్తుతించబడుతోంది.

ఇచ్ఛాశక్తి అనేది మూడు విధాలుగా ఉంటుంది. 1.యోగశక్తి 2.భోగశక్తి 3.వీరశక్తి అని.

1.యోగశక్తి - ప్రళయకాలంలో విశ్రాంతి తీసుకుంటున్న భగవంతుడి (శ్రీహరి) వక్షస్ధలంలో శ్రీవత్సాకార రూపంతో విశ్రమిస్తూ ఉంటుంది.

2.భోగశక్తి- భోగరూపంలో కల్పవృక్ష ,కామధేను ,చింతామణి ,శంఖ ,పద్మ నిధుల్ని ,నవనిధుల్ని ఆశ్రయించి ఉంటుంది. భగవంతుణ్ణి కోరికలతోగానీ ,కోరికలు లేకుండా గానీ ఉపాసించేవారిని అనుగ్రహిస్తుంది. అంతేకాదు భక్తులైనవారు అగ్నిహోత్రాలతో, యమ నియమాది అష్టాంగాలతో ,ఆరాధనలతో ,నిత్యపూజా జపహోమాదికాలతో ,పితృపూజలు ,నైవేద్యాలు ,వ్రతాలు, నోములు వంటి వాటితో నిత్యం భగవంతుని ఆరాధిస్తున్నారు.

3.వీరశక్తి - సీతాదేవి వీరశక్తి రూపంలో చతుర్భుజగా ,అభయ ,వరద ,పద్మాలని ,కిరీటాది సకలాభరణాలనీ ధరించి ఉంటుంది. సకల దేవతలతో పరివేష్ఠించబడి ,కల్పవృక్షం నీడలో నాలుగు ఏనుగులు తమ తొండంతో ఉంచిన రత్న ఘటాలలోని అమృత జలాలతో అభిషేకం చేస్తుండగా, దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆమె సమస్త దేవతల చేతా ,బ్రహ్మాదుల చేతా ,కామధేనువు ,వేదశాస్త్రాల చేతా ప్రస్తుతించబడుతూ జయాది అప్సరసలు చేత పరిచర్యలు అందుకుంటూ ఉంటుంది. ఆమె సూర్య చంద్రులనే దీపాలతో ప్రకాశించబడుతుంది. నారద తుంబురులు నిత్యం ఆమె ని తమ గానంతో సంతృప్తి పరుస్తుంటారు. ఆమె రాకా ,సినీవాలీ అనే ఛత్రాల నీడలో అలంకృతమై ఉంటుంది. హ్లాదినీ అనే మాయ ఆమె కి చామరాలు వీస్తూ ఉంటుంది. స్వాహా, స్వధా అనేవారు వ్యజనాలతో ఆమెను పూజిస్తారు. బృగువు లాంటి ఎందరో మహర్షులు ఆమెని నిత్యం అర్చిస్తుంటారు. ఇలా దివ్య సింహాసనం మీద ఆసీనురాలై సకల కార్యకారిణి అయిన ఆ లక్ష్మీదేవి భవనానికి వేరుగా స్థిరంగా ఉన్నది. ఆమె ప్రసన్నమైన నేత్రాలతో సర్వదేవతలతో పూజించబడుతూ వీరలక్ష్మి అనే నామంతో ప్రసిద్ధి చెందింది..

                              ఓం శ్రీ మాత్రే నమో నమః

Friday, September 30, 2022 0 comments By: visalakshi
Thursday, April 14, 2022 0 comments By: visalakshi

ఆప్తగమన....అంతగమన...

 శ్లో" ఊర్ధ్వమూలో 2 వాక్ శాఖ ఏషో 2 శ్వత్థః సనాతనః !

        తదేవ శుక్రం తద్ బ్రహ్మ తదేవామృతముచ్యతే !

 తస్మింల్లోకాః శ్రితాః సర్వే తదు నాత్యేతి కశ్చన !ఏతద్ వై తత్ !!

 

ఈ అశ్వత్థ వృక్షం పురాతనమైనది.పైకి వ్రేళ్ళూనినది. క్రిందికి వ్యాపించిన కొమ్మలు కలది. అదే పావనమైనది. అదే భగవంతుడు. అది అవినాశి. సమస్త లోకాలూ దానియందే ఉన్నాయి. దానిని ఎవరూ అతిక్రమించలేరు.అదే సత్యం.

తలక్రిందులుగా నిలబడి ఉన్న ఒక రావిచెట్టు తో (అశ్వత్థవృక్షం) జీవితం పోల్చబడుతోంది.ఎప్పుడు ఒక వస్తువు తలక్రిందులుగా కనిపిస్తుంది?ప్రతిబింబించి నప్పుడు. ఏటి ఒడ్డున నిలబడ్డ చెట్టు ప్రతిబింబాన్ని నీటిలో చూసినప్పుడు చెట్టు తలక్రిందులుగా నిలబడ్డట్లుగా కనిపిస్తుంది. దాని వ్రేళ్ళభాగం పైన కొమ్మలు క్రింద ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రతిబింబం నిజం కాదు.

ఏటి నీటిలో చెట్టు తలక్రిందులుగా కనిపిస్తుంది. దాన్లోని సత్యాన్ని ఆకళింపు చేసుకోగోరితే ఆ ప్రతిబింబాన్ని వదిలిపెట్టి, ఆ ప్రతిబింబానికి ఆధారమైన చెట్టును చూడాలి. అదే సత్యం. ఆ విధంగానే జీవిత సత్యాన్ని తెలుసుకోగోరితే జీవితానికి ఆధారమైన భగవంతుణ్ణి పొందగోరాలి.జీవిత వృక్షాన్నే భగవంతునిగా చెబుతోంది ఈ మంత్రం.

నీవు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీకు శరీరధ్యాస ఉండదు. అప్పుడు మృత్యుభయముంటుందా..? నీవు పూర్తిగా మేల్కొని, నీ శరీరాన్ని, ప్రపంచాన్నికి చూస్తున్నప్పుడే ఆ భయముంటుంది. కలలు లేని నిద్రలో వలె నీవు వీటిని చూడకుండా, కేవలం ఆత్మగానే ఉన్నప్పుడు ఏ భయమూ నిన్ను సోకలేదు. ఏదో పోతుందన్న భావమే భయాన్ని కలిగిస్తుంది. ఆ పోయేదేమిటి అని విచారిస్తే అది నీ శరీరం కాదనీ, అందులో పని చేసే మనస్సనీ తేలుతుంది.


తనకి ఎల్లప్పుడు ఎరుక ఉండేట్టయితే, ఈ రోగపీడితమైన శరీరాన్ని, దాని వల్ల కలిగే ఇబ్బందినీ వదిలించు కోవటానికీ అందరూ సిద్దమే. పోతుందని అతను భయపడేది ఈ ఎరుకని, ఈ చైతన్యాన్ని. జీవించి ఉండటమంటే, సదా ఎరుక కలిగి ఉండటమే. అదే వారి ఆత్మ. ఇదంటేనే అందరికీ ప్రీతి. అటువంటప్పుడు ఈ దేహంలో ఉంటూనే ఆ శుద్ధ చైతన్యాన్నే పట్టుకొని ఎందుకుండ కూడదు.. అన్ని భయాలనీ ఎందుకు వదిలించుకోకూడదు..నీ సహజస్థితి లోనే ఉండు"...

అంతగమనమైన మృత్యువు ను అత్యంత ఆత్మీయమైన చెలికాడుగా భావించి, ఆలింగనం కోసం అంతరంగం పడుతున్న తపన ఇది. మరణం దారుణమైనది కాదనీ , దయామయమైందన్న భావనకు నిదర్శనమిది. పరమశాంతికి మనల్ని చేరువ చేసే ప్రస్థానమే పరలోకగమనం. అందుకే జీవితపరమావధి తెలిసిన ప్రాజ్ఞులు , అస్తమయాన్ని ఆత్మబంధువుగా అక్కున చేర్చుకునేందుకు సంసిద్ధులై ఉంటారు.

భౌతిక శరీరంతో జీవాత్మకు కలిగే సంబంధమే జన్మ.  శరీరం నుండి జీవాత్మ విడిపోవడమే మృత్యువు.

నా ఆగమనంలోనూ నీవే... నా నిష్క్రమణంలోనూ నీవే! నా ఆనందంలోనూ నీవే... నా ఆవేదనలోనూ నీవే! అనుక్షణం నీ అద్భుత, అదృశ్యశక్తి నన్ను ఆత్మీయపవనమై ఆలింగనం చేసుకుంటూనే ఉంటుంది. నా ప్రమేయం లేకుండానే నీ అనురాగ హస్తం నన్ను చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. అది జననంలోనైనా...మరణంలోనైనా!

గమనించినా గమనించకపోయినా మనం ఊపిరి పోసుకున్న క్షణం నుంచి ఊపిరి విడిచే క్షణం వరకు ఓ దివ్యశక్తి మనల్ని అనుక్షణం అనుగమిస్తూనే ఉంటుంది. అజ్ఞాతంగా అందరి ఆలనకు పాలనకు ఆధారభూతమవుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రత్యక్షంగా కనిపించే మమతానుబంధాలకు , కురిపించే ప్రేమానురాగాలకు పరోక్ష ప్రేరకుడు ఆ పరమాత్మే!

నిజమే!అంతర్యామి అయిన ఆ అనంతాత్ముడు ఆనుదినం మనపై అనేక రూపాల్లో తన ప్రేమవృష్టిని కురిపిస్తున్నాడు.

జీవితమంటే ఎడతెగని బంధంతో మన ఆలోచనల్లోకి మరణాన్ని రానివ్వం.అది అనివార్య పరిణామమే అని తెలిసినా దాన్ని భయంకరమైన ఆలోచనగా దూరంగా ఉంచడానికి, వీలైనంత సుదూర ప్రక్రియగా మరచిపోవటానికి ఇష్టపడతాం. కానీ సత్యాన్ని అంగీకరించడానికి సిద్ధపడాలి. మృత్యు భయాన్ని జయించడం కంటే తపస్సిద్ధికి మరో తార్కాణం ఏముంటుంది!నిజానికి మరణం అంటే మరో రూపంలో మాధవుడే! అందుకే 'సంహారకులలో సర్వసంహర్తయైన మృత్యువును నేనే 'అంటాడు భగవద్గీత 'విభూతియోగం'లో శ్రీ కృష్ణభగవానుడు.
ధర్మ పురిని దర్శిస్తే యమపురి ఉండదని శాస్త్ర వాక్కు .శ్రీ నృసింహ స్వామివారి మహా మృత్యుంజయ మంత్రం మహామహిమాన్వితమైన మంత్రం ప్రతీరోజూ పఠించడం వలన అపమృత్యువు, అకాల మృత్యువు, అనుకోని ఆపదలు మన దరిచేరవు. ఆదిశంకరాచార్య విరచిత నృసింహ కరావలంబ స్తోత్రం. ఋణ విమోచన శ్రీ నృసింహ స్తోత్రం. శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం.


ప్రతిరోజూ ఈ నరసింహ మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. జాతకరీత్యా అపమృత్యు దోషాలున్నవారు ప్రతిరోజూ జపించినా, లక్ష్మీ నరసింహ స్వామిని పూజించినా దోషం నివారింపబడి దీర్గాయుష్మంతులు అవుతారని శాస్త్రవాక్కు.


🙏శ్రీ నృసింహుని మహా మృత్యుంజయ మంత్రం🙏


ఉగ్రం వీరం మహావిష్ణుం 

జ్వలంతం సర్వతోముఖమ్‌

నృసింహం భీషణం భద్రం 

మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం


🙏నరసింహ స్వామి అంత గొప్ప రక్షణ ఇస్తారు. ఆనాడు మృత్యువు కోరలలో చిక్కుకున్న ప్రహ్లాదుడిని రక్షించినట్లుగా మనల్ని కూడా రక్షణ చేస్తారు. పిల్లల చేత ప్రతిరోజూ చేయిస్తే వారికి ఆయుష్షు చేకూరుతుంది.


🙏ఆదిశంకరులు చేసిన నృసింహ కరావలంబ స్తోత్రం కూడా విశేష ఫలదాయకమైనది. శ్రీ నృసింహ కరవలంబ స్తోత్రం, రుణ విమోచన నృసింహ స్తోత్రం, నృసింహ ద్వాదశనామ స్తోత్రం కూడా పఠించాలి.


ఆదిశంకర భగవత్పాదాచార్య విరచిత శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం🙏


ప్రతీ రోజు శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారిని స్మరించడం, సకల శుభకరం.


ఆదిశంకరభగవత్పాదులు ఒకటి లక్ష్మీనృసింహకరావలంబ స్తోత్రం చేశారు, రెండు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేశారు. ఇంకా ఏమైనా వారు చేసిన కరావలంబ స్తోత్రం ఉన్నాయేమో నాకు తెలియదు. అసలు కరావలంబం అంటే ఏమిటి? స్వామి వారిని "మాకు సహాయం చేసే చేతులను ఇవ్వు..." అని వేడుకోవడం. అంటే ఈ సకల లోకాలనూ రక్షించే నీ బాహువులతో మమ్మల్ని రక్షించు అని. కరావలంబ స్తోత్రం చాలా చాలా శక్తివంతమైనది. ఆదిశంకరులు ఒక విపరీతమైన ఆపద సమయములో నరసింహస్వామి వారిని కరావలంబస్తోత్రముతో పిలిస్తే, స్వామి తత్ క్షణమే వచ్చి ఆదిశంకరులను రక్షించారు. 


 శంకరులు మమదేహి కరావలంబం అని అంత అద్భుతమైన రెండు స్తోత్రాలు ఇచ్చారు అంటే, వాటిని ప్రతీరోజు మనం అనుసంధానం చేసుకుంటే, ఏ విధముగా ఆపదల నుంచి రక్షింపబడి, స్వామి యొక్క కృపకి పాత్రులము అవుతామో మన ఊహకి కూడా అందదు.


ఆదిశంకరులు అందించిన అటువంటి అద్భుతమైన మరియు శక్తివంతమైన స్తోత్రములలో ఒకటి  శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం...

*****                           ******                *****"నిర్భయంగా వచ్చాను; నిర్భయంగా వెళతాను

ఉచ్ఛ్వసిస్తూ వచ్చాను ; నిశ్వసిస్తూ వెళతాను

మృత్యువు నృత్యం చూసి జడిపిస్తారెందుకని?

భయమెందుకు? నా ఇంటికి నే వెళతాను!

అంటూ ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారు.... దాశరధి కృష్ణమాచార్యులు.

                       *******************

                     ఓం నమః శివాయ...


Sunday, April 10, 2022 5 comments By: visalakshi

భద్రాద్రి రాముడు...

                    భద్రాద్రి....శ్రీ సీతారామచంద్రస్వామి..శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానం, ఖమ్మం  జిల్లా, భద్రాచలం లో ఉంది.


 దక్షిణ_అయోధ్య గా పిలవబడే ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని రామాలాయాలలోకెల్లా అతి పెద్దది. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.


17 వ శతాబ్దం నాటి సంకీర్తనాచార్యులు శ్రీరామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న జీవితంతో ఈ ఆలయ నిర్మాణం ముడిపడి ఉంది. 17 వ శతాబ్దం (1674) రెండవ భాగంలో కంచర్ల గోపన్న భద్రాచలం తహశీల్దార్ గా ఉన్నపుడు ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ధనాన్ని ఉపయోగించారని గోల్కొండ లోని ఒక చెరసాలలో ఇతనిని బంధించారు. కంచర్ల గోపన్న భక్తికి మెచ్చిన శ్రీరాముడు చెరసాల నుండి విడిపించేందుకు గోల్కొండ సంస్థానాదీశుడైన సుల్తాన్ కు దివ్య రూపంలో కనిపించి, గోపన్నను విడుదల చేయమని ఆలయ నిర్మాణానికి వెచ్చించిన మీర్_ఉస్మాన్_అలీ_ఖాన్ సొమ్మును చెల్లించాడని చారిత్రక కథనం. బందీఖానా నుండి విడుదలైన గోపన్న శ్రీరాముని కీర్తిస్తూ తెలుగులో అనేక సంకీర్తనలను రచించాడు. అప్పటి నుండి గోపన్నను రామదాసు అని పిలుస్తుండేవారు. భద్రాచలం, విజయనగరం ప్రాంతాలకు రామాయణంతో దగ్గర సంబంధమున్నట్లు రామాయణ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలలో రాముడు, సీత, లక్ష్మణుడు కొంతకాలం నివాసం ఉన్నట్లు తెలియజేయబడింది. గోదావరి నదిఒడ్డున ఉన్న భద్రగిరి అనే చిన్నకొండ వద్ద శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో ఉన్న ఈ నదిని దాటాడు. మేరుపర్వతం, మేనకల కుమారుడే భద్రుడు (భద్రగిరి). ఈ భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలసిన శ్రీరాముడు భద్రాద్రిరాముడు అయ్యాడు. ఈ భద్రగిరిపైవెలసిన శ్రీరాముని ఆలయమే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం. ముస్లిం మతంలో పుట్టిన కబీర్ దాస్ కు కూడా ఈ ఆలయంతో దగ్గర సంబంధముంది. కబీర్ దాస్ ఒకసారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నపుడు అతన్ని నిరాకరించడంతో ఆలయంలోని దివ్య చిత్రాలు అదృశ్యమైయ్యాయని మళ్ళీ అతనిని ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వడంతో దివ్య చిత్రాలు పునర్దర్శనం అయ్యాయని చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం ప్రపంచ నలుమూలల నుండి వేలాది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. పవిత్రమైన గోదావరి నది ఈ కొండను చుట్టుకొని దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలను ఒలకపోస్తూ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లేలా భద్రాచలంకి మరింత తోడ్పాటునందించింది. మేరుపర్వతం, మేనక లకు లభించిన వరం వల్ల పుట్టిన బాలుడే భద్ర పర్వతం. ఈ భద్రుడి (చిన్నకొండ) వలనే ఈ చిన్నకొండను భద్రగిరి అని ఇక్కడ ఏర్పడిన ఊరికి భద్రాచలం అని పేరు వచ్చింది.


మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7 వ నిజాం ఈ ఆలయానికి సంవత్సరానికి రూ.82,000 విరాళంగా ఇచ్చాడు.


#దేవాలయ ప్రత్యేకతలు

శ్రీరాముని దేవాలయాలలో ఉండే శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది. కాని భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా * కుడి చేతిలో బాణంను, ఎడమ చేతిలో విల్లును ధరించి అలాగే విష్ణువు మాదిరిగా కుడిచేతిలో శంఖునుఎడమచేతిలో చక్రంను ధరించి ఉంటుంది.


భద్రుని కోరికమేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో దర్షనమివ్వటంవల్ల వైకుంఠరామునిగా పిలువబడుతున్నాడు.


ఇతర దేవాలయములలో సీతాదేవి రాముని ప్రక్కన నిల్చుని ఉంటుంది. కాని ఈ దేవాలయములో స్వామి ఎడమ తొడపై ఆసీనవతియై ఉంటుంది. మిగిలిన దేవాలయాలలో ఇరువురకూ రెండు పీఠాలు ఉంటాయి. ఇక్కడ ఒకే పీఠం ఉంటుంది.


 అన్ని దేవాలయాలలో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు, కాని ఇక్కడ మాత్రం ఎడమవైపున ఉంటాడు.


నిత్యపూజలు, ఉత్సవాలు, కళ్యాణం

ఇక్కడ జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది శ్రీరామనవమిరోజున జరిగే కళ్యాణం. ఇది దేశ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవం. ఈ కళ్యాణానికి అనేక లక్షల భక్తులు హాజరవుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు బట్టలు ఈ దేవాలయమునకు ప్రతి సంవత్సరం పంపడం జరుగుతుంది.

                  🙏  శ్రీ‌రామన‌వ‌మి...!!


విశ్వంలో చిన్న పెద్ద తేడాలు లేకుండా భగవంతుడిని నమ్మే ప్రతి ఒక్క భక్తుడికి అత్యంత ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి, పండగను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. 


శ్రీ రాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల స‌మ‌యంలో త్రేతాయుగంలో జన్మించాడని, పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి, ఆయ‌న‌ జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకోవడమే శ్రీ రామ నవమి.


14 సంవత్సరములు అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడ‌య్యాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రతీతి. సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.


ఈ చైత్ర శుద్ధ నవమి నాడు అందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ , వాడ వాడల్లోనూ రమణీయంగా, కమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం.


ఖ‌మ్మం జిల్లా భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. 


సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం.


శ్రీ రాముని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. 


శ్రీ రాముడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. 


శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. 


భక్త రామదాసు చెరసాలలో ఉండిపోవ‌డంతో పూర్వం సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా తెలుస్తోంది. 


అయితే తాను చెరసాల నుంచి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు.


సీతారామ కల్యాణం, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమి నాడే.

ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం జరిగిందని చెబుతారు.
కోదండ రామకల్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా. శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారట.


శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. 


శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు...


🙏ఇంట్లో ఈ పండుగ జరుపుకునే విధానము🙏


శ్రీరామనవమి రోజున కుటుంబ సభ్యులందరూ ఉద‌య‌మే లేచి, తలంటు స్నానం చేయాలి. 


శుభ్రమైన లేదా కొత్త వస్త్రములను ధరించాలి. 

సీతా, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర మూర్తి పటమును గాని, సీతారాముల విగ్రహములనుగాని పూజా మందిరంలో ఉంచి శ్రీరామ అష్టోత్తర పూజ చేయాలి.


నీటిలో బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి పానకం తయారు చేసి, వడపప్పు (నానపెట్టిన పెసర పప్పు), పానకం నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. 


సాయంత్రం కుటుంబ సభ్యులతో కలసి ఊరిలోని రామాలయమునకు, పందిళ్లకు వెళ్లి సీతారాములను చూసి, వారిని ధ్యానించుకొని, ప్రసాదం స్వీకరించాలి.


వీలైన వారు రామాలయంలో గాని, శ్రీరామ నవమి పందిళ్లలో గాని సీతారాముల కళ్యాణం జరిపించవచ్చు. 


లేదా ఆ సమయానికి వెళ్లి సీతారాముల కళ్యాణం చూసి రావాలి. 


శ్రీసీతారాముల కళ్యాణం జరిపించినా లేక చూసినా సర్వ శుభాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు.


🙏పూజ...🙏


వినాయక ధ్యానం, సంకల్పం, పూజ చేసి దేవునికి షోడశపూజలు మాములే గనుక పూజ యధావిధిగా వాటిని ముగించి, ఆపై శ్రీరామాష్టకం, శ్రీరామ అష్టోత్తరం, జానకీ అష్టకం పఠించి పువ్వులతో పూజ చేయాలి.


చైత్రమాసం మల్లెలమాసమే గనుక మల్లెపూవులతో పూజించడం శుభప్రదం, 


మల్లెపూవులు లభ్యంకాని ప్రాంతాలలో వుండేవారు ఏదైనా సువాసనలు గల తెల్లరంగు పూవులతో


 సీతాలక్ష్మణాంజనేయ సమేత శ్రీరామ పటానికి, లేదా విగ్ర‌హానికి పూజించాలి.


వడపప్పు, పానకం, రామయ్యకు ప్రీతి.

అంటే స్వామి ఖరీదైన వ్యయ ప్రయాసలతో ముడిపడిన పిండివంటలేవీ కోరుకోడనీ, స్వామి సాత్వికుడనీ భక్తుల నుంచి పిండి వంటలుగాక పరిపూర్ణ భక్తి విశ్వాసాలు మాత్రమే ఆశిస్తాడ‌ని మ‌న‌కు తెలుస్తోంది..


వీటితో పాటు ఏదైన ఒక ఫలం స్వామి వారికి నివేదించాలి.


ఈ రోజంతా రామ నామ స్మరణ (రామ రామ రామ సీత) లో ఉండాలి, వీలైతే నలుగురు పేద జంటలకు కొత్త బట్టలు పెట్టాలి, వారికి తృప్తిగా భోజనం పెట్టాలి, చిన్న పిల్లలకు పానకం వడపప్పు పంచాలి.


               🙏సమస్తలోకా సుఖినోభవంతు🙏


భద్రాచలం లో వైకుంఠ ఏకాదశి పర్వదినం

వైకుంఠం నుండి విష్ణుమూర్తి నేరుగా వచ్చి భద్రునికి దర్శనమివ్వటంవల్ల వైకుంఠఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారదర్శనం ఈ క్షేత్రంలో చాలా ప్రసిద్ధిచెందింది.


#నిత్యపూజలు

తమిళనాడులోని శ్రీరంగం నుండి రామదాసుచే తీసుకురాబదడిన ఆరు వంశాలకు చెందిన శ్రీవైష్ణవ ఆచార్యుల కుటుంబాలు ఇప్పటికి భద్రాచలంలో నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. రామానుజులవారిచే శ్రీరంగంలో నిర్ణయించబడిన విదంగానే ఇక్కడి ఆలయంలో కూడా పూజలు నిర్వహిస్తున్నారు.


#పర్ణశాల

ఇది భద్రాచలంనుండి 35 కి.మీ. దూరంలో ఉంది. సీతారామలక్ష్మణులు తమ వనవాస వనవాసం సమయంలో ఇక్కడ నివసించారని భావిస్తారు. వారి వనవాస సమయంలోని కొన్ని అందమైన దృశ్యాలు ఇక్కడ చిత్ర, శిల్ప రూపాలలో ప్రదర్శింపబడుతున్నాయి. ఉదాహరణకు సీతను ఎత్తుకుపోవడానికి మాయలేడి రూపంలో వచ్చిన మారీచుని బొమ్మ, పర్ణశాలకుసమీపంలో ఉన్న సీతమ్మ వాగువద్ద సీత ఆరవేసిన చీర గుర్తులనీ, ఆమె పసుపు కుంకుమలు సేకరించిన రంగురాళ్ళనీ కొన్ని చిహ్నాలను చూపిస్తారు. నదికి ఆవలివైపుని రావణుని రథపు జాడలని కొన్ని గుర్తులను చూపిస్తారు.రావణుడు సీతను అపహరించిన ప్రదేశం ఇది.సీత వియోగాన్ని పొందిన రామచమంద్రుడు శోక మూర్తిగా కనిపిస్తాడు. భద్రాచలంలో ఉన్న రామచమంద్ర మూర్తి ముఖంలో ఉండే తేజస్సు పర్ణశాల రామునిలో కనిపించదు.శ్రీరామ నవమి రోజున ఇక్కడ కూడా కల్యాణోత్సవం జరుగుతుంది.


#జటాయుపాక (యేటపాక)

ఇది భద్రాచలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. సీతాపహరణం సమయంలో జటాయువు రావణుని ఎదుర్కొని, సీతను రక్షించే యత్నంలో తన ప్రాణాలను ఇచ్చిన స్థలంగా దీనిని చెబుతారు. జటాయువుయొక్క ఒక రెక్క ఇక్కడికి 55 కి.మీ. దూరంలో ఉన్న వి.ఆర్.పురం మండలంలో రెఖపల్లి గ్రామంలో పడిందట.


#దుమ్ముగూడెం

ఇక్కడ జరిగిన భీకరయుద్ధంలో రాముడు 14,000 రాక్షసులను హతమార్చాడట. ఆ రాక్షసుల బూడిదపై ఈ గ్రామం ఉంది. గనుక దీనిపేరు దుమ్ముగూడెం. ఇక్కడి రాముడిని ఆత్మారాముడంటారు.


#గుండాల

ఇవి భద్రాచలానికి 5 కి.మీ. దూరంలో ఉన్న వేడినీటి బుగ్గలు. ఇక్కడ నదిఒడ్డున ఎక్కడ తవ్వినా వేడినీరు ఊరుతుంది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడుచలికాలంలో ఇక్కడ స్నానం చేస్తారట.


#శ్రీరామగిరి

ఇది గోదావరి దిగువన 55 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన యోగరాముని మందిరం ఉంది.


#పాపికొండలు

పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక కొండల శ్రేణి. ఇవి ఖమ్మం జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఆనుకొని ఉన్నాయి. సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. పాపికొండల అడవుల్లో వివిధ రకాల జంతువులు, పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉంది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.

సేకరణ...🕉🚩🕉🚩🕉🚩🕉🚩🚩భద్రాచలం 🕉.....


శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం గర్భగుడిపై 

ఉన్న సుదర్శన_చక్రం ఎవరూ తయారుచేసినది కాదు.


మరి అది ఎలా వచ్చిందంటే

భక్తరామదాసు తాను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పైభాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించడానికై గొప్ప గొప్ప లోహ శిల్పులను రప్పించి వారిచేత సుదర్శన చక్రాన్ని తయారచేయిస్తున్నాడు.కానీ వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవటమో,లేదా సరిగా రాకపోవడమో జరుగుతుంది.కలత చెందిన రామదాసు కలలో ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై "భక్తా..!! సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైనది దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు.అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను అది గోదావరిలో ఉంది తెచ్చి ప్రతిష్ఠించు" అని చెప్పాడు.మరుసటి రోజు గజ ఈతగాళ్ళతో రామదాసు వెతికించాడు.కానీ కనిపించలేదు. మళ్ల రాముడు కలలో కనిపించి "అది నామీద అమితమైన భక్తిని పెంచుుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది" అని చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రునికి స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పెట్టగా వచ్చి ఆ సుదర్శన చక్రం చేతిలో ఆగింది.ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు మనం చూస్తున్నది.

                 🙏🏻🚩🕉🙏🏻🕉🚩🙏🏻🕉🚩

               భక్తులకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు...

                                 || జై శ్రీరామ్ ||

Wednesday, March 23, 2022 4 comments By: visalakshi

"నీలోకి నీవు"

              ఓం శ్రీ సాయి నాధాయ నమో నమః

                   

శ్లో" శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః

          శృణ్వన్తో2పి బహవో యం న విద్యుః !

        ఆశ్చర్యో వక్తా కుశలో2స్య లబ్ధా

                ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః !!


భా...దేనిని గురించి వినడానికి అనేకులచే సాధ్యపడదో , విన్నప్పటికీ ఎందరో దేనిని అర్థం చేసుకోలేరో , ఆ ఆత్మను గురించి ఉపదేశించేవాడూ అరుదు , వినేవాడూ అరుదు. అంతటి అరుదైన వ్యక్తి ఉపదేశాలను పాటించి దానిని తెలుసుకున్నవాడు కూడా అరుదే.
మనం ఎలాంటి సంపదను కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, ఇక్కడ వదిలిపెట్టేదా లేక మనం వెంట తీసుకువెళ్లగలిగేదా ?

నిజమైన సంపద...

ఒక ఫకీరు రోజూ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. రోజూ అక్కడకు ఒక కట్టెలు కొట్టేవాడు వచ్చి, కొన్ని చెక్కలను కొట్టుకుని తనతో తీసుకెళ్లేవాడు. ఒకరోజు అతనితో ఆ ఫకీరు ఇలా అన్నాడు, "నాయనా నువ్వు రోజంతా కష్టపడి ఈ కలప కొట్టుకుని, తీసుకెళ్తావు. అది నీకు రెండు పూటలా తిండికే సరిపోదు. ఇంకొంచెం ముందు వెళ్ళావంటే అక్కడ ఒక పెద్ద గంధపు చెట్ల అడవి ఉంది. నువ్వు అక్కడ ఒక్కరోజు కలపను నరికితే, అది నీకు ఏడు రోజులకు సరిపడా సంపాదన ఇస్తుంది."


పేదవాడైన ఆ చెక్కలు కొట్టేవాడు నమ్మలేకపోయాడు, ఎందుకంటే ఈ అడవి గురించి తనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని అతను అనుకున్నాడు. అతను తన జీవితమంతా అడవిలో కట్టెలు కొట్టడంలోనే గడిపాడు. రోజూ కేవలం చెట్టుకింద కూర్చునే ఈ ఫకీరుకి ఏమి తెలుసు? అని అనుకుని మొదట అతను అంగీకరించడానికి ఇష్టపడలేదు, కానీ వెళ్లి చూడడం వల్ల వచ్చే నష్టమేమిటనే నిర్ణయానికి వచ్చాడు. ఏమో ఎవరికి తెలుసు, అతను చెప్పింది సరైనది కావచ్చు కదా ! పైగా, ఇతను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది ?

చాలా  ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు, తన లోకంలో తాను సంతోషంగా ఉన్నట్లుగా ఉన్నాడు. ఇంతకు ముందు ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు. కాబట్టి అతను స్వయంగా వెళ్లి చూడాలని నిర్ణయించుకున్నాడు.

అలా ముందుకు వెళ్ళాడు. 

వెనక్కి తిరిగి వచ్చి, నమస్కరించి, ఫకీరు పాదాలపై పడి ఇలా అన్నాడు: "దయచేసి నన్ను క్షమించండి ! ఈ అడవి నా కంటే బాగా ఎవరికి తెలుసు అని అనుకునేవాడిని. కానీ చందనాన్ని ఎలా గుర్తించాలో నేను తెలుసుకున్నాను. 

నా తండ్రి కూడా కట్టెలు కొట్టేవాడు; అతని తండ్రి కూడా అంతే. కానీ మేమందరం రోజుల తరబడి ఈ కట్టెలు కొట్టుకుంటూనే ఉన్నాం, మాకు ఆ గంధం చెట్ల గురించిగాని, సరిగ్గా గంధం అంటే ఏమిటో తెలియలేదు? గంధపు చెక్క దొరికినా, దాన్ని కోసి మామూలు చెక్కలాగానే బజారులో అమ్మేసేవాళ్ళం. మీరు దాని గుర్తింపును, దాని వాసనను, దానిని ఎలా గుర్తించాలో నాకు వెల్లడించారు. నేను ఎంత దురదృష్టవంతుడిని ! నాకు ముందే ఇది తెలిసిఉంటే బాగుండేది." 


దానికి ఫకీరు "బాధపడకు నాయనా, ఇప్పుడు నీకు తెలిసింది కదా" అన్నాడు.

ఆ తర్వాత కట్టెలు కొట్టేవాడు తన రోజులను ఎంతో ఆనందంగా గడపడం ప్రారంభించాడు.

 ఒక్కరోజు అడవికి వచ్చి కట్టెలు కొట్టుకునేవాడు, ఆపై ఏడెనిమిది, లేదా పది రోజులకి కూడా రావాల్సిన అవసరం వచ్చేది కాదు.

ఒక రోజు, ఫకీరు అతనితో ఇలా అన్నాడు, " సోదరా, నీకు కొంత తెలివి వస్తుందని నేను అనుకున్నాను, ముందుకు వెళ్లకుండా నీ జీవితమంతా ఇక్కడే కట్టెలు కొట్టుకుంటూ ఉండిపోయావు. ఇప్పుడు కూడా, ఈ చందనాన్ని మించి విలువైనది ఇంకేదైనా ముందుఉందేమోనని నువ్వు అనుకోవట్లేదు."

కట్టెలు కొట్టేవాడు,"నేను అది కనీసం ఆలోచించలేదు. చందనానికి మించినది ఏదైనా ఉందా ?", అని అడిగాడు.


"గంధపు చెక్కను దాటి ముందుకు వెళ్ళు, అక్కడ ఒక వెండి గని ఉంది, ఈ కట్టెలు కొట్టుకోవడం వదిలేయ్. ఈ వెండిని ఒకసారి తెచ్చుకుంటే,  రెండు నుండి నాలుగు నెలల వరకు సరిపోతుంది", అని అన్నాడు.


ఇప్పుడు అతను ఫకీరును నమ్ముతున్నాడు. దాంతో ఒక్కసారిగా పరిగెత్తాడు. ఇప్పుడు అతని మనసులో ఎలాంటి సందేహాలు తలెత్తలేదు. వెండి గనిని కనిపెట్టాడు! ఇప్పుడు జీవితం విలాసవంతంగా గడుస్తోంది. ఇప్పుడు నాలుగైదు నెలలు వరకు కనిపించడం లేదు. ఒకరోజు వచ్చి, మళ్లీ కనిపించకుండా పోయేవాడు. కానీ మనిషి మనస్సు చాలా మూర్ఖంగా ఉంటుంది, ఇంతకు మించినది మరొకటి ఉంటుందని అతను గ్రహించలేదు.


మళ్ళీ ఒకరోజు ఆ ఫకీరు అతనితో ఇలా అన్నాడు, "నువ్వు అసలు ఎప్పటికైనా మేల్కొంటావా ? లేదా నేను నిన్ను మళ్ళీ లేపాలా? ఎదురుగా బంగారు గని ఉంది, మూర్ఖుడా ! నీ వైపు నుండి నీకు ఏలాంటి ప్రశ్నలూ, ఉత్సుకత, ఏమీ ఉండదా ? ముందు ఇంకేముందో  చూడాలా ? ఇప్పుడు ఆరు నెలలుగా నువ్వు స్థబ్దుగా ఉన్నావు, ఇంట్లో పనిలేదు, ఖాళీగా ఉన్నావు, అడవిలో ఇంకా ముందుకెళ్లి చూద్దాం అని ఎప్పుడూ అనుకోలేదు..?"


దానికి కట్టెలు కొట్టేవాడు, "నేను చాలా నిదానంగా ఉన్నాను, నేను దాని గురించి కూడా ఆలోచించలేదు ! వెండే ఆఖరిది అని నేను నమ్మాను, ఇంతకు మించి ఏమి ఉంటుంది అనుకున్నాను! పేదవాడిని, నేను ఎన్నడూ బంగారం చూడలేదు, దాని గురించి కేవలం విన్నాను అంతే." 

ఫకీరు, "ఇంకా ముందుకు వెళ్తే బంగారు గని ఉంది" అని జవాబిచ్చాడు.


 కథ ఇలా సాగుతుంది. ఆపై, మరింత ముందుకి వజ్రాల గని ఉంది. ఈ కథ ఇలా చాలా సంవత్సరాలు సాగింది. 


ఒక రోజు ఫకీరు ఇలా వ్యాఖ్యానించాడు, "నువ్వు చాలా అజ్ఞానివి, ఇప్పుడు నువ్వు వజ్రాల దగ్గర ఆగిపోయావా ?" 


ఇప్పుడు కట్టెలు కొట్టేవాడు కూడా సంపన్నుడు అయ్యాడు, అతనికి స్వంతగా భవనాలు ఉన్నాయి. "ఇక వదిలెయ్, నన్ను ఇబ్బంది పెట్టకు. ఇంక వజ్రాల తర్వాత ఏముంటుంది" అన్నాడు అహంకారంతో.


ఫకీరు ఇలా అన్నాడు, "వజ్రాలను దాటి, నేను ఉన్నాను, ఈ వ్యక్తి ఇక్కడే కూర్చుని ఉన్నాడని, ఇతనికి వజ్రాల గని గురించి తెలిసి కూడా, వజ్రాలను ఎందుకు సేకరించడం లేదని నీవు ఎప్పుడూ ఆలోచించలేదు.. అంటే అంతకన్నా విలువైనది అతనికి దొరికి ఉండాలి... అది వజ్రాలను మించి ఉండాలి కదా... అన్న ఈ ప్రశ్న నీ మనసులో ఎప్పుడూ తలెత్తలేదా?"


ఆ మనిషి ఏడవడం మొదలుపెట్టాడు. అతను ఫకీరు పాదాలపై పడి, తన తలని పాదాలకేసి కొట్టుకుంటూ, ఇలా అన్నాడు: "నేను ఎంత మూర్ఖుడిని ! ఈ ప్రశ్న ఎప్పుడూ నా మనసులోకి రాలేదు! మీరు చెప్పినప్పుడు మాత్రమే నేను దీని గురించి ఆలోచిస్తున్నాను. నా జీవితంలో వజ్రాల కంటే ఎక్కువ సంపద మీ వద్ద ఉందని నేను ఊహించలేకపోయాను. .

 దయచేసి మీ వద్ద ఉన్న నిజమైన సంపదను పొందే మార్గం చూపండి !"


ఫకీరు ఇలా అన్నాడు, "ఆ సంపదే ధ్యానం, ఇప్పుడు నీ వద్ద చాలా డబ్బు ఉంది, ఇంక నీకు డబ్బు అవసరం లేదు. ఇప్పుడు ఇంక నీ అంతరంగంలో ఉన్న గనిని త్రవ్వు, అది అన్నింటికంటే మించినది."


ఈ ప్రశ్న మనందరికీ కూడా - 


మనం ముందుకు సాగాలి ..... అనుభవాలన్నీ నిశ్శబ్దం అయ్యే వరకు ముందుకు సాగుతూ ఉండాలి .... 


భగవంతుని అనుభూతి కొనసాగుతున్నంత వరకు, ద్వంద్వత్వం ఇంకా ఉనికిలో ఉన్నట్లుగానే సూచిస్తుంది -

దర్శించువారు - దృశ్యం రెండూ ఉన్నట్లే.


ఆ అనుభవం కూడా పోయినప్పుడు సమాధి స్థితి లభిస్తుంది. అప్పుడు దృశ్యము లేదు, దర్శించువారు లేరు, ఏమీ ఉండదు. ఒక నిశ్శబ్దం ఉంది,  ఆ శూన్యంలో, అవగాహన యొక్క దీపం ప్రకాశిస్తుంది. అదే అంతిమ స్థితి, అదే సమాధి.
ధ్యానంలో, మనం మొదట స్వీయ-సంతృప్త స్థితికి చేరుకుంటాము, తరువాత ఆత్మతో సన్నిహితంగా రావడం ద్వారా, శాంతి యొక్క వాస్తవ అనుభవాన్ని మొదటిసారిగా పొందుతాం.

                  స్మరణం.. ధ్యానం..తపస్సు,  అంతర్గత ప్రకాశాన్ని పెంచుతాయి, ఆత్మను సుసంపన్నం చేస్థాయి. భగవత్సాక్షాత్కారం లభింంపజేస్తాయి.


‘నీలోకి’ నీ ప్రయాణం ..


వేదాంతంలో కస్తూరీ మృగం గురించిన ప్రస్తావన ఉంటుంది.


కస్తూరి మృగం అంటే ఏమిటి? అదెలా ఉంటుంది?కస్తూరి మృగం ఒకరకమైన జింక. సీజన్‍ వచ్చినపుడు దాని బొడ్డు ప్రాంతం నుంచి ఒకరకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది. అది మదపు వాసనగా ఉంటుంది. అప్పుడు ఆ వాసన ఎక్కడి నుంచి వస్తున్నదా అని ఆ జింక వెదకడం మొదలుపెడుతుంది. ఆ వాసన తన వద్ద నుంచే వస్తున్నదని అది ఎంతకీ గ్రహించలేదు. ఆ అన్వేషణలో అలా అడవి అంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది. ప్రాణాలు కోల్పోతుంది. వేదాంత గ్రంథాలలో ఉన్న ఈ కథ చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు


మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా ఇలాగే వ్యర్థంగా తిరుగుతూ ఉంటాడు. పుణ్యక్షేత్రాలనీ, తీర్థయాత్రలనీ అనవసరంగా తిరిగి డబ్బునీ, కాలాన్ని వృథా చేసుకుంటూ ఉంటాడు. నిజానికి వీటివల్ల పెద్దగా ఆధ్యాత్మిక ఉపయోగం అంటూ ఏమీ ఉండదు.


పాండవులు తీర్థయాత్రలకు వెళ్తూ కృష్ణుడిని కూడా తోడు రమ్మని పిలుస్తారు. సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునికి తీర్థయాత్రల అవసరం ఏముంది? ఆ సంగతి మాయా మోహితులైన పాండవులకు తెలియదు. కనుక కృష్ణుడిని కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్థయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు. ఆయన చిరునవ్వు నవ్వి వారికి ఒక దోసకాయ ఇస్తాడు.


‘నా ప్రతినిధిగా దీనిని తీసుకుని వెళ్లి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనినీ ముంచండి’ అని కృష్ణుడు పాండవుల చేతిలో దోసకాయ పెడతాడు. వారు అలాగే చేసి తీర్థయాత్రలు ముగించి తిరిగి వస్తారు.


అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింప చేస్తాడు కృష్ణుడు. ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది.

‘అదేంటి బావా! ఇది చేదు దోసకాయ. కటిక విషంలాగా ఉంది. ఇలాంటి వంటకం చేయించావేమిటి?’ అని పాండవులు కృష్ణుడిని అడుగుతారు.

దానికి కృష్ణుడు నవ్వి, ‘బావా ఎన్ని గంగ లలో మునిగినా దీని చేదు పోలేదు చూశావా?’ అంటాడు.


ఎన్ని తీర్థయాత్రలు చేసినా మనిషిలో మౌలికంగా ఎటువంటి మార్పూ రాదని కృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం.


మనిషి ప్రయాణం బయటకు కాదు. లోపలకు జరగాలి. యాత్ర అనేది బయట కాదు. అంతరంగిక యాత్రను మనిషి చెయ్యాలి. ప్రపంచమంతా తిరిగినా చివరకు మనిషి ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు. అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలో నుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు.


పాతకాలపు మహర్షులు దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు. ఒకచోట స్థిరంగా కూర్చుని తపస్సు చేశారు. జ్ఞానసిద్ధిని పొందారు.


జ్ఞానం ఎక్కడో బయట దొరికే వస్తువు కాదు. అది మనలో అంతర్లీనంగా ఉన్న శక్తి. దానిని గుర్తించి, కనిపెట్టి మసులుకునే వారే విజ్ఞులు.


భగవాన్‍ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఇంకా ఎందరో మహా యోగులు ఉన్న చోట నుంచి కదల కుండానే అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించారు. అరుణాచలమే తన ఆశ్రమంగా చేసుకుని రమణ మహర్షి జ్ఞానసిద్ధి పొందారు.


జ్ఞాన మార్గాన్ని చూపిన మన పూర్వికులు మంచి మార్గాన్ని ఉపదేశించారు మనకు ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన యోగుల ఉన్నారు.


ప్రయత్నం చేస్తే మనమూ అలా కాగలం. కానీ, మనపై మనకు నమ్మకం తక్కువ. ఇంకా జ్ఞానం, దేవుడు.. ఎక్కడో ఉన్నారని నమ్ముతూ దేశాలు తిరిగే అమాయకత్వం మనది.

ఆత్మ , దానిని గ్రహించడం వంటి విషయాలు అంత సులభతరం కావు. నిరంతర సాధన అనుష్ఠానాల ప్రయత్నం తక్షణమే ఫలితం కానరాని స్థితిలో ఓర్పు, పలువురు దీనిని సాధించారు కనుక నేను కూడా చేయగలననే ఆత్మవిశ్వాసం ఉండాలి.

       సర్వం శ్రీ సాయి నాధార్పణ మస్తు...