Sunday, June 18, 2023 By: visalakshi

నాన్నకో ఉత్తరం.....మణిగాడి లేఖ...

 నాన్నకో ఉత్తరం...





మీకంటూ ఒక రోజుని కేటాయించి ఆరోజు మీకు శుభాకాంక్షలు చెప్పాలని తహ తహలాడే ఎంతో మంది అమ్మాయిలని అబ్బాయిలని చూస్తూ,  ఆశ్చర్యపోతూ , ఈరోజు ప్రత్యేకంగానో, ప్రత్యక్షంగానో,పరోక్షంగానో అందరిచేత అందరి నాన్నలు శుభాకాంక్షలు అందుకొంటుంటే, మరి నేనెలా అందజేయను నా శుభాకాంక్షలు మీకు? "నేను మీదగ్గరికి వచ్చేయనా నాన్నగారు "? అని అడుగుదామనిపిస్తొంది , మరి నేను వచ్చేస్తే ..మీ మనవడు, మనవరాలు ఎలా?


 " ఉత్తరం అంటే ఎదుటి మనిషి మనముందే ఉండి మనతో మాట్లాడుతున్నట్లు ఉండాలి! ఏ నది వడ్డునో కూర్చుని, వెచ్చటి టీ తాగుతూ, గుప్పున సిగరెట్ పొగ, చేతిలో చెలి ఉత్తరం, పక్కన నెచ్చెలి అలా అలలా తీయగా మాట్లాడ్తున్నట్లుగా ఉండే భావన ఎంతో బాగుంటుందిట. చలంగారు ప్రేమలేఖలు చెప్తాయి.


మేము ఉత్తరాలు రాసే అవసరం లేకుండా ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాలు తెలుసుకొనే అవకాశం మా చేతిలో ఉండేట్టుగా అరచేతిలోనే ప్రపంచాన్ని చూపించేస్తొంది ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం.


మరిలా ఈ సెల్ ఫోన్లలో మాట్లాడుకొంటూ, కంప్యూటర్‍లో శుభాకాంక్షలు అందుకోంటూ అందరూ అధునిక సాంకేతికపరిజ్ఞానం ఆసరాగా అందరికి దగ్గర్లో ఉంటున్నట్టుగా భావించి, అంత ఆనందంగా పరస్పర శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తుంటే నువ్వేంటి పాతకాలంలా ఉత్తరం వ్రాస్తున్నాననుకొంటున్నారా నాన్నగారు? " ఏం చేయను? వెళ్తూ వెళ్తూ కనీసం ఒక్కమాట చెప్పారా నాకు, నేను "వెళ్తున్నానమ్మా" అని, (అయినా నా పిచ్చి కాని , మీరు వెళ్ళేప్పటికి ఈ email కాని, ఈ సెల్ ఫోన్లు కాని ఉన్నాయా నాన్నగారు, నంబరు అడగడానికి  గాని, మెయిల్ అడ్రస్ అడగడానికి గాని) "నాన్నగారు స్కూలుకి వెళ్తున్నాను" అంటే "తప్పమ్మా వెళ్ళొస్తాను అనాలి, ఒక్క హాస్పిటల్ లో ఇలా అనకూడదు" అని చెప్పిన మీరు ఎక్కడ నేను "నాన్నగారు వెళ్ళొస్తాను అనండి" అని సతాయిస్తాననే కదూ మాటవరసకన్నా నాకు "వెళ్తున్నాను " అని చెప్పలేదు.


 అవును నాన్నగారు! ఒక్క విషయం ఎన్నాళ్ళుగానో అడగాలని అనుకొంటూ ఎప్పటికప్పుడు దాటేస్తున్నాను. ఆరోజు మీకు గుర్తుందా? అమ్మా , తమ్ముడు వరలక్ష్మి వ్రతం అని ఊరెళ్ళారు. చిన్నదాన్ని నాదగ్గిర ఉంచమని మీరు అమ్మదగ్గిర మంకు పట్టు పట్టారు, ఎందుకని ?  "ఆడపిల్లలు ఇద్దరూ ఉండాలి ఇంటి మహాలక్ష్ములు, వరలక్ష్మీ  వ్రతానికి వాళ్ళిద్దరూ ఉండాలి అన్నా కాని, వద్దంటే , వద్దని వాదన చేసి నెగ్గారు. ఎందుకు నాన్నగారు, మీరు అంత బతిమాలి నన్ను మీదగ్గిర అట్టేపెట్టుకొని, జాగ్రత్తగా చూసుకొంటానని మాట తప్పారు కదూ.. చూసుకోలేకపోయానని, అమ్మకి చెప్పెస్తే సరిపోయేది కదా, దానికి మీరలా వెళ్ళిపోవడమెందుకు? .


నాకింకా గుర్తుంది నాన్నగారు! తెల్లవారుఝామునే నన్ను లేపి తలంటు పోసి, నీకేమి తెచ్చానో చెప్పుకో చూద్దాం అని కళ్ళు మూసి , నాతో దోబూచులాడి మరీ చూపించిన ఆకుపచ్చ గళ్ళ పట్టులంగా కళ్ళల్లో నిన్నో మొన్నో కొని తెచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అదివేసి, జడలు వేయడానికి విఫల ప్రయత్నం చేసి, " నాకు రాదురా అత్తయ్య చేత వేయించుకో " అని అన్నప్పుడు, పరిగెత్తుకొని వెళ్ళి అదేదో హక్కులా "అత్తయ్యా మా నాన్నగారు జడ వెయ్యమంటున్నారు " అంటే , "పండగ పనిలో ఉన్నానిప్పుడు, నా దగ్గిరకి పంపడమేమిటే?" అని విసుక్కొంటూ అత్తయ్య జడ వేస్తే , "ఇదిగోండి, పాపని విసుక్కొవద్దు, పసిపిల్ల దానికేమి తెలీదు " అని నన్ను తీసుకొచ్చుకొన్నారు కదూ.. నిన్న మొన్న జరిగినట్లుండే ఏ విషయాన్ని మనసుపొరల్లోంచి బయటికి పంపలేక పోతున్నాను. మరి పక్కింటావిడ విసుక్కొంది అని, అలా చెప్పి నన్ను తీసుకెళ్ళిన మీరు ఆరోజు సాయంత్రమే ఎందుకు వెళ్ళిపోయారు? "మావయ్యా వాళ్ళింటికి వెళ్తున్నాను" అన్నారు. ఆ తరువాత ఈరోజు వరకూ ఎంత మంది మీరు లేరని అలుసుగా తీసుకొని నన్ను విసుక్కొన్నారో మీకు తెలుసా? మీరు చెంతనుంటే ఎవరన్నా ఎమన్నా అనేవారా? ఎందుకొదిలేసారలా?


 మొన్నే అనుకోకుండా ఎవరో ఒక sms పంపించారు. అది చదువుతుంటే అసలు తప్పు మాది కూడా ఉందనిపిస్తొంది నాన్నా!.


ఒక చిన్న పాప, వాళ్ళ నాన్న అలా నడుస్తూ ఉంటే.... ఒక చిన్న పిల్ల కాలువ దాటాల్సివచ్చిందిట. అప్పుడు వాళ్ళ నాన్న అన్నారుట:


 "చిన్నారి! నన్ను జాగ్రత్తగా పట్టుకోమ్మా! గబుక్కున ఎక్కడన్నా కాలువలో జారిపడ్తావేమో! జాగ్రత్త" అని చెప్తే ....ఆ చిన్నారి అందిట


 "నాన్నా! నేను నీ వేలు పట్టుకొంటే భయానికి గబుక్కున జార విడిచేస్తానేమో, నువ్వే నా వేలు పట్టుకో.. నేనెక్కడపడిపోతానో అని వడిసి పట్టుకొంటావు, అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటావు, నేను సేఫ్" అని అందిట.


ఆ చిన్నారి తెలివితేటలు నిజానికి నా(మా)కు లేవేమో కదా నాన్నగారు, మేము మీవేలు వదిలేసాము. మీకు కోపమొచ్చింది కదూ.. "తెలియక చేసిన తప్పు నాన్నగారు ! మా వేలు పట్టుకోండి నాన్నగారు" అని చెప్పాడానికి అందనంత దూరానికి వెళ్ళిపోయారు. ఉండిలేక ఉన్నది మీరే, ఉన్నా కూడా లేనిది నేనే. మిమ్మల్ని మా వేలు పట్టుకోనీయకుండా , నేనే మీ వేలు పట్టుకొని నడుద్దామన్న స్వార్థం మమ్మల్ని ఇలా శిక్షించింది. అయినా... ఈరోజు ప్రత్యేకమంటూ అందరూ శుభాకాంక్షలు చెప్తుంటే, నేను మటుకు మౌనం వహించడమెందుకని, ఇంకో ఇన్ని జన్మలకి మీకే కూతురిగా పుట్టాలని, అప్పుడు ఆ భగవంతుడిని మిమ్మల్ని పూర్ణాయుష్కుడిని చేయాలని, మీరే మావేలు పట్టుకొని నడిపించాలని మనస్పూర్తిగా కోరుకొంటూ........


ఇక్కడ లేని నాన్నగారికి! ఇక్కడే ఉన్న నా శుభాకాంక్షలు. 


ఎప్పటికీ మీ కూతురే అయిన మణిగాడు


*******

మా చెల్లి రాసిన ఈ లేఖ నా మనసును కదిలించింది.. అందుకే ఇలా బ్లాగులో...నాన్న గారికి నా నమస్సులు..🙏🙏🙏...



3 comments:

Ramani Rao said...

Thanks akkaa.. 🌺🌺🙏🙏

భారతి said...

హృదయాన్ని హత్తుకునే లేఖ...

Anonymous said...

happy fathers day anadaaniki ee uttaraaniki yenta teda!!