Wednesday, October 25, 2017 3 comments By: visalakshi

వ్యక్తిత్వ ధర్మం శ్లో" చతుర్విధా భజంతే మాం జనా స్సుకృతినో2 ర్జున !
     ఆర్తో జిజ్ఞాసు రర్ధార్ధీ జ్ఞానీ చ భరతషభ ! !!(7అ - 16శ్లో)

సుకృతులు, దుష్కృతులు అని లోకంలోని జనులను స్థూలంగా రెండు రకాలుగా విడదీసాడు పరమాత్మ. 

దుష్కృతులు - అత్యాశాపరులు ....


మనిషికి కోరికలు అనేకం. ఆ కోరికలే తోటివారిని నిందించేట్టు, లేదా హింసించేట్టు అనేక సందర్భాలలో వారిని  నిర్మూలించేటట్టు కూడా చేస్తూ ఉంటాయి. మనిషిలో ఉండే అత్యాశే  తన తోటి వారిని హింసించడానికి కారణమవుతోంది. ప్రతీ వస్తువును తయారుచేయడంలో పొటీతత్వంతో ఒకరిని మించి ఒకరు చేయాలన్న తాపత్రయంలో మనిషి సాగించే ప్రయత్నాలు ప్రకృతిని పాడుచేస్తున్నాయి.... పట్టెడన్నం కోసం పరితపించే వారినీ చూస్తున్నాం.... బస్తాలు బస్తాలు ఆహారధాన్యాల్ని పట్టుకెళ్ళి సాగరంపాలు చేసే దేశాల్నీ మనం చూస్తున్నాం. కోరిక ఉండాలి కానీ ఇంకొకరిని అధిగమించి స్వార్ధంగా తాను మాత్రమే ఎదగాలన్న చింతనతో అత్యాశాపరుడు కావటం తప్పు. తాను చేసే కార్యాలు తన తోటి ప్రాణకోటిని, ప్రకృతినీ హింసించని రీతిలో సాగాలి. తనను తాను ఆత్మవినాశనము చేసుకోని రీతిలో సాగాలి. 

మంచి మార్గంలో బతకడానికి భగవంతుని అనుగ్రహాన్ని కోరు. ఆయన అనుగ్రహిస్తాడు. అయితే మన కోరికలను బట్టి ఆయన పరీక్షలూ ఉంటాయి.  కావలసినవి కోరుకున్నా మనకు తగినవి అందిస్తాడాయన. మనకు హాని కలిగించని కోరికలను ఆ పరంధాముడు తీర్చి తన అనుగ్రహాన్ని మనకందిస్తాడు. పిల్లల కోరికకై తల్లిదండ్రులు ఎంత ఆతృత పడతారో లోకపిత అయిన భగవంతుడు కూడా మన విషయంలో ప్రేమతో అంత తపనా పడతాడు. అలాంటి జగత్పితను మనం ఏది కావాలన్నా అడగవచ్చును. ఏది తగునో అది మనకు తప్పక అనుగ్రహిస్తాడు.

మా కోరికలు తీర్చుటలేదు. అన్నీ కష్టాలే ఏ రూపంలో పూజించినా, ఎన్ని పండగలు చేసినా మాకు కష్టాలే..   పరమతంలో అందరూ సుఖంగా ఉన్నారు. కాబట్టి ఆ మతం తీసుకొని వెళ్ళిపోదాము అని చాలామంది ఏసు ప్రార్ధనలోకి మారతారు. మరి అప్పుడు కష్టాలు లేవా.. రావా.. వారి కర్మలు మారిపోయాయా..అంటే అదేమీ ఉండదు.. కానీ భ్రమలో మేము ఈ మతం తీసుకున్నాక చాలా సంతోషముగా ఉన్నాము.. మాకు ఎటువంటి కష్టాలు లేవు అని వారిని వారు మభ్యపరుచుకుంటారు. "ఏ మతం గానీ వారు కొలుస్తున్న వారి దైవం కానీ ఇతర మతస్తులను విమర్శిస్తూ మతమార్పిడులు చేయమని  చెప్పలేదు." ఏసుప్రభువు అంటే ఒక పవిత్ర ఆరాధన.. మహమ్మద్ ప్రవక్త అంటే ఒక పవిత్ర ఆరాధన మన హిందూ ప్రజలలో ఉంది. అలాగే వారికీ మన హిందూదేవతలపై, ధర్మాలపై మన పవిత్ర గ్రంధాల పై ఆరాధన ,గౌరవం ఉండాలి. అది కొద్దిమందిలో మనం చూస్తాం. కానీ ఎక్కువ శాతం అజ్ఞానంతో మతమార్పిడులకు పూనుకుంటున్నారు. దీనిని మనం ముక్తఖంఠంతో ఖండించాలి. ఇందుకు నేను సైతం ..అంటాను. కానీ వారి ధోరణిలోనే మనమూ వారిని విమర్శించడమూ ..విశ్లేషించడమూ అనవసరము. మన గొడవలను భగవంతుడికి ఆపాదించరాదు. హిందూ సంప్రదాయాలకు అర్ధం పరమార్ధం ఉన్నాయి. హిందూ కట్టుబాట్లకు క్రమశిక్షణ ఉంది. ప్రతి పండుగ వెనకాల ఒక ప్రబోధం ఉంటుంది. హిందూ పండగలను దేవతలను వ్యంగ్యముగా మాట్లాడితే  మనం సహించవలదు. పరమత సహనం అంటే గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. "నమ్మకము"(Faith) అన్నది పుట్టిన హిందూత్వం పైనే లేకపోతే ఆ "నమ్మకం" వేరే మతం తీసుకున్నపుడు ఎలా వస్తుందో నాకు అర్ధం కాదు.      

సుకృతులు, దుష్కృతులు అని లోకంలోని జనులను స్థూలంగా రెండు రకాలుగా విడదీసాడు పరమాత్మ. 

నన్నుకోరి నా నుంచి పొందగోరేవారు సుకృతులు. అలా నా నుంచి పొందగోరేవారు 1. ఆర్త:,2. జిజ్ఞాసు:, 3.అర్ధార్ధీ, 4. జ్ఞానీ. 

ఆర్త: -ఒకనాడు సంపద వైభవాలు ఉండీ దురదృష్టవశాత్తు పోగొట్టుకొని తిరిగి పొందాలని కోరుకునేవాడు.. అర్ధార్ధి - తన వద్దలేని కొత్త సంపద వైభవాలు కోరుకునేవాడు. వీరిద్దరూ ఒకలాంటివారే. ఇలాంటి లౌకిక సంపదలు కాక జ్ఞానస్వరూపమైన ఆత్మని దర్శింపగోరువాడు జిజ్ఞాసువు. అంటే ఆత్మసాక్షాత్కార కాముడు అని అర్ధం.  జ్ఞానము కల ఆత్మ కూడా భగవంతుని వస్తువే కనుక అది మనకు స్వయంగా ప్రకాశించాలన్నా స్వామి అనుగ్రహిస్తేనే అవుతుంది తప్ప మన సాధన వలన కాదు.  కనుక జిజ్ఞాసువు అయిన వ్యక్తి కూడా పరమాత్మునే ఆశ్రయించాలి. ఇక జ్ఞానీ అంటే జ్ఞానము పూర్తిగా కలవాడు. జ్ఞానం పూర్తిగా లభిస్తే ఆత్మ స్వరూపం తెలుస్తుంది. ఆత్మ స్వరూపం తెలిస్తే దానికి నియంతగా ఉన్న పరమాత్మ స్వరూపం తెలుస్తుంది. అలా జగత్కారణమై సర్వనియంతయై, ఆత్మ లోపల ఉండి నడిపే శ్రీకృష్ణుని అధీనమే జీవుడని తెలియడమే జ్ఞానమంటే. జ్ఞానం కలవాడు అంటే పరమాత్మకి దాసుడుగా ఉన్నవాడు అనే అర్ధం. 

ధర్మంగా మంచి ఆశయాలను తీర్చమని భగవంతుని కోరండి. భగవంతుడు తప్పక తీరుస్తాడు.మన ఆశలన్నీ ఆలోచించి తగిన రీతిలో నెరవేరుస్తాడు. ఆయన అనుగ్రహించినవి ఆనందంతో స్వీకరిద్దాం. వ్యక్తిత్వాన్ని నమ్ముకుందాం. తద్వారా భగవంతుని అశీస్సులు పొందుదాం. ఇక్కడ ఒక ఉదాహరణ:- సోదరి నివేదిత జీవితం గురుభక్తికి ప్రతీక. భారతదేశ వాతావరణం, ఆచారవ్యవహారాలు, సాంఘీక కట్టుబాట్లు తెలియని ఆవిడ వివేకానంద స్వామికి శిష్యురాలై..మార్గరేట్ "నివేదిత"గా మారారు. అంటే భగవంతునికి నివేదింపబడినదని అర్ధం. ఆవిడ భారత ప్రజల సేవలో స్వచ్చందంగా తనను తాను నివేదించుకొని తన పేరును సార్ధకం చేసుకొంది. పాశ్చాత్యులు భారతీయులను ఎంత చులకన చేశారో, ఎంత అణగద్రొక్కే ప్రయత్నం చేశారో ప్రత్యక్షంగా ఆమె చూసారు. భారతీయులకు కావలసినది పాశ్చాత్య విద్య కాదు..భారతీయ చరిత్ర, సంస్కృతి, భాష అని గ్రహించారు. మాతృభాషలో పదాలుండగా ఇంగ్లీషు వాడడం ఎందుకు? అని ఖండించారు నివేదిత. భారతదేశం గురించి, ఇక్కడ తన అనుభవాల గురించి ఆమె అనేక పుస్తకాలు వ్రాసారు. హృదయాలను కదిలించే ఎన్నో గాధలు భారతీయ చరిత్రలో ఉన్నాయి. చిత్రించడానికి ఎన్నో భారతీయ కళాఖండాలు ఉండగా విదేశీ అనుకరణ ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. పురాతన భారతీయ కళలను పునరిద్ధరించాలని ఆమె ప్రగాఢంగా ఆకాంక్షించారు. ఆమె  మనదేశ స్వాతంత్ర్య దిశలో సమైక్యతా దిశగా విశేష కృషి సలిపారు. నివేదిత ఆధ్యాత్మికంగా సేవలందిస్తూ రామకృష్ణ, వివేకానందులకే తన జీవితాన్ని అంకితం చేసారు. 
సోదరి నివేదిత భారతీయ సంస్కృతి ప్రాముఖ్యమును ప్రాచుర్యము చేశారు. కానీ మనలో కొందరు మన సంస్కృతిని విమర్శించడం శోచనీయం. 

భగవద్గీతలో శ్లోకానికి అర్ధాన్ని ఊటంకిస్తూ భారతీయ హిందూ సంస్కృతి పరి రక్షణ మన ధర్మం.  అని తెలియజేయుటయే ఈ పోస్ట్ సారాంశము.


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు  


Monday, October 16, 2017 0 comments By: visalakshi

శ్రీశ్రీశ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం-మానవజన్మ ప్రాముఖ్యముఈ విశ్వానికే అధిపతి అయిన భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించినప్పటికీ ఆయనకు సంతృప్తి కలుగలేదు. భగవానుని అనంత శక్తిని అవి గ్రహించలేకపోయాయి. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించి వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తిని ప్రసాదించాడు. జ్ఞానము సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు.ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవజన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవజన్మమెత్తి మోక్షమును సాధించవలెనని కోరెదరు. శరీరముండుట చేతనే మానవుడు తన దేహము యొక్క జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్యవివేకముతో కడకు భగవత్సాక్షాత్కారమునుపొందుచున్నాడు.  
మానవుడు భగవంతుని లీలలను, అద్భుతకార్యములను, మహత్యాలను జూచి పరవశమొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి జెంది ఆనందించును. అందుచే  మానవ జన్మ లభించుట  జన్మ సార్ధకము.మానవ జన్మ యొక్క విలువను గ్రహించి ఈ దేహము నశ్వరమని..దేహానికి మరణం అనివార్యమని గ్రహించి జీవిత పరమావధిని సాధించుటకై విసుగు,విరామములేక రాత్రింబగళ్ళు కృషిచేసి ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెను. అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలువవలెను. ఈ మన ధ్యేయము సత్వరము ఫలించాలంటే సద్గురువు సాయినాధుని సాంగత్యములో అది సాధ్యము. ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఎన్ని విన్ననూ, ఆధ్యాత్మిక గ్రంధములెన్ని చదివినను..తెలియరాని ఆత్మసాక్షాత్కారము సద్గురువు సాయినాధుని సాంగత్యములో సులభముగా పొందవచ్చును. ఆ జ్ఞానమునంతయు సద్గురువు చెప్పగలరు. వారి చర్యలు..సామాన్య సంభాషణలే మనకు మౌనప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనమందుంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను సద్గురువు ఆచరణలో చూచి భక్తులు నేర్చుకొందురు. సాయిబాబా వారి పావనచరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగచేసి వారిని పారమార్ధికముగా ఉద్ధరించును. సద్గురువు సాయినాధుడు అట్టి మహా పురుషుడు. వారెప్పుడూ ఆత్మానుసంధానము నందే నిమగ్నులగుచుందురు. వారు స్థిరచిత్తులు. వారి చర్యలు నిగూఢములు. బాబావారి ప్రేమానురాగములు కొలువరానివి. స్వామి అనుగ్రహము ఇంతయని చెప్పుటకు అలవికానిది. బాబా వారి ఆదేశములలో అద్భుతమైన సందేశాలుంటాయి. అవి తెలుసుకున్నవారు ధన్యులు.  భక్తుల కొరకు మానవరూపమున అవతరించిన భగవతత్త్వమే సాయిబాబా. వారి కరుణ, అనుగ్రహము అద్భుతములు. వారే కరుణతో మన వంటి భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండిన వారి మహత్యమును తెలుసుకొనగల శక్తి యెవరికి గలదు? బాబావారు శుద్ధచైతన్యస్వరూపులు. విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. బాబా ఎల్లప్పుడు తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుటయందు నిమగ్నమై యుండువారు. శ్రీసాయిబాబాను భక్తిప్రేమలతో స్మరించుటయే జీవన్మరణరూపమైన సంసారమనెడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఈ సాధనలో వ్యయప్రయాసలు లేవు. మన దేహేంద్రియములలో పటుత్వమున్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు గురు సన్నిధిలో సద్గురువు చరణములను నమ్మి కొలువవలెను. మనయొక్క అంతరంగమున గల భక్తిప్రేమలను బట్టి సద్గురువు మనకు జ్ఞానమును, శాశ్వతానందమును ప్రసాదించును.ద్గురువు సాంగత్యమున కలుగు మహిమ చాలా అద్భుతము. అది మన అహంకారమును, దేహాభిమానమును నశింపజేయును. చావుపుట్టుకలనే బంధములను కూడా నశింపజేయును. కేవలము హృదయ పూర్వకంగా సద్గురువును వంటి మహాత్మునాశ్రయించిన వారు మనలను భవసాగరము నుండి తరింపజేయుదురు. పూర్వజన్మ సుకృతము వలన శ్రీ  సాయిబాబా పాదములనాశ్రయించు భాగ్యము మాకు లభించినది. మసీదుగోడ కానుకొని  ఊదీమహాప్రసాదమును తనభక్తుల యోగక్షేమములకై పంచి పెట్టు సుందరస్వరూపుడు, ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించువాడు, సదా పూర్ణానందములో మునిగియుండు వాడునగు శ్రీ సాయి పాదములకు సాష్టాంగనమస్కారములు చేయుచూ ...పరబ్రహ్మ స్వరూపులైన సాయినాధుడి కృప అందరికీ కలగాలని కోరుకుంటూ....సర్వం శ్రీసాయినాధార్పణ మస్తు 
   
Tuesday, October 10, 2017 0 comments By: visalakshi

ఆత్మీయత-అంతరంగం

 ఓం శ్రీ సాయినాధాయ నమ:


ఆత్మీయత అనేది అంతరంగ భావం. జనన కాలం నుండి ఆత్మీయానురాగాలను మనం పొందుతాం.మనమూ ఆస్వాదిస్తాం. అది ఒక కుటుంబ పరంగా కావచ్చు ..స్నేహం కావచ్చు..మరేదైనా బంధం కావచ్చు. అందరినీ ఆత్మీయులుగా భావించి పరస్పర అవగాహన మేరకు సంభాషణలు చేసుకుంటాము. కానీ "ఆత్మీయత"కు నిర్వచనం ఏమిటి? అంటే చెప్పగలమా...అది అనుభవిస్తేనే ఆ మధురత తెలుస్తుంది. "రెండు వేరు వేరు నదులలోని జలాలను ఒక కలశంలో పోస్తే ఆ జలాలు అవినాభావ సంబంధంతో కలిసిపోయి ఉంటాయి." అలాగే "ఆత్మీయులు" అంతరంగాన మిళితమైన భావనలతో కలిసి ఉంటారు. స్నేహాన్ని మించిన సహచర్యంతో సంతోషభావ ప్రకాశకులై ఉంటారు.    

ఆత్మీయత, అనురాగాలకు దర్పణం రామాయణ కావ్యం. సోదరుల మధ్య అనురాగము, భార్యాభర్తల మధ్య ఆత్మీయానురాగము.. తండ్రీ కుమారుల ఆత్మీయతా మమకారము.. ఇలా రామాయణ మహా గ్రంధములో ఆత్మీయతతో కూడిన అంతరంగాలకు ప్రతి పాత్ర అద్దం పడుతుంది. ఆత్మీయతకు ప్రతిరూపం ఆదికావ్యంలోని శ్రీ రామచంద్రమూర్తి. 

సీతారాముల కళ్యాణంగా శ్రీరామనవమిని భక్తిశ్రద్ధలతో మనం జరుపుకుంటాం. ఎంతో భక్తితో కోదండరాముణ్ణి అర్చిస్తాము. సీతారాముల తరువాత దైవత్వస్థాయిని పొందిన రామదూత "హనుమంతుడు". సీతారాములకు భక్తితో దాసుడైన హనుమంతునకు.. మనము భక్తితో శ్రీ ఆంజనేయకు  దాసులం.
శ్రీరామపట్టాభిషేకం తరువాత ఒకరోజు సీతారామలక్ష్మణులు తమ మందిరంలో ఉన్న హాలులోకి వెళ్ళారు. ఒక్కొక్క చిత్రపటం చూసి దానిగురించి చెప్పుకుంటూ హనుమంతుడి చిత్రం వద్దకు వచ్చారు. లక్ష్మణుడు 'అయం ఆర్యో హనుమాన్- ఈ పూజ్యుడు హనుమంతుడు '  అన్నాడు.... సీత, 'ఏష స: చిరనిర్విణ్ణజీవలోకప్రత్యుద్ధరణగురూపకారీ మహానుభావో మారుతి:- చిరకాలంగా నిర్వేదంలో పడి దు:ఖిస్తున్న జీవలోకాన్ని ఆ దు:ఖమునుంచి    బయటపడేసి మహోపకారం చేసిన మహానుభావుడు ఈ హనుమంతుడు ' అంది.....రాముడు  'దిష్ట్యా  సో2 యం మహాబాహు: అంజనానందవర్ధన: యస్య వీర్యేణ కృతినో వయం చ భువనాని చ - ఎవరి పరాక్రమం వలన మేమూ, లోకాలూ కృతార్ధులమయ్యామో ఆ మహానుభావుడు ఈ ఆంజనేయుడు ' అన్నాడు.

రామపట్టాభిషేకం అయిన తరువాత రాముని అనుమతితో వానరులూ రాక్షసులూ వారి వారి దేశాలకు వెళుతున్నారు. అప్పుడు  హనుమ ఇలా అన్నాడు.

శ్లో"స్నేహో మే పరమో రాజంస్త్వయి తిష్ఠతు నిత్యదా,
     భక్తిశ్చ నియతా వీర భావో నాన్యత్ర గచ్చతు.

రామా! నాకు నీపట్ల నిత్యమూ స్నేహమూ, అచంచలమైన భక్తీ ఉండుగాక! నా మనస్సు ఇతరవిషయాలవైపు మరలకుండా ఉండుగాక. ఈ భూలోకంలో నీ చరిత్ర ఎంతవరకు మానవులు చెప్పుకుంటారో అంతవరకూ నేను జీవించే ఉంటాను. నీ చరితామృతం వింటూ, నీకు దూరమయ్యాననే బెంగను తొలగించుకుంటాను.

శ్లో"ఏవం బ్రువాణం రామస్తు హనూమంతం వరాసనాత్,
     ఉత్ధాయ సస్వజే స్నేహద్వాక్యమేతదువాచ హ.

హనుమను రాముడు స్నేహత్వభావంతో అంతరంగాన ఆత్మీయమైన గౌరవభావము ఉప్పొంగగా. సింహాసనము దిగి .ఆనందముతో కౌగలించుకున్నాడు. ఆ వాయునందనుడు చేసిన మహోపకారాలకు తన కృతజ్ఞత అనితరసాధ్యమైన రీతిలో తెలియజేసాడు.

 శ్లో" ఏకైకస్యోపకారస్య ప్రాణాన్ దాస్యామి తే కపే,
      శేషస్యేహోపకారాణాం భవామ ఋణినో వయం.

హనుమా! నువ్వు మాకు ఎన్నో ఉపకారాలు చేసావు. వాటిలో ఒక్కొక్క ఉపకారం ఎటువంటిదంటే కేవలం ఆ ఒక్క ఉపకారానికే నా ప్రాణాలు ధారపోసినా కూడా నీ ఋణం తీరదు. మిగిలిన ఉపకారాల ఋణం మిగిలే ఉంటుంది. వాటికి నీకు (శాశ్వతంగా) ఋణగ్రస్తుడినయే ఉంటాను. 

శ్లో" మదంగే జీర్ణతాం యాతు యత్త్వయోపకృతం కపే,
     నర: ప్రత్యుపకారాణామాపత్స్వాయాతి పాత్రతాం.

మనం ఆపదలలో ఉండగా ఎవరైనా మిత్రుడు ఉపకారం చేస్తే తరువాతికాలంలో ఆ మిత్రుడికి ప్రత్యుపకారం చెయ్యాలనుకుంటాం. కానీ ఆ మిత్రుడికి ఆపద వస్తేనే మనకి ప్రత్యుపకారం చేసే అవకాశం వస్తుంది. నేను నీకు ప్రత్యుపకారం చెయ్యాలని కోరుకోను. (ఎందుకంటే నువ్వు చేసిన ఉపకారాలకి నీ ఋణం తీర్చుకోవాలంటే నీకు ఆపదలు కలగాలి. నీకు ఆపదలు కలగాలని కలలో కూడా కోరుకోలేను కనుక నీ ఋణం ఎన్నటికీ తీరదు.) "అందుచేత నువ్వు చేసిన మహోపకారాలన్నీ నాలోనే జీర్ణమైపోతాయి."  రాముడు ఇంత గొప్ప మాట హనుమను తప్ప ఇంకెవరిని గురించీ అనలేదు. వెంటనే రాముని మెడలో ఉన్న అమూల్యమణిహారం తీసి హనుమంతుడి మెడలో వేసి తన అత్యంత ఆత్మీయతను కనపరిచాడు.
హనుమంతుడు రామాయణ మహామాలారత్నం. అరిషడ్వర్గాన్ని జయించినవాడు కనుక జితేంద్రియుడు అని, రాముడు మెచ్చిన తెలివైనవాడు కనుక బుద్ధిమతాం వరిష్ఠం అన్నారు. హనుమ ఉన్నచోట భయం ఉండదు. ధైర్యం ఉంటుంది. కార్యదీక్ష ఉంటుంది. విజయం ఉంటుంది. అనితర సాధ్యమైన కార్యాలు సాధించినా ఆత్మస్తుతి ఉండదు. వినయమే ఉంటుంది. ఆవేశం కాకుండా ఆలోచన ఉంటుంది.ఇవన్నీ హనుమద్భక్తులుగా మనం నేర్చుకొని ఆచరించవలసిన అంశాలు.


  

రామాయణంలో శ్రీరాముడి సాన్నిహిత్యం కన్న తమకి వేరే ఏమీ అక్కరలేదనుకొని కోరి రాముడికి దాసులైనవారు ఇద్దరు. వారు లక్ష్మణుడు, హనుమంతుడు.. లక్ష్మణుడు పుట్టుకనుంచీ రాముడితో కలిసి ఉన్నాడు. తన జీవితం రాముడికే అంకితం చేసాడు. రాముడి గుణగణాలు చూసి తనంత తాను కోరి రాముడికి దాసుడయ్యాడు. లంకలో రాక్షసుల మధ్య నిలబడి తానెవరో చెప్తూ 'దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ: - నేను కోసలదేశాధిపతి రాముడికి దాసుణ్ణి ' అని తన గుర్తింపును తెలిపాడు హనుమంతుడు. 

పట్టాభిషేకం తదుపరి రాముడు అనేక దానములు చేసి వానరులకు, రాక్షసులకు విలువైన కానుకలు ఇచాడు. సీతమ్మకు అమూల్యమైన వస్త్రాలు,ఆభరణాలూ ఇచ్చాడు. ఆమెకి చంద్రకాంతిలా ఉన్న స్వచ్చమైన ముత్యాలహారం ఇచ్చాడు. సీత ఆ హారం తన మెడనుంచి తీసి రాముడివైపు, హనుమవైపు, వానరులవైపు చూసింది. ఆమె  ఆలోచన  గ్రహించిన రాముడు సీతా! తేజస్సు,యశస్సు,నేర్పు,సామర్ధ్యం,వినయం,నీతి,పౌరుషం,పరాక్రమం,తెలివి-ఇవన్నీ సర్వదా ఎవరిలో ఉంటాయో, నువ్వు ఎవరిపట్ల ఆనందంగా ఉంటావో అతడికి ఆ హారం ఇయ్యి 'అన్నాడు. సీత వెంటనే ఆ ముత్యాలహారం హనుమంతుడికి బహుకరించింది. అంతటి మహిమాన్విత మహానుభావునికి మనము మనసారా సాష్టాంగ వందనాలు అర్పిస్తూ....


పవమానసుతుడు పట్టు పాదారవిందములకు,
నీ నామరూపములకు నిత్యజయమంగళం.