Friday, February 19, 2016 0 comments By: visalakshi

ఏకలవ్యుడు - గురుదక్షిణ - బొటనవ్రేలు

 ఓం శ్రీ మహేశ్వరాయ నమో నమ:

"నెమ్మిని నీదక్షిణహ
స్తమ్మున పెనువ్రేలు దునిమి దక్షిణయి:మ్మి
ష్టమ్మిది నాకనవుడు విన
యమ్మున వాడిచ్చెదాని నాచార్యునకున్" - (ఆది; పంచమ; ప.243)

" నీ కుడిచేతి బొటనవేలును కోసి ప్రీతితో నాకు గురుదక్షిణగా ఇవ్వు.అది నాకిష్టం"అని ద్రోణాచార్యులు శిష్యుడైన ఏకలవ్యుని అడిగాడు.




  నన్నయ రాసిన 'మహాభారతం ,ఆదిపర్వం, పంచమాశ్వాసంలోని 231 వ వచనం నుండి 245 వ పద్యం దాకా ఏకలవ్యుడి కధ సాగింది.

 ఏకలవ్యుడి తండ్రి హిరణ్యధన్వుడు(కేకయరాజు).తల్లి శ్రుతదేవ..నిషాదులలో పెరిగాడు.


ద్రోణాచార్యులవారిని "గురువు" గా విగ్రహారాధనతో సేవిస్తూ విలువిద్యను అభ్యసించాడు.

'గురుదక్షిణ ' గా ద్రోణాచార్యులు దక్షిణ హస్త అంగుష్ఠమును కోరగా నిస్సంశయముగా అత్యంత గురుభక్తితో బొటనవ్రేలును కోసి ఇచ్చిన వీరుడు.


"హరివంశం" గ్రంధ ప్రకారం ఏకలవ్యుడు పాండవులకు రెండవ పెదతల్లి కొడుకు, కృష్ణుడి రెండో మేనత్త కొడుకు.అనగా పాండవులకు వరుసకు సోదరుడు.


 ఏకలవ్యుడు రాజవంశంలో పుట్టి ఎందుకు నిషాదులతో పెరిగాడన్నది ప్రశ్నార్ధకమే! యవన దశలో భారతంలో తాను వనచరనాధుడైన హిరణ్యధన్వుని కుమారుడనని పాండవులకు పరిచయం చేసుకొన్నాడు.


ద్రోణాచార్యులు కౌరవుల కొలువులో గురుకుల ప్రధానాచార్యులు.
మహాభారతంలో పెద్దలకు సంబంధించి   భీష్ముడి తరువాతి స్థానం ద్రోణుడిదే!

ఆ గురుకులంలో ప్రధానాచార్యులైన ద్రోణుని వద్ద రాకుమారులతో పాటు తనూ యుద్ధవిద్యలు నేర్చుకోవాలని ఏకలవ్యుడు ఉబలాట పడగా, ఆతడు ఆటవికుడని,గురుకుల ప్రవేశానికి అనర్హుడని ద్రోణాచార్యులవారు తిరస్కరింపగా,    ఆతను  ద్రోణాచార్యులవారిని "గురువు" గా విగ్రహారాధనతో సేవిస్తూ విలువిద్యను అభ్యసించాడు.

 ద్రోణునికి అత్యంత ప్రియ శిష్యుడు అర్జునుడు. ఆతనిని తానంత, ఎవరికీ సాటిలేని మేటి విలువిద్యనందిస్తానని అర్జనునికి మాట ఇస్తాడు.ఒకనాడు వేటకెళ్ళిన రాకుమారులు ఏకలవ్యుని అకుంఠిత దీక్షను, విలువిద్యా సామర్ధ్యమును వీక్షించి, ఏకలవ్యుని కలిసి, మాట్లాడి వెంటనే వేటను మాని హస్తినకు తిరిగి వచ్చి ద్రోణునితో ఏకలవ్యుని గురించి చెప్పారు.గురువుగారు ఏకాంతముగా ఉన్న సమయమున అర్జునుడు.. సత్య సంధా! ధనుర్విద్యాకౌశలమున నాకంటెను, మీకంటెను అధికుడట మీ ప్రియ శిష్యుండు.. అని ఒకింత ఈర్ష్యతో పలుకగా..ద్రోణుడు వానిని జూతము రండని అర్జునుని తోడ్కొని అనవరత శరాసనాభ్యాస నిరతుండై యున్న ఏకలవ్యుకడకేగినారు. ఏకలవ్యుడు తన స్థావరానికి విచ్చేసిన గురువుగారిని సాదరంగా ఆహ్వానించాడు.అతిధి మర్యాదలు చేసాడు.ద్రోణాచార్యులవారు అన్నీ గమనించినా,ఏ విచారణ లేకుండా మౌనంగా ఉన్నారు. ఆయన రాకకు ఆనందించిన ఏకలవ్యుడు 'నేను మీ శిష్యుడను ' అని భక్తితో చేతులుజోడించి ఎదురుగా నిలబడ్డాడు."అయితే నాకు గురుదక్షిణిమ్మ"నాడు ద్రోణుడు. అందుకు ఏకలవ్యుడు సంతోషించి "ఇది నా దేహం, ఇది నా ధనం ఇది నా సేవక సమూహం" ఏది కావాలో అనుజ్ఞ ఇవ్వండి అని శిష్యుడనగానే,  ప్రియ శిష్యుడైన అర్జునుడే ధనుర్విద్యా కౌశలముతో, యుద్ధవిద్యలలో సాటిలేని మేటి వీరుడిగా ఉండాలన్న భావంతో, అర్జునునికి ఇచ్చిన మాట కొరకై " నీ కుడిచేతి బొటనవేలును కోసి ప్రీతితో నాకు గురుదక్షిణగా ఇవ్వు.అది నాకిష్టం"అని ద్రోణాచార్యులు శిష్యుడైన ఏకలవ్యుని అడిగాడు.   

  గురుస్థానంలో ఉండే వారెవరైనా శిష్యుడియొక్క ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ దాన్ని మనసులో పెట్టుకొని ఆశీర్వదిస్తూ, విధ్యార్ది శక్తికొలది సంతోషంగా గురుదక్షిణ ఇస్తే తీసుకొని తృప్తి పడతాడు.అలాంటి దాన్ని "గురుదక్షిణ" అంటారు.

 "ద్రోణాచార్యుడు ఏకలవ్యుని దక్షిణాంగుష్టమును గురుదక్షిణగా కోరుట భారతములో ప్రసిద్ధము.అది లవమే అయి ఏకలవ్య నామము సార్ధకమయ్యింది. చేతి బొటనవేలు బ్రహ్మసంకేతము కలది. దానిని ద్రోణుడు 'దక్షిణ 'గా కోరుట బ్రహ్మపరమైన దక్షిణను కోరుటే." 

  బొటనవేలే అన్నిటికీ పట్టు. బొటనవేలు లేకపోతే మానవుడు ఏ వస్తువునూ పట్టుకోలేడు.ఇక యుద్ధవిద్యలకు సంబంధించిన ఆయుధాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అన్నీ తెలిసి భక్తితో గురుదక్షిణ సమర్పించి ఏకలవ్యుడు 'శిష్యుడు ' అనే పదానికి శాశ్వత చిరునామాగా భారత కధనంలో అజరామరుడైనాడు.


ఏకలవ్యుని కృష్ణుడు వధించినట్లు మహాభారత కధనం.


ఏకలవ్యుడు మగధ దేశాధిపతి జరాసంధ చక్రవర్తి కొలువులో సేనాధిపతి;బలరామునితో గదా యుద్ధం చేసి చివరిలో ఒక దీవిని చేరి తలదాచుకున్నట్లు హరివంశ కధనం. 



ఏకలవ్యుని కధనమును గూర్చి ఎన్నో పరిశోధనలు, విశ్లేషణలు 
జరిగినా...అవన్నీ ఒకసారి పక్కకు పెట్టి ,గురు శిష్య కధనము ముఖ్యాంశముగా తీసుకుంటే గురువు ఎటువంటి వారైనా, గురువునే పరమాత్మగా తలంచి శిష్యభక్తితో   గురుదక్షిణ సమర్పించిన వైనం సమర్పిత భావనతో పరమాత్మ ౠణం తీర్చుకోవడం. 

 మన ఆలోచనలకు మూలం "పరమాత్మ" పరమాత్మ ఆదేశానుసారం ప్రతి ఒక్కరికీ "తాను మాత్రమే నిర్వహించాల్సిన పాత్ర" ఒకటి ఉంటుంది. అలాగే "తాను మాత్రమే అధిష్టించాల్సిన స్థానం ఒకటి ఉంటుంది". దానిని తెలుసుకొని ప్రవర్తించడమే ఈ లోకంలో "దైవ దత్తమైన కార్యం". భగవంతుడు, గురువు, ఆత్మ - మువ్వురూ ఒక్కటే.ఏకలవ్యునికి భగవంతుడే గురువై వచ్చి విలువిద్యలో సాటిలేని వాడిగా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అంటే ద్రోణుని  మట్టి  విగ్రహమే భగవంతుని రూపము.  గురువును భగవత్ స్వరూపంగా చూసుకొన్న ఏకలవ్యుడు గురుదక్షిణను సమర్పిత భావంతో శిష్యభక్తితో సమర్పించాడు.అందుకే వీరాగ్రేసరుడు ఏకలవ్యుడన్నారు.'ఏకలవ్య శిష్యత్వం' అని తెలుగు నానుడి!


  సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

      



Wednesday, February 17, 2016 1 comments By: visalakshi

అంగుష్టం - వేదాంతం - వైద్యం

                        "అంగుష్ఠం బ్రహ్మ సంకేతమైనది"

"అంగుష్ట మాత్ర: పురుష:, అంగుష్ట వై సమాశ్రిత:" అని వేదం చెప్తోంది. పరమపురుషుడు అంగుష్టాన్ని ఆశ్రయించి ఉంటాడని, అందుచేత అది పరమాత్మ స్వరూపమని మనవారు గుర్తించారు. అలా బొటనవ్రేలు యొక్క ప్రత్యేకత వేదాంతంలో భాగమైంది.బొటనవ్రేలుకు సంబంధించిన పరిజ్ఞానం భారతీయులకు తెలిసినంతగా ప్రపంచములో మరెవరికీ తెలియదంటే  అది అతిశయోక్తి కాదు. మనవారి దృష్టిలో చేతికున్న ఐదువ్రేళ్ళు పంచభూతాలకు ప్రతీకలు.అందులో అంగుష్టం అగ్నికి సంకేతం.  భారతీయ ప్రాచీన వైద్య విధానమైన యోగా లో ముద్రా చికిత్స - చేతికున్న ఐదువ్రేళ్ళతో జరుగుతుంది. ఈ వ్రేళ్ళ మధ్య అవసరమైన సమన్వయాన్ని బొటనవ్రేలు నిర్వహిస్తుంది.        

యోగా - ' ముద్రాచికిత్స '.....  

1. జ్ఞానముద్ర - (చిన్ముద్ర, ధ్యానముద్ర) - బొటనవ్రేలు చివరి భాగాన్ని చూపుడు వేలితో తాకించాలి.మిగతా వేళ్ళు నిటారుగా, విశ్రాంతిగా ఉంటాయి.



 ఉపయోగం: ఏకాగ్రత,ధ్యానం కుదురుతుంది. పనిమీద శ్రద్ధ కుదురుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.నకారాత్మక ఆలోచనలు పోతాయి.మానసిక వత్తిడులు అంతరిస్తాయి. సోమరితనం పోతుంది. నిద్రలేమితనం పోవటంతో,పాటు దివ్యమైన దృష్టినిస్తుంది.

2. వాయుముద్ర - బొటనవ్రేలును చూపుడువేలు కణుపుపైన పెట్టి క్రిందికి నొక్కిపట్టాలి. పక్షవాతం, గ్యాస్, మెడనొప్పి, వెన్నునొప్పి,మోకాళ్ళనొప్పులు, తుంటినొప్పికి అమోఘంగా 12 నుండి24 గంటల్లో పనిచేస్తుంది. 



3. ఆకాశ ముద్ర:-బొటనవ్రేలు మధ్యవేలుకు తాకించాలి. గుండెకు ఉపయోగకారి. శని ప్రభావం తొలగును. ఆగ్రహం వచ్చినపుడు ఈ ముద్ర వేస్తే 'శాంతి 'చేకూరుతుంది. ఈ ముద్ర నడిచేటపుడు, తినేటపుడు వేయరాదు. 


4. శూన్యముద్ర:- బొటనవ్రేలును మధ్యవేలి కణుపుపై ఉంచి,క్రిందికి నొక్కాలి. చెవిపోటు, చీము, చెవుడు రావు. థైరాయిడ్,గుండె సమస్య, గొంతునొప్పి, నరాల బలహీనత తగ్గిపోవును.దంతపు చిగుళ్ళు గట్టి పడును. ఇది కూడా నడిచేటపుడు, తినేటపుడు చేయరాదు.



5. పృధ్వీముద్ర:- బొటనవ్రేలు ఉంగరపువేలు కొనకు తాకించాలి. ఊబకాయం తగ్గును. జీర్ణశక్తి, జీవశక్తి, పవిత్ర భావాలు పెరుగును. శరీరం చైతన్యవంతమగును. విటమిన్ లోపాలు సరిజేస్తుంది, బలం పుంజుకుంటుంది. ఆజ్ఞాచక్రాన్ని(బొట్టు పెట్టుకునే తావు)ప్రభావితం చేస్తుంది.


6.సూర్యముద్ర:- బొటనవ్రేలు ఉంగరపు వ్రేలు కణుపుపై పెట్టి క్రిందకు నొక్కాలి. కొవ్వు కరుగుతుంది. సమత్వం పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. రోజూ ఉదయం 5 నుండి 15 నిమిషాలు చేయాలి. ప్రధానంగా బరువు తగ్గుతారు.నెల రోజుల్లో సుమారు 4 నుండి 6 కిలోల బరువు తగ్గుతారు.డయాబెటిస్, కాలేయ సమస్యలుండవు.  

7. వరుణముద్ర:- బొటనవ్రేలును చిటికెనవ్రేలుకు తాకించాలి. ఎండిపోయిన శరీరం తేమను సంతరించుకుంటుంది. గ్యాస్ట్రోఎంట్రిటీస్, మొటిమలకు బాగా పనిచేస్తుంది.

8. జలోదరనాశకముద్ర:- బొటనవ్రేలు చిటికెనవ్రేలి కణుపుపై ఉంచి క్రిందకు నొకాలి. శరీరంలోని అధిక నీటిని తగ్గిస్తుంది. జలోదర వ్యాధిని నివారిస్తుంది.
9. అపానముద్ర:- బొటనవ్రేలుమధ్యవేలు,ఉంగరపు వేలును తాకుతుంటుంది. చూపుడువ్రేలు, చిటికెనవ్రేలు నిటారుగా ఉంటాయి. వ్యర్ధ పదార్ధాలను బయటకు గెంటుతుంది. డయాబెటిస్ కు వరం. గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. పైల్సు అంతరిస్తాయి. కిడ్నీలు బాగుపడతాయి. వంటికి మేలు చేస్తుంది. చెమట పట్టేదాకా చేయాలి.ఉదర రోగ నివారణం.


10.  అపాన వాయు ముద్ర:-  బొటనవ్రేలును మధ్యవ్రేలు మరియు ఉంగరపువ్రేలును తాకించాలి. చూపుడువ్రేలి క్రింది భాగములో అదిమిపెట్టి ఉంచాలి. చిటికెనవ్రేలు నిటారుగా ఉంటుంది. దీన్నే 'హృదయ ముద్ర ' లేక 'మృత సంజీవనీ ' ముద్ర అంటారు. గుండె పాలిట వరం. వెంటనే ఫలితాన్నిస్తుంది. 'సార్బిట్ రేట్ ట్యాబ్లేట్ ' గా పనిచేస్తుంది. గ్యాస్, తలనొప్పి పోతుంది. ఉబ్బసం బి.పి లకు లాభకారి.

11. ప్రాణముద్ర:- బొటనవ్రేలు ఉంగరపువ్రేలును మరియు చిటికెనవ్రేలు చివరలను తాకుతుంది. మిగతావ్రేళ్ళు నిటారుగా ఉంటాయి. ఈ ముద్ర చాలా ముఖ్యమైనది. ఇది ఏ సమయములోనైనా, ఏ ఆసనములోనైనా, ఏ ఆసనం లేకుండానైనా ఎంతకాలమైనా చేయవచ్చును.రోజుకు 5 నిమిషాల చొప్పున చేస్తే కళ్ళజోడుతో పని ఉండదు. ఆకలి దప్పులు ఎక్కువ ఉండవు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

12. లింగముద్ర:- ఎడమచేతి బొటనవ్రేలు నిలువుగా ఉండాలి. ఎడమచేతి చిటికెన వ్రేలు కుడిచేతి చిటికెన వ్రేలికింద ఉండాలి. రెండు చేతులు వ్రేళ్ళు ఒకదాని మధ్యలో మరొకటి దూర్చాలి. వేడి జనిస్తుంది. పడిశమునకు శ్రేష్ఠము. ఉబ్బసం, దగ్గు, సైనస్, పక్షవాతము, రక్తపోటులను నివారిస్తుంది. కఫమును తొలగిస్తుంది. ఒంట్లో బరువు తగ్గుతుంది. కొవ్వు కరుగుతుంది.


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

 అంగుష్ఠం బొటనవ్రేలుకు సంబంధించి....ఏకలవ్యుని కధ తదుపరి టపాలో.....