Sunday, April 30, 2017 0 comments By: visalakshi

సాయిబాబా మాటే వేదం..

 ఓం శ్రీ సాయినాధాయ నమో నమ:




పరమాత్మ,పరంధాముడు అయిన ఆ అంతర్యామి శ్రీ బాబా 1918వ సంవత్సరం విజయదశమినాడు సమాధిలోకి వెళ్ళేముందు, తమ భక్తులందరికీ ఇలా ధైర్యం చెప్పారు. 

వీడినా యీ భౌతిక దేహమ్ము
వస్తాను పరుగున భక్తుల కోసమ్ము
అనుభవం మీద తెలుసుకొందురు
సాయి అనంతుడు, అంతర్యామి అంటారు.

భక్తులందరూ వేనోళ్ళ కీర్తించే బాబాగారు.. నా అనుభవాలలో మా కోసం మమ్ములను ఈ జీవిత మాయామోహాలనుండి నిదానంగా విముక్తి చేసే ప్రయత్నంలో ఎన్నో సమస్యలను ఎదురీదే నేర్పును, కష్టనష్టాలను తట్టుకొనే శక్తిని ఆయనే కల్పిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కష్టాలకు కృంగిపోయి బాధపడ్డా..ఆనందానికి అతిగా సంతోషపడ్డా రెండూ సమతుల్యములో చూడరా..అన్నీ నీ మనస్సును బట్టే జరుగుతున్నాయి అని మరుక్షణం తెలిసేటట్లు చేస్తారు బాబాగారు.




 ఏ వ్యవహారములో నయినా విపరీతంగా ఆలోచించి..ఇలా ఎందుకు జరిగింది..ఎవరిది లోపం అని ఆలోచిస్తూ.. రాత్రి పగలూ వేదన పడి.. ఆయన సమక్షములో ధ్యానం చేసుకొని ఒక నిశ్చింతతో బయటకు రాగానే ఆ వ్యవహార కార్యక్రమము అతి సునాయసంగా మనకు తెలియకుండానే సుగమము చేస్తారు బాబాగారు. మళ్ళీ అవే సమస్యలు మరో కోణంలో మళ్ళీ వేదన.. ఇదే జీవితం...

 ఈ మాయామోహాల సుడిగుండంలో మనం దిక్కుతోచక భగవంతుడి ముందు ఆక్రోశంతో మన కోరికల చిట్టాను ఆయనకు వెల్లడి చేస్తాం.. ఒకటి తీరింది ఆనందం.. ఇంకొకటి వెంటనే మరల ఆయనముందు మోకరిల్లి మరల కోరిక... వీటికి అంతు ఉండదు. అంటే మన ఆశలకు అంతులేదు. పుడుతూనే కోరిక... అడుగడుగునా కోరిక.. మరణంలోనూ కోరిక... ఎంతటి మహానుభావుడైనా నాకెలాంటి కోరిక లేదు అనడం శుద్ధ అబద్ధం. కోరికలను వీడి భగవంతుని నిజమైన ఆర్తితో ఎప్పుడు చరణాలను పట్టుకొని శరణాగతుడైయ్యే వరకు వారి కోరికలను సన్మార్గములో తీరుస్తూ తనదరికి చేర్చుకొనే సమయముకై భక్తునకు జ్ఞానమార్గమును తెలుపుతూ నిరీక్షిస్తాడు భగవానుడు.  

కోరికలను జయించి, జ్ఞానప్రాప్తికై భగవంతుని శరణు వేడి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించే మహాయోగులకు కూడా సంకల్పం ఉంటుంది. అదే మోక్షప్రాప్తికై వారి సంకల్పం. సంకల్ప సిద్ధులకు చరాచర వస్తువులన్నిటిలోనూ అంతర్యామియై ఈశ్వరుడు వెలుగుచున్న తత్వము గోచరించును. అది ఈశ్వర సంకల్పము.వీరు నిర్వికల్పసమాధి సులభముగా కలిగి ఉందురు. పరప్రేరణ మాత్రము చేతనే వీరు లోకోద్ధారక బుద్ధి కలిగియుండును. లేనిచో ఎల్లప్పుడు ఆత్మారాములై యుందురు. వీరు సంకల్పించిన మాత్రముచేత సర్వసిద్ధులును కలుగవలసిన ఏర్పాటు గలుగును. అణిమాద్యష్టసిద్ధులు... అణిమాది అష్టసిద్ధులు :- అణిమా సిద్ధి! లఘిమా సిద్ధి! గరిమా సిద్ధి! మహిమా సిద్ధి! ఈశిత్వ సిద్ధి! వశిత్వ సిద్ధి! ప్రాకామ్య సిద్ధి! ప్రాప్తి సిద్ధి!   వీరి సేవ కొరకు నిరీక్షించుచుండును. దు:ఖము వీరు ఎరుగరు. వీరికి బేధము సంపూర్ణముగా నశించును. వీరి వర్తనము ఏ రీతిగా ఉండునని చెప్ప సాధ్యము కాదు. నిధినిషేధములతో కూడియు కూడకయు ఉందురు. వీరే యదార్ధమైన మహాత్ములు. లోకోద్ధారకులై ఉందురు. వీరు ఎట్లుండినను జీవన్ముక్తులే. 




నిస్సంకల్పము:- నిస్సంకల్పము గలవారు విదేహముక్తులు. వీరికి దృశ్య, దర్శన, దృక్కులు ఏకమై ఉండును. ధ్యాతృ, ధ్యాన, ధ్యేయములనెడు త్రిపుటి లయించి ధ్యేయాకారమై యుందురు. వీరికి ఏ సంకల్పము ఉండదు. నిస్సంకల్పులై యుండును. వీరికి జరుగవలసిన దంతయు స్వయముగానే జరుగుచుండును. పరప్రేరణ చేతనైనను సంకల్పము కలుగదు. అణిమాది అష్టసిద్ధులు..అణిమాది అష్టసిద్ధులు :- అణిమా సిద్ధి! లఘిమా సిద్ధి! గరిమా సిద్ధి! మహిమా సిద్ధి! ఈశిత్వ సిద్ధి! వశిత్వ సిద్ధి! ప్రాకామ్య సిద్ధి!   ప్రాప్తి సిద్ధి! వీరిని సేవించుచుండును. అంతేగాక త్రిమూర్తులుగూడ వీరి కార్యములలో నియుక్తులవలె ప్రయత్నింతురు. అదే పరిపూర్ణము, శివము, అద్వైతము, అమృతము, ఆనందము, అచలము, శాంతము, సంపూర్ణసౌఖ్యము, మౌనము. వీరు బహుజన్మములలో నుండి బ్రహ్మనిష్ఠయు, గురుభక్తియు కలిగి పుణ్యకర్మానుష్ఠాన పరిపక్వత చేత వచ్చినవారు. ఇది కడసారిజన్మము. నిర్మలాకాశమునందు భాస్కరుడు ప్రకాశించుచున్నట్లు వీరు ఎల్లప్పుడున్ను స్వస్వరూపులై వెలుగుచుందురు. వీరి జన్మము వలన లోకము జ్ఞానలోకమై యుండును. సరస్సులో గల కమలములు సూర్యోదయమున వికసించునట్లు వీరి అవతారముచే భక్తుల హృదయము సంపూర్ణముగా వికసించును. జనులు కృతార్ధులగుదురు. వీరే భగవంతుని అవతార స్వరూపాలు. 


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు 
  






Thursday, April 27, 2017 0 comments By: visalakshi

వైవాహిక జీవితం




 మీ వైవాహిక జీవితం గురించి నీ స్పందన ఏమిటి? అని సరదాగా అడిగింది..    నా అంతరంగిక స్నేహితురాలు  . తనకి నేను సమాధానం చాలా వివరంగా చెప్పాను. కానీ ఒకసారి నన్ను నేను తరచి చూసుకున్నాను. నా వైవాహిక జీవితంలో 29 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ఒడి దుడుకులు...అయినా అన్నిటినీ సమానంగా తీసుకున్న మా కుటుంబ ఔన్నత్యం నాకు సంతోషాన్నిస్తుంది. ఒక క్రమశిక్షణ గల భర్త, ఆ క్రమ శిక్షణను పాలించిన మా పిల్లలు. అంతే ప్రేమతో అమ్మా,నాన్నలపై గౌరవం.. ఒక వయసు వరకు మా అదుపాజ్ఞలలో ఉన్నా వారి స్వతంత్ర నిర్ణాయాలకు ఎప్పుడూ మేము కూడా గౌరవమిచ్చాము. భార్య అంటే ఇలా ఉండాలి అని నన్ను చూసి బహుశా ఎవరూ అనుకోక పోవచ్చు..కానీ భర్త అంటే ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కరూ మావారిని చూసి అనుకుంటారని నా అభిప్రాయము. అది నూటికి నూరుపాళ్ళూ నిజం. అంతటి ప్రేమతత్వాన్ని వారితో అనుభవించాం మా కుటుంబ సభ్యులం. కోపం లేదు అనుకుంటే పొరపాటే..కానీ ఆ కోపం వెనకాల ప్రేమ మరింత గోచరిస్తుంది.

 ఒక్క కుటుంబ సభ్యుల మధ్యే కాక అందరితోటి చాలా కలివిడిగా ఎప్పటినుండో ఆత్మీయులు అన్నట్లు అందరితో ప్రేమగా ఉంటారు. అది కొంతమంది అలుసుగా తీసుకొని అవమానాలు చేసినా.. మాన అవమానాలను సమంగా తీసుకొని చిరునవ్వే సమాధానంగా శతృత్వం అనేది లేకుండా క్షమించే మనసున్నవారు శ్రీవారు.

 నేను అనబడే నాకు.. కొంచం అసహనం ఎక్కువ.. తొందరపాటుతో విషయాన్ని అపార్ధం చేసుకున్నా తప్పుని గ్రహించినా పిల్లలముందు మళ్ళీ తక్కువైపోతానని మొండిగా వాదించి గెలుస్తాను అప్పుడప్పుడు.. కానీ ప్రేమతో వాళ్ళు ఏమన్నా సంతోషంగా స్వీకరిస్తాను. మంచి మనస్తత్వమే అని అనుకుంటున్నాను.

  పాప, బాబు, అల్లుడు ఇంచుమించు ఒకే వయసు వారు ..మా అల్లుడు మాకు మా అబ్బాయే. తనని అంతే చనువుతో చూస్తాము. చాలా నెమ్మదస్తుడు. అత్తమ్మా,మామయ్యా అంటూ ఆప్యాయంగా పలకరిస్తాడు. మృదుస్వభావి. ప్రేమతత్వంతో అందరినీ  ఆదరిస్తాడు. అడిగిన వారికి కాదనకుండా సహాయం చేసే స్వభావం. ఇంటా,బయటా అందరి మన్ననలను పొందుతాడు. తల్లిదండ్రులంటే ప్రేమతో కూడిన గౌరవాభిమానం. చెల్లి అంటే ప్రాణం.  ఆధ్యాత్మిక  అవగాహన ఉంది, భక్తితత్వం ఉంది. అన్ని దేవాలయాలు భక్తితో దర్శించారు మా అల్లుడు, పాప, వారి కుటుంబం. బాబాగారి ఆశీస్సులు మా అల్లుడికి సదా ఉన్నాయి. స్నేహమయుడు  నాఅల్లుడు..



  మా పాపకి...అమ్మ అంటే ప్రేమ..తనే ఒక అమ్మై నన్ను చూసుకుంటుంది. తమ్ముడు అంటే ప్రాణం. నాన్న అంటే పంచప్రాణాలు. పెళ్ళి అయ్యాక ఇవన్నీ కలగలిపి అంటే అన్నీ తానే అయిన భర్త అంటే తనకి  సర్వస్వం . తన భర్తే తన ధైర్యం.. అంటే బలం..బలహీనత అని చెపుతుంది. అందరినీ ప్రేమిస్తుంది అందరికీ ప్రాధాన్యతనిస్తుంది. అది అర్ధం చేసుకునే మనసులకు తన పరిణత తెలుస్తుంది. బంధు మిత్రులంటే చాలా ఇష్టం.. వారితో సమయం సరదాగా గడుపుతుంది. ఇక షాపింగ్ అంటే ఎనలేని ఇష్టం.. అన్నీ ఇష్టంగా కొంటుంది.. కానీ ధరణకి, ధారణకి ఏమీ నచ్చవు.. ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలంటే మళ్ళీ షాపింగ్...చిన్నప్పటి నుండీ ఇదే సాగుతోంది.ఆధ్యాత్మిక అవగాహన ఉంది. షిర్డీసాయి భక్తురాలు. మరియు బాబాగారి ఇష్టపుత్రిక. చాగంటివారి రామాయణ ప్రవచనాలు విని శ్రద్ధగా రామాయణం చదివి, నాకు కూడా కొన్ని వివరించింది. ఇతరులకు సహాయం చేయడం, వారి బాధను తనదిగా పాటించడం పరిపాటి. కష్టాల్లో ఉన్నవారందరూ తన బంధువులే అన్నట్లుగా వారిని దరిచేర్చుకొని వారిని ఓదారుస్తుంది. కాబట్టి స్నేహమయి, ప్రేమమయి..నా పుత్రిక.

 మా బాబు.అందరినీ ప్రేమిస్తాడు. ఒకరి ప్రేమకై ఎదురుచూడడు. ఎవరినీ విమర్శనాత్మకంగా చూడడు. మీ నాన్నగారే మళ్ళీ పుడుతున్నారోయి అన్న మా శ్రీవారి మాటలను నిజం చేస్తూ.. మా నాన్నగారు నాకు మళ్ళీ కుమారుడుగా జన్మ తీసుకున్నారు. వాళ్ళ అక్కతో పోలిస్తే అల్లరి తక్కువే..చాలా నెమ్మదస్తుడు. అలా అని తనని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోడు. అమ్మా,నాన్న అంటే ప్రేమతో కూడిన గౌరవం. అక్కా, బావా అంటే చాలా ఇష్టం. ఏ వ్యవహారమైనా వారిద్దరినీ సంప్రదించి చేస్తాడు. అక్కే తనకు స్పూర్తి. తనని తాను గౌరవించుకుంటూ అందరినీ గౌరవిస్తాడు. మనసులోని తన భావాలను తొందరగా బయటకు తెలియనీయడు. మా బాబు అంటూ ఉంటాడు. నన్ను ఎవరితో పోల్చవద్దు. నేను నేనే..ప్రత్యేకం ..అని 'మా అన్నయ్య కూడా తనని అలాగే అంటాడు. తనకి తనే ప్రత్యేకం. అని మా బాబుని చూసి ఆనందపడేవాడు.' ఎవ్వరినీ ఒక్క మాట అనడు. కోపం వచ్చినా ఎవరిముందు ప్రదర్శించడు. సమయస్పూర్తిగా వ్యవహరిస్తాడు. ఆంజనేయస్వామి భక్తుడు. సుందరకాండ, రామాయణ గ్రంధాలను పఠించాడు. బాబా అనుగ్రహం చవి చూసి వినమ్ర భక్తుడయ్యాడు. రామాయణ మహాకావ్యంలో ఏమైనా సందేహాలుంటే మేము మా బాబుని అడిగి తెలుసుకుంటాము. రాముడుని ఆదర్శంగా తీసుకుంటాడు   నా పుత్రుడు.

 ఇలా ఆనందంగా సాగిపోతున్న నా జీవితంలో చిన్న..చిన్న  స్పర్ధలు మా మధ్య వచ్చినా అవి తామరాకు మీద నీటిబొట్టులాంటివే.. కాబట్టి నా జీవితంలో  వైవాహిక జీవితం  ఆనందమయ జీవితము. ఉత్సాహపూరిత ఆదర్శకుటుంబం మాది అని సగర్వంగా చెప్పుకోగలను. 


  సర్వం శ్రీ సాయినాధార్పితం..



   

  
Sunday, April 23, 2017 0 comments By: visalakshi

జీవనశైలి-విధానం

ఒక కుటుంబములో నలుగురు సభ్యులుంటే ఆ నలుగురి మనస్తత్వాలు ఒకే రీతిలో ఉండవు. విభిన్న అభిరుచులు అభిప్రాయాలు ఉంటాయి. కానీ ప్రముఖ నిర్ణయాలకు మాత్రము సంప్రదింపులతో ఏకాభిప్రాయముతో ఒక నిర్ణయము తీసుకొని అమలుపరుస్తారు. అలాగే  ఒకరికొకరు అని మమేకమై మైత్రీ భావనతో ఉన్న ఇద్దరు ప్రాణ మిత్రుల అభిప్రాయాలు కూడా ఒకేలా ఉండాలని లేదు. అభిరుచులు అసలు కలవకపోవచ్చు. వారి జీవన విధానము కూడా భిన్నంగా ఉండవచ్చు. వారి ఆలోచనా శైలి వేరుకావచ్చు. కానీ వారు  .. ఒకరి ఆలోచనలను ఒకరు గౌరవిస్తారు. ఒకరి అభిప్రాయలకు ఒకరు విలువనిస్తారు. ఇరువురి ఆలోచనా శైలిని ఒకరితో ఒకరు పంచుకుంటారు.   







కుటుంబములో కలతలూ కలహాలు సహజము. కానీ ప్రేమతో అవన్నీ సమసి పోయేలా మనం మలచుకుంటాము. మైత్రిలో అసలు కలతలూ, కలహాలు రాకూడదు. వచ్చినా ఆ ఇద్దరిలో ఏ ఒక్కరైనా సమర్ధవంతంగా వాటిని దూరం చేసి మనసుతో, మమతను తెలిపి మనసుకు హత్తుకునే మాటలతో మధుర భావనను ఆ స్నేహములో నింపాలి.  ఒక కుటుంబం, స్నేహం, బంధములను 
ఏకాభిప్రాయముతో ఎలా సత్సంబంధాలను నెలకొల్పుకుంటున్నామో... అలాగే మన భారతదేశంలో మత సంబంధమైన ఆదర్శాలు వందల శతాబ్దాలుగా ప్రభవిస్తున్నాయి. మనం  ఆదర్శాల మధ్యన పుట్టి పెరుగుతున్నాం. ఇవి మన రక్తంలో ప్రవేశించి, నరాల్లో స్పందిస్తూ, శరీరతత్వంలో ఒక భాగమై, మన జీవనశక్తిగా మారిపోయాయి. 





మన భారత హృదయం మతభావ పూరితం. ఆ తరువాతే మరొక దానికి స్థానం. మన ప్రాణాధారమైన రక్తం ఆధ్యాత్మికత.ఈ ప్రాణాధార రక్తం స్వచ్చంగా, బలంగా, శక్తిసంపన్నంగా ప్రవహిస్తే చాలు. రాజకీయ, సాంఘీక ఇతర ప్రాపంచిక లోపాలన్నీ, చివరికి మన దేశ దారిద్ర్య చిహ్నాలన్నీ కూడా చక్కదిద్దబడుతాయి. రాజకీయమైనా, సాంఘీకమైనా ఏదైనా సరే ప్రబోధించదలుచుకుంటే దానికి కావలసిన ఒకే అంశం - ఆధ్యాత్మికశక్తి ఎంతగా ద్విగుణీకృతమవుతుందో చెప్పాలి. ఏ ఇతర జ్ఞానమైనా మనబాధలను స్వల్ప వ్యవధి వరకే తొలగించగలదు. శాశ్వతంగా మన బాధలను తొలగించగలిగేది ఆధ్యాత్మిక జ్ఞానమొక్కటే." మత భావాలను భగ్నపరచకుండా సామాన్య ప్రజల సముద్ధరణాన్నే మన లక్ష్యంగా మన ముందుంచుకోవాలి".




 మంచి విషయం ప్రతిదీ ఇతరులనుండి నేర్చుకోవాలి. కానీ దాన్ని స్వీకరించి, నీ సహజ శైలిలో ఆకళింపు చేసుకోవాలి. మనం ఇతరులలా మారిపోకూడదు. మన భారతీయ జీనంలోంచి బయటకు రావడానికి అంగీకరించవద్దు. భారతీయులందరూ వేరే జాతులలా వేషం ధరించి, భుజించి, ప్రవర్తిస్తే భారతదేశ స్థితి ఏదో బాగుపడిపోతుందని ఒక్క క్షణం పాటైనా అనుకోకండి. పిరికితనంతో కూడిన అనుకరణ మనిషి పతనానికి ప్రత్యక్షచిహ్నం.  అవన్నీ పై పై మెరుగులే అని గుర్తించి మన భారతీయ జీవనశైలిని, ఆ విధానాన్ని గౌరవించి అనుసరించండి. మన హిందూ ధర్మాన్ని నిర్వర్తించి అభ్యుదయాన్ని సాధించండి.



 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు..

అంతరాత్మ(నువ్వే నేను)

 ఓం శ్రీ సర్వేశ్వరాయ నమో నమ: 





జ్ఞానంతో కూడిన భక్తే నిజమైన శరణాగతి. తనను తాను విచారించుకోవటం వలన జ్ఞానం లభిస్తుంది. కనుక సాధన విచారణతో ఆరంభమై, సమర్పణతో ముగుస్తుంది. భక్తి భావనతో హనుమంతుని ద్వైత ప్రయాణం శ్రీరామునితో అభేదాన్ని గుర్తించడంతో అద్వైత దర్శనంగా పరిణమించి, గమ్యస్థానాన్ని చేరుకుంది. హనుమంతుడు రామచంద్రునితో ఈ విధంగా తెలియజేశాడు.

 శ్లో"   దేహబుద్ధ్యా తు దాసో2హం జీవబుద్ధ్యా త్వదంశక: !
        ఆత్మబుద్ధ్యా త్వమేవా2హం ఇతి మే నిశ్చితా మతి: !!

" ఓ శ్రీరామా! దేహబుద్ధి కలిగి ఉన్నప్పుడు నేను నీ దాసుడను. జీవబుద్ధితో ఉన్నప్పుడు నేను నీ అంశను. ఆత్మబుద్ధియందు (అనగా 'నేను ' అనే భావన శుద్ధమై నిలిచినపుడు)' నీవే నేను ' అని తెలుసుకుంటున్నాను." ఈ విధంగా భక్తి, జ్ఞానాలు విరుద్ధమైనవి కావు అని మనకు సుస్పష్టంగా తెలియజేసినవాడు  హనుమంతుడు.

 భక్తి మార్గానికి, జ్ఞాన మార్గానికి వైరుధ్యం లేదు. వాస్తవానికి, పర్యవసానంలో రెండూ ఒకటే. భక్తితో నిజమైన నేనును అర్పిస్తే, మిధ్యా నేను పోతుంది. విచారణ ద్వారా నేను పుట్టుక స్థానాన్ని వెదికితే, ఈ మిధ్యా నేను అదృశ్యమౌతుంది.

  "నేను" అను తలపు పుట్టిన తర్వాతే ఈ "నేను"ను ఆశ్రయించుకొనే -క్షణ క్షణం మారే తలపులు పరంపరగా పుడుతున్నాయి. కనుక ఈ "నేనెవరు"? అని నిరంతరం ప్రశ్నిస్తే ఈ నేను అదృశ్యమై నిజమైన "నేను"  అనుభవం అవుతుంది.

ఆత్మ నుండి "నేను" అను ప్రధమ తలంపు పుడుతుంది. నేను పుట్టగానే తల్లిని మర్చిపోయి దేహమే తాననుకుంటోంది. కనుక "నేను" పుడుతూనే తల్లిని(ఆత్మను) హత్య చేస్తోంది. ఈ "నేను"ను పూర్ణమైన భక్తితోజగజ్జనని పాదాలముందు అర్పిస్తే ఆ జగజ్జననియే నీలో నుండి వెలుగుతుంది. ఇలా దేహమే తాను అనుకున్న వారందరూ తల్లిని చంపిన వారే. "నేను"ను చంపిన వాడే తల్లిని బ్రతికించినవాడు. 

అంతరాత్మ ప్రబోధము:    నువ్వు ఎవరో తెలుసుకో.దీనికి శాస్త్రాలూ, పాండిత్యమూ అక్కర్లేదు. 

 నిజమైన "నేను" అనేది మహామంత్రం. ఇది ఓంకారం కన్నా శక్తివంతమైనది. ఇది భగవంతుని మొదటి నామం.  "నేనెవడను"? అను ప్రశ్న ద్వారా అంతర్ముఖుడవై నీ హృదయంలోని ఆత్మను "నేను"ను అన్వేషించు. భగవంతునకు శరణాగతి చెందు.  



అనుక్షణం తన అసమర్ధతను తెలుసుకొని, "నాదేమీ లేదు. ఓ సకలేశ్వరుడా! అంతా నీదే" అని ప్రార్ధిస్తూ "నేను - నాది" పూర్తిగా భగవంతుని పాదాలకు అర్పించాలి. నీతో భగవంతుడు ఏమి చేయించదల్చుకున్నాడో అది చెయ్యటానికి సిద్ధంగా ఉండాలి. నాకు ఇది కావాలి, అది కావాలి అని గానీ నాకు ఈ రూపంతో లేక ఆ రూపంతో సాక్షాత్కారం కావాలనే కోరిక, భక్తునిలో ఉన్నంత వరకు శరణాగతి పూర్ణం కాదు.( శరణాగతి అన్న నేను మొన్న బాబాగారిని ఏ రూపంలో దర్శనమిస్తావు బాబా..) అని అడిగాను.. నా ప్రశ్నకు ఇలా సమాధానం నాచేత రాయిస్తున్నారు. నీ శరణాగతి పాక్షికమా అని నన్ను ప్రశ్నిస్తున్నారు..లేదు బాబా క్షమించండి..."నిజమైన శరణాగతి అంటే భగవంతుణ్ణి ప్రేమించడం.. అహంకారాన్ని నాశనం చేయడం అని తెలుసుకున్నాను." ఆత్మను తెలుసుకొని, ప్రారబ్ధాన్ని జయించి, పూర్ణ శరణాగతి  చెందుతున్నాను  బాబా...

 మనస్సు బయటకు వచ్చినప్పుడు విషయాలలోనూ,ఆలోచనలలోనూ చిక్కుకుంటుంది. లోపలికి మరలినపుడు అది ఆత్మగా మారిపోతుంది. లోపలికి మరలిన మనస్సునే శుద్ధ మనస్సు అంటారు. 

మనం భగవంతుని స్మరించాం అంటే అది భగవంతుడు అనుగ్రహించిన వరం అన్నమాట. అనుగ్రహం భగవంతుని గుణం కాదు. అనుగ్రహమే భగవంతుడు. దేవుని అనుగ్రహం లేనిదే దేవుణ్ణి స్మరించలేం.  




 ప్రతి ఒక్కరినీ భగవంతుడు కనిపెడుతూనే వున్నాడు. ఆయనే అందరినీ సృష్టించాడు. కొన్ని కోట్ల జీవులలో నీవూ ఒక్కడవు. అందరినీ ఆయన చూస్తున్నప్పుడు నిన్ను ఒక్కడినీ చూడకుండా ఉంటాడా? ప్రతి ఒక్కరిని భగవంతుని శక్తి లోబరుచుకొని నడుపుతోంది.అందుకే భక్తులు భగవంతునికి శరణాగతి చెంది "నీ యిచ్చయే నెరవేరు గాక" అంటూ ప్రార్ధన ముగిస్తారు. భగవంతుని యిచ్చే సర్వకాల సర్వావస్థలలోనూ నెరవేరి తీరుతుంది. మనచేత భగవంతుడు ఏ పని ఏ సమయములో జరగాలో ఆ సమయములో జరిపించి తీరుతాడు.

భగవంతుడు జగజ్జనకుడు. ఆయన సదా మనచుట్టూ, బయటా, లోపలా అంతటా ఆవరించే ఉన్నాడు. తన బిడ్డల క్షేమం తండ్రికంటే విచారించేదెవరు? మనలను సదా రక్షిస్తున్నాడన్న సత్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసించాలి. భగవంతుని అనుగ్రహంతోనే ఆధ్యాత్మిక జీవిత ఆరంభమూ, ముగింపూ కూడా...........         రమణుల వారి దివ్య భాషణములు....



 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు



     












  
Friday, April 21, 2017 1 comments By: visalakshi

శుద్ధమౌనం

 ఓం శ్రీ నమో నారాయణాయ నమో నమ:

   మౌనమే ఉత్తమోత్తమమైన ఉపదేశం. పరిణతి పొందిన వారికి మాత్రమే ఇది సంతృప్తినిస్తుంది. సాధారణులకు మాటల ద్వారా బోధిస్తేనే సంతోషపడతారు. సత్యం మాటలకు అందేది కాదు. ఉపన్యాసాలు కొద్ది మందికి మాత్రమే తాత్కాలికమైన మార్పును ఇస్తాయి. మౌనము సర్వులకు శాశ్వతమైన పరివర్తనాన్ని అనుగ్రహిస్తుంది. మౌనమే ఆత్మకు మారు పేరు. మౌనము నాలుగు విధములు. వాజ్మౌనము, నేత్ర మౌనము, కర్ణ మౌనము, మానసిక మౌనము ఇదియే శుద్ధమౌనం. ఇదే ప్రధానమైనది. దక్షిణామూర్తి మౌనం ద్వారానే సత్యాన్ని ప్రబోధించారు.
  
 మౌనమే అనంత భాషణం.. అదే ఒక్కమాట.. అదే నిక్కమైన యిష్ఠాగోష్ఠి.. మౌనము నిరాటంకమైన విద్యుత్ ప్రవాహము వంటిది. కొన్ని వందల ఉపన్యాసాలు, గ్రంధాలు చేయలేని పనిని, జ్ఞాని కొన్ని క్షణాలలో మౌనం ద్వారా సాధకునిలో వివేకాన్ని నింపగలడు.




    మౌనమంటే మాట్లాడకుండా ఉండటం కాదు.ఎక్కడ నుండి ఆలోచన, మాట పుడుతున్నదో, అదే మౌనం. సంకల్పరహితమైన ధ్యానం. ఇదే నిజమైన భాషణ. మాట నిరంతరం మౌనభాషణను నిరోధిస్తుంది. మౌనం సమస్త మానవాళిని అభివృద్ధి పరుస్తుంది.  సదా ఆత్మచింతనమే మౌనం.

 మానవుడు తన నాలుక అగ్రభాగాన్ని కదిలిస్తూ మాట్లాడే శక్తిని కలిగి ఉంటాడు. మాట్లాడటమనే పని వాణితో ఆరంభమై ,చెవితో ముగుస్తుంది. ..వాక్కు - అర్ధం - వాణి... వాక్ అంటే పార్వతి, అర్ధమంటే పరమేశ్వరుడు. మనస్సు ఆలోచించేదే వాణి ద్వారా వ్యక్తమవుతుంది. సృష్టి ద్వారా కూడా పరమేశ్వరుని జ్ఞానం వ్యక్తమవుతుంది. 






 పరమాత్ముడు సృష్ట్యాదిలో మానవుని సృష్టించి నప్పుడు వారు అంతకు పూర్వం బాగా వికసించిన బుద్ధిజీవులు. గత జన్మ సంస్కారాల వలన వారికి లోపలనుండి ప్రేరణ వచ్చింది. వారు ప్రతి భావానికి పదార్ధానికి ఒక పేరు పెట్టి దానిని వాణి ద్వారా వ్యక్తం చేయసాగారు. వాణికి ఏదైనా మాట్లాడమని లోపలనుండి నైసర్గిక ప్రేరణ కలుగుతుంది. మనమేమీ మాట్లాడకపోతే లోపలే వాణి సూక్ష్మంగా అవ్యక్తరూపంలో మాట్లాడుకుంటుంది. ఈ ప్రేరిత వాక్కే మనుష్యజనిత ప్రధమ వాక్కు. అది భాష. ఈ భాష విద్వాంసులైన ఋషుల విజ్ఞానం వారి శుద్ధమైన మనస్సులలో నిగూఢంగా దాగిఉంది. ఇది వారు అనేక జన్మలలో పుణ్యఫలంతో సాధించిన జ్ఞానం. ప్రేమపూర్వకంగా దానిని ఇతరులకు తెలుపమని వారికి లోపలనుండి ప్రేరణ కలుగుతుంది. ఇదే ఆ భాషకు-భావనకు శుద్ధ స్వరూపమవుతుంది. 

బృహస్పతి అనే శబ్దానికి పరమాత్ముడు అనే అర్ధం ప్రధమంగా గ్రహించాలి. అలాగే వాచస్పతి అంటే వాక్కుకు పతి పరమాత్ముడు. వాక్కు పరమేశ్వర ప్రసాదితం. ఆ వాక్కు-వాణి  సరస్వతి నిలయం కావాలి. వాగ్ధేవియై వర్ధిల్లాలి అనేది ఋషుల శుభసందేశం. వాచస్పతి వాణి (వేదం) జ్ఞానానికి ఆశ్రయమై ఉండాలని వాణిలో నుండి వెలువడే ప్రతి పదం మధురమై మహత్తరమై మనోరంజకమై విరాజిల్లాలని మానవులకు పరమాత్ముని ఉపదేశం. 


 సర్వం శ్రీసాయినాధార్పణ మస్తు 









  
Thursday, April 20, 2017 0 comments By: visalakshi

ఆది వరాహస్వామి అవతార వైశిష్ట్యం

  ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమ:

 పరమాత్మ-అంతర్యామి పోస్ట్ లో రెండవ అవతారమును వివరించమని ఇద్దరు మిత్రులు కోరారు..వారి అభీష్టము మేరకు నా ఈ వివరణ....

 భూమి మొదట పాతాలగతమై ఉన్నది. దానిని పైకి తెచ్చి యధాస్థితిలో నిలిపితేగానీ సృష్టిని ప్రారంభించుటకు వీలుగాదు. భగవంతుడు వరాహావతారమెత్తి భూమిని ఉద్ధరించినాడు. "వర" అనగా శ్రేష్ఠమైనది. "అహము " అనగా దినము అని అర్ధము. "వరాహము" అనగా శ్రేష్ఠమైన దినము అని అర్ధము. ఏ దినమున సత్కర్మ జరుగునో, భగవద్గుణము ఏ రోజున హృదయమునకు హత్తుకొనునో ఆ దినమే శ్రేష్ఠమైన దినము. లోభగుణమును హరించేవాడు వరాహమూర్తి.






 శ్రీమహావిష్ణువు ఆదివరాహస్వామిగా అవతరించి భూదేవిని రక్షించి తిరుమలలో నిలిచాడు.  తిరుమల క్షేత్రంలో వెలసిన మొట్టమొదటి దైవం శ్రీ వరాహస్వామి. అందువల్లనే "తిరుమల" ఆదివరాహక్షేత్రమని ప్రసిద్ధి పొందింది. తిరుమలలో శ్రీస్వామి పుష్కరిణికి వాయువ్యమూలలో తూర్పుముఖంగా శ్రీవరాహస్వామి ఆలయం ఆది వరాహ క్షేత్రముగా ప్రసిద్ధి పొందింది. కలియుగములో శ్రీనివాసుడు వైకుంఠం నుండి ఇక్కడకు వచ్చి తాను ఉండడానికి శ్రీవరాహస్వామివారిని 100 అడుగుల స్థలాన్ని దానంగా అడిగాడు. "ప్రధమ దర్శనం, ప్రధమ పూజ, ప్రధమ నైవేద్యం " అను నియమ ఒప్పందంతో దానపత్రం రాసిచ్చి, 100 అడుగుల స్థలాన్ని దానంగా శ్రీనివాసుడు పొందినాడు. ఆ తర్వాతి కాలంలో ఆ క్షేత్రంలో భక్తకోటి నీరాజనాలతో తన ప్రాబల్యాన్ని పెంచుకున్నాడు శ్రీవేంకటేశ్వరస్వామి. ప్రస్తుతం ఆనాటి నియమం ప్రకారమే నేటికీ తిరుమలలో శ్రీభూవరాహస్వామికి తొలిగా పూజా నివేదనాదులు అన్నీ సక్రమంగా జరుపబడుతున్నాయి. అంతేగాక శ్రీవరాహస్వామివారికి వలసిన నివేదనలు, పూజాసామాగ్రి, వగైరాలన్నీ శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం నుండే నేటికీ పంపబడుతుండటం గమనింపదగిన విశేషం. 

వరాహస్వామి ఆలయం ముఖమండపం, అర్ధమండపం, అంతరాళం, గర్భాలయం అని నాలుగు భాగాలుగా నిర్మింపబడింది.గర్భాలయం మధ్యలో సుమారు ఒక అడుగు ఎత్తుగల శిలావేదికపై సుమారు రెండడుగుల ఎత్తుగల శ్రీ భూవరాహస్వామివారి శిలావిగ్రహం ప్రతిష్ఠింపబడివుంది. అదిగో! పై రెండు చేతుల్లో శంఖ చక్రాలు, ఎడమ తొడమీద భూదేవిని కూర్చొనబెట్టుకున్నట్లుగా ఉన్న, ఊర్ధ్వపుండ్రధారియైన శ్రీవరాహస్వామిని కన్నులారా దర్శించండి. 




  
వరాహస్వామిదగ్గర ఉన్న సుమారు ఒక అడుగు చతురస్రాకార రాగి పలకయంత్రాన్ని తిలకించండి! అది శ్రీవేంకటేశ్వరుడు శ్రీవరాహస్వామికి వ్రాసి ఇచ్చిన దాన పత్రమని చెప్పబడుతున్నది. దానిమీద బ్రాహ్మీ లిపిని పోలిన వ్రాత ఉన్నది. శ్రీవరాహస్వామికి ప్రత్యేకంగా ధ్వజస్తంభం లేదు. అందువల్ల వారికి ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహింపబడటం లేదు. అంతేగాక శ్రీవేంకటేశ్వరస్వామివారి జన్మనక్షత్రం, శ్రీవరాహస్వామివారి జన్మనక్షత్రం కూడా శ్రవణమే. ఇద్దరూ ఒక్కరే కాక అభిన్నులుగా అయినందువల్ల శ్రీవేంకటేశ్వరస్వామికి జరుగుతున్న ఉత్సవాలన్నీ ఈ వరాహస్వామివారికి జరిగినట్లేనని భావింపవలసియున్నది. 

క్రీ.శ 1800 ప్రాంతంలో ఈస్టిండియా కంపెనీ, ఆదాయం  అతి తక్కువగా ఉన్న శ్రీవరాహస్వామి ఆలయాన్ని పర్యవేక్షించుటకు నిరాకరించినందువల్ల శిధిలావస్థకు గురైంది. తరువాత 1900 ప్రాంతంలో దేవస్థానం అప్పటి అధికారియైన మహంతు ప్రయాగదాసు శిధిలమైన వరాహస్వామి ఆలయం నుండి వరాహస్వామి మూర్తులను సేకరించి, శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలోని ఇప్పటి అద్దాల మండపంలో భద్రపరచారు. ఆ తర్వాత 10ఏళ్ళకు శిధిలమైన వరాహస్వామి ఆలయాన్ని ప్రత్యేక శ్రద్ధతో, భక్తితో పునరుద్ధించి, వరాహస్వామిని మహంతుప్రయాగదాసు పున: ప్రతిష్టించాడు. అప్పటినుంచి ఈ ఆలయపాలనా శ్రీవేంకటేశ్వరుడే చూస్తున్నాడు. ఇటీవల శ్రీవరాహస్వామి ఆలయానికి మహాసంప్రోక్షణ జరిగింది. శ్రీస్వామి మూలవరుల వేదిక ఎత్తును పెంచడం, స్వామివారి చుట్టూ బంగారు మకర తోరణం అమర్చడం, ఆలయంపై పెద్ద విమాన నిర్మాణం, బంగారు కలశస్థాపన వంటి కార్యక్రమాలు ఘనంగా జరుపబడ్డాయి.

క్షేత్ర సంప్రదాయము ప్రకారం భక్తులు ఈ వరాహస్వామిని తొలుత దర్శించుకొని తదుపరి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.  తానే మళ్ళీ అనంతకాలంలో ఇక్కడే ఈ క్షేత్రంలోనే శ్రీవేంకటేశ్వరునిగా వెలుగొందుతూ భక్తుల కోరిక లీడేరుస్తూ ఉన్న శ్రీ శ్వేత వరాహస్వామివారిని ఒక్కసారి ఇలా ప్రార్ధిద్దాం!     

 వరం శ్వేతావరాహాఖ్యం స  సంహారం ధరణీధరం
 స్వ దం ష్ట్రాభ్యాం ధరోద్ధారాం శ్రీనివాసం భజే2 నిశం.




శ్రేష్ఠమైన అవయవాలతో విరాజిల్లేవాడును, భూదేవిని హరించిన హిరణ్యాక్షుని సంహరించినవాడును, తన కోరలచే భూమిని ఉద్ధరించినవాడును, శ్వేతవరాహుడును అయిన శ్రీనివాసుని ఎల్లప్పుడు భజింతునుగాక!

             గోవిందా!**గోవిందా!**గోవిందా!**గోవిందా!**గోవిందా!  


 సర్వం శ్రీసాయినధార్పణ మస్తు











Monday, April 17, 2017 4 comments By: visalakshi

ఆ తరాలు - అంతరాలు






 ఈ మధ్య నా నెచ్చెలి అమ్మ నాన్న గుర్తుకొచ్చారురా.. అంది. అలా ఆలోచనలో పడిన నాకు మా అమ్మ..నాన్న గుర్తు వచ్చారు. అమ్మ నాన్న వారితో మనకుండే అనుబంధం..మన పిల్లలకి మనతో ఉండే అనుబంధం ఆలోచన .  ఈ టపాకి నాంది అయింది నా ఆలోచనల పరంపర..

జన్మ నిచ్చిన తల్లి ఋణం తీర్చుకోలేము అంటారు. నిజమే! భగవంతుడు ఏర్పరిచిన మధుర బంధం.. సృష్టికి ప్రతిరూపాలు తల్లిదండ్రులు.అమ్మ ఆలనా, నాన్న పాలనా.. వారి కనుసన్నలలో పిల్లల దినదినాభివృద్ధి..పూర్వకాలంలో తల్లిదండ్రులు పిల్లలను ప్రేమతో పాటు, గౌరవ అభిమానాలను పెద్దలయందు మర్యాదాపూర్వక భయభక్తులను నేర్పేవారు. 

 చిన్నతనంలో అమ్మ సాయంత్రము వేళల్లో నాన్నగారికి పలహారం అందించి తను ఎదురుగా మల్లెపూవుల దండను కడుతూ కబుర్లు చెప్పేది. మేము పిల్లలం ఒకింత దూరంలో కూర్చుని చదువుకొనేవారము. ఆ దృశ్యము ఎప్పుడూ నా మదిలో నిలిచిపోయింది. నాన్నగారికి పనసపొట్టుకూర చాలాఇష్టం. ఆయన పనసపళ్ళు. కాయలను తీసుకువచ్చి తానే ఉదయమే పనసపొట్టును తీసి, పనసతొనలను వలిచేవారు.. ఆ ప్రహసనమునకు రెండు గంటల సమయము కాబట్టి ఆదివారము చేసేవారు. అదో జ్ఞాపకం. జామపళ్ళు తెచ్చేవారు. అమ్మ వాటిని ఒక పెద్ద పళ్ళెములో పెట్టేది.. జామపళ్ళ వాసనతో, ఆ గది బలే ఉండేది. ఇవన్నీ ఎక్కడోకాదు. హైదరాబాదు మహానగరంలోనే.. జీతం రాగానే ముందు పుల్లారెడ్డి స్వీటు, చెగోడీలు తెచ్చేవారు. అమ్మ అందరికీ పెట్టేది. నాన్నగారు వస్తున్నారు అంటే మేము మరి మాట్లాడే వాళ్ళం కాదు. స్కూలికి వెళ్ళేటప్పుడు ఆయన చేయి పట్టుకొని వెళ్ళేవారం.  అదో అపురూపం.  అప్పట్లో సందేహాలన్నీ ఉపాధ్యాయులను అడిగి తీర్చుకునేవాళ్ళం. అమ్మా నాన్నను అడగాలంటే వెరపు.  అది మా తరం.

 క్రమేణా తల్లిదండ్రుల ప్రేమలలో స్వార్ధం చోటు చేసుకొంది.తమ పిల్లల ఉన్నతస్థాయి..ఎదుటి పిల్లలకన్నా మరింత ఉన్నతంగా ఉండాలన్న ధ్యాసలో పిల్లలను స్వార్ధపూరితంగా వారి మనసులలో పోటీతత్వమును నింపుతున్నారు. తత్ఫలితం నేటి విద్యార్ధులు. రేపటి స్వార్ధహృదయులు. అన్నీ వారికే కావాలి. అన్నిటా వారే ముందుండాలి. లేకపోతే అసహనం ..కోపం. .విపరీత పరిణామాలు. అమ్మ అదిగో నాన్నగారొచ్చారు చూడు అంటూ చిన్నతనం నుండి నాన్న అంటే గౌరవముతోపాటు భయం భక్తిని తను చూపిస్తూ పిల్లలకు నేర్పించేది. నాన్న కూడా తన పిల్లలను మనసుతో దగ్గరికి తీసుకొనేవారు. కానీ పైకి గంభీరంగా విషయపాలన చేసేవారు. నాన్నగారిని ఏమైనా అడగాలంటే అమ్మద్వారానే సాధ్యం. ఆడపిల్లలను తండ్రి తల నిమిరి ఆశీర్వదించేవారు.అమ్మాయిలు ఎలా ఉంటే ఇంటా బయటా గౌరవంగా చూస్తారనేది... చిన్నప్పటి నుండి నాన్నగారు, సోదరుల అభిమానాల, అభిరుచుల, అభిప్రాయాల సమ్మేళనముతో... ఇంట్లో అమ్మ నాన్నతో మిగిలిన బంధువులతో ఎలా మసులుకుంటుందో ఎంత గౌరవ మర్యాదలను పాటిస్తుందో చిన్నప్పటినుండీ పిల్లలు గమనిస్తారు. ఆ సంస్కారము వారిలో కూడా దిన దిన ప్రవర్ధమానమౌతుంది. సమాజంలో వారు ఆ సంస్కారముతో అభివృద్ధి చెందుతారు. ఈ రోజులలో మనమే పిల్లలకు విదేశీ సంస్కృతి నేర్పుతున్నాము. సోషల్ మీడియా,  టీ.వీలు  ఈ మాధ్యమాల ద్వారా ఒకింత వేగంగా పిల్లలు మన సంస్కృతి సంప్రదాయలకు విలువలు తగ్గించేసారు. పేరుకి వాట్స్ ఆప్ లలో అన్ని పండుగలకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. కానీ నిజంగా హృదయపూర్వకంగా ఆ పండగల విలువలను వాటి పారమార్ధాన్ని తెలుసుకొని ఆకళింపుచేసుకొని పాటిస్తున్నది ఎంతమంది? హాయ్! డాడ్.. హాయ్! మాం ..ఇవీ పలకరింపులు.. అమ్మా! అన్న పిలుపులో తీయదనం మిగిలిన పిలుపుల్లో వస్తుందా.. పల్లెటూళ్ళలో కొంతమంది ఇప్పటికీ ఎంతో ఆప్యాయంగా అమ్మా!, నాన్నగారండీ,అన్నయ్యా,  చెల్లీ, తమ్ముడూ, అక్కా! ఇలా పారవశ్యంగా పిలుచుకుంటారు. ఆ అనుభూతి ఎంతో హృద్యంగా ఉంటుంది. చెప్పడంలో కూడా వారిపై ప్రేమ ఆ మాటలలో కదలాడుతూ ఉంటుంది. మరి మనమో..పిలుపులు సరే!.. మనకే అధ్యాత్మిక విషయాలు అంతంత మాత్రంగా తెలుసు. చిన్న పిల్లలప్పుడు చెప్పడానికి సరైన అవగాహన లేదు. కనీసము ఇప్పుడైనా  అవే పిల్లలకి చెపుదామంటే వారికి వినే, చదివే ఆసక్తి లేదు. చెప్పాలంటే వారికి టైము సరిపోదు. ఈ ఉరుకుల పరుగుల సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో వారు సతమతమవుతూ, మిగిలిన సమయాన్ని నిద్రకు సరిపెడుతున్నారు. సెలవు సమయాలలో విందు, వినోదాలకు సమయాన్ని కేటాయిస్తారు. కానీ విలువైన భక్తి విషయాలు తెలుసుకోవాలని కోరుకోరు. ఇప్పటినుండీ ఎందుకు? అన్న ఆలోచన..లైఫ్ ఎంజాయ్ చేయాలి. అన్న ఉద్దేశ్యముతో వారి విధానములలో వారు ఉంటారు. వాళ్ళు చేస్తున్నది తప్పుకాదు ఆ విధానమే కరక్టు అనుకుంటారు.  ఈ తరంలో చాలామంది తుదిదాకా పట్టువిడువకుండా ముందుకు సాగలేకపోతున్నారు. ఏవో సాకులతో నీరుగారిపోతూ ఉంటారు. ఆరంభశూరత్వంతో మధ్యలోనే విజయమార్గం నుంచి వెనుతిరుగుతూ ఉంటారు. దీనికి ప్రధానకారణం లక్ష్యసాధనలో ఏకాగ్రత కొరవడటం. పట్టుదల లేకపోవడం! 

 అమ్మా, నాన్న చెప్పేవి పాతతరం కబుర్లు.. ట్రెండు మారిపోయింది. అంటూ సినిమాల ప్రభావంతో కొత్త పదజాలాలు.. సరి కొత్త వ్యంగ్య బాణాలు.. ఇంట్లోనే మాట్లాడం ప్రారంభిస్తారు. వాటిని మనం కూడా మన పిల్లలు ఏది చేసినా ముద్దుగా పరిగణిస్తూ వారిని మరింత కలుషిత వాతావరణంలోకి నెడుతున్నాము. అన్నిటికీ కనెక్ట్ అయిపోతున్నారు. వారిని మార్చలేక మనం కూడా వారి బాటలో నడవడం ముదావహం.  




 "మానవ మేధస్సును ..అతడే సృష్టించిన కృత్రిమ మేధస్సు జయిస్తుంది." అని ఓ మహానుభావుడు చెప్పింది అక్షరాలా నిజమైంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ కి మనం అంతగా కనెక్ట్ అయ్యాము. ఉదయం ఫోన్   తోనే లేస్తాను.. మధ్యలో ఫోన్ చూసుకుంటాను. రోజంతా దానితోనే గడుపుతాను. అందరినీ అనే ముందు నేనే దానికి బానిసను. ఇది వైభోగమనుకుంటాము కానీ నాకైతే ఇది బలహీనత. మరి నాకే అలా ఉన్నపుడు యువతకు మరింత బలహీనత. ఎంతవరకు దాని అవసరమో అంతవరకు ఉపయోగించుకొని.. మన మానసిక దౌర్భల్యానికి లోనుకాకుండా దానికి మనకు విశ్రాంతి నివ్వడం ఎంతైనా అవసరం. 

ఇదివరకు సినిమాలు.. హాలు వరకే పరిమితం.. కానీ ఇప్పుడు ఇంట్లో, ప్రతి సంభాషణలలో ప్రతి వారి మధ్యా.. సినిమా కబుర్లు, అనుకరణలు.. ఒక్కో కుటుంబాన్ని చూస్తే ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్..అలాంటి డైలాగులు ఉంటాయి వారి మాటలలో..   టు పోతోంది ఈ సమాజంలో నాగరికత.. మళ్ళీ ఎవరు వచ్చి నా సోదర సోదరీ మణులను, నా భరతమాత బిడ్డలను సంస్కరించాలి. నావంతు నేను ఏమి చేయాలి..నా పిల్లలను.. చుట్టూ ఉన్న నా అనుకున్న అందరికీ గొంతెత్తి మన సంప్రదాయాల  సంస్కృతికి , అమ్మా నాన్నలకి సముచిత గౌరవమిస్తూ, ఆధ్యాత్మికంగా మన పండగల వైశిష్ట్యాన్ని తెలియజేయడం.. నా విధి. తెలిసిన అనుసరిస్తున్న  జ్ఞానాన్ని నలుగురికీ తెలియజేయటం నా ధర్మం. మీరు  అంటే ప్రతి తల్లి,దండ్రి మీ కర్తవ్యాన్ని విస్మరించవద్దని నా మనవి.  జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకొని..ఆ లక్ష్యాన్ని సాధిస్తూ వాస్తవంలో జీవిద్దాం. యువతకు అదే నేర్పుదాం.స్పూర్తినిద్దాం.

 భరతావనికి అంజలి ఘటిస్తూ.............




Saturday, April 15, 2017 1 comments By: visalakshi

పరమాత్మ- అంతర్యామి

 ఓం శ్రీ సాయినాధాయ నమో నమ: 

తమాదిదేవం కరుణానిధానం, తమాలవర్ణం మహితావతారం !
అపారసంసారసముద్రసేతుం, భజామహే భాగవత స్వరూపం !!               
                                                                          - (పద్మపురాణం)

 దేవాదిదేవుడైన శ్రీమహావిష్ణువు కృపానిధి - తమాల వృక్షమువలె శ్యామవర్ణశోభితుడు, లోకకల్యాణార్ధము పెక్కు అవతారములను దాల్చినవాడు. అపారమైన ఈ సంసారసాగరమునుండి తరింపజేయునట్టి దివ్యసేతువై భాసిల్లుచుండెడివాడు. ఆ పరమాత్ముని దివ్యస్వరూపమే భాగవతము.

పలికెడిది భాగవతమట ! పలికించెడివాడు రామభద్రుండట నే
బలికిన భవహరమగునట ! పలికెద వేరొండుగాధ పలుకంగ నేలా..

అని మదితలంచి పూర్తిగావించిన తన భాగవత గ్రంధాన్ని శ్రీహరి అవతారమైన శ్రీరామునకు అంకితం గావించాడు పోతనామాత్యులు.  



 సంసార భవబంధాలను పోకార్చేది, ముక్తిని ప్రసాదించేది అయిన ఈ భాగవత మహాపురాణమును ఆదిదేవుడైన శ్రీమన్నారాయణుడు తన నాభికమలమున ఉద్భవించిన చతుర్ముఖ బ్రహ్మకు సృష్టికి పూర్వం బోధించాడు. బ్రహ్మదేవుడు తన మానస పుత్రుడైన నారదుడు కోరగా ఆయనకు బోధించాడు. వ్యాసమునీంద్రునకు నారదమహర్షి ఆ భాగవతమును బోధించి దీనిని కలియుగ మానవుల ఉద్ధారకార్ధం రచించమని ప్రోత్సహించాడు.వ్యాసమహర్షి భాగవతమును రచించి తన కుమారుడైన శుకునకు బోధించాడు.

వేదాలనే కల్పవృక్షానికి కాచిన భాగవతమనే పండును వ్యాసమహర్షి తెచ్చి కుమారుడైన శుకుని కిచ్చాడు. ఆయన నోటిలోని అమృతంతో కలిసి అది లోకానికి అందింది. భక్తితో భాగవతం వినేటటువంటి నిర్మలహృదయులకు భగవంతుడు చిక్కుతాడు. కార్యకారణాలకు అతీతమైనది ఆత్మతత్వం. దానినే ఆధ్యాత్మం అంటారు. అట్టి ఆధ్యాత్మాన్ని తెలియజేసే దీపం వంటిది భాగవత పురాణం. అది సకలవేదాల సారాంశం.  గాఢమైనటువంటి సంసారమనే అంధకారాన్ని పోగొట్టుకొనదలచినవారికి శుకుడు దయతో ఈ జ్యోతిని ప్రసాదించాడు. కనుక శుకుడికి, వ్యాసుడికి నమస్కరించి, నరనారాయణులకు, సరస్వతీదేవికి మ్రొక్కి సూతమహర్షి భాగవత పురాణం చెప్పడం ప్రారంభించాడు. 




ఎందులో కృష్ణుని ప్రసక్తి ఉంటుందో ఏ విధంగా ఆత్మ ప్రసన్నమవుతుందో ఏ రూపంలో హరిభక్తి కలుగుతుందో అది మానవులకు పరమధర్మం. వాసుదేవునిపై భక్తి వలన వైరాగ్యం కలుగుతుంది. విజ్ఞానం లభిస్తుంది.తత్వ జిజ్ఞాస అంటే ధర్మజిజ్ఞాస. కొందరు ధర్మమే తత్వమని అంటారు. ఆ తత్వాన్నే బ్రహ్మమని, పరమాత్మ అని, భగవంతుడని కూడా వ్యవహరిస్తారు. వేదాంతశ్రవణంవల్ల కలిగిన జ్ఞానంతో, జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తి చేత ఆత్మలో పరమాత్మను చూస్తారు. కృష్ణపరమాత్మ తన కధలు విన్నవారి హృదయాలలో నివసించి వారిచేత మంచిపనులు చేయిస్తాడు. చెడు జరగకుండా చూస్తాడు. ఆ విధంగా వారిలో నిశ్చలభక్తి ఏర్పడుతుంది. భక్తివలన సత్త్వగుణం ప్రకాశిస్తుంది. రజోగుణం, తమోగుణం కారణంగా పుట్టే కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం తొలగిపోయి చిత్తం నిర్మలమవుతుంది. అటువంటి మనిషి రాగద్వేషాలనే బంధనాలనుంచి విముక్తుడవుతాడు. అతనికి తత్వజ్ఞానం సిద్ధిస్తుంది. భగవత్సాక్షాత్కారం లభిస్తుంది. అహంకారం నశిస్తుంది. సంశయాలు విచ్చిన్నమవుతాయి. కర్మలు నశిస్తాయి. అందుచేత తెలివిగలవారు అంత:కరణాలను భక్తిచేత శుద్ధిచేసి భగవానునికి సమర్పిస్తారు.  

 మోక్షమిచ్చేది నారాయణుడు కాబట్టి అందరూ ఆయన్ని సేవించాలి. వేదం, యాగం, యోగం, జ్ఞానం, తపస్సు ఇవన్నీ వాసుదేవుని అధీనంలో ఉండే ధర్మాలు. పరమేశ్వరుడు నిర్గుణుడు. కానీ సత్త్వరజస్తమోగుణాలతో కూడిన తన మాయచేత విశ్వాన్ని సృష్టించి, గుణాల రూపంలో అందులో ప్రవేశించి ప్రకాశిస్తాడు. అంతర్యామి రూపంలో సమస్త జీవరాసులలోనూ నివసిస్తాడు. దేవతలలోను, మనుష్యులలోను, పశు, పక్ష్యాది ఇతరజాతులలోను కూడా అవతరించి, లోకాలను రక్షిస్తాడు. అవతారాలన్నింటికీ మూలం శ్రీమన్నారాయణుడు. 



 పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు లెక్కించుటకు సాధ్యకానన్ని   అవతారాలెత్తాడు.  వాటిలో ముఖ్యమైన కొన్ని అవతారాలు.....మొదట సనక, సనంద, సనత్సుజాత, సనత్కుమారులనే రూపాలు ధరించి, అఖండ బ్రహ్మచర్యాన్ని పాలించి అతికష్టమైన బ్రహ్మచర్యాన్ని ఆచరించి బ్రహ్మచర్యము యొక్క ప్రాముఖ్యతను చూపాడు.

 రెండవ అవతారము "వరాహావతారము"భూమి మొదట పాతాలగతమై ఉండినది. దానిని పైకి తెచ్చి యధాస్థితిలో నిలిపితేగానీ, సృష్టిని ప్రారంభించుటకు వీలుగాదు.  రెండవసారి వరాహరూపమెత్తి భూమిని రసాతలము నుంచి పైకెత్తి రక్షించాడు. 

మూడవసారి నారదుడను అవతారము  దేవరుషిగా జన్మించి ముక్తికి మంత్రమైన వైష్ణవ మంత్రాన్ని ఉపదేశించాడు.కర్మ నిర్మూలమైన మార్గమును తెలియజేయు భక్తిమార్గమును బోధించి ప్రచారము చేసినాడు.   

నాల్గవసారి నరనారాయణుడనే పేరుతో పుట్టి ఘోరమైన తపస్సు చేసాడు.తపస్సు సిద్ధించవలయునంటె "శమము దమము" మొదలగునవి ఎంతో అవసరము. అందువలన నరనారాయణుల రూపములలో అవతరించి శమదమాదుల యొక్క ఆవశ్యకతను లోకాలకు తెలియజెప్పాడు. 



 ఐదవ అవతారంలో కపిలుడనే సిద్ధుడుగా జన్మించి  జ్ఞాన వైరాగ్యాలతో కూడిన  సాంఖ్య శాస్త్రాన్ని బోధించాడు.  జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తికి చలనముండదు.

 దత్తాత్రేయావతారము ఆరవది.పైనచెప్పిన ఐదుగుణములు వరుసగా బ్రహ్మచర్యము, సంతోషము, భక్తి, తపస్సు, జ్ఞాన వైరాగ్యములు కలిగి అత్రిమహర్షి అనసూయాదేవికి భగవంతుడు దత్తాత్రేయుడుగా జన్మించాడు. కాలక్రమేణా అంతరించిన తత్త్వ విచారణమును తిరిగి ఉద్ధరించాడు. అలర్కునకు, ప్రహ్లాదునకు, హైహయరాజునకు ఆత్మ విద్యను ఉపదేశించాడు. 

 యజ్ఞావతారము ఏవది. కాలము గడిచే కొద్దీ లోకపాలనా వ్యవస్త అస్తవ్యస్తమైనది. అపుడు భగవంతుడు 'రుచి ' అను మహర్షీఆకూతి ' అనే దంపతులకు జన్మించి, యజ్ఞుడను పేర ప్రసిద్ధుడై యమాది దేవతలతో కూడి స్వయంభూమన్వంతరమును పరిపాలించి లోకపాలనా వ్యవస్తను కాపాడినాడు. 

 ఋషభావతారము ఎనిమిదవది. భగవంతుడు మేరుదేవికి, నాభికి ఉరుక్రముడనే పేరుతో జన్మించి పరమహంస మార్గాన్ని ప్రకటించాడు. 

 తొమ్మిదవ అవతారము పృధురాజావతారము. పృధుచక్రవర్తియై భూమిని ఆవుగా చేసి దాని పొదుగునుంచి సమస్త వస్తువులను పిదికాడు. ఆహారపదార్ధాలను మొలిపించి, పోషించి, వాటితో ప్రజలు జీవించే మార్గాన్ని బోధించాడు.జీవరాశికి ఆహారాన్ని సమకూర్చిన కారణాన ఈ అవతారము విశిష్టమైనది.

 పదవ అవతారం మత్యావతారము. మీనావతారం దాల్చి వైవస్వత మనువును మహీరూపమైన నావనెక్కించి ఉద్ధరించాడు.

పదకొండవ అవతారము కూర్మావతారము. క్షీరసాగరమధనకాలంలో తాబేలుగా అవతరించి మందరపర్వతాన్ని నీట మునగకుండా తన వీపున నిలిపాడు. తరువాత క్షీరసాగరమధనం సక్రమంగా జరిగింది. అమృతసిద్ధి కలిగింది.

 12వ అవతారము ధన్వంతరి అవతారము. క్షీరసాగరం మధ్య నుండి అమృతకలశాన్ని  హస్తమున ధరించి ధన్వంతరినారాయణునిగా పాలసముద్రమునుండి ఆవిర్భవించాడు.  

 13వ అవతారము మోహినీ అవతారము. అమృతకలశమును దేవతల వద్దనుండి రాక్షసులు లాక్కున్నారు. దేవతలు విష్ణువుకు మొరపెట్టుకున్నారు.  అప్పుడు భగవంతుడు మోహినీ వేషంలో అసురులను మోహవివశులను  జేసి  దేవతలకు  అమృతాన్ని  పంచాడు.  

14వ అవతారము నరసింహావతారము. నరసింహరూపం ధరించి హిరణ్య కశిపుని సంహరించినది.  భక్త ప్రహ్లాదుని తండ్రిని నరసింహ రూపంలో స్థంభము నుండి వెలువడి వధించిన వైనం అందరికీ విదితమే. బ్రహ్మ వరాల కతీతమైన రూపమే నరసింహావతారము. 

  

 15వ అవతారము  వామనావతారము. కపట వామనుడై బలిచక్రవర్తిని మూడడుగుల భూమిని దానమడిగి ముల్లోకాలనూ ఆక్రమించాడు.శరణార్ధి ఐన దేవేంద్రుడు దేవలోకాధిపతియైనాడు.పరమధార్మికుడు భక్తుడు అయిన బలిచక్రవర్తిని శక్తితో కాక యుక్తితో జయించాడు.  

 16వ అవతారము పరశురామావతారము. పరశురాముడు త్రేతాయుగ మధ్యకాలంలో బ్రాహ్మణద్రోహులైన క్షత్రియులను భూభాగమంతయు 21 సార్లు తిరిగి దుర్మార్గులైన రాజులందరినీ వధించి క్షత్రియులను రూపుమాపి ధర్మాన్ని పునరుద్ధరించాడు.   

 17వ అవతారము వ్యాసావతారము.కలియుగములో జనులు మందమతులై వేద ధర్మాలను చక్కగా గ్రహించలేరని, భగవంతుడు పరాశరుని వలన సత్యవతికి జన్మించి, వ్యాసుడనే నామముతో ప్రసిద్ధుడై, ఖ్యాతి పొందాడు.   వేద సమూహములను విభజించి, ఋగ్-యజుర్-సామ-అధర్వణ వేదములుగా నామములిడి, వాటిని వ్యాప్తి పరిచెను. వేదాలకు శాఖలు ఏర్పరచి అష్టాదశపురాణాలను, ఉపపురాణాలను, భారతమును, భాగవతమును రచించి సులభమైన మార్గంలో ధర్మమును బోధించాడు.

 18వ అవతారము  శ్రీరామావతారము. భగవంతుడు శ్రీరాముడుగా అయోధ్యపతియైన దశరధమహారాజుకు కౌసల్యయందు జన్మించి, లోకాలకు రాక్షస బాధను బాపినాడు. శ్రీరామచంద్రుడు సాక్షాత్తుగా ధర్మావతారుడు. లోకాలకు ఆదర్శపురుషుడు. లొకాలలో జనులు ఆచరించవలసిన ధర్మాలన్నిటిని ఆచరించి మార్గదర్శకుడైనాడు. సముద్రమును  నిగ్రహించి సేతువును గట్టి లంకకుపోయి దశకంఠుని సంహరించి, లోకాలకు రాక్షస బాధను బాపినాడు.

19,20.. బలరామ శ్రీకృష్ణ అవతారములు. ద్వాపర యుగాంతములో రాజ్యాధిపతులు రాక్షసాంశమును జన్మించారు. అధర్మం పెచ్చు పెరిగింది. భగవంతుడు బలరామ,శ్రీకృష్ణులుగా యదువంశంనందు  అవతరించి, పాపాత్ములను సంహరించి భూమి భారాన్ని నివారించారు. ధర్మాన్ని ఉద్ధరించారు.

 21 వ అవతారము బుద్ధావతారము. భాగవత రచన జరిగే నాటికి బుద్ధావతారము సంభవించలేదు. వ్యాసులవారు తన దివ్యజ్ఞానము ద్వారా కనుగొని చెప్పిన అవతారము. బుద్ధుడు మహావైరాగ్యపురుషుడు, త్యాగి, ఆనాటి కాలపరిస్థితికి అనుకూలముగా ధర్మమును బోధించాడు.

 22 వ అవతారము కల్కావతారము. కలియుగాంతమున యుగసంధికాలములో పాలకులు ధర్మాన్ని వదలి, పరదారాపహరణమునకు, పరధనాపహరమునకు వడిగట్టుతారు, అధర్మముతో లోకం అతలాకుతలమవుతుంది. అప్పుడు భగవంతుడు విష్ణుయశుడను బ్రాహ్మణునికి కుమారుడుగా జన్మించి,కల్కియను పేరుతో ధర్మాన్ని ఉద్ధరించుతాడు.

 సరస్సు నుండి పలురకాలుగా కాలువలు ప్రవహించునట్లు విశ్వశ్రేయస్సుకొరకు అనేకావతారాలు శ్రీమన్నారాయణుని నుండి ఆవిర్భవిస్తూ ఉంటాయి. విష్ణువు అంశలుగా అవతారాలు పెక్కులు. కలియుగములో వేంకటేశ్వరస్వామిగా తిరుమలలో అనంతకోటి జనాలతో పూజలందుకుంటూ కోరినవారి కొంగుబంగారమై అలరారుతున్నాడు. షిర్డీసాయి అవతారముగా భగవంతుడు.. సాయీ! అంటే ఓయీ అంటూ షిర్డీసాయినాధుడు భక్తులకు కోరిన వరాలిస్తూ భక్తకోటి నీరాజనాలందుకుంటున్నాడు.



 ఎన్నో అవతారములు దాల్చి..మనకై వేదోపనిషత్తులు అందించి మనల్ని ధర్మ మార్గంలో నడిచేటట్లు ప్రబోధిస్తున్న పురాణ ఇతిహాసాలను మనము చదివి గ్రహిస్తున్నాము. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించిన నిదర్శనాలనూ చదివాము. మైమరచాము. అవి మనకి కూడా జరిగినంత అనుభూతితో ఇప్పటికీ పరవశిస్తాము.    ఆ పారవశ్యంతో పాటు శ్రీ షిర్డీ సాయినాధుడుగా భగవంతుడు మాకు ప్రత్యక్షంగా.. ఎన్నో మహత్యాలను మాకు అనుగ్రహించి.. ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ లక్ష్మీ నరసిం హ అవతారములో మాకు దర్శనమిచ్చి, ప్రణవం యొక్క అంతరార్ధమును తెలియజేసి.. ఓంకారము నేనే ...పరమాత్ముడను ..అంతర్యామిని అన్నీ అన్నిటా నేనేయై ఉన్నాను.సర్వాంతర్యామిని..త్రిగుణాలను నేనే. జగన్మాతను నేనే." మూడున్నర అడుగుల, అంగుళాల మానవదేహం నాది కాదు" అని అందుకే ఈ ఆత్మదర్శనం అని ప్రబోధించి నిష్కల్మష మనస్కులై భగవంతుడి చరణాల సన్నిధిలో శరణాగతి చేయుమని...ఈ అల్పులను ప్రేమతో,దయతో స్వామి అనుగ్రహించారు. విష్ణుసహస్ర నామ పారాయణ: హనుమాన్ చాలీసా, కీర్తనం శ్రవణం ధ్యానం చేయమని ఉపదేశించారు..మేము చూసి, అనుభవించి తరించిన ఈ సాయినాధ పరబ్రహ్మ అవతారము మాకు అత్యంత విశిష్ఠమైన అవతారము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధునికి మనసారా దివ్య ప్రణామములతో వారి చరణములకు శతకోటి అభివందనములు ...  

  సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు