Tuesday, December 29, 2020 1 comments By: visalakshi

శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం...

 #శ్రీ దత్తాత్రేయ వజ్రకవచమ్* 

#తాత్పర్యం


పూర్వం వేదవ్యాస మహర్షిని సంకల్పసిద్ధి పొందే ఉపాయం చెప్పమని ఋషులు అడిగిరి. అందుకు వేదవ్యాస మహర్షి, ఒక్కసారి చదివితే చాలు సంకల్పాన్ని సిద్ధింపచేసేది, భోగమోక్షాలను ప్రసాదించేది చెపుతాను, అందరూ వినండి అంటూ ఉపక్రమించాడు.


హిమవత్పర్వత గౌరీశృంగంపై రత్నసింహాసనం మీద ఆసీనుడై ఉన్న పరమేశ్వరునితో ఒకనాడు పార్వతీ దేవి, "ఓ లోక శంకరా! నీవల్ల అనేక మంత్రాలను, యంత్రాలను, తంత్రాలను తెలుసుకున్నాను, ఇప్పుడు మహీతలాన్ని దర్శించాలని కోరుకుంటున్నాను" అని పలికింది. పార్వతి కోరికను సంతోషంతో అంగీకరించిన పరమేశ్వరుడు వృషభవాహనం పై బయలు దేరి భూలోక వింతలు చూపించసాగాడు. వారు వింధ్య పర్వత ప్రాంతంలోని ఒక దుర్గమమైన అరణ్యానికి చేరుకున్నారు. అక్కడ వారికి గొడ్డలి ధరించి సమిధలను సేకరిస్తున్న ఒక కిరాతుడు కనిపించాడు. అతని శరీరం వజ్రము వలె ధృఢముగా ఉన్నది. ఇంతలో ఒక పెద్ద పులి అతని పై దాడి చేయుటకు వేగముగా వచ్చినది. అయితే దానిని చూచిన కిరాతుడు తనను రక్షించుకొనుటకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. పైగా సంతోషముతో నిర్భయముగా నిలబడి ఉన్నాడు. అదే సమయములో ఒక లేడి పరిగెత్తుకుంటూ అక్కడకు రాగా దానిని చూచిన పులి బెదిరి పారిపోయింది.


ఈ వింతను చూసిన పార్వతి శంకరునితో "ఏమాశ్చర్యం! ప్రభూ, ఎదురుగా చూడు" అన్నది. దానికి పరమేశ్వరుడు "దేవీ! మేము చూడనిదంటూ లోకంలో ఏ కొంచమూ లేదు. వాక్కులకు, మనస్సుకు అందని అద్భుతం నీకు చెబుతాను, విను" అంటూ చెప్పనారంభించాడు.


ఈ భిల్లుని పేరు దూరశ్రవుడు. పరమ ధార్మికుడు. ప్రతీరోజూ అడవికి వెళ్ళి కష్టపడి సమిధలూ, దర్భలూ, పుష్పాలూ, కందమూల ఫలాలూ తెచ్చి మునీంద్రులకిస్తాడు. ప్రతిఫలంగా తానేమీ కోరడు. ఆ మునులందరూ కూడా అతని పట్ల దయతో ఉంటారు.


అక్కడే దలాదనుడను మహాయోగి ఉన్నాడు. ఒకనాడు దలాదనుడు, "దత్తాత్రేయుడు స్మర్తృగామి (స్మరించిన‌వారి వద్దకు తక్షణమే వెళతాడు)" అని విన్న కథను తలుచుకొని, దత్తుని స్మరించాడు. మరుక్షణంలో దత్త యోగీంద్రుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దలాదన మహర్షి ఆశ్చర్యానందాలు పెల్లుబికగా ఆయనను పూజించి, "ఓ దత్తాత్రేయ మహామునీ! నా ఆహ్వానం విని నీవు విచ్చేశావు. స్మర్తృగామివని విని, కేవలం పరీక్షించడానికే నిన్ను స్మరించాను. నా అపరాధం మన్నించు." అన్నాడు. అందుకు దత్త భగవానుడు ఆ మునితో "నా ప్రకృతి ఇటువంటిది. భక్తితోగాని, భక్తి లేకుండా కాని అనన్యచిత్తంతో నన్ను స్మరించిన వారి వద్దకు వెళ్ళి వారి కోరికలు తీరుస్తాను" అని చెప్పాడు. "నీవు తలచుకున్నందుకు వచ్చాను గదా, నీకు ఏమి కావాలో కోరుకో" అని దత్తుడు అడుగగా, దలాదుడు, "ఓ మునిపుంగవా! నేనేమీ అడగను. నీ మనస్సులో ఉన్నది, నాకు శ్రేయస్కరమైనది నాకు ప్రసాదింపుము" అన్నాడు.


శ్రీ దత్తాత్రేయుడు, "నా వజ్రకవచం ఉన్నది, తీసుకో" అని చెప్పగా, దలాదుడు అంగీకరించాడు. దత్తుడు తన వజ్రకవచమునకు సంబంధించిన ఋషినీ, ఛందస్సునూ చెప్పి, న్యాసం, ధ్యానం, ప్రయోజనము అన్నీ వివరించి చెప్పాడు.


#దత్తాత్రేయ ధ్యానమ్ :


జగత్తు అనే మొక్కకు దుంప వంటి వాడు, సచ్చిదానంద మూర్తి, యోగీంద్రచంద్రుడు, పరమాత్మ అయిన దత్తాత్రేయునికి నమస్కారము. ఒకప్పుడు యోగి, ఒకప్పుడు భోగి, ఒకప్పుడు నగ్నంగా పిశాచి వలె ఉండే దత్తాత్రేయుడు ప్రత్యక్ష హరి స్వరూపుడు. భుక్తి ముక్తి ప్రదాయకుడు. ఆయన ప్రతిదినమూ వారణాసిలో స్నానము, కొల్హాపురంలో జపము, మాహురీపురంలో భిక్ష స్వీకరించి, సహ్యాద్రిపై శయనిస్తాడు. ఆయన శరీరం ఇంద్రనీలమణి వలె, కాంతి వెన్నెల వలె, జటలు వైఢూర్యం వలే ఉంటాయి. కన్నులు తెల్లగా మైత్రితో, కనుపాపలు చాలా నీలంగా ఉంటాయి. కనుబొమలూ, గుండెలపై రోమాలూ, గెడ్డమూ, మీసాలూ నల్లగా ఉంటాయి. నవ్వు పొగమంచు కంటే చల్లగా, కంఠం శంఖం కంటే అందంగా ఉంటాయి. భుజాలు పుష్ఠిగా ఉంటాయి. బాహువులు పొడవుగా, చేతులు చిగుళ్ళ కంటే కోమలంగా ఉంటాయి. వక్షస్థలం విశాలంగా బలిసి ఉంటుంది. పలుచటి ఉదరంతో, విశాలమైన పిరుదులతో, అందంగా ఉంటాడు. కటి స్థలం విశాలంగా, తొడలు అరటిబోదెల వలె ఉంటాయి. చక్కటి మోకాళ్ళు, పిక్కలూ కలిగి ఉంటాడు. చీలమండలు గూఢంగా ఉంటాయి. పాదాల పైభాగాలు తాబేటి డిప్పల వలె ఉంటాయి. అరికాళ్ళు ఎర్ర తామర పువ్వుల వలె అందంగా ఉంటాయి.


ఆయన మృగచర్మమును వస్త్రంగా ధరిస్తాడు. ప్రతీక్షణమూ తనను తలచుకున్న వారి వద్దకు వెళుతుంటాడు. జ్ఞానోపదేశం చేయటమంటే ఇష్టం. ఆపదలు తొలగించటం ఆయన దీక్ష. సిద్ధాసనంలో నిటారుగా కూర్చుని ఉంటాడు. నవ్వు ముఖం. ఎడమచేత వరదముద్ర, కుడిచేత అభయ ముద్ర. బాలురు, ఉన్మత్తులు, పిశాచాలతో కలిసి తిరుగుతుంటాడు. త్యాగి. భోగి. మహాయోగి. నిత్యానందుడు. నిరంజనుడు, సర్వరూపి, సర్వదాత, సర్వగామి. సర్వకామదుడు. భస్మోద్ధూళిత శరీరుడు. మహాపాతకాలను నాశనం చేసేవాడు. భోగ మోక్ష ప్రదాయకుడు.


"ఇలా ధ్యానం చేసి అనన్యచిత్తంతో నా వజ్రకవచాన్ని పఠించాలి. సర్వత్రా నన్నే దర్శిస్తూ, నాతో సంచరించాలి" అని దత్తుడు తెలిపాడు.


దత్తుడు దిగంబరుడు, భస్మ సుగంధం పూసుకున్నవాడు. చక్రం, త్రిశూలం, డమ్రువు, గద అనే ఆయుధాలు ధరించినవాడు. పద్మాసనుడు. యోగీంద్రులూ, మునీంద్రులూ నిత్యమూ ఆయనను "దత్తా, దత్తా" అంటూ నమస్కరిస్తూంటారు.


#దత్తాత్రేయ వజ్రకవచమ్ 


ఓం, దత్తాత్రేయుడు సహస్రార కమలంలో ఉండి, శిరస్సును రక్షించుగాక. అనసూయేయుడు చంద్రమండల మధ్యభాగంలో ఉండి ఫాలాన్ని కాపాడుగాక. మనోమయుడు హం క్షం ద్విదళ పద్మభవుడై భ్రూమధ్యమును రక్షించుగాక. జ్యోతిరూపుడు రెండు కన్నులను, శబ్ద స్వరూపుడు రెండు చెవులను, గంధ స్వరూపుడు ముక్కును, రస స్వరూపుడు నోటిని, వేద స్వరూపుడు నాలుకను, ధర్మ స్వరూపుడు దంతాలను మరియూ రెండు పెదవులను కాపాడుగాక. అత్రిభవుడు నా చెక్కిళ్ళను, ఆ తత్వవేత్త నా ముఖమంతటినీ కాపాడుగాక. సర్వస్వరూపుడు, నా ఆత్మలో ఉండేవాడు షోడశారకమలంలో ఉండి, నా కంఠాన్ని రక్షించుగాక. చంద్రానుజుడు నా భుజ శిరస్సులను, కృతాదిభవుడు నా భుజాలను, శత్రుజిత్తు కొంకులను, హరి వక్షస్థలాన్ని కాపాడుగాక. కకారాది ఠకారాంతమైన ద్వాదశారకమలంలో ఉన్న వాయు స్వరూపుడు యోగీశ్వరేశ్వరుడు నా హృదయాన్ని రక్షించుగాక. పార్శ్వస్థితుడనే హరి నా పార్శ్వాలను, హఠయోగాది యోగజ్ఞుడు మరియు కృపానిధి నా కుక్షినీ కాపాడుగాక. డకారాది ఫకారాంతం కల దశారకమలంలో ఉండే అగ్ని స్వరూపుడు నా నాభిని, వహ్నితత్వమయుడైన యోగి నా మణిపూరకాన్ని రక్షించుగాక. కటిలోని బ్రహ్మాండ వాసుదేవ స్వరూపుడు నా కటిని కాపాడుగాక. బకారాది లకారాంతమైన షట్పత్రకమలాన్ని వికసింపచేసే జలతత్వమయుడైన యోగి నా స్వాధిష్ఠాన చక్రాన్ని రక్షించుగాక. సిద్ధాసనంలో కూర్చున్న సిద్ధేశ్వరుడు నా ఊరువులను కాపాడుగాక. వకారాది సకారాంతమైన నాలుగు రేకుల కమలాన్ని వికసింపచేసే మహీరూపుడైన వీర్యనిగ్రహశాలి, మోకాళ్ళపై హస్తపద్మాలు పెట్టుకున్నవాడు నా మూలాధార చక్రాన్ని, ఇంకా అన్ని వైపులనుండీ నా పృష్ఠాన్ని రక్షించుగాక. అవధూతేంద్రుడు నా పిక్కలను, తీర్థపావనుడు నా రెండు పాదాలను, సర్వాత్ముడు నా సర్వాంగాలను కాపాడుగాక.


కేశవుడు నా రోమాలను రక్షించుగాక. చర్మాంబరుడు నా చర్మాన్ని, భక్తిప్రియుడు నా రక్తాన్ని, మాంసకరుడు నా మాంసాన్ని, మజ్జాస్వరూపుడు నా మజ్జను, స్థిరబుద్ధి గలవాడు నా అస్థులను, వేధ నా మేధను, సుఖకరుడు నా శుక్రాన్ని కాపాడుగాక. దృఢాకృతి నా చిత్తాన్ని, హృషీకేశాత్మకుడు నా మనస్సును, బుద్ధిని, అహంకారాన్ని, ఈశుడు నా కర్మేంద్రియాలను, అజుడు నా జ్ఞానేంద్రియాలను రక్షించుగాక. బంధూత్తముడు నా బంధువులను కాపాడుగాక. శత్రుజిత్తు నన్ను శత్రువులనుండి కాపాడుగాక. శంకరుడు నా ఇల్లు, తోట, ధనం, పొలం, పుత్రులు మొదలైనవి రక్షించుగాక. ప్రకృతివిదుడు నా భార్యను కాపాడుగాక. శార్ ఙ్గభృత్తు నా పశువులను రక్షించుగాక. ప్రధానజ్ఞుడు నా ప్రాణాలను, భాస్కరుడు నా భక్ష్యాదులను, చంద్రాత్మకుడు నా సుఖాన్ని పాలించుగాక. పురాంతకుడు నన్ను దుఃఖం నుండి రక్షించుగాక. పశుపతి నా పశువులను, భూతేశ్వరుడు నా ఐశ్వర్యాన్ని పాలించుగాక.


విషహరుడు తూర్పున, యజ్ఞస్వరూపుడు ఆగ్నేయాన, ధర్మాత్మకుడు దక్షిణాన, సర్వవైరిహృత్ నైరృతి మూల, వరాహుడు పడమటి దిక్కున, ప్రాణదుడు వాయువ్యపు మూల, ధనదుడు ఉత్తరాన, మహాగురుడు ఈశాన్యాన, మహాసిద్ధుడు ఊర్ధ్వదిక్కున, జటాధరుడు అధోదిశన రక్షించాలి. ఆది మునీశ్వరుడు ఏ దిక్కు రక్షణ లేకుండా ఉంటే ఆ దిక్కును కాపాడాలి.


"ఈ నా వజ్రకవచాన్ని ఎవడు చదివినా విన్నా వాడు వజ్రకాయుడు చిరంజీవి కాగలడు. అతడు త్యాగి, భోగి, మహాయోగి, సుఖ దుఃఖ రహితుడు, సర్వత్ర సిద్ధసంకల్పుడు, జీవన్ముక్తుడు అయి వర్తమానంలో ఉంటాడు." అని చెప్పి దత్తాత్రేయ యోగి అంతర్థానం చెందాడు. దలాదుడు కూడా అది జపించి జీవన్ముక్తుడైనాడు. దూరశ్రవుడు అనే భిల్లుడు అప్పుడు దీనిని విన్నాడు. ఒక్కసారి విన్నంతనే వజ్రకాయుడయ్యాడు.


దత్తాత్రేయ కవచమంతా శివుని నోట విన్న పార్వతి, "ఈ కవచం మహత్మ్యమూ, ఉపయోగించే విధానమూ తెలియచేయ"మని అన్నది. వినయంగా అడిగిన పార్వతి ప్రశ్నకు, "ఓ పార్వతీ ఏకాగ్రతతో విను. ధర్మార్థకామ మోక్షాలకు ఇదే ఆధారం"


"ఇది ఏనుగులనూ, గుర్రాలనూ, రథాలనూ, కాలిబంట్లనూ, సర్వైశ్వర్యాన్ని ఇస్తుంది. పుత్ర మిత్ర కళత్రాది సర్వసంతోష సాధనము. వేదశాస్త్రాది విద్యలకు నిధానము. సంగీత, శాస్త్ర సాహిత్య, సత్కవిత్వాలను ప్రసాదిస్తుంది. బుద్ధిని, విద్యను, తలపును, ప్రజ్ఞను, మతిని, నేర్పును ఇస్తుంది. శత్రువులను శీఘ్రమే సంహరిస్తుంది. యశస్సును, కీర్తినీ పెంచుతుంది."


"దీనిని వెయ్యి సార్లు జపిస్తే ఎనిమిది మహారోగాలూ, పదమూడు సన్నిపాతాలూ, తొంభై ఆరు కంటిజబ్బులూ, ఇరవై మేహ రోగాలూ, పద్దెనిమిది కుష్ఠు రోగాలూ, ఎనిమిది విధాల గుల్మాలూ, ఎనభై వాత రోగాలూ, నలభై పైత్య రోగాలూ, ఇరవై శ్లేష్మ రోగాలూ, క్షయ, చాతుర్థికం మొదలైనవీ, మంత్ర యంత్ర, కుత్సిత యోగాదులూ, కల్పతంత్రాదుల వల్ల కలిగించినవీ, బ్రహ్మరాక్షసులూ, భేతాళులూ, కూష్మాండాది గ్రహాలూ, వీటి వల్ల కలిగినవీ, ఆయా దేశకాలాలలో ఉన్నవీ, తాపత్రయం వల్ల కలిగినవీ, నవగ్రహాల వల్ల ఏర్పడినవీ, మహాపాతకాల వల్ల కలిగినవీ, అన్ని రోగాలూ పూర్తిగా నశిస్తాయి. ఇది నిశ్చయం."


"పది వేలసార్లు జపిస్తే గొడ్రాలు పుత్రవతి అవుతుంది. ఇరవై వేలసార్లు జపిస్తే అపమృత్యుజయం లభిస్తుంది. ముప్ఫై వేల సార్లు జపిస్తే ఆకాశ సంచారం అలవడుతుంది. కోటిమార్లు జపిస్తే సర్వకార్యాలు సాధ్యమవుతాయి. లక్ష సార్లకే కార్యసిద్ధి కలుగుతుంది. సంశయం లేదు."


"విషముష్టి చెట్టు మొదట దక్షిణాభిముఖంగా ఒక్క నెల జపిస్తే శత్రువు వికలేంద్రియుడవుతాడు. వృద్ధికి మేడి చెట్టు మొదటా, సిరి కోసం లక్ష్మీ బిల్వం మొదటా, అరిష్టాదుల శాంతికి చింతచెట్టు మొదటా, ఓజస్సు కోసం రావి చెట్టు మొదటా, భార్య కొరకై తీయ మామిడి చెట్టు మొదటా, జ్ఞానార్థం తులసి చెంతా జపించాలి. సంతతి కావాలనుకొనేవారు గర్భగృహంలో, ధనార్థులు మంచి క్షేత్రాలలో, పశువులు కోసం గోశాలలో, ఏ కోరిక గలవరైనా దేవాలయంలోనూ జపించాలి."


"బొడ్డులోతు నీటిలో నిలబడి సూర్యుని చూస్తూ వేయిసార్లు జపించినవాడు యుద్ధంలోగానీ, శాస్త్రవాదంలో గానీ జయిస్తాడు. గొంతులోతు నీటిలో రాత్రిపూట కవచం పఠిస్తే, జ్వరం, అపస్మారం, కుష్ఠు మొదలైన రోగాలూ తాపజ్వరాలూ తొలిగిపోతాయి."


"ఏది ఏది ఎక్కడ స్థిరంగా ఉంటుందో, ఏది ఏది ప్రసన్నమైతే అది నివారణమౌతుందో దాని కొరకు అక్కడ జపిస్తే సిద్ధి కలుగుతుంది. ఇది నిశ్చయం."


అని శివుడు చెప్పాడు. ఈ వజ్రకవచాన్ని పఠించినవాడు దత్తాత్రేయ సమానుడౌతాడు. ఈ విధంగా దత్తాత్రేయుడు దలాదునికి చెప్పినది, శివుడు పార్వతికి తెలియచేశాడు. ఈ కవచమును పఠించినవాడు ఈ లోకంలో దత్తుని వలె యోగి, చిరాయుష్మంతుడు అయి చరిస్తాడు.

Thursday, December 24, 2020 0 comments By: visalakshi

ఉత్తర ద్వార దర్శనం - విశిష్టత*


భగవద్గీతలోని "సర్వారంభ పరిత్యాగీ:సర్వసంకల్ప సన్న్యాసి"అనే పదబంధాలలోని పరమార్ధం శరణార్ధి అయినవాడు స్వయం సంకల్పిత కర్మలు చేపట్టరాదని,భగవత్ సంకల్పం ఉంటే చేయగలమని..మన పూర్తి బాధ్యతను భగవంతునిపై మోపవలెనని సారాంశం.

 *వైకుంఠ ఏకాదశి విశిష్టత*


సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.

ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు.

ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి.. భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు.

ఈ ఒక్క ఏకాదశి.. మూడు కోట్ల ఏకాదశులతో సమానమట. అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.

ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య.. ముక్కోటి ఏకాదశి వస్తుందని చెబుతారు.

ముక్కోటి రోజున భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి మహావిష్ణువును దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తే మంచిదని చెబుతారు.

పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.

ఏకాదశి వ్రతంలో ఏడు నియమాలున్నాయి. ఒకటి దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. రెండు.. ఏకాదశి రోజు మొత్తం- ఉపవాసం ఉండాలి. మూడు.. అబద్ధం ఆడకూడదు. నాలుగు స్త్రీ సాంగత్యం పనికి రాదు. ఐదు.. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆరు.. ముక్కోటి రాత్రంతా జాగరణ చేయాలి. ఏడు.. అన్నదానం చేయాలి.

ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల.. నరక బాధలనుభవించే అతని పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!

మురాసురుడి కథ రెండోది

కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడు విష్ణుమూర్తికి విన్నవించారు. రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని, మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు.

విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.

ఇందులోని తాత్త్విక సందేశం ఇలా వుంది. విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. ఉపనిషత్తులు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్ధేశించి ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించాలి.

ఉపవాసం ద్వారా పదకొండు ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకుని, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించమని భావం. పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో కలుపుకుని మొత్తం పది. వాటితో పాటు.. మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం.

అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారని చెబుతారు.

ఇదీ హిందువులు పరమపవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశికి చెందిన పూర్తి సారాంశం.


వైకుంఠ ఏకాదశి నాడు ఆచరించవలసిన విధులు* 

 శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు వైకుంఠానికి తరలివెళ్లే సందర్భం- వైకుంఠ ఏకాదశి.

భక్తులందరికీ పరమ పవిత్రమైన ఈ రోజున ఆస్తికులు ఆచరించాల్సిన విధుల గురించి పెద్దలు ఈ విధంగా చెబుతున్నారు.

వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. స్నానానంతరం పూజాగదిని శుభ్రపరచుకుని తోరణాలతో అలంకరించాలి. వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తికి ప్రశస్తమైన తిథి కాబట్టి, హరికి ప్రీతిపాత్రమైన తులసీదళాలతో ఆ స్వామిని పూజించుకోవాలి.

ఈ రోజున విష్ణుమూర్తిని వైకుంఠద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలగడంతో... తమలాగానే వైకుంఠద్వారాన్ని పోలిన ద్వారం ద్వారా హరిని దర్శించుకునేవారికి మోక్షం కలగాలని వారు కోరుకున్నారట. ఉత్తర దిక్కు జ్ఞానానికి సూచన కాబట్టి.. ఇహలోకంలో కొట్టుమిట్టాడుతున్న తమ మనసుకి పరిపక్వత కలిగించమంటూ ఆ భగవంతుని వేడుకోవడం ఈ ఉత్తర ద్వార దర్శనంలోని ఆంతర్యంగా కనిపిస్తుంది.

ఏడాది పొడవునా ఏ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం కుదరకున్నా, ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అపార ఫలితం దక్కుతుందంటారు. మనలో ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు... ఇలా మొత్తం కలిపి ఏకాదశ ఇంద్రియాలు ఉంటాయి. 

ఈ ఏకాదశ ఇంద్రియాలనూ ఆ హరికి అర్పించే అరుదైన అవకాశమే ఏకాదశి వ్రతం.

ఇందుకోసం ముందురోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండి, ఏకాదశి రోజున కేవలం తులసి తీర్థాన్నే స్వీకరిస్తూ, మర్నాడు ఉదయం ఎవరికన్నా అన్నదానం చేసిన పిదప భుజించాలి.

ఏకాదశి రోజు రాత్రి భగవన్నామస్మరణతో జాగరణ చేయాలి. ఇలా జాగరణతో మనసునీ, ఉపవాసంతో శరీరాన్నీ అదుపు చేసుకుని... వాటిని హరిధ్యానంలోకి మరల్చడమే ఏకాదశి వ్రత ఉద్దేశం. అందుకనే లౌకికమైన ఆలోచనలు వేటికీ తావివ్వకుండా కేవలం హరినామస్మరణ మీదే మనసుని లగ్నం చేయాలని చెబుతారు. 

 ఇలా నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేసినవారికి ఇహపర శాంతి లభిస్తుంది.

 *హరినామ స్మరణం...* 

 *సమస్త పాప హరణం ....* 


*మార్గశిర శుద్ధ ఏకాదశి ... గీతా జయంతి*

గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పుట్టినరోజు. 

భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున గీతాజయంతి జరుపుకొంటారు. 

గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . 

కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం.

 గీకారం త్యాగరూపం స్యాత్

 తకారమ్ తత్వబోధకమ్

 గీతా వాక్య మిదమ్ తత్వం

 జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:

 గీత అను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపు చున్నది. 

"గీ" అనే అక్షరం త్యాగాన్నిను బోధించుచున్నది. "త" అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది. 

గీత అనే రెండుశబ్దములకు అర్థము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు. 

త్యాగశబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్థము వుంది . అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ, బంధమునుండి విముక్తి కలగటం అనే అర్థం వుంది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రము ఉపదేశించుచున్నది. 

అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈరోజు ఆపవిత్రగ్రంథాన్ని సృజించినా మహాపుణ్యము వస్తుంది

ఇక పఠన ప్రభావాన్ని వర్ణించనలవికాదు. మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథ రాజాన్ని ఈ రోజునుంచైనా పఠించటం మొదలెడదాం. 

  సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|

 పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం గీతామృతమ్మహత్||

ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. అందుకే అంటారు, సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా,అర్జునుడిని దూడగ మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా, ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి, ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే, మరొపక్క లొకానికి పాలను(ఉపనిషత్ సారమైన గీతను)అందించాడట.

అందుకే గీత సకల ఉపనిషత్ ల సారం. అర్జునుడు కాక మరెవరి ద్వారానూ ఈ ఉపదేశం ఇంత చక్కగానూ శాశ్వతకాలమూ అందరికీ చేరదు. ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునునికి ఈ మోహబుద్ధిని పుట్టించి, ఇనుముతో వస్తువుని చేయించదలచినవాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో, అలా అర్జునునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు. ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు, 

 మన వర్త్మానువర్టంతే మనుష్యాః పార్థ సర్వశః.

అంటే నేననుకున్న మార్గానికే వాళ్ళొస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను.

ఎప్పుడో ద్వాపరయుగంలో చెప్పింది ఇప్పుడు పాటించాలా,ఇప్పటికి అప్పటికి చాలా తేడా అని

కొందరి భావం.

అప్పుడు మనిషిలో స్వార్ధం,అహం,లాభం,మోసం

ఇంకా ఎన్నో చేదు భావనలు ఉన్నాయో,ఇప్పటికి మనిషిలో ఆ గుణాలు ఎక్కువైపోయాయి,

కాబట్టి కాలం మారినా పరిస్థితులు మారినా

మనిషి నైజం,బుధ్ధి మారలేదు.....

ఏ యుగానికైనా ఏ రోజుకైనా మానవాళికి పనికి వచ్చే బోధనలు భగవద్గీత సొంతం

.ఇది ఆ మతం ఈ మతం అని కాకుండా సర్వ మాన వాళికి పనికి వచ్చే అపురూప గ్రంధం,అద్భుతాలను నింపుకున్న ఆదర్శ గ్రంధం..

మాహేశ్వర సూత్రాలు...

 

#మాహేశ్వర సూత్రాలు:


పూర్వం పరమశివుడు నాట్యం చేస్తూ తన ఢమరుకాన్ని పదునాలుగు పర్యాయాలు మ్రోగించగా,ఆ శబ్దం నుండి పుట్టిన అక్షరాలను ‘పాణిని’ అనే ఋషి గ్రహించి,పదునాలుగు వ్యాకరణ సూత్రాలుగ రచించాడు. ఈ సూత్రాలే  "మాహేశ్వర" సూత్రాలుగ పిలువబడుతున్నాయి, ఆ సూత్రాలే అక్షరాల పుట్టుకకి ముఖ్య భూమికలు. ఈ శ్లోకం చూడండి. " నృత్తావసానే నాటరాజ రాజో / ననాద ఢక్కాం నవ పంచవారం"

(నవ=తొమ్మిది. పంచ=ఐదు కలిపితే =14)

ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్ /ఎతద్విమర్శే శివ సూత్రజాలం// అక్షరాలని సృష్టించి సూత్రీకరించింది పాణిని ఐతే, వాటికి వార్తీకం వ్రాసినది ‘వరరుచి’. వివరణాత్మకమైన భాష్యాన్ని వ్రాసినది ‘పతంజలి మహర్షి.’ అందుకనే "“వాక్యకారం వరరుచిం/ భాష్యకారం పతంజలిం/పాణినిం సూత్రకారంచ/ ప్రణతోస్మి మునిత్రయం// అని ముందుగా పైముగ్గురు మునులకి నమస్కరించి, పూర్వం  వ్యాకరణాన్ని, తద్వారా భాషని అభ్యసించేవారు. పదునాలుగు సూత్రాలని తెలుసుకొందాం.  ఇవి పరమేశ్వరుడు చేసిన ఢమరుక శబ్దం నుండి గ్రహింపబడినవి.


1‘అ ఇ ఉ ణ్’ (అకార, ఇకార, ఉకారాలు)

2‘ఋ లు క్’ (ఋకార అలుకారాలు)

3‘ఏ ఓం గ్’ ( ఏకార, ఓకారాలు)

4‘ ఐ ఔ చ్’ (ఐ కారము, ఔ కారము)

5‘హ య వ ర ట్’ (హకార, యకార, వకార, రకారాలు.)

6‘ల ణ్’ (లకారం)

7‘ఙ, మ, ఞ, ణ నం’ ( వర్గల యొక్క చివరి ఐదు అక్షరాలు )

8‘ఝ, భ య్’ ( ఝాకార, భకారాలు)

9‘ఘ,ఢ,ధ ష్’ ( ఘకారం, ఢ కారం, ధకారం)

10‘జ, బ, గ, డ ద శ్’ ( ఐదు అక్షరాలు )

11‘ఖ ఫ ఛ ఠ థ చ ట త వ్’ ( ఎనిమిది అక్షరాలు)

12‘క ప య్’ (క & ప )

13‘శ ష స ర్’( శకార, షకార,సకారాలు )

14‘హల్’ ( హకారం)

 ఈ పదునాలుగు మహేశ్వరుని సూత్రాలు.


ప్రతి సూత్రం చివరఉన్న పొల్లు హల్లులు సులభంగా పలకడానికి నిర్దేశించబడినవి. అట్లే అచ్చులు, హల్లులు కూడ ప్రత్యాహార సంజ్ఞతో సులభంగ అర్థమయే రీతిలో నిర్దేశించబడినవి. అవి తొలి సూత్రములోని మొదటి అక్షరం ‘అ’ నాల్గవ సూత్రములోని చివరి హల్లు ‘చ్’ కలిపితే ‘అచ్’ సంజ్ఞ ఏర్పడి, వాటిమధ్య ఉండే అక్షరాలని ‘అచ్చులు’ అని వ్యవహరిస్తారని, ఐదవ సూత్రములోని మొదటి అక్షరం ‘హ’ని గ్రహించి పదునాల్గవ సూత్రములోని చివర ఉన్న ‘ల్’ అనే పొల్లుతో కలిపితే ‘హల్’అనే సంజ్ఞ ఏర్పడి వాటి మధ్య ఉండే అక్షరాలని ‘హల్’ అనే పేరుతో పిలుతురని పాణిని స్పష్టంగా సూచించాడు.   ఇట్టి సూత్రములతో ఎనిమిది అధ్యాయాలలో పాణిని  మహర్షిచే రచించబడిన తొలి వ్యాకరణ గ్రంథానికి “అష్టాధ్యాయి” అని పేరు. ఈ సూత్రాలకే ‘వరరుచి’ వార్తికాలని, “పతంజలి”భాష్యాన్ని రచించి లోకానికి ప్రసాదించారు.  ఇప్పటికీ ఇదే గొప్ప ప్రామాణిక గ్రంథము.


---వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Wednesday, December 23, 2020 0 comments By: visalakshi

అష్టావక్ర మహర్షి...

 #అష్టావక్ర_మహర్షి....


సకల విద్యావంతుడైన ఏకపాదునకు, సుజాతకు జన్మించిన వాడే అష్టావక్రుడు. ఏకపాదుడు గురుకులాన్ని నడుపుతూ, విద్యార్థులకు వేదవిద్య బోధించేవాడు. అయితే, విద్య బోధించే విషయంలో చాలా కఠినంగా ఉండేవాడు. ఈ విషయంలో నిద్రాహారాలు కూడా లెక్కచేసేవాడు కాదు. ఏకపాదునకు  వివాహమై చాలాకాలం వరకూ సంతానం కలుగలేదు. ఎన్నో నోముల ఫలితంగా సుజాత గర్భవతి అయింది. ఏకపాదుని ఆనందానికి అవధులు లేవు. సుజాతకు నెలలు నిండుతున్నాయి.


ఒకరోజు ఏకపాదుడు నిద్రాహారాలు కూడా లెక్కచేయకుండా తన శిష్యులచేత వేదాధ్యయనం చేయిస్తున్నాడు. విద్యార్థులు అలసిపోతున్నారు... అయినా గురువుకు భయపడి వేదాన్ని అభ్యసిస్తూనే ఉన్నారు. ఇది సుజాత గర్భంలో పెరుగుతున్న శిశువుకు బాధాకరంగా తోచింది. వెంటనే తన తండ్రితో ‘ తండ్రీ.., ఏమిటీ విద్యాబోదన ? శిష్యులు నిద్రాహారాలు లేక సొలసిపోతున్నారు. వారి ఆరోగ్యం పాడవుతోంది.ఈ విదమైన విద్యావిధానాన్ని మార్చుకో ’ అని గర్భంలోంచే సలహా ఇచ్చాడు. ‘తనకు పుట్టబోయే కుమారుడు.., తనకు సలహాయిచ్చేంత గొప్పవాడా’ అని ఏకపాదుడు అహంకరించి, ఆ గర్భస్థ శిశువును ఉద్దేశించి.. ‘నీ జన్మకు కారణభూతుడనైన తండ్రినే విమర్శించేంత ఘనుడవా నీవు ? వేదాధ్యయనమునకు వక్రముగా గురువునే విమర్శించిన పాపానికి ప్రతిఫలంగా నీవు ‘అష్టావక్రుడు’గా జన్మించు’ అని కోపంగా శపించాడు. ఆ గర్భస్థ శిశువు తన తండ్రి శాపాన్ని ఆనందంగా స్వీకరించాడు.


సుజాతకు తొమ్మిది నెలలు నిండాయి. ప్రసవ సమయం దగ్గర పడిందని., ఇక రెండు మూడు రోజులలో శిశు జననం జరుగుతుందని గ్రహించాడు ఏకపాదుడు. ప్రసవ సమయానికి అవసరమైన తిలలు, ఘృతము, ఇతర ధాన్యములు సంపాదించే నిమిత్తం ఏకపాదుడు జనకుని రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ అనుకోని విధంగా వరుణుని కుమారుడైన వందితో వాదానికి దిగి ఓడిపోయాడు. పోటీ నియమానుసారం వంది.., ఏకపాదుని జల మధ్యంలో బంధించాడు. సరిగ్గా ఆ సమయంలోనే సుజాత., తన అన్న అయిన ఉద్దాలకుని ఇంట ఒక మగ శిశువును ప్రసవించింది. అయితే తండ్రి శాపానుసారం ఎనిమిది వంకరలు గల దేహంతో జన్మించాడు. అందుచేతనే అతనికి  ‘అష్టావక్రుడు’ అని పేరు వచ్చింది.


ఉద్దాలకుడు తన కుమారుడైన శ్వేతకేతునకు, అష్టావక్రునకు సమంగా వేదవిద్య నేర్పుతున్నాడు. ఒకరోజు అష్టావక్రుడు తన మేనమామ అయిన ఉద్దాలకుని తొడపైన కూర్చున్నాడు. అది చూసిన శ్వేతకేతువు గబగబా వచ్చి ‘నా తండ్రి తొడ మీద నేను కూర్చోవాలిగానీ., నువ్వెలా కూర్చుంటావు? వెళ్లి నీ తండ్రి తొడమీద కూర్చో.’ అని ఘర్షణకు దిగాడు. వెంటనే అష్టావక్రుడు తన తల్లి దగ్గరకు వెళ్లి ‘ అమ్మా..నా తండ్రి ఎక్కడ అని అడిగాడు’. ధన సంపాదనకై జనకుని సభకు వెళ్లారని చెప్పింది సుజాత. వెంటనే అష్టావక్రుడు జనకుని సభకు వెళ్లి., జరిగిన సంగతి తెలుసుకుని తన వాదనతో వందిని ఓడించి, తన తండ్రితో పాటు, గతంలో ఓడి బంధింపబడిన వారినందరినీ కూడా జలమధ్యం నుంచి విడిపించాడు. ఆ తర్వాత తన తండ్రిని తల్లికి అప్పగించి, తల్లికి ఆనందం కలిగించాడు.


అష్టావక్రునకు యుక్తవయస్సు వచ్చింది. వివాహం చేసుకోదలచి వదాన్యుని దగ్గరకు వెళ్లి అతని కుమార్తె అయిన ‘సుప్రధ’ను తనకు కన్యాదానంగా ఇమ్మని అర్థించాడు. వదాన్యుడు అతని శక్తిని పరీక్షింపగోరి ‘నీవు ఉత్తరదిశగా వెళ్లి, కుబేరుని పట్టణం దాటి, కైలాసగిరి చేరి, శివపార్వతులు సంచరించిన ప్రదేశం దాటి ముందుకు వెడితే ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమెను చూసి రా..అప్పుడు నా కుమార్తె ‘సుప్రధ’ నీకిచ్చి వివాహం జరిపిస్తాను’ అని పలికాడు.


అష్టావక్రుడు ఉత్తరదిశగా బయలుదేరాడు. ముందుగా కుబేర పట్టణం చేరాడు. కుబేరుడు అతనికి స్వాగతం పలికాడు. అష్టావక్రుడు, కుబేరుని ఇంట రంభ, ఊర్వసి, తిలోత్తమల నృత్యగానాలను ఆస్వాదిస్తూ ఒక సంవత్పరం అతిథిగా కాలం గడిపి, తిరిగి తన ప్రయాణం కొనసాగించి.. హిమాలయాలలో బంగారుమయమైన ఒక దివ్యభవనాన్ని చూసాడు. అక్కడ కొందరు సుందరీమణులు అష్టావక్రునకు స్వాగత మర్యాదలు జరిపి ఆ భవనంలోకి తీసుకుని వెళ్లారు. ఆ భవనంలోపల ఒక జగన్మోహిని చిరునవ్వుతో అష్టవక్రుని దగ్గకు వచ్చి ప్రేమగా అతనిని తన అభ్యంతర మందిరానికి తీసుకుని వెళ్లి, తన కోరిక తీర్చమని అర్థించింది. ‘తల్లీ.. నేను అస్ఖలిత బ్రహ్మచారిని. పరసతిని కూడుట ధర్మం కాదు. నన్ను విడిచిపెట్టు’ అని అర్థించాడు. ‘ఈ రాత్రికి మా ఆతిథ్యం స్వీకరించి వెళ్లండి’ అని కోరింది ఆ సుందరి. అంగీకరించాడు అష్టావక్రుడు. తెల్లారింది. అష్టావక్రుడు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అప్పుడా జగన్మోహిని అతని దగ్గకు వచ్చి ‘ మహాత్మా...పరసతిని అనే కదా మీ అభ్యంతరం. నన్ను వివాహం చేసుకోండి. మీ సతిని అవుతాను. కాదనవద్దు.’ అని అర్థించింది. ‘అమ్మా...నీవు బాలవు. నీ వివాహ విషయంలో నీ తండ్రిగానీ, సోదరుడుగానీ నిర్ణయం తీసుకోవాలిగానీ.. నీకుగా నీవు స్వతంత్రించి నిర్ణయం తీసుకునే అధికారం నీకు లేదు. నిజం చెప్పు. నువ్వెవరు?’ అని ప్రశ్నించాడు అష్టావక్రుడు. ఆమె అతని దర్మనిష్ఠకు సంతసించి ‘మహామునీ..నేను ఉత్తరదిక్కాంతను. మిమ్ములను పరీక్షింపమని వదాన్యుడు నన్ను పంపాడు. ఈ పరీక్షలో విజయాన్ని వరించారు. వెళ్లి సుప్రధను వివాహం చేసుకోండి.’ అని పలికింది. ఆ తర్వాత  సుప్రధ, అష్టావక్రుల వివాహం ఘనంగా జరిగింది.

---నామనసిధ్ధాంతి

రోలు..రోకలి.. తిరుగలి

 #పెళ్లి వేడుకల సమయంలో రోలు, రోకలి వంటివాటిని పూజిస్తారెందుకు? అది దేనికి సంకేతం తెలుసుకుందాం* 


రోలు, రోకలి, తిరుగలి ఈ మూడు మానవ జీవితంలో ముడివడి ఉన్నవి. ధాన్యం, జొన్నలు, సద్దలు, రావులు, తైదులు, కొర్రలు మొదలగు ధాన్యాలను మొదట దంచి వంటకు అనువుగా చేసుకొని అన్నం వండుకుంటారు. ఇక కందులు, పెసలు, శనగలు, మినుములు తిరుగలితో విసిరి పప్పులు చేసుకుంటారు. రుబ్బురోలుతో మినపపప్పు ఇతరములు రుబ్బుకొని పిండివంటలు చేసుకుంటారు. మనిషి తినాలి అంటే రోలు, రోకలి, తిరుగలి, రుబ్బురాయి ఇవి తప్పనివి. ప్రొద్దున్నే లేచి పిండి విసురుకోవటం, ధాన్యం దంచుకోవటం, మిరపకాయలు కారం కొట్టుకోవటం, పసుపు కొమ్ములు పసుపు కొట్టుకోవటం ఇవన్నీ నిత్యకృత్యములు. విసురుట, దంచుట, నూరుట గృహిణికి మంచి ఆరోగ్యసూత్రాలు. అప్పటి వారికి అందుకే రోగాలు వచ్చేవి కావు.


పెళ్లి కుదిరిందంటే రెండు నెలల ముందునుంచి వడ్లు దంచుకోవటం, కారం, పసుపు కొట్టుకోవటం, అరిసెల పిండి కొట్టుకోవటం, ఇవి పదిమంది కలిసి చేసేవారు. ఇపుడు యాంత్రిక యుగం వచ్చినది. అన్నిటికీ యంత్రాలే. అన్నీ రెడీమేడ్‌గా షాపులో దొరుకుతున్నాయి. కారం, పసుపు, పిండి, చివరికి ఊరగాయలు, కూరలు కూడా కొంటాము. వారు అందులో ఎన్ని కల్తీలు చేస్తున్నారో, మన ఆరోగ్యానికి ఎంత ఆపద రాబోతుందో

తెలియడం లేదు.వస్తువులతోపాటు రోగాలను కొంటున్నాము. రోగాలకు మందులు కొంటున్నాము. మందులు వాడిన పంటను తిని మనం కూడా మందులు వాడుతున్నాం.


అందుకే వివాహం, ఉపనయనం మొదలగు శుభకార్యాలలో మన సంప్రదాయాన్ని గుర్తుచేయటం, స్వయంగా అన్నీ సిద్ధంగా చేసుకోండి. మీరు తినండి, పదిమందికి పెట్టండి అనే రోలు, రోకలి, తిరుగలిని పూజిస్తాము. బలరాముడు నాగలిని, రోకలిని ఆయుధాలుగా ధరించాడు. నాగలితో భూమిని దున్ని, పంటను పండించి, ఆ పంటను రోకలితో దంచి భుజించండి అన్ని చెప్పిన బలరాముడు నిజమైన రైతుకు ప్రతినిధి. రోలు లక్ష్మీదేవి, రోకలి నారాయణుడు, తిరుగలి శివుడు, దాని పిడి పార్వతి. ఇట్లు ఆయా అధిష్ఠాన దేవతలను పూజించి ధనధాన్య సమృద్ధి కలగాలని ప్రార్థించడం రోలు, రోకలి, తిరగలిని పూజించడంలోని అంతరార్థము.


#లోకాన్ సమస్తాన్ సుఃఖినోభవంతూ! 🙏

Tuesday, December 22, 2020 0 comments By: visalakshi

కదండి..ద్విదండి..త్రిదండి..

 🙏ఓం నమః శివాయ🙏


#కదండి.. ద్విదండి... త్రిదండి అంటే ఏమిటి?


మనం ఎంతో మంది పీఠాధిపతులను లేదా యతీంద్రులను (స్వాములను) చూస్తూ వుంటాం. వారి చేతుల్లో కర్రలు పట్టుకోని వుండటం కూడా చూసివుంటాం. ఆ కర్రలను దండెములు అంటారు. అవి,  వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత మరియు విశిష్టాద్వైత భావానికి సంకేతాలు. వారి చేతిలో పొడవాటి కర్రలు ఎల్లవేళలా పట్టుకుంటారు. ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికి కూడా ఓ అర్థం ఉంది. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల (5) సమ్మేళనమే మనిషి, కాబట్టి సన్యాసులు అయిదు అడుడుగుల కర్రను ధరిస్తారు.


ఆ యతీంద్రులు తమ చేతి ధరించే, కర్రలలో ఏకదండి (ఒక కర్ర), ద్విదండి (రెండు కర్రలు), త్రిదండి (మూడు కర్రలు) అని మూడు విధాలుగా ఉన్నాయి. దండి అంటే కర్ర అని అర్థం. ఒక కర్రను (ఏకదండి) ధరించే వారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారని అర్థం. అద్వైతం అనగా జీవాత్మ, పరమాత్మ ఒక్కటేననే సిద్ధాంతం. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు అనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. ఇది  జగద్గురు ఆది శంకరాచార్యుల వారు బోధించినది. ఈ అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించే వారి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుండి సేకరించిన ఒక కర్ర ఉంటుంది.


ఇక రెండవ సిద్ధాంతం ద్వైతం. రెండు కర్రలు కలిపి (ద్విదండి) ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం అనసరించి బోధించేవారు. వీరి ప్రథమాచార్యుడు మధ్వాచార్యులు. వీరిని ‘ద్విదండి స్వాములు’ అంటారు వీరు విష్ణుభక్తులు. వీరు పరమాత్మ వేరు మరియు జీవాత్మ వేరు అని బోధిస్తారు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.


ఇక మూడవది విశిష్టాద్వైతం. మూడు కర్రలను కలిపి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారిని తత్వత్రయం అనుసరించే వారు అంటారు. వీరిది భగవద్రామానుజాచార్యుల పరంపర. ఈ సిద్ధాంతం ప్రకారం, శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ, జీవుడు ఆజ్ఞానంతో సంసార బంధంలో చిక్కుకుంటాడని, నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుండి విముక్తులై, మరణానంతరం నారాయణ సాన్నిధ్యం (మోక్షం) పొందుతారని, వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు .

ఈ మూడు కర్రలలో, ఒక్కో దండం ఒక్కోక్క తత్వానికి గుర్తు. ఒకటి జీవుడికి, ఒకటి ప్రకృతికి మరియూ ఒకటి పరమాత్మకి. మనం చూసే ఈ ప్రపంచం అంతా ఈ మూడు తత్వాలతోనే నిండి ఉంటుంది అని వేదం తెలియజేస్తుంది. వేదార్థాన్ని వివరించే పురాణాలు, ఇతిహాసాలు, వాంగ్మయాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. తత్వాలు అన్నింటినీ మూడుగా విడదీయవచ్చు. అందులో మనం లెక్కకు అందనంత మంది జీవులు వుంటారు. రెండోది రకరకాల చిత్ర విచిత్ర రూపాలు మార్చుకొనే పంచభూతాత్మకమైన ప్రకృతి. ప్రకృతి అంటే అచేతనమైనది మరియు ప్రకృతికి జ్ఞానం ఉండదు. అందుకే దానిని అచిత్తు అని అంటారు. చేతన రహితమైనప్పటికీ చేతనమైన జీవ సంబంధంచే తన రూపాన్ని మార్చుకుంటుంది. కర్మ సంబంధం చేత సహజమైన జ్ఞానం కలిగి అణుస్వరూపుడైన జీవులు, ఈ ప్రకృతిని శరీరాలుగా దాల్చి ఉంటారు. ఎనభైనాలుగు లక్షల రకాల జీవులు ఈ విశ్వంలో వుంటారని చెబుతారు. ఈ జీవులంతా ప్రకృతిలో సంచరిస్తూ, కర్మ అనుభవాన్ని కష్టమైనదో లేక సుఖమైనదో ఎదో ఒకదాన్ని పొందుతూ ఉంటారు. ప్రకృతిని జీవరాశిని ఈ రెండు తత్వాలని నిరంతరం బయట లోపల వ్యాపించి వాటిని నిలబెట్టి, వాటికి కావల్సిన శక్తిని ఇచ్చి నడిపిస్తూ ఉండే తత్వం పేరే పరమాత్మ. ఈ పరమాత్మ అనే తత్వం మూడోది. ఈ మూడు తత్వాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి, విడిచి ఉండటం అనేది లేనే లేదు. పరమాత్మ జీవాత్మ ప్రకృతిలలో వ్యాపించి ఉంటాడు. జీవుడు ప్రకృతిలో నిరంతరం ఉంటాడు. అంటే మరి ముక్తి ఉండదా అని అంటే అట్లాంటి సందేహం అవసరం లేదు. ప్రకృతి అనేక రకాలుగా అనేక గుణాలతో ఉంటుంది. ప్రకృతికి సత్వ, రజస్సు అని మరియు తమస్సు అనే గుణాలు కలిసి వుంటాయి. అందుకే మిశ్రమ తత్వం అని పేరు. రజస్సు, తమస్సు ఏమాత్రం లేని కేవలం సత్వం మాత్రమే ఉండే సుద్ద సత్వ ప్రకృతి విరజా నదికు ఆవల ఉండే ప్రకృతి. ఇవి రెండు కాక గుణములకు అతీతమైన కాలం అనేది ఒక ప్రకృతి. కాలం కూడా ప్రకృతిలో ఒక భాగమే, అందుకే అది సత్వ శూన్యం అని పేరు. ఇలా మూడు రకాలుగా ఉండే ప్రకృతి, ఎన్నో జీవులు, వీటికి వెనకల ఉండి నడిపించే పరమాత్మ ఈ మూడుతత్వాలని విశ్వసించి మనకు మార్గం చూపే యతులు త్రిదండాన్ని ధరించాలని శాస్త్రం యొక్క నిర్ణయం. ఈ మూడు దండాలను కలిపి కట్టి, ధరించిన వ్యక్తిని త్రిదండి అని అంటారు. చక్రం ధరించిన వాడిని చక్రీ అన్నట్టుగానే 'త్రిదండీ' అని సంస్కృతంలో పదం వస్తుంది, అదే తెలుగులో 'త్రిదండి' అని వ్యవహరిస్తాం. శ్రీవైష్ణవ సంప్రదాయంలో యతులు త్రిదండాన్ని ధరించాలని నియమం. వేదం కానీ, ఇతిహాసాలు ఇదే విషయాన్ని ప్రస్తావించాయి.


దత్తాత్రేయుడు అనే భగవంతుడు వేదోద్దరణకై ఎత్తిన అవతారం. కర్నాటక రాష్ట్రంలో, మండ్యా దగ్గరలో మేలుకోట క్షేత్ర ప్రాంతంలో ఆయన పాద చిహ్నాలు ఉంటాయి. అక్కడి పుష్కరిణికి దత్తాత్రేయ పుష్కరిణి అని పేరు. భగవంతుడు, అత్రి మహర్షికి అనసూయకు తనను తానే వారి పుత్రునిగా అర్పించుకోవడం చేత దత్తుడు అయ్యాడు. అందుకే ఆయన పేరు దత్తాత్రేయుడు అయ్యింది. వైదిక ధర్మాన్ని లోకానికి నెలకొల్పి ఉన్నాడు, ఆయనకూడా త్రిదండి సన్యాసి అని తెలుస్తున్నది. ఈ నాడు దత్తాత్రేయుడు అని మూడు ముఖములో, చూపించే దత్తాత్రేయుడు వేరే అని తెలుస్తున్నది. మనకు ప్రామాణికమైన గ్రంథాలు తెలిపే దత్తాత్రేయుడు తిదండి సన్యాసి అని తెలుస్తున్నది. అందుకే అవసరం ఏర్పడినప్పుడు తిదండి సన్యాసులు మేలుకోటలో దత్తాత్రేయుని వద్దకి వెళ్ళి తిదండాన్ని పొందే సంప్రదాయం ఉంది.  రామానుజుల వారి చరిత్రలో వారికి కుళోత్తుంగచోళుడి వల్ల ఏర్పడ్డ ఉపద్రవం నుంచి రామానుజుల వారిని తప్పించడానికి, కూరేశులు రామానుజులవారి దండాన్ని మరియు కాశాయాన్ని తాను ధరించి, రామానుజులవారిని పశ్చిమ దేశం వైపు పంపారు. రామానుజులవారు మేలుకోట ప్రాంతం చేరే సరికి వారి వద్ద త్రిదండం, కాశాయం లేదు. తిరిగి వాటిని పొందే అవకాశం లేదు. అందుకే వారు మేలుకోటలోని దత్తాత్రేయుడి వద్ద కొత్త త్రిదండాన్ని, కాశాయాన్ని ఉంచి స్వీకరించినట్లు చరిత్ర చెబుతుంది.


🙏🔱ఓం శ్రీ రుద్రాణీ సమేత శ్రీ రుద్రకోటేశ్వరాయ నమః🔱🙏🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏

Monday, December 21, 2020 0 comments By: visalakshi

మిత్రా సప్తమి....

 ఈ రోజు మిత్రా సప్తమి*


మార్గశిర్ష మాసంలోని శుక్ల పక్ష సప్తమిలో మిత్రా సప్తమిని జరుపుకుంటారు. సూర్య సప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఆనందంతో జరుపుకుంటారు.  సూర్యుడిని మిత్రా అంటే స్నేహితుడు అని కూడా పిలుస్తారు.  అందువల్ల *ఈ రోజును మిత్రా సప్తమి* అని కూడా జరుపుకుంటారు. ఈ రోజున భాస్కరుడిని భక్తులు  పూర్తి భక్తితో , ఆచారాలతో పూజిస్తారు. గంగా , యమునా వంటి పవిత్ర నదుల ఒడ్డున నిలబడి ప్రజలు సూర్యుడిని ఆరాధిస్తారు మరియు  నీటిని అందిస్తారు.


#మిత్రా సప్తమి యొక్క చారిత్రక ప్రాముఖ్యత*


సూర్యదేవ కశ్యప మరియు అతని భార్య అదితికి జన్మించారు. దీనిని అదితి పుత్రా అంటే అదితి కుమారుడు అని పిలిచేవారు. ఇతిహాసాల ప్రకారం , రాక్షసుల కోపం రోజురోజుకు దేవతలను ఇబ్బంది పెడుతున్నారు. అంతిమంగా రాక్షసుల సైన్యం తమ రాజ్యాన్ని స్వర్గం మీద స్థాపించింది , దీనివల్ల ప్రతి ఒక్కరూ కలత చెందుతారు , సమస్యకు పరిష్కారం కోసం వెతుకుతారు.  చుట్టుపక్కల అందరి దుస్థితిని చూసి , దేవతల తల్లి (దేవ మాతా) అదితి సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తుంది. ఆదితి అంకితభావంతో సూర్య దేవుడు సంతోషించి ఆమె ముందు కనిపిస్తాడు. రాక్షసుల సమస్యను పరిష్కరించడానికి , అదితికి చెప్తాడు , దేవుని కుమారులను రాక్షసుల కోపం నుండి రక్షించడానికి అతను ఆమె గర్భం నుండి జన్మనిస్తాడు. దేవుడు చెప్పినట్లు , కొంత సమయం తరువాత అదితి గర్భం ధరిస్తుంది.


తన కొడుకును అన్ని ఇబ్బందులు మరియు బాధల నుండి రక్షించడానికి ఆమె వివిధ రకాల ఉపవాసాలు మరియు ఆరాధనలను చేస్తుంది. ఇవన్నీ చూసి కశ్యపుడు కలత చెందుతాడు , మరియు చాలా ఉపవాసాలు పాటించడం ద్వారా ఆమె శరీరాన్ని నొక్కిచెప్పకుండా , ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సలహా ఇస్తాడు. ఇది గర్భస్రావం కావచ్చు మరియు పిండానికి కూడా మంచిది కాదు.  దీనిపై అదితి తన భర్తకు పెద్దగా చింతించవద్దని చెబుతుంది , ఎందుకంటే ఆమె బిడ్డ భగవంతుని ఆశీర్వాదం మరియు ఏ శక్తి దానిని నాశనం చేయదు.  అదితి పవిత్ర సమయంలో కొడుకుకు జన్మనిస్తుంది.  అతను కథానాయకుడిగా మారి రాక్షసుల సైన్యాన్ని చంపుతాడు. ఆ విధంగా , దేవతలను ,  రాక్షసుల నుండి రక్షించడం. సూర్య ఉపనిషత్తు , భవష్య పురాణం , మత్స్య పురాణం , బ్రహ్మ పురాణం , మార్కండేయ పురాణం మరియు సంపూర్ణం సూర్యుని మహిమను వివరించే కొన్ని గ్రంథాలు.


#మిత్రా సప్తమి పూజ*


సూర్యదేవుణ్ణి అంకితభావంతో మిత్రా సప్తమి ఉపవాసం పాటించబడుతుంది. భగవంతుడిని ఆరాధించే ఆచారాలు మార్గశిర్ష నెల ప్రారంభంతో ప్రారంభమవుతాయి. ఇంద్ర సప్తమి రోజున సూర్యుడిని పూజిస్తారు. ఈ రోజున పరిశీలకుడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి తన దినచర్యలన్నీ పూర్తి చేసిన తరువాత స్వామిని ఆరాధిస్తాడు. సూర్యదేవుణ్ణి సరైన ఆచారాలతో పూజిస్తారు. పండ్లు , మరియు వివిధ రకాల వంటకాలు స్వామికి అర్పిస్తారు.


భక్తుడు  సప్తమిలో మాత్రమే పండ్లు తినాలి మరియు స్వీట్లు తినడం ద్వారా అష్టమిపై ఉపవాసం ముగించాలి. ఈ ఉపవాసం పాటించడం ద్వారా భక్తుడు దీర్ఘాయువు పొందుతాడు. ఈ రోజున సూర్యరశ్మిని గ్రహించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.


#మిత్రా సప్తమి యొక్క ప్రాముఖ్యత*


పూజా కార్యక్రమంలో కుటుంబ సభ్యులందరూ పాల్గొనాలి. స్వామిని ఆరాధించడానికి పండ్లు , పాలు , వర్మిలియన్ , బాదం , జీడిపప్పు మొదలైనవి *మిత్రా సప్తమి* రోజున తయారుచేస్తారు. హిందూ ఆచారాలలో ఇది చాలా పవిత్రమైన మరియు ఫలవంతమైన ఉపవాసంగా పరిగణించబడుతుంది. ఇది భక్తులకు శ్రేయస్సు మరియు సంపదను ఇస్తుంది.

ఫేస్బుక్ సౌజన్యంతో..ఈ బ్లాగులో ఈ టపా...