Saturday, August 20, 2016 0 comments By: visalakshi

సమత - మమత

  ఓం శ్రీ సమర్ధ సద్గురు సాయినాధాయ నమో నమ:

 భక్తులకు కావలసినది సమతయే కానీ మమత కాదు.  ఒకానొక రామభక్తుడు- ప్రతిదినమును బాబా సన్నిధియందు కూర్చుని విష్ణు సహస్రనామమును పఠించెడివాడు. అంతా మిధ్యయని ఎరిగి, ఆధ్యాత్మమార్గమున ప్రవేశించి కూడా అతగాడు . ' తన ' 'పర ' భేదము విడువలేకుండెను. అట్టి ఆతని మమతలను త్రుంచి - సమతను బోధించుటకై బాబా ఈ విధముగా తెలిపినారు.


  ఒకనాడా రామభక్తుని పరోక్షమునందు బాబా, ఆతని విష్ణు సహస్రనామ గ్రంధమును తీసి శ్యామాకు బహుకరించినారు. ఆతనితో తగువవునని శ్యామా భయపడిననూ - బాబా వినలేదు.మరికొంతసేపటిలోనే వచ్చిన రామభక్తుడు   శ్యామా వద్ద తన గ్రంధమును చూసి యుద్ధమునకు దిగినాడు, నానాదుర్భాషలనాడినాడు.ఆతని ఆవేశమొక స్థాయికి వచ్చువరకును ఆగి, పిదప బాబా మెల్లగా ఇట్లు చెప్పినారు. - "ఓయీ రామభక్తుడా - కొంచెము ధనము వెచ్చించినచో ఇంకొక పుస్తకము వచ్చునుగాని, మాటలతో మనసు గాయమైనచో ఆ మనిషి మరల మనతో స్నేహం చేయడు సుమా! అయిననూ నీకా విష్ణు సహస్రము ఖంఠోపాఠముగా వచ్చును కదా! ఇక పుస్తకముతో పని ఏమి?దానిని మరియొకరు చదువుకొనుటకు నీకు ఆక్షేపణ ఏల? ఓ అమాయకుడా! భక్తులకు కావలిసినది ' అది నాది ' - 'ఇది నాది 'అను మమత కాదు..సాటి మానవుల పట్లనూ, సమస్త జీవరాసుల పట్లనూ సమత కావలెను.' అంతా రామమయం. జగమంతా రామమయం 'అని వినలేదా! నీ గ్రంధమును నేనే ఉద్దేశ్యపూర్వకంగా తీసి శ్యామాకి ఇచ్చాను.నీ ఆవేశమునణచుకొనుము."  బాబా బోధన వినికూడా ఆ భక్తుడు శాంతి లభింపక "బాబా ! మీరు నాకు చెప్పిన రీతిగా శ్యామాకు ఏల చెప్పరు? ఆతని వస్తువు నేనంటినచో ఆతడూరుకొనునా?" ఆతని వద్దనున్న గ్రంధములను నాకు యిచ్చునా?" అని అడిగినాడు. బాబా శిష్యుడగు శ్యామా - ఆ రామభక్తుని మాట పూర్తయినదే తడవుగా - "తప్పక ఇచ్చెదను. నీకే గ్రంధములు కావలెనో తీసుకొని పొమ్ము"అనెను. భక్తుడు ఖంగు తినినాడు. బాబా తమ సహజ సుందర మందస్మితముతో భక్తుని జూచుచు వింటివిగా శ్యామా చెప్పినది. నీవు కూడా శ్యామావలెనుండుటకు యత్నించుము.


 గుర్తుంచుకొనుము..."మమత"  ఇహమందు  బంధించును..."సమత" పరమునకు పైడి బాటలు వేయును..అని బోధించిరి.

వారి మాటలు మంత్రములు, భక్తి జ్ఞాన కర్మయోగములనూ- ద్వైతాద్వైత విశిష్టములను రంగరించి బాబాయొనరించిన అమృతబోధ...ఈ సచ్చరిత్ర.... 

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.

Thursday, August 18, 2016 0 comments By: visalakshi

తన్మయానుభూతి

 ఓం శ్రీ సాయినాధాయ నమో నమ: సాయినాధా! నిన్ను రోజూ మనసారా తలుచుకోవడం తప్ప సరిగా క్రమంగా అర్చించలేకపోతున్నానన్న వేదన నా అంతరంగమున కదలాడుతూ ఉండేది ...ఈ రోజు సాయంత్రము సమయము చూసుకొని తప్పనిసరిగా ఒక అధ్యాయమైనా మననం చేయాలన్న సంకల్పం తో సంధ్యారతి తదుపరి సచ్చరిత్రలో ఒక అధ్యాయము తీయగా 26 వ అధ్యాయము వచ్చింది..అందలి సందేశము....

" ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టింపబడినది. ఈ వస్తువులు నిజముగా ఉండియుండలేదు. నిజముగా ఉండునది ఒక్కటే అదియే భగవంతుడు.చీకటిలో తాడును చూసి పామనుకొనునట్లు, ప్రపంచములో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు,    కనిపించును; గాని అంతర్గతముగా నున్న సత్యమును తెలుసుకోలేము. సద్గురువే మన బుద్ధియను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా జూచునటుల జేయును.మన కగుపడునది నిజస్వరూపము కాదని గ్రహించెదము. కాబట్టి సద్గురుని అసలయిన దృష్టిని కలుగజేయుమని ప్రార్ధింతముగాక! అదే సత్యదృష్టి." 
 ఆంతరిక పూజ:---

ఆనందభాష్పములతో తనివితీరా సద్గురుని పాదములను కడిగెదముగాక! స్వచ్చమైన ప్రేమయను చందనమును వారి శరీరముకు పూసెదముగాక! దృఢవిశ్వాసమను వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక! అష్టసాత్త్వికములను ఎనిమిది తామరపుష్పములు సమర్పించెదముగాక! ఏకాగ్రచిత్తమను ఫలమును సమర్పించెదముగాక! భావమను బుక్కా వారి శరీరముపై జల్లి భక్తియనే మొలత్రాడును కట్టెదముగాక! మన శిరస్సును వారి బొటనవ్రేళ్ళపై నుంచెదముగాక! సద్గురుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పింతముగాక! అట్టి
 ఆనందకమైన ఆంతరిక పూజ చేసిన తదుపరి ఇటుల ప్రార్ధించెదముగాక!
" మా మనస్సును అంతర్ముఖము చేయుము. దానిని లోపలివైపు పోవునట్లు చేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలిసికొను శక్తిని కలుగజేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగునటుల చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించెదము. సుఖదు:ఖానుభవములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకొనుడు... మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక!"

 ఈ విధముగా నా సంశయమును దూరము చేసి, శరణాగతి అన్నావుగా! నా పాదాల చెంత నీ మనస్సును ఉంచు... అని బాబాగారు  బోధించినట్లయి..నా మనస్సు తన్మయ అనుభూతిని పొందింది...

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు. 


Monday, August 15, 2016 0 comments By: visalakshi

భావోద్వేగం

 మనలో ఉద్రేకం ఎగసిపడేటప్పుడు, ఆవేశం ఉప్పొంగినప్పుడు తీసుకొన్న నిర్ణయాలను వెంటనే అమలుపరచకుండా ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే.. మనం ఆ విషమపరిస్థితుల నుండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోగలం. 

ఈ సాంకేతికయుగంలో వాయువేగంతో దూసుకుపోతున్న నేటి తరానికి 'ఆలస్యం అమృతం విషం' అనే నానుడి కన్నా 'నిదానమే ప్రదానం ' అనే నానుడి ఎక్కువ వర్తిస్తుంది.ఈ నియమాన్ని పాటించడం వలన ఎన్నో అనర్ధాలను తప్పించుకోవచ్చు అనడానికి ఒక కధ....

  ఒకసారి మేధాతిధి అనే ముని ఓ సందర్భంలో తన భార్యపై ఆగ్రహోదగ్రుడయ్యాడు. వెంటనే ఆమెను వధించమని కొడుకు చిరకారిని ఆదేశించి నదీస్నానానికి వెళ్ళిపోయాడు. కానీ చేయబోయే ప్రతి పనిలోనూ మంచిచెడులను విపరీతంగా విశ్లేషించుకునే స్వభావం ఆ కుమారుడిది. అదే ధోరణిలో ఆ చిరకారి తండ్రి ఆదేశాన్ని కాసేపు పక్కన పెట్టి , అలా చేయడం ఎంతవరకు సబబు? అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇంతలో మేధాతిధి నదీస్నానం  చేసి వస్తూ అయ్యో! క్షణికోద్రేకం వల్ల ఆ అమాయకురాలిని వధించమని చెప్పి తప్పు చేసాను..కానీ ఏం లాభం! ఇప్పటికి జరగాల్సిన ఘోరం జరిగిపోయే ఉంటుంది! అని పశ్చాత్తాపపడుతూ ఆశ్రమానికి చేరాడు. కానీ భార్య, పుత్రుడు యధావిధిగా ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు..కొడుకు నిదానం, ఎంత ప్రమాదాన్ని తప్పించిందో మేధాతిధికి అర్ధమై ఊపిరి పీల్చుకున్నాడు.

  మనం ఉద్రేకంలో తీసుకొన్న నిర్ణయాల వల్ల మనలో భావోద్వేగాలను నియంత్రించుకునే శక్తి లేకపోవడం వల్ల ఎన్నో ఘోరాలు జరుగుతుంటాయి. సెల్ ఫోన్ లు, ఫేస్ బుక్ లు, ట్విట్టర్ లు, వాట్సాప్ లు ఈ భావోద్వేగాల నియంత్రణకు మరింత విఘాతం కలిగిస్తున్నాయి.  తొందరపాటు నిర్ణయాల వల్ల జరిగే మేలు కన్నా కీడే అధికమని తెలిపే ఉదంతాలు కోకొల్లలు..ముఖ్యంగా విద్యార్ధులు, యువత క్షణికోద్రేకంలోనో, నిరాశకు గురైనప్పుడో తీసుకున్న నిర్ణయాలు ఎన్నో అఘాయిత్యాలకు దారితీస్తున్నాయి.. 
 అందుకే ఒక స్వామి ఇలా అంటారు ! "నీవు ఎప్పుడైనా ఉద్రేకంతో తీసుకున్న నిర్ణయాలను వెంటనే ఆచరణలో పెట్టవద్దు. ఒక కాగితంపై వాటిని రాసుకొని నీ తలగడ కింద పెట్టుకో! మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ కాగితాన్ని తీసి చదువు. అప్పుడు నీ సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుంది" 
Sunday, August 7, 2016 0 comments By: visalakshi

మిత్రుత్వం....Friendship..

         " అందరూ నాకు మిత్రులే! నేనందరికీ మిత్రతనే!"


 మిత్రులుగా ఉండడం సులభం...శత్రువుగా ఉండడం కష్టం...శత్రుత్వం అనేది అగ్ని వంటిది..అది శత్రువు కంటే ముందు తననే దహించి వేస్తుంది.  శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేకుండా ఉంటే సరిపోతుంది కదా అంటే అది సరికాదు. సృష్టి నియమమే ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించడం..ఇదే మిత్రత..స్నేహం.
 అందరితో స్నేహం చేస్తూ అందరినీ ప్రేమించే వారు మిత్రులు.. అందరూ నన్ను మిత్రభావంతో చూడాలి. నేను అందరినీ స్నేహభావంతో చూస్తే ప్రపంచం ఎంతో సుందరంగా కనిపిస్తుంది. 

మనకెవరితోనూ ద్వేషభావం - శత్రుత్వం లేకుండా ఉండాలని ప్రతినిత్యం భగవంతుని ప్రార్ధించాలి. దాని కనుగుణంగా ప్రవర్తించాలి. మన మనస్సులో ఈర్ష్య, పరాపకారబుద్ధి, అసూయ, అసహనము అనే మాలిన్యాలు తొలగించుకొని ఎవరినీ ద్వేషించక అందరినీ మిత్రభావంతో ఎల్లప్పుడూ ఆదరించాలి. 


 భగవంతుని సాక్షాత్కారాన్ని అభిలషించే వ్యక్తి అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి. తన మనసులో రాగద్వేషాలకు తావీయకూడదు. అనన్య భక్తితో పరాత్పరుని సేవించాలి. అందరూ స్నేహ సౌజన్య భావాలతో వర్ధిల్లే విధంగా వాతావరణాన్ని తయారుచేసుకోవాలి. మైత్రీభావంతో శత్రువును కూడా ఆకర్షించవచ్చు..


" మానవ జన్మ ముఖ్య ప్రయోజనం ఈశ్వరాజ్ఞలను పాలించి శుభకామనలతో జీవించాలి. శుభకార్యాలను ఆచరించాలి. జీవితాన్ని చరితార్ధం చేసుకోవాలి."....

         మిత్రులందరికీ మైత్రీదిన శుభాకాంక్షలతో......విశాలాక్షి...