Monday, June 19, 2017 0 comments By: visalakshi

అభిమానం

అభిమానం అంటే ఒక్కోసారి ప్రేమ లేక ఇష్టం అని చెప్పచ్చు. మరోసారి అభిమానం అంటే తనపై తనకి గౌరవం అవుతుంది. సందర్భాన్ని బట్టి ఆ పదము అర్ధము మారుతుంది. మనం స్నేహితులను, బంధువులను అభిమానంగా ప్రేమగా చూస్తాము. "ఎవరన్నా ఏమైనా అంటే పడదురా, తనకి అభిమానం ఎక్కువ " అంటారు. ఇక్కడ అభిమానం అంటే తన మీద తనకి గౌరవం అని అర్ధం వస్తోంది. మీ వాళ్ళకి నువ్వంటే విపరీతమైన అభిమానం కదా అంటాము. నీ మాటల్లోనే తెలుస్తోంది ఆ మురిపెము అంటుంటారు. అభిమానధనులు అందరినీ అభిమానిస్తారు.


అభిమానం అనే పదానికి అర్ధాలు చాలా ఉన్నాయి. ఒక్కో సందర్భంలో అభిమానాన్ని చంపుకొని ఇతరులకోసం కొన్ని త్యాగాలు చేస్తారు. ఎంత గొడవలు చెలరేగినా కుటుంబంలోగానీ, ఎవరైనా సరే ఆ వ్యక్తిపై అభిమానంతో మౌనంగా ఆరాధిస్తూ అనురాగాన్ని చాటుకుంటారు కొంతమంది. 
ఎంతో అభిమానంతో, ప్రేమతో బంధువుల ఇంటికి వెళితే వారు ఆ అభిమానానికి విలువలేకుండా మాట్లాడితే మన అభిమానాన్ని వారు    కించపరచినట్లే.

కొంతమందికి అహంకారంతో కూడిన అభిమానం ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా మనం గోపికలను చెప్పుకోవచ్చును. ఆ కధనం ఒకసారి...శరదృతువు వచ్చింది. చంద్రుడు తన అమృత కిరణాలతో జీవులకు ఆనందాన్ని కలిగిస్తున్నాడు. గోపాలకృష్ణుడు ఆ చల్లని వెన్నెలలో, యమునానది ఇసుక తిన్నెలపై విహరిస్తూ, మురళీ గానాన్ని ఇంపుగా ఆలాపించాడు. ఆ గానం చెవుల సోకగానే గోపకాంతలు ఎక్కడి పనులక్కడే వదలి దేవదేవుని దర్శనానికి బయలుదేరినారు. కొందరు ఇంటియందె నిలవబడి కృష్ణ విరహాగ్నిలో, సకల కర్మవాసనలను తపింపజేసి, భవబంధాలను తొలగించుకున్నారు.
ఆతృతగా వచ్చిన గోపికలను చూసి భగవంతుడు "ఆ గచ్చంతు మహాభాగా" అంటూ స్వాగత వచనాలు పలికినాడు. పరమ భాగవతులారా! రండి రండి అంటూ ఆహ్వానించాడు. గోపికలు సర్వ కోర్కెలను వదలి అభిమానాన్ని పూర్తిగా వదిలేసి, నిరభిమాని వద్దకు పరుగు పరుగున వచ్చారు. అటువంటి భక్తులైన గోపికలకు భగవంతుడు పలికిన స్వాగతము, గోపికల భక్తి తత్వానికి నిదర్శనము. ఏనాటికైనా తమంతట తామే వదిలిపెట్టిపోయే సంసారిక భోగాలను బుద్ధిపూర్వకంగా వదలి, నిత్యుడు సత్యుడైన పరబ్రహ్మ సన్నిధిని కోరి వచ్చినవారు భాగ్యవంతులు. శ్రీకృష్ణుడు గోపికల మనసెరిగి వారితో రాసలీల సాగించాడు. అప్పుడు కొందరు గోపిక యందు తామే ఉన్నతులమనే భావన కలిగింది. అది గమనించిన భగవంతుడు అంతర్ధానమయ్యాడు. అహంకారం అభిమానం ఉండేచోట నిరభిమానియైన భగవంతుడుండడు. గోవిందుని అదృశ్యముతో వారి అహంకారం తొలగిపోయింది. వారు చెట్టును, పుట్టను అడుగుతూ ఆయన కొరకు పరితపించసాగారు. వారి ఆవేదనను గ్రహించిన పరమాత్మ వారిని కరుణించి వారి చెంతకు చేరి వారికి ఆనందాన్ని కలిగించాడు. కనుక ఆయనపై భారాలన్నీ వేసి ఏ పనైనా కూడా అభిమానం పెట్టుకోకుండా చేస్తే సంపూర్ణ సిద్ధి ప్రాప్తిస్తుంది. కానీ నేనే చేస్తున్నాను అనే అహంకార పూరిత అభిమానం పెట్టుకొన్నా అక్కడ క్షణమైనా ఆలస్యం కాకుండా దాని పరిణామం కనిపిస్తుంది. కార్యసిద్ధి జరుగదు. ధర్మరక్షణార్ధమై అవతరించిన భగవంతుడు తన అవతార కార్యాన్ని పూర్తిగా నిర్వర్తించి, తన వైకుంఠ దామమును చేరుకున్నాడు.అన్ని దు:ఖాలకు ఆశ, అభిమానం, అహంకారం కారణమవుతాయి. మనకు ప్రియమైన వస్తువులను వ్యయప్రయాసల కోర్చి సమకూర్చుకుంటాము. వాటిపై మమకారాన్ని పెంచుకుంటాము. మమకారం  దు:ఖహేతువని గ్రహించి,దానిని వదిలితే కాని సుఖం లభించదని తెలుసుకోలేకపోతున్నాము. పసిబాలుడు ఏ విధమైన అలజడులు లేక ఆనందంగా ఉంటాడు. యోగి కూడా ఇంద్రియాలను జయించి ఏ అలజడులు లేక శాంతంగా ఉంటాడు. అట్లే సాధకులైన మనం మమకార, అభిమాన, అహంకార రహితులమై బేధభావములను వదలి  ఆనందముగా  ఉండవలెను.అన్ని ఉపాధులకు భగవంతుడు ఉపాధిగా ఉన్నాడు. భగవంతుడు స్వత:నిరాకారుడై అవ్యక్తంగా సృష్టినంతా వ్యాపించియున్నాడు. అవతార వైశిష్ఠ్యాన్ని బట్టి ఆ అవతార పురుషునిగా భగవంతుని ఆయా పేర్లతో కొలుచుకుంటాము. కాని భగవంతుని రూపం కంటికి గోచరించేది కాదు. అఖండానందాత్మకమైన అనుభవము కలిగినవారు కూడా భగవంతుని రూపం ఇది అని చెప్పలేరు కదా! ఆత్మ సాక్షాత్కారమును అనుభవించి మౌన యోగితత్వములో విరాజిల్లుతారు.. ఆ ఆత్మానందములో భగవంతునితో లయిస్తారు..అది మనకు కంటికి గోచరించేది కాదు. ఇంద్రియాతీత విషయాలు అగోచరం. సాధకులైన మనం  శాశ్వతానంద స్వరూపుడైన భగవంతుని పాదపద్మాలను హృదయమందు నిలుపుకొని సద్విచారముతో శాంతిని పొందవలయును.

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు
Wednesday, June 14, 2017 0 comments By: visalakshi

తండ్రి (పితృదేవోభవ)
శ్లో" పితాధర్మ: పితాస్వర్గ: పితా హి పరమం తప:!
     పితరి ప్రీతి మాపన్నే సర్వా ప్రీయంతి   దేవతా:!!   (మహాభారతం)

తండ్రిని సేవించడమే ధర్మం. తండ్రిని సర్వవిధముల సుఖింపజేయడమే స్వర్గం. ధర్మవర్తనుడైన తండ్రి ఆదేశాలను అనుసరించడమే సర్వశ్రేష్టమైన తపస్సు. తండ్రిని ప్రసన్నంగా ఉంచితే సమస్త దేవతలు ప్రసన్నులౌతారని ఈ శ్లోకము యొక్క అర్ధం. "సర్వ దేవ మయ: పితా"! తండ్రి సంపూర్ణంగా దేవతా స్వరూపము. అందుకే తల్లిదండ్రులను ఆదర సత్కారాలతో  సేవించాలి. తల్లిదండ్రులకు శ్రద్ధతో అభివాదం చేసే సంతానానికి అక్షయమైన సుఖసంతోషాలు  ప్రాప్తిస్తాయని  శాస్త్రాలు  తెలుపుతున్నాయి.


పాలించి పోషించి, రక్షించేవారిని పితా అంటారు. సంతతిని పాలించి పోషిస్తున్నాడు కనుక తండ్రిని ప్రజాపతి స్వరూపమంటారు. తండ్రి ఆకాశానికంటే ఎత్తైనవాడు. ఉన్నతుడు. తండ్రి హృదయాకాశంలో తన పుత్రుని యందున్న అనంతప్రేమ, వాత్సల్యం వర్ణింపలేనివి. ..పుత్రుడైన శ్రవణ కుమారుని వియోగంతో అంధులైన తల్లిదండ్రులు తమ ప్రాణాలనే త్యజించారు. దశరధమహారాజు తన ప్రియపుత్రుడైన శ్రీరామచంద్రుని యెడబాటును భరించ లేక ప్రాణాలు విడిచాడు.           జన్మనిచ్చినవాడు, భయాన్నుండి రక్షించినవాడు, అన్నమిచ్చి ఆదరించినవాడు, జీవనాధారమైన వృత్తినిచ్చి ఆదుకొన్నవాడు, యజ్ఞోపవీతధారణ సంస్కారము చేసినవాడు ఈ ఐదుగురు పితరులని ఆచార్య చాణక్యుడన్నారు. తల్లిని సేవించినట్లే, తండ్రిని దేవుడుగా భావించి తప్పనిసరిగా సత్కరించాలి. తండ్రి వలన మానవ దేహోత్పత్తి, పాలన, సత్యశిక్షణ, విద్య, ధర్మోపదేశం లభిస్తాయి. పరమాత్ముని సాక్షాత్కారానికి తండ్రి సోపానము. తండ్రి కర్తవ్యపరాయణుడు, విద్వాంసుడయితే సంతానం సత్పురుషులౌతారు. తండ్రి పుత్రులకు వినయాన్ని నేర్పి, శుభకార్యాలలో వారికి శ్రద్ధను కలిగించాలి. పితృ శబ్ధానికి సర్వరక్షకుడు, శ్రేష్ట స్వభావం కలవాడనే అర్ధం ఉంది.


పుత్రుడు ఎప్పుడూ తండ్రి ఆధీనంలో ఉండాలి. తల్లి దండ్రులకు దుర్గతి కలుగకుండా పుత్రుడు చూడాలి. వంశ ప్రతిష్టను గౌరవించి రక్షించాలి. ధర్మ శాస్త్రాల ననుసరించిన ఆదర్శ పురుషుడు, పితృభక్తుడు, ఆజ్ఞాకారియైన సుపుత్రుడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన కోసం సర్వస్వం త్యాగం చేసి సీతాదేవి, లక్ష్మణ సమేతంగా అరణ్యాలకు తరలి వెళ్ళాడు. కౌసల్యామాత శ్రీరాముడు వనాలకు వెళ్ళేందుకు అనుమతి నివ్వలేదు. శ్రీరాముడు తల్లితో " ఈ ప్రపంచంలో ధర్మమే చాలా శ్రేష్ఠమైంది. ధర్మంలోనే సత్యం స్థితంగా ఉంది. ఆ ధర్మాన్ని అనుసరించడమే నాకు పరమ కర్తవ్యం. ధర్మాన్ని పాలించడంలో నా ప్రాణాలు పోయినా నేను లెక్కచేయను. నిఖిల దేవతల కంటే పూజ్యుడు అధికుడు తండ్రి.వారి ఆజ్ఞను నేను ధిక్కరించలేను. నాకు సత్యం ధర్మం రెండూ అత్యంత ప్రియమైనవి. ధర్మబద్ధమైన తండ్రిగారి కోరిక పాలించడమే నా విధి. ఈ విధిని పాలించడంలో నేను మనోధైర్యాన్ని కలిగి ఉండేటట్లుగా ఆశీర్వదించమని" తల్లితో అంటాడు.  అది శ్రీరామచంద్రునిలోని సౌశీల్యం.

శంతన మహారాజు సత్యవతీదేవి సౌందర్యాన్ని చూచి మోహితుడై ఆమెను వివాహం చేసుకోవాలని ప్రయత్నించి, దాశరాజు కోరికను మన్నించలేక విఫలమై నిరాశతో హస్తినాపురం చేరుకుంటాడు. దేవపుత్రుడు దు:ఖంతో ఉన్న తండ్రి సుఖం కోసం అఖండ బ్రహ్మచర్యాన్ని పాటిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. చంద్ర దర్శనం వలన అంధకారం దూరమై రాత్రి శోభించునట్లుగా శీలసంపన్నుడు విద్యా ప్రియుడైన పుత్రుని వలన వంశం ఖ్యాతి గాంచుతుంది. 
తండ్రికి కష్టాలు, బాధలు,సమస్యలు ఎదురైనపుడు ఆ సమస్యల నుండి తండ్రిని సంతానం రక్షించాలి. తండ్రి ఆత్మశాంతిలో సంతానం యొక్క శాంతి ఉంది. ఒక్కొక్కసారి మన నిర్లక్ష్యం వలన అమూల్యమైన తల్లిదండ్రులను పోగొట్టుకుంటాం.తల్లిదండ్రుల సేవలో మనం తరించాలి. మనమలా వ్యవహరించినపుడే భగవంతుడు మనను ఆదరించి మరింత సద్బుద్ధి ప్రసాదిస్తాడు. పరమాత్ముని ఆజ్ఞలను పాలించిన గృహంలో ఎప్పుడూ సుఖశాంతులుంటాయి. పుత్రులను సన్మార్గంలో నడిపించే తండ్రి తనపేరు తనయుడు నిలబెట్టాలని ఆశిస్తాడు. పితృభక్తి కలవాడే పుత్రుడు. పూర్వకాలంలో తల్లిదండ్రులు లేక తాతయ్యలు పిల్లలకు పురాణ గ్రంధాలను వినిపించి వివరించేవారు. చదివించేవారు. వారివల్ల సదా గ్రంధపఠనం..తెలియని విషయాలను సేకరించి వారిని సందేహాలను అడిగి తెలుసుకుని ఆ విషయ జ్ఞానమును, ఆ ధర్మాలను మనం ఆచరిస్తున్నాము. ఆ పితామహులు సదా చిరస్మరణీయులు. వారిని ఇలా స్మరించుకోవటమే మనం వారికిచ్చే బహుమతి. ఆ విలువలను, సంస్కృతి సభ్యతలను మనం రక్షించుకోవాలి అంటే మన కుటుంబపరమైన మన పూర్వీకులను వారిచ్చిన సంస్కారాన్ని గౌరవించి ఆచరించాలి. "తండ్రి సర్వదా పూజ్యనీయుడు."....ఈ నెల 18న పితృ దినోత్సవ సంర్భంగా... మన భారతీయ సమాజంలో మనకు ధర్మవర్తనులైన  పితామహులందరికీ  వందనాలు.                                        
Monday, June 12, 2017 1 comments By: visalakshi

యశోదకృష్ణఓ౦ శ్రీ   సాయి కృష్ణాయ నమో నమ:తొలకరి  మేఘ౦ లా౦టి నీల వర్ణుడు, ఉత్తమ లీలలను ప్రదర్శి౦చినవాడు, సిగన౦దు ముచ్చట గొలిపే నెమలిపి౦చ౦ కలవాడు, జనులకు  హితములను
చేయువాడు అయిన గోపాలకృష్ణునికి నమస్కరి౦చుచున్నాను.


"నామరూపే అవతార" శ్రీకృష్ణుడు నామరూపంలో కూడా అవతరిస్తాడు. ముఖ్యంగా కలియుగంలో శ్రీకృష్ణుడు నామరూపంలోనే అవతరించాడు. కృష్ణునికి, కృష్ణనామానికి తేడా లేదు. "అభిన్నత్వాన్ నామనామినో:" - కృష్ణుడెట్లా పరిపూర్ణుడో అతని నామము కూడా పరిపూర్ణమైనదే. శ్రీకృష్ణ నామాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి అతడు సంపూర్ణ రక్షణను కలుగజేస్తాడు.
శ్రీకృష్ణుని నయనాల వర్ణన చాలా చిత్ర౦గా ఉ౦టు౦ది. బాల న౦ద గోపాలుడు కళ్ళతోనే అడుగుతాడు, కళ్లతోనే చెబుతాడు. నవనీత చోరుని నేత్రములను చూసి యశోదమ్మ బెత్త౦ తీసుకొని అతణ్ణి కొట్టడానికి పరుగెడుతు౦ది. బాలగోపాలుడు రోటిపై ను౦డి కి౦దకు దూకి పరుగులు పెట్టాడు. ఎ౦తో తపస్సు చేసిన మహాయోగులు కూడా శ్రీ కృష్ణుని పొ౦దడ౦ దుర్లభ౦. అలా౦టిది భగవ౦తుడు భయ౦తో పారిపోతు౦టే, యశోద అతని వెనకాలే బెత్త౦ తీసుకొని పరిగెడుతున్నది. ఆహా! ఎ౦త మనోహరమైన దృశ్య౦.శోద పరుగెత్తి, పరుగెత్తి అలసిపోయి౦ది. కానీ గోపాలుడు చిక్కలేదు. యశోద ’ఓ అల్లరివాడా! ఈరోజు నువ్వు పాలకు౦డను ఎ౦దుకు పగలకొట్టావు? అని ఆయాసపడుతూ అన్నది. గోపాలుడు చేతులు జోడి౦చి ’అమ్మా! ము౦దు నువ్వు నీ చేతిలోని బెత్త౦ క్రి౦ద పడవెయ్యి’ అని అన్నాడు. శోద చేతిలోని బెత్త౦ క్రి౦ద పడేసి౦ది. వె౦ఠనే గొపాలుడు ఆమె చేతికి చిక్కాడు.అ౦తవరకూ యశోదకు దొరకని గోపాలుడు బెత్త౦ క్రి౦ద పడేయగానే ఎ౦దుకు పట్టుబడ్డాడు? ’యావత్ జడయుక్తో న తావత్ చేతనాగమ:’ -  చేతిలో జడవస్తువు (మనస్సులో ప్రాప౦చిక విషయాలు) ఉన్న౦త వరకూ చేతన౦ (భగవ౦తుడు) లభి౦చదు. ఎప్పుడైతే యశోదమ్మ జడవస్తువును వదిలి౦దో, అప్పుడు చైతన్య స్వరూపుడైన కృష్ణుడు ఆమె వశమయ్యాడు.యశోద గోపాలుణ్ణి త్రాడుతో రోటికి  కట్టి  బంధి౦చాలని  ప్రయత్ని౦చినా సాధ్య౦ కావడ౦ లేదు.’ నేను కృష్ణుణ్ణి బ౦ధి౦చగలను”. అనే అహ౦కార౦ యశోదలో ఉ౦ది. అ౦దువల్ల గోపాలుడికి యశోద  ఒక అ౦గుళ౦ దూర౦లో ఉ౦టే , గోపాలుడు కూడా యశోదకు మరో అ౦గుళ౦ దూరమయ్యేవాడు. బాల గోపాలుణ్ణి బ౦ధి౦చ ప్రయత్ని౦చి, యశోద అలసిపోయి౦ది. తల్లి పరిస్థితిని చూసిన గోపాలుడి హృదయ౦ ద్రవి౦చి౦ది. అప్పుడు కృష్ణుడే యశోదమ్మ చేతిలో బ౦దీ అవడానికి సిద్ధమయ్యాడు. ’కృపయా2సీత్ స్వబ౦ధనే’ - భగవ౦తుడు భక్తుని చేతిలో బ౦దీ అవ్వాల౦టే ఆయన కృప లేనిదే సాధ్య౦ కాదు. అహ౦కార మమకారాలు తొలగినప్పుడే భగవ౦తుడు, భక్తుని హృదయ౦లో బ౦దీ అవుతాడు."పాపాత్ముడైన వాడి ఇ౦టికి భక్తుడు వెళ్ళాడ౦టే అతణ్ణి కాపాడడానికి భగవ౦తుడు కూడా అతని వె౦టే వెళతాడు. అలా భగవ౦తుడే స్వయ౦గా వెళ్ళాడ౦టే అతని చరణ స్పర్శ వల్ల ఎ౦తటి పాపాత్ముడైనా పునీతుడై ముక్తిని పొ౦దుతాడు." 


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు