Thursday, January 5, 2017 By: visalakshi

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం - 1

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం 




ధ్యానం

శ్లో" మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం
     వర్షిష్ఠాంతే వసదృషిగణై రావృతం బ్రహ్మనిష్ఠై:!
     ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర మానందరూపం
     స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే !!

 భా:- ఆత్మనిష్ఠుడై ప్రసన్నవదనంతో మౌనంగా చిన్ముద్రాంచిత హస్తంతో, వేదవిదులైన మహర్షులకు ఆత్మవిద్యను బోధిస్తున్న యువగురువు శ్రీదక్షిణామూర్తిని నేను ఆరాధిస్తాను.

శ్లో"  వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం
    సకలముని జనానాం జ్ఞానదాతారమారాత్ !
    త్రిభువనగురు మీశం దక్షిణామూర్తి దేవం
    జనన మరణ దు:ఖచ్చేద దక్షం నమామి !!

మర్రిచెట్టు క్రింద కూర్చొని తనచుట్టూ ఉన్న మహర్షులకు ఆత్మవిద్యను అందిస్తూ జనన మరణాలతో కూడిన సంసారదు:ఖాలను నిర్మూలిస్తూ ముల్లోకాల చేతనూ గురువుగా కొలవబడే శ్రీ దక్షిణామూర్తికి నమస్కృతులు. 

శ్లో"   చిత్రం వటరోర్మూలే వృద్ధా: శిష్యా గురుర్ యువా !
       గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్నసంశయా: !!

ఆహా! ఎంత ఆశ్చర్యకరం! యువకుడైన గురువుచుట్టూ వృద్ధులైన శిష్యులు శ్రద్ధాభక్తులతో కూర్చొని ఉన్నారు. గురువు తన మౌనంతోనే వారి సర్వసందేహాలనూ నివారింపగలుగుతున్నారు.

శ్లో"   నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం !
        గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ: !! 

భవరోగ బాధితులకు వైద్యుడై జగద్గురువై, జ్ఞానస్వరూపంగా ప్రకాశించే దక్షిణామూర్తికి నమస్కృతులు.

శ్లో"  ఓం నమ: ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైక మూర్తయే !
     నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ: !!

నిత్యశుద్ధుడవై, ప్రశాంతస్వరూపుడై, శుద్ధజ్ఞానమే మూర్తిగా, ప్రణవనాదమైన ఓంకారానికి లక్ష్యార్ధంగా భాసిస్తూ, నిర్మలుడైన దక్షిణామూర్తికి నమస్కృతులు. 





శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం -  ........

 శ్లో"   విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం
              పశ్యాన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధా నిద్రయా
             య స్సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మాన మేవాద్వయం
             తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!

 భా:-  " నామరూపాత్మకమైన ఈ సర్వజగతినీ, ఆత్మచైతన్యమయిన తనలో లీలామాత్రంగా, స్వానుభవంగా, స్వాత్మగా, అద్దంలో కనిపించే నగరంవలె, స్వప్నదృశ్యం వలె తనకంటే భిన్నంగా ఉందన్న భ్రమ కలిగిస్తోందని గుర్తిస్తున్న జగద్గురువైన శ్రీ దక్షిణామూర్తికి నా నమోవాకాలు... దక్షిణాభి ముఖంగా ఉన్న మూర్తిని(దక్షిణామూర్తిని) ఆ పరబ్రహ్మస్వరూపమే అని ఈ శ్లోకం నిర్ధారిస్తోంది. "

వ శ్లో"   బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాక్ నిర్వికల్పం పున:
              మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్య చిత్రీకృతం !
              మయావీవ విజృంభయత్యపి మహాయోగీవ య: స్వేచ్చయా
              తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!  

  భా:-  " పరిపూర్ణమూ ఏకమూ అయిన ఆత్మతత్వంతో ఈ సమస్త సృష్టి ఇమిడి ఉంది.  విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్లుగా గోచరించే ఈ మహావిశ్వమంతా, దేశకాలావృతమైన సమస్త చరాచర జగతినీ, ఇంద్రజాలికునివలె, మహాయోగివలె, బహిర్గతం చేసి తన మాయాశక్తితో స్వేచ్చగా జగన్నాటకాన్ని నడిపే పరమాత్ముడైన నా గురువునకు, శ్రీ దక్షిణామూర్తికి ఇదే నా నమస్కృతులు. "

వ శ్లో"   యస్యైవ స్ఫురణం సదాత్మక మసత్కల్పార్ధకం భాసతే
               సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ !
               యత్సాక్షాత్కరణాధ్ భవేన్న పునరావృత్తి ర్భవాంభోనిధౌ
               తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!

 భా:-    ఆత్మ యొక్క  ఈ ఉనికి ,స్ఫురణా వలననే మనకు వస్తువిషయక జ్ఞానమూ అనుభవమూ సంభవమవుతున్నాయి.  ఈ ఉనికి ,స్ఫురణా ఆత్మలో అంతర్లీనమై ఉన్న లక్షణాలే. ఇదే సర్వానికీ కారణం అని నిశ్చయింపవచ్చును. "ఎవరి వ్యక్తరూపం ఈ ప్రపంచంగా స్ఫురిస్తూ కూడా నిత్యసత్యమై ప్రకాశిస్తూ ఉంటుందో, శ్రద్ధతో శరణువేడినవారికి తత్త్వమస్యాది మహాక్యాలతో ఎవరు జ్ఞానబోధ చేస్తుంటారో, ఎవరి జ్ఞానబోధవల్ల జననమరణయుక్తమైన ఈ సంసారచక్రం నుండి ముక్తిపొందుతున్నారో, అట్టి పరమ పవిత్రమైన గురుమూర్తికి శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కృతులు."






వ శ్లో"    నానాచిద్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం
               జ్ఞానం యస్యతు చక్షురాదికరణద్వారా బహి: స్పందతే !
               జానామీతి తమేవ భాంత మనుభాత్యేతత్సమస్తం జగత్
               తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం  శ్రీ దక్షిణామూర్తయే !!


 భా:-  "  ఆత్మచైతన్యం అంత:కరణలో ప్రతిఫలించి, మనస్సులో సంచలనాన్ని సృష్టించి మన కళ్ళు చెవులు మొదలయిన ఇంద్రియాలద్వారా,బాహ్యంగా ప్రసరిస్తూ 'అనేక చిల్లులు కలిగిన కుండలో ఉన్న దీపకిరణాలవలె, పైకి ప్రసరిస్తూ ఉందో.'.ఏ చైతన్యం ప్రకాశించడం వలన ఈ వస్తుమయ మహా ప్రపంచమంతా తెలియబడుతూ ఉందో.... అటువంటి దివ్యమూర్తికి సద్గురువుకు, శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."

                                                                                         - సశేషం


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు








0 comments: