Monday, January 2, 2017 By: visalakshi

త్రికరణశుద్ధి

  ఓం నమో భగవతే వాసుదేవాయ



 ఆడి పాడే వయస్సులోనే అనంతాత్ముడి దర్శనం కోసం వ్యాకుల పడుతున్న బాలుడికి నారదమహర్షి మధువనం వైపు మార్గం చూపాడు. ఓంకారంతో కూడిన పన్నెండక్షరాల మహిమాన్వితమైన వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించాడు. 'ఓం నమో భగవతే వాసుదేవాయ ' అనే మంత్రాన్ని ఏడు దినాలు జపిస్తే, ఆ దేవదేవుడి సాక్షాత్కారం సాధ్యమవుతుందని స్పష్టం చేశాడు.  భక్తుడు మనోనిగ్రహం కలవాడై, శాంతుడై, మితభాషియై సదాచార సంపన్నుడై,కందమూలాశనుడై శ్రీహరి కల్యాణ గుణగణాలను ధ్యానించాలని ప్రభోదించాడు.ఇలా సర్వసమర్పణ బుద్ధితో చేసే పూజలను 'ఓం నమో భగవతే వాసుదేవాయ ' అనే మంత్రంతో ఆ వాసుదేవునికి సమర్పించాలని నారద మహర్షి ధ్రువుడికి సూచించారు.  త్రికరణశుద్ధిగా భక్తితో పూజించే భక్తుడు భగవంతుడి మాయలో చిక్కుకొనడని, ధర్మార్ధ కామ మోక్షాలనే పురుషార్ధాలలో కోరినదానిని అనుగ్రహిస్తాడని ఆ బ్రహ్మమానస పుత్రుడు అభయమిచ్చాడు. ఆ నీలమేఘశ్యాముని వర్ణిస్తూ...గరుడవాహనుడిని గరికపోచలతో సేవించాలి. పద్మనేత్రుడైన పరమాత్ముడిని పద్మాలతో పూజించాలి. తులసిదండలు ధరించే స్వామిని తులసీదళాలతో ఆరాధించాలి అని ప్రస్ఫుటం చేశాడు.



నారదమహర్షి ప్రసాదించిన "ఓం నమో భగవతే వాసుదేవాయ " మంత్రాన్ని స్వీకరించి ధ్రువుడు తీవ్ర తపస్సుకు పూనుకున్నాడు.  సమస్త పుణ్యాలకు ఆలవాలమైన మధువనంలో ఉపవాస దీక్షతో, ఏకాగ్రచిత్తుడై భగవంతుణ్ణి ధ్యానింపసాగాడు. ప్రాణవాయువును నిరోధించి పరమాత్మతో అనుసంధించాడు. ఆ బాలుడి అకుంఠిత దీక్షకు భూనభోంతరాలు కంపించిపోయాయి. తుదకు దేవతలందరూ ఆ దేవదేవుడిని లోకరక్షకుడైన పుండరీకాక్షుని శరణు వేడారు. పరమాత్మా! నీవు సర్వప్రాణి శరీరాలలో అంతర్యామిగా ఉండే స్వామివి. పూర్వం ఎప్పుడూ ఈ విధంగా మాకు ప్రాణనిరోధం ప్రాప్తించలేదు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ఓ హరీ! కేశవా! జగదీశ్వరా! సర్వశరణ్యా! నీ చరణ కమలాలను శరణు పొందుతున్నాం ఆపదను తొలగించి కాపాడు ప్రభూ! అని వేడుకున్నారు. వారి విన్నపాన్ని విన్న పరాత్పరుడు వారిని ఓదారుస్తూ, బాలభక్తుడైన ధ్రువుడు నా యందు మనస్సును సంధానపరచి తపస్సు చేస్తున్నాడు. అందుకే మీకు ప్రాణనిరోధం కలిగింది. తపస్సు నుంచి ఆ బాలుని విరమింపజేస్తాను భయపడకండి అని అభయమిచ్చాడు. అనంతరం శ్రీహరి గరుడవాహనమెక్కి మధువనంలో ధ్రువుడి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ధ్రువుడు తనముందు సాక్షాత్కరించిన కరుణామూర్తిని తిలకించి ఆనందభాష్పాలతో పులకించాడు.



అనంతరం తన కనుదోయితో స్వామి సౌందర్యాన్ని తాగుతున్నట్లు, ముఖంతో స్వామిని ముద్దాడుతున్నట్లు తనకరములతో స్వామిని కౌగలించుకుంటున్నట్లు అనుభూతి చెందుతూ ధ్రువుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ విశ్వంభరుడిని వేవేల స్తుతిస్తూ ..."శ్రీ హరీ! నిర్మలాత్ములై నీ సేవయందాసక్తులైన భక్తులతో నాకు మైత్రి చేకూర్చు. ఆ సత్పురుషుల సాంగత్యం చేత నీ కధాసుధారసాన్ని మనసారా గ్రోలి, దు:ఖాలతో నిండిన సంసార సాగరాన్ని సులభంగా తరిస్తాన"ని ప్రార్ధించాడు. ఇలా సజ్జనుల సాంగత్యానికున్న మహత్యాన్ని ధ్రువుడు మరోమారు గుర్తుచేశాడు. పరమాత్మ ఉనికి ప్రస్ఫుటం కావటానికి సత్పురుషుల సాహచర్యం ఎంత ఉపకరిస్తుందో అనటానికి ఈ బాలభక్తుని ప్రార్ధనే నిదర్శనం. పారవశ్యంతో పరంధాముని గొంతెత్తి సుతిస్తూ పాదాభివందనం చేశాడు. భగవంతుడి దర్శనభాగ్యంతో బాలుడైనా, భావుకుడై కవితాత్మకంగా కీర్తించాడు.   
                       
                              ఓం నమో భగవతే వాసుదేవాయ    

0 comments: