Thursday, October 23, 2008 2 comments By: visalakshi

విలువైనదీ, వెలలేనిదీ మధురమైన మాట:

బి.సైదులు గారు రాసిన మాటే మంత్రము నుండి కొన్ని అంశాలు నా మాటల్లో:
మానవ సంబంధాలలో మాటల ప్రభావం మహత్తరమైనది .నాలుగు మంచి మాటలే మధుర ఫలితాలనిస్తాయి. పలికే ప్రతి పలుకూ పరులకు ఆనందాన్ని పంచాలి. మన మనసునూ ఆహ్లాదపరచాలి. ప్రకృతిలో ఏ ప్రాణికీ లేని "పలుకుల" వరాన్ని పరమాత్మ మనిషికే ప్రసాదించాడు. పరుష వాక్కులతో ,మాటల్ని తూటాలుగా ఎదుటి వారి మీద ప్రయోగించకూడదు. శారీరకమైన గాయాల కన్నా ,సున్నితమైన మనసుకయ్యే గాయం కలకాలం బాధిస్తుంది.వ్యాపార వ్యవహారాలకే కాదు. వ్యక్తిగత అనుబంధాలకూసుమధురంగా మాట్లాడటం అత్యంత ఆవశ్యకం .
కోపతాపాలు, కఠోర భాషణలు మనను అందరి నుంచీ దూరం చేస్తాయి. మృదువుగా సంభాషిస్తే ఎదుటివారి మనస్సులో శాశ్వతంగా చోటు సంపాదించుకోగలం. ఆలోచనలు పరిణతిని సాధిస్తున్న కొద్దీ పలుకుల ఒరవడి తగ్గిపోతుంది. వాక్కు విలువ తెలుస్తుంది. అందుకే మేధావులు, జ్ఞానులు వాక్సుద్ధి తెలిసి మితంగా మాట్లాడుతారు. మనసు ఎంత నిర్మలంగా ఉంటే మాటల్లో అంత పవిత్రత తొణికిసలాడుతుంది. మంచి శ్రోతగా ఉంటూ వినటం అలవాటు చేసుకోవాలి. ఎదుటివారి మాటల్ని ఆలకిస్తున్నంత వరకూ మనం న్యాయమూర్తుల స్థానంలో ఉన్నట్లు .ఎప్పుడైతే మనం మాట్లాడటం ప్రారంభిస్తామో ,అపుడు ఎదుటి వారికి మనను అంచనా వేసే అవకాశాన్నిస్తున్నట్టే!
మన మాటల్లో: "నేను" అన్న మాట ఎంత తక్కువ వినియోగిస్తే మన సంభాషణ పరులకు అంత ఆసక్తి కరంగా ఉంటుంది.
"ఎంతటి నిరుపేద ఐనా ఎదుటి వారికి ఇవ్వగలిగిన ఒకే ఒక బహుమతి "మంచిమాట" ".మన సాహచర్యం, సామీప్యం ఇతరులకు మంచి జ్ఞాపకంగా మిగిలిపోవడానికి సౌమ్యమైన సంభాషణను మించిన మార్గం లేదు. ఈరొజుల్లో అలంకరించే పువ్వులనుంచీ ఆహ్లాదపరిచే నవ్వుల వరకూ అన్నీ కృత్రిమమే కావడం దురదృష్టకరం. అలాంటి కపటత్వం నుంచి బయటపడదాం. వెల కట్టలేని విలువైన సరళ సంభాషణను ఆభరణంగా అలంకరించుకుందాం.
Friday, October 17, 2008 10 comments By: visalakshi

సంప్రదాయాన్ని గౌరవించిన జ్యోతిష విద్వన్మణి ; ఖానాదేవి.

అమృత వాహిని లో నాలుగు నెలల క్రితం చదివినప్పటినుండి
ఆలోచింప చేసిన, జరిగిన సంఘటన. భారతావని అందించిన అత్యుత్తమ జ్యోతిశ్శాస్త్రవేత్తల్లో ఒకరు- ఖానాదేవి. మహోన్నత మహిళల గురించి మాట్లాడినపుడల్లా స్వామి వివేకానంద ఆమె పేరును ప్రస్తావించేవారు .జ్యోతిష, ఖగోళ శాస్త్రాల్లో వరాహదేవుడు గొప్ప నిపుణుడు .ఉజ్జయినికి చెందిన విక్రమార్క చక్రవర్తి ఆస్థానంలో నవరత్నాలుగా ప్రసిధ్దికెక్కిన వారిలో ఆయన ఒకరు.
వరాహదేవుడు ,ధరణీ దేవి దంపతులకు మిహిరుడు జన్మించాడు. మిహిరుడు జ్యోతిశ్శాస్త్రంలో గొప్ప విద్వాంసుడిగా పేరుగాంచాడు. శ్రీలంక రాజకుమారి అయిన ఖానాదేవిని అతడు వివాహమాడాడు. ఆమెకి కూడా చిన్నప్పటినుండి జ్యోతిశ్శాస్త్రం పత్ల అపారమైన మక్కువ .పెరిగి పెద్దవుతున్న కొద్దీ జ్యోతిషంలో ఆమె దిట్టగా మారింది.
విక్రమార్క చక్రవర్తి మిహిరుని నైపుణ్యం తెలిసి ఆయనను తన ఆస్థాన జ్యోతిష్యునిగా నియమించాడు. రాజసభలో పలువురు అడిగిన ప్రశ్నలకు మిహిరుడు,వరాహదేవుడు సమాధానాలు ఇచ్చేవారు. కొన్ని క్లిష్టమైన సమస్యలకి వారు ఖానాదేవిని ఆంతరంగికంగా సంప్రదించి ఆపైన రాజసభలో వాటికి బదులిచ్చేవారు .విక్రమాదిత్యుడికి ఈ సంగతి తెలిసింది. ఖానాదేవిని కూడా రాజసభకు తీసుకురావాలనీ ,ఆమె విజ్ఞానం ద్వారా ప్రజలు లభ్ధి పొందే వీలు కల్పించాలనీ ఆయన మిహిరుడ్ని కోరారు.
చక్రవర్తి అభ్యర్ధన విని తండ్రీ, కొదుకులిద్దరూ దిగ్బ్ర్హాంతి చెందారు .కుటుంబ సాంప్రదాయం, గౌరవాల రీత్యా ఆయన అభ్యర్ధనను పాటించలేక ,వారి మాటను తిరస్కరించలేక, చర్చల అనంతరం వారు ఓ ఘోరమైన నిర్ణయం తీసుకున్నారు. మిహిరుడు జరిగిన విషయం ఖానాదేవికి వివరించాడు. ఆమెను నిండు సభకు పంపడం సరి కాదని వాదించాడు. మాట్లాడగలిగితేనే కదా, సభకు పిలిచి మాట్లాడేది .అసలు మాట్లాడడానికి వీలు లేకుండా చేస్తే1 ఈఆలోచనతో తండ్రి ఆదేశం మేరకు మిహిరుడు,ఖానాదేవి నాలుకను కత్తిరించాలని భావించాడు.
ఆమె నిశ్చల చిత్తంతో భర్త దగ్గరకు వెళ్ళి, మామగారు చెప్పినట్టుగా నాలుక కోసివేయాల్సిందిగా పేర్కొంది. మిహిరుడు అలాగే చేయడంతో, ఆమె వీర నాయికగా మరణించింది. పరుల కోసమే జీవిస్తూ, కుటుంబ సంప్రదాయం, గౌరవాలను కాపాడేందుకు జీవితాన్నే త్యాగం చేసిన ఖానాదేవికి భారతీయ మహిళా మణిదీపాలులో స్థానం కల్పించారు, స్వామి వివేకానంద.
ఇప్పుడు ఇది రాస్తూ కూడా ఒళ్ళు గగుర్పొడిచింది. ఇంత ఖఠినంగా ఉండే వారా అని.
Tuesday, October 14, 2008 8 comments By: visalakshi

మనో భావన

నేను గొప్ప ఉపన్యాసకుడిగా ఎదగాలని ఉంది !కానీ మాత్లాడబోతే ఏం చెప్పాలో గుర్తుకు రాదు! అని ఒకరు ఒక స్వామిని ప్రశ్న వేసారు. అలా ఉంది నా పరిస్థితి. నాకున్న ఆలోచనలన్నిటినీ కలబోసి రమ్యంగా వనితలనుగూర్చి బ్లాగులో పొందుపరుద్దామని ప్రారంభిస్తే ఏం రాయాలో అని ఆలోచిస్తున్నా. రాయడం కూడా ఒక కళ. జ్ఞాన తృష్ణ , జ్ఞాన కాంక్ష నేటి మహిళాతరానికి చాలా అవసరం . పుస్తకాలతో సాన్నిహిత్యం పెంచుకోవాలి గొప్ప సాహిత్యాన్ని చదవడం అభిరుచిగా చేసుకోవాలి. ఈరోజుల్లో యువతులు చాలామంది ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు ,కానీ నలుగురిలో ఎలా నడుచుకోవాలో తెలియదు ,జీవితంలో ఎలా మసులుకోవాలో తెలియదు. సాహిత్య పఠనమంటే రుచించదు. మన చదువులన్నీ జీతానికి తప్ప జీవితానికి కాదు. కళాశాలల్లో కూడా సిలబసు పూర్తైందా లేదా . అంతవరకే .పూర్వపు రోజుల్లో అధ్యాపకులు అనుభవజ్ఞులు ,వయసులో పెద్దవారు ఉండే వారు.విద్యతో జ్ఞానాన్ని ఇనుమడింపచేసేవారు. సాహిత్యం అంటే రుచించేలా కధలుగా చెప్పేవారు. నా అనుభవంతో అంటున్న మాటలివి. కేవలం టి.వి. ముందు కూర్చుని కాలాన్ని వృధా చేసుకునేవారు,, సీరియల్స్ చుస్తూ గడిపే స్త్రీలు ,,వీరివల్ల పిల్లలు కూడా అదే అలవాటు పడుతున్నారు .బాల్యం నుండి స్త్రీ తల్లిగా ప్రేమను, గురువుగా వివేకమును,మరియు సాహిత్యాభిలాషను పెంపొందించాలని నా ఆకాంక్ష.