Tuesday, October 14, 2008 By: visalakshi

మనో భావన

నేను గొప్ప ఉపన్యాసకుడిగా ఎదగాలని ఉంది !కానీ మాత్లాడబోతే ఏం చెప్పాలో గుర్తుకు రాదు! అని ఒకరు ఒక స్వామిని ప్రశ్న వేసారు. అలా ఉంది నా పరిస్థితి. నాకున్న ఆలోచనలన్నిటినీ కలబోసి రమ్యంగా వనితలనుగూర్చి బ్లాగులో పొందుపరుద్దామని ప్రారంభిస్తే ఏం రాయాలో అని ఆలోచిస్తున్నా. రాయడం కూడా ఒక కళ. జ్ఞాన తృష్ణ , జ్ఞాన కాంక్ష నేటి మహిళాతరానికి చాలా అవసరం . పుస్తకాలతో సాన్నిహిత్యం పెంచుకోవాలి గొప్ప సాహిత్యాన్ని చదవడం అభిరుచిగా చేసుకోవాలి. ఈరోజుల్లో యువతులు చాలామంది ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు ,కానీ నలుగురిలో ఎలా నడుచుకోవాలో తెలియదు ,జీవితంలో ఎలా మసులుకోవాలో తెలియదు. సాహిత్య పఠనమంటే రుచించదు. మన చదువులన్నీ జీతానికి తప్ప జీవితానికి కాదు. కళాశాలల్లో కూడా సిలబసు పూర్తైందా లేదా . అంతవరకే .పూర్వపు రోజుల్లో అధ్యాపకులు అనుభవజ్ఞులు ,వయసులో పెద్దవారు ఉండే వారు.విద్యతో జ్ఞానాన్ని ఇనుమడింపచేసేవారు. సాహిత్యం అంటే రుచించేలా కధలుగా చెప్పేవారు. నా అనుభవంతో అంటున్న మాటలివి. కేవలం టి.వి. ముందు కూర్చుని కాలాన్ని వృధా చేసుకునేవారు,, సీరియల్స్ చుస్తూ గడిపే స్త్రీలు ,,వీరివల్ల పిల్లలు కూడా అదే అలవాటు పడుతున్నారు .బాల్యం నుండి స్త్రీ తల్లిగా ప్రేమను, గురువుగా వివేకమును,మరియు సాహిత్యాభిలాషను పెంపొందించాలని నా ఆకాంక్ష.

8 comments:

Kathi Mahesh Kumar said...

మీరు చెప్పిన అవలక్షణాలన్నీ పురుషప్రపంచంలోకూడా ఉన్నాయిగా!?! మరి వారికోసం మీరు ఏకంకణాలూ కట్టుకోరా! భీష్మప్రతిజ్ఞలూ చెయ్యరేల!!

Kottapali said...

మంచి మాటలు చెప్పారు.
ఖాళీ తెర ముందు కూర్చోగానే ఇలాగే ఏం రాయాలో అర్ధంకాక అయోమయంగానే ఉంటుంది ముందు. రాయడానికి కూర్చునే ముందే ఫలాని విషయం గురించి రాస్తాను అని అనుకోండి. రాత సులభం అవుతుంది.

Ramani Rao said...

బాగుంది వేద గారు. మీ ఆలోచన, అభిలాష, ఆకాంక్ష చాలా బాగుంది కాని ఇప్పటి తరానికి సాహిత్యాభిలాష కాగడా పెట్టి వెతికినా కనపడదు. కంప్యూటర్ ముందు కూర్చోమంటే గంటలు గడిపేస్తారు[(నాలాగా :)]మీ మా మన కోరిక నెరవరాలని మనఃస్పూర్తిగా అభిలషిస్తున్నాను.

Anonymous said...

మంచి ఆలోచనతో ప్రారంభించారు
కాకుంటే మొదటి ముక్కే మమ్మల్ని తిడుతూ రాస్తే ఎలా అండీ !!
ఎందుకంటే నేను కూడా ఈ కాలం అమ్మాయినే
పరిగెడుతున్న లోకం తో పాటు పరగు పెట్టకపోతే వెనకబడి పోతామేమో అని మా భయం !!
ఆ పరుగు లో మా చిన్ని చిన్ని అభిరుచులను ఎన్నిటిని పోగొట్టుకుంటున్నామో మాకే తెల్సు .
నలుగురిలో ఎలా నడుచుకోవాలో తెలియదు అంటున్నారు అది చెప్పాల్సిన బాధ్యత ఎవరిదీ ???
చదువు నేర్పే గురువులది లేకుంటే తల్లితండ్రులది అదేమంటే ఈ కాలం పిల్లలకి ఏమీ చెప్పలేం అంటారు చెప్పి చూస్తె కదా మేము పాటిస్తామో లేదో తెలిసేది !!
చిన్నప్పటినుంచి గారం మీరే అలవాటు చేస్తారు నా బంగారు తల్లి బాగా చదువు అది కొనిపెడతా ఇది కొనిపెడతా అని చెప్పి మల్లి పెద్దయాక అదే మంకు పడితే మొక్కై వంగనిది మానై వంగునా అంటారు.
ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ వర్తిస్తుంది

ఈ రోజుల్లో సాహిత్యాభిలాష లేనిదేవరికీ ??? ఏమో నా మటుకు నాకు ఎక్కువ మంది అమ్మాయిలు చేతిలో పుస్తకాలతోనే కనిపిస్తారు ఖాళీ సమయాల్లో .

పూర్వపు రోజుల్లో అధ్యాపకులు అనుభవజ్ఞులు అని మీరే చెప్పారు
మరి ఇప్పటి అధ్యాపకులో ?? మా సీనియర్స్ మాకు లెక్చరర్స్ మరి మేము సిలబస్ ఎప్పుడు పూర్తి అవుతుందా అని కాక ఏమని ఎదురు చూడాలో చెప్పండి

స్త్రీలు తమ పిల్లలని ఉన్నత మార్గం లో పెంచాలనే అనుకుంటారు వారికి తెలిసినంతవరకూ అలానే పెంచుతారు .కాని ఏ అక్షర జ్ఞానం లేని స్త్రీలు తమ పిల్లలకి సాహిత్యం గురించి ఏం చెప్పగలరు ?
వారికి తెలిసినంతవరకు తమ పిల్లలని అబద్దాలు చెప్పకుండా ,చెడు మార్గం లోకి వెళ్ళకుండా పెంచగలరు కాని సాహిత్యాభిలాష తగ్గిపోవడానికి అమ్మాయిలే కారణం అమ్మాయిలు సీరియల్స్ చూడటమే కారణం అనడం సమంజసం కాదు

నా ఉద్దేశ్యం మిమ్మల్ని వ్యతిరేకించడం కాదు కాని నాణానికి రెండో వైపు కూడా చూడండి అంటున్నా

మాగంటి వంశీ మోహన్ said...

హయ్యో హయ్యయ్యో...పింగళి వారు చెప్పినట్టు మీరు ఏదో సమాధి భ్రాంతిలో మాట్లాడుతున్నారు...ఎక్కడో చెదురు మదురుగా తప్ప మిగిలిన మణులకు అంత తీరిక ఎక్కడిదండీ బాబూ... :)...

visalakshi said...

మహేష్ గారు వనితావనివేదిక పేరు చూసారు కదా . ఇలా అడగడం భావ్యంగా లేదు. కత్తిలా మీరున్నారుగా కంకణాలు కట్టుకుని, ప్రతిజ్ఞలు చేసి పురుషప్రపంచంలో మార్పు తీసుకురండి మేము స్వాగతిస్తున్నాం .
అభివాదములు కొత్తపాళి గారు. మీ సలహాను తప్పక పాటిస్తాను.
కృతజ్ఞతలు రమణి గారు.
ఓతెలుగింటి అమ్మాయి గారు మీ కామెంట్ నా అభిప్రాయాలకి దగ్గరలో ఉంది. మిమ్మల్ని నొప్పించాలని కాదు, చుట్టుపక్కల జరుగుతున్నవి రాసాను. నాణానికి రెండో వైపు మీలాంటి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అతితక్కువ వయసులోనే పెద్ద ఉద్యోగాలు అదేప్రపంచం అనుకుని అహంకారంతో పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ప్రవర్తించే లోకజ్ఞానం లేనివారు వీరికి సాహిత్య పఠనం చేసేంత అవగాహన ఉంటుందా .
మీ చిన్ని చిన్ని అభిరుచులు కోల్పోతున్నందుకు నాకు కూడా వేదనగా ఉంది.
సమాధి స్థితి నుండి బయటపడేందుకు మీ సహకారం లభిస్తుందని ఆశిస్తున్నాను మాగంటి గారు కృతజ్ఞతలు.

సుజాత వేల్పూరి said...

సాహిత్యాభిలాష, చదవాలి, చదవాలి, చదవాలి అనే దురద(ఇంతకంటే మంచి పదం తోస్తే వేసేస్కోండి వేదా) గల వాళ్ళు బోలెడు మంది ఉన్నారండి మనలోనే! నా మటుకు నాకు ప్రతి నెలా ప్రతి ఊర్లో, ప్రతి చోటా షాపింగ్ అంటే పుస్తకాలే! తర్వాతే ఏదైనా! నాలాంటి వాళ్ళు చాలా మంది తెలుసు నాకు! మన బ్లాగర్ల లోనే మంచి సాహిత్యాభిరుచి కలిగిన వాళ్ళు బోలెడు మంది.

టీవీ సీరియల్స్ లో సరుకు తెలిసిన స్త్రీలు ఎవరూ వాటి జోలికి పోరు. మరీ ఏ ఇతర అభిరుచులూ లేనివారైతే తప్ప!

Anonymous said...

నేను నార్మల్ గానే వున్నా అండీ!!
మీరు ఇలా టపా రాసాక నేను పరిశీలించాను నా చుట్టుపక్కల అమ్మాయిలని ఉద్యోగాలు చేసే స్త్రీలను
బహుశా మీకు కూడా ఇలాంటి వారు తారసపడే వుంటారు
ఒక ఉద్యోగిని బస్ లో కూర్చుని ఆవిడ స్టాప్ వచ్చేవరకు "లలిత సహస్రనామాలు "
ఇంకో అమ్మాయి "వ్యక్తిత్వ వికాసం (కాకుంటే ఇంగ్లీష్ )" ఇలా
ఇంకా మా ఆఫీసు లైబ్రరీ లో ఇలాంటి పుస్తకాలు తీసుకెళ్ళేవాళ్ళని
సిడ్నీ షెల్టన్ సాహిత్యం చదివే వాళ్ళని ఒక్క రోజులోనే నేను ఇంత మంది ని చూసా

ఏంటో కొంత సాహిత్య అభిలాష లేకుంటే వారు చదవరేమో కదా ఇలాంటి పుస్తకాలు
మీతో వాదించడం కాదు నా వుద్దేశ్యం కాని ఎందుకో మీరు తక్కువ మంది అమ్మాయిల్ని, స్త్రీలని చూసి మిగిలిన వారందరినీ అదే కోవ లోకి జేర్చడం నాకు మంచి గా అనిపించలేదు

మీకు తెల్సా పెద్ద పెద్ద జాబ్స్ వచ్చాయని పొగరుతో విర్ర వీగుతున్నారు అన్నారే అటువంటి అమ్మాయిలు చాల మంది తమ వంతు సాయం సమాజానికి చేస్తున్నారు ఇది నిజం .బహుశా వారు మీరు చెప్పిన సాహిత్యం అవి పట్టించుకోకపోవచ్చు కాని వారిలోనూ స్త్రీ సహజమయిన సుగుణాలు (జాలి ,క్షమ,మానవత ......) వంటివి ఇంకా సజీవం గానే వున్నాయి అనడానికి ఎన్నో సహాయ కార్యక్రమాల్లో వారు నిర్వహిస్తున్న పాత్రలు .ఎందుకంటే నేను కూడా వారితో పాటు గా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా కాబట్టి.

కాని ఏది ఏమైనా వేదా గారు ,మీరు చెప్పింది నాణానికి ఒక వైపు ఐతే నేను చెప్పింది రెండో వైపు .

మీరు చెప్పిన విధం గా కూడా ప్రవర్తించే అమ్మాయిలున్నారు నేను కాదు అనటం లేదు .
కాని ఒక్కసారి వారు అలా తయారు కావడానికి దారి తీసిన పరిస్థితులు కూడా ఆలోచించండి అంటున్నాను .

దీనికి ఎక్కువగా కారణాలు అయితే --

చిన్నప్పటినుంచి తల్లితండ్రులు కష్టం విలువా, డబ్బు విలువ తెలియకుండా పెంచడం
ఇంట్లో ఒక్కరే సంతానం కావడం
ఉమ్మడి కుటుంబాలలో వుండే సంతోషం, ఆనందం తెలియకపోవడం
చదువుకునే విధానాల్లో వున్నా వ్యత్యాసం
మాతృ భాష కి వారు చదువుకునే సమయానికి ప్రాదాన్యత తగ్గి పోవడం
వారి శిక్షణ చదువు అంతా వేరే భాష లో జరగడం సాహిత్యాభిలాష తగ్గిపోవడానికి ప్రధాన కారణం గా చెప్పొచ్చు

ఇన్నిటి మధ్య పెరిగినప్పటికీ అమ్మాయిల్లో ఇంకా ఎంతో కొంత సాహిత్యాభిలాష మిగిలే వుంది అనడానికి నిదర్సనం ఈ మధ్య బ్లాగుల్లో అమ్మాయిలు ఎక్కువగా పోస్టులు రాస్తూ వుండడం

వారిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వున్నారు ,చదువుకుంటున్న అమ్మాయిలు వున్నారు ,గృహిణులు వున్నారు ,ఉద్యోగం చేస్తూ ఇంటిని చక్క దిద్దే సవ్యసాచులు వున్నారు కాబట్టి మీ పోస్టుల్లో ఘాటు కాస్తా తగ్గిస్తే బాగుంటుందని మనవి

ఇట్లు తెలుగింటమ్మాయి
నేనేమయ్యిన తప్పుగా మాట్లాడి వుంటే క్షంతవ్యురాలిని .