Tuesday, December 22, 2020 By: visalakshi

కదండి..ద్విదండి..త్రిదండి..

 🙏ఓం నమః శివాయ🙏


#కదండి.. ద్విదండి... త్రిదండి అంటే ఏమిటి?


మనం ఎంతో మంది పీఠాధిపతులను లేదా యతీంద్రులను (స్వాములను) చూస్తూ వుంటాం. వారి చేతుల్లో కర్రలు పట్టుకోని వుండటం కూడా చూసివుంటాం. ఆ కర్రలను దండెములు అంటారు. అవి,  వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత మరియు విశిష్టాద్వైత భావానికి సంకేతాలు. వారి చేతిలో పొడవాటి కర్రలు ఎల్లవేళలా పట్టుకుంటారు. ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికి కూడా ఓ అర్థం ఉంది. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల (5) సమ్మేళనమే మనిషి, కాబట్టి సన్యాసులు అయిదు అడుడుగుల కర్రను ధరిస్తారు.


ఆ యతీంద్రులు తమ చేతి ధరించే, కర్రలలో ఏకదండి (ఒక కర్ర), ద్విదండి (రెండు కర్రలు), త్రిదండి (మూడు కర్రలు) అని మూడు విధాలుగా ఉన్నాయి. దండి అంటే కర్ర అని అర్థం. ఒక కర్రను (ఏకదండి) ధరించే వారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారని అర్థం. అద్వైతం అనగా జీవాత్మ, పరమాత్మ ఒక్కటేననే సిద్ధాంతం. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు అనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. ఇది  జగద్గురు ఆది శంకరాచార్యుల వారు బోధించినది. ఈ అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించే వారి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుండి సేకరించిన ఒక కర్ర ఉంటుంది.


ఇక రెండవ సిద్ధాంతం ద్వైతం. రెండు కర్రలు కలిపి (ద్విదండి) ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం అనసరించి బోధించేవారు. వీరి ప్రథమాచార్యుడు మధ్వాచార్యులు. వీరిని ‘ద్విదండి స్వాములు’ అంటారు వీరు విష్ణుభక్తులు. వీరు పరమాత్మ వేరు మరియు జీవాత్మ వేరు అని బోధిస్తారు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.


ఇక మూడవది విశిష్టాద్వైతం. మూడు కర్రలను కలిపి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారిని తత్వత్రయం అనుసరించే వారు అంటారు. వీరిది భగవద్రామానుజాచార్యుల పరంపర. ఈ సిద్ధాంతం ప్రకారం, శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ, జీవుడు ఆజ్ఞానంతో సంసార బంధంలో చిక్కుకుంటాడని, నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుండి విముక్తులై, మరణానంతరం నారాయణ సాన్నిధ్యం (మోక్షం) పొందుతారని, వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు .

ఈ మూడు కర్రలలో, ఒక్కో దండం ఒక్కోక్క తత్వానికి గుర్తు. ఒకటి జీవుడికి, ఒకటి ప్రకృతికి మరియూ ఒకటి పరమాత్మకి. మనం చూసే ఈ ప్రపంచం అంతా ఈ మూడు తత్వాలతోనే నిండి ఉంటుంది అని వేదం తెలియజేస్తుంది. వేదార్థాన్ని వివరించే పురాణాలు, ఇతిహాసాలు, వాంగ్మయాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. తత్వాలు అన్నింటినీ మూడుగా విడదీయవచ్చు. అందులో మనం లెక్కకు అందనంత మంది జీవులు వుంటారు. రెండోది రకరకాల చిత్ర విచిత్ర రూపాలు మార్చుకొనే పంచభూతాత్మకమైన ప్రకృతి. ప్రకృతి అంటే అచేతనమైనది మరియు ప్రకృతికి జ్ఞానం ఉండదు. అందుకే దానిని అచిత్తు అని అంటారు. చేతన రహితమైనప్పటికీ చేతనమైన జీవ సంబంధంచే తన రూపాన్ని మార్చుకుంటుంది. కర్మ సంబంధం చేత సహజమైన జ్ఞానం కలిగి అణుస్వరూపుడైన జీవులు, ఈ ప్రకృతిని శరీరాలుగా దాల్చి ఉంటారు. ఎనభైనాలుగు లక్షల రకాల జీవులు ఈ విశ్వంలో వుంటారని చెబుతారు. ఈ జీవులంతా ప్రకృతిలో సంచరిస్తూ, కర్మ అనుభవాన్ని కష్టమైనదో లేక సుఖమైనదో ఎదో ఒకదాన్ని పొందుతూ ఉంటారు. ప్రకృతిని జీవరాశిని ఈ రెండు తత్వాలని నిరంతరం బయట లోపల వ్యాపించి వాటిని నిలబెట్టి, వాటికి కావల్సిన శక్తిని ఇచ్చి నడిపిస్తూ ఉండే తత్వం పేరే పరమాత్మ. ఈ పరమాత్మ అనే తత్వం మూడోది. ఈ మూడు తత్వాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి, విడిచి ఉండటం అనేది లేనే లేదు. పరమాత్మ జీవాత్మ ప్రకృతిలలో వ్యాపించి ఉంటాడు. జీవుడు ప్రకృతిలో నిరంతరం ఉంటాడు. అంటే మరి ముక్తి ఉండదా అని అంటే అట్లాంటి సందేహం అవసరం లేదు. ప్రకృతి అనేక రకాలుగా అనేక గుణాలతో ఉంటుంది. ప్రకృతికి సత్వ, రజస్సు అని మరియు తమస్సు అనే గుణాలు కలిసి వుంటాయి. అందుకే మిశ్రమ తత్వం అని పేరు. రజస్సు, తమస్సు ఏమాత్రం లేని కేవలం సత్వం మాత్రమే ఉండే సుద్ద సత్వ ప్రకృతి విరజా నదికు ఆవల ఉండే ప్రకృతి. ఇవి రెండు కాక గుణములకు అతీతమైన కాలం అనేది ఒక ప్రకృతి. కాలం కూడా ప్రకృతిలో ఒక భాగమే, అందుకే అది సత్వ శూన్యం అని పేరు. ఇలా మూడు రకాలుగా ఉండే ప్రకృతి, ఎన్నో జీవులు, వీటికి వెనకల ఉండి నడిపించే పరమాత్మ ఈ మూడుతత్వాలని విశ్వసించి మనకు మార్గం చూపే యతులు త్రిదండాన్ని ధరించాలని శాస్త్రం యొక్క నిర్ణయం. ఈ మూడు దండాలను కలిపి కట్టి, ధరించిన వ్యక్తిని త్రిదండి అని అంటారు. చక్రం ధరించిన వాడిని చక్రీ అన్నట్టుగానే 'త్రిదండీ' అని సంస్కృతంలో పదం వస్తుంది, అదే తెలుగులో 'త్రిదండి' అని వ్యవహరిస్తాం. శ్రీవైష్ణవ సంప్రదాయంలో యతులు త్రిదండాన్ని ధరించాలని నియమం. వేదం కానీ, ఇతిహాసాలు ఇదే విషయాన్ని ప్రస్తావించాయి.


దత్తాత్రేయుడు అనే భగవంతుడు వేదోద్దరణకై ఎత్తిన అవతారం. కర్నాటక రాష్ట్రంలో, మండ్యా దగ్గరలో మేలుకోట క్షేత్ర ప్రాంతంలో ఆయన పాద చిహ్నాలు ఉంటాయి. అక్కడి పుష్కరిణికి దత్తాత్రేయ పుష్కరిణి అని పేరు. భగవంతుడు, అత్రి మహర్షికి అనసూయకు తనను తానే వారి పుత్రునిగా అర్పించుకోవడం చేత దత్తుడు అయ్యాడు. అందుకే ఆయన పేరు దత్తాత్రేయుడు అయ్యింది. వైదిక ధర్మాన్ని లోకానికి నెలకొల్పి ఉన్నాడు, ఆయనకూడా త్రిదండి సన్యాసి అని తెలుస్తున్నది. ఈ నాడు దత్తాత్రేయుడు అని మూడు ముఖములో, చూపించే దత్తాత్రేయుడు వేరే అని తెలుస్తున్నది. మనకు ప్రామాణికమైన గ్రంథాలు తెలిపే దత్తాత్రేయుడు తిదండి సన్యాసి అని తెలుస్తున్నది. అందుకే అవసరం ఏర్పడినప్పుడు తిదండి సన్యాసులు మేలుకోటలో దత్తాత్రేయుని వద్దకి వెళ్ళి తిదండాన్ని పొందే సంప్రదాయం ఉంది.  రామానుజుల వారి చరిత్రలో వారికి కుళోత్తుంగచోళుడి వల్ల ఏర్పడ్డ ఉపద్రవం నుంచి రామానుజుల వారిని తప్పించడానికి, కూరేశులు రామానుజులవారి దండాన్ని మరియు కాశాయాన్ని తాను ధరించి, రామానుజులవారిని పశ్చిమ దేశం వైపు పంపారు. రామానుజులవారు మేలుకోట ప్రాంతం చేరే సరికి వారి వద్ద త్రిదండం, కాశాయం లేదు. తిరిగి వాటిని పొందే అవకాశం లేదు. అందుకే వారు మేలుకోటలోని దత్తాత్రేయుడి వద్ద కొత్త త్రిదండాన్ని, కాశాయాన్ని ఉంచి స్వీకరించినట్లు చరిత్ర చెబుతుంది.


🙏🔱ఓం శ్రీ రుద్రాణీ సమేత శ్రీ రుద్రకోటేశ్వరాయ నమః🔱🙏🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏

0 comments: