Friday, February 3, 2023 By: visalakshi

అద్వైతం - విశిష్టాద్వైతం

ఓం శ్రీ గురుభ్యో నమః

                                   🙏🙏🙏...



అద్వైతం - విశిష్టాద్వైతం / జగత్ గురువులు జగతికి వెలుగులు.


శ్రీ శంకరాచార్యులు - అద్వైతం - సర్వ భౌతిక ప్రపంచానికి బ్రహ్మమే ఆధారం.


శ్రీ రామానుజాచార్యులు - విశిష్టాద్వైతం


 సర్వ భౌతిక ప్రపంచంతో బ్రహ్మం అంతర్లీనమై అంతా ఒక్కటే.


     

 జగత్తులో అనేక రకాల ఆధ్యాత్మిక సాధనాలున్నాయి. ఇందులో ఏది ఎవరికి తగినదనే దాన్ని సాధకుని యోగ్యత, అవగాహన స్థాయిని బట్టి నిర్ణయించి, అది వారికి ఉపదేశించేది గురువే. గురువు అంటే అజ్ఞానాన్ని దూరం చేసేవాడని అర్థం. ‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే ప్రకాశం. గురువు అంటే చీకటిని తొలగించి వెలుగుతో ప్రకాశింపచేసేవాడు అని అర్థం. జ్ఞాన మార్గ దర్శకుడైన గురువు స్థానం పరమ పవిత్రమైనది. జ్ఞానాన్ని ఆర్జించడం కన్నా సద్గురువు చరణారవిందాలను సేవించడం, అనుగ్రహాన్ని పొందడం ఉత్తమమైనది.


వేదాంతులందరూ జరిపే తత్వవిచారం జీవాత్మ, పరమాత్మల అంతర్లీనత ప్రాతిపదికన జరుగుతుంది. అవి వేరుకాదన్న ఏకాభిప్రాయమే వారందరిలో కనపడుతుంది. ప్రామాణికాలైన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత- అద్వైతం చెప్పేదంతా పొందుపరచి బ్రహ్మజిజ్ఞాసులకు అందుబాటులో ఉంచాయి. వేదాంతులైన మహాగురువులు ఆదిశంకరుడు, రామానుజుడు ఇద్దరూ జీవాత్మపరమాత్మల సంలీనమే అద్వైతానికి మూల సూత్రంగా అంగీకరిస్తారు. ఆ రెండింటి స్వరూపం మీద, ఆ సంయోగం జరిగేది ఎలాగో, అందుకు వారిచ్చే వివరణలు మాత్రం భిన్నమైనవిగా ఉన్నట్లు అనిపిస్తాయి.


జీవాత్మ పరమాత్మలు వేరుకాదని చెప్పే తిరుగులేని అద్వైతం శంకరుడిది. ‘లోకమాయ’, ‘కర్మసిద్ధాంతం’ కేంద్ర బిందువులుగా ఆయన అద్వైత వాదనలుంటాయి. జీవుడు, దేవుడు ఒకరేనన్న నిజాన్ని మాయా ప్రభావంతో మనిషి గుర్తించలేడంటారు శంకరులు. చీకటిలో చూసిన తాడును పాము అనుకుని, వెలుతురు రాగానే అది పాము కాదు తాడు అని తెలుసుకున్నట్లే- లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు అనిపింపజేసే ‘సర్పరజ్జుభ్రాంతి’లాంటి అటువంటి మాయను అధిగమించలేనంత కాలం ‘అవిద్య’తో ఉండిపోతాడని చెబుతారు. జీవితకాలమంతా అతణ్ని వెంటాడుతూ వేధించే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు అది మూలరూపమంటారు. ఆత్మశక్తికి తప్ప అవి లొంగుబాటులోకి రావని తెలుసుకొమ్మంటారు. కార్యం లేకుండా ఫలితం ఉండదని, ఫలితం ఉండబట్టే అందుకొక కారణం ఉండితీరాలని ఆయన విశ్వసిస్తారు. వర్తమానంలో మనిషికి ఎదురయ్యే పర్యవసానాలన్నీ కార్యకారణాలతో ముడివడిఉన్నవేనని చెప్పే కర్మసిద్ధాంతం, ఆయన అద్వైతవాదనలన్నింటిలో కీలకమై కనిపిస్తుంది.


శంకరులు- నిద్రాణమై తనలోనే ఉన్న ఆత్మను జ్ఞానభక్తి సాధనలతో జాగృతం చేయమంటారు. అప్పుడే అది బ్రహ్మంతో పునరేకీకరణ పొందగలదంటారు. జ్ఞానానికి, భక్తికి సమగ్రమైన వివరణలుండే సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి వంటి రచనలు శంకరులవే. అహంకారభావనలు తొలగిపోవటమే జ్ఞానమని చెప్పే సారాంశమే ఆ రచనలన్నీ ప్రస్ఫుటిస్తాయి.


రామానుజులు వైదిక పరమైన దైవత్వాన్ని గురించి చెప్పే అద్వైతాన్ని ఆమోదిస్తారు. వేదోక్తమైన ఆస్తికత్వాన్ని సమర్థించేదాన్ని ‘విశిష్టాద్వైతం’ అన్నారు. దేహం, ఆత్మ రెండూ దైవ స్వరూపాలే అంటారాయన. శంకరులు చేసినట్లు- సగుణ నిర్గుణ బ్రహ్మలుగా, బ్రహ్మాన్ని వేరుచేసేందుకు అంగీకరించరు. అద్వైతానికి మౌలిక సూత్రమైన జీవాత్మపరమాత్మల సంవిలీనాన్ని మాత్రం వ్యతిరేకించరు. జీవుడు, పరమాత్ముడు ఒకరేనన్న ప్రగాఢ విశ్వాసంతో జీవుణ్ని పరమాత్ముడిని వెదకమంటారు. కర్మరాహిత్యం అయినప్పుడే జీవుడికి ‘శుద్ద సత్వస్వరూపం’ లభిస్తుందని, ‘బ్రహ్మశరీరం’ అంటే అదేనని, ఆ శరీరంతోనే అతడు అంతర్యామిలో విలీనం కాగలడన్నారు. ‘వైకుంఠపాప్త్రి’ అదేనంటారు.


సామాజిక స్పృహ కనపడని ఆధ్యాత్మికతను విశిష్టాద్వైతం ప్రోత్సహించదు. రామానుజులు-మనుషుల మధ్య సంచారం చేస్తూ, కులం మూఢనమ్మకాలకు అతీతంగా వారిని కొనసాగమంటూ ఉద్బోధించారు. దేవాలయాల్లో ప్రవేశానికి అందరూ అర్హులేనన్నారు. సామూహికంగా ప్రజలు, భగవత్సేవలు నిర్వహించమన్నారు. విశిష్టాద్వైతానికి వివరణలన్నీ ఆయన రచించిన శ్రీభాష్యం, వేదాంత సాగరం, వేదాంత సంగ్రహాల్లో కనపడతాయి.


శంకరుడు అది అద్వైతం అన్నా, రామానుజుడు విశిష్టాద్వైతం అని చెప్పినా, వారిద్దరూ భగవంతుడైన బ్రహ్మాన్ని చేర్చేది అద్వైత మార్గం ఒక్కటేనని తెలిసిన మహాజ్ఞానులు. అది సూత్రీకరించి మనిషికి సులభగ్రాహ్యం చేసిన మహాపురుషులు.


మన సనాతన ధర్మాన్ని కాపాడటానికి జన్మించిన

మహనీయులు,ఈ రోజు మన ధర్మం ఉందంటే

అది వారు ఏర్పరిచిన బాట,క్షేత్రాలు,మార్గదర్శనం తోనే అని మనం తెలుసుకోవాలి.


మన భారతీయ సంప్రదాయంలో ‘గురు’ శబ్దం చాలా మహత్తరమైనది. ఆధ్యాత్మిక వేత్తల్ని గురువులుగా భావించే విలక్షణ సంస్కృతి మనది. 


విశిష్ట దర్శనాలతో ప్రజానీకానికి మార్గదర్శనం చేసిన శంకరాచార్యులు, రామానుజాచార్యులు ఇరువురూ వైశాఖ శుద్ధ పంచమి నాడే జన్మించడం విశేషం.


#శ్రీ ఆది శంకరులనగానే అద్వైతం, శ్రీ రామానుజుడనగానే విశిష్టాద్వైతం గుర్తుకు వస్తాయి.


#శ్రీ ఆది శంకరాచార్యులు


శంకరులు కేరళలోని కాలడి గ్రామంలో జన్మించారు. ఆర్యాంబ, శివగురువులు వీరి తల్లిదండ్రులు. రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే వేదాలను, వేదాంతసారాన్ని అధ్యయనం చేసిన కుశాగ్రబుద్ధి. గోవింద భగవత్పాదుల వద్ద సన్యాస దీక్షను స్వీకరించారు. గురువుల ఆదేశానుసారం కాశీకి వెళ్ళి శిష్యులకు ఉపదేశంచేస్తూ, పండితులతో చర్చలు సాగిస్తూ, వివిధ మతాల్లోని దోషాలను సహేతుకంగా విమర్శించేవారు. మండనమిశ్రుణ్ని, అతడి భార్య ఉభయ భారతిని శాస్త్ర చర్చల్లో ఓడించి, సత్యనిష్ఠతో జ్ఞానమార్గ వైశిష్ట్యాన్ని గుర్తింపజేశారు. సన్యాసం ఒక మానసిక పరిపక్వ స్థితి. మనుషుల మధ్య ఉంటూనే మమతానుబంధాలను అధిగమించి మానవతా ధర్మాన్ని ప్రచారం చెయ్యాలని శంకర సందేశం.


శంకరులు బోధించిన తత్వం అద్వైతం. అది ఈ దేశపు అఖండత్వాన్ని కాపాడటానికి అక్షయమైన సిద్ధాంతం. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ వంటి శ్రుతి వాక్యాలు అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదికలు. నాలుగు వేదాల నుంచి ఈ నాలుగు వాక్యాలు గ్రహించి బ్రహ్మ స్వరూపాన్ని వివరించడంలో వాటిని సమన్వయించారు. శంకరాచార్యులు జ్ఞానమార్గానికి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చారు.

          


 అద్వైతం అంటే రెండు కానిది. అంటే జీవుడికి, దేవుడికి భేదం లేదని చెప్పే మతమన్నమాట. ఈ సిద్ధాంతానికి రూపకర్త జగద్గురు శ్రీ ఆదిశంకరులు. కేరళలోని కాలడి అనే గ్రామంలో జన్మించిన ఆదిశంకరులు ప్రపంచమంతా జగద్గురువుగా గౌరవించే అత్యున్నతమైన ఆధ్యాత్మికవేత్త, మహాజ్ఞాని, మహాపండితులు. సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి, ప్రస్థాన త్రయభాష్యంతో బాటు ఈనాడు మనం స్తుతించుకునే అనేక స్తోత్రగంథాలు, ప్రకరణ గ్రంథాలు, కనకధారాస్తోత్రం, భజగోవింద శ్లోకాలు ఆయన రచించినవే. రవాణా సదుపాయాలు లేని రోజుల్లోనే ప్రపంచమంతా కాలినడకన పర్యటించి అన్ని మతాలను, విశ్వాసాలను ఒక తాటిపైకి తెచ్చిన ఈ జగద్గురువు భారతదేశంలో నాలుగు పీఠాలను స్థాపించారు.


 బదరీనాథ్, పూరి, శృంగేరి, ద్వారకలలో వీరు స్థాపించిన ఈ పీఠాలకు బాధ్యతలు చేపట్టిన వారు కూడా వీరి నామంతోనే జగద్గురువులుగా ప్రఖ్యాతి చెందుతుండటం విశేషం. వీరి లెక్క ప్రకారం దేహమే దేవాలయం. దేహంలో ఉండే జీవుడే దేవుడు. భౌతికమైన దేహం నశించినా, ఆ దేహంలో ఉండే జీవుడు మాత్రం స్థిరంగా ఉంటాడని అద్వైతుల నమ్మకం. నిశ్చలమైన బుద్ధితో ‘అహం బ్రహ్మాస్మి’ అంటే నే నే బ్రహ్మను అని తెలుసుకునేవాడు  జీవన్ముక్తుడు అవుతాడని అద్వైతులంటారు.

               ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు అనే ప్రస్థానత్రయానికి భాష్యం రాశారు. వివేక చూడామణి, శివానందలహరి, సౌందర్య లహరి, భజగోవిందం, కనకధారాస్తవం వంటి గ్రంథాల్లో వారి పాండిత్యం వెల్లడవుతుంది. సర్వజనామోదంగా ఉండేలా శివ, విష్ణు, గణపతి, సూర్య, శక్తి రూపాలతో కూడిన పంచాయతన పూజా విధానాలను ప్రవేశపెట్టారు. శంకరులు జాతీయ సమైక్యతా సూత్రాన్ని పరిరక్షించడానికి ధార్మిక జాగృతిని కలిగిస్తూ బదరి, ద్వారక, పూరి, శృంగేరిలలో నాలుగు పీఠాలు స్థాపించారు.


                                  °°°°°°°°°°°°

🙏🙏🙏...


#శ్రీరామానుజాచార్యులు


రామానుజులు తమిళనాడులో శ్రీపెరంబుదూరులో జన్మించారు. తల్లిదండ్రులు కాంతిమతి, కేశవాచార్యులు. యామునాచార్యుల వద్ద వైష్ణవ దీక్షను పొందారు. తిరుకోష్ఠియారు ‘ద్వయ’ మంత్ర రహస్యాన్ని వివరించి గోప్యంగా ఉంచమని కోరితే మోక్షం ఏ కొద్దిమందికో పరిమితం కాకూడదని తలచిన రామానుజులు ఆలయ గోపురం అధిరోహించి అక్కడ గుమిగూడిన జనులందరికీ మంత్రాన్ని బోధించారు.


పరమాత్మ ఒక్కడే. ఆయన విశిష్ట గుణసంపన్నుడు. ఆ విశేషణాలు, తత్వాలకు గల లక్షణాల్ని, వాటి మధ్య పరస్పర సంబంధాన్ని అవగాహన చేసుకునేందుకు తోడ్పడేదే జ్ఞానమని విశిష్టాద్వైతం చెబుతుంది. సూక్ష్మరూపంలో ఉండే అనేక జీవాత్మలు స్థూల రూపుడైన పరమాత్మలో అంశగా ఉంటూ పరమాత్మతో భేదాన్ని కలిగి ఉంటాయని, ఇదే విశిష్టాద్వైతమని పేర్కొన్నారు రామానుజులు. రామానుజులు సంస్కర్త. నాటి సమాజంలోని వివిధ వర్ణాలవారికి వైష్ణవంలో స్థానం కల్పించారు. భక్తిని ఉద్యమస్థాయిలో ప్రచారం చేశారు.


రామానుజులు వేదాంత సారం, వేదాంత సంగ్రహం, వేదాంత దీపం అనే గ్రంథాలు రచించారు. బ్రహ్మ సూత్రాలు, భగవద్గీతకు భాష్యం వెల్లడించారు. ఆయన కేవలం వేదాంతి కాదు. సమత, మమతలను నిత్య జీవితంలో ఆచరించిన పుణ్య యోగి. అనేక ప్రత్యేక సేవలను భగవదారాధనలో భాగంగా చేసి, విలక్షణ పూజా విధానాన్ని వ్యాప్తి చేశారు.


 బ్రహ్మానికి, ప్రకృతికి భేదం లేదని బోధించే విశిష్టాద్వైత మత స్థాపకులు రామానుజాచార్యులు. ఈ మతాన్ని అనుసరించేవారు విశిష్టాద్వైతులుగా ప్రసిద్ధి. జగత్తు సత్యం, జీవుడు సత్యం, దేవుడు సత్యం అన్నది వీరి విశ్వాసం. దేహంలోని భాగాల వలె జీవుడు కూడా దేవునితో చేరి ఉంటారని, దేహం నశించిన తరువాత జీవుడు మరో దేహంలో ప్రవేశిస్తాడు లేదా ప్రకృతిలో లీనమైపోతారని వీరి నమ్మకం.


విశిష్టాద్వైతమతాచార్యులైన భగవద్రామానుజులు నేటి చెన్నైకు చేరువలోని శ్రీపెరంబుదూరులో జన్మించారు. కాంచీపురం లోని తిరుక్కచినంబికి శిష్యులైన రామానుజులు శ్రీరంగంలో గొప్ప పండితుడు, వైష్ణవ మత ప్రవక్త అయిన యామునాచార్యులవారి వారసుడిగా నిలిచారు.


 బ్రహ్మసూత్రభాష్యానికి విశిష్టాద్వైత దృష్టితో శ్రీ భాష్యం వ్యాఖ్యను రచించారు. మొట్టమొదటి మత సంస్కర్తగా నిలిచిన రామానుజులవారు వేదాంత సంగ్రహం, గద్యత్రయం వంటి విశిష్టమైన గ్రంథాలను రచించారు. ఉత్తరభారతమంతా విస్తృతంగా పర్యటించిన ఆయన దేశం నలుమూలలా నాలుగు శ్రీైవైష్ణవ మఠాలను నెలకొల్పారు. జాతి, మత భేదాలను పాటించకుండా భక్తి భావంతో భగవంతుని సందర్శించాలనుకున్న ప్రతి ఒక్కరికి ఆలయ ప్రవేశం కల్పించేలా చేశారు. తిరుమలతో సహా అనేక దేవాలయాలలో నిర్దిష్టమైన పూజావిధానాలను, సంప్రదాయాలను ఏర్పరిచారు.

                     

తత్వాలు భిన్నంగా గోచరించినా గమ్యం ఒక్కటే. పుణ్య శ్లోకులు సదా స్మరణీయులే.....,,🙏🙏🙏.....

సంగ్రహించిన వ్యాసం...



0 comments: