Sunday, September 25, 2016 By: visalakshi

మా విశాలహృదయంలో సమాలోచనలు..మరోకోణంలో రామాయణం....

 ఓం శ్రీ రామచంద్రాయ నమో నమ:

 రామాయణం దీనిని మరో కోణంలో చూద్దాం.

{వాట్సాప్ లో సమగ్రంగా సాధ్యం కాదు కాబట్టి సంక్షిప్తంగా చెప్తాను.

నీవు చెప్పిన సంక్షిప్త రామాయణమును ఇక్కడ పదిల పరుస్తాను భారతీ! నువ్వు "స్మరణ"లో సమగ్రంగా ఈ రామాయణమును చెప్పమని నీ ఈ స్నేహితురాలి కోరిక...}


మానవుడు మాధవుడు ఎలా కాగలడో తెలియజెప్పే సాధకుడిగా శ్రీరాముణ్ణి చూద్దాం.
 దశేంద్రియములను  సంయమపరచిన సాధకుడు దశరధుడు అయినా....

 మంధర  అనే బుద్ధి ప్రేరణతో, ఆధ్యాత్మిక(పారమార్ధిక) లౌకిక(ప్రాపంచిక) లక్ష్యాలకు మధ్య డోలాయమానంగా ఊగిసలాడే చిత్తమనే కైక, శ్రీరాముడనే సాధకుణ్ణి....

ఈ పోటీలు, స్పర్ధలు, హంగులు, ఆర్భాటాలు రణగొణధ్వనుల మధ్యలో నుండి రణాలు(శబ్దాలు)లేని అరణ్యవాసం కొంతకాలం చేయమని ఆదేశిస్తుంది.

 చంచలమై, అస్థిరమై,నిలకడలేని ఆలోచనలకు ప్రతిరూపములు వానరమూకలు.

సుగ్రీవం అంటే కళ్ళెం. సుగ్రీవం అంటే చక్కగా నియంత్రంచబడిన మనస్సు. నిష్కామభావం, అకుంఠిత కార్యదీక్ష, అచంచలభక్తి, జ్ఞాననిష్ఠ అనే సాధనల ద్వారా మరింత దృడతరం చేసుకున్న సంకల్పశక్తికి మారుపేరు ఆంజనేయుడు.

 నిరంతరం మారిపోయే ఆలోచనల మూకను అదుపులో పెట్టుకొని, నియంత్రణతో సంయమనమైన మనస్సు ద్వారా ,సంకల్పమనే ఆంజనేయుని సహాయము వలన మనస్సు అశోకమై ప్రసన్నమైనప్పుడు శాంతి దొరికి మానవుడు మాధవుడవుతాడని చాటి చెప్పిన సాధకుడు రాములోరు.... 
                                                                            Bharati.....


శ్రీరామాయణం విశిష్ఠత పాఠ్యే గేయే చ మధురం. దీన్ని ఏ రూపంలో పఠించినా, ఏ విధంగా పాడుకున్నా మధురంగా ఉంటుంది అన్నది ఆదికవి వాల్మీకి మాట. అది అక్షర సత్యం. కాబట్టే నాటి నుండి నేటి వరకు కవులు ఎందరో రామకధను ఆధారం చేసుకొని వివిధ రచనలు చేస్తున్నారు....

 రామకధకు విరామం లేదు..అది వినే వారికి విసుగు లేదు..చదివేవారికి కొదవ లేదు..ఇంద్రియాల్ని జయించి రాముడు జీవితాన్ని విజయవంతం చేసుకొంటే, ఇంద్రియ పరాజితుడు రావణుడు జీవితంలోనూ పరాజితుడైన వైనం మనకు ఆదికావ్యమైన రామాయణ గాధ తెలుపుతుంది...  శ్రీరామచంద్ర ప్రభువు సర్వధర్మస్వరూపుడని, పురుషోత్తముడని, సాక్షాత్తూ పరబ్రహ్మమేనని ఉపనిషత్తులు వక్కాణిస్తున్నాయి.ఆ విధంగానే వాల్మీకి మహర్షి కూడా శ్రీరాముణ్ణి షోడశగుణశోభితుణ్ణిగా తీర్చిదిద్దాడు తన రామ చరితలో...తమ రామాయణ కావ్యసృష్టిలో సందర్భోచితంగా పలు పాత్రల్ని ప్రవేశపెట్టి ధార్మిక నేపధ్యంలో కర్మ - భక్తి - జ్ఞానాలను సమ్మిళితం చేసి తద్ద్వారా సమున్నతమైన నైతిక ప్రమాణాలను,మానవజన్మను సార్ధకం చేసే మహోత్కృష్టమైన మానవ విలువలను పుష్కలంగా పండించి రామచరితను పరిపుష్టం చేసాడు. కొందరు తత్వశాస్త్రమంటారు...మరికొందరు మంత్రశాస్త్రమంటారు..ఇంకొందరు పారాయణ గ్రంధమంటారు..ఇలా ఎందరెన్ని విధాలుగా అనుకొన్నా - అది మాత్రం మానవాళి పరిపూర్ణ జీవన వికాసానికి దోహదపడే అత్యద్భుతమైన ధర్మనిధి. అందుకే రామచరితం అందరికీ శిరోధార్యం ; చిరస్మరణీయం!...
                                                           visalakshi......

0 comments: