Tuesday, September 27, 2016 By: visalakshi

అపరిగ్రహం

"అపరిగ్రహస్థైర్యే జన్మ కధంతా సంబోధ: - అపరిగ్రహమనే వ్రతంలో నిష్ఠులైనవారికి పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది." 

 అపరిగ్రహం అంటే ' ఇతరుల నుండి ఏమీ స్వీకరించకపోవడం' సహజంగా ఇక్కడ అందరూ భావించే విషయం ఇతరుల నుండి బహుమతులు, వస్తువులు తీసుకోకపోవడం అని. కానీ ఇక్కడ విషయం అది కాదు. ' స్వీకరించడం అనే భావన మనం విడనాడాలి.' అని ఇది సూచిస్తుంది. 



 ఇతరుల నుండి ఏమైనా స్వీకరించాలనే భావనే మనలను బద్ధులను చేస్తుంది...శారీరకంగాకానీ, మానసికంగాకానీ ఇతరులకు బానిస కావద్దు. తప్పనిసరి పరిస్థితులలో ఎవరినుండైనా ఏదైనా స్వీకరించవలసి వస్తే ' ఇది ధర్మాచరణకు మాత్రమే, నాకోసం కాదు ' అనే వైఖరి అవలంబించడం ఉత్తమం. ఇలా ఎవరి చేతులలోనూ బందీ కాకుండా, ఎవరికీ బానిస కాకుండా ఉంటే మానసిక స్వేచ్చ లభిస్తుంది. ఆ స్థితి నుండి ధర్మాచరణ అలవడుతుంది.   



 అలా మానసిక స్వేచ్చను పొందిన మనస్సు దాని అంతరాళాల లోతును కనుగొంటుంది. మన మనస్సుకు ఇప్పుడు స్వేచ్చ లేదు. ఎందుకంటే అది ఎన్నో పరిమితులకు లోబడి ఉంది. ఈ పరిమితులన్నీ( వాసనలు, అభిరుచి, తలంపు, భావము, జ్ఞాపకము) తొలగిపోతాయో అప్పుడు ఆ స్వేచ్చా మానసానికి మన ఆలోచనలను గమనించగలిగే శక్తి వస్తుంది.అలా గమనించడం వలన మనస్సుకు బంధనాలనుండి విముక్తి లభిస్తుంది.  

" మీకు ఎవరైనా ,ఏదైనా ఇస్తే, అది మీకు కాదు భగవంతునికి అని గుర్తుంచుకోండి. దాన్ని మీకై ఉపయోగించకుండా ఆయన సేవకై వినియోగించండి." ఈ ప్రపంచంలో ఎవరూ ఎవరికీ ఇవ్వలేరు. అంతా భగవంతుడిదే. అందుకే ఆయనకు నివేదించడానికే స్వీకరిస్తున్నామనే సమర్పణ భావంతో జీవించడం ఉత్తమం. అపరిగ్రహ సాధన చేసినప్పుడు మనం స్వేచ్చగా ఉన్నామనే భావనను పొందుతాం. అప్పుడు మనం పూర్తిగా స్వతంత్రులం. ఏ బానిసత్వమూ ఉండదు.





  అపరిగ్రహ ధర్మాన్ని అనుసరించి గత స్మృతులను పొందడం వల్ల ప్రయోజనం ఉంది. మనస్సుకు బానిసలైనవారి ఆలోచనలు అప్రయత్నంగా ఆచరణలోకి వస్తాయి. అందుకే ప్రతి ఆత్మజ్ఞాని ప్రేమ, దయ, క్షమ, అఔదార్యాలను కచ్చితంగా పొందుతారు. ఎప్పుడైతే స్వతంత్రేచ్చతో అన్ని ఆలోచనలను పైకి తీసుకు వస్తాడో అప్పుడు తన గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు. తద్ద్వారా ఇతరులను క్షమించడం, వారిపట్ల దయ కలిగి ఉండడం మొదలైన అనుష్ఠాలను గావిస్తాడు. ఈ లోకంలోకి తన రాకపోకలను గమనించి ఈ మారు ఎలాగైనా ప్రకృతిమాయకు లోనవకుండా ముక్తుడవడానికి ప్రయత్నిస్తాడు. అతి చిన్న అంశంగా కనిపించే అపరిగ్రహం వెనుక ఇంత కధ దాగి ఉంది.అందుకే పతంజలి నైతికజీవన నిబంధనలైన   'యమ ' నిర్దేశకాలలొ దీనిని కూడా చేర్చాడు.



3 comments:

భారతి said...

మంచి టపా.
'అహింసా సత్యాస్తేయ బ్రహ్మచర్యాపరిగ్రహా యమాః'
అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఈ ఐదు నియమాలు యమము అనబడును. ఇందు అపరిగ్రహం గురించి చక్కగా వివరించావు వేద. బాగుంది.

ప్రియ said...

nice post ...

యోగాభ్యాసంలో పరిపూర్ణత పొందడానికి ప్రధమ సాధనా సోపానము 'యమము'. అందు చివరిది బాగా వివరించారు. అభివందనలు.
మొదట నాల్గింటిని కూడా వివరించండి వేదగారు.

visalakshi said...

ధాంక్యూ! భారతి మరియు ప్రియ గారికి... అహింస, సత్యం ల గురించి అందరికీ విదితమే. అస్తేయం ,బ్రహ్మచర్యము గురించి వివరిస్తాను. ప్రియగారూ!