Friday, August 21, 2020 By: visalakshi

**వినాయక చవితి**

 

వినాయక చవితి ప్రాశస్త్యం 


భాద్రపద శుద్ద చవితి నాడు గౌరీశంకరులకు పుత్రుడిగా గణపతి అవతరించడం వల్ల, గొప్ప పర్వదినం గా గణేశ చతుర్ది జరుపుకొంటాం. విఘ్నాలను తొలగించి శుభాలను ఇచ్చే శుభదాయకుడు గణపతి. అన్ని శుభ కార్యాలలో ఆయనకే అగ్ర పూజ. 'గ' అనే శబ్దం జ్ఞానవాచకం. 'ణ' అంటే నిర్వాణం. జ్ఞాన నిర్వాణాలకు శాసకుడైన అధిపతి కనుక గణేశుడని అంటాం. విఘ్నాలు అనేవి అజ్ఞానం వల్ల కలుగుతాయి. అజ్ఞానం తో చేసే పనుల వలన విఘ్నాలు తప్పవు. గణపతి జ్ఞానాని కి మూర్తి, కనుక జ్ఞానాన్ని పొందడానికే ఆయన్ని పూజిస్తాం. ఆయన విఘ్న గణపతి మాత్రమే కాదు, వరద గణపతి కూడా. గణపతిని శ్రద్దా భక్తులతో పూజిస్తే, తలపెట్టిన కార్యానికి సంబంధించిన దేవత కూడా సంతుష్టి పొంది ఫలాన్నిస్తుంది. గణపతి ని పూజిస్తే శత్రుక్షయం జరుగుతుంది. గ్రహబాధలు తొలగుతాయి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. శ్రీ గణపతి ని పూజించినవారు జీవన్ముక్తులవుతారు. అంతే కాదు, గణపతి ఆది దేవుడు. ప్రతి ఒక్కరూ ఆయనను పూజించాల్సిందే. గ్రహాల్లో శని గ్రహ ప్రభావం అందరికి తెలిసినదే, శని ఇతరులను వారి కర్మానుసారం పట్టి పీడించే గ్రహం, అటువంటి శని దేవుడు రక్షించమని వేడుకునేది గణపతినే, ఎలాగంటే ఇతర బాధల నుండి తనను తానూ రక్షించుకునేందుకు శనిమహాత్ముడు ధరించేది విజ్ఞేశ్వర కవచాన్నే. జ్యోతిష్యపరం గా చూసినా ఈ చవితి రోజున వినాయకుడిని పూజిస్తే గ్రహబాధలు వంటివన్నీ తొలగుతాయి.   ముఖ్యం గా గమనించాల్సిన విషయమేమిటంటే గణపతి ప్రకృతి దేవుడు. గణపతి పూజలందుకొనేది ప్రకృతి లో లభించే వివిధ రకాల పత్రితోనే. అందుకే మనం ప్రకృతి లో లభించే సహజ సిద్ద మైన వాటితో, అది కూడా నీటిలో ఆరోగ్యవంతం గా కరిగే బంకమట్టి తో తయారు చేసిన గణపతి ప్రతిమలను ఆరాధించడం వలన ఆ గణపతి కి మరింత చేరువగా పూజించుకొని అత్యంత ప్రీతిపాత్రులం కాగలం.  మన ప్రతి పనికీ, ఆచారానికి, వ్యవహారానికి వెనుక ఒక మహత్తరమైన అర్ధం, పరమార్దం దాగి ఉంటాయి. ఈ పూజకు ఉపయోగించే పత్రాల లో అనేక ఆరోగ్య పరమైన ప్రయోజనాలే కాకుండా ఎన్నో దైవపరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. మహోత్కృష్టమైన హిందూ ధర్మం లో మహర్షులు ఔషధాలను, మూలికలను పూజా ద్రవ్యాలుగా, యజ్ఞ యాగాది క్రతువులలో సమిధలుగా పేర్కొన్నారు. అటువంటి వాటితో పూజలు, యజ్ఞ యాగాదులు చేసి సద్గతులు పొందవచ్చు.  గణపతి కి ఎరుపు రంగు అత్యంత ప్రీతి పాత్రం. గణపతి వక్రతుండం ఓంకారానికి ప్రతీక. లంబోదరం బ్రహ్మాండానికి సంకేతం. లంబోదరానికి బిగించిన సర్పం కుండలిని శక్తి కి సంకేతం గా చెబుతారు. గణపతి చేతిలోని పాశ అంకుశాలు రాగ ద్వేషాలు నియంత్రించే సాధనాలు. ఆయనకి ప్రియమైన భక్ష్యం మోదకం. మోదకం అంటే ఆనందాన్నిఇచ్చేది. గణపతి కృప వలన ఆనందఫలం లభిస్తుంది. గణపతి పూజా విధానం లో మరొక ముఖ్యమైన ప్రక్రియ "దోర్భికర్ణం" అంటే చేతులతో చెవుల్ని పట్టుకోవడం. కుడి చేత్తో ఎడమ చెవి, ఎడమ చేత్తో కుడి చెవి ని పట్టుకుని, కూర్చుని లేచి గుంజీలు తీయడం. ఇలా చేయడం వల్ల గణపతి సంతుష్టుడవుతాడని, దీని వలన మన కోరికలు నేరవేరుస్తాడని ఒక నమ్మకం. వినాయక చవితి రోజున ఏకవింశతి పత్ర పూజ , అంటే 21 రకాల పత్రాలతో పూజించే విధానం విశిష్టమైనది. గరిక పత్రీ గణపతి కి అత్యంత ప్రియమైన పూజాద్రవ్యం. వంద యజ్ఞాలు చేస్తే కలిగే ఫలితం కన్నా ఒక్క గరిక పోచ తో చేసే పూజ అత్యంత ఫలితాన్నిస్తుందని, గరిక లేని పూజ వ్యర్దమైనదని సాక్షాత్తు గణపతే పేర్కొన్నాడట.  ఆషాడం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ మాసాల లో ఆరోగ్య సమస్యలు అధికం గా ఉంటాయని అందరికి తెలిసిన విషయమే, కావున మనం ఈ మాసాలలో ఆచరించే పండుగలు, పర్వదినాలలో వినియోగించే ద్రవ్యాలలో, ప్రసాదాలలో అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండేట్టు, మన మహర్షులు ఏర్పరచడం గమనించవలసిన అంశం. గణేశచతుర్ధి నాడు మనం వినియోగించే వివిధ పత్రులలో దాగి ఉన్న ఆరోగ్య అంశాలను తెలుసుకొందాం.  బృపతి పత్రం (వాకుడు) ఈ పత్రి లోని ఔషద గుణం, ఉబ్బస బాధ ని తగ్గిస్తుంది.  మాచి పత్రం (ధవనం) ఈ పత్రి లోని పరిమళo ఒత్తిడిని తగ్గించి ఉల్లాసాన్ని కలిగిస్తుంది.  బిల్వపత్రం ( మారేడు) ఈ పత్రి మధుమేహం , విరేచనాలకు విరుగుడుగా పనిచేస్తుంది.  దూర్వపత్రం (గరికె) ఈ పత్రి యాంటివైరల్ శక్తి , రోగ నిరోధక శక్తి కలిగి ఉంటుంది.  దుత్తర పత్రం (ఉమ్మెత్త) ఈ పత్రి ఊపిరితిత్తుల పై ప్రభావం చూపి వ్యాకోచింపచేయడం ద్వారా ఉబ్బస వ్యాది తగ్గుతుంది.  బదరీ పత్రం (రేగు) ఈ పత్రి చర్మ వ్యాధులకు అధ్బుతం గా పనిచేస్తుంది.  తూర్యా పత్రం (తులసి) ఈ పత్రి శరీరం లోని ఉష్ణాన్ని తగ్గిస్తుంది, జలుబు, దగ్గు వంటి వ్యాధులను దరిచెరనివ్వదు.  అపామార్గ పత్రం (ఉత్తరేణి) ఈ పత్రం దగ్గు, ఉబ్బసం వంటి వ్యాదులకు చక్కటి పరిష్కారం లాగ పనిచేస్తుంది  చూత పత్రం (మామిడి) ఈ పత్రం నోటి దుర్వాసన, పళ్ళు, చిగుళ్ళ సమస్యలకు ఉపశమనాన్నిస్తుంది.  జాజి పత్రం (జాజి) ఈ పత్రి చర్మ వ్యాదులను, జననాంగ వ్యాదుల నుండి రక్షిస్తుంది.  గండకి పత్రం (అడవిమొల్ల యుదిక) ఈ పత్రి అతి మూత్ర సమస్య నుండి ఉపశమనాన్నిస్తుంది.  అశ్వత్థ పత్రం (రావి ఆకు) ఈ పత్రి విశేషమైన ఔషధ గుణాల్ని కలిగినటువంటిది, ముఖ్యం గా నోటి దుర్వాసన జననాంగ సమస్యలని తగ్గిస్తుంది.  అర్జున పత్రం( మద్ది ఆకు) ఈ పత్రి రక్త స్థంభనం, గుండె ఆరోగ్యానికి చాలా చక్కగా పనిచేస్తుంది.  అర్క పత్రం (జిల్లేడు) ఈ పత్రి నరాల బలహీనత ఉన్నవారికి, చర్మవ్యాదులు కలిగిన వారికి చక్కగా పనిచేస్తుంది.  విష్ణుక్రంతం (పొద్దుతిరుగుడు) ఈ పత్రి చర్మాన్నికాపాడే గుణాన్ని కలిగి ఉంటుంది.  దాడిమ పత్రం (దానిమ్మ) ఈ పత్రి వాంతులు, విరేచనాలను అరికట్టడానికి, శరీరం లో ఉన్న హానికర క్రిములను నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది.  దేవదారు పత్రం (దేవదారు) ఈ పత్రి శరీర ఉష్ణాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది.  మరువకం పత్రం (మరువం) ఈ పత్రి పరిమళం తో మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.  సింధువార పత్రం(వావిలాకు) ఈ పత్రి కీళ్ళ నొప్పులకు మంచి ఔషధం.  శమీ పత్రం (జమ్మి చెట్టు) ఈ పత్రి నోటి వ్యాధులను తగ్గిస్తుంది.  కరవీర పత్రం (గన్నేరు) ఈ పత్రి ఎంతకు మానని పుళ్ళు తగ్గించడానికి దీని వేర్లు, బెరడుని ఉపయోగిస్తారు   గణపతి భక్తి సులభుడు. ప్రయత్నం లేకుండానే మొలిచే గరికలే గణపతి కి ప్రీతి. తానూ కూడా అలాగే భక్తులకు శ్రమలేకుండా అనుగ్రహించే స్వామి. కేవలం మట్టి తో రూపు నిచ్చి గడ్డిపోచలతో, పత్రాలతో, పళ్ళ తో పూజించి, గుంజీలు తీస్తే స్వామి ఎంతో సంతృప్తి పొంది, సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తాడు.


**మట్టి తో చేసిన వినాయకుడ్ని ఎందుకు పూజించాలి**


హిందూ సంప్రదాయం లో మనం చేసే ప్రతి పనికి చక్కటి ఆధ్యాత్మిక మరియు సామాజిక స్పృహ ఉంటాయి. మన పూర్వీకులు ఏర్పరిచిన ఆచారాలు సంప్రదాయాల లో ఎన్నో శాస్త్రీయ కోణలు ఎంతో విజ్ఞానం ఇమిడి ఉన్నాయి. ఇటువంటి ఆచారాల్ని మనం గౌరవించి మన జీవనాన్ని సుఖమయం చేసుకోవడం తో పాటు భవిష్యత్తు తరాల ఉన్నతి కి పాటు పడాలి. 


వినాయక చవితి మనకు వర్ష ఋతువు లో వస్తుంది. ఎండాకాలం లో చెరువులు, బావులు, కుంటలు ఎండడం వలన నీరు తగ్గుతుంది. ఈ సమయం లో అందులో ఉన్న బురద మట్టి ని బయటకు తీయడం వలన వర్షాలు పడినప్పుడు వాన నీటిని నిలువ చేసుకొనే సామర్థ్యం పెరుగుతుంది.


భగవంతుడు విశ్వవ్యాపిత. విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. అందుకే మట్టి తో వినాయకుడిని చేసి భగవంతుని విశ్వవ్యాపకత్వాని తెలియ చేయడమే. మట్టి నుండే అన్ని ప్రాణులు సృష్టింపబడ్డాయి. చివరకు సర్వ జీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి ధర్మం. మట్టి ఎక్కడైనా ఎవరికైనా లభిస్తుంది . బీద, ధనిక తేడా ఉండదు. భగవంతుడు అందరివాడు. మట్టి అందరికి సులభం గా లభిస్తుంది. అందుకే మట్టి తో వినాయకుడిని చేసి పూజించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.


ఇలా పూజించిన విగ్రహాన్ని తిరిగి ఆ చెరువుల్లోని నిమజ్జనం చేస్తారు. ఇలా నిండిన చెరువుల్లో మట్టిని వేయడం వలన బురదగా మారి, చెరువు అడుగు భాగానికి చేరి నీరుని ఇంకకుండా అడ్డుపడుతుంది. 


ఇక సామాజిక కోణాన్ని పరిశీలిస్తే అందరు కలిసి మట్టి ని తీయడం, అందరు కలిసి తిరి నిమజ్జనం చేయడం వలన జనుల మధ్య చక్కటి ఐక్యత స్నేహ భావాలు పెరుగుతాయి. ఇలా అందరూ కలిసి చేసే మంచి పనుల వలన పర్యావరణాన్ని కాపాడుకొంటూ, సామాజిక హితం కొరకు కృషి చేస్తూ చక్కటి జీవన శైలిని గడపాలి.

         జై గణేష్ మహరాజ్...

    





    

0 comments: