Monday, September 30, 2019 By: Vedasree

ఆత్మశక్తి-దైవ ఆరాధన...


ఓం శ్రీ సాయినాథాయ నమో నమః


   
స్వభావరీత్యా మానవునకు ప్రేమానురక్తులను ఆశించడం పరిపాటి. ఆ ఆశలను అందుకోవడంలో విఫలమైనప్పుడు ఆవేశపూరితుడవుతాడు. కానీ ఆలోచిస్తే ఆ ఆశ అన్న భావాన్ని మనసునుండి తొలగించుకునే ప్రయత్నంలో అతను సాధు స్వభావుడవుతాడు.

మహాత్ముల స్వరూపం సదా ఆనంద దీపికలు వెలిగిస్తూ ఉంటుంది. దైవదృష్టికి పరిమితి లేదు. "ఏయధా మాం ప్రపద్యంతే తాంస్తధైవ భజామ్యహం" (నా పట్ల ఎలాంటి భక్తిని కలిగిఉంటే వారికి వారి భక్తి ననుసరించి అలాంటి ప్రతిఫలమిస్తాను) అయితే మహాత్ముల అంత:కరణ వారిని నిందించిన వారిపై కూడా కారుణ్యం కురిపిస్తుంది. బాబా ఎన్నోసార్లు "ఇతరుల మనసుకి కష్టం కలిగేలా మాట్లాడితే అవి నా హృదయాన్నే తూట్లు పొడుస్తాయి. నా అత్యంత సున్నితమైన భాగానికి గుచ్చుకుంటాయని తెలుసుకోండి. ఇతరులను   బాధాకర మాటలతో కోపం కలిగేలా మాట్లాడితే అవి నన్నే బాధిస్తాయి. కానీ వాటిని శాంతంగా సహించే వారే నాకు బాగా తృప్తి కలిగిస్తారు". అని చెప్పి ఉన్నారు. అలా సాయిబాబా జీవులన్నింటా లోపలా, బయటా నిండి ఉన్నారు .ఆ మహా మంగళప్రదమైన ప్రేమమయి సర్వవ్యాపకుడై  భక్తుల హృదయనివాసుడైనాడు...ఓం సాయిరాం.... 





దృఢమైన మనసుతో భగవానుని కొరకు లోకమందలి స్వజన సంబంధములు మరియు మిత్ర పరిచయముల వంటి సమస్త సంబంధములకు ఋణములన్నీ తీర్చుకోవలెను. ఋణవిముక్తులవ్వాలంటే ఆధ్యాత్మిక జీవనమనే సాధు సాంగత్యముతో విష్ణు ఆరాధనలో భక్తిభావ సమన్వితులై భగవచ్చరణారవిందములను ఆశ్రయించడం ద్వారానే మనం ఋణము లనుండి విముక్తులవుతాము.

 సుఖదు:ఖములు తాత్కాలికము. వాటి రాక పోకలు శీతగ్రీష్మ అనుభవముల వంటివి. జీవితానుభవముల వలన అవి కలుగుచుండును. కావున కలత పొందక వాటిని సహింపవలెను. నిజానికి సుఖదు:ఖములనేవి మనస్సు వలన కలుగునన్నది మనకు విదితము. కాబట్టి మనసును దైవ ఆరాధనలో నిమగ్నం చేసి  ప్రశాంతతను అలవరచుకోవాలి....ఓం సాయిరాం...,




బాబా తమ కమలసుమదళంలాంటి చేతిని శిరస్సుపై పెట్టటంతోనే అనేక జన్మలనుంచీ సంతరించుకొన్న పాపాలు ప్రక్షాళనం అయిపోయి నా లాంటి సాయియొక్క ప్రేమిక భక్తులు పవిత్రులవుతారు. బాబాస్పర్శతో హృదయంలో అష్టసాత్విక భావాలు ప్రకటమవుతాయి. పారాయణ చేస్తున్నా, పురాణాలు చదువుతున్నా అడుగడుగునా బాబా కనిపిస్తారు. రాముడు కృష్ణుడు, వేంకటేశ్వరుడు....ఏ దేవాలయానికి వెళ్ళినా.. ఆ రూపాలలో బాబా దర్శనమిస్తారు. ఆహా జన్మ ధన్యము కదా!... కాయా, వాచా, మనసా శ్రీ సాయినాధునికి సాష్టాంగం చేస్తే ధర్మ అర్ధ కామ మోక్షాలనే నాలుగు పురుషార్ధాలను, కర్మ,జ్ఞాన యోగ, భక్తి- అనే నాలుగు మార్గాలతోనూ ఈశ్వరుడు ప్రాప్తిస్తాడు. మనసనే తోటలో భక్తి అనే నీటిని చల్లితే వైరాగ్యం మొలకెత్తుతుంది. జ్ఞానమనే పూలు విరగబూస్తాయి. కైవల్యమనే ఫలం లభిస్తుంది. జ్ఞానమయం విప్పారుతుంది. జనన, మరణాలు నిశ్చయంగా తప్పిపోతాయి.."ఓం సాయిరాం..."





" మా మనస్సును అంతర్ముఖము చేయుము. దానిని లోపలివైపు పోవునట్లు చేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలిసికొను శక్తిని కలుగజేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగునటుల చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించెదము. సుఖదు:ఖానుభవములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకొనుడు... మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక!"...ఓం సాయిరాం...

"తడిసిన కట్టెలకు నిప్పు సెగను పెట్టగానే తేమ పోయినట్లు, సాధు సా౦గత్య౦ వల్ల  లౌకికుల హృదయాల్లోని లోభ మోహాలనే తేమ పోతు౦ది."


"ఒక దీపాన్ని, మరో దీప౦ వెలిగిస్తు౦ది. అ౦తమాత్ర౦ చేత వెలిగి౦చే దీప౦ వెలుగు తగ్గిపోదు. అలాగే ఇతరులకు బోధి౦చే కొద్దీ మీ జ్ఞాన౦ పెరుగుతు౦దే కానీ తరగదు." .."ఓం సాయిరాం".


సర్వం శ్రీ సాయి నాధార్పణ మస్తు









0 comments: