Sunday, October 27, 2019 By: visalakshi

వివాహనిశ్చితార్థం....

                             ఓం శ్రీ గణేశాయ నమో నమః
సంప్రదాయాలకు, సంస్కారాలకు, శ్రేష్టమైన
ఆచారవ్యవహారాలకు నిలయం "భారతీయ సంస్కృతి". అందులో ఒకటైన మన వివాహ విధానం ఘననీయమైనది. గృహస్థాశ్రమం నాలుగుఆశ్రమంలలో శ్రేష్ఠోత్తమం. ఈ ఆశ్రమం లోనికి  ప్రవేశంకి  ఉత్తమ సంస్కారముంది. అదే వివాహం. 
   
వివాహం అనేది ఒక వైదిక కార్యం. ఇది ఒక సాంస్కృతిక సార్వజనీనమైన సంప్రదాయం. మూడు ముళ్ళ బంధం ద్వారా ఒకటై విడదీయరాని నూతన బంధానికి శ్రీకారం చుడుతూ తమ పవిత్ర కలయిక ద్వార మరో కొత్తతరానికి నాంది పలికేటట్లు చేసే సంస్కారమే వివాహం. 

అసలు వివాహం ఎందుకు? పురుషార్ధాలలో ఒకటైన కామం కోసమా...కానేకాదు. ఆమె కామపత్నికాదు ధర్మపత్ని. దేనికైన ఓ పవిత్రతను కలిగించడం, దైవభక్తితో, దేవతల శక్తులతో అనుసంధానించడం భారతీయజీవన ఔనత్యం. హిందూ వివాహవ్యవస్థ ఓ ధర్మం. మన సంస్కృతి 'వివాహం'ను ఓ ధర్మసాధనగా పేర్కొన్నది. గృహస్థ కర్తవ్యములైన పంచయజ్ఞములను నిర్వహించుటకొరకు, ముఖ్యంగా మువ్విధములైన ఋణములు తీర్చుకొనుటకొరకు.ఆ ఋణాలేమిటంటే - 

దైవఋణం:- దైవం ఒకటే అయినా అనేక దేవతారూపాల్లో పూజిస్తాం. అలా ఆరాధించడం వలన, మరియు జపధ్యానాదులు యజ్ఞయాగాదుల చేయడం ద్వారా, పంచభూతాల రూపంలో నిరంతరం మనల్ని పోషిస్తున్న దైవాన్ని అర్చించడం (ప్రకృతిశక్తులకు కృతజ్ఞత చూపడం) ద్వారా దేవఋణం తీరుతుంది. 

పితృఋణం :- గత జన్మల ప్రారబ్ధం అనుభవిస్తూ , ఈ జన్మలో ఉత్తమకర్మలు చేస్తూ, పునరావృతి లేని ముక్తస్థితి పొందడానికి అవసరమైన శరీరాన్ని ఇచ్చి, పెంచిన తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి. తల్లితండ్రులను పెద్దలను గౌరవించడం వలన, అలాగే పూర్వీకులైన పితృదేవతల పట్ల మనకున్న ఋణం సంతానం కనడం ద్వారా తీరుతుంది. అంటే వంశాన్ని ముందుకు తీసుకెళ్ళడం వల్ల పూర్విజులైన పితృఋణం తీరుతుంది. దేవఋణం తీరడానికి యజ్ఞయాగాదులు ఎలాగో, పితృదేవతల ఋణం తీరడానికి శ్రాద్ధకర్మలు కూడా అలాంటివే . 

ఋషిఋణం:- జ్ఞానసంపన్నులు అయిన ఋషులు చెప్పిన వేదోపనిషత్తులను అధ్యయనం చేయడం, సాధనలు, సత్గ్రంధ పఠనాదులు చేస్తూ ధర్మాన్ని ఆచరించడం ద్వారా ఋషిఋణం తీరుతుంది. 
పై ఋణాలకి వివాహానికి సంబంధం ఏమిటంటే- దేవతానుగ్రహం చేతనే సర్వకార్యములు జరుగుతాయి. వారికి అందుకే కృతజ్ఞత చూపాలి. యజ్ఞయాగాదులతో హవిస్సునివ్వాలి. అలా ఇవ్వాలంటే ప్రక్కన ధర్మపత్ని వుండాలి. ధర్మపత్నితో కూడి వున్నప్పుడే యజ్ఞం చేయడానికి అర్హత వుంటుంది. 

ఇక పితృఋణం వంశాన్ని ముందుకు తీసుకెళ్ళడం అంటే సంతానం పొందడం ద్వారా తీరుతుంది కాబట్టి, ఆ సంతానం ధర్మబద్ధంగా ఉండాలి కాబట్టి వివాహ సంస్కారంద్వారా పత్నిని పొందాలి.ఆపై తాను పుణ్యకర్మములు చేయలన్న,  జాతిహితంకై ఋషులు చెప్పిన వాజ్మయంలను చదివి ఆచరించాలన్న, తనని, తనవారిని శ్రద్ధగా చూసుకుని, సహకరించే భార్య కావాలి. అప్పుడే ఋషిఋణం తీర్చుకోవడం అవుతుంది.

ఈ మూడు ఋణాలు తీరాలంటే వివాహం చేసుకొని గృహస్థాశ్రమం లోనికి ప్రవేశించాలి తప్ప వేరే మార్గం లేదు. ధర్మాచరణకు ప్రధానమైన ఉపకరణం ధర్మపత్నియే. ఎన్ని వున్నా, వున్నది పుణ్యంగా మార్చుకోవడానికి సహచరి తప్పనిసరి. 

ఎన్నెన్నో అనుభూతులు ఆనందాలు సుఖాలు కష్టాలు సర్ధుబాటులు...ఒకటనేముందీ...అన్ని అనుభవాలను సామరస్యంగా ఒకరికొకరు తోడై పంచుకుంటూ సంతోషంగా జీవనగమనం సాగిస్తూ పురుషార్ధాలను సాధించడమే వివాహ అంతరార్ధం. 

ఇక మన వివాహపద్ధతిలో చాలా ప్రత్యేకతలున్నాయి. మన ఈ పద్ధతుల్లో ప్రతీ ఘట్టం సంప్రదాయకమే, మరుపురాని మధురస్మృతే. ముందుగా అబ్బాయికి తగిన అమ్మాయిని, అమ్మాయికి తగిన అబ్బాయిని ఎంపిక చేయడం ఓ ముఖ్యఘట్టం.

మొదటి ఘట్టం 'పెళ్ళిచూపులు'.
యుక్తవయస్సు వచ్చిన అబ్బాయి, అమ్మాయిలకు వివాహం చేయదలచి ఇరుపెద్దలు చక్కటి సంబంధాలకై పెద్దవారిని, తెలుసున్నవారిని ఆశ్రయించి (ఇప్పటివారు సమిష్టితత్వం లేనందున మాట్రిమోనీలమీద ఆధారపడుతున్నారు)
వారి సహకారంతో వారిని సంధానకర్తలుగా నిలిపి 
ఇరు కుటుంబాల నడుమ రాయభారాలు నడిపి ఒకరిది ఒకరికి నప్పింది అని అనుకున్నప్పుడు తొలుత పెళ్ళిచూపుల కార్యక్రమంకు నాంది పలుకుతారు. ఆపై చేసుకున్నవారికి, చేసేవారికి సమ్మతమై, ఇరువురి ముఖ్యబంధువులు ఒకచోట సమావేశమై, పరస్పర సంప్రదాయలు, కుటుంబ ఆచారవ్యవహారాలు చర్చించుకొని, అన్నీ కుదిరాక ఓ శుభముహుర్తమున 'నిశ్చితార్ధం' చేయ నిర్ణయించుకోవడం రెండవ ఘట్టం.
నిశ్చితార్ధం:- ఇరు కుటుంబాలవారు వారి అబ్బాయి అమ్మాయి ఏకమవ్వడానికి చేసిన ప్రతిపాదనను శాస్త్రానుసారంగా వేదమంత్రాల నడుమ వాగ్ధానం ద్వారా నిశ్చయించుకోవడాన్ని నిశ్చితార్ధం అంటారు. సంప్రదాయబద్ధంగా పెద్దల సమ్మతితో అందరి అత్మీయుల ఆశీర్వాదములతో జరిగే ఈ వివాహ నిశ్చయం అమ్మాయి ఇంట్లో గాని వారు సూచించే చోట జరుగుతుంది. నిశ్చితార్ధంకై అబ్బాయి తన కుటుంబ బంధుమిత్రాదులతో వచ్చినప్పుడు అమ్మాయి తరుపున వారు ఆదరాభిమానాలతో ఆహ్వానిస్తారు. పరస్పర నమస్కారాలతో (నమస్కారం మన సంస్కారమంటారు. దీనిలో కూడా ఓ అంతరార్ధముంది. భగవంతునికి నమస్కరించడంలో భక్తిభావం, గురువుని నమస్కరించడంలో పూజ్యభావం, పెద్దలను నమస్కరించడంలో గౌరవభావం ఉన్నట్లే, పెళ్ళి ఒప్పందం లాంటి ఈ వేడుకలో ఇరు కుటుంబాలవారు నమస్కరించుకోవడంలో రెండు కుటుంబాలు ఒకటి కావాలనే ఆకాంక్షతో అరమరికలు లేకుండా కలిసుందామని రెండుచేతులు జోడించి అనుబంధాన్ని దృఢపర్చుకునేభావముంటుంది)పలకరించుకుంటారు.

హితులు, స్నేహితులు, బంధువుల నడుమ వైదిక మంత్రాలమధ్య అందరికీ అమోదయోగ్యమైన ఈ ఇరువురు పెళ్ళిని లాంచనప్రాయంగా ఖాయపరచుకోవడమనే ఈ కార్యక్రమం ప్రధమంగా విఘ్నేశ్వరుని పూజతో ప్రారంబమౌతుంది. వివాహప్రక్రియ అసాంతం విఘ్నాలు లేకుండా చూడమని ఆయన్ను పూజించడం ఆనవాయితి. ఆపై అమ్మాయికి అబ్బాయి తల్లితండ్రులు నూతనవస్త్రాలను నగానట్రా పండ్లు మధురపధార్ధాలను ఇచ్చి తనకోడలుగా స్వీకరిస్తారు. ఇప్పుడు అమ్మాయికి అత్తమ్మగారు (అబ్బాయి తల్లి), అబ్బాయికి మామయ్యగారు(అమ్మాయి తండ్రి) ఉంగారాలు తొడుగుతారు. అయితే నేటితరంవారు అబ్బాయి అమ్మాయి ఒకరికి ఒకరు తొడుక్కుంటున్నారు. శాస్త్రరీత్యా వివాహం అప్పుడే పాణిగ్రహణం జరగాలని పెద్దలు చెప్తుంటారు. ఇది ఎవరి వంశానుసారంగా వారి వారి కుటుంబ పెద్దలు ఆచరించినది అనుసరించడం ఉత్తమం. 
పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహుర్తాన్ని లగ్నపత్రికగా వ్రాయించిన తదుపరి, వధూవరుల తల్లితండ్రులు నూతన వస్త్రాలపై లగ్నపత్రికలు, తాంబులాలు పెట్టి మార్చుకుంటారు. అటుపిమ్మట అమ్మాయితో కొందరికి తాంబులాలు ఇప్పించి వధూవరులను వేరు వేరుగా ఆశ్వీరదిస్తారు. కానీ ఇప్పటి తరంవారు ప్రక్క ప్రక్కనే కూర్చొబెట్టి ఆశీర్వదిస్తారు. అది సరికాదని, అంతగా సరదా ఉంటే వేరువేరు కుర్చీలలో కూర్చోబెట్టి మధ్యలో చిన్న ఉదకబాండం ఉంచండని పెద్దలవాక్కు. తాత్కాలిక ముచ్చట్లుకు కాకుండా జీవితాంతం ముచ్చటగా ఉండేటట్లు చూడండి అని పెద్దలు చెప్తుంటారు. అప్పటికి ఇప్పటికి కొన్ని మార్పులు అన్నింటా చోటుచేసుకున్నవి. 
పిమ్మట రెండు మనసులు జీవితకాలం తోడునీడై కలిసుండడానికి వేసే ఈ తొలి వేడుకలో, రెండు కుటుంబాలూ కుటుంబాలు జీవితకాలం ఆత్మసంబంధీకుల్లా కలుసిపోయే శుభతరుణంలో, అందరూ ఒకచోట కలుసుకునే ఈ మధురక్షణాల్లో ఆత్మీయముచ్చట్లు,విందుఆరగింపులు,చలోక్తులు, చతురోక్తులు...నవ్వులు, కవ్వింపులు...ఓహో...ఆనంద వెల్లువ...కమనీయ వేడుక...శుభాకాంక్షల డోలిక..... మూడవది ముచ్చటైనది మూడుముళ్లు  పడే శుభదినంకై సన్నాహాలు ఎదురుచూపులు... ఈ ఉల్లాస ఉత్సాహాలు మరుపురాని మధురఘట్టం.

ఇలాంటి మధురానుభూతుల సమాహారాల కలయికే వివాహ బంధంగా ముడిపడి దంపతులుగా ఆదర్శంగా నిలవాలని ముక్కోటి దేవతలు ఆశీర్వదిస్తారు..

                       సర్వే జనా సుఖినో భవంతు...
0 comments: