Sunday, October 18, 2020 By: visalakshi

వాగ్భూషణం...


 #పురుషార్థ సాధన.....


ప్రతి మానవునకు సాధించవలసిన నాలుగు లక్ష్యములు వున్నవి. అవి...


ధర్మ,

అర్ధ,

కామ,

మోక్షము..


..లనే చతుర్విధ పురుషార్ధములు. వీటిలో మొదటి మూడు లక్ష్యముల కొరకు ప్రతివారు నిత్యమూ ఏదో ఒక సాధన చేస్తూనే ఉంటారు. వాటి ఫలితములనూ పొందుతుంటారు. అవి వారి దైనందిన జీవితానికి సంబందించిన విషయములు కాబట్టి వాటి యెడల ఆసక్తి, ప్రయత్నము జరుగుతున్నది. ఈ ప్రయత్నములకు సంప్రాప్తించే ఫలితమంతా దాదాపు ఇహలోకమునకు సంబంధించినదే. అనిత్యము, అశాశ్వితమైనది.


నాల్గవదైన మోక్షము శాశ్వతమైనది. కాబట్టి అందరూ దానిని కోరుకుంటారు. అది చాలా కష్టసాధ్యమైన విషయం కాబట్టి ఎవ్వరూ తీవ్రమైన ప్రయత్నం చేయటానికి ఉత్సాహం కనపరచటం లేదు. ఎందుచేతనంటే అది జ్ఞానము వలననే సాధ్యమవుతుంది. అటువంటి జ్ఞాన సముపార్జనకు యోగ్యత అవసరం.


యోగ్యత పొందాలి అంటే లక్ష్యం యెడల పూర్తి అవగాహన, శ్రద్ద ఉండాలి. అటువంటి శ్రద్దాసక్తులు కలగాలి అంటే సాధన శమాది షట్కసంపత్తి ఉండాలి. వివేకం వల్ల, వైరాగ్యం వల్ల షట్కసంపత్తి లభిస్తుంది. అంటే బాహ్యేద్రియ నిగ్రహం అంతరింద్రియ నిగ్రహం వలన కలుగుతుంది. మనస్సు విషయ వాసనల మీదకు పోకుండా, శాస్త్రములు బోధించిన విషయములపై విశ్వాసం, శ్రద్ద కలుగుతాయి.


వాగ్భూషణం.....


వాక్కు భగవంతుడు మానవునుకి ఇచ్చిన అద్భుత మైన వరం. ఆ శక్తిని అంటే వాక్కును సద్వినియోగ పరచుకోవడం లేదా దుర్వినియోగ పరచుకోవడం అనేది మానవునిలోనే ఉంది. మనిషి మాట్లాడే తీరును బట్టి అతని వ్యక్తిత్వం అవగతమవుతుంది. మాట్లాడే మాటను బట్టి అతని సంస్కారం అర్థమవుతుంది. మాటల్లో ఎంత మహత్తు ఉందంటే మనిషి మాట్లాడే విధానం, పద్ధతి వలన, ఉపయోగించే పదాల వలన మిత్రులు ఏర్పడతారు. బంధువర్గం ఏర్పడుతుంది. శత్రువులు కూడా మిత్రులవుతారు. వైరివర్గం బంధుగణం అవుతుంది. అలాగే మిత్రులు శత్రువులవుతారు. బంధువులు విరోధులవుతారు.


అంచేత వాక్కు మనిషికి భూషణం కావాలంటే భాషణం లోనే ఉంది అంతా. అయితే ఈ భాషణం ఎలా ఉండాలీ అంటే మితం గానూ, ప్రియం గానూ, మృదువు గానూ, సత్యమైనది గానూ ఉండాలి.


మిత భాషణం...


మితంగా, అవసరమైనంత వరకే మాట్లాడడం. దీని వలన ఆత్మస్తుతికీ, పర నిందకూ అవకాశం ఉండదు. వాదోపవాదాలకూ, ఘర్షణలకూ తావుండదు. అనవసరమైన సంభాషణలు లేనప్పుడు కాలమూ వ్యర్థమవదు.


ప్రియ భాషణం...


ఎదుటి వారికి ప్రియం కలిగించేలా మాట్లాడడం. దీని వలన మైత్రి, సఖ్యత, ప్రేమ, అభిమానం, గౌరవం ఏర్పడతాయి.


మృదు భాషణం...


మృదువుగా మాట్లాడడం ఒక విధంగా కటువుగా మాట్లాడకపోవడం. కొంత మంది మాట్లాడితే వినాలనిపిస్తుంది. ఇంకా మాట్లాడితే బాగుండును అనిపిస్తుంది. కొంత మంది మాట్లాడితే వినబుద్ధి వేయదు. మాట్లాడడం ఆపేస్తే బాగుండును అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆపకపోతే తిట్టాలనో, కొట్టాలనో అనిపిస్తుంది. అదే కటు భాషణం.


సత్యభాషణం...


ఎప్పుడూ నిజాన్నే మాట్లాడడం. ఇది ఒక వ్రతం లాంటిది. గొప్ప ధర్మం. శ్రేయస్కరం కూడా. కాని ఒక్కొక్కప్పుడు సత్యం కూడా కఠోరంగా ఉంటుంది. అందుకే "నిజం నిప్పు లాంటిది" అంటారు. దాన్ని దాచలేము కూడా. నిజం చెపితే నిష్ఠూరం కూడా కలుగుతుంది. అవతలి వారి మనసు గాయపడవచ్చు. వారు బాధపడవచ్చు. అలాంటి సందర్భాలలో వారికది ప్రియభాషణం కాకపోవచ్చు.


అంచేత "సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం". సత్యాన్నే పలకాలి. ప్రియంగా పలకాలి. అప్రియమైన సత్యాన్ని పలకకుండా ఉండడమే మంచిది. అంటే నిజం చెపితే ఎవరికైనా ఏదైనా కీడు జరుగుతుందనుకున్నప్పుడు ఆ నిజం చెప్పవలసిన అవసరం లేనప్పుడు చెప్పకుండా ఉండడమే మంచిది. అలాగే ఒక అసత్యం చెపితే ఎవరికయినా ఏదయినా మేలు జరుగుతుందన్నప్పుడు అసత్యమాడినా పరవాలేదు. అదే ధర్మరాజు "అశ్వత్థామా హతః (కుంజరః)" అని ఆడిన అసత్యం. అలాంటి సందర్భాలలో, సమయాలలో సత్యం చెప్పకపోవడమే కాకుండా అసత్యమాడినా దోషం అంటదనేది శుక్రనీతి. కాని అది ఎల్లవేళలా పనికి రాదు.


"స్మితవక్త్రో మితభాషీ, అపూర్వభాషీచ రాఘవః" అని శ్రీరామచంద్రుని అష్టోత్తర శతనామావళిలో కీర్తించడం జరిగింది. అంటే శ్రీరామచంద్రుడు ఎల్లప్పుడూ చిరునవ్వుతో మాట్లాడేవాడునూ, మితంగా భాషించేవాడునూ, అపూర్వంగా అంటే ఇంతకు ముందు ఎన్నడూ ఎవరూ ఎరుగని విధంగా మహోన్నతంగా భాషించేవాడునూ అని కొనియాడడం జరిగింది. అందుకే అవతార పురుషుడై మానవులందరికీ మాటల్లోనూ, చేతల్లోనూ ఆదర్శప్రాయమైన మార్గాన్ని అవలంబించి చూపాడు.


అయితే ఈ వాక్కును నిగ్రహించుకోవడం ఎలా.. మనం మన మనసును నిగ్రహించుకుంటే వాక్కును నిగ్రహించుకోగలుగుతాము. మనసు నిర్మలంగా, శుద్ధిగా ఉంటే వాక్కు కూడా నిర్మలంగా ఉంటుంది. వాక్శుద్ధి కలుగుతుంది. అటువంటి వాక్శుద్ధి కలవారు అన్నది జరిగి తీరుతుంది. అదే పూర్వం ఋషీశ్వరులూ, మునీశ్వరులూ ఇచ్చిన శాపాలకూ, వరాలకూ ఉదాహరణ. వాక్శుద్ధి కలవారు చేసే కర్మలు కూడా శుద్దిగానే ఉంటాయి. ఇలా మనసూ, వాక్కూ, కర్మా ఈ మూడూ శుద్ధిగా ఉండడాన్నే త్రికరణ శుద్ది అంటారు...


|| ఓం నమః శివాయ ||

0 comments: