Monday, October 19, 2020 By: visalakshi

మాతా అన్నపూర్ణేశ్వరి...



 #మాతా అన్నపూర్ణేశ్వరీ.............!!


'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అని అన్నారు. భగవంతుని సన్నిధిని కోరుకునే మానవుడు, ముందుగా అన్నాన్ని ప్రణమిల్లమనండని మనుధర్మశాస్త్రం పేర్కొంటోంది. జ్ఞానాన్వేషకులైన మునులు అన్నాన్ని అలక్ష్యం చేయరు. కడుపులో ఆకలి అనే అగ్నిని పుట్టించేది అన్నపూర్ణమ్మకాగా, ఆ మంటని చల్లార్చేది కూడ ఆ చల్లని తల్లే. ఆ తల్లి కాశీనగరంలో కాశీ అన్నపూర్ణేశ్వరిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తోంది.


ఆ అన్నపూర్ణమ్మ తల్లి కాశీలో కొలువై ఉండటం వెనుక ఒక కథ ఉంది.


 బ్రహ్మదేవుని గర్వమణిచేందుకై పరమశివుడు, బ్రహ్మ తలల్లో ఒక తలను ఖండించగా, బ్రహ్మహత్యాదోషం చుట్టుకుంది. ఆ హత్యాదోషం పరమశివుని కడుపులో ఆకలిమంటగా రూపుదాల్చింది. ఆకలి బాధను తీర్చుకునేందుకై పరమశివుడు కపాల భిక్షాపాత్రను పట్టుకుని యాచిస్తూండేవాడు. ఆ భిక్షపాత్రలో ఆదిశక్తి అన్నం పెట్టగా, ఆ భిక్షాపాత్ర నిండాలన్నది విధి. అందుకై ఆదిశక్తి అన్నపూర్ణ అవతారాన్ని ధరించింది. ఆదిభిక్షువు పాత్రను అన్నంతో నింపింది. ఫలితంగా స్వామిని పట్టుకున్న బ్రహ్మహత్యాదోషం వెనక్కి తగ్గింది.


మరి, ఆ తల్లి వారణాశికి వచ్చిన కథ సంగతి ఏమిటి? ఈశ్వరునికి ప్రియాతిప్రియమైన కాశీ నగరంలో దేవదత్తుడు, ధనుంజయుడు అనే ఇద్దరు సోదరులున్నారు. దేవదత్తుడు అష్టైశ్వార్యాలతో తులతూగుతూండగా, ధనుంజయుడు మాత్రం నిత్య దారిద్ర్యంతో సతమతమవుతుండేవాడు. ఒక రోజు ధనుంజయుడు మణికర్ణికా స్నానఘట్టంలో ముఖ ప్రక్షాళన చేసుకుని, కాశీవిశ్వేశ్వరుని దర్శించుకుని, తినేందుకు ఏమీ దొరక్కపోవడంతో, ఆకలితో నకనకలాడుతూ కాశీ ముక్తి మంటపంలో కూర్చున్నాడు. 'నేను ఇలా ఆకలిదప్పులతో అలమటించడానికి కారణమేమిటి? నేను గతజన్మలో ఎవరికి అన్యాయం చేసాను? అని ఆలోచిస్తూ నీరసంతో నిద్రలోకి జారిపోయాడు. నిద్రలో అతనికొక కల. ఆ కలలో సన్యాసి గోచరించి ఇలా చెప్పాడు. 'దరిద్ర ధనుంజయా! పూర్వకాలంలో కంచిలో శత్రు మర్దనుడనే రాజకుమారుడుండేవాడు. అతనికి హేరంబుడు అనే ప్రియ మిత్రుడూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ వేటకెళ్ళి దారి తప్పిపోయారు. ఆకలితో అల్లాడిపోయారు. అలా తిరిగి తిరిగీ సూర్యాస్తమయ సమయానికి ఓ మునీశ్వరుని దర్శించుకున్నారు. ఆ మునీశ్వరుడు మిత్రులిద్దరినీ తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి మంచి నీళ్లిచ్చి, ఆకలి మంటలు చల్లారేందుకు పాలలో ఉడికించిన బియ్యపుపిండి ఫలహారాన్ని ఇచ్చాడు. ఆకలితో నకనకలాడుతూన్న శత్రుమర్దన రాజ కుమారునికి ఆ పదార్థం అమృతంలా తోచింది. ఒక్క చుక్క మిగల్చకుండా అంతా తాగేశాడు. అతని మిత్రుడు హేరంబునికి ఆ పదార్థం నచ్చక పోవడంతో కొంచెం తాగి, మిగతా వదిలేశాడు. అలా అన్నాన్ని అవమానపరిచి నందుకు హేరంబునిగా ఉన్న నీవు, ఈ జన్మలో దరిద్ర ధనుంజయునిగా జన్మించావు.


రాజకుమారుడైన శత్రుమర్దనుడు నీ అన్న దేవదత్తునిగా జన్మించి సకల భోగాలను అనుభవిస్తున్నాడు. అన్నాన్ని అవమాన పరిచినందుకుగాను నిన్ను అన్నదోషం వెంటాడుతోంది. ఈ స్థితి నుంచి నువ్వు బయటపడాలంటే అన్నపూర్ణేశ్వరీదేవిని శరణు వేడుకో. నియమ నిబంధనలతో అన్నపూర్ణ వ్రతాన్ని అనుసరించి, నీ దరిద్రాన్ని దూరం చేసుకో" అని చెప్పి సన్యాసి అంతర్థానమయ్యాడు. కల నుంచి మేల్కొన్న ధనుంజయండికి అన్నపూర్ణ వ్రతాన్ని ఎలా చేయాలో తెలియదు. అప్పట్నుంచి కనబడినవారినంతా అన్నపూర్ణ వ్రతాన్ని ఎలా చేయాలని అడుగసాగాడు. అలా అర్థిస్తూ, అర్థిస్తూ కామరూపదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఓ కోండప్రక్కన కోంతమంది దేవకన్యలు ఏదో పూజను చేస్తూండడం అతని కంట్లో పడింది. వారి దగ్గరకెళ్లి ఎవరిని పూజిస్తున్నారని అడిగిన ధనుంజయునికి, అన్నపూర్ణేశ్వరీదేవిని పూజిస్తున్నామన్న జవాబు లభించింది. అతని సంతోషానికి ఎల్లలు లేవు. ధనుంజయుని అభ్యర్థనతో దేవతలు అతనికి అన్నపూర్ణ వ్రతం చేసే విధానాన్ని చెప్పారు. ఇంటికి తిరిగివచ్చిన ధనుంజయుడు ఎటువంటి ఆటంకం లేకుండా అన్నపూర్ణేశ్వరీ వ్రతాన్ని చేసి, ఆ తల్లిని పూజించి, ఆ తల్లి అనుగ్రహానికి పాత్రమయ్యాడు. దరిద్రబాధలను అనుభవించిన ధనుంజయుడు ఒక్కసారిగా ఐశ్వర్యవంతుడయ్యాడు.


ధనవంతుడవగానే ధనుంజయుని కామపిశాచి పట్టుకుంది. కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేస్తూ మరొక స్త్రీతో కాపురాన్ని మొదలుపెట్టాడు. ఒక రోజు పెద్ద భార్యతో కూర్చుని అన్నపూర్ణ వ్రతాన్ని ముగించిన ధనుంజయుడు చేతికి వ్రత దారంతో చిన్న భార్య ఇంటికి వెళ్ళాడు. నన్ను వెళ్లగొట్టేందుకు నీ పెళ్ళాం ఈ దారాన్ని కట్టిందా? అంటూ ఆ దారాన్ని తెంపి దూరంగా విసిరేసింది అతని రెండవ భార్య. అంతటితో ఊరుకోకుండా ఆ దారాన్ని అగ్నికి ఆహుతి చేసింది. ఉదయాన్నే నిద్రలేచిన ధనుంజయుడు నోముతాడు తన చేతికి లేకపోవడాన్ని చూసి, భయపడి మరొక తాడును కట్టుకున్నాడు.


కానీ, జరగాల్సినదంతా జరిగిపోయింది. అన్నపూర్ణకు అపచారం జరిగిపోయింది. కుబేరునిగా ఉన్న ధనుంజయుడు మరలా కుచేలునిగా మారిపోయాడు. అనంతరం ఎన్ని వ్రతాలు చేసినప్పటికీ, అతనికి అన్నపూర్ణ కటాక్షం లభించలేదు. ఇక నాకేది గతి అంటూ మరలా కామరూప దేశానికి పరుగెత్తాడు. తనకు అన్నపూర్ణవ్రతం బోధించిన చోట దృశ్యన్ని చూసి, అతనికి ఆశ్చర్యమనిపించింది. అప్పుడు పూజ చేసిన చోట ఒక బావి కనిపించింది. జీవితంపై విరక్తి చెందిన ధనుంజయండు కళ్ళు మూసుకుని ఆ బావిలో దూకాడు. అయితే చీకటిలో బావిలో దూకిన ధనుంజయుడు చనిపోలేదు.


ఒక్కసారిగా బావిలోపల కళ్ళు మిరమిట్లు గొలిపే వెలుగు కనిపించింది. అక్కడ ఓ అద్భుత దృశ్యం అతని కంటబడింది. అక్కడొక కొలను. ఆ కొలను పక్కన పూజలో నిమగ్నమైన దేవతలు. ఎటుచూసినా వేదఘోషలు. చెవులకింపైన సంగీతం. అక్కడ స్ఫటిక శరీరాకృతితో ఓ పురుషుడు ఆనందతాండవం చేస్తున్నాడు. ఆతని కొప్పులో నెలవంక. నుదుట మూడు కన్నులు. ఆ శరీరమంతా ఆభరణాలతో ధగధగ మెరిసిపోతోంది. ఆయనకు ఎదురుగా ఓ రత్న సంహాసనంపై ఓ మాత కుర్చుని అతని నృత్యాన్ని ఆసక్తితో చూస్తోంది. ఇంతలో కొంతమంది దేవతలు ధనుంజయుని చూసి అతడిని గెంటి వేయడానికి ఉద్యుక్తులయ్యారు. అప్పుడా మాత వారిని వారించింది. ఆమె ధనుంజయుని దగ్గరకు పిలిచి, "నువ్వు ఇన్నాళ్ళూ ఏ అన్నపూర్ణేశ్వరీ దేవిని చూడాలనుకుంటున్నావో, ఆ అన్నపూర్ణేశ్వరీ దేవిని నేను. రుద్రుని రుద్రతాండవాన్ని చూసేందుకై ఇక్కడికొచ్చాను. నువ్వు చేసిన వ్రతాలు, ఆ పుణ్యం వలన నన్ను చూసే భాగ్యానికి నోచుకున్నావు. ఇది బ్రహ్మాదులకు కూడ దక్కని అవకాశం" అని చెప్పింది.


అప్పుడు ధనుంజయుడు భక్తి పారవశ్యంతో, "మాతా! మీ ఇద్దరి దర్శనభాగ్యంతో నా జన్మ తరించింది" అని పలికాడు. అన్నపూర్ణేశ్వరీ దేవి చిరునవ్వులు చిందిస్తూ, "ధనుంజయా! ఇకపై ఎవరు అన్నపూర్ణ వ్రతాన్ని చేస్తారో, వారికి కరువు వంటి బాధలుండవు. ఏ ఇంట్లో నన్ను పూజిస్తారో, ఆ ఇంట్లో నేను వచ్చి కొలువుంటాను. ఆ ఇల్లు ఐశ్వర్యాలతో కళకళలాడుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళి, మరలా వ్రతాన్ని ప్రారంభించు. నీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నేను భూలోకవాసుల కోసం కాశీ నగరానికే వస్తున్నాను. నా కోసం నువ్వొక ఆలయాన్ని నిర్మించు" అని ఆనతిచ్చింది. ధనుంజయుడు అమ్మవారి ఆనతిని అనుసరించి కాశీలో ఓ ఆలయాన్ని నిర్మించాడు. అదే కాశీ అన్నపూర్ణేశ్వరాలయం.


నిత్యాన్నదానేశ్వరిగా, నిటాలాక్ష ప్రాణేశ్వరిగా, అన్నపూర్ణాదేవి తన బిడ్డలైన మనకే కాక సకలజీవరాసులన్నిటికీ, ఆహారాన్ని ప్రసాదిస్తుంది. తద్వారా ఈ జీవకోటి నశించిపోకుండా కాపాడుతుంది. ఇలా జీవకోటికి ఆహారాన్నందించే అన్నపూర్ణాదేవి నిజ నివాసం ఆది స్మశానమైన వారణాసి క్షేత్రం. ఆ క్షేత్రాధిష్ఠాన దేవుడైన ఆ ఆదినాధుడు విశ్వేశ్వరుడి ప్రియపత్ని శ్రీ అన్నపూర్ణాదేవి. ఆమెనే కాశీఅన్నపూర్ణా అని పిలుస్తారు. దసరా పండుగ సందర్భాలలో దుర్గాలయంలో దుర్గమ్మ తల్లికి అన్నపూర్ణమ్మ అలంకారాన్ని కూడ చేస్తుంటారు. అయితే దుర్గాలయంలో ఈ అన్నపూర్ణాదేవి అలంకారాన్ని వేయడంలో పరమార్థం ఏమిటి అని అడిగితే, ఈ అన్నపూర్ణదేవి కూడా అమ్మవారి దివ్యస్వరూపాల్లో ఒక రూపమే. సాక్షాత్తు తన భర్త అయిన పరమేశ్వరుడే ఆదిభిక్షువుగా యాచనకి వస్తే ఆ తల్లి అన్నపూర్ణా ఆయనకి భిక్షని ప్రసాదిస్తుంది. ఇదీ అలంకారంలోని దృశ్యం.


 దీన్ని చూసి మనం గ్రహించాల్సింది ఏమంటే, తల్లికి బిడ్డలంటే ఎంతో ప్రేమ. ఏ తల్లైనా తన బిడ్డలందరికీ కడుపునిండా తీండిపెట్టుకోవాలనుకుంటుంది. అందుకోసం ఎంతకష్టాన్నైనా పడుతుంది. అలాగే దుర్గమ్మ కూడా అన్నార్తుల పాలిటి అన్నపూర్ణగా మారి, వారి ఆకలిని తీరుస్తోంది. అది ఆమెకి అత్యంత ప్రీతిపాత్రమైన కార్యం. ఆకలేసి యాచించిన తన భర్తకే ఆమె అన్నాన్ని సమర్పిస్తోంది. అంటే ఈ లోకంలో అ అన్నార్తులైన వారినందరినీ సాక్షాత్తు శివ స్వరూపులుగా మనం భావించాలి. అలా ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు మనమంతా సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవిస్వరూపమే అవుతాం. ఆ న్నార్తుల ఆకలిని తీర్చే అన్నపూర్ణలమవుతాం. లోకంలో ఆకలిని తీర్చడం కన్నామిన్న అయిన దానం ఏముంది? అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు. కాబట్టి మనం కూడా ఈ అలంకారంలోని పరమార్థాన్ని గ్రహించి అన్నదాతలుగా, అన్నపూర్ణలుగా మారాలి. వీలైనంత వరకూ అన్నార్తులు అలమటించి పోకుండా కాపాడాలి. 


ఒక్కసారి ఆ నిత్యాన్నదానేశ్వరి అన్నపూర్ణాదేవిని మనకి ఆ శక్తినివ్వమని ఆ బుద్ధినివ్వమని భక్తితో ప్రార్థించుకోవలెను. ఆ తల్లి భక్తాభీష్టప్రదాయిని. మనం కోరుకున్న కోరికలను తీర్చే కల్పవల్లి.

                            ఓం శ్రీ మాత్రే నమః...

సేకరణ. ఫేస్బుక్ నుండి.....

0 comments: