Wednesday, October 26, 2016 By: visalakshi

అచంచల విశ్వాసం

 శ్లో" మాం చయో' వ్యభిచారేణ భక్తియోగేన సేవతే!
    స గుణాన్ సమతీ త్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే!! -(14ఆ: 26శ్లో)

భా:- ఎవడు నన్ను చలించని భక్తియోగము చేత సేవించుచున్నాడో వాడు ఈ మిశ్రితమైన గుణములను అతిక్రమించి, బ్రహ్మతో సమానమైన రూపమును పొందుటకొరకు తగు వాడవును.  

ఈ ప్రపంచములో మనిషి పుడుతూనే రకరకాల బాధ్యతల బంధాలతో వచ్చాడు. వాటినుండి తప్పించుకోలేడు. సహజంగా ఏర్పడ్డ బంధాలు అవి. ఎవరూ కల్పిస్తే వచ్చేవి కావు.తొలగించినా పోయేవీ కావు  పుట్టుకతో వచ్చాయి కనుక... 

 మన ప్రవృత్తుల్లో కూడా ఎన్నో విచిత్రాలను మనం దర్శిస్తున్నాం. తెలియకుండానే మనస్సు ఒక్కొక్కసారి ప్రశాంతమౌతుంది. ఒకోసారి ఉద్రిక్తమౌతుంది.మరోసారి తెలియని అజ్ఞానంలోకి జారుకుంటుంది. కారణం ఈ జన్మ ప్రకృతి యొక్క అంశ కలది. అందుకే ప్రకృతికుండే గుణాలు దీనిమీద ఎప్పుడూ ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రకృతి సత్వ,రజో తమస్సులనే గుణాలు కలిగి ఉన్నది...వాటివల్ల తయారైంది కనుక ఈ శరీరం కూడా సత్వరజస్తమోమయమయే ఉంటుంది...సత్వం జ్ఞానాన్ని, ఆనందాన్ని ప్రశాంతతనూ ఇస్తుంది. రజస్సు కోరికలూ, కోపతాపాలూ పెంచుతుంది. తమస్సు అజ్ఞానాన్ని నిద్రాబద్ధకాలనూ పెంచుతుంది.


   ఈ మూడు గుణములు పర్యాయేనా ఒకటి పైకి వస్తే రెండు క్రిదికి వెళుతుంటాయి. సహజంగా సాగుతుంటాయి. ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవి. ఈ జీవుడు జ్ఞానఘనుడు. జ్ఞానరసుడు అని మనకి ఉపనిషత్తు చెబుతోంది. జ్ఞానమే తన ఆకారమైనపుడు ఈ ప్రకృతిలో శరీరాల్ని ధరించి తిరిగేటపుడు, తరిగిపోయే జ్ఞానాన్ని తిరిగి తాను నింపుకోవాలి ...పెంచుకోవాలి అని అనిపించాలి కదా! దానికి పరమాత్ముడు కొన్ని సాధనాలు చెప్పాడు. " లభించిన దానితో సదా ఆనందంగా ఉండు."... "ఎవడైనా నిన్ను నిందించినా, ఎవడైనా స్తోత్రం చేసినా పట్టించుకొనే ప్రయత్నం చేయకు."...మిశ్రతమై ఉండే త్రిగుణముల ప్రభావానికి దూరం కమ్ము!కేవలం సత్వంలో మాత్రమే ఉండే ప్రయత్నం చేయి. 'నిత్య సత్త్వస్థ:' అన్నాడు.


అయితే సత్త్వగుణంలో ఉండాలంటే ఈ రజస్తమస్సుతో ప్రచురమైన ఈ విషయసుఖాల్లోనుండి నిన్ను మొట్టమొదట వెనక్కు తీసుకో. వెనక్కు తీసుకోవడానికి బలం కలగాలి కనుక, ఈ శరీరానికి అందించే ఆహారాదులు కూడా శరీరానికి సత్త్వం అధికం చేసేవి చూచి అందించాలి. వండుకున్న పదార్ధంలో కూడా కనిపించని  దోషాలు ఉండవచ్చు. కనుక దానిని భగవంతునికి నివేదన చేసిన తరువాత మాత్రమే తీసుకోవాలి. అది సత్త్వాన్ని పెంచే అవకాశముంటుంది...దీపం వెలిగిస్తే చీకటి దానంతట అదే పోయినట్లుగా ఉత్తమ జ్ఞానం కలిగిన ఒకని సహాయం తీసుకోగలిగితే మన జ్ఞానం అధికమై మనపై ఆక్రమించడానికి ప్రయత్నం చేసిన తమోగుణాదులను వాటంతట అవే తొలగిపోయేట్టు చేస్తుంది. 

' బ్రహ్మ భూయాయ కల్పతే'గొప్ప బ్రహ్మానందాన్ని అనుభవించే స్థితికి చేరగలుగుట ...ఈ యోగ్యత ఎప్పుడు? ఏ రకమైన సందేహాలకీ తావీయని ,నిశ్చయాత్మక, అచంచలమైన విశ్వాసంతో ఎవడు నన్ను సేవిస్తాడో ....పరమాత్మ శ్రీ చరణ సన్నిధానానికి చేరడానికి మనిషికి ఈ విశ్వాసం చాలా అవసరం. పరమాత్మ సత్యసంకల్పుడు. దోషాలు మనలో ఉంటాయని తెలుసు. కానీ విశ్వాసం మనలో ఏర్పడితే ఆ దోషాలను మనలోంచి తొలగేటట్టు ఆయనే చేస్తాడు. ఆశ్రిత వాత్సల్యజలధి అని కదా స్వామిని అంటారు! నాయందు మనసు నిలుపుము. నా భక్తుడవు కమ్ము. నన్ను పూజింపుము.  నన్నేశరణు వేడుము. ఈ విధముగా చేసిన నీవు నన్నే చేరుదువు  ఇది సత్యము.  ...........geetaasaaramu...


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

0 comments: