Wednesday, December 7, 2016 By: Vedasree

ఏకనాధస్వామి -దత్తుని అనుగ్రహం

నిరంతరము భగవన్నామామృత పానచిత్తులై అతిధి అభ్యాగతులను సేవిస్తూ అరిషడ్వర్గములను అంతమొందించి, భగవత్సాన్నిధ్యమును పొంది తరించిన భాగవతోత్తములలో సంత్ ఏకనాధస్వామి సదా స్మరించ దగిన ధన్యాత్ములు.
గోదావరీ పుణ్యనదీతీరంలో పైఠనపుర మను గ్రామము కలదు. ఆ గ్రామములో సూర్యాజీరావు, రుక్మాబాయి అను దంపతులుండేవారు. ఆదర్శగృహస్థ జీవనమును సాగిస్తూ జీవించేవారు. కానీ వారి హృదయాలలో పున్నామనరకము నుండి కాపాడి సద్గతిని ప్రసాదించే కుమారుడు లేడన్నవ్యధ చోటుచేసుకొని ఉన్నది. నిరంతరము పాండురంగని సేవచేస్తూ, తమ అభీష్టము ననుగ్రహించమని ప్రార్ధించేవారు. పాండురంగని ఆశీస్సులు ఆ పుణ్యదంపతులకు లభించాయి. వారికి కుమారుడు కలిగాడు. ఆ బాలునికి ఏకనాధ్ అని నామకరణం చేశారు. భగవదనుగ్రహంతో జన్మించిన ఏకనాధుడు బాల్యమునుండి ఆధ్యాత్మిక విషయములందు ఆసక్తి చూపుతుండేవాడు. ఆసక్తి పెరిగి పెరిగి ఆశయసిద్ధికి అన్వేషణగా పరిణమించింది. బాహ్యవిషయములందు అనురక్తి కలగడంలేదు. నిరంతరం వైరాగ్యజనిత మనస్కుడై ఉదాసీనంగా కనిపించేవాడు. ఏదో పోగొట్టుకున్నట్లు అతని నేత్రాలు వెతుకుతున్నట్లు గోచరమయ్యేవి. భగవంతునికి దూరమైన బ్రతుకు నిరర్ధకమని ఆ పసిహృదయం ఆరాటపడసాగింది.
 ఒకనాడు అతని స్నేహితులు ఆటలకు రమ్మని పిలువగా...ఆటలయందు ఆసక్తి లేకపోయినను మిత్రుల ప్రోద్బలంపై బయలుదేరుతాడు. ఆటలాడుతుండగా ఏకనాధుడు ఓడిపోయాడంటూ మిత్రులందరూ కేరింతలు పెడతారు. ఏకనాధుడు ఆలోచిస్తూ అవును వారు చెప్పినది నిజమే భగవానుని మరచి జీవనము కొనసాగించు నేను అపజయానికి మారుపేరు. నేను తప్పక గెలుస్తాను. భగవంతుని గెలుచుకుంటాను. అని చింతిస్తూ వైరాగ్యము హృదయమునుండి పెల్లుబుకుచుండ ఒక వృక్షచాయలో ఆశీనుడై అంతర్ముఖుడయ్యాడు. అంతరాత్మలో రమించసాగాడు. ఆట ముగియగానే స్నేహితులందరూ ఏకనాధుని అన్వేషిస్తూ ఆ ప్రదేశానికి అరుదెంచారు. అచ్చట అద్భుత దృశ్యాన్ని గాంచి నిశ్చేష్టులయ్యారు. ఏకనాధస్వామి ధ్యానస్థితిలో యుండ త్రాచుపాము అతని మెడను చుట్టి తన పడగతో స్వామి శిరస్సుకు గొడుగు పట్టినట్లు నిలచి యుండుట చూస్తారు. వారి అలికిడికి సర్పము ఏకనాధుని వదలి దూరంగా వెళ్ళిపోయింది. ఏకనాధస్వామి దృష్టి బహిర్ముఖమైంది. స్నేహితులందరూ స్వామిని చుట్టుముట్టి జరిగిన విషయమంతా చెప్పారు. ఏకనాధస్వామి అలా ఉండటాన్ని గూర్చి ప్రశ్నించసాగారు. 
 స్వామి ప్రసన్నవదనంతో స్నేహితులను సమీపించి వారితో మిత్రులారా! "నాకు ఆంతర్యంలో భగవానుని దర్శనం లభించింది. భగవానుని అమృతవాక్కు నాకు హృదయంలో వినిపించింది. దౌలతాబాద్ నగర నివాసియైన జనార్దనపంత్ ని గురువుగా స్వీకరించి సేవించమని ఆదేశము అందినది.నేను గురు సాన్నిధ్యమును పొందుటకు బయలుదేరుతున్నాను." అని మిత్రబృందమును కౌగలించుకొని, వారినుండి వీడ్కోలు తీసుకొని వెనుదిరిగి చూడకుండా దౌలతాబాద్ చేరాడు. గురు జనార్ధన పంత్ గృహస్థుడు. తాను సంసారములో యున్నను తనలో సంసారము లేకుండా జీవించిన మహాజ్ఞాని. దత్తాత్రేయ ఉపాసకులు.ప్రతి గురువారము తాను ఒక అరణ్యప్రదేశమునకు వెళ్ళి అక్కడ దత్తాత్రేయులవారి దర్శనము పొంది తృప్తి చెందేవాడు. తన దరిచేరు జిజ్ఞాసువులకు మార్గమును చూపి నడిపిస్తుండేవాడు. అట్టి గురుజనార్ధనుల వారిని సేవించి, ధన్యత నొందమని హృదయాంతర్యామియైన భక్తవత్సల భగవానుడు ఏకనాధస్వామిని ఆదేశించాడు.ఏకనాధుడు దౌలతాబాద్ చేరి గురు జనార్ధుని పాదాలను ఆశ్రయించారు. జనార్ధనుడు ఏకనాధుని శిష్యుడుగా స్వీకరించాడు. ఆతనిని గమనిస్తూ మంత్రదీక్ష ఇవ్వకుండా తమ ఇంటి ఖర్చుల పద్దులను ఒక పుస్తకములో వ్రాస్తుండమని చెప్పెను. సద్గురుని ఆదేశానుసారము వ్రాయుచుండెడివాడు. క్రమముగా ఏకనాధుని ఏకాగ్రతను, బుద్ధిసూక్ష్మతను గ్రహించి జనార్ధనుడు తృప్తి చెందుతాడు. " కుమారా! ఏకనాధా! ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరింపబడిన కర్మలు మానవునికి ఆధ్యాత్మికోన్నతిని కల్గిస్తాయి. గృహపద్దులను సరిచేయుటకు నీవు ఉపయోగించిన ఏకాగ్రతను భగవానునిపై వినియోగించినచో అనిర్వచనీయానందమును పొందగలవు." అని పరోక్షంగా జ్ఞానోపదేశము చేశారు గురు జనార్ధనులు. గురుబోధ ఏకనాధునిలో నిద్రాణమైయున్న ఆధ్యాత్మిక శక్తిని ప్రజ్వలింపచేసింది. భగవద్దర్శనము కొరకు తపించిపోసాగాడు.
గురుజనార్ధనుడు గురువారమునాడు యధావిధిగా దత్తాత్రేయులవారి దర్శనమునకై అరణ్యమునకేగుచు ఏకనాధస్వామిని వెంటబెట్టుకొని వెళ్ళారు. "ఏకనాధా! ఈనాడు నీకు దత్తాత్రేయులవారి దర్శనము కాగలదు. వారు ఏ రూపములోనైనను కనిపించవచ్చును. భ్రాంతికి లోనుగాకుము. అని చెప్ప ధ్యానస్థితిలో ఆశీనులైరి. కొంతసేపటికి ఒక వికృత రూపధారి అచ్చట కరుదెంచెను. జనార్ధనుడు ఆ వ్యక్తి పాదాలపై బడి ప్రణమిల్లెను. ఏకనాధుడు ఆ వ్యక్తిని చూసి అసహ్యించుకుంటాడు. జనార్ధునుని ఆశీర్వదించి ఆ వ్యక్తి అదృశ్యమవుతాడు. జనార్ధనుడు "వత్సా! ఏకనాధా! ఎంత అపచారము చేసితివి. ఆ వచ్చిన వ్యక్తి ఎవరోకాదు. అతడే అనసూయా పుత్రుడైన  దత్తాత్రేయులవారు.  త్రిమూర్త్యాత్మక   శక్తి స్వరూపము. చేతికందిన అపూర్వ అవకాశమును జారవిడుచుకొంటివి" అని తెలియజేయగానే ఏకనాధుడు దు:ఖవదనుడై విలపించసాగాడు. శిష్యుని పరితాపమును గాంచి..దిగులు చెందకు ఈ రోజుతో నీలో నున్న కొద్దిపాటి అజ్ఞానము పటాపంచలైంది. వచ్చే గురువారము నాడు నీవు దత్తాత్రేయులవారి దర్శనమును పొంది, వారి అనుగ్రహమునకు కూడా పాత్రుడవయ్యెదవు అని ఆశీర్వదించాడు.
మరుసటి గురువారము ఏకనాధుని వెంటనిడుకొని అరణ్యానికి ప్రయాణమయ్యారు గురు జనార్ధనులు. ఒక వృక్షచాయలో ఆసీనులై ధ్యానము చేయుచుండగా మెరుపు మెరుస్తుంది. ఒక దివ్యకాంతి వలయం గోచరిస్తుంది. నేత్రాలు తెరుస్తారు. దత్తాత్రేయులవారు ఒక ఫకీరు వేషములో దర్శనమిస్తారు. ఆతని చుట్టూ నాలుగు కుక్కలుంటాయి. ఆరు మేకలుంటాయి. వారు ఏకనాధుని దగ్గరకు పిలిచి అతని చేతికి ఒక ఖడ్గము నిచ్చి తనతో ఉన్న ఆరు మేకలను ఖండించమని చెబుతారు. ఏకనాధస్వామి భగవదాజ్ఞను శిరసావహించి మేకలను ఖండిస్తాడు. వెంటనే అక్కడ గోచరిస్తున్న దృశ్యమంతా అదృశ్యమైంది. ఫకీరుస్థానే దత్తాత్రేయులవారు ప్రసన్నవదనంతో దర్శనమిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపములతో మూడు శిరస్సులు, ఆరుచేతులతో దర్శనమిస్తారు. శంఖ, చక్ర, గదా,పద్మ, త్రిశూలముతో అద్భుత దర్శనమిచ్చి అనుగ్రహించారు. ఫాలభాగమున విభూతి ధారణచేసి, తులసిమాలను, పుష్పహారములను కంఠమునందు ధరించి, పాదుకలు పాదములయందు ధరించి, కామధేనువు వెనుక నిలబడియుండగ దేదీప్యమానంగా దర్శనమిచ్చి అభయప్రదానం చేశారు. 
 ఏకనాధస్వామి దత్తాత్రేయులవారికి సాష్టాంగ నమస్కారము చేసి తన కన్నీటితో స్వామి పాదాలకు అభిషేకం చేస్త్తాడు. దత్తాత్రేయులవారు "ఏకనాధా! నీవు ఖండించిన మేకలు ఏమిటో తెలుసా? అవియే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనెడి అరిషడ్వర్గములు. నీవు అరిషడ్వర్గములను అంతమొందించి అంత:కరణ శుద్ధిని పొందావు. ఇక నీ శేషజీవితమును హరిసేవకు వినియోగించుము. హరిగుణములను అభంగరూపముగా రచించి గానము చేయుచు తరించుము. వాల్మీకి విరచితమైన శ్రీమద్రామాయణకావ్యము, వేదవ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత గ్రంధములు సంస్కృత భాషలో యున్నవి. నీవు రామాయణ, భాగవత కావ్యములను ప్రాకృతమైన మరాఠీ భాషయందు రచించుము. అని అమృత సందేశమునిచ్చిఅంతర్ధానమయ్యెను.భాగవతులందరు గృహస్థాశ్రమములోనే తరించారు. నీవు నా ఆజ్ఞానుసారము గృహస్తుడవై ఆదర్శమార్గమున చరించి,భక్తిమార్గములో తరించి, లోకాన్ని తరింపజేయుము అని గురు జనార్ధనులవారు దీవించిరి. ఏకనాధస్వామి తల్లిదండ్రుల ఆదేశానుసారము  సద్గుణ సంపన్నురాలైన గిరిజాబాయి అను కన్యను వివాహమాడెను. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానము కలిగిరి. ఏకనాధస్వామి నిరంతరము జపధ్యానాదులతో, భగవద్గుణ సంకీర్తనాదులతో తన్మయత్వ జీవనముతో కాలము గడుపుచుండెను. ఒకనాడు పాండురంగ భగవానుడు ఏకనాధస్వామికి స్వప్న దర్శనమిచ్చి "ఏకనాధా! వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణ కావ్యమును   సులభశైలిలో సంస్కృతము తెలియనివారు చక్కగా చదివి అర్ధం చేసుకొనునట్లు మరాఠీభాషలో రచించుము" అని తెలియజేసెను. ఏకనాధస్వామి మేల్కొని దిగ్భ్రాంతి చెందెను. దత్తాత్రేయులవారి ఆశీర్వాదముతో, మరియు పాండురంగని అనుజ్ఞను హృదయములో గురుదేవులను కూడా ప్రార్ధించి రామాయణ రచనను రమ్యముగా సాగించి పూర్తి చేసెను. పరమ భాగవతమూర్తి ఐన ఏకనాధస్వామి తనకు ప్రాణమైన భాగవత గ్రంధమును కూడా మరాఠీ భాషలోకి అనువదిస్తూ భక్త సమూహమునకు వివరించెడివారు. ఏకనాధుని భక్తిప్రపత్తులకు సంతసించిన ద్వారకాపతి శ్రీకృష్ణుడు బ్రాహ్మణరూపంలో వచ్చి ఏకనాధస్వామి ఇంట్లో వంట చేయు శ్రీ ఖంఢ్వాగా 12 సం"లు ఆయనవద్ద ఉండి సేవ చేసెను. ఆయనను శ్రీకృష్ణ పరమ్మాత్మ అవతారములో చూసిన ఏకనాధుడు భగవాన్ నన్ను కరుణించావా తండ్రీ! అంటూ శ్రీఖండ్వా పాదములపై పడెను. చూస్తుండగానే శ్రీఖండ్వా అదృశ్యమయ్యెను. కృష్ణా తెలియక నీచే వండించుకొని తృప్తిగా 12సం"లు భోజనం చేశాను. నీవు తిన్నావా అని ఒక్కనాడైనా అడుగలేదు అని విలపించెను. వాసుదేవుడు మధురమైన వాణితో ఏకనాధా! నీవు నా ఆంతరంగిక భక్తుడవు. నీవు నా కృపకు పాత్రుడవయ్యావు. నిన్ను త్వరలోనే నాలో ఐక్యము చేసుకొంటాను" అని చెప్పి అంతర్ధానమయ్యెను. ఏకనాధుడు  కొద్ది రోజులకు భక్తులకు నమస్కరించి, గోదావరీ పుణ్యతీర్ధములోదిగి నీటిలోనుండి భక్తజనులకు నమస్కరిస్తూ వాసుదేవుని చైతన్యములో లీనమయ్యెను.భాగవత ధర్మమును ప్రచారము చేసి, భాగవతులకు ఆదర్శమై నిలిచిన ఏకనాధస్వామి సదా స్మరణీయుడు, సర్వ సంపూజ్యుడు. దత్తాత్రేయులవారి ఆజ్ఞతో రచించిన ఏకనాధ రామాయణము, ఏకనాధ భాగవతములను... దత్తుని ఐదవ అవతారధారి శ్రీ షిర్డీసాయిబాబా సమక్షమున భక్తులు ఆ గ్రంధములను బాబావారి చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనేవారు. ఆ పవిత్ర గ్రంధములను బాబాగారి సమక్షములో పారాయణ చేసేవారు.  సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.

0 comments: