Wednesday, December 28, 2016 By: visalakshi

భక్త కనకదాస్ - part 1


ఎవరూ లేని, చూడని చోట ఈ ఫలమారగించి రావాలి అని శిష్యులను పిలిచి పండ్లు పంచిపెట్టారు వ్యాసరాయలవారు. శిష్యులందరు తమకు నచ్చిన ప్రదేశములకు వెళ్ళి ఎవ్వరు లేని చోట గురువుగారిచ్చిన పండును భుజించి వస్తారు. ఒక శిష్యుడు మాత్రము ఆ పని పూర్తి చేయలేక తిరిగి తిరిగి ఆ పండును చేతియందుంచుకొని గురుసన్నిధికి చేరుతాడు. "పండు తినకనే వచ్చినావేమి?" అని వ్యాసరాయలు ప్రశ్నించారు.

శిష్యుడు చేతులు జోడించి నమస్కరిస్తూ "గురుదేవా! నేను మహాపాపిని గురుదేవుల ఆజ్ఞ పాలించలేని అసమర్ధుడను. తమరి ఆదేశము మేరకు ఎవ్వరు లేనిచోట, ఎవరికీ తెలియకుండా ఫలమారగించాలని ఎంతగానో ప్రయత్నించాను .నేనెక్కడికి వెళ్ళినా భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. " అని గురువుగారికి శిష్యుడు విన్నవించాడు. 



శిష్యుని విన్నపమునకు గురువుగారైన వ్యాసరాయలవారు సంభ్రమాశ్చర్యములతో పులకాంకితుడయ్యాడు. తన నిర్మల ఆధ్యాత్మిక భావపరంపరలతో గురుదేవులను విస్మయమొందించిన వ్యక్తియే భక్త కనకదాస్. 

విజయనగర సామ్రాజ్యమును శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించు రోజులలో యాదవకులమునకు చెందిన బీరప్ప యనునతడు సేవానాయకుడుగా ఉండేవాడు. అతని భార్య బుచ్చమ్మ. వీరిరువురు తిరుమలేశుని భక్తులై, ఆదర్శ గృహస్థజీవనమును గడిపెడివారు. చిరకాలముగా వారికి సంతానము లేకపోవుటచే వారు వేంకటేశ్వరుని సేవించి, తమకు సంతానము ననుగ్రహింప వలసిందిగా ప్రార్ధిస్తారు. వారి భక్తికి తృప్తి చెంది బాలాజీ వారికొక పుత్రుని ప్రసాదిస్తాడు. భగవత్ప్రసాదితమైన ఆ శిశువుకు తిమ్మప్ప అని నామకరణం చేస్తారు. 

తిమ్మప్పకు చదువు సంధ్యలయందు మనస్సు లగ్నం కాలేదు. విద్య వచ్చే అవకాశము లేనందున తండ్రి తన కుమారుని వ్యాయామము, విలువిద్యలందు నేర్పరిగా తీర్చిదిద్దాడు. తిమ్మప్ప యవన దశలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని దిక్కులేనివాడవుతాడు. తన ఇరవయ్యో ఏట వివాహం చేసుకుంటాడు. కానీ అనతి కాలములోనే భార్యావియోగము ననుభవించవలసి వస్తుంది. 

తిమ్మప్ప జీవితం ప్రశ్నార్ధకంగా మిగిలింది. ఒకనాడు ఆదికేశవ స్వామి స్వప్నంలో దర్శనమిచ్చాడు. తన భక్తుడు కమ్మని ఆజ్ఞాపించాడు. భగవదాజ్ఞను తిమ్మప్ప నిరాకరించాడు. జీవితంలో భోగభాగ్యాలను అనుభవించి విహరించాలనే తిమ్మప్పకు భక్తి జ్ఞానమను   పదములు చిరాకును కలిగించసాగాయి. అనేకసార్లు ఆదికేశవ స్వామి స్వప్న దర్శనమిచ్చి భక్తుడవు కమ్మని హెచ్చరించడము, తిమ్మప్ప నిరాకరించము జరుగుతూ వచ్చింది.     




ఒకసారి శత్రురాజులు తమ దేశము మీదికి దండెత్తిరాగా, తిమ్మప్ప యుద్ధమునకు వెళ్ళవలసి వచ్చింది. తిమ్మప్ప ధైర్యసాహసములతో మెరుపువలె విజృంభించి శత్రుసైన్యమును చెదరగొడతాడు. వెనుకనే ఒక సైనికుడు వచ్చి తిమ్మప్పపై కత్తి విసురుతాడు. వీపులో ఆ కత్తి గుచ్చుకొనగా తిమ్మప్ప మూర్చిల్లుతాడు. కొద్దిసేపటికి స్పృహలోకి వస్తాడు. గాయము తీవ్రబాధను కల్గించుచున్నది. కదలలేక ఉన్నాడు. అంతలో ఆదికేశవస్వామి మరల అక్కడ దర్శనమిచ్చాడు. స్వామి చిరునవ్వు చిందిస్తూ "తిమ్మప్పా! గాయము తీవ్రముగా బాధించుచున్నదా? ఆలోచించు ఇప్పటికీ మించిపోయినది ఏమీ లేదు. నాకు భక్తుడివి కా " అన్నారు. కత్తిపోటుతో విలవిలలాడుతున్న తిమ్మప్ప ఆగ్రహోదగ్రుడై " నన్నెందుకిలా బాధిస్తావు? నేను నీకు భక్తుడను కాలేను. నాకు భక్తి నచ్చదు. ముక్తి గిట్టదు. నిన్ను దర్శించాలని నీ కొరకు పరితపించే  ఎందరో భక్తులు ఈ ప్రపంచములో ఉండగా, నన్నే ఎందుకిలా వెంబడిస్తావు?" అన్నాడు. 

"తిమ్మప్పా! నీవు గతంలో నా భక్తుడవు. చిత్తశుద్ధితో నాకు సేవచేసి నన్ను స్మరించిన భాగవతోత్తముడవు. కర్మవశాత్తు ఇంతవరకు నీవు నన్ను ఆశ్రయించలేకపోయితివి. నీవు నన్ను సేవించు శుభఘడియ సమీపిస్తున్నది. నిర్మల మనస్కుడవై నన్ను సేవించు. నీ బాధలన్నీ తొలగించి నీకు ముక్తిని ప్రసాదిస్తాను" అని ఆదికేశవస్వామి తన దివ్య సందేశాన్ని అందిస్తారు. తిమ్మప్ప తదేకంగా స్వామిపై దృష్టిని సారించి "నీవు నన్ను బంధ విముక్తుణ్ణి చేయుమాట వాస్తమైనచో ప్రస్తుతము నన్ను హింసించుచున్న శారీరక బాధనుండి విముక్తి చేయండి. అలా జరిగితే నిన్ను నేను విశ్వసించి నీకు భక్తుడను కాగలను." అని చెప్పగా దీనదయాళుడు, భక్తవత్సలుడైన ఆదికేశవస్వామి తన దివ్య హస్తస్పర్శతో తిమ్మప్పను శరీరక బాధనుండి  విముక్తుణ్ణి చేస్తారు. భగవానుని దివ్య కరముల స్పర్శతో తిమ్మప్పలో నిద్రాణమైయున్న ఆధ్యాత్మిక చైతన్యము ప్రభావితమై, భక్తి పారవశ్యము పొడసూపుతుంది. ఆదికేశవస్వామి నవ్వుతూ అదృశ్యమవుతారు. తిమ్మప్పలో తీవ్ర పరిణామము కదిలింది. ఒక్క క్షణము కూడా భగవానుని చూడకుండా, స్మరించకుండా  ఉండలేకపోతున్నాడు. నేత్రములనుండి అశ్రుధారలు ప్రవహించుచుండ పరుగు పరుగున ఆదికేశవస్వామి ఆలయానికి చేరుతాడు. దేవాలయ ద్వారము మూసియుంటుంది. స్వామి వియోగాన్ని భరించలేక తన హృదయము నుండి  పొంగి వచ్చే విషాదానికి పదములు జోడించి    సుశ్రావ్యంగా కీర్తన గానం చేయసాగాడు. స్వామి వియోగాన్ని భరించలేని తిమ్మప్ప పసిబిడ్డవలె విలపిస్తూ తన శిరస్సుతో గుడి తలుపులను బాదుతాడు. శిరస్సునుండి రక్తము ప్రవహించుచున్నను తల బాదుకొనుట ఆపడు. ఆతని భక్తికి మెచ్చి ఆదికేశవస్వామి తిమ్మప్పను అనుగ్రహిస్తాడు. భగవానుని దివ్యమయ దర్శనముతో పులకాంకితుడై తిమ్మప్ప కరద్వయమును జోడించి నమస్కరిస్తూ తనలో పొరలి వచ్చుచున్న భక్తిభావాలను శ్రావ్యముగా కీర్తనద్వారా తెలియచేస్తాడు.   వాసుదేవా! నీ దివ్య నామస్మరణ చేయుటకై నాకు అనేక జన్మలు ప్రసాదించు. అని నిర్మల చిత్తముతో స్వామిని ప్రార్ధిస్తాడు. కేశవ భక్తుడైన తిమ్మప్ప బంగారు బుద్ధి కలిగి కనకదాసుగా మారిపోయాడు. 





కనకదాసుకు బాహ్య విషయాలపై అనురక్తి లేదు. నిద్రాహారాలు మాని భగవంతుని దివ్యసందర్శనాభిలాషియై కనకదాసు విలపించసాగాడు. ఒకనాడు కనకదాసుకు స్వప్నములో కేశవస్వామి దర్శనమిచ్చి హంపి నగరవాసి అయిన వ్యాసరాయ గురుదేవుల నాశ్రయించి మంత్రదీక్షను పొందవలసినదిగా తెలియజేస్తారు. కనకదాసు హంపి చేరి వ్యాసరాయలవారిని దర్శించి, తనను శిష్యుడుగా స్వీకరించి మంత్రదీక్షనొసగమని ప్రార్ధిస్తాడు. యాదవ కులజుడైన కనకదాసుకు మంత్రదీక్షనొసగుట వ్యాసరాయలకు ఇష్టం లేదు. ప్రార్ధనాపూర్వకముగా కనకదాసు పదే పదే ప్రాధేయపడసాగాడు. వ్యాసరాయలవారు విసుగుతో కోపోద్రికుడై "దున్నపోతు నామము జపించు.నీకు ఆ మంత్రము  బాగా సరిపోతుంది." అని చెబుతారు.  గురువు నుండి ఆ మాట రాగానే కనకదాసు విశ్వాసపూరిత హృదయముతో దూరంగా వెళ్ళి ఒక నిర్జన ప్రదేశములో "దున్నపోతు" నామమును ఉచ్చరించసాగాడు. తపస్సు తీవ్రరూపం దాల్చింది. భక్తి విశ్వాసములు చరమస్థాయి నందుకున్నాయి. తన వాహనమైన దున్నపోతుపై కఠోరసాధన సాగిస్తున్నందుకు యమధర్మరాజు సంతృప్తి చెంది దున్నపోతు రూపంలో కనకదాసుకు ప్రత్యక్షమవుతాడు. కనకదాసు శిరసు వంచి నమస్కరిస్తాడు . తనవలన ఏమి సహాయము కావాలో తెలియజేయుమని దున్నపోతు రూపంలో ఉన్న యమధర్మరాజు అడుగుతాడు. తనకేమీ అవసరం లేదనియు, తన గురుదేవుల అవసరమును తీర్చవలెనని ప్రార్ధించి..దున్నపోతును వెంటబెట్టుకొని వ్యాసరాయల వద్దకు కనకదాసు వస్తాడు. 

 తదుపరి భాగం  మరో టపాలో..... 


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

  

1 comments:

sri said...

very interesting,please upload next part.