Tuesday, December 6, 2016 By: visalakshi

శ్రీగురుడు -దత్తాత్రేయస్వామి..

 బ్రహ్మ మానసపుత్రులు సప్తఋషులు. వారిలో అత్రిమహాముని ఒకరు. అనసూయ కర్దమ ప్రజాపతి, దేవహూతుల పుత్రి. అత్రిమహాముని అనసూయను చేబట్టి గృహస్థధర్మములు నెరవేర్చుతూ తపస్సు చేసిరి. అనసూయ మహా పతివ్రత. ఆమెను వేదములు ప్రశంసించినవి. ఆమెను జగదంబగా అభివర్ణించవచ్చు. ఆ సాధ్వి నిత్యమును పతిసేవాపరాయణ. ఆమె మహిమ తెలిసిన ఇంద్రాది దేవతలు స్వర్గసంపదను హరించునేమోయని తలచి భయపడిరి. అంతట వారు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను శరణు వేడుకొనుచు ఆ సాధ్వి ఖ్యాతిని నివేదించిరి.  ఇంద్రుని మాటలు విని ఆమెను త్రిమూర్తులు పరీక్షింప వచ్చిరి. అనుష్ఠానమునకు నదీతీరమునకు వెళ్ళిన ముని రాకకు ముందే త్రినాధులు అతిధుల రూపంలో భోజనము పెట్టుమని అనసూయను కోరిరి. ఆ సాధ్వి వడ్డన చేయబోగా వివస్త్రవై వడ్డన చేయవలెనని వారనిరి. ఆమె తపోబలమున త్రిమూర్తులను పసిబిడ్డలను జేసి పాలిచ్చినది. ఎన్నో యజ్ఞములు చేసినను తృప్తి చెందనట్టి ఆ త్రినాధులు అనసూయమాత స్తన్యముగ్రోలి తృప్తిచెందిరి.అనసూయాసతితో సమానమైన సాధ్విలేదు. భువనత్రయము నందును ఆమె త్రిమూర్తులకు మాతగా ప్రసిద్ధి గాంచెను. ఇంతలో అరుదెంచిన అత్రిమహర్షి దివ్యదృష్టితో సర్వము తెలిసికొనెను. 





అత్రి అనసూయా దంపతులకు త్రిమూర్తి స్వరూపుడై అవతరించినవారు శ్రీ దత్తాత్రేయస్వామి. త్రిమూర్తులు వరమిచ్చుటచే ఆ బిడ్డల రూపంలో బ్రహ్మ చంద్రుడుగను, విష్ణువు దత్తాత్రేయుడుగను, మహేశ్వరుడు దుర్వాసుడుగను ప్రసిద్ధులయిరి. ప్రజ్ఞావంతులైన చంద్ర దుర్వాసులు మాత అనసూయా సాధ్విని సెలవీయ గోరిరి. దుర్వాసుడు తల్లి అనుమతితో తపస్సుకై తీర్ధయాత్రలకు వెడలెను. చంద్రుడు మాతనుజ్ఞతో చంద్రమండలము చేరెను.  త్రిగుణాత్మకు డయిన శ్రీదత్తుడనసూయా గృహమున నిలిచెను.. ఈ విధముగా స్వాయభువమన్వంతరములో మార్గశిర శుద్ధ పౌర్ణమి బుధవారము ప్రదోష సమయమున శ్రీ దత్తులు అవతరించిరి. దత్తుని అవతారము గురురూపము. వీరు కుమారస్వామికి; ప్రహ్లాదునకు; యదువునకు; సాంకృతమునికి; కార్తవీర్యునకును జ్ఞానముపదేశించిన మహర్షులు. అవధూత మార్గము ఈ స్వామి వలన ఏర్పడినదే. చారిత్రకముగా సిద్ధనాగార్జునుడు, ఆదిశంకరుడు, జ్ఞానేశ్వరుడు, ఏకనాధుడును దత్తోపాసకులే. దత్తుడు స్మరణ మాత్రముననే సంతుష్ఠుడగును. 




పీఠికాపురమందు క్రీ"శ" 1320 ప్రాంతమున శ్రీదత్త భక్తులయి ఆపస్తంబశాఖీయులగు అప్పలరాజు సుమతి అను దంపతులకు భాద్రపద శుద్ధ చతుర్ధినాడు శ్రీదత్తులు శ్రీపాద శ్రీవల్లభులయి అవతరించిరి. బాల్యమందే వీరు విశేషమహిమ చూపి 16 సం"ల ప్రాయమున విరాగియై భక్తులను ఉద్ధరించుటకు జ్ఞానము నుపదేశించుచు దేశాటనకు బయలుదేరిరి. ఆ సమయమున పుత్రునిపై వ్యామోహము విడువజాలని తల్లిదండ్రులకు తమ దత్తాత్రేయ దివ్యరూపమును దర్శింపజేసిరి. నాటినుండి పిఠాపురమునందు భక్తులు స్వామిని సేవించి తరించుచుండిరి. ఇది శ్రీ దత్తాత్రేయుల ద్వితీయావతారము. 




అంబయను భక్తురాలికి మహారాష్ట్ర దేశమునందు కరంజయా అను గ్రామము నందు శ్రీగురువు తృతీయావతారమై వెలిసారు. ఈ అవతారమందు శ్రీగురువు శ్రీ  నృసిం హ సరస్వతిగా ప్రసిద్ధిచెంది ఎందరో దీనులను ఉద్ధరించిరి. భక్తులకు అనేక లీలలు చూపిరి. శిష్యులకు అవతారమునకు ధ్యేయమైన జ్ఞానప్రబోధము చేసి యున్నారు. కృష్ణపంచ గంగా సంగమమందలి నరసోబావాడియందు వీరు కొంతకాలము నివసించి అచట నిర్గుణపాదుకలను స్థాపించిరి. కృష్ణానదీతీరమందు సాంగ్లీజిల్లాలో ఔదుంబర క్షేత్రమున, భీమా అమరజాసంగమ స్థానమందున్న గాణుగాపురము లేక గంధర్వనగరమందును వీరు కొంతకాలముండి మనోహర పాదుకలను స్థాపించిరి. తరువాత శ్రీశైలమందలి కదళీవనమున పుష్పాసనముపై ఆసీనులయి అంతర్ధానమయిరి. శ్రీ నృసిం హ  సరస్వతులు నేటికిని తమ భక్తులకు దర్శనమిచ్చుచునేయున్నారు. పిఠాపురము, కరంజియా, కురుపురము, నరసోబావాడి, గాణుగాపురము, ఔదంబరమును ప్రసిద్ధ దత్త క్షేత్రములు. వీటిలో పిఠాపురము మూలక్షేత్రము. శ్రీ కుక్కుటేశ్వర దేవాలయమందు నైఋతిమూలగా శ్రీదత్తులు శిలావిగ్రహమున వెలసియున్నారు.  

  అక్కల్ కోట మహరాజ్  ,మాణిక్ ప్రభు అవతారాలను శ్రీగురువు  నాలుగవ అవతారంగా తెలుపబడింది. గుల్బర్గానుండి 45మైళ్ళదూరాన కలదు. శ్రీఅక్కల్ కోట మహారాజు తపస్సు చేసి సిద్ధి పొందిన పెద్ద జాగృతి స్థానము. ఈయన అపరదత్తావతారమని భక్తులు కొలుస్తారు.  మాణిక్యనగర్ గుల్బర్గానుండి 40కి.మీ హుమ్నాబాద్ దగ్గర కలదు. శ్రీమాణిక్య ప్రభువులవారి సమాధి క్షేత్రం. 




  ఐదవ అవతారంగా పరబ్రహ్మస్వరూపుడైన భగవాన్ షిర్డీ సాయిబాబాగా దత్తుని పంచమావతారము .అపరదత్తావతారముగా హిందువులచే, మహమ్మదీయులచే అన్ని మతముల వారు కొలవబడుచున్న స్వామి దివ్యక్షేత్రము. తన్నాశ్రయించిన వారందరినీ కాపాడుచున్న సాయి యొక్క బహు గొప్పదైన జాగృతి స్థానము.  త్రిమూర్తులే గురురూపముగ అవతరించి, మానవులకు గురుకృపలేక జీవితము పరిపూర్ణము గాదని, గురు అనుగ్రహమువలననే జీవుడు ఇహపరములను సాధించగలడని పరమానందప్రాప్తిని పొందగలడని దత్తావతారముల ద్వారా శ్రీ గురుడు మనకు అవగతం చేసి కృతార్ధులను చేశాడు.

 యోగమే ఆనందంగా విలసిల్లుచు, యోగమాయను ధరించి యోగిరాజులకు అధిరాజయిన దత్తాత్రేయునకు మంగళము.   


 జై గురుదేవ దత్త 





4 comments:

Bharati said...

భగవంతుని అవతారములకు పలు కారణాలు, పలు కధనాలు. ఈ కధనం, వివరణ బాగున్నాయి. చక్కటి టపా.

Anonymous said...

జయ గురు దత్త. మరి వారు ఇప్పుడు ఎక్కడ వున్నారో తెలుసా?
శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిగా మైసూరు అవధూత దత్త పీఠము స్థాపించి ధర్మోద్ధారనకై , భక్తుల వద్దకు తామే పట్టు విడువక తిరుగుతు వున్నారు.
నన్ను నమ్మండి. ఎన్నో మహిమలు, నిజముగా ప్రత్యక్షంగా చూసిన తర్వాతే చెబుతున్నాను.

visalakshi said...

నమ్మకమే విశ్వాసము. మీరు దత్తుణ్ణి గణపతి సచ్చిదానంద స్వామీజీలో చూస్తున్నారు. వారిని గురువుగా భగవంతుడిగా సేవించి తరించగలరు. అవధూత దత్త పీఠాధిపతికి నా ప్రణామములు..

రుక్మిణిదేవి said...

Jai Guru datta.... Chakkagaa vivarinchaaru...