Thursday, November 10, 2016 0 comments By: visalakshi

సీతాన్వేషణ - చివరిభాగం

జాంబవంతుడు ప్రేరేపించగా మహాబలశాలి అయిన హనుమంతుడు సీతాదేవిని వెతికి చూడాలన్న కాంక్షతో దేవతలు, చారణులు సంచరించే ఆకాశమార్గంలో ప్రయాణం చేసి లంకాపట్టణాన్ని చేరాలని సంకల్పించాడు.తూర్పు దిక్కుగా తిరిగి తండ్రి అయిన వాయుదేవుని స్మరించి ఆశీస్సులు కోరి దక్షిణ దిక్కుగా వెళ్ళేందుకు హనుమంతుడు శరీరాన్ని మేరుపర్వతమంత పెద్దదిగా పెంచాడు. శత యోజన విస్తీర్ణ సాగరాన్ని దాటి సీతాన్వేషణ చేయడానికి పూనుకున్నాడు. సముద్ర ఉల్లంఘన సమయంలో హనుమకు పర్వత రూపంలో ఉన్న మైనాకుడు సముద్రుడి ఆదేశంపై మానవరూపంలో వచ్చి పర్వతశిఖరంపైన నిలిచి ఆకాశంలో ఉన్న హనుమంతుడితో ..ఎవ్వరికీ సాధ్యంకాని పని చేపట్టావు. వానరోత్తమా కొద్దిసేపు నా శిఖరంపై విశ్రమించు. నీకు సహాయం చేయడం ద్వారా రఘువంశ రాజైన రాముడికి సేవ చేసినట్లవుతుందని నా భావన. నా ఆతిధ్యం స్వీకరించి నన్ను కృతార్ధుణ్ణి చెయ్యి.అన్నాడు.




 హనుమంతుడు ఓ మైనాకుడా! నీ ప్రియమైన మాటలు నాకు సంతోషము కలిగించాయి   చాలు. ఇప్పుడు నేను మీ ఆతిధ్యాన్ని స్వీకరించలేను. ఎక్కడా ఆగకుండా లంకాపట్టణాన్ని చేరుతానని నా స్నేహితుల వద్ద ప్రతిజ్ఞ చేశాను. అందువలన నీ మాట మన్నించలేకపోతున్నాను అని వారిని చేతితో తాకి వారికి ఆనందాన్ని కలిగిస్తూ ముందుకు సాగిపోయాడు. సురస, సింహికల రాక్షస మాయలు అడ్డుగా నిలిచినా ప్రలోభాలకూ, ప్రతిబంధకాలకూ లొంగక హనుమంతుడు కార్యదీక్షాపరుడై లంకాపట్టణం చేరుకున్నాడు.మహాబలశాలి అయిన వానరశ్రేష్ఠుడు నగరంలోనికి ప్రవేశిస్తూ ఉండగా లంకానగరం స్త్రీరూపంలో హనుమంతుని అడ్డుకుంది. హనుమంతుడి ధాటికి భయపడింది. దీనస్వరంతో ఓ మహానుభావా! నేనే సాక్షాత్తూ లంకానగరాన్ని. నన్ను నీ పరాక్రమంతోజయించావు.ఇక బ్రహ్మవాక్కు నిజమవబోతోంది.  దురాత్ముడైన రావణుడు సీతను అపహరించి తెచ్చాడు. దాంతో అతడికి, మిగిలిన రాక్షసులందరికీ వినాశకాలం దాపురించింది.వానరశ్రేష్ఠుడా! నీవు ఈ లంకాపట్టణానికి  ఏయే పనులు చక్కపెట్టటానికి వచ్చావో, ఆ పనులన్నీ పూర్తి చేసుకో! ఈ పట్టణమంతా స్వేచ్చగా సంచరించు. మహా పతివ్రత అయిన సీతను అన్వేషించు. అంది.

 హనుమంతుడు రావణుని అంత:పురంలోకి రహస్యంగా ప్రవేశించి,  రావణుని మందిరాలలో సీతకై వెదుకుతున్నాడు. రాక్షస ప్రముఖుల ఇళ్ళన్నీ గాలించాడు. వారి ఐశ్వర్య సమృద్ధిని చూసి హనుమ ఆశ్చర్యపోయాడు.  రావణుని అంత:పుర భవన సముదాయాలలో పుష్పక విమాన గృహంలో రావణుడు నివసిస్తూ ఉంటాడు. ఆ నివాసంలో కూడా నిద్రించే స్త్రీలను పరిశీలించి సీతమ్మ కానరాక దిగులుచెందాడు. మరల ఒకసారి వెదుకుతుండగా దివ్యమైన పడకగదిలో వీరుడైన రావణుడు నిద్రించుచున్నాడు. అచటికి దూరంగా ఏకాంత శయ్యపైన ఒక సుందరాంగి ఒంటరిగా నిద్రిస్తోంది. అతిరూప సౌందర్యవతి అయిన మండోదరిని చూసి మొదట ఆమెయే సీతాదేవి అనుకున్నాడు. ఆమె సీతాదేవి కాదని తెలుసుకున్నాడు. సీతమ్మ రాముని వియోగముతో కంటిమీద కునుకులేక శోకవనితలా ఉంటుంది. రాముడు తప్ప పరపురుషుని కన్నెత్తి కూడా చూడదు. అలంకారాలు చేసుకోదు కాబట్టి ఈమె సీత కాదు అనుకొని ఆమె మండోదరి అని తెలుసుకొన్నాడు.   తిరిగి అన్వేషణ ప్రారంభించాడు. పానశాలలో వెదికాడు.అయినా సీతాదేవి కనిపించలేదు. సీత మరణించినదేమోనన్న అలోచనతో బాధగా పుష్పకవిమాన గృహం నుండి క్రిందికి దిగి రాముని తలుచుకొని..అనేక విధాలుగా అలోచిస్తూ..సీతాదేవి కనిపించేవరకు వెదుకుతాను అని శపధంచేసుకుంటూ వస్తూండగా ఎదురుగా పెద్దపెద్ద వృక్షాలతో అశోకవనం కనిపిస్తోంది. ఇంకా ఈ వనంలో వెదకలేదు ఇప్పుడు సీతాదేవి కోసం ఆ వనంలో ప్రవేశిస్తాను. పరమపూజ్యురాలు అయిన సీతాదేవి ఇప్పుడు నాకు కనపడు గాక! అని మనస్సులోనే ప్రార్ధన చేసుకున్నాడు.  




 హనుమంతుడు అశోకవనంలోకి ప్రవేశించాడు. ఆ అశోకవనం అనేక ఉపవనాలతో కూడిన వనసమూహం. హనుమంతుడు అక్కడ కొన్ని బంగారు వృక్షాలు చూశాడు. అక్కడొక శింశుపావృక్షం ఉంది. మహాబలశాలియైన హనుమంతుడు ఆ శింశుపావృక్షం చిటారు కొమ్మపైన కూర్చుని సీతాదేవి ఎక్కడైనా కనిపిస్తుందేమోనన్న ఆశతో నాలుగు ప్రక్కలా కలయ చూశాడు. హనుమంతుడు అలా అశోకవనంలో ఒక వృక్షం నుండి, మరోవృక్షంపైకి దూకుతూ, ఒకానొక వృక్షాగ్రం నుండి పరికించి ఒక భవనం చూసాడు .ఆ భవనం కైలాసంలా తెల్లగా మెరిసిపోతోంది. ఆ భవనాన్ని వెయ్యి స్తంభాలపైన కట్టారు. హనుమ ఒక్క గెంతుతో ఆ భవనం పైకి దూకాడు. అక్కడ ఒక యువతిని చూసాడు.  ఆహారం లేనందున ఆమె శరీరం కృశించిపోయి ఉంది. శరీరంపై ఎక్కడా ఏవిధమైన అలంకారాలూ లేక దీనురాలై వున్న ఆ యువతి సీతయే అయిఉండవచ్చని హనుమంతుడు భావిస్తున్నాడు.  రాముడు చెప్పిన అలంకారాలన్నీ అంటే ఆమె చెవులకున్న కుండలాలు,గాజులు,మణులతో పొదిగిన హారాలు అన్నీ రాముదు వర్ణించి చెప్పినట్లే కనబడుతున్నాయి. కాకపోతే కాస్త మాసిపోయి ఉన్నాయి. సందేహం లేదు ఆమె తన ఉత్తరీయంలో మూట కట్టిపడేసిన నగల్ని మేమంతా చూశాం. ఆ నగలు మూట కట్టిన ఉత్తరీయమూ ఇప్పుడు ఈమె ఒంటిపై ఉన్న వస్త్రమూ ఒకేమాదిరిగా ఉన్నాయి. రాముడు చెప్పిన నగల గుర్తులను బట్టి, ఈమె ధరించిన వస్త్రం, నగల ఉత్తరీయం అన్నివిధాలా ఒక్కటిగానే ఉండడం వల్ల ఈమె రాముని సఖి సీతయేనని నా మనస్సు కచ్చితంగా చెబుతోంది.అనుకున్నాడు. 


  ఈమె సీత అని నిర్ధారణ చేసుకున్న హనుమంతుడు ఆనందాశ్రువులతో రాముని స్థుతించి, నమస్కరించాడు. హృదయం అంతా ఆనందం నిండి ఆ చెట్టు ఆకుల మధ్య పొంచి కూర్చున్నాడు. రావణుడు అశోక వనానికి వచ్చి సీతను చూడాలనే కాంక్షతో సీతాదేవి దగ్గరగా వచ్చాడు. హనుమంతుడు ఆ కొమ్మపై కూర్చుని అక్కడినుండి అన్నీ పరిశీలనగా చూస్తున్నాడు. రావణుని చూడగానే సీతాదేవి భయపడింది.రావణుడు సీతను బ్రతిమాలుతూ తన మనోభావాల్ని తెలియజేస్తూ, ప్రలోభపెట్టాలని చూశాడు.సీత తనపై గల మనస్సును భార్యలపైకి మరల్చుకోమనీ, ఐశ్వర్యము, ధనము చూపి నన్ను ప్రలోభపెట్టాలని చూడకు. కాంతి సూర్యుని నుండి ఎలా వేరు కాదో అలాగే నేను రాముడి నుండి వేరు కాను. నీవు జీవించి ఉండాలన్నా, నీ రాజ్యాన్ని నీవు పాలించాలన్నా పురుషశ్రేష్ఠుడైన రాముని శరణు కోరుకో .ఆ మహాత్ముడు నిన్ను క్షమించి విడిచిపెడతాడు. రావణా నేను చెప్పిన హితాన్నిపెడచెవిన పెడితే నీవు మరణించడం తధ్యం! అని నిందించింది.

  రావణుడు సీతమాటలన్నీ అప్రియంగా ఉన్నా విని, కోపం వచ్చినా ఆమె పట్ల మోహం చేత తనకు వశమవ్వడానికి సీతకు రెండు మాసాల గడువు ఇస్తాడు.ఇలాంటి చులకన స్వభావంకల రావణుడు రెండు నెలల గడువు నివ్వడం విని శింశుపావృక్షం వద్దకు పోయి విలపించి, రాముని తలపులతో ప్రాణాలు విడవాలని సీత నిశ్చయించుకుంది. సీత ధర్మాన్ని ఆలోచించి ఆత్మహత్యను పాపకార్యంగా భావించి ఆలోచిస్తుండగా ఆమెకు అనేక శుభశకునాలు కనిపించాయి. హనుమంతుడు సీత పడుతున్న ఆవేదన అంతా స్వయంగా విన్నాడు. త్రిజట స్వప్న వృత్తాంతమంతా అత్యంత ఆసక్తితో ఆలకించాడు. సీతాదేవిని చూడగలిగాడు. రామకార్యం సగం పూర్తి అయింది గదా! అని సంతోషించాడు.సీతకు వినబడే విధంగా రాముణ్ణి మధురాతి మధురంగా కీర్తించాడు. హనుమంతుడి మాటలు వినబడిన దిక్కుగా తలపైకెత్తి చూసింది. అతణ్ణి చూసి కలవరపడింది. ఆశ్చర్యపడింది. వానరుడి రూపం భయంకరంగా ఉండడంతో స్పృహతప్పినట్లయింది. చేష్టలుడిగిన సీతాదేవి వానరుని గురించి ఆలోచించుతుండగా హనుమంతుడు సీతాదేవికి వినయంగా శిరస్సు వంచి రెండుచేతులతో నమస్కరిస్తాడు. నీకు సర్వ శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. జనస్థానం నుండి రావణుడు అపహరించిన సీతాదేవివి కదా! నీ దైన్య స్థితి చూస్తే నీవు రాముని భార్యవని నాకు అనిపిస్తోంది అన్నాడు. సీత హనుమంతునికి తన వృత్తాంతము చెప్పి, నిజానికి నీవు వానరుడవా..లేక మాయా రూపంలో వచ్చిన రావణుడివా అని సందేహపడ్తుంది. ఓ దేవీ! నీవు సందేహపడినట్లుగా నేను రావణుడను కాను. నా మాటలు విశ్వసించు. అని అనేక విషయాలను గుర్తుచేస్తూ నేను రామదూతగా వచ్చాను.ఇదిగో! ఆ ఉంగరాన్ని చూడు.  రామ ముద్రికతో ఉన్న ఈ ఉంగరము  మహాత్ముడైన రాముడు నీకిమ్మన్నాడు. నీకు ఇకపై అన్నీ శుభాలే అన్నాడు. జానకి భర్త పంపిన ఉంగరాన్ని తీసుకొని రాముడిదేనని గుర్తించి, భర్త సందేశాన్ని హనుమ ద్వారా విని సంతోషించింది. హనుమంతుణ్ణి ప్రత్యక్షదైవంగా భావించి ప్రశంసించింది.

   కానీ హనుమతో వెళ్ళడానికి నిరాకరించింది." ఓ హనుమంతుడా! ఈ కార్యం  నెరవేరరడానికి అంటే ఈ చెరనుండి విడిపించడానికి, రామప్రభువు నా దు:ఖం పోగొట్టడానికి నీవే కర్తవు కావాలి. నీ ద్వారానే ఆ మహానుభావుడు నన్నుతీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాడు. నా భర్తతో ఈ మాట మరీ మరీ చెప్పు. " ఓ రామప్రభూ! నేను ఇంకా ఒక్క మాసమే జీవించి ఉంటాను. నేను శపధం చేసి చెప్తున్నాను. పాపాత్ముడైన రావణునిచే అపహరింపబడిన నన్ను రామప్రభువే తీసుకొనిపోవాలి."తరువాత తన చీర కొంగునుండి సుందరమైన దివ్యమైన చూడామణిని తీసి రాముడికి తన ఆనవాలుగా ఇమ్మంది. హనుమంతుడు ఆ చూడామణిని తీసుకొని తన వేలుకి ధరించాడు. సీతమ్మ దర్శనం అయింది; రామకార్యం సిద్ధించింది. అని సంబరంతో సీతాదేవి అనుమతితో చూడామణిని తీసుకొని కిష్కింధకు ప్రయాణమయ్యాడు. కానీ రావణాదులు బంధించడంతో... రామదూతగా వచ్చానని చెప్పినా.. ఆలకించకపోవటంతో తోకకు నిప్పు పెట్టినా.. తనకు ఏమీ కాకపోయినా, అగ్ని ఆవహించి ఉన్నాడు. ఆయనకు ఏదైనా హోమద్రవ్యాన్ని సమర్పించి ఆయన్ని తృప్తి పరుస్తాను అనుకొని రాక్షస భవనాలకు, లంకా పట్టణానికి నిప్పు పెట్టి లంకాదహనం గావించాడు. సీతాదేవి క్షేమంగురించి భయపడి మరల సీతాదేవిని దర్శించాడు. హనుమంతుడు సీతాదేవిని శింశుపావృక్షానికి దగ్గరలో కూర్చొని ఉండడం చూసాడు. మనస్సులోని భయాలు తొలగిపోగా మహదానందపడిపోయాడు. ఆమెకు నమస్కారం చేసి .. నీవు క్షేమంగా ఉండటం చూసి ఆనందంగా బయలుదేరుతున్నాను నీ అనుమతితో అని భయంకరంగా గర్జిస్తున్న సముద్రాన్ని దాటి  ఉత్తరపు దిక్కున ఉన్న ఒడ్డుకు చేరుకునేందుకు హనుమ ఆకాశంపైకి ఎగిరాడు. సముద్రతీరాన హనుమంతుడు ఎప్పుడు వస్తాడా అని చూస్తున్న వానరయోధులకు హనుమంతుని సింహనాదం వినిపించింది. జాంబవంతుదు వానరయోధులారా! హనుమంతుడు విజయలక్ష్మితో తిరిగి వస్తున్నాడు. అని అన్నాడు. హనుమంతుడు వాయువేగంతో సెలయేటి గట్టున దిగాడు. 




 గురువుకు నమస్కరించి, పెద్దలకు,జాంబవంతుడికి నమస్కరించి.. వారందరినీ ఉద్దేశించి "సీతమ్మను చూసాను" అన్నాడు.హనుమంతుడు లంకా విశేషాలను వివరించాడు."లంకాదహన ఘట్టం అంతరార్ధాన్ని పరిశీలిస్తే లంకా పదాన్ని తిరగేస్తే కాలం అవుతుంది. కాలం అంటే నలుపు అని అర్ధం. అది తమో గుణానికి సంకేతం. రాక్షసత్వం తమోమయం. ఆ తమోగుణాన్ని సాధకుడు తన కృషితో దహించివేయాలి."  విభీషణుడు జ్ఞాని.  హనుమ విభీషణుడి మందిరంవైపు వెళ్ళలేదు. సాత్విక గుణసంపన్నులైన మండోదరి, త్రిజటల మందిరాలవైపు చూడలేదు. వారికి ఎటువంటి హానీ కలిగించకుండా ఆయన లంకానగర దహనకాండ కొనసాగించాడు. సాధించిన విజయంతో  తన ఆనందాన్ని కపివీరులతో పంచుకున్నాడు. వారితో కలిసి కిష్కింధ చేరుకొని సీత వృత్తాంతాన్ని రామునికి తెలిపాడు. సీతమ్మ ఇచ్చిన 'చూడామణి 'ని శ్రీరామచంద్రుడికి అందజేసి సంతోషపరిచాడు. పరమాత్మను ఆనందభరితుణ్ణి చేశాడు. ప్రకృతి శక్తుల సమాహారమే జీవాత్మ. జానకీ మాత ప్రకృతి. శ్రీరాముడు పరమాత్మ. జీవాత్మను పరమాత్మతో జతచేయడమే హనుమంతుడి కర్తవ్యం. జీవాత్మ, పరమాత్మల ఆనందాన్ని చూసి బ్రహ్మానందభరితుడయ్యాడు. హనుమంతుడి విజయం లోకకల్యాణకారకమైంది. ఆయన శ్రీరాముడి ఆలింగన భాగ్యాన్ని పొందాడు.


 సర్వం శ్రీ సాయిరామార్పణ మస్తు













Wednesday, November 9, 2016 0 comments By: visalakshi

సీతాన్వేషణ -నాలుగవభాగం

 వర్షాకాలం గడిచిపోయింది. శరదృతువు ప్రారంభమైంది. వర్షాలు తగ్గి నేల గట్టి పడింది. సుగ్రీవుడు శరదృతువు ప్రారంభం కాగానే సీతను వెదకడానికి ఏర్పాట్లు చెయ్యాలి. కానీ అతడి జాడ లేదు. అంత:పురంలో భార్యలతో శృంగారజీవితం సాగిస్తూ తనమాట మర్చిపోయాడు - అనిపించింది రాముడికి.  తమ్ముడిని పిలిచాడు. 

 లక్ష్మణా! సీతాన్వేషణ చేస్తానని మాటయిచ్చి సుగ్రీవుడు తనపని పూర్తికావడంతో నన్ను ఉపేక్షిస్తున్నాడు. మనమిక్కడ దు:ఖంలో పడి కొట్టుకుంటూ క్షణమొక యుగంలా గడుపుతుంటే అతడక్కడ రాజభోగాల్లో మునిగి తేలుతూ మనని మర్చిపోయాడు. సుగ్రీవుడు యిప్పుడు రాజయ్యాడు. నేను రాజ్యం పోగొట్టుకొని ఉన్నాను. ఆ వానరుడు భార్యను చేరి ఆనందిస్తున్నాడు. నేను భార్యావియోగంతో దు:ఖిస్తున్నాను. అతడి దృష్టిలో నేను అనాధుణ్ణి, రాజ్యభ్రష్టుణ్ణి . ఇల్లూ వాకిలీ లేకుండా తిరుగుతున్న వాణ్ణి. రావణుడి చేతిలో అవమానం పొందినవాణ్ణి. అతని సహాయం మీద ఆధారపడిన వాణ్ణి. ఇలా అనుకుని నన్ను చులకన చేసి అవమానిస్తున్నాడు. వెంటనే కిష్కింధకు వెళ్ళు. స్త్రీ సాంగత్యంలో మననీ, మనపట్ల కర్తవ్యాన్నీ మర్చిపోయిన ఆ మూర్ఖుడికి నా మాట చెప్పు.





 'తమ పనులు మిత్రులచేత చేయించుకుని, ఆ మిత్రుల పనికి ఉపయోగపడని వాడిని కృతఘ్నుడంటారు. యుద్ధంలో నేను చేసే ధనుష్టంకారం వినాలనుకుంటున్నావేమో! ఆ పని చెయ్యకు. మన మధ్య ఒప్పందం ఒకటుంది. దానిమీద నిలబడు. వాలిని అనుసరించి వెళ్ళేందుకు ప్రయత్నించకు. నేను సత్యాన్నీ, ధర్మాన్నీ రక్షిస్తానని ప్రతిజ్ఞ చేసాను. ధర్మాన్ని అతిక్రమించినందుకు వాలిని చంపాను. ఇప్పుడు నువ్వు సత్యాన్ని అతిక్రమిస్తే నిన్నే కాదు, నీ బంధువర్గాన్నంతటిని   చంపుతాను. క్షణికమైన సుఖాలలో పడి కొట్టుకుపోకు. శాశ్వతమైన ధర్మాన్ని గమనించు. ఇచ్చిన మాట నిలబెట్టుకో. ' లక్ష్మణా ఈ మాటలు సుగ్రీవుడికి చెప్పు అన్నాడు. 

సీతను వెదకడం నాలుగునెలల తరువాత ప్రారంభిద్దామని రాముడు చెప్తే దానిని సాకుగా తీసుకుని నాలుగు నెలలుగా సుగ్రీవుడు ప్రస్రవణ పర్వతం వైపు కనీసం తొంగి చూడలేదు. అసలు తమ ఉనికినే గుర్తించనట్లు ప్రవర్తించాడు. లక్ష్మణుడికి కోపం వస్తోంది..కానీ కోపం ఇన్నాళ్ళూ అణిచి పెట్టుకున్నాడు. ఇప్పుడు రాముడు ఒక మార్గం చూపించాడు. అంతే! అగ్నిపర్వతం బద్దలైంది. రామా! ఈ సుగ్రీవుడు మంచీ చెడూ తెలియని అవివేకి. ఇటువంటి వాడికి రాజ్యం ఇవ్వకూడదు. వీడు వానరరాజ్యం అనుభవించే హక్కు పోగొట్టుకున్నాడు.నీ అనుగ్రహంతో ఇంత వైభవం పొంది ఉపకారం చెయ్యాలని మర్చిపోయాడు. ఇక ఈ కోపాన్ని అణుచుకోలేను. సుగ్రీవణ్ణి ఇపుడే వధిస్తాను. వాలి పుత్రుడైన అంగదుడు సీతమ్మను వెదుకుతాడు.అంటూ ధనుస్సు అందుకున్నాడు. రాముడు లక్ష్మణుణ్ణి ఇలా అనునయించాడు.

 లక్ష్మణా! మనం సుగ్రీవుడితో స్నేహం చేసాం. ఒకరికొకరు సాయం చేసుకోవాలని ఒప్పందం చేసుకున్నాం. అతడు మంచివాడని నమ్మాం. దనువు కూడా చాలా మంచివాడని చెప్పాడు. సీతాన్వేషణకు ఇతడే మనకు ఆధారం. ఎంత వీరుడైనా కోపాన్ని అణుచుకుంటేనే పురుషశ్రేష్ఠుడౌతాడు. చెప్పిన సమయానికి స్పందించకపోవడం సుగ్రీవుడు చేసిన తప్పు. దానికోసం పరుషంగా మాట్లాడకుడదు. అతడితో మంచిగా మాట్లాడి పని సాధించుకురా. అన్నాడు. కోపం తీవ్రత తగ్గినా కోపం తగ్గలేదు. చక్కటి సుగమమైన కాలిబాట ఉన్నా, దుర్గమమైన దగ్గర దారిలో నడుస్తూ సుగ్రీవుని తలచుకొని కోపంతో చెట్లకొమ్మలు విరిచేస్తున్నాడు.. చేతికందిన బండరాళ్ళను బంతుల్లా విసిరేస్తూ..కిష్కింధకు చేరాడు.

 వానరవీరులు లక్ష్మణుడు దగ్గరకు సమీపిస్తుంటే అతణ్ణి గుర్తించారు. ఆతని రౌద్రరూపం చూసి సుగ్రీవుడి వద్దకు వెళ్ళి లక్ష్మణుడు కోపంతో మండిపడుతూ వస్తున్నాడని చెప్పారు.  సుగ్రీవుడు మద్యం మత్తులో అందమైన స్త్రీలమధ్య ఉన్నాడు. అతడికి వానరుల మాటలు వినబడలేదు. తాను వచ్చినా సుగ్రీవుడినుంచి స్పందన లేకపోవడంతో లక్ష్మణుడికి కోపం మరింత పెరిగింది. ఈలోగా అతడికి అంగదుడు కనిపించాడు. కోపాన్ని అదుపు చేసుకుని శాంతంగా, 'నాయనా! అన్నగారి దు:ఖం చూడలేక లక్ష్మణుడు వచ్చాడు.నీ నగరద్వారం ముందు నిలుచున్నాడు- అని సుగ్రీవునికి చెప్పు.' అన్నాడు. సుగ్రీవుడికి అంగదుడి మాటలూ వినబడలేదు. అంతలో లక్ష్మణుడు రాజప్రసాదం సమీపించాడు.అతణ్ణి ప్రసన్నం చేసుకుందుకు అనేకవేలమంది వానరవీరులు   సింహనాదాలు చేసారు. ఆ కోలాహలానికి సుగ్రీవుడికి కొంత మత్తు వదిలింది. అంగదుడి వెనుక అంత:పురంలోకి చనువుగా రాగలిగిన మంత్రులు ప్లక్షుడూ, ప్రభావుడూ, హనుమంతుడూ వచ్చారు. వారు లక్ష్మణుడు తీవ్రమైన కోపంతో ధనుస్సు ధరించి రాజభవనం ముందు నిల్చున్నాడని చెప్పారు. హనుమంతుడు సుగ్రీవునికి కర్తవ్యం బోధిస్తాడు. ఓ వానరరాజా! నీవు మనస్సులో కూడా రామలక్ష్మణుల ఆజ్ఞలను నిర్లక్ష్యం చేయకూడదు. రాముడి బలం ఏమిటో నువ్వే చూసావు. ఇక అతడి వద్ద ఉన్న దివ్యాస్త్రాల గూర్చి నీవు ఊహించనైనా ఊహించలేవు సుమా !




 సుగ్రీవుని వద్దకు వెళ్ళిన అంగదుడు లక్ష్మణుని వద్దకు వచ్చి సాదరంగా లోనికి రమ్మని ఆహ్వానించాడు. లక్ష్మణుడు అన్నీ దాటుకుంటూ అంత:పురంలోకి ప్రవేశించాడు. ధనిష్ఠంకారానికి సుగ్రీవుడు ఉలిక్కిపడి, ఎదుటపడడానికి భయపడి..తారను పంపాడు. తార లక్ష్మణుని నీ కోపానికి కారణమేమిటని ప్రశ్నించింది. సుగ్రీవుడు ప్రత్యుపకారాన్ని మరచి కాలాయాపన చేస్తున్నాడు. .అనగా..  నాయనా! నీవు ఉత్తముడవు నా మాట నమ్ము. సుగ్రీవుడు కామ కలాపాల్లో మునిగి ఉన్నా మీ విషయంలో ఏమరి లేడు. కార్యసాధనకు అవసరమయ్యే ప్రయత్నాలన్నీ ముమ్మరంగా చేస్తున్నాడు. నీవు పరస్త్రీలు ఉన్నారని బిడియపడుతూ ఇక్కడే నిలబడిపోయావు నీవు సదాచారవంతుడవు.  కానీ మిత్రుల భార్యలను చూడటంలో కానీ, మాట్లాడడంలో గానీ దోషం ఏమీ లేదు. అందువల్ల లోపలికి రా! సుగ్రీవుణ్ణి చూడు. అతడితో మాట్లాడు. కోపంతో ఎరుపెక్కి ఉన్న కళ్ళతో లక్ష్మణుడు ...లోపలికి ప్రవేశించాడు. బంగారు ఆసనంపై కూర్చొని ఉన్న సుగ్రీవుడు విశాలనేత్రుడైన లక్ష్మణుని చూశాడు.  ఎదురు వచ్చి చేతులు జోడించి నిలబడ్డాడు. అతడి వెనుక రుమ ఇతర స్త్రీలు నిలబడ్డారు. అతడి వేషాన్ని చూడగానే అంతవరకు అణుచుకున్న కోపం తన్నుకొచ్చింది లక్ష్మణుడికి. 

 సుగ్రీవా! ఉపకారం చేసిన మిత్రులకు సహాయం చేస్తానని మాట యిచ్చి,ఆ మాట నిలబెట్టుకోని రాజుకంటే క్రూరుడు యీ లోకలో ఉండడు.ముఖం చాటేసేవాడిని కృతఘ్నుడంటారు. ప్రత్యుపకారం చేస్తానని రాముడి ముందు ప్రతిజ్ఞ చేసావు. కానీ ఏమీ చెయ్యలేదు..వాలి మార్గంలో వెళ్ళాలని ప్రయత్నించకు. రాముని గుర్తు తెచ్చుకో ఉత్తరక్షణంలో వాలిని చేరుకుంటావు అన్నాడు. పిడుగుల్లాంటి ఆ మాటలకు సుగ్రీవుని నోట మాట లేదు. తార కలగజేసుకొని, కొండగుహల్లో గడిపినవాడికి గొప్ప సుఖం దొరకడంతో కాలగమనం మర్చిపోయాడు. సుగ్రీవుడు రాముడికి ప్రత్యుపకారం చెయ్యాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. సుగ్రీవుడికోసం నిన్ను ప్రార్ధిస్తున్నాను.వేడుకుంటున్నాను.కోపంవదిలిపెట్టు.అంది.  సుగ్రీవుడు కుడా చేతులు జోడించి వినయపూర్వకంగా రాముడి అనుగ్రహంతో రాజ్య లభించింది. ఇంతటి ఉపకారానికి ఎంత చేసినా ప్రత్యుపకారం అవదు. రాముడు సీతను తన బలపరాక్రమాల చేతనే పొందగలడు. నేను చేసే సహాయం కేవలం నామమాత్రమే. నా వలన ఏదైనా పొరపాటు జరిగితే నన్ను మన్నించాలి.అన్నాడు.  సుగ్రీవుడి మాటలు విన్న లక్ష్మణుడికి కోపం పూర్తిగా పోయింది. ప్రేమగా నువ్వు సహాయంగా ఉంటే రాముడికి అంతా మేలే జరుగుతుంది. నీ ప్రభావం గొప్పది. నువ్వు వెంటనే బయల్దేరు. దు:ఖిస్తున్న నీ మిత్రుణ్ణి ఓదార్చు. నాలుగు నెలలుగా రాముడు అనుభవిస్తున్న దు:ఖాన్ని చూసి తట్టుకోలేక ఇంతకు ముందు పరుషంగా మాట్లాడాను. 'క్షమస్వ సఖే మమ ' నన్ను క్షమించు. ఇదీ లక్ష్మణుడి ఔదార్యం. సుగ్రీవుడూ, లక్ష్మణుడూ రాముడున్న గుహకు వచ్చారు. వారివెంట కోట్లమంది వానరులు వచ్చారు. సుగ్రీవుడు రాముణ్ణి చుడగానే చేతులు జోడించి నమస్కరించాడు. సమీపించి సాష్టాంగ నమస్కారం చేసాడు. రాముడు వానరరాజును లేవనెత్తి ప్రేమగా కౌగలించుకుని తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు.అతడి పట్ల చూపవలసిన గౌరవమంతా చూపించి, మెత్తగా హితబోధ చేసాడు.రాజు మిత్రులను సంపాదించాలి. శత్రువులను ఎదుర్కోవాలి. ఇప్పుడు శత్రువుని ఎదుర్కొనే సమయం వచ్చింది. సీతజాడ ఎలా తెలుసుకోవాలో నీ మంత్రులతో ఆలోచించి తగిన ఏర్పాట్లు చెయ్యి అన్నాడు.



 సుగ్రీవుడు ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా ఎవరేం చెయ్యాలో చెప్పాడు. వినతుడనే వానరరాజుని లక్షమంది వానరవీరులతో తూర్పు దిక్కున వెదకమన్నాడు. అంగదుడి నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు, నీలుడు, గజుడు, గవయుడు,గవాక్షుడు, మైందద్వివిదులు మొదలైన మహావీరులతో ఒక గొప్ప సైన్యాన్ని దక్షిణదిశలో వెదకమన్నాడు. శతబలి అనే వీరుడి నాయకత్వంలో గొప్ప సైన్యాన్ని ఉత్తర దిశకు పంపాడు. వారు ఒక్కొక్కరూ వెదకవలసిన ప్రదేశాలు వివరంగా చెప్పాడు. వెదకడం పూర్తి చేసి వెనక్కి రావడానికి అందరికీ ఒక్క నెల గడువు ఇచ్చాడు. గడువు దాటి వచ్చేవారికి దండన మరణశిక్షే అని హెచ్చరించాడు.అందరికీ అన్నీ చెప్పి హనుమంతుని పిలిచాడు. 

 "హనుమా! నీకు భూమిమీద గానీ, ఆకాశంలో గానీ, నీటిలో గానీ కోరినట్లు సంచరించే శక్తి ఉంది. నీ తండ్రి వాయుదేవుడితో సమానమైన వేగముంది. తెలివిలోనూ, బలంలోనూ నీకు నువ్వే సాటి. సీతాన్వేషణలో నీదే కీలకమైన బాధ్యత "అన్నాడు. సుగ్రీవుడు హనుమంతుడితో చెప్పన మాటలు రాముడు విన్నాడు. అతడే సీతజాడ తెలుసుకోగలడనుకున్నాడు. వెంటనే తన పేరు చెక్కిన ఉంగరాన్ని హనుమంతుడికిచ్చాడు. 'ఈ ఉంగరాన్ని సీతకిస్తే ఆమె దీనిని గుర్తు పడుతుంది. నిన్ను నేనే పంపానని నమ్ముతుంది. భయపడకుండా నీతో మాట్లాడుతుంది.' అన్నాడు హనుమంతుడు ఆ ఉంగరాన్ని భక్తిగా శిరస్సుమీద ఉంచుకుని, తరువాత జాగ్రత్తగా దాచి రాముడికి పాదాభివందనం చేసాడు. అందరూ రాజాజ్ఞప్రకారం వెదకడానికి బయలుదేరారు. నెల గడిచేలోగా తూర్పు, పడమర, ఉత్తర దిశలకు వెళ్ళినవారు వెనక్కి వచ్చి సీతజాడ తెలియలేదన్నారు. నెలగడచిపోయాక దక్షిణదిశకు వెళ్ళినవారు వచ్చి సీతజాడ హనుమంతుడు కనుగొన్నాడన్నారు. ఎలా కనుగొన్నాడన్నది చివరిభాగంలో......

 సర్వం శ్రీసాయిరామార్పణ మస్తు














Tuesday, November 8, 2016 0 comments By: visalakshi

సీతాన్వేషణ - మూడవభాగం

 రామలక్ష్మణులు మతంగాశ్రమం నుంచి బయల్దేరి, పంపాసరస్సును చుట్టి అవతలి వైపుకు వెడుతున్నారు. ఆ సరోవరం తీరం వసంతశోభతో కలకలలాడుతోంది. సరోవరంలో పద్మాలూ, కలువలూ పుష్కలంగా ఉన్నాయి. నీటిలో అనేకరకాల చేపలు మిలమిలలాడుతూ  కదుల్తున్నాయి. పక్షులూ, జంతువులూ ఉత్సాహంతో జతలు కడుతున్నాయి. 

ఆ రమణీయమైన ప్రకృతిని చూస్తూ రాముడు విషాదానికి లోనయ్యాడు. రాముడికి తామరపూవులను చూస్తే సీతమ్మ ముఖం జ్ఞాపకం వచ్చింది. కలువపూవులను చూస్తే సీతమ్మ కళ్ళు గుర్తుకొచ్చాయి. కదిలే చేపలను చూస్తే ఆమె చూపులు గుర్తుకొచ్చాయి...పురివిప్పి ఆడుతున్న మగనెమలిని చూసి రాముడికి మరింత దు:ఖం వచ్చింది. 'అవునులే దాని భార్యను రాక్షసుడు ఎత్తుకుపోలేదు. అది ఆనందంగానే ఉంటుంది.' అన్నాడు. క్రమంగా విరహవేదన ఆయన బుద్ధిని కప్పివేసింది. 




 లక్ష్మణుడు రాముణ్ణి ఓదార్చి కర్తవ్యం జ్ఞాపకం చేసాడు." రామా! ఎంత ప్రేమించిన వారినైనా వియోగం ఏర్పడినప్పుడు నిరంతరం అదే పనిగా జ్ఞాపకం చేసుకోవడం మంచిది కాదు. అతిస్నేహం అతిదు:ఖానికి దారితీస్తుంది. ఆలోచన క్రమంగా ఉండదు. ఆత్మవిశ్వాసం  తగ్గుతుంది. ఉత్సాహమే  బలం.
ఆత్మవిశ్వాసమున్నఉత్సాహవంతుడు సాధించలేనిదిలేదు. ఓటమిఉండదు.
ఉత్సాహంతో సీతమ్మను తెచ్చుకునేందుకు ప్రయత్నిద్దాం.రావణుడు పాతాళంలో ఉన్నా, ఇంకే లోకాలలో ఉన్నా వాడు చేసిన పనికి మరణించక తప్పదు. వాడు నీకు సీతనైనా అప్పగించాలి. ప్రాణాన్నైనా అప్పగించాలి. మనస్సును కుదుట పర్చుకో. ధైర్యాన్ని అవలంభించు. కామప్రకోపం కలిగించే ఊహల్ని పక్కకు నెట్టు. నువ్వెంత మహాత్ముడివో జ్ఞాపకం చేసుకో. 

 రాముడు శోకమోహాలు వదిలిపెట్టాడు. వారు ముందుకు సాగారు. ఋశ్యమూక పర్వతాన్ని సమీపిస్తుంటే సంన్యాసి వేషంలో ఉన్న హనుమంతుడు వారికి ఎదురయ్యాడు. వారు సుగ్రీవుడికై వెదుకుచుండగా..వారెవరో తెలుసుకోమని సుగ్రీవుడు తనమంత్రిని పంపాడు. వెదకబోయిన తీగ కాలికి తగిలింది. హనుమంతుడు నెమ్మదిగా రామలక్ష్మణుల వద్దకు వెళ్ళి వినయంగా వాళ్ళకు నమస్కరించి మృదుమధురంగా..మహాత్ముల్లారా ! మీరు చూట్టానికి దేవతల్లా ఉన్నారు. మీ ముఖవర్చస్సు చూస్తే రాజర్షుల్లా కనిపిస్తున్నారు. మునుల వేషంలో ఉన్నారు. ధనుస్సు,బాణాలు,ఖడ్గము ధరించారు.మీరు ఎవరు? అని పలువిధాల వారిని శ్రేష్ఠులుగా అభివర్ణిస్తూ..ఓ నరశ్రేష్ఠులారా ! నేను ఇంతసేపు మాట్లాడినా మీరు బదులు చెప్పరేమి? సరే. నేనే విషయానికొస్తాను.. ధర్మాత్ముడు, వీరుడు అయిన సుగ్రీవుడు అనే వానరరాజు ఉన్నాడు. అతడు తన అన్నగారైన వాలిచేత అవమానింపబడి దేశం నుండి వెళ్ళగొట్టబడ్డాడు. అతడు ఈ పర్వతంపై తల దాచుకుంటున్నాడు. నేనుకూడా వానరాన్నే . నా పేరు 'హనుమంతుడు ' సుగ్రీవుడు పంపగా వచ్చాను. రాముడు మహదానందం పొందుతూ లక్ష్మణా! చూసావా మనం ఏ వానరరాజైన సుగ్రీవుణ్ణి వెతుక్కుంటూ వచ్చామో, అదే సుగ్రీవుడి మంత్రి అయిన ఈ హనుమంతుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఈ వానరుడు మంచి మాటకారి. స్నేహపాత్రుడు. శత్రుసంహారం చేయగల శక్తీ, నేర్పు రెండూ ఉన్నాయి.అటువంటి ఈ హనుమంతునితో స్నేహంగానూ, మధురంగానూ మాట్లాడు. అన్ని వేదాలూ చదివిన వేదవిదుడిలా కనిపిస్తున్నాడు.ఈతని పలుకు వ్యాకరణబద్ధంగా ఉంది. 




 రాముని మాటలు విన్న లక్ష్మణుడు.. హనుమంతునితో ఓ బుద్ధిమంతుడా మేము రామలక్ష్మణులం..మహాత్ముడైన సుగ్రీవుని గుణాలను గూర్చి మేము ఎరుగుదుము. మేము సుగ్రీవుని మైత్రికై వచ్చాం. సత్పురుషులలో శ్రేష్ఠుడవైన ఓ హనుమంతుడా! మేము సుగ్రీవుడు కోరినట్లు అతడితో స్నేహం చేయడానికి వచ్చాం.

 రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. ఒకరి కధ ఒకరికి చెప్పుకున్నారు. రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేసాడు. సీతమ్మ ఎక్కడున్నా వెదికించి ఆమెను తిరిగి పొందడానికి సహాయం చేస్తానని సుగ్రీవుడు ప్రతిజ్ఞ చేసాడు. రాక్షసుడొకడు ఒక స్త్రీని బలవంతంగా పట్టుకుని ఆకాశమార్గంలో దక్షిణదిశకు తీసుకువెడుతుంటే తాము చూసామని సుగ్రీవుడు చెప్పాడు. ఆమె రామా! రామా! లక్ష్మణా! లక్ష్మణా! అని ఏడ్చిందన్నాడు. ఆమె కూడా తమను చూసి, కొన్ని నగలు పట్టుబట్టలో కట్టి తామున్న చోటుకి విసిరిందనీ, ఆ మూట అలాగే భద్రపరిచామనీ చెప్పాడు. ఆ మూట తీసుకువచ్చి రాముడికిచ్చాడు. 




ఆ పట్టుబట్టను గుర్తించిన రాముడి కళ్ళు జలపాతాలైపోయాయి. చూపు మసకబారింది. లక్ష్మణుణ్ణి ఆ ఆభరణాలు చూడమన్నాడు. లక్ష్మణుడు చెప్పిన సమాధానం:...

'నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే,
 నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్.


సోదరా! ఆమె భుజాలకు ధరించే అలంకారాలు గాని, చెవులకు ధరించే కుండలాలుగాని నేనెపుడూ చూడలేదు. ఎందుకంటే తలెత్తి నేనెపుడూ సీతమ్మను చూడలేదు. నిత్యం ఆమె పాదాలకు నమస్కరించడం వలన ఆమె పాదాలకుండే నూపురాలను మాత్రం గుర్తించగలను అన్నాడు. ఆ భావాన్ని భక్తిభావమనవచ్చు .  

 వాలి సుగ్రీవుల వైరానికి గల కారణాలు తెలుసుకున్న రాముడు ఇచ్చిన మాట ప్రకారం వాలిని వధించాడు. సుగ్రీవుడు వానర సామ్రాజ్యానికి ప్రభువయ్యాడు.రాజ్యాభిషిక్తుడైన సుగ్రీవుడు రాముని అనుమతి పొంది కిష్కింధా నగరానికి వెళ్ళాడు. తరువాత రామలక్ష్మణులు ప్రస్రవణ పర్వతంపై నివసించాలనుకున్నారు. అక్కడికి కిష్కింధ కూడా దగ్గర్లోనే ఉంది. అప్పటికి వర్షాకాలం ప్రారంభమౌతోంది. ఆ కాలం సీతాన్వేషణకు అనువైనది కాదు కనుక నాలుగు నెలల తరువాత ఆ ఏర్పాట్లు చేయమని రాముడు సుగ్రీవునకు ఆదేశించాడు. రామలక్ష్మణులు ప్రస్రవణపర్వతం మీద ఒక విశాలమైన గుహలో ఉన్నారు.

రాముడు సుగ్రీవాదుల సహాయం ఎలా వినియోగించుకున్నాడు....తదుపరి భాగంలో....  


సర్వం శ్రీసాయిరామార్పణ మస్తు.








Monday, November 7, 2016 0 comments By: visalakshi

సీతాన్వేషణ - రెండవభాగం

రామలక్ష్మణులు నాలుగు అడుగులు వేసేసరికి కొనప్రాణంతో ఉన్న జటాయువు కనిపించాడు. రావణుడనే రాక్షసుడు సీతను అపహరించి దక్షిణదిశగా పోయాడని చెప్పాడు. రాముడు వచ్చేస్తాడేమోననే భయంతో ఆ రాక్షసుడు సమయం గమనించక తనకు వ్యతిరేక ఫలితం ఇచ్చే ముహుర్తంలో సీతాదేవిని అపహరించాడనీ, ఆ ముహూర్తం పేరు విందం అనీ, ఆ ముహుర్తంలో పోగొట్టుకున్న సొమ్ము యజమానికి త్వరలోనే తిరిగి చేరుతుందనీ చెప్పాడు. సీతమ్మను రక్షించడానికి రావణుణ్ణి ఎదుర్కొని పోరాడి తను గాయపడ్డానని చెప్పి ప్రాణం వదిలాడు. రామలక్ష్మణులు మరోసారి దు:ఖంలో మునిగిపోయారు. తమకోసం దుర్లభమైన ప్రాణాలను తృణప్రాయంగా ఒడ్డి రాక్షసరాజుతో పోరాడిన జటాయువు(పక్షిరాజు) త్యాగానికి చలించిపోయారు. అంతవరకూ భావావేశానికి లోనుకాకుండా ఉన్న లక్ష్మణుడు కూడా దు:ఖం ఆపుకోలేక రోదించాడు. రాముడైతే తన దీనావస్థను తలుచుకుని 'లక్ష్మణా! రాజ్యంభ్రష్ఠం రాజ్యం పోయింది. వనే వాస: వనవాసం చేయవలసి వచ్చింది. పితా మృత: తండ్రిగారు మరణించారు. సీతా నష్టా: సీత అపహరించబడింది...నాకు సహాయం చేయబోయి ఈ పక్షిరాజు ప్రాణం పోగొట్టుకున్నాడు. నేను ముట్టుకుంటే మహాసముద్రాలు ఎండిపోతాయి. నాకంటే దౌర్భాగ్యవంతుడు ఇంకొకడుండడు.' అని విలపించాడు. కొంచెం  తేరుకుని రాముడు జటాయువుకు అంతిమసంస్కారం చేసి స్వర్గానికి పంపాడు.




 రామలక్ష్మణులు మళ్ళీ దక్షిణదిశగా సీతాన్వేషణ చేస్తూ బయల్దేరారు. అరణ్యాలూ, పర్వతాలూ వెదుకుతూ వెడుతున్నారు. ఒక అరణ్యంలో కబంధుడనే రాక్షసుడు వీరిద్దరినీ తలొక చేత్తో పట్టుకున్నాడు. ఆ రాక్షసుడి అసలు పేరు దనువు.  చాలా అందంగా ఉండేవాడు. గొప్ప తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి దీర్ఘాయుర్దాయం వరంగా పొందాడు. వరగర్వంతో భయంకరమైన రూపం ధరించి ఋషుల్ని భయపెట్టేవాడు. ఒకరోజు స్థూలశిరస్కుడు అనే ఋషిని భయపెట్టబోతే ఆ ఋషి కోపించి 'నీకు ఈ రూపమే శాశ్వతంగా ఉండుగాక.' అని శపించాడు. దనువు క్షమించమని ప్రాధేయపడడంతో జాలిపడి, భవిష్యత్తులో దశరధుడి కుమారులు రామలక్ష్మణులు ఈ అడవికి వస్తారనీ, వారి చేతిలో మరణించి శాపమునుంచి బయటపడతాడనీ శాపవిమోచనం చెప్పాడు.

 ఆ తరువాత బలగర్వంతోనూ, వరగర్వంతోనూ ఇంద్రుడిమీద యుద్ధానికి వెళ్ళాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో తలమీద గట్టిగా మోదాడు. ఆ దెబ్బకు రాక్షసుడి తల, తొడలు మొండెంలోకి దిగిపోయాయి. కదలడానికి కాళ్ళు లేకుండా ఆహారం ఎలా సంపాదించుకోవాలి? తినడానికి నోరులేకుండా ఎలా బ్రతకాలి? బ్రహ్మ యిచ్చిన దీర్ఘాయుర్దాయం తీరేదాకా తిండి లేకుండా ఎలా జీవించాలి? అని ఇంద్రుణ్ణి అడిగాడు. ఇంద్రుడు జాలిపడి పొట్టలోనే పదునైన దంతాలున్న నోరు పెట్టాడు. పొడవైన భుజాలు ఇచ్చాడు. ఆ భుజాలతో జంతువులను, పక్షులను పట్టుకుని తిని బ్రతకమన్నాడు. ఈ దు:స్థితినుంచి విముక్తి ప్రసాదించమని దనువు  వేడుకున్నాడు. రామలక్ష్మణులు అతడి బాహువులను ఖండించి   సంహరించాక శాపవిముక్తుడై స్వర్గానికి వెడతాడని ఇంద్రుడు అనుగ్రహించాడు. అప్పటినుంచి దనువుకు కబంధుడు అని పేరు వచ్చింది. 

 "రామలక్ష్మణులు కబంధుడి పట్టునుంచి విడిపించుకుందుకు చాలా ప్రయత్నం చేసారు. కానీ వారికి సాధ్యం కాలేదు. ఆ రాక్షసుడి కోసం చుట్టూ చూసారు. వాడు ఒక పొదలో ముద్దలా కదలకుండా కూర్చున్నాడు. వీరిరువురినీ మెల్లగా మెల్లగా తన నోటి వద్దకు లాక్కుంటున్నాడు. రాముడికి మరల దు:ఖం ముంచుకొచ్చింది. లక్ష్మణా! కష్టం మీద కష్టం ఎలా వచ్చి పడుతోందో...ఒక రాక్షసుడు సీతను అపహరించాడు.ఆమెను వెదుకుతుంటే ఈ రాక్షసుడు పట్టుకున్నాడు. మనకీ కష్టాలేమిటి? కాలం కలిసిరాకపోతే పరాక్రమం, బలం, శస్త్రాస్త్రనైపుణ్యం అన్నీ ఇసుకతో కట్టిన అడ్డుకట్ట నీటిప్రవాహంలో కొట్టుకుపోయినట్లు కొరగాకుండాపోతాయి.' అన్నాడు. లక్ష్మణుడు నిర్వేదానికి లోనవకుండా బుద్ధి కేంద్రీకరించి..రామా! వీడి బలమంతా వీడి భుజాలలో ఉంది. మనని తినడానికి మోచేతులు మడిచి పిడికిళ్ళు  నోటివద్దకు లాక్కుంటున్నాడు. కొంచెం సేపుంటే వీడి భుజాలు మనకందుతాయి. భుజాలు నరికితే వీడు మరణిస్తాడు. కదలలేని వాణ్ణి చంపడం వీరులకు మర్యాద కాదు. కానీ వీణ్ణి చంపడానికి మరొక మార్గం లేదు అన్నాడు." 

 రామలక్ష్మణులు కబంధుడి రెండు భుజాలూ ఖండించారు. వారు దశరధపుత్రులని రాక్షసుడు గ్రహించి, తనకు శాపవిమోచనం అయ్యిందని సంతోషించాడు. తన శరీరాన్ని దహనం చేస్తే సీతజాడ కనిపెట్టగలిగినవాడెవరో చెప్తానన్నాడు.  వారు కబంధుణ్ణి ఒక గోతిలోకి తోసి పైన ఎండుకర్రలు వేసి దహనం చేసారు. దనువు దివ్యస్వరూపంతో మంటలనుంచి బయటకు వచ్చి రామా! నీ జీవితంలో ఇప్పుడు కష్టాలు అనుభవించాల్సిన దశ నడుస్తోంది. అందుకే నీకు భార్యావియోగం కలిగింది. ఆపదలు శత్రువుల వలన కలిగినపుడు వాటినుంచి బయటపడడానికి ఆరు ఉపాయాలు ఉన్నాయని శాస్త్రం చెప్తోంది. అవి: సంధి (శత్రువుతో రాజీపడడం), విగ్రహం(విరోధం కొనసాగించడం), యానం(యుద్ధానికి తలపడడం), ఆసనం(అనువైన సమయంకోసం ఓరిమిగా ఎదురుచూడడం), ద్వైధీభావం(శత్రువులలో చీలిక తేవడం), సమాశ్రయణం(ఇంకొకరి సహాయంతో విజయం సాధించడం). పస్థుతం మీరు దుర్ధశాఫలం వలన చాలా హీనస్థితిలో ఉన్నారు. అందువలన మీకు సమాశ్రయణమే తగిన ఉపాయం.  ఇక్కడికి కొద్ది దూరంలో ఋశ్యమూకం అనే పర్వతముంది. దానిమీద సుగ్రీవుడు అనే వానరరాజు తన నలుగురు మంత్రులతో ఉన్నాడు. ఆ సుగ్రీవుడు ఋక్షరజస్సు అనే మహావీరుడి కుమారుడు ఉత్తముడు. ఈతడి అన్నగారు వాలి. ఆ వాలి రాజ్యం కోసం తమ్ముణ్ణి దేశం నుంచి వెళ్ళగొట్టాడు. సుగ్రీవునికి నీ సహాయం కావాలి. నీకు అతడి సహాయం కావాలి. అతడితో స్నేహం చేసి కార్యసిద్ధి పొందు. ఇక్కడినుండి పడమటికి వెళ్తే పంపాసరోవరం పశ్చిమతీరం చేరుకుంటారు. ఇంకొంచెం ముందుకి వెళితే మతంగముని ఆశ్రమప్రాంతం. అక్కడ ఆ మహర్షి శిష్యులు తపస్సు చేసేవారు. వారంతా స్వర్గానికి వెళ్ళిపోయారు. వారికి సపర్యలు చేస్తూ వారితోపాటు తపస్సు చేసిన శబరజాతికి చెందిన ఒక సం న్యాసిని ఆ ఆశ్రమంలో నీకోసం జీవించి ఉంది. ఆమెను అందరూ శబరి అంటారు. నిన్ను చూశాక స్వర్గానికి వెళ్తుంది. రామలక్ష్మణులు దనువుకు వెళ్ళడానికి అనుమతి యిచ్చారు.




 పంపాతీరాన ఉన్న రమ్యమైన ఆశ్రమానికి చేరుకొని మెల్లగా ఆశ్రమం లోపలకు ప్రవేశించి శబరి దగ్గరగా వెళ్ళారు. అప్పుడు సిద్ధురాలైన శబరి రామలక్షమణులను చూడగానే ఆనందభాష్పాలతో నమస్కరించి రామలక్ష్మణ పాదాలను కళ్ళకు అద్దుకుంది. రాముడు ఆ తపస్వినితో ..ఓ తాపసురాలా! నీ తపస్సుకు ఏమీ ఆటంకాలు లేవు కదా..తపస్సులో పురోగతి సాధిస్తున్నావా? కామక్రోధాలన్నిటినీ అదుపులో ఉంచుకుంటున్నావా? నీ గురుసేవలు ఫలించాయా? మశ్శాంతి లభిస్తోందా?...దానికి   శబరి ఓ రామా! ఈనాడు నీ దర్శనం కావటం వల్ల నా తపస్సు సిద్ధించింది. నీ దర్శనంతోనే గురు శుశ్రూషాఫలం కూడా లభించింది. నా తపస్సు ఫలించింది.రామా! నీకు ఆతిధ్యం యివ్వడానికి అరణ్యాలలో దొరికే అనేక పదార్ధాలు సేకరించాను  స్వీకరించు అంది.ఆమె తన ధర్మాన్ని పాటించి ఆహారం సేకరించి పెట్టింది. కానీ ఆమె సేకరించిన ఆహారం గురించి రాముడు పట్టించుకోనేలేదు. నిత్యం జ్ఞానమార్గంలోనే ఉండే శబరితో రాముడు.. దనువు నీ ప్రభావం ఎంతటిదో చెప్పాడు. నువ్వు అంగీకరిస్తే నీ ప్రభావం ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాను...మతంగమహర్షి శిష్యులు శబరికి గురువులు. వారు తపస్సు చేసిన ఆశ్రమం అంతా రాముడికి చూపించింది. వారు వృద్ధులై వణకుతున్న చేతులతో పూజలు చేసిన వేదిక చూపించింది. పదమూడేళ్ళు గడచినా వారు పూజకు ఉపయోగించిన పుష్పాలు వారి తప:ప్రభావం వలన వాడిపోకుండా ఎలా ఉన్నాయో చూపించింది.వారు తడి బట్టలు ఆరవేసుకొనే చెట్లు చూపించింది.ఆ ఆశ్రమంలో ఉన్న ఋషులకు సప్తసాగరాలలో స్నానం చెయ్యాలనిపించింది. కానీ వార్ధక్యం వలన  శరీరాలు  దుర్భలమై కదలడమే కష్టమైపోయేది. వారి కోరిక గ్రహించి సప్తసముద్రాలూ ఆ ఆశ్రమం చేరి వారికోసం సప్తసాగరతీర్ధం ఏర్పరిచాయి. ఆ తీర్ధం చూపించింది.  తన గురువులందరూ, రాముడు   చిత్రకూటంలో ఉండగానే దివ్యవిమానాలలో పుణ్యలోకాలకు వెళ్ళిపోయారని చెప్పింది.. .రామా! గురువు ఆజ్ఞ ప్రకారం నీకోసం పదమూడు సంవత్సరాలు నిరీక్షించాను. నీ దర్శనమైంది. ధన్యురాలినయ్యాను. నువ్వు అనుమతిస్తే యీ శరీరాన్ని విడిచిపెట్టాలనుంది. పూజ్యులైన నా గురువుల సన్నిధికి వెళ్ళిపోతాను అంది. రాముడి అనుమతి తీసుకుని శబరి అగ్నిలో ప్రవేశించింది.ఆ అగ్నినుంచి మరింత తేజోమయమైన అగ్నిశిఖలా  బయటకు వచ్చి, స్వర్గానికి వెళ్ళింది. రామలక్ష్మణులు సప్తసాగరతీర్ధంలో స్నానం చేసి యధాశాస్త్రంగా పితృతర్పణాలు యిచ్చారు.


  మతంగాశ్రమం దర్శించాక వారి మనసుల్లో ఏదో నూతనోత్సాహం వచ్చింది. నిరాశా, ఆందోళనా తొలగిపోయాయి. అశుభం అంతమైంది.' ఏదో గొప్ప శుభం కలగబోతోంది అని మనస్సుకు తెలుస్తోంది..లక్ష్మణా!' అన్నాడు రాముడు.....

సీతమ్మ జీవుడు. రాముడు పరమాత్మ.  ఈ జీవుణ్ణి పరమాత్మతో కలిపే ఆచార్యుడు హనుమంతుడు.....ఎలా అన్నది తదుపరిభాగంలో.....


   
సర్వం శ్రీ సాయిరామార్పణ మస్తు








Saturday, November 5, 2016 1 comments By: visalakshi

సీతాన్వేషణ - మొదటిభాగం

రామాయణంలో శ్రీరాముణ్ణి వాల్మీకి మహర్షి కేవలం మానవమాత్రుడిగానే చివరి వరకు చిత్రించాడు. అనగా పరమేశ్వరుడే "నా మాయయే నన్ను ఆవహించి ఉండు గాక!" అని సంకల్పించి ఉంటాడు.

శ్రీరాముడు మాతృభక్తి,  పితృభక్తి,  గురుభక్తి, పతిభక్తి, సోదరప్రేమ, శరణాగత సంరక్షణము, సత్యవాక్పరిపాలనము మొదలైన విశిష్టమైన గుణాలను తాను ఆచరించి లోకానికి బోధించాడు. 



  దాంపత్యబంధం ఎంత పవిత్రమైనదో రామాయణం మనకు బోధిస్తుంది.రాముడు శివధనుర్భంగం చేసినప్పుడు జనకుడు సీతాదేవిని వివాహం చేసుకోమని అడుగుతాడు. తండ్రి దశరధుని అనుమతి లేకుండా వివాహం చేసుకోనంటాడు. దశరధ మహారాజు వైభవోపేతంగా సీతారాముల కల్యాణం జరిపించుట అందరికీ విదితమే! రాముడు వనవాసానికి వెళ్ళే ఘట్టంలో తల్లి కౌసల్యాదేవి కూడా రాముడి వెంట అడవులకు వెళ్ళడానికి సిద్ధపడుతుంది.అప్పుడు రాముడు తల్లిని ఓదార్చుతూ, తండ్రి దశరధ మహారాజు సేవలో తరించడమే ఆమెకు శ్రేయస్కరమని, అదే పరమ సాధ్వీమణుల లక్షణమని వివరిస్తాడు.

 సీతారామలక్ష్మణులు పంచవటికి చేరుకున్నారు. అచటికి శూర్పణక అనే రాక్షస స్త్రీ రాముని మోహించుట.. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోయుట.. శూర్పణక సోదరుడైన ఖరుడు రామాదులను చంపటానికి ప్రయత్నించుట... ఖరుని అనుచరులను రాముడు  సంహరించుట .. ఖరదూషణాదులు  పంచవటికి  రామునితో  యుద్ధానికై  బయలుదేరుట..
కొన్నివేలమంది రాక్షసులను  సంహరించి..ఖరుని నిందించి రామచంద్రుడు ఖరుని వధించాడు...ఖరుడి మరణవార్త తెలిసిన రావణుడు..శూర్పణక ద్వారా సీతారామలక్ష్మణులను గూర్చి తెలుసుకొని... ఆ రాక్షసరాజు మారీచుని సహాయం అడగడం..  సీతను అపహరింప మారీచుని సహాయం అడగటం.. రావణునికి మారీచుని ఉపదేశం.. మారీచుని తనతో రమ్మని రావణుడు ఆజ్ఞాపించడం..మారీచుడు బంగారు లేడిరూపం దాల్చడం..ఆ మాయాలేడిని సీత కోరడం..రాముడు లక్ష్మణుణ్ణి సీతకు రక్షణగా ఉంచి ఆ మాయాలేడిని మారీచుడుగా గుర్తించి వధించడం..మారీచుడు రాముని స్వరంతో హా లక్ష్మణా..హా సీతా అని అరచుట.. లక్ష్మణుని రాముని వద్దకు సీత పంపుట.. రావణాసురుడు సన్యాసి వేషంలో సీత వద్దకు వెళ్ళటం..రావణునికి సీత తన వృత్తాంతం చెప్పటం..రావణుడు తన పరాక్రమాన్ని వర్ణించి సీతకు చెప్పుట అటు పిమ్మట రావణుడు సీతను అపహరించి తీసుకుపోయాడు. ఆమెకోసం రామలక్ష్మణులు అశ్రమమంతా వెతికారు. ఆశ్రమం చుట్టుపక్కల అడవి అంతా వెదికారు. ఆమె కనిపించలేదు.



సీత ఏమైందని రాముడు గోదావరిని అడిగాడు. నిరంతరం గలగలా పారే గోదావరి రావణుణ్ణి చూసిన భయంతోనూ, ఆ రాక్షసుడు సీతను అపహరించుకు పోయాడని దు:ఖంతోనూ నిశ్శబ్దంగా ప్రవహించింది.అడవిలో మృగాలను అడిగాడు. అవి జాలిగా కన్నీళ్ళు కారుస్తూ మోరలెత్తి దక్షిణంవైపు చూపించాయి. పర్వతాన్ని అడిగాడు. అది రాముడి ప్రశ్ననే ప్రతిధ్వనిగా బదులిచ్చింది. చెట్లను అడిగాడు. అవి విషాదంగా తలలు వాల్చాయి.ఏం చెయ్యాలో తెలియని అశక్తత. సీత ఏమైందోనని ఆందోళన. తమ అజాగ్రత్త వలన ఆమెకు ఆపద కలిగిందని ఆవేదన.అన్నీ కలిసి దు:ఖం  తట్టుకోలేక   లక్ష్మణుడి రెండు భుజాలూ పట్టుకొని కుదిపేస్తూ, నీకు నా మాట మీద గౌరవం లేదు. నేను ఆశ్రమంలో ఉండమని పదిసార్లు చెప్పినా నా రక్షణ కంటూ నా వెనకాల పరిగెత్తుకు వచ్చావు. ఘోరమైన ఆపద కలిగించావు. భార్యను రక్షించుకోలేని పిరికివాణ్ణని లోకం నన్ను అవమానిస్తుంది. అయినా ఎవర్నని ఏం లాభం! నా అదృష్టమే ఇలా ఉంది. లేకపోతే ' శోకేన శోకో హి పరంపరాయా మామేది భిందన్ హృదయం మనశ్చ ' ఒక దు:ఖం మీద మరొక దు:ఖం ఆగకుండా వచ్చి పడుతూ మనస్సుని వదలకుండా పీడిస్తున్నాయి. చూడు. రాజ్యం పోయింది. అయినవాళ్ళందరికీ దూరమయ్యాము. అరణ్యంలో ఋషుల దర్శనభాగ్యం వలన ఆ దు:ఖం కొంత శాంతించింది. అంతలోనే సీతా వియోగంతో మళ్ళీ రెట్టింపు దు:ఖం ముంచుకొచ్చింది. ఇలా ఈ దు:ఖాగ్ని రోజురోజుకూ మరింత ప్రజ్వరిల్లి నన్ను దహించేస్తోంది.  లక్ష్మణుడు పెద్దరికం ఆపాదించుకుని రాముణ్ణి ఓదార్చాడు. రామా! దు:ఖాన్ని వదిలిపెట్టి ధైర్యం తెచ్చుకో. సీతమ్మను వెదుకుదాం.    'ఉత్సాహవంతో హి నరా లోకే సీదంతి కర్మస్వతిదుష్మరేషు ' ఉత్సాహవంతులు కష్టమైనపనులు చేయవలసి వచ్చినా దిగులు చెందరు. తాము అనుకున్నది సాధిస్తారు. ఇందాకా నువ్వు మృగాలను అడిగినప్పుడు అవి మోరలెత్తి దక్షిణదిక్కును చూపించాయి. ఆ దిక్కుకు వెళ్ళి వెదికితే సీతమ్మ తప్పక కనబడుతుంది అన్నాడు. రాముడు అంగీకరించాడు. రామలక్ష్మణులు సీతను అన్వేషిస్తూ దక్షిణదిశగా బయల్దేరారు. 



 ఆశ్రమం నుంచి కొంచెం దూరంలో వారికి ఇద్దరు వీరులు యుద్ధం చేసిన ఆనవాళ్ళు కనబడ్డాయి. యుద్ధ సమాగ్రి, రధం అంబులపొదులు, సారధి, సేవకులూ ప్రాణాలు పోయి పడి ఉన్నారు. నేలమీద అప్పుడే ఆరుతున్న రక్తపు మరకలు.. ఇవన్నీ చూస్తే గొప్ప యుద్ధం జరిగిందని తెలుస్తోంది. ఇద్దరు రాక్షసులు సీతకోసమే యుద్ధం చేసి గెలిచినవాడు సీతను అపహరించుకుపోయి ఉండాలి. అని అనుకోగానే రాముడికి దు:ఖం తన్నుకొచ్చింది.

 సీత ఏమరకుండా పాటించిన ధర్మం ఆమెను కాపాడలేకపోయిందని రాముడు చింతించాడు. పాటించిన నియమాలు ఆపదలో ఆదుకోలేక పోయాయని ఆవేదన చెందాడు. ధర్మమార్గం వదలని వాళ్ళను రక్షించవలసిన దేవతలు సీత విషయంలో ఉపేక్షించారని ఆగ్రహించాడు.   

 కోపం ఆపుకోలేక తీవ్రమైన సంకల్పం చేసాడు.  లక్ష్మణా! దేవతాప్రీతి కోసం ఎన్ని పుణ్యకార్యాలు చేసాం! కష్టనష్టాలు, ఆపదలు ఎదురైనా ధర్మమార్గం వదలకుండా జీవించాం. ఇంత చేసినా ఆపద కలిగితే దేవతలు సీతను కాపాడలేదు. నేను ఇంద్రియాలను జయించి, దయామూర్తినై, లోకానికి మేలు చేయడమే లక్ష్యంగా జీవిస్తుంటే 'నిర్వీర్య ఇతి మన్యంతే నూనం మాం త్రిదశేశ్వరా:' నా మృదుస్వభావాన్ని అలుసుగా తీసుకుని దేవతలు నన్ను చేతకానివాణ్ణి అనుకుంటున్నారు. 

  ఇక నాలో ఉన్న మంచి గుణాలను అణిచిపెట్టి విజృంభిస్తాను. దయాదాక్షిణ్యాలు మర్చిపోతాను. నా ఆగ్రహం ఎలా ఉంటుందో చూపిస్తాను. లోకాలేమైపోతే నాకేం!  నా బాణాలతో గ్రహాల గమనం ఆపుతాను. అగ్నికి, వాయువుకి, సూర్యుడికి తేజస్సులేకుండా చేస్తాను. పర్వతాలను కూల్చివేస్తాను . సముద్రాలను ఇంకిపోయేలా చేస్తాను. దేవతలు తిరిగే ఆకాశమార్గాన్ని బాణాలతో నింపేస్తాను. ఇకపై ఏ ప్రాణులూ ఆకాశంలోకి ఎగరలేవు. విలాసంగా దేవతలు చేసే ఆకాశసంచారం ఆగిపోతుంది. అసలు దేవ దానవ యక్ష లోకాలన్నీ నాశనం చేసేస్తాను.  సీతను ప్రాణాలతో గానీ, ప్రాణం లేకుండా గానీ దేవతలు వెంటనే నాకు అప్పగించకపోతే దేవతలే ఉండరు..రాక్షసులసలే ఉండరు. లోకాలుండవు. అని ప్రళయకాలాగ్నిలా మండిపడుతూ ధనుస్సు పట్టి బాణం అందుకున్నాడు. రాముణ్ణి అంత భయంకరమైన రూపంలో లక్ష్మణుడు ఎప్పుడూ చూడలేదు.  రాముడి భయంకర రౌద్రరూపం చూసి లక్ష్మణుడు తెల్లబోయాడు. తేరుకొని అన్నకు అంజలి ఘటించి రాముడి కోపం తగ్గించేందుకు ప్రయత్నించాడు.

 రామా! చంద్రుడికి శోభ, సూర్యుడికి కాంతి, వాయువుకు గమనం ఎలా సహజలక్షణాలో అలాగే ఇంద్రియ నిగ్రహం, మృదుస్వభావం, జీవులన్నిటిపట్లా  దయ  నీకు  సహజలక్షణాలు. నువ్వు  ధర్మమూర్తివి. 

 ఎవడో ఒకడు నీకు బాధ కలిగించాడని లోకాలన్నిటినీ నాశనం చెయ్యడం నీకు తగదు. సకలప్రాణులూ నీకు మేలే కోరుకుంటాయి. నిన్ను ప్రభువుగా చూసుకుంటాయి. నువ్వు రక్షిస్తావని నమ్ముతున్నాయి. నువ్వు పదికాలాలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాయి. నదులూ పర్వతాలూ సముద్రాలూ నీకు అపకారం జరగాలని కోరుకోవు. నువ్వే స్వయంగా లోకనాశనానికి పూనుకొంటే నువ్వే దిక్కని నమ్మిన ప్రజలకు ఇక దిక్కెవరు?వాళ్ళు ఎవరిని ఆశ్రయించాలి? 

నీకు బాధ కలిగింది నిజమే. కానీ ఓరిమితో బాధలను తట్టుకోవడమే కదా మహాత్ముల లక్షణం! సూర్యచంద్రులు లోకానికి కళ్ళవంటివారు. వారికే గ్రహణాలు తప్పడం లేదు. జీవులన్నిటికీ ఆధారమైన భూదేవి కూడా అప్పుడప్పుడు కంపిస్తోంది. దేవతలకు కూడా అవమానాలు తప్పడం లేదు. అంత మాత్రం చేత వారు ఉత్పాతాలు సృష్టిస్తున్నారా? నీకు తెలియంది కాదు..దు:ఖం గానీ, కష్టం గానీ వచ్చినప్పుడు బుద్ధితో ఆలోచించాలనీ, ఆవేశానికి లోనుగాకూడదనీ నువ్వే నాకు అనేకసార్లు చెప్పావు.నీకు తెలియని ధర్మం లేదు. నువ్వు నేర్చుకోని నీతి లేదు. బృహస్పతి కూడా నీతో మాట్లాడేందుకు జంకుతాడు. 'శోకేనాభిప్రసుప్తం తే జ్ఞానం సంబోధయామ్యహం ' ఈ క్షణంలో నీ ఆలోచనలను శోకం పూర్తిగా ఆవరించి ఉంది. నేను శోకంతో మరుగున పడిపోయిన నీ బుద్ధిని కేవలం మేల్కొలుపుతున్నాను.  లక్ష్మణుడి మాటలకు రాముడు శాంతించాడు. 

 తదుపరి భాగంలో కబంధుడనే రాక్షసుడు, భక్త శబరి వృత్తాంతాలతో....



సర్వం శ్రీ సాయిరామార్పణ మస్తు.








Friday, November 4, 2016 1 comments By: visalakshi

జ్ఞానప్రాప్తి

 శ్రీసాయిబాబా స్వయంగా భక్తులకు వర్ణించిన, శ్రోతలకెంతో శ్రేయస్కరమైన మధుర వృత్తాంతాన్ని హేమాడ్పంత్ ఇలా వివరిస్తున్నారు. 

  ఓసారి బాబాగారు అడవిలో ఉన్నప్పుడు ఆయనకి అనుకోకుండా గురుదర్శనమైంది.గురువు చేతలు నిజంగా ఎంత అద్భుతంగా ఉంటాయో ఈ కధ తెలుపుతుంది. ఈ కధ విన్న వారికి అది భక్తి,శ్రద్ధలను పెంచి వారికి జననమరణాలనుంచి ముక్తి ప్రసాదిస్తుందని సాయిబాబా స్వయంగా పలికారు.తమ గురుదర్శనం గురించి సాయిబాబా నోటినుంచి జాలువారిన కధామృతం....గురుకృప లేకుండా జ్ఞానప్రాప్తి రాదు.




ఊర్ధ్వమూల మధశ్శాఖ ప్రాహు రవ్యయం!
చంధాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్!!   అ.15లో 1వ శ్లో 

ఆ వృక్షానికి మూలం పైన బ్రహ్మ లేక పరమాత్మ లోనూ దాని శాఖలు క్రింద (పృధ్వి మీద మానవాదికాలు) ఉంటాయి. దాన్ని అవినాశి అంటారు.వేదాలు దాని ఆకులు. అలాంటి (సంసారమనే) అశ్వత్థవృక్షాన్ని తెలుసుకొన్నవారు వేదవేత్తలు. అంటే జ్ఞానులు. అలాగే ఖఠోపనిషత్తులో "ఊర్ధ్వమూలో వాక్షాఖ్ ఏషో శ్వత్థసనాతన".  

ఈ బ్రహ్మ అన్నిటికీ ఆధారమూ, సత్యమూ అయి ఉంది. అయితే ఈ జగత్తు స్వప్నం లాగా మిధ్య. దానికి 'ఆది ' లేదు. 'అంతం ' లేదు.  దానికి ఏ విధమైన ఆధారం కూడా ఉండదు. మరి మధ్యలో అది ఎలా ఉండగలదు? దానికోసం (బ్రహ్మ) మహాత్ములు అనురక్తులౌతారు. ముముక్షువులు కోరుతారు.సాధకులు ఇష్టపడుతారు. దాన్ని ప్రాప్తింపచేసుకోవాలనుకొనేవారు మహాత్ములను శరణనాలి. మనసుని మూటకట్టి, బుద్ధిని దూరంగా నెట్టేసి, మాయ,మమకారాలను పూర్తిగా త్యాగం చేసి గురుచరణాల్లో చక్కగా నిమగ్నం కావాలి. దీనికి సంబంధించిన గురువచనమనే ఓ మధురసుధారసధార  గా..  బాబాగారు స్వయంగా చెప్పిన కధ..

ఒకసారి మేము నలుగురం పురాణాలు చదివి జ్ఞానం ప్రాప్తించాక బ్రహ్మ గురించి చర్చించసాగాం. ఒకడు "ఉద్ధరేదాత్మనాత్మానాం"(తమని తామే ఉద్ధరించుకోవాలి అన్న భగవద్గీత ఆరవ అధ్యాయంలోని 5వశ్లోక) అన్న మాటలు తీసుకొని ఇతరులపై ఆధారపడి ఉండటం అన్ని విధాలా అయోగ్యం అని వివరణ ఇవ్వసాగాడు. దానికి రెండవవాడు ఇలా సమాధానం చెప్పాడు. "మనసుని స్వాధీనంలో ఉంచుకొనే వారే ధన్యులు. ఊహలను, సందేహాలను వదిలేసి తాను తప్ప జగత్తులో ఇంకెవరూ అస్థిత్వంలో లేరన్న భావనతో ఉండాలి." మూడవవాడు  "మార్పుకి లోనయే వస్తువు అనిత్యం అంటే నాశవంతం.మార్పుకి లోనవని వస్తువు నిత్యం.కనుక నిత్యానిత్యాల గురించి విచారిస్తూ ఉండాలి." అన్నాడు. నాలుగవవాడికి కేవలం పుస్తక జ్ఞానం ఇష్టం లేదు. అతనిలా అన్నాడు, "శాస్త్రాలచే నిర్దేశింపబడిన ఆచరణ చేస్తూ, గురుచరణాలకు శరీరమూ, వాక్కుతో సహా పంచప్రాణాలనూ సమర్పించాలి. గురువు ప్రత్యక్షంగా పరమాత్మే. ఆయన సమస్త చరాచర వస్తువులకు బయటా, లోపలా  నిండిపోయి  ఉన్నాడన్నభావం  తమలో స్థిరపడటానికి అపారమైన నిష్ట ఉండాలి. అక్కడ కేవలం పరిశుద్ధమైన మనసూ, భక్తి, యుక్త, అంత:కరణా  ఉన్న  శ్రద్ధావంతులే  కావాలి."




 అలా మా నలుగురం ఆ బ్రహ్మని శోధించాలని బయలుదేరాం. మాలో ముగ్గురికి మన స్వబుద్ధితో, స్వేచ్చతో, నిశ్చిత మనసుతో బ్రహ్మను వెతకాలన్న కోరిక ఉంది. తరువాత మేము వనంలో యధేచ్చగా తిరుగుతుంటే దారిలో ఓ వణజారి (ఇతర గ్రామాల నుంచి ధాన్యం, ఉప్పు, పప్పు మొదలైనవి ఎద్దులమీద మోసుకొచ్చి అమ్మేవాడు. కనుక వనంలోని అన్ని మార్గాలు బాగా తెలిసినవాడు) కలిసి మమ్మల్నిలా అడిగాడు, "చాలా ఎండగా ఉంది.ఎక్కడికి వెళ్తున్నారు? అసలెందుకు వెళ్తున్నారు?" మేము జవాబిచ్చామిలా, "మేము వనాన్ని లోపలా బయటా వెతుకుతున్నాం." దానికి ఆ వణజారి ..మీరింతగా ఎందుకు వెతుకుతున్నారు?.. అప్పుడు మేము "రహస్యాన్ని బయటికి చెప్పడం సరికాదు."అని మేము నలుగురం అలా పరిగెత్తడం చూసి ఆ వణజారి ప్రాణం తల్లడిల్లింది. "వనంలో తిరగటం కష్టం తిరగాలంటే మార్గదర్శి ఉండాలి. మీ రహస్యం నాకు చెప్పద్దులెండి కానీ కాసేపు కూచుని కొంచెం రొట్టెముక్క తిని నీళ్ళు తాగి తరువాత వెళ్ళండి మానవులు ఓర్పుగా ఉండాలి"అని చెప్పినా ఆతని విన్నపాన్ని లెక్క చేయకుండా ముందుకు నడిచి చివరికి మార్గంలో ఎంతో అలసిపోయాము. మేము తెలివైనవాళ్ళం. మా మార్గాన్ని మేమే వెతుక్కోవాలి అన్న గర్వం మా మనసులో మాకెంతో ఉంది. కానీ దట్టంగా ఉన్న ఆ అడవి ఎంతో దూరం వ్యాపించి, ఎత్తైన పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయింది. అలాంటిచోట వెతుక్కోవతం ఎలా? దిశల గురించి తెలీక తికమకపడి దారితప్పి మేము అటూ  ఇటూ    వ్యర్ధంగా  తిరుగుతూ  ఉండిపోయాము.  కానీ  దైవం ఎంత గొప్పవాడంటే  తిరిగి  తిరిగి  మళ్ళీ  అదే  ప్రదేశానికి  వచ్చాం.   అదృష్టవశాత్తూ వెళ్ళిన మార్గానికే తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ ఆ వణజారి మాకు కలిశాడు.  "పొరపాటున తప్పు దారిలో పోయారు..మార్గం చూపేవారు ఉండాలి. ఖాళీ కడుపుతో ఏదీ అన్వేషించకూడదు.ఎవరైనా తినడానికి రొట్టెముక్క ఇస్తే దాన్ని పూర్తిగా శుభశకునంగా భావించాలి. అపుడా కార్యం ఏ అవాంతరాలు లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఫలహారాన్ని తిని కొంచెం ధైర్యం పెట్టుకోండి" అని చెప్పినా ఆ అలోచన ముగ్గురికీ నచ్చలేదు. వాళ్ళు మళ్ళీ ఏమీ తినకుండా వెళ్ళిపోయారు.నాలుగోవాడినైన నాకు ఆకలేసింది. దాహంతో నా గొంతెండిపోయింది. వణజారి అలౌకిక ప్రేమను చూసి నాకు చాలా ప్రీతి కలిగింది.ఆతని మనసులో ఎంత స్వాభావిక ప్రేమ ఉంది..ఏదీ ఆశించకుండా రొట్టె,కూర తినమని..అలా ప్రేమించిన వాళ్ళే నిజమైన జ్ఞానులు. అతన్ని ఆదరించడమే అదే నేను విద్యను సంపాదించగల ఉపాయమని అనిపించింది. కనుక అతను ఇచ్చిన ఒక పావు రొట్టెముక్కను ఆదరపూర్వకంగా తిని నీరు త్రాగాక ఒక అద్భుతం జరిగింది. 

 ఊహించని విధంగా అక్కడికి గురుమహారాజు వచ్చి ఇలా అన్నారు. "వాదవివాదాలెందుకు చేస్తున్నారు?" ఆయనతో నేను జరిగిన వృత్తాంతమంతా చెప్పాను. అప్పుడాయన "నాతోపాటు వస్తావా? నీకు వెంటనే మీరు వెతికిన ఆచూకీ పట్టిస్తాను. కానీ నేను చెప్పినట్లు వింటేనే కోర్కె నెరవేరుతుంది."  ఇతరులు ముగ్గురూ మాట వినలేదు. కానీ నేను ఆదరపూర్వకంగా దానికంగీకరించాను. గురుమహారాజు నన్నుతీసుకొని ఒక బావి దగ్గరకు వెళ్ళారు. నా రెండు కాళ్ళనూ ఆయన త్రాడుతో కట్టి పాదాలను పైనా, తలను క్రిందా పెట్టి తలకిందులుగా నన్ను నీటిలో మునగకుండా నీటిమీదుగా వ్రేలాడదీశారు. నీటికి నా చేతులు తగలకుండా, నీరు కూడా నా నోట్లోకి పోకుండా గురువు నన్ను బావిలో వ్రేలాడదీశారు.బావి గట్టు వద్ద ఓ చెట్టుంది. దానికి తాడు రెండవ కొసను కట్టి గురువుగారు నిర్దాక్ష్ణ్యంగా ఎక్కడికో వెళ్ళిపోయారు. నాలుగున్నర గంటలు గడిచాక ఆయన తిరిగి వచ్చ్హారు. నన్ను గబుక్కున పైకి లాగి"బావున్నావా" అన్నారు. నేను "ఎంతో ఆనంద పారవశ్యంలో ఉన్నాను. మీ ప్రేమామృత రసధారలవల్ల నేనభవించిన అపార సుఖాన్ని నేనెలా వర్ణించగలను" నా మాటలు విన్న గురుమహారాజు నా దేహాన్ని తమ చేత్తో నిమిరి ఆయన నన్ను తమ వద్దే ఉంచుకొన్నారు. గురువుగారు బాబాని సమాధి అవస్థలోకి తీసుకెళ్ళారు. బాబాని బావి అనే సంసారంలో నీరు అనే విషయాలవద్ద పెట్టారు. అదే సమయంలో ఆ నీరు చేతికి అందనంత దూరంలో బాబాని వ్రేలాడదీశారు. తలకిందులుగా వ్రేలాడదీయటంవల్ల ఇంద్రియాలన్నీ లోపలా బయటా సహస్రార చక్రం దగ్గరకు లాగబడి బాబాకి సమాధి స్థితి కలిగింది. అందుకే ఆ నాలుగున్నర గంటలూ బాబా భగవత్ ప్రేమామృత వర్షంలో తడిసిపోయి పారవశ్యపు స్థితిలో ఉన్నారు.  అప్పుడు గురువుగారు నన్ను తమ పాఠశాలకు తీసుకెళ్ళారు. నా గురువు నాపై నిష్కల్మష ప్రేమను కుంభవృష్టిలా వర్షించారు. నాకు గురువే అన్నీ అయిపోయారు. మనసుతో సహా ఇతర జ్ఞానేంద్రియాలన్నీ తమ స్థానాన్ని వదిలేసి ధ్యానం చేయాలన్న ప్రవృత్తికోసం ఏకాగ్రంగా కనుపాపల్లోకి వచ్చేశాయి. గురువు తప్ప నాకు వేరే ఏదీ కనిపించేది కాదు. దాన్నే "అనన్య అవధానం" అంటారు. ఆ ప్రకారంగా నాచేత ఉపాసన చేయించి నాకు బ్రహ్మజ్ఞాన నిధిని చూపించారు నా గురువు.బ్రహ్మజ్ఞానాన్ని స్వీయ అనుభవంతోనే ప్రాప్తింప చేసుకోవలసి ఉంటుంది.




సరే, ఆ నలుగురు పండితులూ దేని గురించి అన్వేషణ సాగించారూ..అంటే వారి వారి పుస్తక జ్ఞానాన్ని ప్రదర్శించుకొంటున్నప్పుడు దైవం గురించిన ప్రస్తావన వచ్చింది. తమకున్న జ్ఞానంతో దైవమెలా ఉంటాడు, ఏ పద్ధతిలో ,ఏ మార్గంతో, ఏ ఉపాయంతో తమకు ఆయన వెంటనే కలుస్తాడు ..ఇదే వారి మనసుల్లోని ఆలోచన. ఆ ప్రబుద్ధుల్లో శ్రీసాయి తనని కూడా ఒకరిగా కలుపుకొన్నారు.  ఆయన వైరాగ్యమూర్తి, వివేక సంపన్నులు. ఆయన సాక్షాత్తూ పరబ్రహ్మ తత్వమే. అప్పుడాయన ఆ విచారాన్ని స్వీకరించడం కేవలం లోకానికి ఆదర్శంగా మాత్రమే. భక్తులను ఉద్ధరించగల సాయి సమర్ధులకు ఆ అల్పత్వాన్ని ఎలా ఆపాదించగలం! స్వయంగా తాము అవతార పురుషులై ఉండి ఒక వణజరిని పూజ్యుడుగా భావించి,నిశ్చయపూర్వకంగా అన్నబ్రహ్మను స్వీకరించి దాని మహిమను కీర్తించారు. అలాగే ఆ అన్నాన్ని అనాదారం చేసేవారు ఎలా నష్టపోతారో చెప్పి గురువు లేకుండా జ్ఞానం ఎవరికీ ప్రాప్తించదని ఆ విషయానికి  సంబంధించిన  ప్రబుద్ధుల  కధను  చెప్పారు.  

తల్లి, తండ్రి, ఆచార్యుడు -వీరి ఉపదేశం లేకుండా ధర్మానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందలేం. తల్లి,తండ్రి, గురువులను దైవస్వరూపంగా భావించి, వారికి సదా నమస్కరిస్తూ, వారిని సేవిస్తూ, వారి ఆజ్ఞలను పాటిస్తూ,వారి ఆశీర్వాదం పొందవలసి ఉంటుంది. మరియు యజ్ఞ,వేదపఠన,దానధర్మాలు చేయటం - ఇవి జనన, మరణాలను ఆపటానికి సులభసాధనలు-ఇవన్నీ చిత్తశుద్ధికి సాధనలు. శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఇవన్నీ కూడా దేన్ని తెలుసుకోలేవో, అలాంటి తెలుసుకోవటానికి కష్టమైన ఆత్మ స్వరూప సాక్షాత్కారం  గురుకృపతోనే  జరుగుతుంది.  




 సర్వం శ్రీసాయినాధార్పణ మస్తు















Wednesday, November 2, 2016 0 comments By: visalakshi

భయం - భద్రత

మహాభారతంలో బ్రహ్మదేవుడు మృత్యుదేవత మధ్య జరిగిన ఒక సంవాదం ఉంది. చతుర్ముఖుడు మృత్యుదేవతను సృష్టించి జీవుల ప్రాణాలను హరించమన్నప్పుడు ఆమె, 'అమ్మో! ఈ పాపకార్యాన్ని నేను చేయలేను. బంధువులు, సోదరులు, భర్త, భార్య, మిత్రులు చనిపోయినప్పుడు మనిషి విపరీతమైన బాధను అనుభవిస్తాడు. నేను వారి ద్వేషానికి గురవుతాను. అందరూ నన్ను చూసి భయపడతారు ' అంటూ ఏడుస్తూ బ్రహ్మదేవుడితో మొరపెట్టుకుంటుంది. 



బ్రహ్మదేవుడు ఆమె కన్నీళ్ళను చేతిలో ఒడిసిపట్టుకొని, ఈ కన్నీళ్ళు జీవులలో రోగం రూపంలో వ్యక్తమవుతాయి.' ఆత్మానాం వై ప్రాణినోఘ్నంతి 
సర్వే నైతాన్ మృత్యుర్దండపాణిర్హినాస్తి ' జీవులు వాటి మరణాన్ని అవే కొనితెచ్చుకుంటాయి. నీవేమీ దండం పట్టుకొని కార్యాన్ని నిర్వహించవలసిన అవసరం లేదు.అంటాడు. ' అభిధ్యా వై ప్రధమం హంతి లోకాన్ కామక్రోధావనుగృహ్యాశకు పశ్యాత్...-బ్రతుకుపై తీపియే మనిషిని చంపివేస్తుంది. తరువాత కామక్రోధాలు మనిషిని మృత్యువశం చేస్తాయి.జీవిత ప్రయోజనం తెలియకుండా జీవించాలని కోరుకుంటే ప్రమాదంలో పడతాం.ఆ ప్రమాదమే మనిషికి మృత్యువును తెచ్చిపెడుతుంది. జీవిత పరమార్ధం తెలిసి జీవిస్తే మనిషి అమృతత్వాన్ని పొందగలుగుతాడు. మహాభారతంలో సనత్సుజాతుడు మనిషి ఔన్నత్యాన్ని తెలియజెపుతూ ప్రమాదమే మృత్యువని ధృతరాష్థ్రుడికి బోధిస్తాడు..ఈ వివరణ నా సన్నిహితురాలు భారతి "స్మరణ" బ్లాగులో వివరించింది. " సనత్సుజాతీయం  "అనే పేరుతో నాలుగు భాగాలుగా వివరణ ...చదవగలరు.. 





 'అమృతం చైవ మృత్యుశ్చ ద్వయం దేహే ప్రతిష్టితం! మృత్యుమాపద్యతే మోహాత్ సత్యేనాపద్యతే2మృతం.'...అమృతత్వం,మృత్యువు రెండూ దేహాన్ని అంటిపెట్టుకుని ఉన్నాయి.మోహం వలన మృత్యువు సంభవిస్తుంది. సత్యంతో అమృతత్వం సంక్రమిస్తుంది. ..ఇక్కడ మోహం అంటే దేహాభిమానమే ...భగవంతుడిని పొందడానికి మానవదేహం ఒక మహోపకరణం అని తెలిసి కాయాన్ని ధర్మాచరణకు, ఆధ్యాత్మిక సాధనలకు వాడుకున్ననాడు అమృతత్వం సిద్ధిస్తుందని ఋషుల బోధ.



 ప్రతీ మనిషికీ ఏదో భయం. జీవితంలో ఏదో కోల్పోతానన్న భయం. జీవితం-మరణం రెండూ నాణానికి బొమ్మాబొరుసు లాగా కలిసే ఉన్నాయి. కానీ మన విపరీత జీవేచ్చ అవతలి పార్శ్వాన్ని చూడనివ్వడం లేదు. మరణాన్ని స్వాగతించడానికి సిద్ధపడ్డవ్యక్తి మాత్రమే భయవిరహితుడవుతాడు.అతడు మాత్రమే నిజంగా జీవిస్తాడు.ప్రేమస్వరూపుడౌతాడు.శాంతికాముకుడౌతాడు. భయం లేని జీవితమే నిజమైన జీవితం. భయం తొలగినపుడు ఏకాగ్రత సిద్ధిస్తుంది. మనమీద మనకు నమ్మకం ఏర్పడుతుంది. మన సామర్ధ్యం పెంపొందుతుంది. ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది.

  భయం వలననే హింస జనిస్తుంది. తనకు చెందినదేదో నష్టపోతున్నానన్న భావనతో భయం జనిస్తుంది. ఆ భయంతోనే తోటివారిని తనకు శత్రువులుగా చేసికుంటాడు. తాను..తనవి అని భావించిన వానిని రక్షించుకోవాలన్న మిధ్యాజ్ఞానమే మనుషులను కఠినాత్ములుగా మారుస్తుంది.



మానవులందరూ ఒకే జాతి అయినప్పుడు అందరికీ ఒకే ప్రయోజనం ఉంటుంది కదా! మరి మనిషికి ఎందుకు ఈ మాత్రం అర్ధం కావడం లేదు. అందుకే మృత్యువును జ్ఞప్తిలో ఉంచుకోమని, మరణం మన చేతుల్ని ఇదివరకే ఖాళీ చేసిందని గుర్తుంచుకోమని జ్ఞానులు మనకి బోధిస్తారు. ఆ బోధ అర్ధమైనప్పుడు నశ్వరమైన దేహాన్ని శాశ్వతమనుకొని స్వీయ సం రక్షణార్ధం తోటిమానవులను ఇతరులుగా భావించి వ్యక్తి తాను చేస్తున్న హింసను మానుకుంటాడు. జాగరూకతతో వ్యవహరిస్తాడు. దురాశ, క్రోధం మొదలగు అంతర్గత శత్రువులనుండి బయటపడతాడు. జీవన ప్రయాణాన్ని సుగమం చేసుకోగలుగుతాడు. అమృతత్త్వానుభవానికి అర్హుడవుతాడు.

 సర్వం శ్రీసాయినాధార్పణ మస్తు