Monday, November 7, 2016 By: visalakshi

సీతాన్వేషణ - రెండవభాగం

రామలక్ష్మణులు నాలుగు అడుగులు వేసేసరికి కొనప్రాణంతో ఉన్న జటాయువు కనిపించాడు. రావణుడనే రాక్షసుడు సీతను అపహరించి దక్షిణదిశగా పోయాడని చెప్పాడు. రాముడు వచ్చేస్తాడేమోననే భయంతో ఆ రాక్షసుడు సమయం గమనించక తనకు వ్యతిరేక ఫలితం ఇచ్చే ముహుర్తంలో సీతాదేవిని అపహరించాడనీ, ఆ ముహూర్తం పేరు విందం అనీ, ఆ ముహుర్తంలో పోగొట్టుకున్న సొమ్ము యజమానికి త్వరలోనే తిరిగి చేరుతుందనీ చెప్పాడు. సీతమ్మను రక్షించడానికి రావణుణ్ణి ఎదుర్కొని పోరాడి తను గాయపడ్డానని చెప్పి ప్రాణం వదిలాడు. రామలక్ష్మణులు మరోసారి దు:ఖంలో మునిగిపోయారు. తమకోసం దుర్లభమైన ప్రాణాలను తృణప్రాయంగా ఒడ్డి రాక్షసరాజుతో పోరాడిన జటాయువు(పక్షిరాజు) త్యాగానికి చలించిపోయారు. అంతవరకూ భావావేశానికి లోనుకాకుండా ఉన్న లక్ష్మణుడు కూడా దు:ఖం ఆపుకోలేక రోదించాడు. రాముడైతే తన దీనావస్థను తలుచుకుని 'లక్ష్మణా! రాజ్యంభ్రష్ఠం రాజ్యం పోయింది. వనే వాస: వనవాసం చేయవలసి వచ్చింది. పితా మృత: తండ్రిగారు మరణించారు. సీతా నష్టా: సీత అపహరించబడింది...నాకు సహాయం చేయబోయి ఈ పక్షిరాజు ప్రాణం పోగొట్టుకున్నాడు. నేను ముట్టుకుంటే మహాసముద్రాలు ఎండిపోతాయి. నాకంటే దౌర్భాగ్యవంతుడు ఇంకొకడుండడు.' అని విలపించాడు. కొంచెం  తేరుకుని రాముడు జటాయువుకు అంతిమసంస్కారం చేసి స్వర్గానికి పంపాడు.




 రామలక్ష్మణులు మళ్ళీ దక్షిణదిశగా సీతాన్వేషణ చేస్తూ బయల్దేరారు. అరణ్యాలూ, పర్వతాలూ వెదుకుతూ వెడుతున్నారు. ఒక అరణ్యంలో కబంధుడనే రాక్షసుడు వీరిద్దరినీ తలొక చేత్తో పట్టుకున్నాడు. ఆ రాక్షసుడి అసలు పేరు దనువు.  చాలా అందంగా ఉండేవాడు. గొప్ప తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి దీర్ఘాయుర్దాయం వరంగా పొందాడు. వరగర్వంతో భయంకరమైన రూపం ధరించి ఋషుల్ని భయపెట్టేవాడు. ఒకరోజు స్థూలశిరస్కుడు అనే ఋషిని భయపెట్టబోతే ఆ ఋషి కోపించి 'నీకు ఈ రూపమే శాశ్వతంగా ఉండుగాక.' అని శపించాడు. దనువు క్షమించమని ప్రాధేయపడడంతో జాలిపడి, భవిష్యత్తులో దశరధుడి కుమారులు రామలక్ష్మణులు ఈ అడవికి వస్తారనీ, వారి చేతిలో మరణించి శాపమునుంచి బయటపడతాడనీ శాపవిమోచనం చెప్పాడు.

 ఆ తరువాత బలగర్వంతోనూ, వరగర్వంతోనూ ఇంద్రుడిమీద యుద్ధానికి వెళ్ళాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో తలమీద గట్టిగా మోదాడు. ఆ దెబ్బకు రాక్షసుడి తల, తొడలు మొండెంలోకి దిగిపోయాయి. కదలడానికి కాళ్ళు లేకుండా ఆహారం ఎలా సంపాదించుకోవాలి? తినడానికి నోరులేకుండా ఎలా బ్రతకాలి? బ్రహ్మ యిచ్చిన దీర్ఘాయుర్దాయం తీరేదాకా తిండి లేకుండా ఎలా జీవించాలి? అని ఇంద్రుణ్ణి అడిగాడు. ఇంద్రుడు జాలిపడి పొట్టలోనే పదునైన దంతాలున్న నోరు పెట్టాడు. పొడవైన భుజాలు ఇచ్చాడు. ఆ భుజాలతో జంతువులను, పక్షులను పట్టుకుని తిని బ్రతకమన్నాడు. ఈ దు:స్థితినుంచి విముక్తి ప్రసాదించమని దనువు  వేడుకున్నాడు. రామలక్ష్మణులు అతడి బాహువులను ఖండించి   సంహరించాక శాపవిముక్తుడై స్వర్గానికి వెడతాడని ఇంద్రుడు అనుగ్రహించాడు. అప్పటినుంచి దనువుకు కబంధుడు అని పేరు వచ్చింది. 

 "రామలక్ష్మణులు కబంధుడి పట్టునుంచి విడిపించుకుందుకు చాలా ప్రయత్నం చేసారు. కానీ వారికి సాధ్యం కాలేదు. ఆ రాక్షసుడి కోసం చుట్టూ చూసారు. వాడు ఒక పొదలో ముద్దలా కదలకుండా కూర్చున్నాడు. వీరిరువురినీ మెల్లగా మెల్లగా తన నోటి వద్దకు లాక్కుంటున్నాడు. రాముడికి మరల దు:ఖం ముంచుకొచ్చింది. లక్ష్మణా! కష్టం మీద కష్టం ఎలా వచ్చి పడుతోందో...ఒక రాక్షసుడు సీతను అపహరించాడు.ఆమెను వెదుకుతుంటే ఈ రాక్షసుడు పట్టుకున్నాడు. మనకీ కష్టాలేమిటి? కాలం కలిసిరాకపోతే పరాక్రమం, బలం, స్త్రాస్త్రనైపుణ్యం అన్నీ ఇసుకతో కట్టిన అడ్డుకట్ట నీటిప్రవాహంలో కొట్టుకుపోయినట్లు కొరగాకుండాపోతాయి.' అన్నాడు. లక్ష్మణుడు నిర్వేదానికి లోనవకుండా బుద్ధి కేంద్రీకరించి..రామా! వీడి బలమంతా వీడి భుజాలలో ఉంది. మనని తినడానికి మోచేతులు మడిచి పిడికిళ్ళు  నోటివద్దకు లాక్కుంటున్నాడు. కొంచెం సేపుంటే వీడి భుజాలు మనకందుతాయి. భుజాలు నరికితే వీడు మరణిస్తాడు. కదలలేని వాణ్ణి చంపడం వీరులకు మర్యాద కాదు. కానీ వీణ్ణి చంపడానికి మరొక మార్గం లేదు అన్నాడు." 

 రామలక్ష్మణులు కబంధుడి రెండు భుజాలూ ఖండించారు. వారు దశరధపుత్రులని రాక్షసుడు గ్రహించి, తనకు శాపవిమోచనం అయ్యిందని సంతోషించాడు. తన శరీరాన్ని దహనం చేస్తే సీతజాడ కనిపెట్టగలిగినవాడెవరో చెప్తానన్నాడు.  వారు కబంధుణ్ణి ఒక గోతిలోకి తోసి పైన ఎండుకర్రలు వేసి దహనం చేసారు. దనువు దివ్యస్వరూపంతో మంటలనుంచి బయటకు వచ్చి రామా! నీ జీవితంలో ఇప్పుడు కష్టాలు అనుభవించాల్సిన దశ నడుస్తోంది. అందుకే నీకు భార్యావియోగం కలిగింది. ఆపదలు శత్రువుల వలన కలిగినపుడు వాటినుంచి బయటపడడానికి ఆరు ఉపాయాలు ఉన్నాయని శాస్త్రం చెప్తోంది. అవి: సంధి (శత్రువుతో రాజీపడడం), విగ్రహం(విరోధం కొనసాగించడం), యానం(యుద్ధానికి తలపడడం), ఆసనం(అనువైన సమయంకోసం ఓరిమిగా ఎదురుచూడడం), ద్వైధీభావం(శత్రువులలో చీలిక తేవడం), సమాశ్రయణం(ఇంకొకరి సహాయంతో విజయం సాధించడం). పస్థుతం మీరు దుర్ధశాఫలం వలన చాలా హీనస్థితిలో ఉన్నారు. అందువలన మీకు సమాశ్రయణమే తగిన ఉపాయం.  ఇక్కడికి కొద్ది దూరంలో ఋశ్యమూకం అనే పర్వతముంది. దానిమీద సుగ్రీవుడు అనే వానరరాజు తన నలుగురు మంత్రులతో ఉన్నాడు. ఆ సుగ్రీవుడు ఋక్షరజస్సు అనే మహావీరుడి కుమారుడు ఉత్తముడు. ఈతడి అన్నగారు వాలి. ఆ వాలి రాజ్యం కోసం తమ్ముణ్ణి దేశం నుంచి వెళ్ళగొట్టాడు. సుగ్రీవునికి నీ సహాయం కావాలి. నీకు అతడి సహాయం కావాలి. అతడితో స్నేహం చేసి కార్యసిద్ధి పొందు. ఇక్కడినుండి పడమటికి వెళ్తే పంపాసరోవరం పశ్చిమతీరం చేరుకుంటారు. ఇంకొంచెం ముందుకి వెళితే మతంగముని ఆశ్రమప్రాంతం. అక్కడ ఆ మహర్షి శిష్యులు తపస్సు చేసేవారు. వారంతా స్వర్గానికి వెళ్ళిపోయారు. వారికి సపర్యలు చేస్తూ వారితోపాటు తపస్సు చేసిన శబరజాతికి చెందిన ఒక సం న్యాసిని ఆ ఆశ్రమంలో నీకోసం జీవించి ఉంది. ఆమెను అందరూ శబరి అంటారు. నిన్ను చూశాక స్వర్గానికి వెళ్తుంది. రామలక్ష్మణులు దనువుకు వెళ్ళడానికి అనుమతి యిచ్చారు.




 పంపాతీరాన ఉన్న రమ్యమైన ఆశ్రమానికి చేరుకొని మెల్లగా ఆశ్రమం లోపలకు ప్రవేశించి శబరి దగ్గరగా వెళ్ళారు. అప్పుడు సిద్ధురాలైన శబరి రామలక్షమణులను చూడగానే ఆనందభాష్పాలతో నమస్కరించి రామలక్ష్మణ పాదాలను కళ్ళకు అద్దుకుంది. రాముడు ఆ తపస్వినితో ..ఓ తాపసురాలా! నీ తపస్సుకు ఏమీ ఆటంకాలు లేవు కదా..తపస్సులో పురోగతి సాధిస్తున్నావా? కామక్రోధాలన్నిటినీ అదుపులో ఉంచుకుంటున్నావా? నీ గురుసేవలు ఫలించాయా? మశ్శాంతి లభిస్తోందా?...దానికి   శబరి ఓ రామా! ఈనాడు నీ దర్శనం కావటం వల్ల నా తపస్సు సిద్ధించింది. నీ దర్శనంతోనే గురు శుశ్రూషాఫలం కూడా లభించింది. నా తపస్సు ఫలించింది.రామా! నీకు ఆతిధ్యం యివ్వడానికి అరణ్యాలలో దొరికే అనేక పదార్ధాలు సేకరించాను  స్వీకరించు అంది.ఆమె తన ధర్మాన్ని పాటించి ఆహారం సేకరించి పెట్టింది. కానీ ఆమె సేకరించిన ఆహారం గురించి రాముడు పట్టించుకోనేలేదు. నిత్యం జ్ఞానమార్గంలోనే ఉండే శబరితో రాముడు.. దనువు నీ ప్రభావం ఎంతటిదో చెప్పాడు. నువ్వు అంగీకరిస్తే నీ ప్రభావం ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాను...మతంగమహర్షి శిష్యులు శబరికి గురువులు. వారు తపస్సు చేసిన ఆశ్రమం అంతా రాముడికి చూపించింది. వారు వృద్ధులై వణకుతున్న చేతులతో పూజలు చేసిన వేదిక చూపించింది. పదమూడేళ్ళు గడచినా వారు పూజకు ఉపయోగించిన పుష్పాలు వారి తప:ప్రభావం వలన వాడిపోకుండా ఎలా ఉన్నాయో చూపించింది.వారు తడి బట్టలు ఆరవేసుకొనే చెట్లు చూపించింది.ఆ ఆశ్రమంలో ఉన్న ఋషులకు సప్తసాగరాలలో స్నానం చెయ్యాలనిపించింది. కానీ వార్ధక్యం వలన  శరీరాలు  దుర్భలమై కదలడమే కష్టమైపోయేది. వారి కోరిక గ్రహించి సప్తసముద్రాలూ ఆ ఆశ్రమం చేరి వారికోసం సప్తసాగరతీర్ధం ఏర్పరిచాయి. ఆ తీర్ధం చూపించింది.  తన గురువులందరూ, రాముడు   చిత్రకూటంలో ఉండగానే దివ్యవిమానాలలో పుణ్యలోకాలకు వెళ్ళిపోయారని చెప్పింది.. .రామా! గురువు ఆజ్ఞ ప్రకారం నీకోసం పదమూడు సంవత్సరాలు నిరీక్షించాను. నీ దర్శనమైంది. ధన్యురాలినయ్యాను. నువ్వు అనుమతిస్తే యీ శరీరాన్ని విడిచిపెట్టాలనుంది. పూజ్యులైన నా గురువుల సన్నిధికి వెళ్ళిపోతాను అంది. రాముడి అనుమతి తీసుకుని శబరి అగ్నిలో ప్రవేశించింది.ఆ అగ్నినుంచి మరింత తేజోమయమైన అగ్నిశిఖలా  బయకు వచ్చి, స్వర్గానికి వెళ్ళింది. రామలక్ష్మణులు సప్తసాగరతీర్ధంలో స్నానం చేసి యధాశాస్త్రంగా పితృతర్పణాలు యిచ్చారు.


  మతంగాశ్రమం దర్శించాక వారి మనసుల్లో ఏదో నూతనోత్సాహం వచ్చింది. నిరాశా, ఆందోళనా తొలగిపోయాయి. అశుభం అంతమైంది.' ఏదో గొప్ప శుభం కలగబోతోంది అని మనస్సుకు తెలుస్తోంది..లక్ష్మణా!' అన్నాడు రాముడు.....

సీతమ్మ జీవుడు. రాముడు పరమాత్మ.  ఈ జీవుణ్ణి పరమాత్మతో కలిపే ఆచార్యుడు హనుమంతుడు.....ఎలా అన్నది తదుపరిభాగంలో.....


   
సర్వం శ్రీ సాయిరామార్పణ మస్తు








0 comments: