Sunday, November 13, 2016 By: visalakshi

కృపా ప్రసాదం

 సాయి సత్యచరిత్ర పంతొమ్మిదవ అధ్యాయములో హేమాడ్ పంత్ పై బాబాగారు కురిపించిన కృపా ప్రసాదం.

 శ్లో" యే యధా మాం ప్రపద్యంతే తాం స్తధైవ భజా మ్యహం
       మమ వర్త్మానువర్తంతే మనుష్యా: పార్ధ సర్వశ:  (4వ అ...11వశ్లో)  

 భా:- ఓ పృధాకుమారా! మానవులెట్లు నన్ను శరణుపొందుదురో, అట్లే వారికి ఫలము లొసంగుచుందును. మానవులు అన్ని విధముల నామార్గమునే అనుసరింతురు. 



జ్ఞానమార్గం అన్నింటిలోనూ శ్రేష్టమార్గం అని బాబా ఉపదేశం చేసినప్పటికీ ఆయన సర్వసాధారణంగా భక్తిమార్గాన్నే అవలంబించమని చెప్పేవారు. జ్ఞానమార్గం మహిమ చెప్తున్నప్పుడు ఆయన ఇలా అనేవారు. 'జ్ఞానమార్గం రామాఫలం లాంటిది. భక్తిమార్గం అంటే సీతాఫలాన్ని ఆస్వాదించటమే అవుతుంది. దాన్ని సహజంగా సాధించగలం.అది ఎంతో రుచిగా, మధురంగా ఉంటుంది. జ్ఞానం అంటే బాగా పండిన రామాఫలం. భక్తి అంటే మధురమైన సీతాఫలం . రెండూ రసంతో నిండి ఒకదానికన్నా మరొకటి మధురంగా ఉంటాయి. సుగంధం కూడా రెండింటిదీ ఒకేలా ఉంటుంది. రామాఫలాన్ని చెట్టుమీదే పండించిన ఫలాలే మాధుర్యంగా ఉంటాయి. సీతాఫలం అలా కష్టపడనవసరం లేదు. చెట్టునుండి కోసి పండించవచ్చు. రామాఫలానికి భూమ్మీద రాలిపడే భీతి ఉంటుంది. అదేవిధంగా జ్ఞానమార్గం అవలంబించే వారికి నిర్భయత్వం ఉండదు. వారు అణిమ, మహిమ వగైరా అష్టసిద్ధులమీద విజయం పొందవలసి ఉంటుంది. వాళ్ళు ఏమాత్రమూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. కనుక శ్రీసాయి తమ శిష్యులకు సామాన్యంగా భక్తి, నామస్మరణల గురించే చెప్పేవారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జనునికి జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమని చెప్పాడు. "జ్ఞానం కంటే ధ్యానం గొప్పది." కానీ దానికోసం యదార్ధజ్ఞానం కావాలి. ఆత్మ గురించిన చక్కటి అనుభవజన్య జ్ఞానమే జ్ఞానానికి మూలం. దీన్నే అంతర్యామి ఆత్మానుష్ఠానం అంటారు.

 విశేష ప్రమాణం లేకుండా అంటే స్థితి లేకుండా ఉండేదాన్ని ధ్యానంలోకి ఎలా తీసుకురావాలి? అయితే అంతర్యామి ఆత్మే ఈశ్వరుడు. ఈశ్వరుడే గురువు. ముగ్గురి మధ్యా అణువంతైనా భేదం లేదు. మళ్ళీ మళ్ళీ చింతన చక్కగా పూర్తిగా అయి ధ్యాత, ధ్యానం రెండూ కలిసిపోతే ఏ విధమైన గాలి లేనప్పుడు స్థిరంగా ఉండే దీపంలా చిత్తానికి శాంతి కలుగుతుంది. దాన్నే సమాధి అంటారు. సర్వ ఇచ్చలూ, ఆకాంక్షల నుంచి పూర్తిగా ముక్తులైనవారే సర్వప్రాణుల అంతర్యామి అని తెలుసుకుని తాము తప్ప జగత్తులో అన్యులెవరూ లేరని తెలుసుకుని ఎవరి గురించీ, ఎలాంటి భీతిలేని స్థితి ప్రాప్తిస్తే దాన్ని ధ్యానమంటారు. అప్పుడు కర్మ బంధనాలతో సంబంధం వెంటనే తెగిపోతుంది. విధినిషేధాల నిర్బంధం విడిపోతుంది. ముక్తి అనే ఆనందం లభిస్తుంది.  సాయిబాబా స్వతహాగా సంపూర్ణ అనుభవజ్ఞానానికి నిధి. సాయి స్వరూప జ్ఞానాన్ని యధాతధంగా తెలుసుకోవటమే ఆయన ధ్యానాన్ని అనుష్టించడం, దర్శించటం అవుతుంది. అవిద్య, కామము, కర్మ - ఈ బంధనాలనుంచి సంపూర్ణంగా విడివడటానికి మరో సాధన లేదు.పరమార్ధం లభించినవారు కృతార్ధులు.. 



ఇప్పుడు నాకు అనుభవాన్నిచ్చిన సాయిబాబా  స్వభావం  గురించిన ఒక కధను వినండి...భక్తులు బాబాకి అనన్యంగా శరణు వెళ్తే వారికి భక్తి యొక్క గొప్పతనం అనుభవంలోకి వస్తుంది. అది శిరిడీ లాంటి పవిత్రస్థానం. ఆ రోజు గురువారంలాంటి శుభప్రదమైన రోజు. ఆ రోజంతా రామనామాన్ని అఖండంగా జపించాలని నాకనిపించింది. బుధవారం రాత్రి పక్కమీద శరీరం నిద్రలోకి జారే వరకు నా మనసు శ్రీరామప్రభు చింతనలో మునిగింది. ప్రాత:కాలం మేలుకోగానే మనసుకి రామనామం గుర్తొచ్చింది. అలాంటి భావన లో ఆనందాతిశయంతో మనసుని స్థిరం చేసుకొని, శౌచము, ముఖప్రక్షాళనము పూర్తిచేసి దొరికిన పూలను తీసుకొని సాయిబాబా ప్రాత:కాల దర్శనానికి బయలుదేరాను. దీక్షిత్ ఇంటి బయటకొచ్చి, బూటీవాడాని దాటినప్పుడు ఔరంగాబాద్కర్ మధురంగా ఓ అందమైన గీతాన్ని ఇలా పాడటం వినిపించింది.

 పదం:  గురుకృపాంజన పాయో మేరీ భాయి! రాం బినా కచు మానత్ నాహి!!
            అందర్ రామ బాహర్ రామ! జహదేఖే వహా పూరన్ రామ!!       1
            జాగత్ రమ సోవతరామ! సపనే మే దేఖత్ సీతారామ!!             2
           ఏకాజనార్ధనీ అనుభవ నీకా! జహాదేఖే వహరామ సరీఖా!!           3  

 ఓ సోదరా! గురుకృప అంజనం అంటే అంటే కళ్ళకి పెట్టుకొనే కాటుక. దానివల్ల దృష్టి సరి అవుతుంది. అది నాకు లభించింది.ఇప్పుడు నేను రాముణ్ణి తప్ప వేరెవవరినీ అంగీకరించను. సర్వం రాముడే కనిపిస్తున్నాడు. రామనామాన్ని చిత్తంలో పెట్టుకోవాలనుకున్నాను. ఆ నిశ్చయాన్ని ప్రారంభించకముందే ఆ గీతంతో అది దృఢతరమయింది. దానివల్ల మనసుకి జ్ఞానం కలిగింది. నా నిశ్చయమనే అంకురాలపై దయాసాగరులైన సాయిసమర్ధులు ఈ గీతమనే నీటిని చిలకరించారు. బాబా ఎదుట ఆ ప్రాంగణంలో ఔరంగాబాద్ కర్ పాడిన ఈ పాట నేను మైమరచి విన్నాను. అతనికి అనేక గీతాలు వచ్చు. అయినా అప్పుడతనికి ఈ గీతమే పాడాలని అనిపించటమేమిటి? నా మనసులోని ఆలోచనను తెలుసుకున్నట్లు...బాబా తమ సూత్రాన్ని ఎలా కదిలిస్తారో అలాగే మనసుకి స్పురణ కలుగుతుంది. మనమంతా తోలుబొమ్మలం. సాయి జనని సూత్రధారి. ఆయన ఏమీ మాట్లాడకుండానే చక్కని ఉపాసనను నాకు ప్రసాదించారు. నా మనసులోని కోరిక బాబా అంత:కరణలో ప్రతిబింబించింది. 



సమర్ధరామదాసు అంటారు "ఈ రాఘవుని నామం ఎంత అందమైనది. సంసారమూలాన్ని నిర్మూలిస్తుంది. జీవులకి ఇదే కైవల్యసాధనం."సంతతుకోబా ఇలా అంటారు"రామనామంతో నేను కృతార్ధుణ్ణయ్యాను. నామం ఉచ్చరించడానికి ఏమీ ఖర్చుకాదు. నామ మంత్రం కష్టం కాదు. అది కేవలం రెండక్షరాలు మాత్రమే. రామ రామ అని ఉచ్చరించండి.సంత్ తులసీదాస్ ఇలా అంటారు "రామనామం ఎంతో ప్రభావాన్ని చూపిస్తుందని సత్పురుషులు, పురాణాలు, ఉపనిషత్తులు గానం చేశాయి. జ్ఞానగుణరాశి అయిన శివుడు సతతము దీన్ని జపిస్తాడు. రామరక్షాస్తోత్రంలో శంకరుడు పార్వతికి రామనామ మహత్వాన్ని చెప్తూ విష్ణువు యొక్క వెయ్యినామాలు ఒక్క రామనామంతో సమానమని" అన్నాడు. "శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే" ఈ నామం వల్ల స్వరూపం ప్రాప్తిస్తుంది. 

ఒక్క రామనామం స్మరణతో లెక్కలేనన్ని లాభాలు చేకూరుతాయి. రామనామ గర్జన ఉన్నచోట విష్ణువు సుదర్శన చక్రం తిరుగుతుంది. దీనులను రక్షించేది ఈ రామనామమే. నేను ఈ అనుభవాన్ని పొందినప్పుడు నా మనసుకి శాంతి, అంత:కరణలో ఆశ్చర్యముతో కూడిన పారవశ్యము కలిగాయి. శ్రీ సాయినాధ్ గురుమహారాజ్ కీ జై.....

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు    















  


0 comments: