Monday, November 14, 2016 By: visalakshi

పంచమహాయజ్ఞాలు

 శ్రీబాబా బాల్యం నుంచి సర్వస్వాన్నీ త్యాగం చేసిన బ్రహ్మచారి. కనుక భిక్ష చేయటం ఆయనకి ఎంతో యోగ్యం. విశ్వమంతా నా యిల్లు. నేనే వాసుదేవుణ్ణి, విశ్వంభరుణ్ణి. నేనే అవినాశి పరబ్రహ్మని అన్న ప్రజ్ఞ ఉండి, మనసులో దృఢనిశ్చయం ఉన్నవారికి, విశ్వమే తన కుటుంబం అని తెలిసినవారికి బిక్షాన్నం మీద పూర్ణ అధికారం ఉంటుంది. 

శ్లో" ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితా:
    తై ర్దత్తా న ప్రదాయైభ్యో యో భుజ్కే స్తేన ఏవ స:  ( 3వ అ..12శ్లో)

భా:- వివిధజీవితావశ్యకముల నిచ్చు కార్యమున నియుక్తులైన దేవతలు యజ్ఞాచరణముచే తృప్తులై మీ కావశ్యకవస్తువు లన్నింటి నిత్తురు; కాని దేవతలిచ్చు వస్తువులను మరల వారి కీయకుండ ననుభవించువాడు. నిజంగా దొంగయే అగును.




అయిదురకాల మహాయజ్ఞాలు ..బ్రహ్మయజ్ఞం అంటే వేద పురాణ పఠనం, మానవులందరు పరమ పురుషార్ధ సాధనకు, వైదిక నిత్యకర్మలను ఆచరిస్తూ, నిత్యం, ప్రాత:సాయం సంధ్యా సమయాలలో సంధ్యావందనం చేయాలి. స్త్రీ,పురుషభేదం, వర్గ వర్గ తారతమ్యం లేకుండా బ్రహ్మయజ్ఞం చేయాలి. పరమాత్మను ప్రార్ధించాలి. ప్రకాశం-అంధకారం ఈ రెండింటి సమ్యోగ సమయమే సంధ్యాకాలం. అప్పుడు చేసే ధ్యానక్రియ "సంధ్య" అనబడుతుంది. 'సం 'అంటే చక్కగా 'ధ్య ' అంటే ధ్యానం చేయడం 'సంధ్య ' అంటే సృష్టికర్త ఐన పరాత్పరుని ధ్యానించడమని అర్ధం. బ్రహ్మయజ్ఞంలో నమస్కారమంత్రంతో సుఖదాతా, సుఖకరుడు, మంగళస్వరూపుడైన పరమాత్మకు భక్తితో నమస్కరిస్తూ ఉపాసకుడు సంధ్యావందనాన్ని సమాప్తం చేయాలి. దేవయజ్ఞమంటే స్వాహాకారాలతో దేవతలకు ఆహుతి ఇవ్వటం,  అగ్నిహోత్రంలో హోమంకై సుఘందయుక్తములైన కస్తూరి, కుంకుమపువ్వు మొదలైనవి,.. తియ్యని మధుర పదార్ధాలు బెల్లం, తేనె, మిష్టాన్నాలు..పుష్టిని కలిగించే పదార్ధాలు నేయి, పాలు, ధాన్యాలు...రోగనాశకాలు సోమలతాది ఓషధులు,మొదలైన వస్తువులను అగ్నిలో వేసి హోమం చేయాలి. సర్వవ్యాపకుడై అంతటా ఓతప్రోతంగా నిండియున్న ఆ పరమాత్మ ప్రతినిత్యం మనం చేసే యజ్ఞంలో స్థితమై ఉన్నాడు. పితృయజ్ఞం అంటే స్వాధాకారాలతో పితరులకి ఆహుతి ఇవ్వటం, వృద్ధాప్యంలో పెద్దలు జీవించి ఉన్నప్పుడే శ్రద్ధతో ఆదరించి, వారి ఆజ్ఞలను పాలించి, వారికి తృప్తిని సంతోషాన్ని కలిగించాలి. పెద్దల పేరుమీద ప్రజలకు హితాన్ని కలిగించే పనిచేయాలి. ఋషులు నిష్పక్షపాతంగా వివరించిన పితృయజ్ఞంలో పెద్దలను పూజించి, సేవించి వారిమాటలకు విలువనిచ్చి వారి ఆదేశాలను మన్నించాలని ఉంది. భూతయజ్ఞం అంటే భూతాలకు బలిదానాలు, క్రిమి - కీటకాలకోసం, పశుపక్షులకోసం ముద్ద తీసి పెట్టటం, మనుష్యయజ్ఞం అంటే అతిధులకి భోజనం పెట్టటం లాంటి యజ్ఞాలు చేయని  గృహస్థాశ్రమ మానవుల నింద్య(శాస్త్రాలచే నిషేధించబడ్డ) భోజనాన్ని శిరిడీలో సాయిబాబా స్వయంగా పవిత్రం చేయించేవారు. ఆయన ప్రతిరోజూ అయిదిళ్ళలో భిక్షకు పోయి వారికి అతిధి యజ్ఞాన్ని గుర్తు చేస్తుండేవారు. ఆ ప్రకారంగా ఆ అదృష్టవంతులైన గృహస్థులు తమ ఇళ్ళలో కూర్చునే ఆ లాభాన్ని పొందారు. ఆ అయిదు మహాయజ్ఞాలు చేసాక మిగిలిన అన్నాన్ని తినేవారి 'పంచసూన ' మనే పేరుగల ప్రసిద్ధిచెందిన, తెలీకపోవటంవల్ల సంభవించే, తెలుసుకోవటానికి కఠినమైన పాపాలు నశించిపోతాయి. కండణీ(రోట్లో వేసి దంచటం), చుల్లీ(పొయ్యంటించటం), పేషణీ(తిరగలిలో వేసి విసరటం), ఉదకుంభీ(నీరునింపటం), మార్జనీ (పేడతో అలకటం)అనే ఈ అయిదు పాతకాలు 'పంచసూన 'మనే పేరుతో ప్రసిద్ధి చెందాయి. ఈ అయిదు రకాల  పాతకాల వలన అనేక జీవక్రిముల హత్య జరుగుతుంది. వీటినుంచి ముక్తులవటానికి గృహస్థులు పంచమహాయజ్ఞాలు విధిపూర్వకంగా ఆచరిస్తే ఆ 'పంచసూన ' పాతకాలు క్షయమౌతాయి. గృహస్థులకి చిత్తశుద్ధి లభిస్తుంది. 



 అయితే ఈ రోజుల్లో అన్ని సదుపాయాలతో పాటు కాలమానాన్ననుసరించి పరిస్థితులలోనూ, జీవనవిధానంలోనూ అనేక మార్పులొచ్చాయి. అయినా మనకి తెలియకుండా లేదా అనివార్యంగా సంభవించే పాపాలను పరిహరించుకోవాలి అన్న శ్రద్ధ ఉన్నవారు యోగ్యమైన మార్పులతో ఈ రోజుకీ ఆచరణలో పెట్టుకోవటం సాధ్యమే. ఉదాహరణకి... బ్రహ్మయజ్ఞమంటే పురాణగ్రంధాలు చదవటం, దేవయజ్ఞం,పితృయజ్ఞం, భూతయజ్ఞం వీటిలో అగ్నికి ఆహుతి ఇవ్వటం మనకు సాధ్యం కాదు. అయితే దేవతలకు చక్కెర నైవేద్యం, మరణించిన తల్లిదండ్రులకు వారి పుణ్యతిధుల రోజును గుర్తు    పెట్టుకొని పేదవారికి అన్నదానం చేయటం,కుక్కలు,పిల్లులు, పిచ్చుకలకి అవకాశం వచ్చినప్పుడు రొట్టెముక్క పెట్టటం సాధ్యమే. మనుష్యయజ్ఞం అంటే అతిధులకి భోజనం పెట్టటం ..ఈ రోజుల్లోనూ మన దగ్గరకి కూడా ఎవరో అతిధులు అనుకోకుండా వస్తారు. అలాంటి సందర్భంలో ఆనందంతో, ప్రేమతో వారికి భోజనం పెట్టి తృప్తిపరచటం ..అదే మనుష్యయజ్ఞం. అతిధిదేవోభవ అని అందుకే అంటారు. ఈ విధులన్నిటి వెనుకా ఉండే మూలతత్వమంటే సాయిబాబా 24వ అధ్యాయంలో అణ్ణాసాహెబ్ కి శనగల గురించి ఆతన్ని హాస్యం పట్టించి"ఒంటరిగా తినటం మంచిది కాదు" అని చేసిన ఉపదేశమే. తమ అదృష్టంతో ఏది ప్రాప్తిస్తుందో అందులో కొద్దిభాగం పరమేశ్వరుడికి లేదా ఇతరులకి, పశుపక్షులకి ఇవ్వాలి. అప్పుడే మనం తినాలి లేదా అనుభవించాలి.  



 పంచయజ్ఞాల ముఖ్యతత్వం తెలుసుకొని ఆ ప్రకారంగా కాలానుగుణంగా తమ ఆచరణ పెట్టుకోవాలి. అప్పుడే మనకు శ్రేయస్సు కలుగుతుంది. మనసుకి శాంతి లభిస్తుంది.

సర్వం శ్రీసాయినాధార్పణ మస్తు. 





0 comments: