Wednesday, November 9, 2016 By: Vedasree

సీతాన్వేషణ -నాలుగవభాగం

 వర్షాకాలం గడిచిపోయింది. శరదృతువు ప్రారంభమైంది. వర్షాలు తగ్గి నేల గట్టి పడింది. సుగ్రీవుడు శరదృతువు ప్రారంభం కాగానే సీతను వెదకడానికి ఏర్పాట్లు చెయ్యాలి. కానీ అతడి జాడ లేదు. అంత:పురంలో భార్యలతో శృంగారజీవితం సాగిస్తూ తనమాట మర్చిపోయాడు - అనిపించింది రాముడికి.  తమ్ముడిని పిలిచాడు. 

 లక్ష్మణా! సీతాన్వేషణ చేస్తానని మాటయిచ్చి సుగ్రీవుడు తనపని పూర్తికావడంతో నన్ను ఉపేక్షిస్తున్నాడు. మనమిక్కడ దు:ఖంలో పడి కొట్టుకుంటూ క్షణమొక యుగంలా గడుపుతుంటే అతడక్కడ రాజభోగాల్లో మునిగి తేలుతూ మనని మర్చిపోయాడు. సుగ్రీవుడు యిప్పుడు రాజయ్యాడు. నేను రాజ్యం పోగొట్టుకొని ఉన్నాను. ఆ వానరుడు భార్యను చేరి ఆనందిస్తున్నాడు. నేను భార్యావియోగంతో దు:ఖిస్తున్నాను. అతడి దృష్టిలో నేను అనాధుణ్ణి, రాజ్యభ్రష్టుణ్ణి . ఇల్లూ వాకిలీ లేకుండా తిరుగుతున్న వాణ్ణి. రావణుడి చేతిలో అవమానం పొందినవాణ్ణి. అతని సహాయం మీద ఆధారపడిన వాణ్ణి. ఇలా అనుకుని నన్ను చులకన చేసి అవమానిస్తున్నాడు. వెంటనే కిష్కింధకు వెళ్ళు. స్త్రీ సాంగత్యంలో మననీ, మనపట్ల కర్తవ్యాన్నీ మర్చిపోయిన ఆ మూర్ఖుడికి నా మాట చెప్పు.

 'తమ పనులు మిత్రులచేత చేయించుకుని, ఆ మిత్రుల పనికి ఉపయోగపడని వాడిని కృతఘ్నుడంటారు. యుద్ధంలో నేను చేసే ధనుష్టంకారం వినాలనుకుంటున్నావేమో! ఆ పని చెయ్యకు. మన మధ్య ఒప్పందం ఒకటుంది. దానిమీద నిలబడు. వాలిని అనుసరించి వెళ్ళేందుకు ప్రయత్నించకు. నేను సత్యాన్నీ, ధర్మాన్నీ రక్షిస్తానని ప్రతిజ్ఞ చేసాను. ధర్మాన్ని అతిక్రమించినందుకు వాలిని చంపాను. ఇప్పుడు నువ్వు సత్యాన్ని అతిక్రమిస్తే నిన్నే కాదు, నీ బంధువర్గాన్నంతటిని   చంపుతాను. క్షణికమైన సుఖాలలో పడి కొట్టుకుపోకు. శాశ్వతమైన ధర్మాన్ని గమనించు. ఇచ్చిన మాట నిలబెట్టుకో. ' లక్ష్మణా ఈ మాటలు సుగ్రీవుడికి చెప్పు అన్నాడు. 

సీతను వెదకడం నాలుగునెలల తరువాత ప్రారంభిద్దామని రాముడు చెప్తే దానిని సాకుగా తీసుకుని నాలుగు నెలలుగా సుగ్రీవుడు ప్రస్రవణ పర్వతం వైపు కనీసం తొంగి చూడలేదు. అసలు తమ ఉనికినే గుర్తించనట్లు ప్రవర్తించాడు. లక్ష్మణుడికి కోపం వస్తోంది..కానీ కోపం ఇన్నాళ్ళూ అణిచి పెట్టుకున్నాడు. ఇప్పుడు రాముడు ఒక మార్గం చూపించాడు. అంతే! అగ్నిపర్వతం బద్దలైంది. రామా! ఈ సుగ్రీవుడు మంచీ చెడూ తెలియని అవివేకి. ఇటువంటి వాడికి రాజ్యం ఇవ్వకూడదు. వీడు వానరరాజ్యం అనుభవించే హక్కు పోగొట్టుకున్నాడు.నీ అనుగ్రహంతో ఇంత వైభవం పొంది ఉపకారం చెయ్యాలని మర్చిపోయాడు. ఇక ఈ కోపాన్ని అణుచుకోలేను. సుగ్రీవణ్ణి ఇపుడే వధిస్తాను. వాలి పుత్రుడైన అంగదుడు సీతమ్మను వెదుకుతాడు.అంటూ ధనుస్సు అందుకున్నాడు. రాముడు లక్ష్మణుణ్ణి ఇలా అనునయించాడు.

 లక్ష్మణా! మనం సుగ్రీవుడితో స్నేహం చేసాం. ఒకరికొకరు సాయం చేసుకోవాలని ఒప్పందం చేసుకున్నాం. అతడు మంచివాడని నమ్మాం. దనువు కూడా చాలా మంచివాడని చెప్పాడు. సీతాన్వేషణకు ఇతడే మనకు ఆధారం. ఎంత వీరుడైనా కోపాన్ని అణుచుకుంటేనే పురుషశ్రేష్ఠుడౌతాడు. చెప్పిన సమయానికి స్పందించకపోవడం సుగ్రీవుడు చేసిన తప్పు. దానికోసం పరుషంగా మాట్లాడకుడదు. అతడితో మంచిగా మాట్లాడి పని సాధించుకురా. అన్నాడు. కోపం తీవ్రత తగ్గినా కోపం తగ్గలేదు. చక్కటి సుగమమైన కాలిబాట ఉన్నా, దుర్గమమైన దగ్గర దారిలో నడుస్తూ సుగ్రీవుని తలచుకొని కోపంతో చెట్లకొమ్మలు విరిచేస్తున్నాడు.. చేతికందిన బండరాళ్ళను బంతుల్లా విసిరేస్తూ..కిష్కింధకు చేరాడు.

 వానరవీరులు లక్ష్మణుడు దగ్గరకు సమీపిస్తుంటే అతణ్ణి గుర్తించారు. ఆతని రౌద్రరూపం చూసి సుగ్రీవుడి వద్దకు వెళ్ళి లక్ష్మణుడు కోపంతో మండిపడుతూ వస్తున్నాడని చెప్పారు.  సుగ్రీవుడు మద్యం మత్తులో అందమైన స్త్రీలమధ్య ఉన్నాడు. అతడికి వానరుల మాటలు వినబడలేదు. తాను వచ్చినా సుగ్రీవుడినుంచి స్పందన లేకపోవడంతో లక్ష్మణుడికి కోపం మరింత పెరిగింది. ఈలోగా అతడికి అంగదుడు కనిపించాడు. కోపాన్ని అదుపు చేసుకుని శాంతంగా, 'నాయనా! అన్నగారి దు:ఖం చూడలేక లక్ష్మణుడు వచ్చాడు.నీ నగరద్వారం ముందు నిలుచున్నాడు- అని సుగ్రీవునికి చెప్పు.' అన్నాడు. సుగ్రీవుడికి అంగదుడి మాటలూ వినబడలేదు. అంతలో లక్ష్మణుడు రాజప్రసాదం సమీపించాడు.అతణ్ణి ప్రసన్నం చేసుకుందుకు అనేకవేలమంది వానరవీరులు   సింహనాదాలు చేసారు. ఆ కోలాహలానికి సుగ్రీవుడికి కొంత మత్తు వదిలింది. అంగదుడి వెనుక అంత:పురంలోకి చనువుగా రాగలిగిన మంత్రులు ప్లక్షుడూ, ప్రభావుడూ, హనుమంతుడూ వచ్చారు. వారు లక్ష్మణుడు తీవ్రమైన కోపంతో ధనుస్సు ధరించి రాజభవనం ముందు నిల్చున్నాడని చెప్పారు. హనుమంతుడు సుగ్రీవునికి కర్తవ్యం బోధిస్తాడు. ఓ వానరరాజా! నీవు మనస్సులో కూడా రామలక్ష్మణుల ఆజ్ఞలను నిర్లక్ష్యం చేయకూడదు. రాముడి బలం ఏమిటో నువ్వే చూసావు. ఇక అతడి వద్ద ఉన్న దివ్యాస్త్రాల గూర్చి నీవు ఊహించనైనా ఊహించలేవు సుమా !
 సుగ్రీవుని వద్దకు వెళ్ళిన అంగదుడు లక్ష్మణుని వద్దకు వచ్చి సాదరంగా లోనికి రమ్మని ఆహ్వానించాడు. లక్ష్మణుడు అన్నీ దాటుకుంటూ అంత:పురంలోకి ప్రవేశించాడు. ధనిష్ఠంకారానికి సుగ్రీవుడు ఉలిక్కిపడి, ఎదుటపడడానికి భయపడి..తారను పంపాడు. తార లక్ష్మణుని నీ కోపానికి కారణమేమిటని ప్రశ్నించింది. సుగ్రీవుడు ప్రత్యుపకారాన్ని మరచి కాలాయాపన చేస్తున్నాడు. .అనగా..  నాయనా! నీవు ఉత్తముడవు నా మాట నమ్ము. సుగ్రీవుడు కామ కలాపాల్లో మునిగి ఉన్నా మీ విషయంలో ఏమరి లేడు. కార్యసాధనకు అవసరమయ్యే ప్రయత్నాలన్నీ ముమ్మరంగా చేస్తున్నాడు. నీవు పరస్త్రీలు ఉన్నారని బిడియపడుతూ ఇక్కడే నిలబడిపోయావు నీవు సదాచారవంతుడవు.  కానీ మిత్రుల భార్యలను చూడటంలో కానీ, మాట్లాడడంలో గానీ దోషం ఏమీ లేదు. అందువల్ల లోపలికి రా! సుగ్రీవుణ్ణి చూడు. అతడితో మాట్లాడు. కోపంతో ఎరుపెక్కి ఉన్న కళ్ళతో లక్ష్మణుడు ...లోపలికి ప్రవేశించాడు. బంగారు ఆసనంపై కూర్చొని ఉన్న సుగ్రీవుడు విశాలనేత్రుడైన లక్ష్మణుని చూశాడు.  ఎదురు వచ్చి చేతులు జోడించి నిలబడ్డాడు. అతడి వెనుక రుమ ఇతర స్త్రీలు నిలబడ్డారు. అతడి వేషాన్ని చూడగానే అంతవరకు అణుచుకున్న కోపం తన్నుకొచ్చింది లక్ష్మణుడికి. 

 సుగ్రీవా! ఉపకారం చేసిన మిత్రులకు సహాయం చేస్తానని మాట యిచ్చి,ఆ మాట నిలబెట్టుకోని రాజుకంటే క్రూరుడు యీ లోకలో ఉండడు.ముఖం చాటేసేవాడిని కృతఘ్నుడంటారు. ప్రత్యుపకారం చేస్తానని రాముడి ముందు ప్రతిజ్ఞ చేసావు. కానీ ఏమీ చెయ్యలేదు..వాలి మార్గంలో వెళ్ళాలని ప్రయత్నించకు. రాముని గుర్తు తెచ్చుకో ఉత్తరక్షణంలో వాలిని చేరుకుంటావు అన్నాడు. పిడుగుల్లాంటి ఆ మాటలకు సుగ్రీవుని నోట మాట లేదు. తార కలగజేసుకొని, కొండగుహల్లో గడిపినవాడికి గొప్ప సుఖం దొరకడంతో కాలగమనం మర్చిపోయాడు. సుగ్రీవుడు రాముడికి ప్రత్యుపకారం చెయ్యాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. సుగ్రీవుడికోసం నిన్ను ప్రార్ధిస్తున్నాను.వేడుకుంటున్నాను.కోపంవదిలిపెట్టు.అంది.  సుగ్రీవుడు కుడా చేతులు జోడించి వినయపూర్వకంగా రాముడి అనుగ్రహంతో రాజ్య లభించింది. ఇంతటి ఉపకారానికి ఎంత చేసినా ప్రత్యుపకారం అవదు. రాముడు సీతను తన బలపరాక్రమాల చేతనే పొందగలడు. నేను చేసే సహాయం కేవలం నామమాత్రమే. నా వలన ఏదైనా పొరపాటు జరిగితే నన్ను మన్నించాలి.అన్నాడు.  సుగ్రీవుడి మాటలు విన్న లక్ష్మణుడికి కోపం పూర్తిగా పోయింది. ప్రేమగా నువ్వు సహాయంగా ఉంటే రాముడికి అంతా మేలే జరుగుతుంది. నీ ప్రభావం గొప్పది. నువ్వు వెంటనే బయల్దేరు. దు:ఖిస్తున్న నీ మిత్రుణ్ణి ఓదార్చు. నాలుగు నెలలుగా రాముడు అనుభవిస్తున్న దు:ఖాన్ని చూసి తట్టుకోలేక ఇంతకు ముందు పరుషంగా మాట్లాడాను. 'క్షమస్వ సఖే మమ ' నన్ను క్షమించు. ఇదీ లక్ష్మణుడి ఔదార్యం. సుగ్రీవుడూ, లక్ష్మణుడూ రాముడున్న గుహకు వచ్చారు. వారివెంట కోట్లమంది వానరులు వచ్చారు. సుగ్రీవుడు రాముణ్ణి చుడగానే చేతులు జోడించి నమస్కరించాడు. సమీపించి సాష్టాంగ నమస్కారం చేసాడు. రాముడు వానరరాజును లేవనెత్తి ప్రేమగా కౌగలించుకుని తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు.అతడి పట్ల చూపవలసిన గౌరవమంతా చూపించి, మెత్తగా హితబోధ చేసాడు.రాజు మిత్రులను సంపాదించాలి. శత్రువులను ఎదుర్కోవాలి. ఇప్పుడు శత్రువుని ఎదుర్కొనే సమయం వచ్చింది. సీతజాడ ఎలా తెలుసుకోవాలో నీ మంత్రులతో ఆలోచించి తగిన ఏర్పాట్లు చెయ్యి అన్నాడు. సుగ్రీవుడు ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా ఎవరేం చెయ్యాలో చెప్పాడు. వినతుడనే వానరరాజుని లక్షమంది వానరవీరులతో తూర్పు దిక్కున వెదకమన్నాడు. అంగదుడి నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు, నీలుడు, గజుడు, గవయుడు,గవాక్షుడు, మైందద్వివిదులు మొదలైన మహావీరులతో ఒక గొప్ప సైన్యాన్ని దక్షిణదిశలో వెదకమన్నాడు. శతబలి అనే వీరుడి నాయకత్వంలో గొప్ప సైన్యాన్ని ఉత్తర దిశకు పంపాడు. వారు ఒక్కొక్కరూ వెదకవలసిన ప్రదేశాలు వివరంగా చెప్పాడు. వెదకడం పూర్తి చేసి వెనక్కి రావడానికి అందరికీ ఒక్క నెల గడువు ఇచ్చాడు. గడువు దాటి వచ్చేవారికి దండన మరణశిక్షే అని హెచ్చరించాడు.అందరికీ అన్నీ చెప్పి హనుమంతుని పిలిచాడు. 

 "హనుమా! నీకు భూమిమీద గానీ, ఆకాశంలో గానీ, నీటిలో గానీ కోరినట్లు సంచరించే శక్తి ఉంది. నీ తండ్రి వాయుదేవుడితో సమానమైన వేగముంది. తెలివిలోనూ, బలంలోనూ నీకు నువ్వే సాటి. సీతాన్వేషణలో నీదే కీలకమైన బాధ్యత "అన్నాడు. సుగ్రీవుడు హనుమంతుడితో చెప్పన మాటలు రాముడు విన్నాడు. అతడే సీతజాడ తెలుసుకోగలడనుకున్నాడు. వెంటనే తన పేరు చెక్కిన ఉంగరాన్ని హనుమంతుడికిచ్చాడు. 'ఈ ఉంగరాన్ని సీతకిస్తే ఆమె దీనిని గుర్తు పడుతుంది. నిన్ను నేనే పంపానని నమ్ముతుంది. భయపడకుండా నీతో మాట్లాడుతుంది.' అన్నాడు హనుమంతుడు ఆ ఉంగరాన్ని భక్తిగా శిరస్సుమీద ఉంచుకుని, తరువాత జాగ్రత్తగా దాచి రాముడికి పాదాభివందనం చేసాడు. అందరూ రాజాజ్ఞప్రకారం వెదకడానికి బయలుదేరారు. నెల గడిచేలోగా తూర్పు, పడమర, ఉత్తర దిశలకు వెళ్ళినవారు వెనక్కి వచ్చి సీతజాడ తెలియలేదన్నారు. నెలగడచిపోయాక దక్షిణదిశకు వెళ్ళినవారు వచ్చి సీతజాడ హనుమంతుడు కనుగొన్నాడన్నారు. ఎలా కనుగొన్నాడన్నది చివరిభాగంలో......

 సర్వం శ్రీసాయిరామార్పణ మస్తు


0 comments: