Thursday, December 25, 2008 By: visalakshi

ఎందుకీ బలవన్మరణాలు;ఆత్మహత్యలు-

దార్ల వెంకటేశ్వర రావు గారి బ్లాగులో నిన్ననే చదివాను ఎం.ఫిల్ చేస్తున్న కేశవాచారి అనే విద్యార్ధి (తెలుగు బ్లాగరు)రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడుట .
ఒక నెల ముందు మా బాబు కాలేజీలో బీ.టెక్ 2వ సం" చదువుతున్న ఒకబ్బాయి ,వేరే కాలేజీ లో లైబ్రరీ బుక్ దొంగతనము చేసాడు అన్న అసత్య ఆరోపణతో మనస్థాపంచెంది రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు .
ఇలా ఎంతమంది?రోజుకో వార్త ఒక విద్యార్ధిని ఉరి వేసుకుంది. అని లేక పై నుండి దూకిందని వినడం,చూడడం జరుగుతోంది. పదవ తరగతి నుండి ఉన్నత విద్యలు చదివే విద్యార్ధుల వరకు అందరూ ఒకే మార్గంలో నడుస్తున్నారు ఆత్మహత్యల విషయంలో. మంచి మేధావులు, అవగాహన ఉన్నవాళ్ళూ క్షణికమైన ఆవేశంతో ఇలాంటి పిరికి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో ?ఆలోచిస్తే మనసు ఆందోళనకు గురౌతోంది .ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలంటారు కానీ వీళ్ళందరికీ బతకడానికి ధైర్యం చాలడం లేదేమో .
చిన్నప్పటినుండి వారి నవ్వులో, మాటలో ,నడకలో, అన్నిటిలో మమేకమై వారి కోసమే జీవిస్తున్న తల్లి దండ్రుల కడుపుకోత ,ఇవన్నీ ఆసమయంలో వాళ్ళకి గుర్తురాదా! ఒక అమ్మాయి కోసమో,లేక మరే ఇతర కారణమైనా సమస్యకి పరిష్కారం చావొక్కటేనా !జీవితాన్ని ఆత్మ స్థైర్యంతో సాధించకుండా ,మరణాన్ని జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు ఇలాటి నిస్థేజపరులు.
ఏదో సాధించాలనే తపన :అది నెరవేరకపోతే నిర్లిప్తత .ఆవేశంలో అనాలోచిత నిర్ణయాలు .ఆత్మకి శాంతి కలగాలి అంటున్నారు కొందరు, నిజంగా బలవన్మరణాలలో ఆత్మలు శాంతిస్తాయా ?లేక ఘోషిస్తాయా !తీరని కోరికలతో ఇలా ఎంతమంది ఆత్మహత్యల పాలవుతారు .స్నేహితులు, తెలిసిన వారు కొంత కాలం బాధపడతారు.కానీ కన్నవారి కడుపు తీపి జీవితాంతం వారు కుమిలిపోతూనే ఉంటారు. పుట్టి నప్పటి నుండి తనగురించే, చావులో కూడా తన గురించే ఆలోచించి స్వార్ధాన్ని చూసుకుంటున్న విద్యార్ధుల్ని ఏమనాలి? వాళ్ళ ఆత్మలు అసంతృప్తితో క్షోభించవా !
ఇలాటి అనాలోచిత నిర్ణయాలని అరికట్టాలంటే బాల్యం నుండీ పెరిగిన పరిసరాల ప్రభావం :మానసిక స్వభావాన్ని మెరుగు పరుస్తుంది .తల్లి దండ్రులు జీవితము పట్ల సరైన అవగాహన కలిగేట్టు బాధ్యతాయుతంగా పిల్లల వ్యక్తిగత జీవితాన్ని కూడా తెలుసుకుంటూ మెలకువతో వ్యవహరించాలి .ముఖ్యంగా యువతీ యువకులు ఎక్కువగా కాలేజీలో సమయం గడుపుతారు కాబట్టి అక్కడ ఉపాధ్యాయులూ,ప్రధానోపాధ్యాయులు యువతకి ఆత్మస్థైర్యాన్ని పెంచే బోధనలు చేయాలి .
కానీ దురద్రుష్టవశాత్తూ ఈ రోజుల్లో అమ్మాయిల కాలేజీ అయితే ,ప్రతీ అమ్మాయినీ ,ఆ అమ్మాయి ఎంత మంచి నడవడిక గల యువతి అయినా సరే(మంచి క్రమశిక్షణతో కాలేజీని నడుపుతున్నాము అనే ఆలోచనతో)ప్రిన్సిపాల్ అసభ్య పదజాలంతో అమ్మాయిలను దూషిస్తూ ,ఆలస్యంగా వచ్చిన వారిని ఎవరితో తిరుగుతున్నావ్?అంటూ దారుణంగా మాట్లాడు తుంటే తల్లి దండ్రులకు ఇలాంటి ఫోనులు వెళుతుంటే యువతకి జీవితం మీద విరక్తి కాక అవగాహన ఎలా పెరుగుతుంది. ముందుగా చదువు చెప్పే ఇలాంటి గురువులకి కౌన్సిలింగ్ ఇప్పించాలి .
యువతీ ,యువకులకు నాచిన్న సలహా మరియు అభ్యర్ధన . ఆవేశంతో కాక ఆలోచనతో భవిష్యత్ ని రసరమ్యంగా తీర్చి దిద్దుకోండి .తల్లి దండ్రులను నిరాశ పరచకండి .

3 comments:

Ramani Rao said...

అయ్యో అక్కా! గురువులకి కౌన్సిలింగా? పసి పిల్లలల లేత చర్మం మీద వాత తేలేలా కొట్టడం ఒకప్పటి పైశాచకత్వం, పైకి కనపడని దెబ్బలు కొట్టడంలో ఇప్పటి ఉపాధ్యాయులు ఎక్కడ శిక్షణ పొందారో తెలీదు కాని, ఏమి తెలియని పసి మనసులని రాయి చేస్తున్నారు వాళ్ళ అర్థం లేని శిక్షలతో, రోజుకో వార్త పేపర్లో చదువుతుంటే, నిజంగా మన చదువులు ఎంత సాఫీగా జరిగాయో కదా అనిపిస్తుంది. ఆలోచించతగ్గ విషయం రాసావు. కాని, ఆచరించే వారే కరువు ఇప్పుడు, లక్ష రూపాయల ఫీజ్, రెండు లక్షలు అని లెక్కలు వేసుకొని వాళ్ళ పిల్లల గొప్పతనం చెప్పుకోడంలో తల్లితండ్రులు ముందు ఉన్నారు కాని, వారికి తెలియకుండా పడే ఇలాంటి శిక్షల గురించి తల్లితండ్రులే పట్టించుకోడం లేదు. లక్షల ప్రేరణ కన్న శిక్షల బాధ జీవితాంతం ఉంటుందని తెలియడం లేదు వారికి.

visalakshi said...

కరెక్టు చెప్పావురా! ఊళ్ళ నుండి వచ్చి హాస్టలు లో చేరి కష్ట పడుతున్న స్టూడెంట్సు ని చూస్తే, వారిని హింస పెడుతున్న తోటి సీనియర్లు కొంతమంది అయితే, లెక్చరర్లు కొంతమంది .రాను రాను విద్యా వ్యవస్థ మరీ దిగజారిపోతోంది .

నేస్తం said...

నా మనసులో మాటలే ఇంచుమించుగా రమణి గారు చెప్పేసారు