Thursday, December 11, 2008 By: visalakshi

ఖడ్గ సృష్టి ;



" మానవుడే నా సందేశం ,మనుష్యుడే నా సంగీతం "అని ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీ శ్రీ . తెలుగు కవిత్వాన్ని మరో మలుపు తిప్పిన మహా కవి శ్రీ శ్రీ (మహా ప్రస్థానం }1950 లో పుస్తక రూపం ధరించింది .ఆయన సాహితీ తపస్సుకు గుర్తింపుగా ఖడ్గ సృష్టి కావ్యానికి 1966లో సోవియట్ భూమి నెహ్రూ అవార్డూ ,1973 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డూ ,1979 లో శ్రీ రాజ్య లక్ష్మీ ఫౌండేషన్ వారి మొదటి అవార్డు అందుకున్నారు .తెలుగు కవిత్వాన్ని ఖండించి ,దీవించి ,ఊగించి ,శాసించి ,రక్షించిన మహా కవి శ్రీ శ్రీ .
" కృష్ణ శాస్త్రి తన బాధని అందరిలోనూ పలికిస్తే శ్రీ శ్రీ అందరి బాధనూ తనలో పలికిస్తాడు."
"కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ,ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ"................... చలం గారు అన్న మాటలివి .
రెండు రెళ్ళు నాలుగన్నందుకు
గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో
క్షేమం అవిభాజ్యం అంటే
జైళ్ళు నోళ్ళు తెరిచే భూమిలో

అస్వ్తంత్రతని జయించడానికి
అహింసాయుధం ధరించామంటూ
రక్త పాతం లేకుండానే
రాజ్యం సంపాదించామంటూ

అవినీతి భారీ పరిశ్రమలో
అన్యాయాల ధరలు పెంచేసి
స్వాతంత్ర్యాన్ని బ్యాంకుల్లో వేసుకుని
చక్ర వడ్డీ తిప్పే కామందులకు

క్షణ క్షణం మారుతున్న లోకాన్ని
సరీగా అర్ధం చేసుకున్న వాళ్ళంతా
పేద ప్రజల పక్షం వహించడమే
పెద్ద అపరాధమై పోయింది .

అహింస ఒక ఆశయమే కాని
ఆయుధం ఎప్పుడూ కాదు
ఆశయం సాధించాలంటే
ఆయుధం అవసరమే మరి.

ఆశయం ఉండడం మంచిదే కాని
అన్ని ఆశయాలూ మంచివి కావు
ఆశయాలు సంఘర్షించే వేళ
ఆయుధం అలీనం కాదు

అందుకే అంటున్నాను నేను
అందుకో ఆయుధం అని
ఆచరణకి దారి తీస్తేనే
ఆవేశం సార్ధకమవుతుంది .

అందుకే సృష్టిస్తున్నాను
అధర్మనిధనంచేసే ఈ ఖడ్గాన్ని
కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది
జనంతో నిర్మిస్తున్న స్వర్గం ఇది.

ఈ కత్తి
బూజు పట్టిన భావాలకి
పునర్జయం ఇవ్వడానికి కాదు
కుళ్ళి పోతున్న సమాజ వృక్షాన్ని
సమూలచ్చేదం చెయ్యడానికి ............................ఇంకా చాలా ఉంది.ప్రతి తెలుగు వారికి "అంకితం" చేసిన ఈ ఖడ్గ సృష్టి కావ్యం అందరూ చదివి తీరాల్సిన కావ్యం.

0 comments: