Wednesday, June 3, 2015 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 78

ఓ౦ శ్రీ శరణాగత వత్సలాయ నమ:

శ్రీమతి చ౦ద్రాబాయి బోర్కర్ : -శ్రీ షిర్డీ సాయి కి మహాభక్తురాలైన చ౦ద్రాబాయి గారి గురి౦చి , సాయితో ఆవిడకు గల భక్తి సాన్నిహిత్య౦ ఎలా౦టిదో అ౦దరూ శ్రద్ధగా విన౦డి.

"అన్ని రకాల అహ౦కారాలను వదిలిపెట్టి నన్నే శరణు పొ౦దాలి. నేను మీ హృదయ అ౦తర్యామిని. అప్పుడు మీ అజ్ఞాన౦ శీఘ్ర౦గా నశిస్తు౦ది. ఇక మరే ఇతర జ్ఞానబోధలు మీకు అవసర౦ ఉ౦డవు." --షిర్డీ సాయి.

ఒకరోజు సాయి భక్తులతో కూడి మశీదులో ఉన్నారు. తొలిసారి చ౦ద్రాబాయి సాయిని దర్శి౦చి, నమస్కరి౦చగానే భక్తులతో సాయి , ఈమె 7 జన్మల ను౦చి నా సోదరి. ప్రతి జన్మలోనూ నేను ఎక్కడున్నాసరే, నన్ను వెతుక్కు౦టూ నా దగ్గరకు వస్తు౦ది. అని అనగానే భక్తులు ఆశ్చర్యపోయారు. సాయి తన జన్మ,జన్మల గురువనే రహస్య౦ తెలిసిన౦దుకు చ౦ద్రాబాయి చాలా స౦తోషి ౦చి౦ది.

1898లో చ౦ద్రాబాయ్ సాయి మహారాజ్ ను తొలిసారిగా దర్శి౦చి,వారి దివ్య తేజస్సును తిలకి౦చి తనని తాను మైమరచిపోయారు. అప్పుడు ఆవిడకు 28స౦"లు.ఆ రోజులలో సాయి ఎక్కువగా వేపచెట్టు క్రి౦ద కూర్చుని ధ్యాన నిమగ్నులై వు౦డేవారు. ద్వారకామయి అప్పటికి మరమ్మత్తులు చేయి౦చలేదు. సాఠేవాడ కూడా నిర్మి౦చలేదు.

చ౦ద్రాబాయి తొలియాత్రలోనే సాయి దివ్యలీలలను కళ్ళారా చూసారు.

"సాయి నీటితో దీపాలు వెలిగి౦చిన దృశ్యాన్నికళ్ళారా చూచి , సాయి యోగశక్తికి ఆశ్చర్యపోయారు శ్రీమతి చ౦ద్రాబాయ్. అ౦తేకాక సాయి గుడ్డపీలికలతో, ఒక చెక్కబల్లను వ్రేలాడదీసి, దానిపై నిద్రి౦చుట చూసి పారవశ్య౦తో పులకి౦చిపోయారు."సాయి మహిమలను స్వయ౦గా దర్శి౦చిన చ౦ద్రాబాయి శ్రీ సాయి సిద్ధ యోగీ౦ద్రులని, అవతార పురుషులని తిరుగులేని విశ్వాస౦తో కొన్నాళ్ళు షిర్డీలోనే బాబా గారితో గడిపి పిదప బొ౦బాయికి వెళ్ళారు.

సాయి దివ్య లీలలను చూసి తరి౦చిన ఆమె మనసులోసాయి సన్నిధిలో సదా ఉ౦డాలని కోరుకునేది. ఆమె భర్త రామచ౦ద్ర బోర్కర్ ఒక నాస్తికుడు.ప్రాప౦చిక విషయములలో సదా మునిగి తేలేవాడు. తాను ఒక స్త్రీ కావడ౦ కావడ౦ వలన స్వేచ్చగా సాయిని సేవి౦చే అవకాశ౦ లేదు. తన భక్తికి, సేవకు భర్త అవరోధ౦ కాకూడదని, సాయిని ప్రార్ధి౦చేది. తన భర్తను కూడా మార్చమని సాయిని మనసులో వేడుకునేది.

ఆవిడ భక్తిని మన్ని౦చి , భర్త లో మార్పు కోస౦ సాయి ఒక అద్భుత లీలను చేసారు.

1909లో రామచ౦ద్ర బోర్కర్ ప౦డరీపురములో ,ఒక వ౦తెన నిర్మాణము చేసే పనిలో ఉ౦డెను. ఆ సమయములో చ౦ద్రాబాయి శిరిడీలో సాయి సేవలో ఉన్నది.ఒకనాడు సాయి చ౦ద్రాబాయితో "బాయీ! నీవు ప౦డరీపూర్ లోని నీ భర్త వద్దకు వెళ్ళు. నేను నీ వెనకనే వస్తాను. నాకు ఏ వాహనాలు అవసర౦ లేదు."అని అన్నారు.చ౦ద్రాబాయి గురు ఆజ్ఞగా భావి౦చి, తనకు తోడుగా ఇద్దరిని తీసుకుని ప౦డరీపుర౦ వెళ్ళి౦ది. తీరా అక్కడికి వెళ్ళాక ,తన భర్త ఏదో కారణ౦ వలన ప౦డరీపుర౦లో ఉద్యోగానికి రాజినామా చేసి , బొ౦బాయి వెళ్లిపోయాడని తెలుసుకుని ఆశ్చర్యపోయి౦ది. వేదనకు గురై౦ది. "సాయీ! ఏమీవిధ౦గా చేసావు? బొ౦బాయి వెళ్ళుటకు తగిన౦త పైకము నా వద్ద లేదు నేను ఏవిధ౦గా బొ౦బాయి వెళ్ళేది అని సాయిని ప్రార్ధి౦చి౦ది.

కొన్ని క్షణాలకే ఒక ఫకీర్ ఆమెను సమీపి౦చి , అమ్మా! నీ భర్త , రామచ౦ద్ర బోర్కర్ , ధో౦డ్ రైల్వేస్టేషన్ లో ఉన్నాడు.వె౦ఠనే మీరు బయలుదేర౦డి. తప్పక మీ భర్తను కలుసుకు౦టారు అనగానే చ౦ద్రాబాయి ఆశ్చర్యపోయి౦ది.తన భర్త పేరు చెప్పగానే, ఈ ఫకీరు ఎవరో మహిమాన్వితుడని విశ్వసి౦చి,మా వద్ద డబ్బులు లేవుఅని ఫకీరుకు సమాధానమిచ్చెను.వె౦ఠనే ఫకీరు మూడు టిక్కట్లు చ౦ద్రాబాయి చేతిలో పెట్టి వెళ్ళ౦డి అని పలికెను. మీరెవరు? అని అడిగే లోపు వడి వడిగా అడుగులు వేస్తూ అదృశ్యమయ్యెను.

రైలు సిద్ధముగా వు౦డుటతో వారు రైలు ఎక్కెను. ఇదే సమయములో రామచ౦ద్ర బోర్కర్, ధో౦డ్ స్టేషన్ లో టీ త్రాగి నిద్రపోతున్నాడు."నా తల్లిని ఎ౦దుకు నిర్లక్ష్యము చేస్తున్నావు. నీ భార్య ఇప్పుడు రాబోయే రైలులో ఇక్కడకు వచ్చుచున్నది.ఇ౦టికి తీసుకెళ్ళు."అని ఒక ఫకీరు కలలో కనిపి౦చి మ౦దలి౦చారు.రామచ౦ద్ర అదిరిపడి లేచి , ఇది నిజమా! ,భ్రమయాఅని విచారి౦చెను. కొ౦తసేపటికి నిజ౦గానే తన భార్య రైలు దిగట౦ చూసి ఆశ్చర్య పోయాడు.తన అనుభవాన్ని భార్యకు గద్గద ఖ౦ఠముతో చెప్పెను. చ౦ద్రాబాయి కన్నీరు కారుస్తూ తనకు జరిగిన అనుభవాన్ని చెప్పి౦ది. ఇ౦టికి చేరాక చ౦ద్రాబాయి వద్దనున్న సాయి పట౦ చూసి నాకు కలలో కనిపి౦చి మ౦దలి౦చిన ఫకీరు వీరేనని రామచ౦ద్ర పలికాడు.చ౦ద్రాబాయి ఎ౦తో స౦తోషి౦చి౦ది.సాయిబాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నది.

1908లో చ౦ద్రాబాయి, కోపర్గావ్ లో చతుర్మాస దీక్షలో ఉ౦ది. ఒక రోజు ఒక ఫకీరు వచ్చి , అమ్మా! నాకు రొట్టె, ఉల్లి పచ్చడి పెట్టమ్మా! అని కోరాడు.చాతుర్మాసములో మేము ఉల్లి త౦. అని చ౦ద్రాబాయి చెప్పడ౦తో ఆ ఫకీరు వెళ్ళిపోయాడు.కొన్ని క్షణాలకే సాయిబాబాయే ఫకీరుగా వచ్చాడేమో,సాయికి ఉల్లి,రొట్టెఅ౦టే ఇష్ట౦, అని ఆమె తన తప్పుకు బాధపడి౦ది.కొన్ని రోజుల తరువాత రొట్టె, ఉల్లిపచ్చడి తీసుకుని చ౦ద్రాబాయి శిరిడీ వెళ్ళి౦ది. ఆమె మశీదు మెట్లు ఎక్కి లోపలికి రాగానే "నీవు నాకు ఉల్లిపచ్చడి పెట్తలేదు ఇప్పుడు ఎ౦దుకొచ్చావ్? అని సాయి అడుగగా, ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆనాడు సాయే తని౦టికి వచ్చారని తెలుసుకుని వె౦ఠనే అవి మీకు సమర్పి౦చడానికి వచ్చాను బాబా, అని కన్నీరుతో పలికి౦ది. సాయి ఎ౦తో ప్రేమతో వాటిని తిన్నారు.

చ౦ద్రాబాయికి 48స౦"ల వరకూ స౦తాన౦ కలుగలేదు.బాబా 1918లో ఒకసారి ’తల్లీ, నీకేమి కావాలి? అన్నారు. చ౦ద్రాబాయి ’ మీకు తెలుసు! అ౦ది.ఆయన సరేనన్నారు. తర్వాత ఆమెకు 3స౦"లకు ఋతుక్రమ౦ ఆగిపోయి౦ది. కొన్ని నెలల తరువాత డాక్టరు ఆమెను పరీక్షి౦చి కడుపులో గడ్డ వు౦దని,ఆ వయసులో ఇక గర్భ౦ అవదని,అది వ్రణమని వైద్యులు శస్త్ర చికిత్స అవసరమన్నారు.కానీ ఆవిడ పదినెలల వరకూ చేయి౦చుకోనని,పట్టుబట్టారు. చిత్ర౦గా తుదకు సకాల౦లో సుఖ ప్రసవమై౦ది. ప౦డ౦టి కుమారుని చూసి బాబా ప్రసాదమని ఆమె ఆన౦దపడి౦ది.

మరొకసారి బాబాగారు చ౦ద్రాబాయి కలలో ’నీ రాముని తీసుకుపోతాను. నీవు ధైర్య౦గా నీ విధి నిర్వర్తి౦చు! అన్నారు. చ౦ద్రాబాయి ఇ౦కా ఇలా చెబుతున్నారు...
"బాబా చెప్పినట్ల్లే చాతుర్మాస౦లో మా వారికి ప్రమాద౦గా జబ్బు చేసి౦ది. ఆయన కోరిక ప్రకార౦ చాతుర్మాస్య౦ వెళ్ళేదాకా మా వారిని నిలుపమని బాబాను కోరాను.చాతుర్మాస్యమైన ఏడవ రోజున మావారు టీ త్రాగి విష్ణు సహస్రనామ౦ , హారతి చదివి౦చుకుని విన్నారు. డాక్టర్లు ప్రమాద౦ తప్పి౦దన్నారుగాని, నాకు బాబా చెప్పి౦ది గుర్తొచ్చి గ౦గ నోటిలో వేశాను. ఆయన’ శ్రీరామ” అ౦టూ కన్నుమూశారు".

శ్రీ సాయి నాధుడు ఆ మహా భక్తురాలిపై ప్రేమతో ,ఆమె భర్తను కూడా అనుగ్రహి౦చారన్నమాట.

శ్రీ సాయి 1918 దసరా ప౦డుగకు ము౦దు ,చ౦ద్రాబాయి వచ్చి౦దా అని తరచుగా, అడుగుచు౦డగా, దీక్షిత్ చ౦ద్రాబాయికి జాబు వ్రాసి పిలిపి౦చారు. ఆమె వె౦ఠనే శిరిడీ వచ్చి సాయి అస్వస్థత చూసి దు:ఖాన్ని ఆపుకోలేక సాయి ము౦దు ఏద్చి౦ది. సాయి దయ గల, ప్రేమపూరిత చూపులతో,

బాయి! ఏడ్వవద్దు. నేను ఎప్పుడు నీతోనే ఉ౦టాను. అని ఒక పన్ను నోటి ను౦డి తీసి ఆవిడకు ఇచ్చారు. ఆ పన్నును ఆమె తాయెత్తుగా ధరి౦చారు. తుది క్షణములో సాయి గొ౦తులో ,"నాకు" నీరు పోసే భాగ్య౦ కలిగి౦దని చ౦ద్రాబాయి ఏడుస్తూ తెలిపారు.

సాయి మహాసమాధి చె౦దిన తరువాత ఒక రోజు హేమాడ్ప౦త్ చ౦ద్రాబాయి ఇ౦టికి వచ్చారు. వారు సచరిత్ర రచి౦చుచూ అనుభవాల కోస౦ ఆవిడను కలవడానికి వచ్చారు. హేమాడ్ప౦త్ అడుగు పెట్టగానే, వారి ఇ౦టి హాలులో,ఒక జ్యోతి కనిపి౦చి౦దట. హేమాడ్ ఆశ్చర్యపోయి జ్యోతి కనబడిన స్థలములో సాయి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని చెప్పాడు. చ౦ద్రాబాయి స౦తోషి౦చి ,రె౦డడుగుల సాయి మట్టి విగ్రహాన్ని 1958లో వస౦తరావ్ గోవేకర్ అనే శిల్పిని తయారు చేయమని కోరి౦ది. ఆ శిల్పి 500రూ"లు అవుతు౦దనగా ఆమె అ౦గీకరి౦చారు. చ౦ద్రాబాయి విగ్రహ౦ కోస౦ వెళ్ళగా రె౦డడుగులు కాకు౦డా విగ్రహ౦ చాలా పెద్దదిగా శిల్పి తయారు చేశాడు. ఆర్ధిక సమస్యలతో ఉన్న చ౦ద్రాబాయి ,డబ్బు ఎక్కువ అడుగుతాడెమో ఈ శిల్పి అని భయపడుచు౦డగా, ఆశిల్పి అమ్మా! నేను రె౦డు అడుగుల విగ్రహాన్ని తయారుచేయాలనే స౦కల్పి౦చాను. కానీ నా ప్రయత్న౦ లేకనే విగ్రహ౦ పెద్దగా తయారుచేయబడి౦ది.మీరు అదన౦గా డబ్బు ఇవ్వవలసిన అవసర౦ లేదు అన్నాడు. సాయి గొప్ప మహరాజ్ అని ఆన౦ది౦చి 1958లో విగ్రహ ప్రతిష్ఠ జర్పి౦చి మహాభక్తితో పూజలొనర్చారు చ౦ద్రాబాయి.



                                                                *************


"దీప౦ చిన్నదైనా, చీకటికది మ౦దే. వెలిగి౦చు"


శ్లో" నేహాభి క్రమ నాశో ’స్తి ప్రత్యవాయో న విద్యతే!

స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్!!

భా- కర్తవ్యాన్ని గుర్తు౦చుకుని బాధ్యతలనెరిగి జీవి౦చేవాడిని "కర్మయోగి" అ౦టారు. కుటు౦బపర౦గా,సమాజపర౦గా,భగవత్పర౦గా సమన్వయ బాధ్యతాయుత జీవితాన్ని సమర్ధవ౦ర౦గా స౦స్కరిస్తూ , స్వీయ ఆరాధనతో, పాటుగా సర్వ ఆదరణ నేర్వాలి. ఏది చేసినా అది జగదాధారుడు పరమాత్మునికే చె౦దుతు౦ది. "మాధవసేవగ సర్వప్రాణిసేవ"అనేది ప్రతివ్యక్తికి "జీవనాడి" కావాలి. "ఉత్తమ కర్మయోగి"కిది లక్షణ౦.

మాధవసేవగాబాధ్యతనెరిగి సత్ కర్మయోగము నార౦బిస్తే, అలా౦టి కర్తవ్యపాలన మె౦తవరకు చేయగలిగితే అ౦త ఫలమూ తప్పక ఉ౦టు౦ది.

స్వార్ధ౦తో, హృదయ౦లో రాగద్వేషాది మాలిన్య౦తో ప్రార౦భి౦చిన పనులైతే, ప్రార౦భి౦చినవి మధ్యలో మానేస్తే కొన్ని వ్యర్ధమైపోతాయి. కొన్ని విపరీతఫలితాలొస్తాయి, కొన్ని ప్రాణా౦తకాలవుతాయి. ఆత్మ వినాశానికి దారి తీస్తాయి.

ప్రార౦భి౦చినవి పూర్తి అయినా లభి౦చే ఫలిత౦ అ౦త౦త మాత్రమే.అది కూడా తాత్కాలిక౦గానే ఉ౦డి నశి౦చిపోతు౦ది.

తన సేవగా ప్రార౦భి౦చే కర్మయోగానిదైతే "అభిక్రమనాశ: ఇహ న" ఇలా౦టి పని ప్రార౦భిద్దామనుకు౦టూ ,కొద్దిగా ఆర౦భి౦చి మానివేయడ౦లా౦టివి జరిగినా ఆ చేసిన౦త వరకు విఫల౦ కాదు. వ్యర్ధము కానే కాదు. ఒకవేళ చేయడ౦లో కాస్త లోటుపాట్లు ఏర్పడ్దా అవి విపరీత ఫలాన్నిచ్చి వినాశానికి దారి తీయవు.

భగవత్సేవగా చేయాలి. లౌకిక, వైదిక కర్మలు మధ్యలో మానినా,మార్చినా జీవితానికి,కీర్తికీ హానిని కలిగిస్తాయని,అలా మానిన కొ౦దరు బ్రహ్మరాక్షసులైనారని గూడా పురాణాలు చెపుతున్నాయి.బాధ్యత నెరి౦గి చేసే కర్మయోగానికి శ్రీ కృష్ణుడు తానే రక్షణగ ఉ౦టానని హామీ ఇస్తున్నాడు.

’మహతో భయాత్ త్రాయతే’ ఎ౦తె౦త చేస్తే అ౦త౦త వరకైనా సత్ఫలితాన్నిస్తు౦ది. పర్యవసాన౦గా అది భయ౦కరమైన ఈ అహ౦కార రూపమైన సంసారమనే సాగరము  ను౦డి మనలను కాపాడుతు౦ది, అలా మనలను రక్షి౦చి బాగుచేయడానికి మ౦చి బాధ్యతతో చేసే పని "స్వల్పమపి" అతి చిన్నదైనా ఇ౦త మ౦చి లాభాన్ని కలిగి౦చును. కనుక నిర్లక్ష్యవాదానికి నీళ్ళొదలి,బాధ్యత తెలిసి భగవత్ సేవగ మన జీవిత కార్యాలన్ని౦టినీ ప్రార౦భిద్దా౦.

నిర్లిప్త , నిరాసక్త ఉదాసీన వైఖరులను పారద్రోలుదా౦!

భగవ౦తుని భరోసాను విశ్వసిద్దా౦.

మ౦చి పనిలో ము౦దడుగు వేద్దా౦.

సాయిరా౦.
**************

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు













Friday, May 8, 2015 1 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 77.. "సంఘటితం"

 ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమ:

శ్రీమత్పయోనిధి నికేతన! చక్రపాణే!
భోగీంద్ర భోగమణి రాజిత! పుణ్యమూర్తే! /
యోగీశ! శాశ్వత! శరణ్య! భవాబ్ధిపోత!
లక్ష్మీనృసింహ! మమదేహి కరావలమం //

' శ్రీమంతమైన పాల సముద్రంలో ఉండువాడా!చేతియందు సుదర్శన చక్రాన్ని ధరించినవాడా! శ్రేష్ఠమైన ఆదిశేషుని శరీరంపై పవ్వళించి ప్రకాశించువాడా! పుణ్యవిగ్రహా! యోగీశ్వరుడా! శాశ్వతుడా! శరణునొసంగువాడా! సంసారసముద్రాన్ని దాటించే నౌక అయినవాడా!ఓ లక్ష్మీనృసింహా! నాకు చేయూతనిచ్చి కాపాడుము '.






 2011 లో "శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం" ప్రారంభించాము.
  
స్వామిసేవాకార్యక్రమాలను నిర్వర్తిస్తూ,పూజలు,స్తోత్రపఠనం,సంకీర్తనలద్వారా భగవంతుని పట్ల భక్తులు భక్తిభావాన్ని పెంపొందించుకోవడానికి అనుసరించే మార్గం 'భక్తియోగం'.  
  
   భక్తియోగం ద్వారా మన హృదయపద్మంలో పరివేష్టితుడై ఉన్న పరమాత్మను దర్శించడానికి హృదయ పవిత్రతను సాధించాలి. అచట ఆసీనుడై ఉన్న పరమాత్మను నిరంతరం ఉపాసించాలి. 

  అని   ప్రెసిడెంటు  శ్రీ సూర్యప్రకాష్ గారు సత్సంగ సభ్యులకు ప్రబోధిస్తూ,"ఐకమత్యంతో కలిసి పనిచేద్దాము,అందరం ముక్తకంఠంతో ఏకాభిప్రాయులై ఉందాము, మన సంకల్పం ఒక్కటైనదిగా ఉండుగాక! మనమధ్య అద్భుతమైన సామరస్యం నెలకొనాలి. అని ప్రతిజ్ఞ చేసి సత్సంగసభ్యులందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉండి శ్రీ సాయినాధుడు ఆదేశించిన దేవాలయ నిర్మాణమునకై భక్తితో సంఘటితంగా కలిసి పనిచేయాలని సంకల్పించుకున్నాము. 

" నేను ,నాది " అనే అహంకార మమకారాలే మన అజ్ఞానానికి కారణం. ఈ అజ్ఞానం తొలగిపోతే 'ఏకత్వభావన ' కలుగుతుంది. 'బ్రహ్మసత్యం,జగన్మిధ్యా అనే వివేకాన్ని పొందడమే జ్ఞానయోగం."అంతర్గతంగా ఉన్న దివ్యాత్మను వ్యక్తపరచడానికి,ఉపాసన ద్వారా గానీ, తత్వజ్ఞానం ద్వారా గానీ ఆత్మసాక్షాత్కార మార్గాన్ని అభ్యసించి ముక్తుడవుకమ్ము"అని స్వామి వివేకానంద ప్రబోధించారు."

"సంఘటిత శక్తికి మూలసూత్రం ప్రేమ." 'సేవకుడనే భావంతో పనిచేయాలి గానీ, నాయకుడననే అహంకారంతో వ్యవహరిస్తే ఇతరుల సహకారం లభించదు. కార్యనిర్వహణలో ప్రతి ఒక్కరూ ముఖ్యమేనన్న భావనతో మెలగాలి.'

 ప్రేమ నటిస్తూ,వారి వెనుక చెడుగా మాట్లాడడం కన్నా పాపం మరోటి లేదు.విభేదాలకు అసలు కారణం ఈ అవలక్షణమే!


అసూయ,ద్వేషాలు లేకుండా మనమంతా స్వామి నిర్దేశించిన మహత్కార్యాన్ని,సంఘటిత కార్యాచరణ ద్వారా నిర్వహించడానికి కృషిచేద్దాం.మానవజన్మ లక్ష్యమైన భగవత్సాక్షాత్కారాన్ని పొంది తరిద్దాం. 

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.  



 



Saturday, April 18, 2015 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 76

 ఓం శ్రీ వేంకటేశ రమణాయ నమ:

 శ్లో" అనంతకోటి జన్మానాం బిజభూతం సత్ యత్ కర్మజాతం!

      తిష్తతి తత్ సంచితం జ్ఞేయం!!

 సంచిత కర్మ అంటే ....The collection of invisible karma phalam that  is acquired during many many previous births is known as 
   sanchita.

  సంచిత కర్మ  ఎలా నశిస్తుంది అంటే...
శ్లో" సంచితం కర్మ బ్రహ్మైవహం !
   ఇతి నిశ్చయాత్మిక జ్ఞానేన నష్యతి!!
Sanchita karma exhausted by the sheer knowledge that I am the same as the ultimate consciousness swaroopa athma.

 "ఒక లోభి సాయిబాబాను బ్రహ్మజ్ఞానం గురించి అడిగినప్పుడు సాయిభగవానుడు దాన్ని అతని జేబులోనించే తీసిచ్చారు." 

ఇంద్రియాలు దుర్భలమయ్యాక, జగత్తులోఎవరూ గౌరవించకపోయినప్పుడు వూరికే పనిలేకుండా కూచుని, కాలక్షేపంకోసం బ్రహ్మను తెలుసుకోవాలని ఆ లోభి ప్రయత్నం ...ఈ లోభి కధ ద్వారా సంచిత పాప కర్మ ఫలమును,అది నశించు విధమును సాయి తత్వభోద ద్వారా తెలుసుకుందాము. 

ఒక లోభి అయిన ధనవంతుడు సత్వర బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని అందుకే షిర్డీకి వచ్చానని బాబా పాదాలకు నమస్కరించి.. నాకు బ్రహ్మ లభిస్తే కృతకృత్యుడినౌతాను అని బాబాతో విన్నవించుకున్నాడు.
 బాబా ఇలా అన్నారు."చింతపడకు బ్రహ్మను వెంటనే చూపిస్తాను.అసలు నీలాగ బ్రహ్మను ఎవరూ అడగరు. నా వద్దకు వచ్చేవారు ధనమో,రాజ్యపదవి,కష్టనివారణ,రోగనివృత్తి,సుఖాన్నికోరుతారు.
నీలాంటివాళ్ళు దొరకరు.బ్రహ్మజిజ్ఞాసువుల కోసం నేను ఆకలిగొని ఉన్నాను.అలాంటి నాకు పర్వకాలం వచ్చింది."అని బాబా ఆ బ్రహ్మార్ధిని కూచోబెట్టి ..ఒక పిల్లవాణ్ణి పిలిచి అతనితో,వెంటనే వెళ్ళి బాబాకి అవసరం పడింది అని నందూ మార్వాడితోచెప్పి ఓ అయిదు రూపాయలు తీసుకురా! అన్నారు. పిల్లవాడు నందూ ఇంటికి వెళ్ళాడు. అతని తలుపు తాళం పెట్టి ఉంది.వెనక్కొచ్చి బాబాగారికీసంగతి చెప్పాడు. బాబా ఇలా అన్నారు,"మళ్ళీ వెళ్ళు.బాళా వ్యాపారి ఇంటికెళ్ళి డబ్బు తే" అన్నారు.అతను కూడా ఇంట్లో లేడని పిల్లవాడు తిరిగొచ్చి చెప్పాడు.తిరిగి,తిరిగి అలసిపోయినా ఆ పిల్లవాడికి చిల్లుగవ్వ కూడా దొరకలేదు. ఇది అంతయు బాబాలీల. ఆయనకు తెలుసు.ఆ వ్యాపారులు ఇం ట్లో లేరని. సర్వజ్ఞులైన సాయి నడుస్తూ మాట్లాడే దైవం. వారి పని 5 రూ"ల కోసం ఆగిపోతుందా? కానీ ఆ బ్రహ్మార్ధి కోసం ఈ చమత్కారం చూపారు.ఆ బ్రహ్మార్ధి జేబులో అప్పుడు రెండువందల యాభై రూపాయలున్నాయి.అది సాయినాధులకు తెలుసు. బ్రహ్మార్ధి జేబులో నోట్లకట్ట ఉండి కూడా ఇవ్వాలా,వద్దా? అవి తిరిగి తనవద్దకు వస్తాయా లేదా? అన్న సంధిగ్ధావస్థలో పడిపోయాడు.బాబాగారికి ఐదు రూపాయలు అప్పుగాకొద్దిసేపు ఇవ్వగల ధైర్యం అతనికి లేకపోయింది.బ్రహ్మసాక్షాత్కారం అడగటానికొచ్చాడు.అతను ధనమోహంలో చిక్కుకొన్నాడు. తిరిగి వెళ్ళిపోయే ఆతృతలో బాబాతో "బ్రహ్మని చూపండి" అన్నాడు.
బాబా ఇలా అన్నారు.."కూచున్నచోటునే బ్రహ్మను చూపించాలని ఇప్పటివరకు ప్రయత్నించాను. అది నీకు తెలీటం లేదా? బ్రహ్మకోసం పంచప్రాణాలు,పంచజ్ఞానేంద్రియాలు,పంచకర్మేంద్రియాలు,అహంకారం,బుద్ధీ,మనసు ఇవన్నీ సమర్పించవలసి వుంటుంది.దురాశా లోభభూయిష్టుడైన నువ్వు ముందు ఆ రెండింటినీ (దురాశ,లోభం) వదులుకో. ఎవరి మనస్సైతే ధనధారాపుత్రేషణత్రయంలో తగులుకోనివ్వకుండా తాను బద్ధుడనని గ్రహించి,తద్విముక్తిని మాత్రమే ఆశించి, బాహ్యాన్ని విస్మరించి తన లోపలి ఆత్మను చూడగలుగుతాడో వాడికే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. అంతర్ముఖానుభవం నుంచే ఆత్మవిద్య అలవడుతుంది.
 'సత్యం,తపస్సు,ధ్యానం,బ్రహ్మచర్యం అనే నాలుగింటి సంయోగాన్ని పాటించనిదే త్యాగి కాలేడు.త్యాగి కాలేనివాడు యోగి కాలేడు.యోగి కాని వాడికి సమదృష్టి కలగదు. సమదృష్టి లేని వాడికి ఆత్మసాక్షాత్కారం కలగదు."అన్న సాయిబాబావారి బోధలో పరిపూర్ణజ్ఞానం అవగాహన చేసుకుంటే సంచిత కర్మలు నశిస్తాయి.  

   ఇలా  ..పెద్ద పెద్ద ఆధ్యాత్మిక ఉపన్యాసాలు,ప్రవచనాలు చేయకుండా ఉపదేశించిన సద్గురువు "శ్రీ సాయిబాబా". అందుకే అందరికీ ఉపాసన దైవమైనారు.


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు  










Sunday, March 8, 2015 2 comments By: visalakshi

మాతృమూర్తి

మాతృదేవోభవ

 శ్లో: ఉపాధ్యాయాన్ దశాచార్యా ఆచార్యాణాం శతం పితా:!
      సహస్రం తు పితౄన్ మాతా గౌరవే నాతి రిచ్యతే!! (మనుస్మృతి)

 "గౌరవించదగిన వారిలో ఉపాధ్యాయుల కన్నా ఆచార్యులు పది రెట్లు ఎక్కువ ;అచార్యుల కన్నా తండ్రి వంద రెట్లు ఎక్కువ; కాగా తల్లి(మాతృమూర్తి) ఆ తండ్రి కన్నా వేయి రెట్లు ఎక్కువ". మాతృమూర్తికి అంతటి ఉన్నతస్థానం ఎలా సంప్రాప్తించింది అంటే ఆమె త్యాగనిరతి వల్ల!నిస్వార్ధ ప్రేమానురాగాలవల్ల!

  "మాతృత్వం అంటే చాలామంది అనుకున్నట్లు భౌతికంగా ఓ బిడ్డకు జన్మనివ్వడం కాదు. దురదృష్తవశాత్తూ బిడ్డలకు నోచుకోనంత మాత్రాన వారు మాతౄమూర్తులు కాకుండాపోరు! మాతృత్వభావన అనేది భౌతిక స్థాయిని మించినది! ఏ బిడ్డను చూసినా మనస్సు స్పందించడం, నిస్వార్ధంగా ప్రేమను పంచడం- ఇవే మాతృత్వ లక్షణాలు. అందుకే భారతీయ సంస్కృతిలో మాతృమూర్తిని మాతృదేవోభవ అని కీర్తిస్తారు."

  భారతీయ మహిళ తనను తాను మాతృమూర్తిగా అభివ్యక్తం చేసుకోవడాన్ని మన సనాతన ధర్మం అత్యున్నత ధర్మంగా అభివర్ణించింది. స్త్రీకి సంబంధించినంత వరకు భార్య స్థానం నుంచి తల్లిగా ఎదగడం కేవలం భౌతికపరమైన పరిణామం మాత్రమే కాదు! మాతృత్వభావనతో ఆధ్యాత్మికంగా పరిణతిని సాధించడానికి అరుదైన అవకాశం; భారతీయ వివాహ వ్యవస్థ స్త్రీకి కల్పించిన అదృష్టం!నిజానికి భార్యగా తన పాత్రను పోషించే సమయంలో కన్నా, తల్లిగా తన మాతృత్వ మధురిమలను పంచేటప్పుడే స్త్రీ ఎక్కువ ఉన్నతిని సాధించినట్లు సంతృప్తి పడుతుంది.అమ్మతనంలో అత్యున్నతమైన ఆత్మానందాన్ని పొందుతుంది.స్త్రీ తన సహజమైన సహనం,క్షమ,ప్రేమ తదితర సర్వోన్నత లక్షణాలతో విశ్వజనీనతను పొందికుటుంబం,జాతి,వంశం మొదలైన హద్దులను చెరిపివేసి ఆదర్శమాతృమూర్తిగా వెలుగుతుంది.ఈ ఆధ్యాత్మిక ఔన్నత్యమే మహిళ భార్యగా, పౌరురాలిగా కూడా సమర్ధంగా తన బాధ్యతలను నిర్వహించడానికి దోహదపడుతుంది.అందుకే స్వామివివేకానంద..
"The ideal of womanhood in India is motherhood;that marvellous,unselfish,all suffering,ever forgiving mother -  కష్టాలను,బాధలను సహిస్తూ,అనుక్షణం క్షమిస్తూ, నిస్వార్ధానికి మారుపేరైన మాతృత్వమే భారతీయ నారీమణుల ఆదర్శమ"ని ఉధ్ఘాటించారు.

 విసృతమైన అవకాశాలున్న ప్రపంచంలో అడుగుపెట్టిన ఆధునిక మహిళలకు ఈ ఆదర్శాలు అసమగ్రంగా,చాదస్తంగా తోస్తున్నాయి. కానీ దీర్ఘంగా ఆలోచిస్తే మన మునుపటి తరాల స్త్రీ అడుగుజాడలు నేటికీ అన్వయమవుతాయనీ, నేటి మహిళ ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు వాటిలోనే లభిస్తాయనీ గుర్తించాలి.ఎవరు ఎన్ని చెప్పినా, భారతీయ స్త్రీలు సీత,దమయంతి సావిత్రి లాంటి సాధ్వీమణుల అడుగుజాడల్లోనే అభ్యుదయాన్ని సాధించాలి.భిన్నంగా మన స్త్రీలను ఆధునికీకరించే ప్రయత్నం చేస్తే మనకు పరాభవం తప్పదు అని వివేకానంద చెప్పారు.---- స్వామి రంగనాధానంద


మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
Tuesday, February 24, 2015 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 75 ఆగామి(క్రియమన)కర్మ తత్వబోధ

  ఓం శ్రీ పరమేష్ఠి గురుభ్యో నమ:


ఆగామి కర్మ అంటే...

శ్లో:  జ్ఞాన ఉత్పతి అనంతరం, జ్ఞాని దేహ కృతం !
పుణ్య పాప రూపం కర్మ ఎత్ అస్థి తత్ ఆగామి ఇతి అభిదియతే!!

"The invisible results of action --A person gets while doing actions after getting the self -knowledge is called agami."



ఆగామి కర్మ ఎలా నశిస్తుంది....

శ్లో:  ఆగామి కర్మ అపి జ్ఞానేన నష్యతి/కిం చ ఆగామి
 కర్మానాం నలిని దల గత జల వత్ జ్ఞానినాం సంబంధో నస్తి// 

"Agami karma ,also will get exhausted by the self knowledge.also, like the water on the lotus leaves, the agami karma will not effect the jnani."

"ఆత్మ స్వతహాగా నిర్వికారి. స్ఫటికంలాగా దోషరహితంగా ఉండికూడా సంసారంలో మాయతో, కర్మలతో బంధించబడినట్లు కనిపిస్తుంది.'నేను ఈ దేహాన్ని '     అన్న అభిమానం ముక్తస్థితిలో ఆత్మకి మిధ్యాబంధనాన్ని తీసుకొస్తుంది. దేహము, ఇంద్రియాలు, మనసు, ప్రాణము వీటిపై అభిమానం ఉన్నంతవరకు కర్తృత్వమూ,భోక్తృత్వమూ ఉంటాయి. వాటి జ్ఞానాన్ని కూడా ఆపలేము. అంతర్యామి ఆత్మే ఈశ్వరుడు. ఈశ్వరుడే గురువు. గురువు మనకు దివ్యనేత్రాలనిచ్చినప్పుడే జ్ఞాననిధి లభిస్తుంది.అవిద్య,కామము,కర్మ అనే బంధనాలనుండి సంపూర్ణంగా విడివడటానికి గురు స్వరూప జ్ఞానాన్ని యధాతధంగా తెలుసుకొని గురుధ్యానాన్ని  అనుష్ఠించడం, దర్శించడం అవుతుంది."   


 శ్లో" మన్నాధ: శ్రీ జగన్నాధ: మద్గురు: శ్రీ జగద్గురు:!
      మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవేనమ:!!


 "గురువు అంటే అజ్ఞానాంధకారమును తొలగించే ఒక శక్తి. శక్తి అంటే తత్వము, అని అర్ధం చేసుకోవాలి. మానవునిలోని అజ్ఞానాన్ని తొలగించే శక్తి కేవలము భగవంతునికి మాత్రమే ఉన్నది."

 శ్రీ షిర్డీ బాబాగారుచేసిన సహజ ఉపదేశం "ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాక్కలహాన్ని వారి కర్మ నశించే వివరణను",మరియు బాబాగారి జ్ఞానబోధను తెలుసుకుందాము....

ఒకసారి ఒక శ్రేష్ట భక్తుడు, మరో భక్తుడి గురించి చెప్తూ స్వతహాగా చెడుమాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎంతగానో నిందించడం మొదలుపెట్తాడు. అతని చక్కటి గుణాలు పక్కనపెట్టి నోటితో ఎడాపెడా దూషించటం మొదలుపెట్టాడు. అసలు సంగతి పక్కనపడి, నిందే వరదలై పొంగిపొరలింది.
 'ఏదో కారణంతో ఎవరి ఆచరణైనా నింద్యంగా ఉంటే వారిపై జాలి పడి వారికి ఎదురుగానే ప్రబోధం చేయాలి. ఎప్పటికీ నిందించకూడదు.' 
 నిందించేవారు నిందింపబడేవారికి ఉపకారులు. వీరు అనేకరకాలుగా శుభం కలిగిస్తారు. నిందించేవారు తమ నాలుకతో ఇతరుల మాలిన్యాన్ని కడిగేస్తారు. నింద నిమిత్తంతో వారి దోషాలు వారికి తెలుపుతారు. భవిష్యత్తులో రాబోయే అనేక అనర్ధాలను వాళ్ళు తప్పిస్తారు.సరే! ఆ భక్తుని నోటినుంచి నింద ఎక్కువగా రావటం చూసి వినేవాళ్ళకి అసహ్యం కలిగింది. వారందరూ బాబా దర్శనం కోసం మశీదుకి బయలుదేరారు.నిందించే భక్తుడు శౌచం కోసం కాలువదగ్గరకెళ్ళాడు.
   సాయిబాబా సర్వజ్ఞులు. భక్తులతో కలిసి లెండీకి బయలుదేరినప్పుడు బాబా ఆ నిందించే భక్తుడి గురించి అడిగారు.దానితో భక్తులు ఇలా అన్నారు. "అతను కాలువ దగ్గ్రకు శౌచానికి వెళ్ళాడు." తమ కార్యక్రమం ముగిసిన తరువాత బాబా లెండీనుంచి తిరిగి వచ్చారు. కాలువ వద్దనుండి ఆ నిందించిన భక్తుడు కూడా ఇంటికెళ్ళేందుకు తిరుగుముఖం పట్టాడు. దార్లో అతను బాబాకి ఎదురయ్యాడు.  బాబాగారు  అక్కడకి దగ్గరలో ఓ పందిని జూపి ఇట్లనెను. "చూడుము! ఈ పంది అమేధ్యమును ఎంత రుచిగా తినుచున్నదో! నీ స్వభావము కూడా అట్టిదే! ఎంత ఆనందముగా నీ సాటి సోదరుని తిట్టుచున్నావు.ఎంతయో పుణ్యము చేయగా నీకీ మానవజన్మ లభించినది.ఇట్లు చేసినచో శిరిడీ దర్శనము నీకు తోడ్పడునా?"ఆ మాటలు నిందించిన  భక్తుని మనసుకు గుచ్చుకొని, అందులోని నీతిని,సారాన్ని గ్రహించాడు."నా భగవంతుడు నా వాడైతే నాకు మంచమ్మీదే నే కూచున్నచోటే అన్నీ ఇస్తాడు" ఈ సామెత నిజమే కానీ అబద్ధం కాదు. కానీ అన్న వస్త్రాలవరకే ఇది వర్తిస్తుంది.దాన్ని పరమార్ధానికి ఆపాదించేవారికి పరమార్ధం అన్నిరకాలుగా దూరమవుతుంది.
 ఈ విధంగా నిందాస్తుతి వల్ల జరిగే అనర్ధాన్ని బాబాగారు ఉపదేశంతో వివరించి.. అజ్ఞానవినాశనం చేసి జ్ఞానబోధతో ఆగామికర్మ  నశించేలా చేసారు. 


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు






  








Saturday, December 6, 2014 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 74(శ్రీ దత్త గురువు - శ్రీ సాయి గురువు )

 ఓం శ్రీ అనంతరూపాయ నమో నమ:

 శ్లో" అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర:!
     స్మర్తృగామీ స్వభాక్తానాముద్ధర్తా భవసంకటాత్ !!


 రేపు అనగా 06-12-2014 శనివారం శ్రీ దత్తజయంతి సందర్భంగా ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజగారి "శ్రీగురుచరిత్ర"నుండి దత్తగురువుకు,సాయిగురువుకుగల సన్నిహిత పోలికలు...సారాంశము.

   శిరిడీ సాయిబాబా భక్తులకు "శ్రీగురుచరిత్ర" పారాయణ యెంతో అవసరం. హరివినాయక్ సాఠె, అన్నాసాహెబ్ దభోల్కర్ వంటి వారికి శ్రీసాయిబాబా దర్శనము, అనుగ్రహము లభించడానికి "శ్రీగురుచరిత్ర" పారాయణమే కారణమైంది.కుశాభావు అనే భక్తుడి విషయంలో యీ సత్యం యింకెంతో స్పష్ఠంగా కనిపిస్తుంది. అతడిచేత యీ గ్రంధాన్ని 108 సార్లు పారాయణ చేయించడంలో సాయినాధుడు దీనికెంత ప్రాముఖ్యమిచ్చారో తెలుస్తుంది.ఆయన మహాత్ములందలోకి తలమానికము.తాను సద్గురువునని చెప్పక, అతి సామాన్యుడిలా జీవించారు. భక్తులు తమను గురువుగా ఎలా సేవించాలో యెన్నడూ చెప్పలేదు. భగవద్గీతా శ్లోకాన్ని వివరించినప్పుడు ఆ విషయమై రత్నాల్లాంటి మాటలు ఒకటి రెండు మాత్రమే చెప్పారు. అలాగాక గురుచరిత్రలో శ్రీగురుడు యెన్నో పురాణోపాఖ్యానాల సహాయంతో యీ విషయం వివరించారు. అంటే భక్తులు యెలా శ్రీసాయిని సేవించాలో "శ్రీగురుచరిత్ర" నుండి నేర్చుకోమని శ్రీసాయి సూచించారన్నమాట.

   అంతేగాక, శ్రీగురునికి-సాయిబాబాకు సన్నిహితమైన పోలికలు యెన్నో ఉన్నాయి. జన్మించిన క్షణమునుండే యీ యిద్దరికీ తాము ఎవరో తెలుసు. ఇద్దరూ లోకహితం కోసం అవతరించిన భగవత్స్వరూపులే.అయినప్పటికీ సత్సాంప్రదాయాన్ననుసరించి ఇద్దరూ బాహ్యంగా గూడ ఒకగురువును ఆశ్రయించారు.  శ్రీగురుడు శ్రీశైలములో అంతర్ధానమయినప్పుడు తమ శిష్యులకు పూలు ప్రసాదంగా అందజేసి వాటిని ప్రాణపదంగా ఉంచుకోమని చెప్పారు. సాయిబాబా తమ గురువు ప్రసాదించిన ఇటుక రాయిని అలానే పవిత్రంగా ఉంచుకున్నారు. అది విరిగిపోయిన కొద్దికాలానికే ఆయన గూడా శరీర త్యాగం చేసారు.  ఆయన తమను తమ గురువు ఒక బావిలోకి  తలక్రిందులుగా వ్రేలాడదీసినట్లు చెప్పారు. గురుచరిత్రలో దీపకుడు,ఉపమన్యువు మొ"న వారు చేసిన గురుసేవా విధానమంతా ఆ ఒక్క వాక్యానికి వివరణ అని తలచవచ్చు.   శ్రీగురుడు యెంతోకాలం సన్యాసాశ్రమ ధర్మాన్ననుసరించి దేశసంచారం చేస్తూ లోకుల దృష్టినుండి గుప్తంగా ఉండిపోయారు. ఒక్క నర్సోబావాడిలోనే 12 సం"లు తపోనిష్ఠలో ఉన్నారు.    శ్రీసాయి గూడా శిరిడీలో వేపచెట్టుక్రిందనున్న భూగృహంలో 12 సం"లు ఉన్నారు. అందుండి బయటకు వచ్చాక గూడ సుమారు 30 సం"లు గుప్తంగా పిచ్చి ఫకీరువలె జీవించారు.  శ్రీగురుడు తాము లోకానికి వెళ్ళడి కావలిసిన సమయమొచ్చాకనే గంధర్వపురం చేరి ప్రకటమయినట్లు, శ్రీ సాయి గూడ చివరి 23 సం"లలోనే వెల్లడి అయ్యారు. కాకుంటే సాయి నైష్ఠిక బ్రహ్మచారి గనుక, యావజ్జీవితమూ తమ గురుసన్నిధిలోనే ఉండిపోయారు. శ్రీగురుడు సంగమానికి వెళ్ళిరావడం నిత్యమూ మహోత్సవంగా జరిగినట్లే, శ్రీసాయి రోజూ లెండీకి రావడం,రోజు విడిచి రోజు చావడికి వెళ్ళడమూ గొప్ప ఊరేగింపుగా జరిగింది. కొద్దిలో చెప్పాలంటే ,సాయిచరిత్రలో గురుస్థానం (వేపచెట్టు మూలం) నర్సోబావాడి వంటిది.; లెండీవనమే సంగమం;ద్వారకామాయియే గంధర్వపురం. ఈ మహనీయులిద్దరూ తమ 16వ యేటనే బాహ్య ప్రపంచంలోనికి అడుగు పెట్టారు. ఇద్దరూ తమ భక్తులకు కవితాశక్తిననుగ్రహించి,వారికి బిరుదులు గూడా ఇచ్చారు. శ్రీగురుడు ఒకనికి 'యోగీశ్వర్ 'అని మరొకరికి 'కవీశ్వర్ ' అని బిరుదులిస్తే-శ్రీసాయి ఒకరికి 'దాసగణు ' అని, మరొకరికి 'హేమాడ్పంత్ 'అని బిరుదులివ్వడమే కాక, జోగేశ్వర్ భీష్మకు కవితాధారనిచ్చి 'సగుణోపాసన ' వ్రాయించుకున్నారు.  శ్రీగురుడు ఒక యవనరాజును అనుగ్రహించి అతనినుండి పూజలందుకున్నారు. సాయి యవనులందరిచేత సేవించ బడుతున్నారు.ఇద్దరిదీ భిక్షావృత్తియే. ఈ ఇద్దరూ కర్మఫలానికీ, జన్మ పరంపరలకూ యెంతో ప్రాముఖ్యమిచ్చారు. ఇలా ఆలోచించినకొద్దీ యింకెన్నో పోలికలు స్ఫురిస్తాయి. కనుకనే "శ్రీసాయిబాబా జీవితచరిత్ర","శ్రీగురుచరిత్ర" ..ఒకదానికొకటి వివరణమని చెప్పాలి. ఆ రెండూ ఒకే దత్తాత్రేయుని చరిత్రలో వేర్వేరు అధ్యాయాలు. కనుక సాయి భక్తులందరికీ, "శ్రీసాయిబాబా జీవిత చరిత్ర","శ్రీగురుచరిత్ర","శ్రీగురుగీత"లు కలిసి ప్రస్థానత్రయము అనవచ్చు. ప్రస్థానత్రయము అంటే సనాతనధర్మమంతటికీ మూలమైన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు,భగవద్గీత.


  సర్వజీవులనూ ఉద్ధరించడమే తమ అవతారకార్యంగా గల దత్తాత్రేయుణ్ణి భక్తులందరూ గురుధ్యాన శ్లోకం చదువుకుంటూ,త్రిమూర్త్యాత్మకుడైన దత్తాత్రేయుణ్ణే మనసారా స్మరిస్తున్నారు.

ఓం దత్త... శ్రీ దత్త...జయగురుదత్త  

   సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు



Friday, November 14, 2014 1 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 73

ఓం శ్రీ పరబ్రహ్మస్వరూపాయ నమ:

" సాయి పారాయణగ్రంధము లో ప్రతీఘటనను పరిశీలిస్తే ఓ అద్భుతమైన ఆధ్యాత్మికబోధన అవగతమౌతుంది. మన శాస్త్రాలు స్మృతులు సంక్లిష్టంగా చెప్పేవే సరళంగా తెలియజేసిన ఘటనలే అవన్నీ. ఉదాహరణకు త్రివిధములైన సంచిత, ఆగామి, ప్రారబ్ధకర్మములలో ప్రారబ్ధం భోగముతో, జ్ఞానంచే సంచితము, మిత్రులు శత్రువుల పరుష మాటలచే ఆగామి నశించునని శాస్త్రం చెప్తున్దిలా -

ప్రారబ్ధం భోగతో నశ్యేత్తత్త్వజ్ఞానేన సంచితమ్ / 
ఆగామి ద్వివిధం ప్రోక్తం తద్ద్వేషి ప్రియవాదినో: //

దీనినే సామాన్యులకు సైతం అర్ధమయ్యే ఘటనలు పారాయణంలో చదివాను - అని  బాబాగారి సచ్చరిత్ర లోని ప్రతి సంఘటన ఒక జ్ఞానబోధ. ప్రతి ఘటనను వివరముగా రాయమని ప్రోత్సహించిన నా శ్రేయోభిలాషి, ప్రియస్నేహితురాలికి ధన్యవాదాలు తెలుపుతూ", బాబాగారు శ్యామాకు తెలిపిన ప్రారభ్దకర్మ గురించి ఇలా....

 ఒక భక్తుడు సాయిబాబాకి భక్తితో 2రూ"ల దక్షిణ ,సాయి పేరుమీద శిరిడీకి పంపాడు. ఆ సమయములో సాయి మశీదులో లేరు. ఆ రెండు రూపాయలను శ్యామా తీసుకొని సంతకం చేసాడు. శ్యామాకు బాబాగారిని పరీక్షించాలని వారి సర్వజ్ఞత, శక్తి స్వయంగా చూడాలని,వాటిని సాయికి ఇవ్వకుండా, మశీదులో ఒక మూలకు పాతిపెట్టాడు. సాయి మశీదుకు వచ్చి ఏమీ మాట్లాడలేదు. కొన్నాళ్ళకు ,శ్యామా ఇంట్లో దొంగలు పడి 200రూ"లు దొంగిలించారు. శ్యామా బాధపడి, తనకు జరిగిన దుస్థితిని సాయితో చెప్పుకున్నాడు.  అపుడు సాయి నవ్వుతూ,  "నీకు చెప్పుకోడానికి నేనైనా వున్నాను. నా రెండు రూపాయలు పోయి ఆరు నెలలు అయింది. మరి నేనెవరితో చెప్పుకోవాలి." అని శ్యామావైపు సాయి గంభీరంగా చూసాడు. 

శ్యామా రెండు రూపాయలు దాచిపెట్టిన సంగతి సాయి తెలుసుకున్నారని సాయి సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపోయి బాబా! ఏదో తమాషాకొద్దీ, నేను 2రూ"లు దాచిపెడితే, నాకు 200రూ"ల నష్టం కలిగిస్తావా? ఇదేమి న్యాయం అని శ్యామా అన్నాడు.

  "ఎందుకు దిగాలు పడతావు, ఎవరి తలరాత ఎలావుంటే అలా జరుగుతుంది. మనచేతనిబట్టే ప్రారబ్ధమనే తలవ్రాత వుంటుంది. కర్మఫలాన్ని అనుభవించక తప్పదు" అని   ఉద్యోగం చేసే నీకు 200రూ"లు ఎంతో, ఏ ఉద్యోగం లేని ఈ ఫకీరుకు 2రూ"లు అంతే. అని శ్రీసాయి చెప్పడముతో ధర్మ సూక్ష్మానికి శ్యామా అశ్చర్యపడ్దాడు. బాబా హితబోధ వలన ప్రారబ్ధం అన్నది అనుభవించక తప్పదని, అది అనుభవిస్తే పోతుందని,   తెలుసుకొని తిరుగులేని విశ్వాసాన్ని సాయి మీద నిలుపుకున్నాడు.

  శ్యామాద్వారా మనకు 3 విషయాలు బోధపడ్డాయి. అవి "1. గురువును పరీక్షించరాదు. 2. గురువు విషయంలో తప్పు చేస్తే, ఎప్పుడో ఒకనాడు శిక్ష అనుభవించక తప్పదు. 3. గురువుకు చేసే మంచైనా, చెడైనా శిష్యునికి 100 రెట్లు తిరిగి వస్తుంది " 

ఇక్కడ నా ప్రారబ్ధ ఘటన గురించి కూడా మీకు తెలియజేయాలి. దాదాపు ఐదు నెలల క్రితం నేను,మావారు మా వియ్యంకులవారి ఇంటికి వెళ్ళి వస్తుండగా, రాత్రి వర్షం పడి, చిన్న,చిన్న చినుకులు పడుతుండగా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పరధ్యానంగా ఉన్న సమయంలో,బైక్ మీద ఒకవ్యక్తి మమ్మల్ని కంఫ్యూజన్ చేస్తూ మా ముందుకు వచ్చి నామీద లైట్ ఫోకస్ చేస్తూ నాకు తెలియకుండా పక్కకు వచ్చి నా మంగళసూత్రాలు, నల్లపూసలగొలుసు ఒక్క క్షణంలో లాక్కుని వెళ్ళిపోయాడు. నేను లాగేస్తున్నాడు అని అరుస్తుంటే మావారు పరిగెత్తి పట్టుకోబోయి పడిపోయారు. వర్షం వల్ల రోడ్డుపైన జారి పడిపోయారు. వాడు అప్పటికే పారిపోయాడు.నా అరుపులకి చుట్టుపక్క జనాలు వచ్చి నన్ను ఓదారుస్తుండగా అప్పటి వరకు వెలగని స్ట్రీట్ లైట్స్ అప్పుడు వెలిగాయి. ఐదు ని"లలో  పోలీసులు వచ్చారు. జరిగినది తెలుసుకున్నారు. మా వియ్యంకులవారు,మేము పోలిస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ రాసి సంతకంచేసి ఇచ్చి వచ్చాము. జరిగిన దానికి నా అజాగ్రత్తే కారణమని తలచినా, మంగళవారం నాడు పోయాయి అని చాలా బాధపడ్డాను. ఈ సంఘటన తెలిసిన సత్సంగ సభ్యులు ఇద్దరుమరియు స్నేహితులు మమ్ములను ఇలా అడిగారు. "మీరు రోజూ బాబాకి పూజలు చేస్తారుకదా! మరి మీకెందుకిలా జరిగింది?"మేము చెప్పాము..."మీ కర్మలకు నన్ను కారణభూతుణ్ణి చేయకండి. నేను సాక్షీభూతుణ్ణి మాత్రమే!" అని బాబాగారు చాలా సంధర్భాలలో చెప్పారు.మరి నేను చేసిన ఏ కర్మఫలమో అని అనుకున్నాను. కానీ బాబాగారికి విన్నవించుకున్నాను. ఎందుకిలా జరిగిందో తెలియదు. పరిష్కారం నీకే తెలుసు. నీ చరణాలు పట్టుకున్న మేము ఈ విషయాన్ని నీ పాదాలవద్ద వుంచాము అని. ఒక వారంలో  స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. మీ గోల్డ్ దొరికింది. దొంగను పట్టుకున్నాము. కోర్టుకు వచ్చి మీ బంగారం తీసుకెళ్ళవచ్చు . అని చెప్పారు. మూడున్నర తులాలు పోతే, సగంకి కొంచం ఎక్కువ బంగారం ఇచ్చారు. అప్పుడు సత్సంగ సభ్యులు మీ భక్తి, పూజలవల్ల బాబాగారి అనుగ్రహం వల్ల మీకు పోయిన బంగారం దొరికింది అని అన్నారు.    ఎందుకు జరిగినా.. మమ్మల్ని సదా ఎరుకలో ఉండమని బాబాగారు హెచ్చరించినట్లు మాకు బోధపడింది.


  శివేరు ష్టే గురు: త్రాతా గురౌ రుష్టే న కశ్చ న !



శివుడు కోపించిన గురువు మనలను రక్షించును. గురువు కోపించిన రక్షించువాడు మరొకడు లేడని పరమేశ్వరుడు తెలిపెను.

  ఇద్దరువ్యక్తులవాక్కలహంతో ఆగామి నశించే విధం ...ఘటనలు సవివరముగా తదుపరి.....



సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.