Sunday, March 8, 2015 By: visalakshi

మాతృమూర్తి

మాతృదేవోభవ

 శ్లో: ఉపాధ్యాయాన్ దశాచార్యా ఆచార్యాణాం శతం పితా:!
      సహస్రం తు పితౄన్ మాతా గౌరవే నాతి రిచ్యతే!! (మనుస్మృతి)

 "గౌరవించదగిన వారిలో ఉపాధ్యాయుల కన్నా ఆచార్యులు పది రెట్లు ఎక్కువ ;అచార్యుల కన్నా తండ్రి వంద రెట్లు ఎక్కువ; కాగా తల్లి(మాతృమూర్తి) ఆ తండ్రి కన్నా వేయి రెట్లు ఎక్కువ". మాతృమూర్తికి అంతటి ఉన్నతస్థానం ఎలా సంప్రాప్తించింది అంటే ఆమె త్యాగనిరతి వల్ల!నిస్వార్ధ ప్రేమానురాగాలవల్ల!

  "మాతృత్వం అంటే చాలామంది అనుకున్నట్లు భౌతికంగా ఓ బిడ్డకు జన్మనివ్వడం కాదు. దురదృష్తవశాత్తూ బిడ్డలకు నోచుకోనంత మాత్రాన వారు మాతౄమూర్తులు కాకుండాపోరు! మాతృత్వభావన అనేది భౌతిక స్థాయిని మించినది! ఏ బిడ్డను చూసినా మనస్సు స్పందించడం, నిస్వార్ధంగా ప్రేమను పంచడం- ఇవే మాతృత్వ లక్షణాలు. అందుకే భారతీయ సంస్కృతిలో మాతృమూర్తిని మాతృదేవోభవ అని కీర్తిస్తారు."

  భారతీయ మహిళ తనను తాను మాతృమూర్తిగా అభివ్యక్తం చేసుకోవడాన్ని మన సనాతన ధర్మం అత్యున్నత ధర్మంగా అభివర్ణించింది. స్త్రీకి సంబంధించినంత వరకు భార్య స్థానం నుంచి తల్లిగా ఎదగడం కేవలం భౌతికపరమైన పరిణామం మాత్రమే కాదు! మాతృత్వభావనతో ఆధ్యాత్మికంగా పరిణతిని సాధించడానికి అరుదైన అవకాశం; భారతీయ వివాహ వ్యవస్థ స్త్రీకి కల్పించిన అదృష్టం!నిజానికి భార్యగా తన పాత్రను పోషించే సమయంలో కన్నా, తల్లిగా తన మాతృత్వ మధురిమలను పంచేటప్పుడే స్త్రీ ఎక్కువ ఉన్నతిని సాధించినట్లు సంతృప్తి పడుతుంది.అమ్మతనంలో అత్యున్నతమైన ఆత్మానందాన్ని పొందుతుంది.స్త్రీ తన సహజమైన సహనం,క్షమ,ప్రేమ తదితర సర్వోన్నత లక్షణాలతో విశ్వజనీనతను పొందికుటుంబం,జాతి,వంశం మొదలైన హద్దులను చెరిపివేసి ఆదర్శమాతృమూర్తిగా వెలుగుతుంది.ఈ ఆధ్యాత్మిక ఔన్నత్యమే మహిళ భార్యగా, పౌరురాలిగా కూడా సమర్ధంగా తన బాధ్యతలను నిర్వహించడానికి దోహదపడుతుంది.అందుకే స్వామివివేకానంద..
"The ideal of womanhood in India is motherhood;that marvellous,unselfish,all suffering,ever forgiving mother -  కష్టాలను,బాధలను సహిస్తూ,అనుక్షణం క్షమిస్తూ, నిస్వార్ధానికి మారుపేరైన మాతృత్వమే భారతీయ నారీమణుల ఆదర్శమ"ని ఉధ్ఘాటించారు.

 విసృతమైన అవకాశాలున్న ప్రపంచంలో అడుగుపెట్టిన ఆధునిక మహిళలకు ఈ ఆదర్శాలు అసమగ్రంగా,చాదస్తంగా తోస్తున్నాయి. కానీ దీర్ఘంగా ఆలోచిస్తే మన మునుపటి తరాల స్త్రీ అడుగుజాడలు నేటికీ అన్వయమవుతాయనీ, నేటి మహిళ ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు వాటిలోనే లభిస్తాయనీ గుర్తించాలి.ఎవరు ఎన్ని చెప్పినా, భారతీయ స్త్రీలు సీత,దమయంతి సావిత్రి లాంటి సాధ్వీమణుల అడుగుజాడల్లోనే అభ్యుదయాన్ని సాధించాలి.భిన్నంగా మన స్త్రీలను ఆధునికీకరించే ప్రయత్నం చేస్తే మనకు పరాభవం తప్పదు అని వివేకానంద చెప్పారు.---- స్వామి రంగనాధానంద


మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

2 comments:

Unknown said...

ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,

మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.

సాయి రామ్ సేవక బృందం,
తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*

భారతి said...
This comment has been removed by the author.