Saturday, January 30, 2021 0 comments By: visalakshi

శ్రీ భూ వరాహ స్తోత్ర మహిమ..

 శ్రీ భూ వరాహ స్తోత్ర మహిమ*


ఇల్లు కట్టుకోవాలనే కోరిక, ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అనేక కారణాల చేత సొంత ఇంటి కల కుదరక పోవచ్చు.సొంత ఇల్లు ఒక్కటే కాదు, స్థలాలు,భూములు,ఇళ్ళు కొనాలన్నా, అమ్మాలన్నా అడ్డంకులు తొలగడానికి ప్రతి రోజు పూజలో భాగంగా ఈ స్తోత్రంని కూడా చేర్చుకోని, ఈ స్తోత్రమును రోజూ 9సార్లు మండలం రోజులు పఠించాలి.


#శ్రీ భూ వరాహ స్తోత్రం*


ఋషయ ఊచు |

జితం జితం తేఽజిత యజ్ఞభావనా

త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః |

యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః

తస్మై నమః కారణసూకరాయ తే || ౧ ||


రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం

దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం |

ఛన్దాంసి యస్య త్వచి బర్హిరోమ-

స్స్వాజ్యం దృశి త్వంఘ్రిషు చాతుర్హోత్రమ్ || ౨ ||


స్రుక్తుండ ఆసీత్స్రువ ఈశ నాసయో-

రిడోదరే చమసాః కర్ణరంధ్రే |

ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే

యచ్చర్వణంతే భగవన్నగ్నిహోత్రమ్ || ౩ ||


దీక్షానుజన్మోపసదః శిరోధరం

త్వం ప్రాయణీయో దయనీయ దంష్ట్రః |

జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః

సభ్యావసథ్యం చితయోఽసవో హి తే || ౪ ||


సోమస్తు రేతః సవనాన్యవస్థితిః

సంస్థావిభేదాస్తవ దేవ ధాతవః |

సత్రాణి సర్వాణి శరీరసంధి-

స్త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధనః || ౫ ||


నమో నమస్తేఽఖిలయంత్రదేవతా

ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే |

వైరాగ్య భక్త్యాత్మజయాఽనుభావిత

జ్ఞానాయ విద్యాగురవే నమొ నమః || ౬ ||


దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృతా

విరాజతే భూధర భూస్సభూధరా |

యథా వనాన్నిస్సరతో దతా ధృతా

మతంగజేంద్రస్య స పత్రపద్మినీ |


త్రయీమయం రూపమిదం చ సౌకరం

భూమండలే నాథ తదా ధృతేన తే |

చకాస్తి శృంగోఢఘనేన భూయసా

కులాచలేంద్రస్య యథైవ విభ్రమః |


సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం

లోకాయ పత్నీమసి మాతరం పితా |

విధేమ చాస్యై నమసా సహ త్వయా

యస్యాం స్వతేజోఽగ్నిమివారణావధాః 


కః శ్రద్ధధీతాన్యతమస్తవ ప్రభో

రసాం గతాయా భువ ఉద్విబర్హణం |

న విస్మయోఽసౌ త్వయి విశ్వవిస్మయే

యో మాయయేదం ససృజేఽతి విస్మయమ్ |


విధున్వతా వేదమయం నిజం వపు-

ర్జనస్తపః సత్యనివాసినో వయం |

సటాశిఖోద్ధూత శివాంబుబిందుభి-

ర్విమృజ్యమానా భృశమీశ పావితాః |


స వై బత భ్రష్టమతిస్తవైష తే

యః కర్మణాం పారమపారకర్మణః |

యద్యోగమాయా గుణ యోగ మోహితం

విశ్వం సమస్తం భగవన్ విధేహి శమ్ 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే శ్రీ వరాహ ప్రాదుర్భావోనామ త్రయోదశోధ్యాయః | సంపూర్ణం.

Saturday, January 23, 2021 0 comments By: visalakshi

శ్రీ కృష్ణ దేవాలయం...



          శ్రీ కృష్ణ అద్భుత వింత దేవాలయం!


మీకు తెలుసా ?  ఈ దేవాలయంలో దేవుడికి ప్రసాదం పెడితే ప్రత్యక్షంగానే ఆయన భుజిస్తారు. సమర్పించిన నైవేద్యం అందరూ చూస్తుండగానే మాయమవుతుంది.


 గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక కేరళ దేవాలయం తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం, కొట్టాయం.


 అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత కూడా దీపారాధన చేసే ప్రపంచంలోని అరుదైన  హిందూ దేవాలయంగా పిలుస్తారు.


 ఇక్కడి కృష్ణపరమాత్మ మూర్తి చాలా ఆకలితో ఉంటారు. ఇక్కడ అర్చకులు రోజుకు 7 సార్లు స్వామికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. సమర్పించిన నైవేద్యం ప్రతిసారి కొంచెం తగ్గుతూ ఉండటం తరుచుగా గమనిస్తుంటారు. స్వామివారు స్వయంగా తింటారు అని ఇక్కడి భక్తుల విశ్వాసం. అదే విధంగా అందరూ చూస్తుండగానే ప్రసాదం మాయమవుతుంది.


 గుడి తెల్లవారుజావున 2 గంటలకు తెరుస్తారు. సాధారణంగా అన్ని దేవాలయాలలో అభిషేకం, అలంకరణ అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు కానీ ఈ దేవాలయంలో నైవేద్యం నివేదన చేసిన తర్వాత అభిషేకం, అలంకరణ చేస్తారు.


 నైవేద్యం సమర్పించడంలో కొంత ఆలస్యమైనా, ఆలయ ప్రధాన ద్వారం తెల్లవారుజామున తెరవకపోయినా చాలా దోషంగా భావిస్తారు. అందుకే ప్రధాన అర్చకుడి చేతిలో గొడ్డలి పట్టుకుంటారు. ఏదేని కారణం చేత తాలం పనిచేయకపోయినా, తాళం పోయినా, గొడ్డలితో తాళాన్ని పగలకొట్టడం ఇక్కడి ఆనవాయితీ.


కృష్ణుడికి చేసే నైవేద్యం చాలా రుచికరంగా ఉంటుంది. స్వామికి నివేదించిన అనంతరం భక్తులందరికీ ప్రసాదం పంచుతారు. ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడూ ఆకలితో వెళ్ళకూడదని ఇక్కడి నియమం. అందుకే అర్చక స్వాములు “ఇంకా ఎవరైనా ప్రసాదం తీసుకోనివారు ఉన్నారా అని పెద్ధగా అరుస్తారు”.  


 కృష్ణుడికి సమర్పించే నైవేద్యం ఆలస్యమైతే ఆకలికి తట్టుకోలేక కడుపు ఖాళీ అవ్వడం చేత స్వామివారి నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదులై కొన్ని ఇంచులు క్రిందకు దిగడం మనం చూడవచ్చు. పూర్వం గ్రహణం సమయంలో ఆలయం మూయడం వలన ఇలాంటి అపసృతి చోటు చేసుకోవడం వలన, ఈ దేవాలయాన్ని గ్రహణం సమయంలోనే కాదు మరెప్పుడూ మూయరు .


గ్రహ దోషాలు, గ్రహణ దోషాలు, సంతాన దోషాలు, సర్పదోషాలు, వ్యాపారాలలో నష్ట దోషాలు, వివాహ దోషాలు, బ్రహ్మహత్య వంటి మహాపాతకాలు ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి కృష్ణపరమాత్మను దర్శించి, పూజిస్తే దోషాలు నివారింపబడుతాయి. దేవతలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు కృష్ణభగవాణుడి సేవకులు కనుక ఇక్కడి కృష్ణభక్తులకు ఎటువంటి జాతక దోషాలు అంటవని స్వామిని భక్తితో కొలుస్తారు.


సైంటిష్టులకు కూడా అంతుచిక్కని ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో జరిగాయి. భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంత కన్నా గొప్ప దేవాలయం ఎక్కడ ఉంటుంది! 


                  *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

Monday, January 18, 2021 0 comments By: visalakshi

మానవజీవితం..

 శరీర విషయంలో జ్ఞాపకం ఉంచుకోవలసిన ముఖ్యవిషయం ఏమిటి ?


వ్యాఖ్యానం : సూక్ష్మంగా

🌺*ప్రతివారి జీవితంలోనూ, బాల్యం, యవ్వనం, వార్ధక్యం - అని 3 స్థితులు ఉంటాయి. ఈ 3 స్థితులను అజ్ఞానంలో ఎలా గడిపేస్తున్నాడో ఇక్కడ తెలియజేస్తున్నారు*. 

*1. బాల్యం*:- బాల్యావస్థ అంతా ఆటపాటలతోను, చదువు సంధ్యల తోను గడిచిపోతుంది. ఈ వయస్సులో జీవితాన్ని గురించిన అవగాహన ఉండదు. ఆటబొమ్మల మీద, చిత్ర విచిత్ర వస్తువుల మీద ఆసక్తి కలిగి ఉంటాడు. అవి కావాలని కోరుకుంటాడు. వాటికోసం మారాం చేస్తాడు. లభిస్తే ఆనందిస్తాడు. లభించకపోతే దుఃఖిస్తూ గోల చేస్తాడు. కర్తవ్యాన్ని గురించి ఆలోచించే అవకాశం ఈ అవస్థలో రానేరాదు. 

*2. యౌవనం*:- బాల్యం గడిచిపోగానే యౌవనం వస్తుంది. ఈ వయస్సులో శరీర సౌష్టవం బాగా ఉంటుంది. యౌవనమంతా శారీరక సంబంధమైన వాంఛలతోను, ధనసంపాదనల గురించి వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, వ్యవసాయం మొదలైన ఆలోచనలతోను గడిచిపోతుంది.

*3. వార్ధక్యం*:- యౌవనం గడిచిపోతే క్రమక్రమంగా శరీరంలోని బిగువులన్నీ సడలిపోయి వృద్ధాప్యం వస్తుంది. శరీర అవయవాలలో పటుత్వం తగ్గిపోయి పనిచేసేశక్తి క్షీణిస్తుంది. పనిచేయగలిగినంత కాలం పనిలో నిమగ్నమైపోతాడు. అనేక విషయాలలో తల దూర్చుతాడు. తన చుట్టూ పెద్ద లంపటాన్ని చేర్చుకుంటాడు. ఇక వృద్ధాప్యంలో దానిని గురించిన ఆలోచనలు - చింతలు. 

🌺ఇలా వృద్ధాప్యం గడిచిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడో ఒక్కప్పుడు అన్ని బంధాలు తెంచుకొని, దేహంతో సహా అన్నింటిని, అందరిని వదలి అవ్యక్తంలోకి వెళ్ళిపోవటమే. 

🌺జీవితమంతా ఇలా గడచిపోతుంటే ఇక జీవిత పరమార్థమైన మోక్షాన్ని అందుకోవటానికి కృషి చేసేదెప్పుడు? పరమాత్మను చేరుకొనేదెప్పుడు? అన్నీ లౌకికవిషయాలే అయితే పారమార్థిక విషయాలకు చోటెక్కడ? మనిషిగా పుట్టినందుకు, భగవంతుడు వివేకాన్ని ఇచ్చినందుకు వాటిని ఉపయోగించుకొని సాధించవలసినది ఇదేనా? కానేకాదు*. 

🌺పరమాత్మవైపుకు బుద్ధిని మళ్ళించి - ఆయనపై ప్రేమానురాగాలు చూపించి, ఆయనకు సంబంధించిన సత్కర్మలు చేస్తూ, ఆయనను గురించి ఆలోచనలు చేస్తూ, ఆయనను స్మరిస్తూ, ఆయనను అందుకోవటమే మానవ జీవిత పరమార్థం. అందుకే మనకు మానవ జన్మ లభించింది. పరమాత్మను అందుకుంటున్నాం అంటే దుఃఖాలతో, బాధలతో కూడిన ఈ సంసార జనన మరణ చక్రం నుండి తప్పించుకొని మనను మనం ఉద్ధరించుకొంటున్నామన్న మాట. క్షణికమైన లాభనష్టాలు, సుఖదుఃఖాల నుండి విముక్తి చెంది శాశ్వత పరిపూర్ణ ఆనందాన్ని అందుకొంటున్నామన్న మాట. 

🌺కనుక జీవితమంతా ఆటపాటలతోను, కామవాంఛలతోను, చింతలతోను గడిపి, జీవితాన్ని వ్యర్థం చేస్తుకోవటం గాక సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మవైపుకు అడుగు వేయాలి. అదీ బాల్యంలోనే వేస్తే మహా అదృష్టం. అలాగాక పోతే యౌవనంలోనన్నా వేయాలి. కనీసం వృద్ధాప్యంలో కూడా భగవంతునివైపు తిరగలేకపోతే ఈ మానవజీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్లే. 

ఓం శ్రీ సాయి నాథాయ నమో నమః..
    
Saturday, January 2, 2021 0 comments By: visalakshi

భగవంతుని పాదపూజ..

 

               #శ్రీ షిర్డీ సాయినాథ చరణం శరణం..*

భగవానుడొక్కడే పాదపూజకు అర్హుడు. ఆయన సృష్టికర్త, అనంతుడు. ఆయన చరణాలు శ్రీచరణాలు. అహంకారాన్ని, ఆభిజాత్యాన్ని వదిలిపెట్టి చేసే పాదసేవ సంపూర్ణ శరణాగతికి నిదర్శనం. మనసులోని సకల కల్మష భావాలను ఆవల పెట్టి చేసే సేవే పాదసేవనం.

అనంతుడి పాదపీఠమే భూమి. హరిపాదం సోకని తావుండదు. ఆయన సర్వవ్యాపకుడు. విశ్వం మొత్తాన్ని ప్రకాశింపజేసే చైతన్యరూపం ఆయనది. బ్రహ్మాండ గోళాలన్నింటినీ కొలిచిన పాదం. ఒక పాదంతో భూమిని, మరొకపాదంతో ఆకాశాన్ని ఆక్రమించి తన విరాట్‌ స్వరూపాన్ని ప్రదర్శించాడు. అహంకారంతో తుళ్ళిపడే జీవులను సంస్కరించిన పాదమది. పావనగంగ ఆ పాదాలనుంచే ఉద్భవించింది. అందుకే భక్తి జగత్తులో, మనసును పుష్పంలా మలచి ఆ పాదాలకు సమర్పించాలి. మనోవాక్కాయ కర్మలు ఏకీకృతమై, శుద్ధత్వంతో ఆ పాదాలను ఆశ్రయించాలి. భగవానుడికి సమర్పించే అధాంగపూజలో ప్రథమంగా పాదౌ పూజయామి అంటారు.

హిరణ్యకశిపుణ్ని తన నరసింహాకృతితో వధించిన పిదప, ఉగ్రరూపంలో సింహాసనాన్ని అధిష్ఠించిన శ్రీహరిని ప్రహ్లాదుడు నీ పాదాశ్రయుడిగా చేయమంటూ ప్రార్థిస్తాడు. అంతకన్నా సామ్రాజ్య వైభవాలు వద్దంటాడు.

శ్రీరామచంద్రుడి పాదుకలను తలపై ధరిస్తాడు భరతుడు. తల ఉన్నతమైన స్థానం. అది బ్రహ్మరంధ్రం ఉండే చోటు. సహస్రారకమలం నెలవై ఉండే చోటు. శ్రీరామచంద్రుడి పాదుకలను సింహాసనంపై ఉంచి శ్రీరామచంద్రుడి పేరిట రాజ్యపాలన చేస్తాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కాళియుడి పడగలపై నాట్యం చేస్తాడు. ఆయన పాదముద్రలే నాగజాతికి అలంకారాలయ్యాయి.

శ్రీకృష్ణుడు గోవులతో గోపబాలురతో యమునాతీరంలో బృందావనంలో విహరిస్తుండగా గోవులను, గోప బాలురను మాయం చేస్తాడా విధాత. సృష్టికి ప్రతిసృష్టి చేస్తాడు శ్రీకృష్ణుడు. మనసును కమ్మిన మాయ, అహంకారం తొలగుతాయి విధాతకు. శ్రీకృష్ణుడి అవతార వైభవానికి తన్మయుడైన విధాత ‘స్వామీ! ఆ బ్రహ్మపథం ఎందుకు! నీతో కలిసి ఆడిపాడే గోపబాలుర పాదరేణువు నా తలపై ధరించినా నాకది చాలు’నంటాడు. మధురానగరంలో మాలాకారుడైన సుదాముణ్ని అనుగ్రహించి వరం కోరుకొమ్మని అంటాడు శ్రీకృష్ణుడు. నీ పాదకమల సేవ నీ పాదార్చకులతోడి స్నేహం అనుగ్రహించమని అడుగుతాడు సుదాముడు.

ఆదిశంకరుల అద్భుత రచనల్లో దేవీదేవతల పాదాల వైభవాన్ని వర్ణించారు.

సర్వ భయాలను పోగొట్టి సుఖాలనిచ్చే సదాశివుడి పాదపద్మాలను ఆశ్రయించాలని శివానందలహరిలో ప్రబోధిస్తారు. అరిషడ్వర్గాలను తొలగించి ముక్తిపథాన్ని చూపేది ఒక్క గురుపాదాలేనని, తన గురుపాదుకాస్తోత్రం ద్వారా తెలియజేశారు.

వివాహ వేడుకలో వరపూజ ముఖ్యమైన ఘట్టం. కన్యాదాత వరుణ్ని లక్ష్మీనారాయణ స్వరూపుడిగా భావించి, సుగంధ పూజాద్రవ్యాలతో కూడిన జలంతో పాదప్రక్షాళన చేస్తారు. అలాగే తల్లిదండ్రులను దైవస్వరూపులుగా భావించి, పాదపూజ జరుపుతుంది సంతానం. పాదప్రక్షాళన చేసిన జలాన్ని తమ శిరస్సులపై చిలకరించుకొని ధన్యత చెందినట్లుగా భావిస్తారు.

వినమ్రతకు, మనసులో మెదిలే భక్తి భావనకు నిదర్శనాలు ఇవన్నీ. ఆధ్యాత్మిక సాధనాజగత్తులో పాదసేవ గొప్ప సంస్కారవంతమైనది. భగవానుడి అవతారమూర్తుల చరణాలపైన నిలిచే దృష్టి, ఆ రూప వైభవాన్ని, తత్వాన్ని కాలగమనంలో గ్రహించగలుగుతుంది.

ఆ పాదాలకు-మనసుకు బంధం ఏర్పడాలి. ఆ బంధం మానవుణ్ని మాధవత్వం వైపు నడుపుతుంది.

                 శ్రీ సాయి చరణారవిందార్పితం..



#శాంతాకారం - శ్లోకంలోని అద్భుత భావన*


శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాధా(కా)రం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం!

లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం

వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైక నాథం!!


ఇందులో సృష్టిక్రమం..

సృష్టిని పాలించే ఈశ్వర స్వరూపం..

ఒక చక్కని క్రమపద్ధతిలో నిబద్ధించారు.


#శాంతాకారం

సృష్టికి పూర్వం ఈ జగమంతా శాంత స్థితిలో ఉన్నది.

శాంతం, శమనం – అంటే అన్నీ లయించిన స్థితి.

అనేకంగా ఉన్న వృక్షం, బీజంలో లీనమయినట్లుగా, సర్వ జగతి, పరమాత్మయందే లీనమై ఉన్న స్థితి – శాంతి.

ఏ వికారమూ లేని పరిపూర్ణత్వాన్ని కూడా, ఈ శబ్దం తెలియజేస్తోంది.

శాంతమే తన స్వరూపంగా కలిగిన పరమాత్మ.


#భుజగ శయనం

భుజగశయనుడు..అనంత కాలతత్త్వమే అనంతుడు – ఆదిశేషువు – భుజగము.

ఈ కాలానికి ఆవల కాలాన్ని అధిష్ఠించిన ఈశ్వరుడే భుజగశయనుడు.

కాలానికి లొంగి ఉన్నవి లోకాలు.

కాలాతీతుడు, కాలం ద్వారా జగతిని శాసించే భగవానుడు కాలభుజగశయనుడు.


#పద్మనాభం

సృష్టికి తగిన కాలాన్ని అధిష్ఠించిన నారాయణుని సంకల్పం మేరకు, సృష్టి బీజాల సమాహార రూపమైన పద్మం, ఆయన నాభీ కమలం నుండి ఆవిర్భవించింది.

సృష్టిగా విచ్చుకుంటున్న బీజ స్వరూపమే పద్మం.

దానికి నాభి (కేంద్రం) విష్ణువే.

అందుకే ఆయన ‘పద్మనాభుడు’.


#సురేశం

విశ్వపు తొలిరూపమైన ఆ పద్మమందు,

విష్ణు శక్తియే సృష్టికర్తగా, బ్రహ్మగా వ్యక్తమయింది.

నలువైపులా దృష్టిని ప్రసరించి తన నుండి జగన్నియామక శక్తులైన వివిధ దేవతలను వ్యక్తీకరించాడు బ్రహ్మ.

జగతికి మేలు(సు)కలిగించే వారే సురలు

(సు- అంటే మేలు, ‘రాతి’ అంటే కలిగించు వాడు. సుం-రాతి – మేలును కలిగించువారు సురలు).

ఈ దేవతా శక్తులతో విశ్వమంతా నిర్మితమయింది. నిజానికి దేవతా శక్తులు స్వతంత్రులు కాదు.

ఆ శక్తులన్నీ ఆదిమూలమైన వాసుదేవుని కిరణాలే.

అందుకే ఆ సురలందరికీ తానే నియామకుడై ‘సురేశు’డయ్యాడు.


#విశ్వాధారం

కనిపిస్తున్న విశ్వాన్ని నియమించే సూక్ష్మ శక్తులు ‘సురలు’. వారితో పాటు విశ్వానికి సైతం ఆధారమై ఉన్న చైతన్యం ఆ వాసుదేవుడు.

సమస్తమునకు ఆధారమై ఉన్నందున అతడే ‘విశ్వాధారుడు’.

కనిపించే జగమంతా ఆయన చైతన్యంతో నిండి ఉన్నందున ఆతడే ‘విశ్వాకారుడు’ కూడా.

నదిలో అలలన్నిటికీ జలమే ‘ఆధారం’.

అలల ‘ఆకారం’  అంతా జలమే.

జలం అలలకు ఆధారమై, ఆకారమై ఉన్నట్లే..

విశ్వాధారుడై విశ్వాకారుడై పరమాత్మయే ఉన్నాడు.


#గగన సదృశం

ఇది ఎలా సంభవం?

ఆకాశంలో వ్యక్తమయ్యే సమస్తము నందూ, ఆకాశమే ఉన్నది.

సమస్తమూ ఆకాశము నందే ఉన్నది.

అదేవిధంగా ఆకాశంతో సహా,

సమస్త విశ్వమూ ఎవరియందు,

ఎవరిచే వ్యాప్తమై ఉందో,

అతడే పరమాత్మ.

అందుకే ఆయన ‘గగనసదృశుడు’(గగనం వంటివాడు).

ఇదే భావాన్ని ‘ఆకాశాత్ సర్వగతః సుసూక్ష్మః’ అంటూ ఉపనిషత్తు ప్రకటిస్తోంది.

ఇది నిరాకారుడైన పరమేశ్వరుని తెలియజేస్తోంది.


#మేఘవర్ణం

నిరాకారుడై సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మయే..

తన లీలా శక్తితో భక్తులను అనుగ్రహించడానికై దివ్యమంగళ విగ్రహుడై సాకారుడయ్యాడు.

ఆ సాకారం ‘మేఘవర్ణం’ (మబ్బువన్నె)గా ఉన్నది.


#శుభాంగం

మేఘం నీటితో నిండి తాపాన్నీ, దాహాన్నీ పోగొడుతుంది. అదేవిధంగా కరుణారసంతో నిండిన విష్ణు మేఘం, సంసార తాపత్రయాల్ని పోగొట్టి, జ్ఞానదాహాన్ని తీర్చుతున్నది.

అందుకే అది నీలమేఘశ్యామం.

ఆ శ్యామల వర్ణ దేహంలో ప్రత్యంగమూ శుభమే. ప్రాపంచిక దేహాలు ప్రకృతి దోషాలతో కూడి ఉంటాయి కనుక అవి అశుభ రూపాలే.

కానీ స్వామి దాల్చిన విగ్రహంలో అవయవాలు శుభ స్వరూపాలు.

తలచే వారికి శుభాలు కలిగించే స్వభావంతో దివ్యమంగళ స్వరూపంగా భాసిస్తున్నాడు భగవానుడు.

అందుకే ఆయన రూపం ‘శుభాంగం’.


#లక్ష్మీ_కాంతం

ప్రపంచాన్ని పోషించే ఐశ్వర్యాలన్నీ ఆయనను ఆశ్రయించుకున్నాయి.

ఐశ్వర్యాల అధిదేవత లక్ష్మి ఆయననే చేరి,

ఆయన సంకల్పానుగుణంగా ప్రవర్తిస్తున్నది.

అందుకే ఆ శుభ స్వరూపం ‘లక్ష్మీకాంతం’.


#కమల_నయనం

ఐశ్వర్య దేవతకు ప్రీతికరం.

కమలముల వలె విచ్చుకున్న సూర్యచంద్ర కాంతులతో జగతిని గమనిస్తున్న కరుణామయ దృష్టి కల భగవానుడు ‘కమలనయనుడు’.


#యోగిహృద్యానగమ్యం

ఇటువంటి విష్ణుతత్త్వం, స్వరూపం అందరూ అందుకోలేరు.

యోగులు మాత్రమే ఏకాగ్రమైన దృష్టితో ధ్యానం ద్వారా తమ హృదయాలలో దర్శించగలుగుతున్నారు.

ఆ కారణం చేతనే అతడు ‘యోగిహృత్ ధ్యానగమ్యుడు’.


#వందే విష్ణుం  భవ భయహరం

విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడు కనుక ‘విష్ణువు’.

ఈ తత్త్వాన్ని గ్రహించి, శుభాంగాన్ని ధ్యానించే వానికి ఈ సంసారంలో భయాలు తొలగి, అవిద్య నశిస్తున్నది. అందుకే ఆ స్వామి ‘భవభయహరుడు’.


#సర్వలోకైకనాథమ్

సర్వలోకములకు ప్రధానమైన నాథుడు అతడే ‘సర్వలోకైకనాథమ్’.


14నామాలతో ‘విశ్వానికీ – విష్ణువునకు’ ఉన్న అభిన్న సంబంధాన్ని, ఈ శ్లోకం స్పష్టపరుస్తోంది.


ఒకే శ్లోకంలో, విశ్వానికి పూర్వ స్థితి నుండి సృష్టి స్థితులను కూడా నిర్వహిస్తున్న భగవత్తత్త్వాన్ని స్పష్టపరచడం, ఆర్ష దృష్టి వైభవం.


ఇంత స్పష్టంగా పరమేశ్వరుని గొప్పతనాన్ని,

ఆయనలోని సాకార నిరాకార తత్వాలను తెలియజేస్తూ యోగపూర్వక ధ్యానం ద్వారా,

మన హృదయాలలోనే ఆయనను దర్శించగలమనే, సాధనా రహస్యాన్ని కూడా, ఈ శ్లోకం అందిస్తోంది.


                 సర్వం శ్రీ పరమేశ్వరార్పణ మస్తు....



Tuesday, December 29, 2020 1 comments By: visalakshi

శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం...

 #శ్రీ దత్తాత్రేయ వజ్రకవచమ్* 

#తాత్పర్యం


పూర్వం వేదవ్యాస మహర్షిని సంకల్పసిద్ధి పొందే ఉపాయం చెప్పమని ఋషులు అడిగిరి. అందుకు వేదవ్యాస మహర్షి, ఒక్కసారి చదివితే చాలు సంకల్పాన్ని సిద్ధింపచేసేది, భోగమోక్షాలను ప్రసాదించేది చెపుతాను, అందరూ వినండి అంటూ ఉపక్రమించాడు.


హిమవత్పర్వత గౌరీశృంగంపై రత్నసింహాసనం మీద ఆసీనుడై ఉన్న పరమేశ్వరునితో ఒకనాడు పార్వతీ దేవి, "ఓ లోక శంకరా! నీవల్ల అనేక మంత్రాలను, యంత్రాలను, తంత్రాలను తెలుసుకున్నాను, ఇప్పుడు మహీతలాన్ని దర్శించాలని కోరుకుంటున్నాను" అని పలికింది. పార్వతి కోరికను సంతోషంతో అంగీకరించిన పరమేశ్వరుడు వృషభవాహనం పై బయలు దేరి భూలోక వింతలు చూపించసాగాడు. వారు వింధ్య పర్వత ప్రాంతంలోని ఒక దుర్గమమైన అరణ్యానికి చేరుకున్నారు. అక్కడ వారికి గొడ్డలి ధరించి సమిధలను సేకరిస్తున్న ఒక కిరాతుడు కనిపించాడు. అతని శరీరం వజ్రము వలె ధృఢముగా ఉన్నది. ఇంతలో ఒక పెద్ద పులి అతని పై దాడి చేయుటకు వేగముగా వచ్చినది. అయితే దానిని చూచిన కిరాతుడు తనను రక్షించుకొనుటకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. పైగా సంతోషముతో నిర్భయముగా నిలబడి ఉన్నాడు. అదే సమయములో ఒక లేడి పరిగెత్తుకుంటూ అక్కడకు రాగా దానిని చూచిన పులి బెదిరి పారిపోయింది.


ఈ వింతను చూసిన పార్వతి శంకరునితో "ఏమాశ్చర్యం! ప్రభూ, ఎదురుగా చూడు" అన్నది. దానికి పరమేశ్వరుడు "దేవీ! మేము చూడనిదంటూ లోకంలో ఏ కొంచమూ లేదు. వాక్కులకు, మనస్సుకు అందని అద్భుతం నీకు చెబుతాను, విను" అంటూ చెప్పనారంభించాడు.


ఈ భిల్లుని పేరు దూరశ్రవుడు. పరమ ధార్మికుడు. ప్రతీరోజూ అడవికి వెళ్ళి కష్టపడి సమిధలూ, దర్భలూ, పుష్పాలూ, కందమూల ఫలాలూ తెచ్చి మునీంద్రులకిస్తాడు. ప్రతిఫలంగా తానేమీ కోరడు. ఆ మునులందరూ కూడా అతని పట్ల దయతో ఉంటారు.


అక్కడే దలాదనుడను మహాయోగి ఉన్నాడు. ఒకనాడు దలాదనుడు, "దత్తాత్రేయుడు స్మర్తృగామి (స్మరించిన‌వారి వద్దకు తక్షణమే వెళతాడు)" అని విన్న కథను తలుచుకొని, దత్తుని స్మరించాడు. మరుక్షణంలో దత్త యోగీంద్రుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దలాదన మహర్షి ఆశ్చర్యానందాలు పెల్లుబికగా ఆయనను పూజించి, "ఓ దత్తాత్రేయ మహామునీ! నా ఆహ్వానం విని నీవు విచ్చేశావు. స్మర్తృగామివని విని, కేవలం పరీక్షించడానికే నిన్ను స్మరించాను. నా అపరాధం మన్నించు." అన్నాడు. అందుకు దత్త భగవానుడు ఆ మునితో "నా ప్రకృతి ఇటువంటిది. భక్తితోగాని, భక్తి లేకుండా కాని అనన్యచిత్తంతో నన్ను స్మరించిన వారి వద్దకు వెళ్ళి వారి కోరికలు తీరుస్తాను" అని చెప్పాడు. "నీవు తలచుకున్నందుకు వచ్చాను గదా, నీకు ఏమి కావాలో కోరుకో" అని దత్తుడు అడుగగా, దలాదుడు, "ఓ మునిపుంగవా! నేనేమీ అడగను. నీ మనస్సులో ఉన్నది, నాకు శ్రేయస్కరమైనది నాకు ప్రసాదింపుము" అన్నాడు.


శ్రీ దత్తాత్రేయుడు, "నా వజ్రకవచం ఉన్నది, తీసుకో" అని చెప్పగా, దలాదుడు అంగీకరించాడు. దత్తుడు తన వజ్రకవచమునకు సంబంధించిన ఋషినీ, ఛందస్సునూ చెప్పి, న్యాసం, ధ్యానం, ప్రయోజనము అన్నీ వివరించి చెప్పాడు.


#దత్తాత్రేయ ధ్యానమ్ :


జగత్తు అనే మొక్కకు దుంప వంటి వాడు, సచ్చిదానంద మూర్తి, యోగీంద్రచంద్రుడు, పరమాత్మ అయిన దత్తాత్రేయునికి నమస్కారము. ఒకప్పుడు యోగి, ఒకప్పుడు భోగి, ఒకప్పుడు నగ్నంగా పిశాచి వలె ఉండే దత్తాత్రేయుడు ప్రత్యక్ష హరి స్వరూపుడు. భుక్తి ముక్తి ప్రదాయకుడు. ఆయన ప్రతిదినమూ వారణాసిలో స్నానము, కొల్హాపురంలో జపము, మాహురీపురంలో భిక్ష స్వీకరించి, సహ్యాద్రిపై శయనిస్తాడు. ఆయన శరీరం ఇంద్రనీలమణి వలె, కాంతి వెన్నెల వలె, జటలు వైఢూర్యం వలే ఉంటాయి. కన్నులు తెల్లగా మైత్రితో, కనుపాపలు చాలా నీలంగా ఉంటాయి. కనుబొమలూ, గుండెలపై రోమాలూ, గెడ్డమూ, మీసాలూ నల్లగా ఉంటాయి. నవ్వు పొగమంచు కంటే చల్లగా, కంఠం శంఖం కంటే అందంగా ఉంటాయి. భుజాలు పుష్ఠిగా ఉంటాయి. బాహువులు పొడవుగా, చేతులు చిగుళ్ళ కంటే కోమలంగా ఉంటాయి. వక్షస్థలం విశాలంగా బలిసి ఉంటుంది. పలుచటి ఉదరంతో, విశాలమైన పిరుదులతో, అందంగా ఉంటాడు. కటి స్థలం విశాలంగా, తొడలు అరటిబోదెల వలె ఉంటాయి. చక్కటి మోకాళ్ళు, పిక్కలూ కలిగి ఉంటాడు. చీలమండలు గూఢంగా ఉంటాయి. పాదాల పైభాగాలు తాబేటి డిప్పల వలె ఉంటాయి. అరికాళ్ళు ఎర్ర తామర పువ్వుల వలె అందంగా ఉంటాయి.


ఆయన మృగచర్మమును వస్త్రంగా ధరిస్తాడు. ప్రతీక్షణమూ తనను తలచుకున్న వారి వద్దకు వెళుతుంటాడు. జ్ఞానోపదేశం చేయటమంటే ఇష్టం. ఆపదలు తొలగించటం ఆయన దీక్ష. సిద్ధాసనంలో నిటారుగా కూర్చుని ఉంటాడు. నవ్వు ముఖం. ఎడమచేత వరదముద్ర, కుడిచేత అభయ ముద్ర. బాలురు, ఉన్మత్తులు, పిశాచాలతో కలిసి తిరుగుతుంటాడు. త్యాగి. భోగి. మహాయోగి. నిత్యానందుడు. నిరంజనుడు, సర్వరూపి, సర్వదాత, సర్వగామి. సర్వకామదుడు. భస్మోద్ధూళిత శరీరుడు. మహాపాతకాలను నాశనం చేసేవాడు. భోగ మోక్ష ప్రదాయకుడు.


"ఇలా ధ్యానం చేసి అనన్యచిత్తంతో నా వజ్రకవచాన్ని పఠించాలి. సర్వత్రా నన్నే దర్శిస్తూ, నాతో సంచరించాలి" అని దత్తుడు తెలిపాడు.


దత్తుడు దిగంబరుడు, భస్మ సుగంధం పూసుకున్నవాడు. చక్రం, త్రిశూలం, డమ్రువు, గద అనే ఆయుధాలు ధరించినవాడు. పద్మాసనుడు. యోగీంద్రులూ, మునీంద్రులూ నిత్యమూ ఆయనను "దత్తా, దత్తా" అంటూ నమస్కరిస్తూంటారు.


#దత్తాత్రేయ వజ్రకవచమ్ 


ఓం, దత్తాత్రేయుడు సహస్రార కమలంలో ఉండి, శిరస్సును రక్షించుగాక. అనసూయేయుడు చంద్రమండల మధ్యభాగంలో ఉండి ఫాలాన్ని కాపాడుగాక. మనోమయుడు హం క్షం ద్విదళ పద్మభవుడై భ్రూమధ్యమును రక్షించుగాక. జ్యోతిరూపుడు రెండు కన్నులను, శబ్ద స్వరూపుడు రెండు చెవులను, గంధ స్వరూపుడు ముక్కును, రస స్వరూపుడు నోటిని, వేద స్వరూపుడు నాలుకను, ధర్మ స్వరూపుడు దంతాలను మరియూ రెండు పెదవులను కాపాడుగాక. అత్రిభవుడు నా చెక్కిళ్ళను, ఆ తత్వవేత్త నా ముఖమంతటినీ కాపాడుగాక. సర్వస్వరూపుడు, నా ఆత్మలో ఉండేవాడు షోడశారకమలంలో ఉండి, నా కంఠాన్ని రక్షించుగాక. చంద్రానుజుడు నా భుజ శిరస్సులను, కృతాదిభవుడు నా భుజాలను, శత్రుజిత్తు కొంకులను, హరి వక్షస్థలాన్ని కాపాడుగాక. కకారాది ఠకారాంతమైన ద్వాదశారకమలంలో ఉన్న వాయు స్వరూపుడు యోగీశ్వరేశ్వరుడు నా హృదయాన్ని రక్షించుగాక. పార్శ్వస్థితుడనే హరి నా పార్శ్వాలను, హఠయోగాది యోగజ్ఞుడు మరియు కృపానిధి నా కుక్షినీ కాపాడుగాక. డకారాది ఫకారాంతం కల దశారకమలంలో ఉండే అగ్ని స్వరూపుడు నా నాభిని, వహ్నితత్వమయుడైన యోగి నా మణిపూరకాన్ని రక్షించుగాక. కటిలోని బ్రహ్మాండ వాసుదేవ స్వరూపుడు నా కటిని కాపాడుగాక. బకారాది లకారాంతమైన షట్పత్రకమలాన్ని వికసింపచేసే జలతత్వమయుడైన యోగి నా స్వాధిష్ఠాన చక్రాన్ని రక్షించుగాక. సిద్ధాసనంలో కూర్చున్న సిద్ధేశ్వరుడు నా ఊరువులను కాపాడుగాక. వకారాది సకారాంతమైన నాలుగు రేకుల కమలాన్ని వికసింపచేసే మహీరూపుడైన వీర్యనిగ్రహశాలి, మోకాళ్ళపై హస్తపద్మాలు పెట్టుకున్నవాడు నా మూలాధార చక్రాన్ని, ఇంకా అన్ని వైపులనుండీ నా పృష్ఠాన్ని రక్షించుగాక. అవధూతేంద్రుడు నా పిక్కలను, తీర్థపావనుడు నా రెండు పాదాలను, సర్వాత్ముడు నా సర్వాంగాలను కాపాడుగాక.


కేశవుడు నా రోమాలను రక్షించుగాక. చర్మాంబరుడు నా చర్మాన్ని, భక్తిప్రియుడు నా రక్తాన్ని, మాంసకరుడు నా మాంసాన్ని, మజ్జాస్వరూపుడు నా మజ్జను, స్థిరబుద్ధి గలవాడు నా అస్థులను, వేధ నా మేధను, సుఖకరుడు నా శుక్రాన్ని కాపాడుగాక. దృఢాకృతి నా చిత్తాన్ని, హృషీకేశాత్మకుడు నా మనస్సును, బుద్ధిని, అహంకారాన్ని, ఈశుడు నా కర్మేంద్రియాలను, అజుడు నా జ్ఞానేంద్రియాలను రక్షించుగాక. బంధూత్తముడు నా బంధువులను కాపాడుగాక. శత్రుజిత్తు నన్ను శత్రువులనుండి కాపాడుగాక. శంకరుడు నా ఇల్లు, తోట, ధనం, పొలం, పుత్రులు మొదలైనవి రక్షించుగాక. ప్రకృతివిదుడు నా భార్యను కాపాడుగాక. శార్ ఙ్గభృత్తు నా పశువులను రక్షించుగాక. ప్రధానజ్ఞుడు నా ప్రాణాలను, భాస్కరుడు నా భక్ష్యాదులను, చంద్రాత్మకుడు నా సుఖాన్ని పాలించుగాక. పురాంతకుడు నన్ను దుఃఖం నుండి రక్షించుగాక. పశుపతి నా పశువులను, భూతేశ్వరుడు నా ఐశ్వర్యాన్ని పాలించుగాక.


విషహరుడు తూర్పున, యజ్ఞస్వరూపుడు ఆగ్నేయాన, ధర్మాత్మకుడు దక్షిణాన, సర్వవైరిహృత్ నైరృతి మూల, వరాహుడు పడమటి దిక్కున, ప్రాణదుడు వాయువ్యపు మూల, ధనదుడు ఉత్తరాన, మహాగురుడు ఈశాన్యాన, మహాసిద్ధుడు ఊర్ధ్వదిక్కున, జటాధరుడు అధోదిశన రక్షించాలి. ఆది మునీశ్వరుడు ఏ దిక్కు రక్షణ లేకుండా ఉంటే ఆ దిక్కును కాపాడాలి.


"ఈ నా వజ్రకవచాన్ని ఎవడు చదివినా విన్నా వాడు వజ్రకాయుడు చిరంజీవి కాగలడు. అతడు త్యాగి, భోగి, మహాయోగి, సుఖ దుఃఖ రహితుడు, సర్వత్ర సిద్ధసంకల్పుడు, జీవన్ముక్తుడు అయి వర్తమానంలో ఉంటాడు." అని చెప్పి దత్తాత్రేయ యోగి అంతర్థానం చెందాడు. దలాదుడు కూడా అది జపించి జీవన్ముక్తుడైనాడు. దూరశ్రవుడు అనే భిల్లుడు అప్పుడు దీనిని విన్నాడు. ఒక్కసారి విన్నంతనే వజ్రకాయుడయ్యాడు.


దత్తాత్రేయ కవచమంతా శివుని నోట విన్న పార్వతి, "ఈ కవచం మహత్మ్యమూ, ఉపయోగించే విధానమూ తెలియచేయ"మని అన్నది. వినయంగా అడిగిన పార్వతి ప్రశ్నకు, "ఓ పార్వతీ ఏకాగ్రతతో విను. ధర్మార్థకామ మోక్షాలకు ఇదే ఆధారం"


"ఇది ఏనుగులనూ, గుర్రాలనూ, రథాలనూ, కాలిబంట్లనూ, సర్వైశ్వర్యాన్ని ఇస్తుంది. పుత్ర మిత్ర కళత్రాది సర్వసంతోష సాధనము. వేదశాస్త్రాది విద్యలకు నిధానము. సంగీత, శాస్త్ర సాహిత్య, సత్కవిత్వాలను ప్రసాదిస్తుంది. బుద్ధిని, విద్యను, తలపును, ప్రజ్ఞను, మతిని, నేర్పును ఇస్తుంది. శత్రువులను శీఘ్రమే సంహరిస్తుంది. యశస్సును, కీర్తినీ పెంచుతుంది."


"దీనిని వెయ్యి సార్లు జపిస్తే ఎనిమిది మహారోగాలూ, పదమూడు సన్నిపాతాలూ, తొంభై ఆరు కంటిజబ్బులూ, ఇరవై మేహ రోగాలూ, పద్దెనిమిది కుష్ఠు రోగాలూ, ఎనిమిది విధాల గుల్మాలూ, ఎనభై వాత రోగాలూ, నలభై పైత్య రోగాలూ, ఇరవై శ్లేష్మ రోగాలూ, క్షయ, చాతుర్థికం మొదలైనవీ, మంత్ర యంత్ర, కుత్సిత యోగాదులూ, కల్పతంత్రాదుల వల్ల కలిగించినవీ, బ్రహ్మరాక్షసులూ, భేతాళులూ, కూష్మాండాది గ్రహాలూ, వీటి వల్ల కలిగినవీ, ఆయా దేశకాలాలలో ఉన్నవీ, తాపత్రయం వల్ల కలిగినవీ, నవగ్రహాల వల్ల ఏర్పడినవీ, మహాపాతకాల వల్ల కలిగినవీ, అన్ని రోగాలూ పూర్తిగా నశిస్తాయి. ఇది నిశ్చయం."


"పది వేలసార్లు జపిస్తే గొడ్రాలు పుత్రవతి అవుతుంది. ఇరవై వేలసార్లు జపిస్తే అపమృత్యుజయం లభిస్తుంది. ముప్ఫై వేల సార్లు జపిస్తే ఆకాశ సంచారం అలవడుతుంది. కోటిమార్లు జపిస్తే సర్వకార్యాలు సాధ్యమవుతాయి. లక్ష సార్లకే కార్యసిద్ధి కలుగుతుంది. సంశయం లేదు."


"విషముష్టి చెట్టు మొదట దక్షిణాభిముఖంగా ఒక్క నెల జపిస్తే శత్రువు వికలేంద్రియుడవుతాడు. వృద్ధికి మేడి చెట్టు మొదటా, సిరి కోసం లక్ష్మీ బిల్వం మొదటా, అరిష్టాదుల శాంతికి చింతచెట్టు మొదటా, ఓజస్సు కోసం రావి చెట్టు మొదటా, భార్య కొరకై తీయ మామిడి చెట్టు మొదటా, జ్ఞానార్థం తులసి చెంతా జపించాలి. సంతతి కావాలనుకొనేవారు గర్భగృహంలో, ధనార్థులు మంచి క్షేత్రాలలో, పశువులు కోసం గోశాలలో, ఏ కోరిక గలవరైనా దేవాలయంలోనూ జపించాలి."


"బొడ్డులోతు నీటిలో నిలబడి సూర్యుని చూస్తూ వేయిసార్లు జపించినవాడు యుద్ధంలోగానీ, శాస్త్రవాదంలో గానీ జయిస్తాడు. గొంతులోతు నీటిలో రాత్రిపూట కవచం పఠిస్తే, జ్వరం, అపస్మారం, కుష్ఠు మొదలైన రోగాలూ తాపజ్వరాలూ తొలిగిపోతాయి."


"ఏది ఏది ఎక్కడ స్థిరంగా ఉంటుందో, ఏది ఏది ప్రసన్నమైతే అది నివారణమౌతుందో దాని కొరకు అక్కడ జపిస్తే సిద్ధి కలుగుతుంది. ఇది నిశ్చయం."


అని శివుడు చెప్పాడు. ఈ వజ్రకవచాన్ని పఠించినవాడు దత్తాత్రేయ సమానుడౌతాడు. ఈ విధంగా దత్తాత్రేయుడు దలాదునికి చెప్పినది, శివుడు పార్వతికి తెలియచేశాడు. ఈ కవచమును పఠించినవాడు ఈ లోకంలో దత్తుని వలె యోగి, చిరాయుష్మంతుడు అయి చరిస్తాడు.

Thursday, December 24, 2020 0 comments By: visalakshi

ఉత్తర ద్వార దర్శనం - విశిష్టత*


భగవద్గీతలోని "సర్వారంభ పరిత్యాగీ:సర్వసంకల్ప సన్న్యాసి"అనే పదబంధాలలోని పరమార్ధం శరణార్ధి అయినవాడు స్వయం సంకల్పిత కర్మలు చేపట్టరాదని,భగవత్ సంకల్పం ఉంటే చేయగలమని..మన పూర్తి బాధ్యతను భగవంతునిపై మోపవలెనని సారాంశం.

 *వైకుంఠ ఏకాదశి విశిష్టత*


సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.

ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు.

ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి.. భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు.

ఈ ఒక్క ఏకాదశి.. మూడు కోట్ల ఏకాదశులతో సమానమట. అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.

ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య.. ముక్కోటి ఏకాదశి వస్తుందని చెబుతారు.

ముక్కోటి రోజున భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి మహావిష్ణువును దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తే మంచిదని చెబుతారు.

పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.

ఏకాదశి వ్రతంలో ఏడు నియమాలున్నాయి. ఒకటి దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. రెండు.. ఏకాదశి రోజు మొత్తం- ఉపవాసం ఉండాలి. మూడు.. అబద్ధం ఆడకూడదు. నాలుగు స్త్రీ సాంగత్యం పనికి రాదు. ఐదు.. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆరు.. ముక్కోటి రాత్రంతా జాగరణ చేయాలి. ఏడు.. అన్నదానం చేయాలి.

ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల.. నరక బాధలనుభవించే అతని పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!

మురాసురుడి కథ రెండోది

కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడు విష్ణుమూర్తికి విన్నవించారు. రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని, మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు.

విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.

ఇందులోని తాత్త్విక సందేశం ఇలా వుంది. విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. ఉపనిషత్తులు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్ధేశించి ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించాలి.

ఉపవాసం ద్వారా పదకొండు ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకుని, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించమని భావం. పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో కలుపుకుని మొత్తం పది. వాటితో పాటు.. మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం.

అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారని చెబుతారు.

ఇదీ హిందువులు పరమపవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశికి చెందిన పూర్తి సారాంశం.


వైకుంఠ ఏకాదశి నాడు ఆచరించవలసిన విధులు* 

 శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు వైకుంఠానికి తరలివెళ్లే సందర్భం- వైకుంఠ ఏకాదశి.

భక్తులందరికీ పరమ పవిత్రమైన ఈ రోజున ఆస్తికులు ఆచరించాల్సిన విధుల గురించి పెద్దలు ఈ విధంగా చెబుతున్నారు.

వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. స్నానానంతరం పూజాగదిని శుభ్రపరచుకుని తోరణాలతో అలంకరించాలి. వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తికి ప్రశస్తమైన తిథి కాబట్టి, హరికి ప్రీతిపాత్రమైన తులసీదళాలతో ఆ స్వామిని పూజించుకోవాలి.

ఈ రోజున విష్ణుమూర్తిని వైకుంఠద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలగడంతో... తమలాగానే వైకుంఠద్వారాన్ని పోలిన ద్వారం ద్వారా హరిని దర్శించుకునేవారికి మోక్షం కలగాలని వారు కోరుకున్నారట. ఉత్తర దిక్కు జ్ఞానానికి సూచన కాబట్టి.. ఇహలోకంలో కొట్టుమిట్టాడుతున్న తమ మనసుకి పరిపక్వత కలిగించమంటూ ఆ భగవంతుని వేడుకోవడం ఈ ఉత్తర ద్వార దర్శనంలోని ఆంతర్యంగా కనిపిస్తుంది.

ఏడాది పొడవునా ఏ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం కుదరకున్నా, ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అపార ఫలితం దక్కుతుందంటారు. మనలో ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు... ఇలా మొత్తం కలిపి ఏకాదశ ఇంద్రియాలు ఉంటాయి. 

ఈ ఏకాదశ ఇంద్రియాలనూ ఆ హరికి అర్పించే అరుదైన అవకాశమే ఏకాదశి వ్రతం.

ఇందుకోసం ముందురోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండి, ఏకాదశి రోజున కేవలం తులసి తీర్థాన్నే స్వీకరిస్తూ, మర్నాడు ఉదయం ఎవరికన్నా అన్నదానం చేసిన పిదప భుజించాలి.

ఏకాదశి రోజు రాత్రి భగవన్నామస్మరణతో జాగరణ చేయాలి. ఇలా జాగరణతో మనసునీ, ఉపవాసంతో శరీరాన్నీ అదుపు చేసుకుని... వాటిని హరిధ్యానంలోకి మరల్చడమే ఏకాదశి వ్రత ఉద్దేశం. అందుకనే లౌకికమైన ఆలోచనలు వేటికీ తావివ్వకుండా కేవలం హరినామస్మరణ మీదే మనసుని లగ్నం చేయాలని చెబుతారు. 

 ఇలా నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేసినవారికి ఇహపర శాంతి లభిస్తుంది.

 *హరినామ స్మరణం...* 

 *సమస్త పాప హరణం ....* 


*మార్గశిర శుద్ధ ఏకాదశి ... గీతా జయంతి*

గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పుట్టినరోజు. 

భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున గీతాజయంతి జరుపుకొంటారు. 

గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . 

కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం.

 గీకారం త్యాగరూపం స్యాత్

 తకారమ్ తత్వబోధకమ్

 గీతా వాక్య మిదమ్ తత్వం

 జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:

 గీత అను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపు చున్నది. 

"గీ" అనే అక్షరం త్యాగాన్నిను బోధించుచున్నది. "త" అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది. 

గీత అనే రెండుశబ్దములకు అర్థము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు. 

త్యాగశబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్థము వుంది . అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ, బంధమునుండి విముక్తి కలగటం అనే అర్థం వుంది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రము ఉపదేశించుచున్నది. 

అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈరోజు ఆపవిత్రగ్రంథాన్ని సృజించినా మహాపుణ్యము వస్తుంది

ఇక పఠన ప్రభావాన్ని వర్ణించనలవికాదు. మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథ రాజాన్ని ఈ రోజునుంచైనా పఠించటం మొదలెడదాం. 

  సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|

 పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం గీతామృతమ్మహత్||

ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. అందుకే అంటారు, సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా,అర్జునుడిని దూడగ మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా, ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి, ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే, మరొపక్క లొకానికి పాలను(ఉపనిషత్ సారమైన గీతను)అందించాడట.

అందుకే గీత సకల ఉపనిషత్ ల సారం. అర్జునుడు కాక మరెవరి ద్వారానూ ఈ ఉపదేశం ఇంత చక్కగానూ శాశ్వతకాలమూ అందరికీ చేరదు. ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునునికి ఈ మోహబుద్ధిని పుట్టించి, ఇనుముతో వస్తువుని చేయించదలచినవాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో, అలా అర్జునునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు. ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు, 

 మన వర్త్మానువర్టంతే మనుష్యాః పార్థ సర్వశః.

అంటే నేననుకున్న మార్గానికే వాళ్ళొస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను.

ఎప్పుడో ద్వాపరయుగంలో చెప్పింది ఇప్పుడు పాటించాలా,ఇప్పటికి అప్పటికి చాలా తేడా అని

కొందరి భావం.

అప్పుడు మనిషిలో స్వార్ధం,అహం,లాభం,మోసం

ఇంకా ఎన్నో చేదు భావనలు ఉన్నాయో,ఇప్పటికి మనిషిలో ఆ గుణాలు ఎక్కువైపోయాయి,

కాబట్టి కాలం మారినా పరిస్థితులు మారినా

మనిషి నైజం,బుధ్ధి మారలేదు.....

ఏ యుగానికైనా ఏ రోజుకైనా మానవాళికి పనికి వచ్చే బోధనలు భగవద్గీత సొంతం

.ఇది ఆ మతం ఈ మతం అని కాకుండా సర్వ మాన వాళికి పనికి వచ్చే అపురూప గ్రంధం,అద్భుతాలను నింపుకున్న ఆదర్శ గ్రంధం..

మాహేశ్వర సూత్రాలు...

 

#మాహేశ్వర సూత్రాలు:


పూర్వం పరమశివుడు నాట్యం చేస్తూ తన ఢమరుకాన్ని పదునాలుగు పర్యాయాలు మ్రోగించగా,ఆ శబ్దం నుండి పుట్టిన అక్షరాలను ‘పాణిని’ అనే ఋషి గ్రహించి,పదునాలుగు వ్యాకరణ సూత్రాలుగ రచించాడు. ఈ సూత్రాలే  "మాహేశ్వర" సూత్రాలుగ పిలువబడుతున్నాయి, ఆ సూత్రాలే అక్షరాల పుట్టుకకి ముఖ్య భూమికలు. ఈ శ్లోకం చూడండి. " నృత్తావసానే నాటరాజ రాజో / ననాద ఢక్కాం నవ పంచవారం"

(నవ=తొమ్మిది. పంచ=ఐదు కలిపితే =14)

ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్ /ఎతద్విమర్శే శివ సూత్రజాలం// అక్షరాలని సృష్టించి సూత్రీకరించింది పాణిని ఐతే, వాటికి వార్తీకం వ్రాసినది ‘వరరుచి’. వివరణాత్మకమైన భాష్యాన్ని వ్రాసినది ‘పతంజలి మహర్షి.’ అందుకనే "“వాక్యకారం వరరుచిం/ భాష్యకారం పతంజలిం/పాణినిం సూత్రకారంచ/ ప్రణతోస్మి మునిత్రయం// అని ముందుగా పైముగ్గురు మునులకి నమస్కరించి, పూర్వం  వ్యాకరణాన్ని, తద్వారా భాషని అభ్యసించేవారు. పదునాలుగు సూత్రాలని తెలుసుకొందాం.  ఇవి పరమేశ్వరుడు చేసిన ఢమరుక శబ్దం నుండి గ్రహింపబడినవి.


1‘అ ఇ ఉ ణ్’ (అకార, ఇకార, ఉకారాలు)

2‘ఋ లు క్’ (ఋకార అలుకారాలు)

3‘ఏ ఓం గ్’ ( ఏకార, ఓకారాలు)

4‘ ఐ ఔ చ్’ (ఐ కారము, ఔ కారము)

5‘హ య వ ర ట్’ (హకార, యకార, వకార, రకారాలు.)

6‘ల ణ్’ (లకారం)

7‘ఙ, మ, ఞ, ణ నం’ ( వర్గల యొక్క చివరి ఐదు అక్షరాలు )

8‘ఝ, భ య్’ ( ఝాకార, భకారాలు)

9‘ఘ,ఢ,ధ ష్’ ( ఘకారం, ఢ కారం, ధకారం)

10‘జ, బ, గ, డ ద శ్’ ( ఐదు అక్షరాలు )

11‘ఖ ఫ ఛ ఠ థ చ ట త వ్’ ( ఎనిమిది అక్షరాలు)

12‘క ప య్’ (క & ప )

13‘శ ష స ర్’( శకార, షకార,సకారాలు )

14‘హల్’ ( హకారం)

 



ఈ పదునాలుగు మహేశ్వరుని సూత్రాలు.


ప్రతి సూత్రం చివరఉన్న పొల్లు హల్లులు సులభంగా పలకడానికి నిర్దేశించబడినవి. అట్లే అచ్చులు, హల్లులు కూడ ప్రత్యాహార సంజ్ఞతో సులభంగ అర్థమయే రీతిలో నిర్దేశించబడినవి. అవి తొలి సూత్రములోని మొదటి అక్షరం ‘అ’ నాల్గవ సూత్రములోని చివరి హల్లు ‘చ్’ కలిపితే ‘అచ్’ సంజ్ఞ ఏర్పడి, వాటిమధ్య ఉండే అక్షరాలని ‘అచ్చులు’ అని వ్యవహరిస్తారని, ఐదవ సూత్రములోని మొదటి అక్షరం ‘హ’ని గ్రహించి పదునాల్గవ సూత్రములోని చివర ఉన్న ‘ల్’ అనే పొల్లుతో కలిపితే ‘హల్’అనే సంజ్ఞ ఏర్పడి వాటి మధ్య ఉండే అక్షరాలని ‘హల్’ అనే పేరుతో పిలుతురని పాణిని స్పష్టంగా సూచించాడు.   ఇట్టి సూత్రములతో ఎనిమిది అధ్యాయాలలో పాణిని  మహర్షిచే రచించబడిన తొలి వ్యాకరణ గ్రంథానికి “అష్టాధ్యాయి” అని పేరు. ఈ సూత్రాలకే ‘వరరుచి’ వార్తికాలని, “పతంజలి”భాష్యాన్ని రచించి లోకానికి ప్రసాదించారు.  ఇప్పటికీ ఇదే గొప్ప ప్రామాణిక గ్రంథము.


---వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో