Thursday, October 1, 2015 0 comments By: visalakshi

భక్తుడి మాట భగవంతుడి బాట

  ఓం శ్రీ భక్తవత్సలాయ నమో నమ:

 శ్లో" క్షి ప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాంతిం నిగచ్చతి !
       కౌంతేయ! ప్రతిజానీహి న మే భక్త: ప్రణశ్యతి !! ( 9 అ" 34 శ్లో ) 



భగవంతుడు తన భక్తుడి మాటకోసం ఏమైనా చేస్తాడు.తన దాసుడి మాట నిజం కావాలి. తన మాట ఏమైనా ఫరవాలేదు. ఇది భగవంతుడి యొక్క అభిప్రాయం. భక్తుడి మాట భగవంతుడి బాట.    

భగవంతుడితో సకలవిధ బాంధవ్యమూ ఉందన్న విశ్వాసం మనలో ఏర్పడితే చాలు.  


"నా అనుగ్రహాన్ని పొందించే శాస్త్రాన్ని అతిక్రమించని సదాచారము వానిలో నిండేటట్టు చేస్తా! అంటే నన్ను చేరటానికి, విశ్వసించటానికి ఆటంకంగా ఎదురయ్యే పాపరాశినంతటిని కూడా మసి చేసి పారవేస్తా. దాని వలన మనసు లోపలి దోషములు పూర్తిగా తొలగిపోతాయి.
'శ్రీకృష్ణుడు ఆ విషయాన్ని ప్రతిజ్ఞ చేసాడు.' నా మీద ఏర్పడ్డ ప్రేమ విశ్వాసం స్థిరపడేటట్టుగా చేసేస్తాను. కుసంస్కారాలు తొలగి, నా మీద ప్రేమ మనసులో నిండుట అనే శాంతి కలిగేటట్టుగా చేస్తాను."వాడు ధర్మాత్ముడౌతాడు.లోకం ఎంత బాగా ఆరాధిస్తుందంటే 'తిరుప్పాణి అని ఒక ఆళ్వారు .ఆయన మాలదాసరిగా జన్మించినా భగవత్ భక్తి,విశ్వాసం పరిపూర్ణంగా అతడిలో నిండేసరికి భగవంతుడు అతడిని కొండంతగా ప్రేమించాడు.  ఆయనంటాడూ.."నాలో ఉండే లోపాల్ని తొలగించి నీ ఆంతరంగిక కైంకర్యాన్ని ప్రసాదించేటంత ఔన్నత్యాన్ని కల్గించావా తండ్రీ!"అని.

 హే! కౌంతేయా! కుంతీపుత్రా! నీవు ప్రతిజ్ఞ చేయవయ్యా!ఏం చెయ్యమంటావు కృష్ణా! అని అడిగాడు అర్జునుడు.నా భక్తుడు ఎన్నటికీ చెడడు.అంటే కృష్ణ భక్తుడు ఎన్నటికీ చెడడని ప్రతిజ్ఞపూను.నేనెందుకయ్యా ప్రతిజ్ఞ చేయడం? నీ భక్తుడు చెడడని కావాలంటే నీవు చెప్పు అని అన్నాడు అర్జునుడు.

"అర్జునా! విను..రామావతారంలో నేను ప్రతిజ్ఞ చేస్తే నిలబడతా! కానీ కృష్ణావతారంలో , నా ప్రతిజ్ఞకంటే భక్తుడి మాటకే నేను ఎక్కువ ప్రాధాన్యమిస్తాను అన్నాడు. భీష్ముడు ఒక ప్రతిన పూనాడు. కృష్ణుడు ఒక ప్రతిన పూనాడు. 'ఆయుధం పట్టనన్నాడు కృష్ణుడు.' పట్టిస్తానన్నాడు భీష్ముడు దుర్యోధనుడి దగ్గర. ఇద్దరూ దుర్యొధనుడి దగ్గరే చేస్తారు ఈ ప్రతిజ్ఞలు.దానికతడే సాక్షి. అది తెలిసి శ్రీ కృష్ణుడు "భీష్ముడి మాట నిజం చేయడమే తన కర్తవ్యం"అనుకున్నాడు.అందుకోసమే భారత సంగ్రామం జరిగేటప్పుడు ఎన్నో సందర్భాలలో ఆయుధం పట్టాడు. జయద్రధ   సం హారం చేయించడం కోసం తాను చక్రం పట్టాడు. 

భీష్ముడు యుద్ధంలో 11 వ రోజున అతి తీవ్రమైన పోరుసల్పుతుంటే అర్జునుడు నిర్వీర్యుడైపోతే, ఆ అర్జనుడిని కాపాడే వంకతో చక్రం చేతపట్టి ఒక్కసారి దూకాడు. ఆవేళ భీష్ముడు "కృష్ణా! నేను గెలిచాను" అన్నాడు ఆయన. ఎందుకని? ఎందుకంటే "స్వనిగమమపహాయ ప్రతిజ్ఞాం    ఋతమధికర్తుం అవప్లుతో రధస్థ:"నేను నిన్ను చక్రం పట్టిస్తాను అని అన్నానని నా మాట నిజం చేయడం కోసం నీమాటను వదిలేసుకొని చక్రం చేతపట్టి క్రిందకు దూకావా తండ్రీ! అని ప్రార్ధన చేస్తాడు.

 అనుక్షణం నా భక్తులను కాపాడుకుంటూ ఉంటాను. "అర్జునా! నీవు ప్రతిజ్ఞ చేయి. ఈ లోకంలో నీ ప్రతిజ్ఞను నిలబెట్టటం కోసం నేను ఏవైనా చేస్తాను." భగవంతుడి యొక్క రక్షణ దీక్ష అంత గొప్పది. ఆయనయొక్క శాశ్వతమైన రక్షణ మనకు నిరంతరం ఉంటుందని స్వామి ప్రతిన పూనారు. ఆయన ప్రతినను విశ్వసిద్దాం. భక్తి ప్రపత్తులతో భగవంతుడి బాటలో నడుద్దాం...


 సర్వం శ్రీ సాయి కృష్ణార్పణ మస్తు









Thursday, September 3, 2015 1 comments By: visalakshi

శ్రీకృష్ణుని వాగ్ధానము

 ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ: 

 ప్రతి ఒక్కరు ఈ భౌతిక ప్రపంచములో దు:ఖములను కలిగి ఉందురు. అది భౌతిక ప్రకృతి యొక్క స్వభావము. 

ఒకదాని తర్వాత ఒక సమస్య వస్తూనే ఉంటుంది.అందుకే భగవద్గీతలో సర్వ శక్తివంతుడైన దేవాదిదేవుడు,యోగీశ్వరుడు,సర్వసిద్ధులకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు  అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి: "నా పై ఆధార పడుము.మీ అన్ని సమస్యల యొక్క పరిష్కారముల కోసము ప్రయత్నములను విడిచి,నన్నే శరణువేడుము.మీ బాధ్యతను నేను వహిస్తాను మరియు మీ సమస్త పాపకర్మల యొక్క ఫలితములను నిర్మూలిస్తాను."అని వాగ్ధానం చేశాడు.


 శ్రీకృష్ణుడు మన బాధ్యతలను స్వీకరించినప్పుడు, ఆయన క్రమముగా మనకు వెలుపల నుండి బయటనుండి జ్ఞానమును ప్రసాదించుట వలన మనము బహుశా: భగవద్ధామమును చేరుకోవచ్చు.



ఐశ్వర్యము,విద్య,సౌందర్యము,ఉన్నత జన్మ   మొదలగు వాటిని పొందుట అన్నది శుభప్రదమని భౌతిక దృష్టి అనుసారముగా భావిస్తారు. కానీ ఇవన్నీ కూడా అనేక దు:ఖాలతో కూడుకున్నట్టివి.అవి నిజముగా శుభప్రదమైనవి కావు. నిజమైన శుభమంటే భగవద్ధామమును చేరుట.అనగా శాశ్వత జీవితము, శాశ్వత ఆనందము,శాశ్వత జ్ఞానమును పొందుట.దానిని మనము పొందవలెనంటే భౌతికమైనటువంటి ఎటువంటి కోరికలు లేకుండా, మనము దివ్యమైన భక్తియుక్త సేవలో నిమగ్నమగుటయే సర్వ శుభములకు ఆరంభము.ప్రతిరోజు శ్రీకృష్ణ మహామంత్ర జపమును చేయుచు భగవంతుని సేవలో ఎల్లప్పుడు నిమగ్నమై ఉందాము. 


 భగవద్గీతలో శ్రీకృష్ణుడు తన విశ్వరూపమును ప్రదర్శించినపుడు అర్జనుడు ఆయనతో ఇట్లనెను:" నా ప్రియమైన కృష్ణా! నిన్ను కేవలము నా మేనబావగా తలచి నేను నీ పట్ల ఎన్నియో అపరాధములను చేసితిని. నిన్ను కృష్ణా!, మిత్రమా! అని సంబోధించితిని. కాని నా ఊహకందనంతటి అపరి మేయుడవు నీవు" అది పాండవుల పరిస్థితి. శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు అయినను సర్వాధికుడు అయినను ఆయన ఆ రాచబిడ్డల భక్తికి, సఖ్యతకు, ప్రేమకు మురిసి వారితో కలిసి జీవించెను.శుద్ధభక్తి సేవ మహత్యమునకు ఇది ఒక నిదర్శనము.భగవానుడు గొప్పవాడు. కాని ఆయనను ఆకర్షించే 'భక్తి ' భగవానుని కంటే కూడా గొప్పది.

  సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

కుటుంబ భ్రాంతి

  ఓం శ్రీ నారాయణాయ నమో నమ:


 5 సం"లు వయసు గల ప్రహ్లాద మహారాజు తన స్నేహితులకు "మీరు తక్షణమే నారాయణభక్తిని ప్రారంభించాలి" అని చెబుతున్నాడు.అదృష్టవశాత్తు వారికి భగవత్ భక్తుడైన ప్రహ్లాదుని యొక్క సాంగత్యం లభించింది.

 ఎప్పుడు అవకాశం దొరికినను గురువుగారు తరగతిలో లేనప్పుడు ప్రహ్లాదుడు తన స్నేహితులతో 'నారాయణ ' మహామంత్ర కీర్తనలను గానం చేసేవాడు. 


  ఎప్పుడైతే మనం ఈ ఇంద్రియ తృప్తి అనే మాయాజాలంలో చిక్కుకుంటామో దాని నుండి బయటపడటం చాలా కష్టం.అందుకే వైదిక సంస్కృతి ప్రకారం మగపిల్లవానికి 5 సం"ల వయస్సు నుండే ఆధ్యాత్మిక విద్యను బోధిస్తారు.దీనినే బ్రహ్మచర్యం అంటారు. బ్రహ్మచారి తన జీవితాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందటమే లక్ష్యంగా ఉంచుకుంటాడు.

 ప్రతి ఒక్కరు కుటుంబ మమకారంలో చిక్కుకొని ఉన్నారు.ఎవరైతే కుటుంబ వ్యవహారాలలో మునిగి ఉన్నారో వారికి ఇంద్రియాలను నియంత్రంచటం సాధ్యం కాదని ప్రహ్లాద మహారాజు తెలుపుతున్నాడు. 

  అందరు భౌతిక ప్రేమ బంధాలలో ఉన్నారు. ప్రేమపాశం చాలా బలమైనందు వలన భౌతిక ప్రేమలో ఉన్నవారు ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించటం చాలా కష్టం.అందుకే ప్రతి బాలుడికి ఐదు నుండి పదిహేను సం"లమధ్యకాలంలో శిక్షణను ఇవ్వడం వలన వారు సంపూర్ణులు కాగలరు.అని ప్రహ్లాద మహారాజు ప్రతిపాదిస్తున్నాడు.

   మనమందరం ఆత్మస్వరూపులం అయినప్పటికిని ఈ భౌతిక ప్రపంచంలో ఉండి ఎలాగైనా సరే ఆనందాన్ని అనుభవించాలని అనుకుంటాము.ఇదే భౌతికం అంటే!

" ఈ భౌతిక తృప్తి కేవలం స్త్రీ - పురుషుల యొక్క కలయిక పైన ఆధారపడి ఉంటుంది. మొదట ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి ' చాలా బాగుంది ' అనుకుంటాడు. అలాగే అమ్మాయి అబ్బాయిని చూసి అలాగే అనుకుంటుంది.ఎప్పుడైతే వారు ఒకరినొకరు కలుసుకుంటారో వారి భౌతిక సంబంధం బలంగా ఏర్పడి అది కామానికి దారి తీసి దాని వలన వారు ఆ ఆకర్షణలో పూర్తిగా బంధింపబడుతారు.తరువాత వివాహం,సంతానం,సమాజంలో గుర్తింపు,ప్రేమ,స్నేహితులు ఈవిధంగా భౌతికమైన ఆకర్షణ పెరుగుతూ పోతుంది.వీటన్నిటికీ డబ్బు అవసరం. వారికి తెలుసు ఇవన్నీ శాశ్వతం కావని..ఆకర్షణ బలమైనది కుటుంబాన్ని పోషించడానికి తన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి వెనుకాడరు.ఇదే మాయ. ఈ భవబంధంలో చిక్కుకొని తమను తామే మరచిపోతారు. "


 తన ఆధ్యాత్మిక ఆచార్యుడైన నారదముని ద్వారా జ్ఞానాన్ని పొంది ఉండటం వలన కేవలం ఐదు సంవత్సరముల వయసు గల ప్రహ్లాదుడు ఒక గొప్ప అనుభవజ్ఞుడైన వాని వలె బోధిస్తున్నాడు. "జ్ఞానం ద్వారా మనిషి ఎదుగుతాడు కానీ వయసు ద్వారా కాదు" అని నానుడి.ప్రతి జీవి వృద్ధాప్యం వరకు జీవిస్తారని ఖచ్చితమైన హామీ లేదు. మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితాన్ని వాయిదా వేయటం చాలా ప్రమాదకరమైనది. కాబట్టి అందరూ నారాయణ చైతన్యాన్ని అలవర్చుకొని భక్తిలో ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించాలి."స్థిరచరాలైన వృక్షాలు,మొక్కల నుండి బ్రహ్మ వరకు అన్నింటా అందరి హృదయాలలోనూ శ్రీ మహా విష్ణువు పరమాత్మ రూపంలో ఉంటాడు " అని ప్రహ్లాద మహారాజు బోధిస్తున్నాడు. 

 " స్వయంగా భగవంతుడు అంతటా వ్యాపించి ఉండటం వలన మనం అతని అంశలమై ఉన్నందు వలన సర్వ జీవరాసులపై దయను కలిగి ఉండటం మన యొక్క బాధ్యత"


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు
Tuesday, September 1, 2015 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 82 ఊదీ మహిమ 2

 ఓం శ్రీ సర్వ వ్యాపక సాయినాధాయ నమ:

                                                                                                     
                  
శ్రీ సద్గురు సాయినాధ ఆశీర్వాద సాఫల్యత

 బాబా విభూతికి రెండు గుణాలు ప్రాపంచికము, పారమార్ధికము. ప్రాపంచిక గుణం ఏమిటంటే మానవ జీవన ప్రాంగణంలో బాధించే ఏ రకమైన వ్యాధినైనా సమూలంగా నయం చేయటం. అందుకు శ్రద్ధ, సహనం కావాలి.

 "శ్రద్ధ అంటే బాబా విభూతితో వ్యాధులు నయమౌతాయన్న దృఢ విశ్వాసం, సహనం అంటే వ్యాధి నయమయేందుకు ఎంత ఆలస్యం పట్టినా ధైర్యాన్ని సడలనీయకుండా ఎదురు చూడ్డానికి సిద్ధంగా ఉండటం."

  అఖండంగా జ్వలించే బాబా ధునిలోని విభూతి వెనుక బాబా దైవశక్తి ఉంది.కానీ సందర్భం వచ్చినప్పుడు భక్తులకుండే దృధమైన శ్రద్ధ వల్ల ఆ దైవశక్తి అగరొత్తుల వల్ల, దార్లోని మట్టిలో నుంఛి కూడా ఉత్పన్నమగును.దాని వెనుక విభూతినిచ్చే వారి శ్రద్ధ లేదా స్వయంగా బాబా ఇచ్చ, కృప ఉంటాయి.



 పారమార్ధిక గుణం అంటే....  ఈశ్వర ప్రాప్తి గురించి  చేసే సాధనా
మార్గంలో  అన్నిట్లోకి మొదటి అవసరం శారీరక, మానసిక శుద్ధి.

విభూతిని దేహానికి పూసుకోవటమంటే,పూజకోసం నీటితో స్నానం చేసి దేహాన్ని శుద్ధి చేసుకొన్నట్లే.  శాస్త్రాలు దీన్ని అంగీకరించాయి.  

 అలా చేయటం వల్ల మనసు శాంతంగా,పవిత్రంగా వుంటుంది.విభూతి స్పర్శతో భయంకర మహా పాతకాలు, ఉప పాతకాలు సమూలంగా నశిస్తాయి. ముక్తి కాంత వచ్చి భక్తుల ముంగిట వాల్తుంది. పారమార్ధిక మార్గం యొక్క గుహ్యార్ధం వారికి స్పష్టమై భక్తులకు పారమార్ధికం సాధ్యమవుతుంది. వాళ్ళు కృతార్ధులవుతారు.

 బాబాగారి సమాధి తరువాత కూడా ఈ గడచిన సంవత్సరాలలో , అఖండంగా ప్రజ్వలించే ధునితో బాబా ఎన్ని విభూతి బస్తాలు ఉత్పన్నం చేస్తున్నారో, ఎంతమంది భక్తులకు శ్రేయస్సు కలిగిస్తున్నారో! విభూతి ధన్యం! భక్తవాత్సల్యామృత వర్షిణి అయిన సాయిజనని ధన్యం!


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు 








                                          





శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 82 ఊదీ మహిమ

 ఓం శ్రీ సద్గురు సాయినాధాయ నమో నమ: 

" పరమం పవిత్రం బాబా విభూదిం
  పరమం విచిత్రం లీలా విభూదిం
 పరమార్ధ మిష్టార్ధ మోక్ష ప్రదాతం
 బాబా విభూదిం ఇదమాశ్రయామి "




" బాబాగారి పాదాల వద్దనున్న ఊదీ  ప్రసాదం 2011 గురుపౌర్ణమి రోజు  
 మా ఇంట బాబాగారు మాకునొసంగిన అపురూపమైన,వెలకట్టలేని సంపద."

ఆ ఊదీని సమస్యలతో వచ్చిన భక్తులకు ఇచ్చి,అందరికీ నుదుట పెట్టి,  అందరికీ ఇవ్వగా మిగిలిన   ఊదీ ఒక కవరులో వేసి బీరువాలో ఉంచాము.  

  ఆధ్యాత్మిక విషయములో లేదా సాధనలందు భక్తుల నమ్మకము అపారముగా నుండవలెను. 

జరిగే మహత్యాలను ఆక్షేపణ చేయుచు, సద్గురువును సిద్ధులను విమర్శించుచు నమ్మకమున్నవారిని ఖండించి వట్టి భ్రమ అని బాబాగారి మహత్యాలను అప్పుడూ,ఇప్పుడూ పరీక్షించే (మహానుభావులం మనం). కొంతమంది భక్తులు .

  మా వారి ఆఫీసులో చాలామందికి ఊదీ ద్వారా వ్యాధులు నయమయ్యాయి. ఒక వ్యక్తి తన పాపాకు తరచుగా జ్వరం వస్తుందని,చాలాసార్లు చెప్పగా మావారు పూర్తినమ్మకంతో బాబాగారిని స్మరిస్తూ ఊదీని రోజూ నీళ్ళలో కలిపి త్రాగింపమని చెప్పారు. రెండు రోజులలో అతను సంతోషముతో పాప చలాకీగా ఆడుకుంటోందని చెప్పాడు.

2010 నుండి ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. మా ఇంట్లో ఎవరికి అనారోగ్యము చేసినా ఊదీ నీళ్ళలో వేసుకొని మనస్పూర్తిగా బాబాని స్మరించుకొని తాగుతాము. 


  ఊదీ ని గూర్చి బాబా బోధ: -

"  ప్రపంచములో కనిపించు వస్తువులన్నియు బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నియు సౌఖ్యముల ననుభవించిన పిమ్మట పతనమై బూడిద యగును.ఈ ఊదీ వలననే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు,ప్రపంచములో గల బంధువులు,కొడుకుగాని,తండ్రిగాని,తల్లిగాని,మనవారు కారనియు బాబా బోధించెను.ఈ ప్రపంచములోకి మనము ఒంటరిగా వచ్చితిమి,ఒంటరిగానే పోయెదము. ఊదీ అనేక విధముల శారీరకమానసికరోగములను బాగుచేయుచుండెను. "
 భక్తుల చెవులలో బాబా ఊదీ ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దానియందు అభిమానరాహిత్యము గంట మ్రోత వలె వినిపించుచుండెను.మొదటిది (ఊదీ) వివేకమును, రెండవది (దక్షిణ) వైరాగ్యమును బోధించుచుండెను.ఈ రెండును కలిగియున్నగాని సంసారమనే సాగరమును దాటలేము.అందుచే బాబా అడిగి దక్షిణ తీసికొనుచుండెను.శిరిడీనుంచి ఇంటికి పోవునపుడు భక్తులకు ఊదీయే ప్రసాదముగా నిచ్చి, కొంత నుదుటిపై వ్రాసి వరదహస్తమును   వారి శిరస్సుపై నుంచుచుండెను.ఇదంతయు ఊదీయొక్కఆధ్యాత్మికప్రాముఖ్యము.

దానికి భౌతికప్రాధాన్యము కూడాకలదు. అదిఆరోగ్యమును,ఐశ్వర్యమును,
ఆతురతుల నుండి విమోచనమును మొదలగునవి యొసగుచుండెను.


  సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు


Friday, August 28, 2015 1 comments By: visalakshi

రాఖీపౌర్ణమి-శ్రావణపౌర్ణమి

  ఓం శ్రీ నారాయణాయ నమ:

  "యత్ర నార్యోస్తు పూజ్యతే  తత్ర రమంతే దేవతా" - ఎక్కడ స్త్రీ మాతృరూపంలో ఆరాధించబడుతుందో, అచట దేవతలు నర్తిస్తారు.

   మన భారతీయ పండుగల్లో వివిధ దేవతల అనుగ్రహం, అధ్యాత్మిక దృక్పధం,ఆత్మీయతానురాగాల అనుబంధం కలబోసి ఉంటాయి.

   శ్రావణ పూర్ణిమ నాడు విద్యాదిదేవత,వేదమయుడు అయిన శ్రీ హయగ్రీవ స్వామి ఆవిర్భవించారు. దేవతారాధనకు, ధ్యానానికి అనువైన వేదాల జ్ఞానదీప్తిని ప్రసాదించడమే హయగ్రీవానుగ్రహం.

  మన ధర్మ శాస్త్రాల్లో పేర్కొన్న రక్షాబంధన మహోత్సవం ఈ రాఖీ పూర్ణిమ ప్రత్యేకత.

ఈ రోజున సోదరుని తిలకధారణతో,అక్షతలతో అభినందించి,సోదరి రక్షా కంకణాన్ని బంధిస్తుంది.ఇది దేవతారక్షగా అతడిని కాపాడుతుంది.

బదులుగా సోదరిని కానుకలతో సత్కరిస్తారు.సోదరీ సోదర అనుబంధానికి చెలిమిని బలపరచి,స్త్రీకి పుట్టింటి అనుబంధాన్ని దృడపరచిన పండుగ ఇది.

 ఇంటి ఆడపడుచును మహాలక్ష్మీ స్వరూపంగా, పరాశక్తికి ప్రతీకగా భావించే సంసృతి మనది.పుట్టింటి ఆత్మీయత స్త్రీకి ఎంతో మనో నిబ్బరాన్ని,ఉల్లాసాన్ని పెంచుతుంది.

 ఈ శ్రావణ పూర్ణిమ నిండు చంద్రుని శోభలను పుడమి స్వీకరించే రోజు.చంద్రుని ప్రకాశం వల్ల మనసు పవిత్రమై,ఆరాధనలూ,ధ్యానాలు  విశేషంగా ఆచరిస్తారు.

 మానవ సంబంధాల్లో దివ్యత్వాన్ని నింపుకునే ఈ ఆచారమే" రక్షాబంధన మహోత్సవం.."

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు


Wednesday, August 26, 2015 1 comments By: visalakshi

వరలక్ష్మీ వ్రతం

 ఓం శ్రీ మాత్రే నమోనమ:

 శ్లో" పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
    నారాయణప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా
    క్షీరోదధి సంభూతే కమలే కమలాలయే
    సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే !!





 శ్రావణ మాస మంటేనే మహిళలందరికీ సందడే సందడి. మంగళగౌరీ వ్రతాలు,నోములు, వరలక్ష్మీ వ్రతం, రాఖీపౌర్ణమి  ఇలా వరుసగా  పండుగలు...

 వరలక్ష్మీ వ్రత పండగ కు కావలిసిన   వ్రత సామాగ్రి అనగా పూజకు తగిన
పూలు,పళ్ళు,పట్టుచీరలు,రూపు, బంగారు ఆభరణములు తదితరములు   సమకూర్చుకొని,వరలక్ష్మీ మాతను సుందరంగా అలంకరించి,  కలశం పై చిన్న వరలక్ష్మి అమ్మవారి ప్రతిమను ఉంచి,పూలతో ,గాజులతో,బంగారు ఆభరణాలతో అలంకరించి లక్ష్మి అమ్మవారిని ఆవాహన చేసి, షోదశోపచారాలతో పూజిస్తూ వ్రతం ప్రారంభించాలి.  

 ముందుగా ఒక పళ్ళెములో బియ్యము పోసి,దానిపై మనము కలశము అమర్చి,పళ్ళెము ముందు తమలపాకువేసి పసుపు వినాయకుడిని చేసుకొని,మహా గణపతి పూజతో వ్రతం ప్రారంభించాలి. సంకల్పం చెప్పుకొని,గణపతి పూజానంతరం,వరలక్ష్మీ మాత పూజ ధ్యానం,ఆవాహనం,అర్ఘ్య,పాద్య,ఆచమనీయాలు సమర్పించి,పంచామృత,
శుద్ధోదకస్నానాలు సమర్పించాలి. వస్త్రయుగ్మం,ఆభరణం సమర్పించాలి.మాంగళ్యం (రూపు) సమర్పించాలి.గంధం,అక్షతలు,పూలు సమర్పించాలి.అధాంగపూజ,అష్టోత్తరశతనామావళి అక్షతలతో అమ్మను అర్చించాలి.ధూప,దీప,నైవేద్య,పానీయ,తంబూలాలు సమర్పించాలి.నీరాజనం సమర్పించాలి.మంత్రపుష్పం,దక్షిణ సమర్పించాలి. ఆత్మ ప్రదక్షిణ సమర్పించాలి.....ప్రార్ధనాపూర్వక నమస్కారం సమర్పయామి.
తోరపూజ...
తొమ్మిది సూత్రంబులు (పసుపు రాసిన దారము) గల తోరములను చేసి అమ్మవారివద్ద ఉంచి అక్షతలతో కమలాయై నమ: ప్రధమగ్రంధిం పూజయామి అంటూ నవమ గ్రంధిం వరకు పూజ చేయాలి.తోరం ముందు కలశానికి కట్టాలి. తరువాత శ్లోకం చదువుతూ  కుడి చేతికి తోరం కట్టుకోవాలి. 

 శ్లోకం చదువుతూ అమ్మవారికి వాయనం ఇవ్వాలి.వాయనమిచ్చాక అక్షతలు తీసుకొని వ్రతకధను చదువుకోవాలి.తరువాత ముత్తైదువకు పీట వేసి అమ్మవారి ఎదురుగా కూర్ఛోబెట్టి, పసుపు రాసి బొట్టు పెట్టి చేసిన ,నైవేద్యంపెట్టిన,పిండివంటలు,శనగలు,తాంబూలం,వస్త్రములు,దక్షిణ అన్నీ ఒక పళ్ళెములో పెట్టి ఆవిడకు తోరము కట్టి, వాయనము ఇస్తూ,ఇసినమ్మ వాయనం అని 3 సార్లు అనాలి. ఆవిడ పుచ్చుకుంటినమ్మ వాయనం అని 3 సార్లు అనాలి.   వాయనమును  అందుకున్నదెవరమ్మా అని అనగా ముత్తైదువ "నేనమ్మా గౌరీ దేవిని" అని అనాలి.తదుపరి పూజాక్షతలను కుటుంబీకులందరూ తమపై వేసుకొని,తీర్ధ ప్రసాదాలు స్వీకరించాలి.

వరలక్ష్మీ వ్రతకల్పంలో ప్రతి శ్లోకం చదువుతూ పూజ చేయాలి. ఈ వ్రతమునకు 9 లేక 5 రకముల పిండి వంటలు చేయాలి.సాధారణంగా బూరెలు,పరవాన్నం,పులిహోర,ఉండ్రాళ్ళు,గారెలు లేక బజ్జీలు చేయచ్చు.ఎవరిష్టం వారిది. చలిమిడి,వడపప్పు కొద్దిగా పానకం చేసి నైవేద్యం పెట్టాలి.ఒక కొబ్బరికాయ కలశానికి, రెండవది అమ్మవారి ముందు కొట్టి నైవేద్యం సమర్పించాలి. 

 మనం చేసిన చలిమిడిని కుందులుగా చేసి దీపం వెలిగించి ఆ దీపం పైన గరిట  పెట్టి కధ చదువుతాము.కధ పూర్తయ్యీసరికి పొగకి గరిట నల్లగా మసి పడుతుంది దానికి కొద్దిగా నెయ్యి చేర్చి ముత్తైదువులకి కాటుకగా ఇస్తాము. చుట్టుపక్కలవారిని అందరినీ తాంబూలానికి పిలిచి అందరికి పసుపు రాసి, గంధం,బొట్టు ఇచ్చి,శనగలు,తాంబూలం ఇచ్చి పెద్దవారైతే ఆశీర్వాదం తీసుకుంటాము.అతి ముఖ్యమైన విషయం ఆరోజు వీలు చూసుకొని తప్పకుండా లలితా సహస్రనామ స్తోత్రం పఠించాలి. 

 వరలక్ష్మీ వ్రతం చేసుకుని,అందరం వరలక్ష్మీ కటాక్షంతో సౌమాంగల్యం,సర్వసౌభాగ్యాలు ప్రసాదించమని అమ్మను వేడుకుంటూ...

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్రయంబకే గౌరి  నారాయణి నమోస్థుతే!!