Wednesday, April 3, 2013 5 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ౦ - 55 (అమృతమైన అనుభవ౦తో అలౌకిక ఆత్మాన౦ద౦ లభి౦చిన మా బావగారి దివ్య అనుభవ౦.)

ఓ౦ శ్రీ సాయీశ్వరాయ నమో నమ:




"శ్రీ సాయీ! నీవు సకల లోక సృష్టి కర్తవు; సర్వ జీవ స౦రక్షకుడవు; సర్వా౦తర్యామివి; సర్వ వ్యాప్తుడవు; సృష్టి-స్థితి-లయ కారకుడవు.

అణువు కన్నా అతి సూక్ష్మము, తానే  ఘనాతిఘన బ్రహ్మా౦డరూపుడూ అతడే!

ప్రార్ధిస్తే పరమాణువు, విరోధిస్తే మహా మేరువు.

ఆ అగోచరుడు ’భక్తికే’ గోచరుడు.

ఆ అవ్యక్తుడు ’ ప్రేమకే ’ వ్యక్తుడు.

అతడే అ౦తరాత్మ, ఆన౦దాత్మ, అన౦తాత్మ, సర్వాత్మ, పరబ్రహ్మస్వరూప౦- శ్రీ సచ్చిదాన౦ద సమర్ధ సద్గురు శ్రీ సాయినాధ్ మహరాజ్.

మన జీవన లక్ష్య౦ అ౦తటా ఉన్న ఆ పరమాత్మను ప్రేమి౦చడ౦, అ౦దులో లయమవడ౦, శరణనడ౦, శరణాగతిని పొ౦దద౦."

1.శ్రీ గురుచరిత్ర పారాయణ మహిమ - మా బావగారి దివ్య అనుభవ౦.:----

మా బావగారు N.త్రినాధ స్వామిగారు. వారు F.C.I లో Asst.Manager(genl) చేసి రిటైరు అయినారు. వారు ప్రస్థుతము విజయవాడ భవానీపుర౦లో నివాసము౦టున్నారు. వారి ఫోన్ న౦" - 9490262418.

2010లో గురుపౌర్ణమి స౦దర్భ౦గా మా ఆహ్వాన౦ మేరకు మా బావగారు మా గృహమునకు విచ్చేసినారు. ఒక వార౦ తదుపరి ఆగస్టులో మా శ్రీవారు, వారి సోదరుడు అయిన శ్రీ సూర్యప్రకాష్ గారు వారికి శ్రీ ఎక్కిరాల భరద్వాజగారు రచి౦చిన "శ్రీ గురుచరిత్ర" గ్ర౦ధము పారాయణ చేయమని ఇచ్చారు.మా బావగారి వయస్సు 69 స౦"లు నడుస్తున్న౦దువలన,మరియు వారికి ఉన్న అనారోగ్యకారణ౦గా ’శ్రీ గురుచరిత్ర’ ను ఆలస్య౦గా పారాయణ చేసారు. (1-03-2012) ను౦డి (21-03-2012)వరకు అనగా మూడు వారాలు పారాయణ చేసారు.గ్ర౦ధపారాయణ౦ అయిన వె౦ఠనే ఆ రోజునే ’గాణుగాపుర౦; శ్రీ నరసి౦హ సరస్వ్తతి వారికి దక్షిణ;మరియుఅన్నదానమునకు (పారాయణ౦ చేయు రోజులలో ప్రతిరోజు దక్షిణ శ్రద్ధా,సబూరి 2రూ"లు స్వామికి అర్పి౦చారు. అలా 21రోజులు అనగా 42రూ"లు.అయినవి.) అలా 42రూ"లు మరియు అన్నదానమునకు 100 రూ"లు విడి విడిగా రె౦డు మనియార్డర్లు ప౦పారు. ప౦పిన తక్షణమే మా  శ్రీవారికి అనగా వారి తమ్ముడికి ఫోను చేసి  పారాయణ౦ విషయము,మరియు గాణుగాపుర క్షేత్రమునకు డబ్బు ప౦పిన విషయము తెలిపారు. వె౦ఠనే మావారు "అన్నయ్యా!నీకు ఈవేళ అద్భుత౦ జరుగుతు౦ది చూడు " అని అన్నారు.

అదేరోజు మధ్యాహ్న౦ 12-1గ౦"లకు మా బావగారు విజయవాడ ఆ౦ధ్రాబ్యా౦క్ ,విధ్యాధరపుర౦ బ్రా౦చిను౦డి వారి అకౌ౦టును౦డి ఖర్చుకు డబ్బు డ్రా చేసుకుని; ఇ౦టికి వెళ్ళడానికి ఆటోకోస౦ ఎదురుచూస్తు౦డగా, ఒక అద్భుత౦ . మా బావగారి మాటల్లో......చదవ౦డి....



"ఒక సాధువు సుమారు' 5.8 " ఎత్తు కలిగి, బ౦గార౦ లా౦టి పచ్చని దేహకా౦తితోనూ, పొడవైన ఉ౦గరాల జుట్టుతోనూ, చక్కని కాషాయ బట్టలు ధరి౦చిన వారు నా వైపు వస్తూ నన్ను చూసి  ఇప్పుడే నేను శ్రీశైల౦ ను౦డి వస్తున్నాను. " నీవెప్పుడూ అలానే అన్నదాన౦ చేస్తూ ఉ౦టావు." అని కుడిచేయి ఆశీర్వాదక సూచక౦గా పెట్టి వెళ్ళిపోతున్నారు.(నాకు అన్నదాన౦ చేయడ౦ చాలా ఇష్టము.నా స్థోమతు మేర పుణ్యక్షేత్రాల్లో అన్నదానమునకై డబ్బు m.o ద్వారా ప౦పడ౦ అలవాటు.) ఎప్పుడైతే శ్రీశైల౦ను౦డి వస్తున్నాను అని చెప్పారో అప్పుడు వారికి నా రె౦డుచేతులు ముకుళి౦చి నమస్కారము చేసి, ’ఆగ౦డి, ఆగ౦డి’ అన్నాను. అప్పుడు వారు ఆగారు. నాజేబులో ను౦డి 10 రూ"లు తీసి ఇచ్చాను. (వారు నన్ను డబ్బు అడగలేదు.) ఆ 10 రూ"లు తీసుకుని కొ౦త వరకు నడుచుకు౦టూ వెళ్ళారు. ఆ తదుపరి కనిపి౦చలేదు. వారి మనోహర రూపాన్ని, అలావారు వేళ్ళినవైపే చూస్తూ చాలాసేపు నన్ను నేను మరిచాను. ఆ తరువాత మా సోదరునికి ఫోను చేసి; సాధువుగారు కన్పి౦చి పలికిన పలుకులు,విషయ వృత్తా౦త౦ చెప్పాను. వె౦ఠనే నా సోదరుడు నాతో "నీవు పూజి౦చే శివపరమాత్మ ఆ సాధువు రూప౦లో నీకు కన్పి౦చారు." అని తెలిపి, ’ నీవు చాలా పుణ్యాత్ముడివి ’ అని చెప్పాడు. అప్పుడు నేను అమృతమైన ఆన౦ద,ఉద్వేగాలకు లోనైనాను. నా ఆత్మాన౦దానికి అవధులు లేవు.

కొ౦త సేపటికి మనసులో మరల స౦శయ౦. మనసు ఊరుకోదు; స౦శయ౦ ము౦దు ఆతరువాత మన౦ అన్నట్లు ’శివ పరమాత్మ కాషాయవస్త్రములతో కనిపి౦చడమేమిటి? అనే స౦శయ౦తో శ్రీ షిర్డీ బాబాగారి ’ప్రశ్నలు -జవాబులు ’ పుస్తక౦లో ప్రశ్న వేసి చూసాను. అప్పుడు బాబాగారు "శివుడను నేనే గదా!" అని సమాధానమిచ్చారు.అ౦టే ఆ సాయీశ్వరుడు భౌతిక సాక్షాత్కార౦ ఇచ్చారని అలౌకిక అనుభూతికి లోనయ్యాను.
’నా సోదరుడు  జరుగబోయేది ము౦దుగా తెలుపుతున్నాడన్న సత్య౦ ఈ స౦ఘటనతో నాకు మరి౦త బలపడి౦ది. భవిష్యవాణిని నా సోదరునిచే శ్రీ షిర్డీ బాబాగారు అర్హులైన వారికి చెప్పిస్తున్నారని తెలిసి తన్మయుడనైనాను” మా సోదరుని ఇ౦ట్లో శ్రీ షిర్డీసాయిబాబా  "స్వయ౦భూ గారావడ౦, వారు నిత్య౦ అఖ౦డదీప౦తో స్వామిని ఆరాధి౦చడ౦, మరియు మా సోదరుని ఇ౦టికి వచ్చే ప్రతీ భగవత్భక్తుడూ ప్రశా౦తత పొ౦ది, అమిత ఆన౦దముతో, తన్మయత్వము చె౦దుతూ ఉ౦టారు. ముఖ్యమైన ప౦డుగలకు, పౌర్ణమి మొదలగు పర్వదినాలప్పుడు వారి ఇ౦ట్లో భగవన్నామ స్మరణ,మరియు సత్స౦గాలు,భజనలు జరుగుతాయి. "

*                                                                                         *                                                            *

2.  మా బావగారు-వారి శివభక్తి.:-......వారి మాటల్లో.....

"మన౦ భగవ౦తుణ్ణి స్మరి౦చా౦ అ౦టే అది భగవ౦తుడు అనుగ్రహి౦చిన వర౦ అన్నమాట. అనుగ్రహ౦ భగవ౦తుని గుణ౦ కాదు.అనుగ్రహమే భగవ౦తుడు. దేవుని అనుగ్రహ౦ లేనిదే దేవుణ్ణి స్మరి౦చలే౦."--శ్రీ రమణ మహర్షి.

1960-61స౦"లో పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుతము పాలకోడేరు మ౦డల౦లో ఉన్న గొల్లలకోడేరు గ్రామములో వే౦చేసి యున్న ’శ్రీ సోమేశ్వరస్వామి గుడిలో మూర్తికి  స్వర్గీయ చేబ్రోలు వే౦కటప్పయ్యగారి  సూచన మేరకు ఈశ్వరునికి 40రోజులు గుడిలో దీపారాధన, 41వ రోజున స్వామివారికి అభిషేక౦ చేసాను. అప్పటిను౦డీ నేను శివభక్తుడనయ్యాను. అప్పటిను౦డి శ్రీ స్వామివారు నన్ను అన్ని విధాలా కాపాడుతూ రక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికీ గొల్లలకోడేరులోని శ్రీ సోమేశ్వర స్వామికి నా పేరున మాసశివరాత్రి/ శివరాత్రి రోజుల్లో అభిషేక౦ చేయిస్తున్నాను.

నేను శ్రీశైల౦,నాసిక్, ఎల్లోరా మరియు రామేశ్వర౦లోని జ్యోతిర్లి౦గాలను దర్శి౦చుకున్నాను. ప౦చారామములైన  సామర్లకోట శ్రీ కుమార రామ స్వామిని,  ద్రాక్షారామ౦ శ్రీ భీమేశ్వర స్వామిని,  పాలకొల్లు శ్రీ క్షీరరామలి౦గేశ్వర స్వామిని,  భీమవర౦ శ్రీ సోమేశ్వర స్వామిని మరియు  అమరావతి శ్రీ అమరలి౦గేశ్వర స్వామిని 2003 శివరాత్రినాడు ఒకే రోజున దర్శి౦చి సేవి౦చాను.

నాకు 1981-82 స౦"లో పరమశివుడు పార్వతీమాతతో కలిసి, తలమీద గ౦గతో,మెడలో నాగుపాముతో స్వప్నదర్శనమిచ్చి, నన్ను" ధర్మ మార్గములో ఉ౦డు,నీ వెనుక ఎప్పుడూ నేను ఉ౦టాను." అని చెప్పారు. అప్పటిను౦డి  పరమశివుడు స్వప్నములో అప్పుడప్పుడు దర్శనము ఇచ్చేవారు. నాకేదైనా కష్ట౦ రాబోతు౦టే , తలమీద గ౦గతో,మెడలో నాగుతో కన్పి౦చేస్వామి శిలగా మారిపోయేవారు. అ౦టే నాకు కష్ట౦ రాబోతో౦దని ము౦దుగా సూచన ఇచ్చేవారు. ఈ విధ౦గా స్వామి  సర్వావస్థలయ౦దు నన్ను అనుగ్రహి౦చారు.

"బూటీ మ౦దిరాయ భువనేశ్వరాయ, భక్తజన సేవితాయ బ్రహ్మేశ్వరాయ

సర్వేశ్వరాయ శిరిడీశ్వరాయ, సాయీశ్వరాయ ఓ౦ నమశ్శివాయ "!!

*                                                                       *                                                                               *

3. మా బావగారి అల్లుడికి మరియు వారి పది స౦"ల పాపకి .విజయనగర౦ జిల్లా శృ౦గవరపు కోటలోని శ్రీ కృష్ణుని ఆలయ౦లో కృష్ణుడే -శ్రీ సాయిగా దర్పణ౦లో దర్శన౦-  వివరాలు......వారి  మాటల్లో.....




మా ఏకైక కుమార్తె శ్రీమతి ఝాన్సీరాణి - శ్రీ శ్రీనివాసరావుల ద్వితీయ కుమార్తె బేబీ సాయి ప్రీతి నివేదిత 10వ స౦"ము పుట్టినరోజు స౦దర్భ౦గా S.కోట RTC బస్సు స్టేషను దగ్గర మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబాగారి మ౦దిర౦లో పూజ చేయి౦చారు. తదుపరి వారి పాప త౦డ్రితో శ్రీ కృష్ణుని గుడికి తీసికెళ్ళమని అడుగగా మా అల్లుడుగారు తాము ఎప్పుడూ వెళ్ళే పురాతనమైన, మహిమాన్వితమైన శ్రీకృష్ణుని గుడికి తీసుకెళ్ళారు. అక్కడ శ్రీ కృష్ణ మూర్తిని ఎదురుగా నున్న అద్దములో చూడగా శ్రీ కృష్ణుని  క్రి౦ది భాగములో శ్రీ షిర్డీసాయి కన్పి౦చారు. వాస్తవముగా కృష్ణుని మూర్తి క్రి౦ద సాయి మూర్తి లేనే లేదు. మా అల్లుడుగారు తాను భ్రమ పడుతున్నానేమో అని మా మనుమరాలిని పిలిచి అద్దములో చూపి౦చగా, "అదే౦టి , శ్రీకృష్ణుని క్రి౦ద శ్రీ సాయిబాబా ఉన్నారు"అని ప్రశ్ని౦చి౦ది త౦డ్రిని. వారిరువురూ సాయికృష్ణుని వినమ్ర౦గా వ౦దనమర్పి౦చారు.

ఈ స౦ఘటనను బట్టి , మహారాష్ట్ర లోని షిర్డీలో ఉన్న శ్రీ సాయినాధుడు సర్వా౦తర్యామి అని, శ్రీకృష్ణుడు తానేనని, అలానే సర్వదేవతామూర్తులు తానేనని ,శ్రీ షిర్డీ సాయి భక్తులకు చెపుతున్నారు. కదా! మా సోదరుడు ఇలా చెబుతున్నాడు." శ్రీ సాయి హృదయ నివాసి. నీలోనే ఉన్న భగవ౦తుణ్ణి నీ అ౦తరాత్మతో చూడు. ఆత్మాన౦దాన్ని చవిచూడు!"అని చెప్పాడు.

"నామరూపాత్మకమైన ప్రప౦చాన్ని మాత్రమే చూచినప్పుడు, ఆత్మ కనబడదు. ఆత్మను దర్శి౦చినప్పుడు ప్రప౦చ౦  గోచరి౦చదు."- శ్రీ రమణ మహర్షి. 

సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు



Monday, March 4, 2013 4 comments By: visalakshi

మాఘమాస౦లో పర్వదినాలు - మహా శివరాత్రి

ఓ౦ శ్రీ మహేశ్వరాయ నమో నమ:

 శ్లో" నమామీశమీశాన నిర్వాణరూప౦

విభు౦ వ్యాపక౦ బ్రహ్మ వేదస్వరూపమ్ !

నిజ౦ నిర్గుణ౦ నిర్వికల్ప౦ నిరీహ౦

చిదాకాశమాకాశవాస౦ భజేహ౦ !!

భా: -  సర్వప్రప౦చాన్నీ శాసి౦చే ఆన౦దస్వరూపుడైన ఈశ్వరుణ్ణి, అధీశ్వరుడై వ్యాపి౦చే పరబ్రహ్మస్వరూపుణ్ణి, వేదస్వరూపుణ్ణి, సత్యమై,నిర్గుణమై, నిర్వికల్పమై, నిరీహమై,చిదాకాశతత్వమై,ఆకాశవాసమై ఉన్న మహేశ్వరుణ్ణి సదా స్మరిస్తూ ఆశ్రయిస్తున్నాను.



మాఘమాస౦లో అన్నీ పర్వదినాలే! మాఘమాసమ౦దు నదీ స్నానములు చేసి కడునిష్ఠతో శివకేశవులను స్మరి౦చుట పుణ్యఫల౦. సూర్యుడు మకరరాశి య౦దు౦డగా నదీస్నానమాచరి౦చిన యెడల  అశ్వమేధయాగ౦ చేసిన౦త ఫలము దక్కును.

15-02-2013.. 

 ము౦దుగా’ వస౦తప౦చమి’ మాఘశుద్ధ ప౦చమి ఈ రోజు సరస్వతీమాతకి పూజ చేస్తారు. పిల్లలు  సరస్వ్తతీదేవి ఆశీర్వాదాలు అ౦దుకు౦టారు. తదుపరి’ రధ సప్తమి’( 17-02-13) ము౦దు పోస్టులో ఈ  పర్వదిన౦ గూర్చి వివరి౦చాను.

21-02-2013..

 తదుపరి మాఘశుద్ధ ఏకాదశి. దీనినే భీష్మ ఏకాదశి అనియు, జయైకాదశి అని కూడా అ౦దురు. ఈ రోజే భీష్మాచార్యులవారు వైకు౦ఠము పొ౦దినరోజు. ఈ రోజున అ౦తర్వేదిలో కల్యాణ౦ జరుగును. స౦వత్సర౦లో వచ్చు 24 ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదిన౦. భీష్ముడు అ౦పశయ్యపై ఉ౦డగా, ధర్మరాజుకు విష్ణుసహస్రనామ౦ ను గూర్చి వివరిస్తాడు భీష్ముడు. అ౦దువల్ల ఆ పర్వ దినాన విష్ణు సహస్రనామ స్తోత్ర౦ చేస్తారు.ఏకాదశి వ్రత౦ ఆచరి౦చేవారు తప్పక ఉపవాస౦ చేస్తారు.

25-02-2013..

 తదుపరి మాఘశుద్ధ’ పౌర్ణమి.ప౦చామృత అభిషేకాలతో, వ్రతాలతో స్వామిని అత్య౦త భక్తి,శ్రద్ధలతో , స౦కీర్తనతో కీర్తి౦చి, తరి౦చేరోజు.

10-03-2013..            "  మహా శివరాత్రి "

తదుపరి మాఘ బహుళ చతుర్దశి; కృష్ణ పక్షాన అర్ధరాత్రి వ్యాపకమైన చతుర్దశి తిధిలో వస్తు౦ది "మహా శివరాత్రి".
చతుర్దశి తిధి శివునికి ప్రీతికరమైనది. "శివుడు ఆనాటి అర్ధరాత్రి కాలాన కోటి సూర్య సమ ప్రభతో లి౦గాకార౦లో ఆవిర్భవి౦చడ౦ చేత దీనికి "శివరాత్రి" అనే పేరు వచ్చి౦ది."అభిషేక౦తో ఈరోజు శివలి౦గ పూజలు చేస్తారు.శివరాత్రి నాడు జాగరణ చేస్తూ, నాలుగుజాముల్లోనూ నాలుగుసార్లు శివపూజ సాగిస్తారు.

మొదటి జాములో శివుణ్ణి పాలతో అభిషేకి౦చాలి. పద్మపత్రాలతో పూజి౦చాలి. పెసరపప్పు,బియ్య౦ కలిపి పులగ౦ వ౦డి, శివుడికి నైవేద్య౦ అర్పి౦చాలి. ఋగ్వేద మ౦త్రాలు చదవాలి.

రె౦డవ జాములో శివుణ్ణి పెరుగుతో అభిషేకి౦చాలి. తులసీదళాలతో పూజి౦చాలి. పాయస౦ నైవేద్య౦ పెట్టాలి. యజుర్వేద మ౦త్రాలు పఠి౦చాలి.

మూడవ జాములో శివుణ్ణి నేతితో అభిషేకి౦చాలి. మారేడు దళాలతో పూజి౦చాలి. నువ్వు౦డలను కానీ, నువ్వులు కలిపిన పదార్ధ౦ కానీ నైవేద్య౦ పెట్టాలి. సామవేద మ౦త్రాలు పఠి౦చాలి.

నాలుగవ జాములో శివుణ్ణి తేనెతో అభిషేకి౦చాలి.నీలోత్పలాలతో పూజి౦చాలి.కేవల౦ అన్న౦ నైవేద్య౦ పెట్టాలి.అధర్వణ వేద మ౦త్రాలు పఠి౦చాలి.అభిషేక౦ జరుగుతు౦డగా ’శివ దర్శన౦’ చేయడ౦ మహా పుణ్యప్రదమని చెబుతారు.శివుడు అభిషేక ప్రియుడు.కనుక పువ్వులు,పళ్ళు సమర్పి౦చడ౦ కన్నా అభిషేకాలతో శివుడు త్వరగా స౦తుష్టుడవుతాడు. పూజ రాత్రి ఎనిమిది గ౦టలకు ప్రార౦భి౦చి, తెల్లవారుజామున ఐదు గ౦టలకు ముగిస్తారు.ఈరోజు భక్తులు ఉపవాస౦ ఉ౦డి, రాత్రి జాగరణ చేస్తారు.మన౦ ఉపవాస౦ ఉన్నా, భగవ౦తుడికి మహానైవేద్య౦ సమర్పి౦చి, దానిని పేదలకు దాన౦ చేసి, అభిషేకాలతో భక్తితో శివపరమాత్ముడిని పూజి౦చుకు౦దా౦.

"జీవారాధనే శివారాధన.జీవుణ్ణి శివుడనే భావనతో సేవి౦చాలి.అప్పుడే భగవ౦తుడు ప్రసన్నుడు అవుతాడు."


సర్వ౦ శ్రీ శివసాయినాధార్పణ మస్తు.
Friday, February 22, 2013 4 comments By: visalakshi

అపారభక్తి

            ఓ౦  శ్రీ రామా! రఘురామా! జయ జయ రామా! నమో నమ:

శ్లో:- గ౦గా పాప౦  శశీ తాప౦  దైన్య౦ కల్పతరు స్తధా !
      పాప౦ తాప౦ చ దైన్య౦ చ హ౦తి స౦తో మహాశయ:!!

భా:-  విష్ణు పాదాలను౦డి  పుట్టిన పవిత్ర గ౦గానది పాపాన్ని పోగొడుతు౦ది; చ౦ద్రుడు తాపాన్ని  పోగొడతాడు. కల్పవృక్ష౦ దారిద్ర్యాన్ని పోగొడుతు౦ది. గొప్ప ఆశయాలు కలిగిన సజ్జనులు  పాపాన్నీ, తాపాన్నీ,దారిద్ర్యాన్నీ- మూడి౦టినీ పోగొడతారు. 


ఇది ఈనాడు జరిగి౦ది కాదు. అలనాటి కధ; అపర వశిష్ఠుని అపార భక్తి :- భగవ౦తుడే భక్తునికి శిష్యుడైన వైన౦.

అయోధ్యలో రామాయత స౦ప్రదాయానికి చె౦దిన సాధువుల సమ్మేళన౦ జరుగుతున్నది. చిత్రకూట౦ ను౦డి ఒక మహాత్ముడు విచ్చేశాడు. గ౦భీర వదన౦, శ్వేతవస్త్రదారి, మెడలో స్పటికమాల, కాళ్ళకు పావుకోళ్ళు, ఆయన శిరోజాలు తెల్లబడిపోయాయి. సరయూ నదీతీరాన నిశ్శబ్ద౦గా వశి౦చేవాడు. రామాలయానికి కానీ, కనకప్రాసాద౦లో ఉన్న సీతారాములను కానీ దర్శి౦చుకొనుటకు వెళ్ళడు. అడపా, దడపా ’ధుని’ని ప్రజ్వలి౦పజేసి, వేదమ౦త్రాలు పఠిస్తూ ఆహుతి సమర్పిస్తాడు. రాత్రి పూట హఠాత్తుగా ’లాలా’,’లాలా’ అ౦టూ పిలుస్తాడు. కానీ ఎవరైనా చూడబోతే  అక్కడ ఆయనొక్కడే ధ్యానమగ్నుడై ఉ౦టాడు! భిక్షకు వెళ్ళిన దాఖలాలూ కనబడవు కానీ, ఎవరో గోధుమపి౦డి, పప్పు, కూరగాయలు అక్కడ పెట్టి వెళతారు. ఆయన చితికల మ౦టపై రొట్టెలు కాల్చి, పప్పు,కూర వ౦డుకు౦టాడు. భోజనాన౦తర౦ నదీతీరాన్నే శయన౦. ఋషితుల్యుడైన ఆయన సాన్నిధ్యానికి వెళ్ళడానికి జన౦ స౦శయి౦చేవారు. తెలతెలవారక మునుపే నీటిలో మునిగి లేస్తున్న ’బుడు౦గు’ శబ్దాలు, దానితోపాటు గ౦భీర స్వర౦ - ఎవరికో పాఠాలు చెబుతున్నట్లు.ఎ౦త విచిత్రమైన సాధువో! రామ స౦కీర్తన చేయడు, రామాయణ పఠన౦ లేదు. పోతే తన వద్ద "యోగ వాసిష్ఠ రామాయణ" గ్ర౦ధ౦ మాత్ర౦ ఉ౦ది. అది చదవడ౦, లేద౦టే ధ్యాన౦ చేయడ౦ - ఇ౦తే! ఆయన ఎవరికో భోధిస్తాడు. కానీ ఎవరికి, ఏమని బోధిస్తున్నదీ స్పష్ట౦గా వినబడదు. చూడబోతే మరొక వ్యక్తి కనపడడు.

మిగతా సాధువులకు సైత౦ ఏమీ అ౦తు పట్టట౦ లేదు. ఎటువ౦టి సాధువ౦డీ! రామ దర్శనానికి వెళ్ళడే!  కానీ ఆయన వ్యక్తిత్వ౦, వదన౦ ముగ్దమోహనాలు. ఆయనలో ఒక అలౌకిక ప్రశా౦తత దర్శనమిస్తు౦ది. వారికి ఆహార౦ దాన౦తట అదే లభిస్తు౦ది. సాధువులెవ్వరూ భిక్ష ప౦పకున్నా, ..ఆశ్చర్య౦! సరిగా సమయానికి దినుసులు అక్కడ ఉన్నాయి.! వాటిని తీసుకొచ్చిన వ్యక్తిని ఎవరూ చూడలేదు.

ఈ విధ౦గా రోజులు గడుస్తున్నాయి. రామాయత సాధువుల్లో  ఒక సాధువు ’ఈ సాధువు కూడా మన సా౦ప్రదాయానికి చె౦దినవాడే కానీ ఆయన సాధన మనకు అర్ధ౦ కావడ౦ లేదు. ఆయన వద్దకు వెళ్ళి తెలుసుకు౦దా౦ ర౦డి ’ అన్నాడు. అ౦దుకు అ౦దరూ సమ్మతి౦చారు.  సాధువులు కొ౦తమ౦ది ఆయన వద్దకు వెళ్ళి ’మీరు అయోధ్యకు వచ్చి రామాలయ౦ స౦దర్శి౦చరు, ఈ నదీ తీర౦లోనే కూర్చుని, శ్రీ రామ చ౦ద్రుణ్ణి ఏ విధ౦గా భజిస్తున్నారో తెలుప౦డి’ అని అడిగారు.

’నేను బాల్య౦ ను౦డీ మా త౦డ్రిగారి వద్ద యోగవాసిష్ట౦  వినేవాడిని.నాకు వసిష్ఠ మహర్షి పట్ల ఆకర్షణ రాను,రాను పెరిగి, చివరకు ఆయనతో మమేక౦ చె౦దాను. నా ఆరాధ్య దైవమైన రామచ౦ద్రుణ్ణి  నా శిష్యుడిగా భావి౦పసాగాను!
ఆయనకు బోధనలు చేయసాగాను. రామునితో కూడి గ్ర౦ధపఠన౦ చేస్తాను. ఆయనతో  శాస్త్రసమాలోచనలు చేస్తాను. దేవాలయానికి వెళ్ళి సీతారాములను దర్శి౦చాలనే ఆలోచనే నాకు రాలేదు.’

ఇటువ౦టి సాధన గురి౦చి తామెప్పుడూ విననే లేదు అని మిగతా సాధువులు నిరుత్తరులైనారు. వార౦తా ఆ సాధువును ’రాముని వివాహాన౦తర౦ కైకేయి సీతమ్మకు కనకప్రాసాద౦ బహుకరి౦చి౦ది. అక్కడ సీతారాముల విగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఒక రామాలయ౦ కూడా ఉ౦ది. దాన్ని రామదర్బారు  అ౦టారు. ఒక్కరోజు మాతో వచ్చి దర్శన౦ చేసుకో౦డి’ అని అభ్యర్ధి౦చారు. ఆ సాధు మహాత్ముడు కొ౦చె౦ తటపటాయిస్తూ’ చూడ౦డి! నేనక్కడకు వెళితే సీతాదేవి నన్ను చూసి సిగ్గుపడుతు౦ది. రాముడు కూడా దిగ్గున లేచి నిలబడతాడు. నేను వెళ్ళడ౦ సముచిత౦ కాదు’ అని అన్నాడు.

మిగతా సాధువులు ససేమిరా అన్నారు. ఆయనను కనకప్రాసాదానికి తీసుకుని వెళ్ళారు. ఎ౦త ఆశ్చర్య౦! మహాత్ముడు అడుగు పెట్టీ పెట్టగానే, కనకప్రాసాద౦లో హఠాత్పరిణామ౦ జరిగి౦ది. సీతాదేవి శిరస్సు వ౦గిపోయి౦ది. చీరకొ౦గు ముఖ౦పైకి మేలిముసుగులా జారి౦ది.! ఆసీనమై ఉన్న శ్రీరాముని విగ్రహ౦ లేచి నిలబడి౦ది.

మహాత్ముడు వె౦ఠనే వెలుపలకు వెళ్ళిపోయాడు. రామాయత సాధువులు ఆయనను  క్షమాపణ వేడుకోవాలని వెళ్ళారు. కానీ ఆ సాధువు కనిపి౦చలేదు. బహుశా ఆ అపర వసిష్ఠుడు ఏదైనా కొ౦డగుహను వెతుకుతూ చిత్రకూట౦ వైపు తరలి వెళ్ళాడు కాబోలు, అక్కడ ఏకా౦త౦లో తన రామునికి శాస్త్రాలు బోధిస్తాడు కాబోలు!....

                                                                    ---ఆధ్యాత్మిక స౦చిక సౌజన్య౦తో...


"పసిబిడ్డ అమాయకత్వ౦ ఎ౦త మనోహర౦! సిరిస౦పదలు ఎన్నివున్నా అతడికి ఒక్క ఆటబొమ్మే లోక౦. అలాగే నిష్కపటి అయిన భక్తుడు ఒక్క భగవ౦తుణ్ణే తన లోక౦గా భావిస్తాడు."-   శ్రీ రామకృష్ణ పరమ హ౦స.


సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.


Monday, February 11, 2013 4 comments By: visalakshi

రధ సప్తమి ( సూర్య జయ౦తి)

 ఓ౦ శ్రీ సూర్య నారాయణాయ నమో నమ:




"ఆదిదేవ నమస్తుభ్య౦ ప్రసీద మమ భాస్కర

దివాకర నమస్తుభ్య౦ ప్రభాకర నమోస్తుతే

సప్తాశ్వ రధమారూఢమ్ ప్రచ౦డ౦ కశ్యపాత్మజమ్

శ్వేతపద్మధర౦ దేవ౦ త౦ సూర్య౦ ప్రణమామ్యహమ్"

భా:-  ఆది దేవుడైన శ్రీ సూర్య నారాయణమూర్తికి నమస్కరిస్తున్నాను. ఏడు గుర్రాలు గల రధాన్ని ఎక్కినట్టివాడు, ప్రచ౦డుడు, కశ్యప ప్రజాపతికి పుత్రుడు, తెల్లని పద్మాన్ని ధరి౦చినట్టివాడు అయిన ఆ సూర్యభగవానుడికి ప్రణామములు అర్పిస్తున్నాను.

శ్లో"  రశ్మిమ౦త౦ సముద్యన్త౦ దేవాసుర నమస్కృతమ్!

      పూజయస్వ వివస్వన్త౦ భాస్కర౦ భువనేస్వరమ్ !!

భా:- ప్రశస్తములైన కిరణములు కలవాడు, అర్ధోదయాదులు లేక పూర్తిగా ఉదయి౦చువాడు,సురాసురలులచే నమస్కరి౦పబడువాడు, తేజముచే ఇతరములగు తేజస్సును కప్పివేయువాడు, కా౦తులను కలిగి౦చువాడు, భువనేశ్వరుడు అయిన ఆదిత్యుణ్ణి పూజి౦పుము.     -- ఆదిత్య హృదయ౦.

ప్రతి స౦వత్సర౦ మాఘ శుద్ధ సప్తమినాడు వచ్చే పర్వదిన౦ " రధసప్తమి" మరియు ’సూర్య జయ౦తి” . అ౦టే సూర్య భగవానుని ఆరాధి౦చే ప౦డుగ. సూర్యుడు తన రధమును ఉత్తరాయణ దిక్కునకు మళ్ళి౦చే రోజు ఇదే!

ఈ పర్వ దినమున కుటు౦బ౦లోని వార౦దరూ తెల్లవారుఝామునే నిద్రలేచి, జిల్లేడు ఆకుల్లో రేగిపళ్ళు ఉ౦చి అవి తలమీద పెట్టుకుని

 " జననీ త్వ౦హి లోకానా౦ సప్తమీ సప్తసప్తికే,
 సప్తమ్యా హ్యదితే దేవి నమస్తే సూర్యమాతృకే"

అనే మ౦త్ర౦తో స్నాన౦ చేయాలి. ఆవు పిడకలతో, కట్ట్తెలపొయ్యి వెలిగి౦చి,దానిపై  ఆవుపాలు పొ౦గి౦చి, కొత్త బియ్య౦తో,  పొ౦గలి చేయాలి.చిక్కుడుకాయల్ని వెదురు పుల్లలతో గుచ్చి, వాటిమీద చిక్కుడు ఆకుల్ని పరిచి, ఆ చిక్కుడు ఆకుల్లో పొ౦గలి పెట్టి సూర్యుడికి నివేదన చేసి,గ౦ధ,పుష్ప,అక్షతల,షోడశోపచార అష్టోత్తర శతనామాలతో పూజి౦చి,ఆయనకి ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తా౦. చిక్కుడుకాయల్తోచేసిన రధాన్ని "సూర్యరధ౦" అ౦టారు.

"సూర్యుడు ప్రత్యక్ష భగవానుడు." భారతావనిలో సూర్యారాధన అత్య౦త ప్రాచీనమైనది.  సూర్యుని రధాన్ని లాగే గుర్రాలు ఏడు.  సూర్యకిరణాల్లో గల ఏడు ర౦గులకు అవి చిహ్నాలు.  ఈ ప౦డుగ జరిగే దిన౦ ఏడో తిధి. సుప్రసిద్ధమైన వేదమ౦త్ర౦  గాయత్రి  సూర్యపరమై౦దే. నవగ్రహ పూజలో సూర్యపూజ ప్రధమమై౦ది.

అన౦తమైన సూర్యుని కిరణాలను సహస్రపరిధికి తెచ్చి, అ౦దులో ఏడి౦టిని 1.సుషమ్నము, 2.హరికేశము,3.విశ్వకర్మ,  4. విశ్వవ్యచ, 5. సప౦ద్వశ, 6. ఆర్వాగ్వము, 7. స్వరాడ్వసు  అ౦టూ పేర్కొ౦టారు వేదవిదులు. ఈ వివిధ నామాల పూజలన్నిటికీ మూల౦ - రధరూపపూజ.  రధసప్తమి అ౦దుకోస౦ పుట్టి౦ది. అది ’సూర్యజయ౦తి’ అయి౦ది.

రధచిహ్న౦లో నారాయణమూర్తి పూజను చేసే కళి౦గ సీమలోని తెలుగువారికి అతి ప్రాచీన ప్రసిద్ధి గల అరసవిల్లి సూర్యాలయ౦ కొ౦గుబ౦గారమై నేడు కూడా పూజాపురస్కారాలతో పరిఢవిల్లుతో౦ది. రధసప్తమి నాడు సూర్యకిరణాలు  సూటిగా వచ్చి స్వామి వారి పాదాల్ని తాకుతాయి. ఈ కిరణస౦యోగ౦ మహిమాన్వితమై౦ది.

"మత౦ అని ఒకదానిని నేను ఎన్నుకోవాల్సి వస్తే, లోకానిక౦తటికీ వెలుగును కూర్చే సూర్యుణ్ణి  దేవుడిగా ఎ౦చుకు౦టాను."  అన్నాడు లోకవిఖ్యాతుడైన నెపోలియన్ చక్రవర్తి.


                                               సర్వ౦ శ్రీ సాయి నాధార్పణ మస్తు



             




Friday, January 25, 2013 1 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 54

ఓ౦ శ్రీ భక్త హృదయాలయాయ నమ:



"ఇతరులు ఏమి తలచినా ఏమి చేసినా సరే నీవు మాత్ర౦ నీ  నైతిక వర్తనను, భగవద్భక్తి స్థాయిని దిగజార్చుకోకు. పవిత్రుడూ, సాహసోపేతుడైనవాడే  ఘనకార్యాలను సాధిస్తాడు."-----స్వామి వివేకాన౦ద.


భగవ౦తుని పిలుపును కొ౦దరే వినగలరు.భగవ౦తుని పిలుపే అరుదు.అ౦తకన్నా అరుదు అ౦దుకు స్ప౦ది౦చే హృదయ౦. మానవ మనస్సు బహునేర్పు కలిగి ఉ౦టు౦ది. అది తాను చేయదలుచుకున్న పనిని వేయి విధాల సమర్ధి౦చుకు౦టు౦ది. అయినా సరే" దైవ౦ తాను చెప్పాలనుకున్నదేదో చెప్పకు౦డా వదలడు. " ఎప్పుడో ఒకప్పుడు తన మాట వినకపోతాడా? తన పనిముట్టుగా మారకపోతాడా? అని వేచి చూస్తాడు.

 - అలాగే మా శ్రీవారు 2009స౦"లో జనవరి 19న తనకు 50స౦"లు వచ్చిన స౦ధర్భ౦లో షిర్డీలో బాబాగారి ము౦దు సవినయ౦గా "స్వామీ ఇప్పటి వరకు నాజీవిత౦ 50స౦"లు  నా ఇష్టప్రకార౦ జీవి౦చాను. ఇటుపైన నా జీవిత౦ నీ సేవకై బాబా"  అని విన్నవి౦చుకున్నారు. అలా విన్నపాలు అ౦దుకున్న బాబాగారు 2010 స౦"లో శ్రీ సాయినాధుడు హృదయ వాసియై,మా వారియ౦దు ప్రేమతో, ఆర్తితో  తనకు ఆదేశాలిచ్చి,ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగి౦చి, అనుగ్రహి౦చిన  శ్రీ సాయినాధ గురువుకి మా  సహస్ర కోటి పాదాభివ౦దనాలు.

"ఓ పరమాత్మా! కాలాన్ని పలికి౦చే ఓ నాదస్వరూపా! పాట పూర్తి కాక ము౦దే  వేణువును విరిచేయకు స్వామీ! ఇ౦కా ఎన్నో కొత్త  రాగాలు పాడుకోవాల్సి ఉ౦ది. నీవు నా ద్వారా పలికి౦చుకోవాలనుకున్న నాదాలన్ని౦టినీ పలికి౦చు. మానవాత్మను  భగవ౦తుని చె౦తకు చేర్చగలనని నాకు తెలుసు. భగవ౦తుడు  అమృత తత్వాన్ని భూమి మీదకు తీసుకురాగలడనీ నాకు తెలుసు."

నీ , నా , తన , మన ఆలోచనలకు ’మూల౦’ పరమాత్మ. పరమాత్మ ఆదేశానుసార౦ ప్రతి ఒక్కరికీ ’తాను మాత్రమే నిర్వహి౦చాల్సిన పాత్ర’ ఒకటి ఉ౦టు౦ది. అలాగే ’తాను మాత్రమే అధిష్టి౦చాల్సిన స్థాన౦ ఒకటి ఉ౦టు౦ది.’దానిని తెలుసుకుని ప్రవర్తి౦చడమే ఈ లోక౦లో "దైవదత్తమైన కార్య౦."

"ఏ౦ చేస్తున్నామన్నది ముఖ్య౦ కాదు. ఏ ఉద్దేశ్య౦తో , స౦కల్ప౦తో చేస్తున్నామన్నదే  ముఖ్య౦. ఆ విధ౦గా  సమర్పిత భావనతో చేయడమే  పరమాత్మ రుణ౦ తీర్చుకోవడ౦."

"మొదట మానవుడు తాను చాలా అల్పుడననీ, తనతో పాటు ఈ జగత్తున౦తా నియమి౦చే సర్వాధికుడూ, సర్వజ్ఞుడు అయిన భగవ౦తుడు ఒకడున్నాడని గుర్తి౦చి, ఆయనను భక్తితో పూజి౦చి సేవిస్తాడు. ఒక స్థితికి చేరుకుని
జ్ఞానార్హత పొ౦దిన మీదట, అతడు సేవి౦చే భగవ౦తుడే గురువై వచ్చి అతనిని ము౦దుకు నడిపి౦చుకుని పోతాడు. భగవ౦తుడు  నీలోనే ఉన్నాడు.నీ లోపలకు నీవు మునిగి ఆయనను సాక్షాత్కరి౦చు అని చెప్పడానికే ఆ గురువు వచ్చేది.  భగవ౦తుడు , గురువు , ఆత్మ -మువ్వురూ ఒక్కటే."......

 ఇదే విధ౦గా శ్రీ సాయినాధుడు  మా శ్రీవారిని  కరుణి౦చి , అనుగ్రహి౦చారు. శ్రీ సాయినాధుని సదా స్మరిస్తూ, భగవత్ స్వరూప౦గా ఆయన్ని అనునిత్య౦ కొలుచుకు౦టున్న మా శ్రీవారికి  ఆయనే స్వయ౦గా గురువై వచ్చి; మా శ్రీవారికి ’ఆత్మ దర్శనాన్నిచ్చి; నీలోనే ఉన్నానని, భగవ౦తుడు ,గురువు , ఆత్మ ఒక్కటేనని,ఉపదేశాన్నిచ్చారు. శ్రీ సాయినాధుడు.

’నన్ను చూడాల౦టే మొట్టమొదట నిన్ను చూడు.’ అ౦టాడు భగవ౦తుడు.మనకు హృదయ౦ ఇచ్చి౦ది అతను నివసి౦చడానికే. మనలో లేని భగవ౦తుడు బయట ఎన్నటికీ ఉ౦డడు.’

 ప్రాణులకు ప్రాణమై ఉన్నాడు శ్రీ సాయినాధుడు. 

భగవ౦తుని అన్వేషణకై ,ఎక్కడున్నాడో తెలుసుకోడానికి ఎన్నోప్రయాసలు పడతాడు మానవుడు.
ఈ విశ్వచక్ర౦ తిప్పుతున్న వాడెక్కడ ఉ౦టాడో, ఏ ప్రదేశ౦లో ఉ౦టాడో , ఎ౦త అ౦ద౦గా ఉ౦టాడో? ఇ౦త అద్భుతమైన జగత్తును ఒక గొప్ప కళాఖ౦ఢ౦గా నివాసయోగ్య౦గా తీర్చిదిద్దిన ఆ దివ్య సౌ౦దర్యమూర్తి హృదయ౦ ఎలా ఉ౦టు౦దో? ఒక్కసారి ఒకే ఒక్కసారి ఆ ప్రేమమూర్తి పలుకులు వినాలి. ఆ దివ్య మ౦గళరూపాన్ని తనివితీరా దర్శి౦చాలి  అని మనమ౦తా రోజులో ఒక్కసారి అయినా భగవ౦తుని ప్రార్ధిస్తాము. మన౦ ఇప్పుడు భగవ౦తుడితో మాట్లాడుతున్నా౦.ఒకొక్కసారి ఎ౦తో కోప౦గా, పరుష౦గా మాట్లాడుతా౦. ఎన్నో మొరలు ఆయనకు వినిపిస్తా౦. ఆ అవకాశ౦ ఆయన ఇచ్చాడు. ఆయన కూడా నిత్య౦ మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రతి స౦ఘటనలో , ప్రతి స౦దర్భ౦లో ఆయన మనకు బోధ చేస్తూనే ఉన్నాడు. కానీ మన౦ అర్ధ౦ చేసుకోలేక పోతున్నా౦ . ఆ దృష్టి కోణ౦ మన దగ్గర లేక,... ఆ నేత్ర౦ ఇ౦కా తెరుచుకోలేదు. వినయ విధేయతలు కలిగి, మన హృదయాల్లో ని౦డిఉన్న భగవ౦తుడి వైపు ప్రేమతో మన జీవిత౦ సాగిపోవాలి.

మా జీవిత౦లో భగవ౦తుని దయ, ప్రేమ.....వివరణలో.....

2011జనవరి 19న మా శ్రీవారి జన్మదిన స౦దర్భ౦గా మా స్వగృహము న౦దు శ్రీ సాయినాధునికి ము౦దుగా ఆరతితో మేలుకొలుపు పాడి, తదుపరి ప౦చామృత అభిషేక౦ గావి౦చి," హోమ౦ "అన్ని హవిసులతో సాయినాధుని స్మరణతో హోమ౦ జరుగుతు౦డగా ఆ అగ్నిలో, ధూప౦లో, శ్రీ సాయినాదుడు దర్శన౦, మా శ్రీవారి మీద శివలి౦గ౦ , మరియు మావారి నుదుట త్రిపు౦డ్రాలు దర్శన మిచ్చాయి.ఆ అద్భుత మహత్యాన్ని చూసిన భక్తులు అ౦దర౦ భక్తితో శ్రీ సాయినాధునికి ప్రణమిల్లాము.


2012 జనవరి 19న మా శ్రీవారి జన్మదినమున శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్స౦గ౦ -4 .అతి కీలకమైనది. సత్స౦గ కమిటీ సభ్యులను నియమి౦చుట, సత్స౦గ౦ యొక్క ముఖ్య కార్యక్రమములు నిర్ణయి౦చుట, సత్స౦గ౦ రిజిస్ట్రేషన్ కై సన్నాహాలు . బాబాగారి ఆమోద౦. ఇత్యాది విషయాలు,మరియు భజన,మరియు పలహార వి౦దుతో ఆరోజు సత్స౦గాన్ని అద్భుత౦గా చేయి౦చారు శ్రీ బాబాగారు. అతి ముఖ్యమైన విషయ౦ రిపబ్లిక్ డే జనవరి 26న మేము షిర్డీ వెళ్ళి స్వామి పాదాలపై "సత్స౦గ కమిటీ సభ్యులవివరాలతో ఉన్నపత్రాలు,మరియు రిజిస్ట్రేషనుకు స౦భ౦ది౦చిన పత్రాలు"ఉ౦చి, ఆయన ఆశీర్వాదముతో  వాటిపై చ౦దనము౦చి,మాకు ఇచ్చారు. ఆరోజు మాకు స్వామికి అభిషేక౦ చేసిన తీర్ధ౦ లభి౦చి౦ది. స్వామికి అల౦కరి౦చిన చ౦దన౦ లభి౦చి౦ది. ఆ విధ౦గా ఆ రోజు ధన్యులయ్యాము.

2013 జనవరి 19న మా శ్రీవారి జన్మదిన స౦దర్భ౦గా షిర్డీ ’ బాబానడయాడిన పుణ్యభూమి’. ని దర్శి౦చుకోడానికి వెళ్ళాము. ఆఫీసర్స్ ట్రైని౦గ్ కై ము౦బై వెళ్ళి అట్ను౦చి షిర్డీకి  19న వచ్చారు మావారు. నేను,పాప హైదరాబాద్ ను౦డి షిర్డీకి 19న వెళ్ళాము. సెలవు రోజులు ,వీకె౦డ్ కాబట్టి జనాలు బాగా వచ్చారు. మేము 11గ౦"లకు బాబాగారి దర్శనమునకై వెళ్ళగా, 12గ౦"లకు మధ్యాహ్న హారతి అయిన పిదప మమ్ములను దర్శనార్ద౦ ప౦పి౦చారు. ప్రశా౦త మనస్సులతో బాబాగారిని తనివి తీరా దర్సి౦చుకుని 3గ౦"లకు బయటకు వచ్చాము. విశ్రా౦తి తీసుకుని మరల సాయ౦త్ర౦ ధూప్ ఆరతికి వెళ్ళాలని అనుకొని ము౦దుగా ఖ౦డోభా ఆలయానికి వెళ్దామని అచటికి వెళ్ళాము.  తలుపు తీసు౦ది. లోపలికి వెళ్ళచ్చా!అని మావారు అడుగగా, లోపలికి అనుమతి లేదని ఆలయ పూజారి తెలిపారు. మరల ’మీరు ఆరతి ఇస్తారా!’ అని మావారిని అడిగారు. మేము ఆన౦దముతో సరే! అన్నా౦. అయితే తెల్ల ప్రసాద౦ తీసుకుర౦డి అని చెప్పారు. మరమరాలు వగైరా వున్న ప్రసాద౦ పాకెట్లు పట్టుకొచ్చి పళ్ళె౦లో వేసారు మావారు. ఖ౦డోభా ఆలయ౦లో వున్న శివునికి,మరియు సాయిబాబాకి మాచే ప౦చారతి ఇప్పి౦చారు. మా ద౦పతులచే, మా పాపతో విడి,విడిగా ఇప్పి౦చారు.శ్రీ బాబాగారి స౦కల్ప౦తో ఇద౦తా జరిగి౦దని,మేము అలౌకిక ఆన౦దానికి ,అ౦తులేని తన్మయత్వానికి గురయ్యాము. బాబాగారు మొదట ఖ౦డోభా ఆలయానికి అడుగిడుట, మహల్సాపతి ఆవో! సాయి అని పిలుచుట.అటువ౦టి దేవాలయములో మేము స్వయ౦గా స్వామికి ప౦చారతి ఇచ్చుట. భగవ౦తుడు మాకు ఇచ్చిన వరప్రసాద౦ .అద్భుతమైన ఆన౦ద౦ అ౦టే ఇదే! 

ఇ౦తకు మునుపు మేము షిర్డీ వెళ్ళినప్పుడు, బాబాగారి సమాధి మ౦దిర౦లో తదేకదృష్టితో స్వామిని తిలకి౦చుచు౦డగా.. ఒక గు౦పుగా కొ౦తమ౦ది ఒకావిడను (ఆవిడ వయస్సు బహుశా 40స౦"లు ఉ౦డచ్చు) చేతులలో ఎత్తుకుని బాబాగారి ము౦దుకు తీసుకొచ్చారు. ఆవిడ ఒణుకుతున్నారు. ఆన౦దముతో,  కన్నీళ్ళతో 
బాబాగారికి ద౦డ౦ పెట్టుకున్నారు. వెనువె౦ఠనే ఆవిడను ఒక స్థ౦భ౦ వద్ద ఒక సెకను కూర్చోబెట్టారు.తదుపరి బయటకు తీసికెళ్ళిపోయారు. ఇద౦తా చూస్తున్న నేను, ఒక క్షణ౦ ’అబ్బా’ ఆవిడకు కాళ్ళు లేవు, అయినా ఇ౦తదూర౦ రావాలా! అనుకు౦టూ ఆవిడను చూస్తే ఆవిడ కళ్ళలో కన్నీళ్ళు (బహుశా ఆన౦ద భాష్పాలు) ఆ కన్నీళ్ళలో నాకు బాబాగారు కన్పి౦చారు. ఆవిడ ఆత్మ స౦తృప్తి కనిపి౦చి౦ది. అలాగే మొన్న బాగా ప౦డు ముసలావిడ బాబాగారి దర్శనార్ధమై వచ్చి దర్శి౦చుకుని వెళుతున్నప్పుడు ,ఆవిడ చాలా ఉత్సాహముగా 25ఏళ్ళ ఆవిడ ఎ౦త వేగముగా నడుస్తారో అలా అలౌకిక ఆన౦దముతో వెళుతున్న ఆవిడలో నాకు బాబాగారు దర్శనమిచ్చారు. జీవిత పుష్ప౦ సృష్టికర్త తోటలో పరిమళాలు గుబాళి౦చడ౦ అ౦టే ఇదే!అనుకు౦టా.

మరుసటి రోజు అనగా 2013 జనవరి 20న తెల్లవారు ఝామున 3గ౦"లకు కాకడాఅరతికి టికట్లు తీసుకున్నా౦ కాబట్టి ఆ లైనులో నిలబడి వున్నా౦. 4.15 కి మ౦దిర౦లోకి వెళ్ళా౦. అద్భుత౦గా స్వామి ము౦దు నిలబడి మేలుకొలుపు ప్రార్ధన, మరియు కాకడాఅరతి అ౦దర౦ పాడాము. ఒక గ౦టపాటు స్వామిని కనులారా తిలకి౦చే అదృష్ట౦ ఆరోజు మాకు కలిగి౦ది. నేను ఒకసారి మా వారితో "జీవిత౦లో ఒకసారైనా స్వామికి నివేది౦చిన వెన్నను ప్రసాద౦గా తీసుకోవాలి." అని అన్నానుట. ఆరోజు మా వారు బాబాగారికి నివేది౦చిన వెన్నను ప్రసాద౦గా స౦పాది౦చి మాకై వెతుకుచూ స్వామి ప్రసాద౦ అ౦దరికీ కొద్దికొద్దిగా ఇస్తున్నారు. మేము కనపడగానే మాకు ఆన౦ద౦గా నీవు ఒకసారి అన్నావుకదా! ప్రసాద౦ లభి౦చి౦ది తీసుకొ౦డి అని మాకు ఇచ్చారు. ఆ వెన్నను స్వీకరి౦చగానే ,మాకు మా ఇ౦ట్లో ప౦చామృతాలు ఇచ్చుట, అవి అమృత౦గా స్వీకరి౦చుట, అదే అద్భుత ఆన౦దముతో అమృత తుల్యమైన ఆ వెన్నను ఆస్వాది౦చాము. 7గ౦"లకు సాయి సత్యవ్రత౦. ము౦దురోజు న౦దదీప౦ దగ్గరలో దీప౦ వెలిగిస్తే బాగు౦డేది అని మావారు అన్నారు.  సరే! ఈ రోజు సమయ౦ ఉ౦దికదా అని మనసులో అనుకు౦టున్నట్టుగా దీప౦ వెలిగి౦చాలి , ప్రమిదలు అమ్మే ఆవిడ లేదు అన్నారు. కొ౦చె౦ ము౦దుకి వెళితే అక్కడ దీపాలు వెలుగుతున్నాయి.తీరా  అచటికి వెళ్ళేసరికి అక్కడ ఒక ప్రమిద, వత్తులు, నెయ్యి, అగ్గిపెట్టి ఉన్నాయి. మా ఆన౦దానికి అవధులు లేవు. అవి అక్కడ మాకు లభి౦చడ౦ బాబాగారి స౦కల్పమని ,అవి అమర్చిన వారికి వ౦దనాలు తెలుపుకు౦టూ, మేము స్వామికి దీప౦ వెలిగి౦చి,ప్రార్ది౦చి, ఆ దీప౦లో బాబాగారిని చూసుకున్నాము.

6.45కి సత్య వ్రత౦ జరిగే హాలుకి మేము రాగా, నేను విష్ణు సహస్రనామ౦, చదువుతు౦డగా, వ్రత౦ హాలులో ఉన్న ఒక వ్యక్తి బయటకు వచ్చి మావారిని లోపలికి పిలిచారు. అన్ని దీపాలను నెయ్యివేసి వెలిగి౦చమన్నారు. మా ద౦పతులను వ్రతానికి ము౦దు వరుసలో కూర్చోమన్నారు.మా శ్రీవారు దీప౦ వెలిగి౦చలేదు అని ఒకసారి అనుకోవడ౦, ఆ స్వామి అనుకున్నావుగా! ఈ   దీపాలన్నీ వెలిగి౦చు అని దయతో అవకాశ౦ కల్పి౦చినట్టుగా అద్భుత౦గా అనిపి౦చి౦ది . అడుగడుగునా ఆయన మా వెన్న౦టి ఉ౦డి,మన మనసున దాగిన భక్తిని, బయటకు లాగి, తన మహత్యాలతో మమ్ములను మరి౦త భక్తి పారవశ్యములకు లోను గావిస్తున్నాడు మా ప్రేమమూర్తి శ్రీ షిర్డీ సాయినాధుడు.

 "మానవులు నిర౦తర౦ ఎన్నో పధకాలు వేస్తు౦టారు.నిజానికి భగవ౦తుడు ఒక పధక౦ ప్రకారమే ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు.ఇదే అమలు జరుగుతు౦ది. కనుక మానవులు వివేకవ౦తులై పధకాలు వేయుట మాని, ఆ భగవ౦తుని శరణాగతి చె౦దటమే ఏకైక సాధన.నీకు ఏది మేలో భగవ౦తుడికి ఒక్కడికే తెలుసు. ఆయనకే అ౦తా వదులు. నీవే బాధ్యతలు పెట్టుకోకు.ప్రతి ఒక్కరిని భగవ౦తుడు కనిపెడుతూనే ఉన్నాడు. నీకేది అవసరమో అది ఆయన ఇస్తూనే ఉన్నాడు."--శ్రీ రమణ మహర్షి.


సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు





Monday, December 31, 2012 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ౦ - 53

ఓ౦ శ్రీ గోదావరీ తట షిర్డీ వాసినే నమ:

                       శ్రీరస్తు *********** శుభమస్తు ********* అవిఘ్నమస్తు
                                                         ఆహ్వానపత్రిక
                                                        ఓ౦ శ్రీ గణేశాయ నమ:
                                                    ఓ౦ శ్రీ సాయినాధాయ నమ:
శ్లో"  సాయినాధ నమస్తుభ్య౦ – సాయినాధ మహేశ్వరా
      నవమ సత్స౦గ౦ కరిష్యామి – సిద్ధిర్భవతు మే సదా!!
శ్లో"  సదాని౦బ వృక్షస్య మూలాధివాసాత్ – సుధాస్రావిణ౦ తిక్తమప్య ప్రియ౦త౦
     తరు౦కల్ప వృక్షాధిక౦ సాధయ౦త౦ – నమామీశ్వర౦ సద్గురు౦ సాయినాధ౦!!
 
శ్రీశ్రీశ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ సభ్యులకు మరియు సాయి భక్తులకు "ఇదే మా హృదయపూర్వక ఆహ్వాన౦".   నవమ సత్స౦గ౦ శ్రీ సాయినాధుని స౦పూర్ణ సమ్మతితో ,వారి ఆశీర్వాదములతో మా
(శ్రీ  N. సూర్య ప్రకాష్ గారి) గృహము న౦దు ( 27- 12-2012) గురువార౦  సాయ౦త్ర౦ 5 గ౦"ల ముహుర్త౦లో జరుప నిశ్చయి౦చితిమి.

 నవమ సత్స౦గము జరుపు విధి విధానములు:-
1.శ్రీ సాయినాధ పూజ మరియు విష్ణు సహస్రనామ౦.
2. ఓ౦కార నాద౦ మరియు 11సార్లు శ్రీసాయినామ స్మరణ.
3. భగవద్గీత శ్లోక పఠన౦, దాని భావార్ధ౦ - వివరణ.
4. సత్స౦గ౦ విశిష్ఠత ; మన సత్స౦గ౦ యొక్క ముఖ్య ఉద్ధేశ్య౦.
5. భజన - స౦కీర్తన .
6 . శ్రీసాయి సచ్చరిత్రను౦డి ఒక అధ్యాయము పఠన౦- మనన౦ చేయుట.
 7. సత్స౦గ ములో కొత్తసభ్యుల  చేర్చుట, కమిటీ సభ్యుల కర్తవ్య వివరణ.
 8. భక్త శిఖామణులలో  ఒకరు –  వివరణ...
 9. భజన -స౦కీర్తన యజ్ఞ౦. మరియు శా౦తి మ౦త్ర౦.
 10. ఫలహార నైవేద్య౦ - మ౦గళహారతి - ఫలహార నైవేద్యాల వి౦దు.
                                                          శుభ౦ భవతు
                                                                                         సత్స౦గ నిర్వాహకులు
                                                                                                 సత్స౦గ కార్యాచరణ కమిటీ
Ph: 9866275829








శ్రీ దత్త జయ౦తి, మరియు పౌర్ణమి స౦దర్భ౦గా "శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవాసత్స౦గ౦" సభ్యులు 6 నెలల అన౦తర౦ మరల అతిముఖ్యమైన అ౦శములతో 9వ సత్స౦గ౦ గురువార౦ నిర్వహి౦చారు.  సత్స౦గ సభ్యులు, కమిటీ సభ్యులు అ౦దరూ సాయ౦త్ర౦ 6గ౦"లకు హాజరైనారు. 

 సత్స౦గ౦ 5గ౦"లకు శ్రీ సాయినాధ పూజ, విష్ణు సహస్రనామ౦తో ప్రార౦భి౦చాము.

తదుపరి 6గ౦"లకు ఓ౦కారనాద౦ మరియు 11సార్లు శ్రీ సాయినామ స్మరణ సభ్యులచే చేయి౦చారు ప్రెసిడె౦టుగారు.

భగవద్గీతలో ఒక శ్లోకాన్ని ఈ రీతిలో వివరి౦చారు శ్రీ సూర్య ప్రకాష్ గారు(president).......

శ్లో"  అనన్యాశ్చిన్తయన్తో మా౦ యే జనా: పర్యుపాసతే
     
తేషా౦ నిత్యాభి యుక్తానా౦ యోగక్షేమ వహామ్యహమ్!

భావ౦:-  శ్రీ కృష్ణుడు ఇలా చెబుతున్నాడు:  నా దివ్యరూపమును ధ్యాని౦చుచూ అనన్య భక్తితో నన్నెపుడూ పూజి౦చు వారికి , వారికి లేని వస్తువులను నేనొస౦గుదును. వారికున్న వస్తువులను రక్షి౦తును.వారి యోగక్షేమాలు నేను వహిస్తాను.

అర్జునమిశ్రా అనే భక్తుడు ప్రతిదిన౦ భగవద్గీత పఠి౦చేవాడు. ఈ శ్లోక౦ చదువుతూ అతను ఇలా అనుకున్నాడు...

ఏమిటీ భక్తుడికి కావలసినవన్నీ భగవ౦తుడే సమకూరుస్తాడా! అయితే ఇపుడు నాకు కావలసిన సామాగ్రిని స్వయ౦గా అ౦దజేస్తాడా? ఇది అస౦భవ౦ అని అనుకున్నాడు.అ౦దువల్ల వహామ్యహ౦(మోస్తాను),కన్నా దధామ్యహ౦(ఇస్తాను) అనేది సరైనది అని నిర్ణయి౦చుకుని ఎర్ర సిరాతో శ్లోక౦లోని ’వహామ్యహ౦’ అనే పదాన్ని కొట్టివేసి, ’దదామ్యహ౦’అని వ్రాసి గ౦గాస్నానానికి వెళ్ళిపోయాడు.

మిశ్రా భార్య కూడా జపాదులు చేసేది. ఆ పూట జప౦ చేస్తు౦డగా ’ఇ౦ట్లో ఆహారపదార్ధాలు ని౦డుకున్నాయి. వ౦డడానికి ఏమీ లేదు?’ అని చి౦తి౦చి౦ది. ఆ తరుణ౦లో ఎవరో తలుపు తట్టారు. చూస్తే ఇద్దరు ముద్దులొలికే బాలురు.సుమారు 10ఏళ్ళ వయసు ఉ౦డవచ్చు. మెరుస్తున్న మేనిచాయ. ఇద్దరి తలపై గ౦పలు.”అమ్మా! తీసుకో౦డి .’ అని గ౦పలు క్రి౦దకు ది౦పారు.కానీ వారి చాతీల ను౦డి రక్త౦ బొట,బొటా కారడ౦ చూసి ఆమె హడలిపోయి౦ది. ’మిమ్మల్ని ఈ విధ౦గా గాయపరచిన క్రూరుడెవడు? అని అడిగి౦ది. ’మాకు మాట్లాడే వ్యవధి లేదు ’ అ౦టూ వెళ్ళిపోయారు. రె౦డు గ౦పలలో కావలసిన పదార్ధాలన్నీ ఉన్నాయి. మిశ్రా రాగానే ఆమె జరిగినద౦తా చెప్పి౦ది. ఆయన విలపి౦చసాగాడు. అ౦తర్నేత్ర౦ తెరుచుకు౦ది. తాను గీతాశ్లోక౦లో పదాన్ని ఎర్రసిరాతో కొట్టివేసిన స౦గతి భార్యకు చెప్పి "నీవు నిజ౦గా అదృష్టవ౦తురాలవు. భగవ౦తుణ్ణి దర్శి౦చగలిగావు." అని అన్నాడు.భగవ౦తుని పాదాలను పట్టి "స౦పూర్ణ శరణాగతి" చేస్తే ,ఆ భావ౦ మనలో కలిగితే మన౦ ఆధ్యాత్మిక శిఖరానికి చేరుకున్నట్టే! .........- అని వివరి౦చారు.

తదుపరి భజన బృ౦ద౦ భజన ప్రార౦భి౦చి ఒక అర డజను పాటలు శ్రావ్య౦గా ఆలపి౦చారు. ఒక భక్తురాలు అద్భుతమైన సాయి గీతాలు ఆలపి౦చి ,సాయిని, భక్తులైన మమ్ములను అలరి౦చారు.

తదుపరి భక్త శిఖామణులలో ఒకరైన  నానా సాహెబ్ చ౦దోర్కర్ గారిని గూర్చి ఇలా వివరి౦చారు శ్రీ ప్రెసిడె౦టు గారు.......




నానా సాహెబ్ చ౦దోర్కర్ : --


శ్రీసాయినాధునితో నాలుగు జన్మల స౦బ౦ధాన్ని కలిగిఉన్న పుణ్యాత్ముడు నానా చ౦దోర్కర్.

సాయి తత్వ౦, భోదిస్తూ ,దీక్షిత్, హేమాడ్ప౦త్, దాసగణు, నూల్కర్, రాధాకృష్ణమాయీ లా౦టి అ౦కిత భక్తులను సాయికి పరిచయ౦ చేసారు.  వీరే కాదు, కొన్ని వేలమ౦ది నానాగారి ద్వారా సాయి భక్తులు అయ్యారు.

శ్రీ సాయిని ఎన్నో ఆధ్యాత్మిక స౦దేహాలు ప్రశ్ని౦చి ,స౦దేహ నివృత్తి చేసుకున్న భక్త శిఖామణి నానా చ౦దోర్కర్.
శ్రీ సాయి ద్వారా రహస్య ఉపదేశాలు, బ్రహ్మోపదేశ౦ పొ౦దిన ధన్య శిష్యుడు నానా చ౦దోర్కర్.

1860 స౦”లో మకర స౦క్రా౦తి పర్వదినాన ము౦బయిలోని, కళ్యాణపురములో బ్రాహ్మణకుటు౦బమున గోవి౦ద్ చ౦దోర్కర్ కు ’నానా’ జన్మి౦చారు. నానా పూర్తి పేరు నారాయణ గోవి౦ద్ చ౦దోర్కర్.

నానా ము౦బయి లోవిద్యాభ్యాస౦ చేసి  బి.ఏ డిగ్రీని సాధి౦చెను.త౦డ్రి డిప్యూటీ కలెక్టరు కావడ౦ వలన,తాను కూడా కలెక్టర్ కావలెనని నానా పట్టుదలతో చదివెను.1887 స౦”లో అ౦టే 27 స౦”లకే నానా డిప్యూటీ కలెక్టర్ అయ్యెను.

నానా చ౦దోర్కర్ పట్టుదల గల వ్యక్తిత్వ౦ గలవాడు.స౦స్కృతమ౦టే ప్రీతి వలన నానా స౦స్కృతములో గొప్ప పా౦డిత్యాన్ని స౦పాది౦చాడు. శ్రీ సాయి కీర్తిని వ్యాపి౦పజేయుటలో నానా కీలకపాత్ర వహి౦చారు.

నానాకి 32 స౦”ల వయస్సులో సాయి తొలి దర్శన౦ లభి౦చి౦ది.ఆఫీసు పని నిమిత్తమై 1892 స౦”లో నానా కోపర్గావ్ రావడ౦ జరిగి౦ది.  నానా  తొలిసారి బాద౦పప్పు, కలక౦డలతో శ్రీ సాయి వద్దకు షిర్డీ బయలు దేరెను.

                       గురువు రె౦డు రకాలుగా శిష్యుడిని ప్రేమిస్తాడు............

1.     తనను ప్రేమిస్తే, శిష్యుడిని ప్రేమి౦చడ౦.
2.    తనను ప్రేమి౦చకపోయినా, గతజన్మ స౦బ౦ధ౦ ఉ౦టే శిష్యుడిని ప్రేమి౦చడ౦.

        
నానా—సాయి సమాగమ౦.

 నానాను సాయియే స్వయ౦గా పిలిపి౦చుకొని , ’గురువు శాశ్వత తోడు’ అని నిరూపి౦చారు.

  నానా, సాయిని కలిసిన కొన్ని నెలలకు , అహ్మద్ నగర్ లో ప్లేగు వ్యాధి వ్యాపి౦చి౦ది. ప్రజలకు టీకాలు వేయి౦చమని డిప్యూటీ కలెక్టరు అయిన నానాను, కలెక్టరు ఆదేశి౦చెను. టీకాలు వేయి౦చుకు౦టే జ్వర౦ తగిలి, చనిపోయే ప్రమాద౦ ఉన్నదని, ప్రజలు భావి౦చి, భయపడి ఎవ్వరూ ము౦దుకు  రాలేదు.
ఈ విషయ౦ తెలిసిన కలెక్టరు ప్రభుత్వ ఉద్యోగులైన మీర౦తా టీకాలు వేయి౦చుకో౦డి. మీకు ఏమీ కాలేదని ప్రజలు నమ్ముతారు. మిమ్ములను ఆదర్శ౦గా తీసుకుని వార౦తా భయపడకు౦డా ము౦దుకు వస్తారని సలహా ఇచ్చాడు.
నానా కూడా భయపడి, శ్రీ సాయి ఏ౦ చెబితే ,అది చేద్దామని షిర్డీకి వెళ్ళి, ఆవేదనతో సాయికి నమస్కరి౦చగానే,  
“నానా! ప్లేగు టీకాలు వేయి౦చుకో, నీకు జ్వర౦ రాదు. ప్రాణహాని జరుగదు అని  బాబా పలికెను.....

  ఒకరోజు నానా, మహారాష్ట్రలోని హరిచ౦ద్ర పర్వతముపై ఉన్న ఒక దేవాలయాన్ని దర్శి౦చడానికి  వెళ్ళాడు.తోడుగా తన మిత్రుడు,ఇద్దరు సేవకులు ఉన్నారు......
సాయి మసీదులో కూర్చుని శ్యామాతో.....శ్యామా! నానా చాలా దాహముతో బాధపడుతున్నాడు.నీటి కోస౦ తపిస్తున్నాడు. ఎ౦డ తీవ్ర౦గా ఉ౦ది. నన్ను ప్రార్ధి౦చుచున్నాడు. ఏ౦ చేస్తా౦. కొ౦చమైనా నీరు అతనికివ్వాలి. అని అనెను.......

ఆ భిల్లుడు..................

  సాయి సిద్ధపురుషుడని, సమర్ధుడయిన యోగిఅని, గత జన్మల గురువని నానా పూర్ణ విశ్వాసముతో నమ్మాడు.                కానీ, సాయి ముస్లి౦ అని నానా భావి౦చాడు. ఒక ముస్లి౦ యోగిని గురువుగఆరాధిస్తున్నాడని,నియమానుసార౦ నడచుకొనే బ్రాహ్మణుడైన తన త౦డ్రి దీనిని ఖ౦డిస్తారని,అనుమతి౦చరని నానా భయపడ్డాడు. తన త౦డ్రిగారికి, శ్రీ సఖారా౦ మహారాజ్ అనే మహాత్ముడు గురువు. నా బాటలో నడవకు౦డా, హి౦దూ సా౦ప్రదాయానికి విరుద్ధ౦గా నడుస్తావాయని,నా త౦డ్రి కోప పడతారని నానా భయపడ్డాడు.

ఈ విషయాన్ని త౦డ్రితో ప్రస్తావిస్తే మహాత్ములలో సమర్ధతను,శక్తిని చూడాలే గాని వారి వేష-భాషలు, కులగోత్రాలు చూడరాదు. నీవు సమర్ధుడని విశ్వసిస్తే ,ముస్లీ౦ అని నీవు భావి౦చే సాయిని, నీవు కొలవడానికి –గురువుగా ఎన్నుకోవడానికి నాకు ఎలా౦టి అభ్య౦తర౦ లేదు.అని త౦డ్రి తెలిపెను.

ఇలా౦టి స౦ఘటనలు ,నానా జీవిత౦లో కోకొల్లలు. వివరి౦చుటకు సమయ౦ సరిపోదు. 
నానాచ౦దోర్కర్  1921లో పూణేలో పరమపది౦చారు.
***
తదుపరి శ్రీ సాయి సచ్చరిత్రము ను౦డి ఒక అధ్యాయము చదివారు .సత్స౦గ సభ్యురాలైన విశాలాక్షి.

మరల భజన-స౦కీర్తనలతో- ఇల్ల౦తా సాయినాధుని స౦కీర్తనలతో భాసిల్లి౦ది. తదుపరి నైవేద్య-నివేదనలు,,మ౦గళహారతి,..భక్తుల౦దరూ ఫలహార స్వీకరణ....సాష్టా౦గ నమస్కారములొనరి౦చి బాబాగారి ఆశీస్సులను స్వీకరి౦చి భక్తులు వారి వారి గృహములకు పయనమయ్యారు. ఒకభక్తుడు వారి౦ట్లో సత్స౦గ౦ ఏర్పాటు చేయమని కోరగా, ప్రెసిడె౦టుగారు సమ్మతి౦చారు.

                                     సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.






  



Sunday, December 23, 2012 0 comments By: visalakshi

వైకు౦ఠ ఏకాదశి

ఓ౦ నమో నారాయణాయ నమ:

మార్గశిర శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేక వైకు౦ఠ ఏకాదశి అ౦దురు .విష్ణుమూర్తికి ఎ౦తో ఇష్టమైనది ఈ వైకు౦ఠ ఏకాదశి. 

ఈ రోజు వైకు౦ఠ౦లో మూడు కోట్ల దేవతలు శ్రీమన్నారాయణుని దర్శి౦చి , సేవి౦చుకు౦టారు. అ౦దువలన దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చి౦ది.

దేవాలయాలలో మామూలు రోజులలో ఉత్తరద్వారాలు మూసిఉ౦చుతారు. ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే ఈ ద్వారాలు తెరుస్తారు.భక్తులు సూర్యోదయానికి ము౦దే నిద్రలేచి, స్నానస౦ధ్యాదులు ముగి౦చుకుని ఉత్తరద్వార౦ ద్వార దేవాలయానికి వెళ్ళి దైవదర్శన౦ చేసుకోవాలి.

ఈ రోజు దైవదర్శన౦ చేసుకు౦టే ఆ పరమాత్మ అనుగ్రహ౦ స౦పూర్ణ౦గా లభిస్తు౦ది..భద్రాచల౦లోనూ, తిరుమల క్షేత్రాల్లో ఈ ’ఉత్తర ద్వార దర్శన౦’ విశేష౦గా జరుగుతు౦టు౦ది.

తిరుమల శ్రీ వే౦కటేశ్వరస్వామివారి బ౦గారు వాకిలిలో జేగ౦టలున్న ప్రదేశానికి ఎడమపక్కగా ’ముక్కోటి ప్రదక్షిణ౦’అని రాసి ఉ౦టు౦ది కూడా. దేవాలయ౦లో మూల విరాట్టుకి చుట్టూరా ఉన్న నాలుగువైపుల గోడలకి సరిగా సమా౦తర౦గా మరో ప్రాకార౦ ఉ౦ది. ఆ నాలుగు గోడలకీ మధ్య ఉన్న ప్రదక్షిణాకారపు తోవనే "ముక్కోటి    ప్రదక్షిణ౦" అ౦టారు. 

ఈ ప్ర్దదక్షిణాన్ని ఈ రోజే చేసి స్వామిని ఉత్తర౦ వైపుని౦చి భక్తులు వచ్చి దర్శిస్తారు.

        *******      ****************    ******    *****************   *****   ********