Thursday, June 30, 2016 By: visalakshi

మా విశాలహృదయంలో సమాలోచనలు..గాయత్రీమహామంత్రం...

.గాయత్రీమహామంత్రం:-- 





 హే రక్షకా! సచ్చిదానంద స్వరూపా, నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త స్వభావా, అజ,నింజన, నిరాకార, సర్వవ్యాపక, సర్వాంతర్యామిని, జగదుత్పాతక దేవా, నీ దివ్యమూ వరేయము నైన సచ్చిదానంద స్వరూపమును మేము సర్వదా మా హృదయమున ధ్యానింతుము. మాకు సద్బుద్ధి నిచ్చి బ్రహ్మచర్యాది సద్ వ్రతములను ఆచరించునట్లు మమ్ము అనుగ్రహింతువు గాక! 

 ఈ గాయత్రీ మహా మంత్రములో మొదటి భాగంలో ప్రణవం, రెండవ భాగంలో 3 వ్యాహృతులు, మూడవ భాగంలో త్రిపదా గాయత్రి అనే మూడు భాగాలున్నాయి.

ప్రణవంలోని మూడు మంత్రాలు సృష్టి, క్రమ చిహ్నాలు..ఈ మూడింటి  ఉచ్చారణ వలన క్రమంగా భూలోక, భువర్లోక ,స్వర్లోకములేర్పడుచున్నాయి.ఇవే పృద్వి, అంతరిక్ష, ద్యులోకాలు. సప్త చంధస్సులలో గాయత్రి కూడా ఒక చంధస్సు. ఇందులో మూడు పాదాలున్నాయి. అందుకే దీనిని త్రిపదా గాయత్రి అంటారు. త్రివిధ లోకాలు, త్రివిధదేవతలు,త్రివిధ అగ్నులు, త్రివిధ గుణాలు, త్రివిధ దు:ఖాలు మొదలైన రహస్యాలు ఈ త్రిపదా గాయత్రిలో ఇమిడి ఉన్నాయి.

 గాయత్రీ మంత్రములో పరమాత్మను "సవితా" అనిసంబోధిస్తాము.సవితకు సంబంధించింది కనుక దీనికి సావిత్రి అని పేరు. ఈ మంత్రాధి దేవత సావిత్రి.(సవిత పుత్రిక సావిత్రి).




 ప్రతినిత్యం బ్రహ్మ ముహుర్తంలో నిద్రలేచి,కాలకృత్యాలు తీర్చుకొని, ఏకాంతంగా పద్మాసనంలో కూర్చుండి, అత్యంత శ్రద్ధా నిష్ఠలతో ఈ జపాన్ని చేయాలి.అందువలన బుద్ధి సూక్ష్మమై వేగవంతమవుతుంది..ధారణాశక్తి, మనోనిగ్రహం, స్మరణ శక్తి పెరుగుతాయి. తద్వారా ఉత్సాహం, ఆత్మానందం కలుగుతాయి. ప్రచోదయాత్ అనే శబ్దార్ధం జీవితంలో ప్రవేశించి, మానవజీవితాన్ని ప్రభావితం చేస్తుంది. 

  సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలలో ఈ  జపం చేయడం వలన శుభం కలుగుతుంది.సృష్టికర్త సృష్టికర్తృత్వాన్ని తెలుసుకునేందుకు ఈ మంత్రజపం ఎంతగానో సహకరిస్తుంది. ఈ మంత్రంలో (సవితా) పరమాత్ముని కేవలం జ్ఞానం కొరకే ప్రార్ధిస్తాము.మానవునకు జ్ఞానమే ముఖ్యమైన జీవన సాధనం.శాశ్వతానందాన్ని కలిగించే జ్ఞానాన్ని మాత్రమే కోరాలి.జ్ఞానమే శాశ్వతం.

 ఈ గాయత్రీ మంత్రములో న: శబ్ధములో విశాలమైన అర్ధం ఉంది.సమస్త మానవులు -స్త్రీ పురుషులందరూ ఈ గాయత్రీ మంత్రాన్ని జపించి సమాన ఫలం పొందవచ్చు. ఒక వర్ణం వారికి అధిక ప్రయోజనం, మరొక వర్ణం వారికి అల్ప ప్రయోజనమనే సంకుచిత భావం ఈ మంత్రములో లేదు. కానీ ఈ మంత్రజపం చేసేవారు శిష్టాచార సంపన్నులు, సదాచారవంతులు, పూర్ణాచారవంతులు, శీల సంపద గలవారు అయి ఉండాలి. ..వారు ఏ వర్ణానికి, వర్గానికి, చెందిన వారైనా ఈ శుభలక్షణాలు కలిగిన స్త్రీ పురుషులందరికీ సమాన ఫలం ఉంటుంది.

  గాయత్రిని జపించే అధికారం స్త్రీ పురుషులకు నిశ్చయముగా ఉంది. వైదికుల లక్ష్యం, వారి జీవన ధ్యేయం గాయత్రీ మంత్రజపమే! గురుకుల విద్యాభ్యాసం నుండి మొదలై చివరి ప్రాణ త్యాగం వరకు ఈ గాయత్రీ మంత్రం తోనే వారి జీవన సూత్రాన్ని అవినాభావ సంబంధంగా ముడివేసుకుంటారు. ప్రాచీనకాలంలో ఈ గాయత్రీజపం ఋషులు, మునులు,సాధుసత్పురుషులు అందరూ చేసేవారు. వారికి ఋష్యత్వం సిద్ధించడానికి మూలమంత్రం గాయత్రీయే! వేదకాలం నుండి ఋషి మునులు వాణి వాజ్ఞ్మయాదుల ద్వారా ఈ గాయత్రీ మహిమను వేనోళ్ళ కీర్తించారు. ..ఋషులు మంత్రదష్టలైనవారు పరమాత్ముని నుండే నేరుగా ఈ జ్ఞానాన్ని పొందుతారు. 


సర్వశ్రేష్ఠమైన ఈ గురుమంత్రాన్ని జపించి ఆత్మవిశ్వాసం, ఆత్మబలం పొందగలం.  ...... visalakshi.  ......

****               ****                ****                     ****

     కారణజన్ములు మినహాయిస్తే సాధారణంగా మనమంతా పూర్వం జేసిన కర్మల ఫలితంగానే జన్మలెత్తుతున్నాం అన్నది విస్పష్ఠం. అయితే ఎవరి పుట్టుకా యాదృచ్చికంగా సంభవించేది కాదు. ఏదో పొరపాటు వలనో, ప్రకృతి ప్రేరకం వల్లనో మనం ఊపిరి పోసుకోలేదు. ఏ జన్మలోనో మనం చేసుకొన్న పాప పుణ్య కర్మల వల్ల ఆ ఫలం అనుభవించడానికి ,వాటికి అనుగుణంగా దేహం తగిన బంధు మిత్ర పరివారంతో ఈ లోకంలోకి ప్రవేశించాము. అలా ప్రారబ్ధంగా సమకూరినవే ఈ బంధాలన్నీ...బాధలన్నీ!..



  ఆ మనుషుల ఋణం, కర్మఫలం తీరటానికి ప్రతి ఒక్కరికీ భగవంతుడు కొంతకాలాన్ని నిర్దేశించాడు. దానికి ఆయుష్షు అని పేరు పెట్టుకొని, అది తీరేవరకు ఆ కర్మలు ఆడించినట్లు ఆడుతూ ఉంటాము. వాటి నుంచి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యము కాదు.   




  "మనిషిగా పుట్టిన మనకే ఈ  మానవ జన్మ విలువ తెలియదు. ...మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలమని బహుశా మూగజీవాలకు తెలుసేమో!"

...విశాలాక్షి.  .....

2 comments:

రుక్మిణిదేవి said...

"మనిషిగా పుట్టిన మనకే ఈ మానవ జన్మ విలువ తెలియదు. ...మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలమని బహుశా మూగజీవాలకు తెలుసేమో!".. నిజం ఐ ఉండవచ్చు .. మంచి మాట చెప్పారు విఎస్ గారు

రుక్మిణిదేవి said...


మంచి విషయం తెలియజేసారు